‘‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ రోజుల్లో ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. అప్పుడు మిస్ అయిన డిజిటల్ హంగామాని మళ్లీ క్రియేట్ చేసి ఇస్తున్న మా అన్న గణేశ్‌కి, సత్యనారాయణకి థ్యాంక్స్. ‘గబ్బర్ సింగ్’ మా జీవితాలను మార్చేసిన సినిమా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ చిత్రం 2012 మే 11న విడుదలైంది. ఈ నెల 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ప్రెస్ మీట్‌లో హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘గబ్బర్ సింగ్’ డబ్బింగ్ సమయంలోనే ఈ మూవీ పక్కా బ్లాక్‌బస్టర్ అన్నారు పవన్ కల్యాణ్‌గారు. నా అభిమానులు కోరుకునేది ఇవ్వబోతున్నావ్’’ అన్నారు. ‘‘నన్ను నేను నమ్మలేని పరిస్థితిలో పవన్ కల్యాణ్‌గారు నమ్మి, నన్ను నిర్మాతగా నిలబెట్టారు. నేను, హరీష్, దేవిశ్రీ ప్రసాద్... అందరూ ప్రేమించి ఈ సినిమా చేశాం. ఏడేళ్లుగా నేను సినిమా తీయకపోవడం బాధగా ఉంది... మళ్లీ సినిమాలు తీస్తా’’ అన్నారు బండ్ల గణేశ్. డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, నటుడు రమేశ్‌రెడ్డి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment