Pulagam Chinnarayana
-
విఠలాచార్యపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉంది
‘‘నేను స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో విఠలాచార్యగారి సినిమాలు చాలా చూశాను. ఆయన దర్శకత్వంలో నేను చేసిన ఒకే ఒక సినిమా ‘ఇద్దరు మొనగాళ్లు’ హిట్ అయ్యింది. గొప్ప దర్శకుడు, సక్సెస్ఫుల్ నిర్మాత అయిన ఆయనపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. ప్రముఖ దర్శకుడు విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన సినీ ప్రయాణం నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ రాసిన ‘జై విఠలాచార్య’ పుస్తకం ఫస్ట్ లుక్‌ని కృష్ణ విడుదల చేశారు. ‘‘సినిమా నిర్మాణంలో విఠలాచార్యగారు పెద్ద బాలశిక్ష లాంటివారు. కరోనా సమయంలో విఠలాచార్య శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేసి, త్వరగా రాశాను. రచయితగా నా తొమ్మిదవ పుస్తకమిది’’ అని పులగం చిన్నారాయణ అన్నారు. ‘‘జై విఠలాచార్య’ను మా తొలి పుస్తకంగా పబ్లిష్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా అన్నారు. -
నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది...
సినిమా వెనుక స్టోరీ - 35 ఆ రోజు పవన్‌కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా రిలీజ్. మొత్తం కుర్ర బ్యాచ్. కల్యాణ్ కటౌట్‌కి పాలాభిషేకం చేస్తున్నాడు ఓ కుర్రాడు. పేరు హరీశ్ శంకర్. పవన్‌కు అరివీర భయంకర ఫ్యాన్. ఎప్పటికైనా కల్యాణ్‌ని కలిసి ఓ ఫొటోగ్రాఫు, ఓ ఆటోగ్రాఫూ తీసుకోవా లనేది అతగాడి డ్రీమ్. నెరవేరుతుందా? ‘షాక్’తో షాక్ తిన్నాడు హరీశ్ శంకర్. రవితేజ లాంటి హీరోతో అలాంటి డిజాస్టర్ తీసినందుకు ఇంకొకడైతే హర్ట్ అయ్యి ఇండస్ట్రీ నుంచి తిరిగెళ్లిపోతాడు. కానీ హరీశ్ జగమొండి. పోయినచోటే వెతుక్కోవాలనే కసిలో ఉన్నాడు. ఎక్కడ పని దొరికితే అక్కడ వాలిపోయేవాడు. పూరి జగన్నాథ్, నల్లమలుపు బుజ్జి కాంపౌండ్‌లో స్టోరీ సిట్టింగ్స్‌లో కూర్చునే వాడు. రవితేజకు అతనంటే గురి. ఫ్లాపిచ్చిన ప్రతివాడూ పనికిరానివాడని కాదుగా! హరీశ్‌కు ఇంకో చాన్స్ ఇచ్చే ఉద్దేశం ఉంది రవితేజకు. హరీశ్ కూడా రవితేజకు కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ‘ఆంజనేయులు’ షూటింగ్ స్పాట్కెళ్తే నిర్మాత బండ్ల గణేశ్ కలిశాడు. సింగిల్ సిట్టింగ్‌లోనే క్లోజ్ అయిపోయారిద్దరూ. హరీశ్ బ్యాడ్‌లక్. రవితేజ రెండు ప్రాజెక్టులు ఒప్పేసుకున్నాడు... ‘శంభో శివ శంభో’, కృష్ణవంశీతో ‘కందిరీగ’. బండ్ల గణేశ్ నుంచి ఫోన్. ‘‘అర్జంట్‌గా ‘నందగిరి హిల్స్’కు రా.’’ నందగిరి హిల్స్ అంటే పవన్‌కల్యాణ్ ఇల్లు ఉన్న ఏరియా. ఆగమేఘాల మీద ఇంటి ముందు వాలిపోయాడు. గేట్లు తెరుచుకున్నాయి. లోపల నుంచి మూడు కార్లు దుమ్ము రేపుకుంటూ బయటికి వెళ్లిపోయాయి. హరీశ్ అయోమయంగా చూస్తున్నాడు. గణేశ్‌కి కాల్ చేస్తే ‘‘నేను కల్యాణ్‌తో ఫామ్‌హౌస్‌కి వెళ్తున్నా, నువ్వు నా కారులో అక్కడికొచ్చేయ్. అదిరిపోయే కథ చెప్పాలి’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. హరీశ్‌కి విపరీతమైన టెన్షన్. కల్యాణ్‌కి ఏ కథ చెప్పాలి? ఎలా చెప్పాలి? మంచి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ చెబుదామా? ఇవే ఆలోచనలు. మళ్లీ గణేశ్ ఫోన్. ‘‘మంచి లవ్‌స్టోరీ ఉంటే... అదే చెప్పు.’’ ఇప్పటికిప్పుడు లవ్‌స్టోరీ ఎలా? ఓ బడ్డీకొట్టు దగ్గర కారు ఆపించాడు. సిగరెట్ ముట్టించి, గట్టిగా దమ్ము పీల్చాడు. రవి తేజ కోసం చేస్తున్న లైన్ చెప్పేద్దామా? కల్యాణ్ బాబుకి బావుంటుంది. అప్పటి కప్పుడు టైటిల్ కూడా అనేసుకున్నాడు ‘రొమాంటిక్ రిషి’. ఫామ్ హౌస్. కల్యాణ్ వర్కర్స్‌తో ఏదో మాట్లాడుతున్నాడు. పక్కనే బండ్ల గణేశ్. హరీశ్ అక్కడికెళ్లాడు. ‘‘ఈ రోజు నాకు మూడ్ సరిగ్గా లేదు. ఇంకోరోజు కథ వింటా’’ చెప్పాడు కల్యాణ్. ‘‘బాబూ! ఈ రోజు ఏకాదశి. మంచి రోజు. అతనికి సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక అయిదు నిమిషాలైనా కథ వింటే..?’’ అని గణేశ్ తటపటాయిస్తూ చెప్పాడు. ‘‘ఓకే... మీ సెంటిమెంట్స్‌ని నేనెందుకు కాదనాలి’’ అని అక్కడే చెట్టు దగ్గర కూర్చున్నాడు పవన్‌కల్యాణ్. హరీశ్ కథ చెబుతున్నాడు. గంటం పావు గడిచింది. అప్పటికి ఇంటర్వెల్ దాకా చెప్పడం పూర్తయింది. హరీశ్ కథ చెబుతున్నంతసేపూ పగలబడి నవ్వుతూనే ఉన్నాడు కల్యాణ్. ‘‘ఇక చాలు’’ అన్నాడు. హరీశ్ టెన్షన్‌గా చూస్తున్నాడు. ‘‘వియ్ డూ దిస్ ఫిల్మ్’’ అని హరీశ్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి లేచాడు కల్యాణ్. కాస్సేపటి తర్వాత గణేశ్ వచ్చి హరీశ్‌ను హగ్ చేసుకుని కంగాట్స్ చెప్పాడు. హరీశ్ స్క్రిప్టు వర్క్ మొదలెట్టాడు. కల్యాణ్‌కు ఇంకా సెకండాఫ్ చెప్పాలి. ఛేంజెస్ చెప్పాలి. బెటర్మెంట్స్ చెప్పాలి. కానీ అక్కడేమో కల్యాణ్ ఫుల్ బిజీ. అపాయింట్మెంట్ కూడా దొరకని స్థితి. ఆ టైమ్‌లో ఓ న్యూస్. హిందీ సినిమా ‘లవ్ ఆజ్ కల్’ బేస్‌తో కల్యాణ్ ఓ సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. బండ్ల గణేశ్ ప్రొడ్యూసర్. త్రివిక్రమ్ స్క్రిప్టు రాస్తున్నాడు. డెరైక్టర్ ఎవరో తెలియదు. హరీశ్‌నే చేయమంటారని టాక్. కానీ జయంత్. సి.పరాన్జీ డెరైక్షన్‌లో ‘తీన్మార్’ మొదలెట్టారు కల్యాణ్. హరీశ్ పరిస్థితేంటి? కల్యాణ్ ప్రాజెక్ట్ కన్ఫ్యూజన్లో ఉన్న టైమ్‌లో రవితేజ నుంచి పిలుపు. అక్కడ ‘కందిరీగ’ ప్రాజెక్ట్ క్యాన్సిల్. హరీశ్ రెడీ అంటే ఇక్కడ సినిమా స్టార్ట్. కల్యాణ్ కోసం తీర్చిదిద్దిన ‘రొమాంటిక్ రిషి’ రవి తేజకు షిఫ్ట్. ‘‘మరీ క్లాస్ టైటిల్లా ఉంది. ‘మిరపకాయ్’ అని పెడదాం’’ రవితేజ సలహా. ఓకే. 2011 సంక్రాంతికొచ్చిన ఈ సినిమా హరీశ్ లైఫ్‌లో కొత్త క్రాంతి తీసుకొచ్చింది. వ్వాట్ నెక్స్ట్ హరీశ్? ఫిబ్రవరి 21... తన ఫేవరెట్ డెరైక్టర్ ఈవీవీ చనిపోవడంతో హరీశ్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆయన డెడ్ బాడీని కొంత దూరం మోసి, విషాద హృదయంతో ఇలా ఇంటికొచ్చాడో లేదో... అలా ఫోన్ మోగింది. పవన్ కాలింగ్. స్నానం చేసి ఆదరాబాదరాగా కల్యాణ్ ఇంటికెళ్లేసరికి ఫొటో సెషన్ జరుగుతోంది. కల్యాణ్ పోలీసాఫీసర్ గెటప్‌లో ఉన్నాడు. హరీశ్కేం అర్థం కాలేదు. ‘దబంగ్’ను తెలుగులో చేస్తున్నాం, సినిమా పేరు ‘గబ్బర్‌సింగ్’, డెరైక్టర్‌వి నువ్వే’’ చెప్పాడు కల్యాణ్ తాపీగా. ‘‘ఎంత రెమ్యునరేషన్ కావాలి?’’ కల్యాణ్ డెరైక్ట్ క్వశ్చన్. ప్రొడ్యూసర్ కూడా ఆయనే మరి. హరీశ్ మాత్రం డబ్బుల గురించి మాట్లాడటం లేదు. పూనకం వచ్చినవాడిలా ఉన్నాడతను. ‘‘దబంగ్కి జిరాక్స్‌లా దీన్ని తీయకూడదు సార్. మీ ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులూ చేర్పులూ, డైలాగ్స్ రాసే అవకాశమివ్వండి చాలు. అదే నాకు పెద్ద రెమ్యునరేషన్’’ చెప్పాడు నిజాయతీగా. కల్యాణ్ నవ్వుతూ అడ్వాన్స్ కవర్ అతని చేతికిచ్చాడు. నెక్స్ట్ మినిట్‌లో మీడియాకు న్యూస్ వెళ్లిపోయింది. హరీశ్ ఓ ఉన్మాదంలో ఉన్నాడు. గబ్బర్‌సింగ్ అంటే రెట్టమతంగా ఉండే పోలీసాఫీసర్. అతనా పేరెందుకు పెట్టు కున్నాడు లాంటి లాజిక్స్ మిస్ కాకుండా, కల్యాణ్‌ని మాస్ ఎలా చూడాలనుకుంటు న్నారో అలా స్క్రిప్ట్‌ని డిజైన్ చేసుకున్నాడు. కోల్‌కతాలో ‘పంజా’షూటింగ్ జరుగు తుంటే స్క్రిప్టు వినిపించడానికెళ్లాడు. కల్యాణ్ వెంటనే కనెక్టయిపోయాడు. టక టకా తన సజెషన్స్ చెప్పేశాడు. ‘‘పోలీస్ స్టేషన్లో రౌడీలతో అంత్యాక్షరి సీన్ పెడదాం. బాగా కామెడీ క్రియేట్ చేయొచ్చు. ‘పాడమంటే పాడేది పాట కాదు’ లాంటి మంచి మంచి పాటలు పెడదాం’’ అని హింట్ ఇచ్చాడు. ఓకే సార్ అన్నాడు హరీశ్. ‘గబ్బర్‌సింగ్’ స్టార్ట్. ప్రొడ్యూసర్ పవన్ కల్యాణ్ కాదు... బండ్ల గణేశ్. హీరో యిన్‌గా శ్రుతీహాసన్‌ను తీసుకుంటే? ఐరన్ లెగ్ అన్నారు చాలామంది. కల్యాణ్ మాత్రం ఆమెకే ఓటు. ఇంకెవరూ మాటా ్లడ్డానికి లేదు. 2011 డిసెంబర్ 4... మిట్ట మధ్యాహ్నం 12 గంటల 20 నిముషాలకు ఫస్ట్ షాట్ తీశారు. అవతల ‘పంజా’ డిజాస్టర్. ఫ్యాన్స్ నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. ‘గబ్బర్ సింగ్’ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని రకరకాల డౌట్లు. ఫ్యాన్స్‌కు ఓ భరోసా ఇవ్వాలంటే టీజర్ రిలీజ్ చేయాలి. ఇంకా ఓ షెడ్యూలు కూడా ఫినిష్ కాకుండా టీజర్ చేయడమంటే కష్టమే. హరీశ్కో ఐడియా వచ్చింది. కల్యాణ్‌తో ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పించి, టీజర్ రిలీజ్ చేయిస్తే? ఐడియా బాగుంది. డైలాగ్ కూడా బాగా వచ్చింది. ‘‘నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది’’... ఇదీ డైలాగ్. ఇబ్బంది పడుతూనే కల్యాణ్ దగ్గరకు వెళ్లాడు. డైలాగ్ చెప్పగానే కల్యాణ్ సంబరపడిపోయి, క్లాప్స్ కొట్టేశాడు. టీజర్ రెడీ. ఆ ఒక్క టీజర్‌తో ‘గబ్బర్‌సింగ్’ ఎలా ఉండబోతోందో ఆడియన్స్ స్మెల్ చేసేశారు. ‘దబంగ్’లోని ‘మున్నీ బద్నామ్’ తరహాలో ఐటమ్ సాంగ్ కావాలి. మిగతా పాటలన్నీ చిటికెలో చేసిచ్చేసిన మ్యూజిక్ డెరైక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఈ సాంగ్‌కి రాత్రింబవళ్లూ తలకొట్టుకుంటున్నాడు. దేవి ఫాదర్, రైటర్ సత్యమూర్తి ఆ టైమ్‌కి అక్కడే ఉన్నారు. ‘‘ఎందుకురా టెన్షన్. ‘కెవ్వు కేక’ అని మొదలుపెట్టు’’ అన్నా రాయన. దేవి చెలరేగిపోయాడు. ‘అంత్యాక్షరి’ ఎపిసోడ్ గురించి చాలా కసరత్తులే చేశారు. డెరైక్షన్ డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసి 300 పాటలు సెలక్ట్ చేశారు. వాటిల్లోంచి కొన్ని ఎంచుకున్నారు. పోలీస్ స్టేషన్ సెట్లో రౌడీ గ్యాంగ్‌తో రోజంతా తీయాలని ప్లాన్ చేశారు. కట్ చేస్తే - 4 గంటల్లోనే అయిపోయింది. సినిమా మొత్తం చాలా స్మూత్‌గా జరిగి పోయింది. డబ్బింగ్ సెషన్ కూడా హ్యాపీనే. అంతా కంప్లీట్ అయ్యాక డబ్బింగ్ ఫ్లోర్‌కి దణ్ణం పెట్టి, ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అవనుంది. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. టేక్ కేర్’’ అన్నాడు కల్యాణ్. 2012 మే 11. ఎండ దెబ్బకు రాళ్లు సైతం పగిలిపోతున్నాయి. ఇక్కడ ‘గబ్బర్‌సింగ్’ దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి. ఆ థియేటర్ దగ్గర ఫుల్ ప్యాక్డ్గా జనం. పవన్ కల్యాణ్ కటౌట్‌కి క్షీరాభిషేకం చేస్తున్నారు. పక్కనే హరీశ్ శంకర్ కటౌట్. దానికీ క్షీరాభిషేకం. ఇదంతా చూసి హరీశ్ శంకర్ కళ్లు చెమర్చాయి. అతనికి తన ఫ్లాష్‌బ్యాక్ గుర్తొచ్చింది. హిట్ డైలాగ్స్ * ‘‘నేను ఆయుధాలతో చంపను. వాయిదాలతో చంపుతా’’ అనే బ్రహ్మానందం డైలాగ్ రాసింది ఈ సినిమా కో-డెరైక్టర్ శంకరమంచి రాజశేఖర్. అందుకే టైటిల్స్‌లో ఆయన పేరు వేశారు. * నేను ఆయుధాలతో చంపను... వాయిదాలతో చంపుతా * నేను ఆకాశం లాంటోణ్ణి. ఉరు మొచ్చినా మెరుపొచ్చినా ఇలానే ఉంటాను ఠి నేను ట్రెండ్ ఫాలో అవ్వను... ట్రెండ్ సెట్ చేస్తా * కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు - పులగం చిన్నారాయణ -
కథానాయకుడు
కథకు మూలం ఉంటుంది.... మర్రిచెట్టంత మహావృక్షానికి విత్తనం లాంటి మూలం! మూలం వెతికి, దాన్ని తిరగేయగలిగితే... మూల్యం ఉంటుంది. మర్రిచెట్టంత మూల్యం ఉంటుంది! సృష్టికర్త ఒక్కడే - బ్రహ్మ! మిగతావాళ్ళంతా - స్ఫూర్తికర్తలే! విజయేంద్రప్రసాద్ కథల్లో దమ్ముంటుంది. కథల్లో దమ్మే కాదు... కథెలా పుట్టిందో చెప్పే దమ్మూ ఆయనకుంది. మూలాన్ని తిరగేసి, మూల్యాన్ని మూటగట్టుకున్న ఈ ‘కథా’నాయకుడు ...ఎంతమందికి స్ఫూర్తికర్త అవుతాడో!! ప్రతి సినిమాకూ కథ ఉంటుంది. ప్రతి సినిమాకథకూ వెనక ఇంకొక కథ ఉంటుంది. అది ఆ కథ తాలూకు ఇన్స్పిరేషన్ కథ. మిగతా వాళ్ల సంగతేమో కానీ, నేనైతే ఎక్కడ నుంచి ఎలా ఇన్స్పైరై కథ చేశానో చెప్పేస్తాను. పిల్లాడు ఎలా పుడతాడో అందరికీ తెలుసు. కానీ చెప్పరంతే! అది సీక్రెట్ అనుకుంటే ఎలా? చిన్నప్పట్నుంచీ చూసిన సంఘటనలు, చదివిన పుస్తకాలు... ఒకప్పుడు గుర్తుకొస్తాయి. అవన్నీ కథలకు ఉపయోగపడతాయి. నా కెరీర్‌లోని సూపర్ హిట్ కథల గురించి చెప్పుకోవాలంటే... జానకి రాముడు (1988): నా ఫస్ట్ కథ ‘జానకి రాముడు’. అంతకుముందు ఏవేవో కథలు రాశా కానీ ఏవీ పెర్ఫెక్ట్గా కాదు. నిర్మాత ‘యువచిత్ర’ కాట్రగడ్డ మురారి అప్పట్లో నాగార్జునతో సినిమా తీస్తున్నారు. ‘‘ఏయన్నార్ నటించిన ‘మూగమనసులు’ కథ కావాలి, కానీ ‘మూగమనసులు’లా ఉండకూడద’’ని దర్శకుడు రాఘవేంద్రరావు అడిగారు. అలా ‘జానకి రాముడు’ కథ చేశా. బంగారు కుటుంబం(1994): ఏయన్నార్ గారిది ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా ఉంది. అందులో మూడు కుటుంబాలు విడిపోతాయి. ఆ సినిమా రిలీజయ్యే నాటికి అది టూ ఎర్లీ. కానీ, ఇవాళ్టి రోజులకు అది బావుంటుందని నిర్మాత కైకాల నాగేశ్వరరావు అడిగారు. అప్పుడు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో అక్కినేని గారు నటించిన ‘బంగారు కుటుంబం’ స్క్రిప్టు రెడీ చేశా. బొబ్బిలి సింహం (1994): బాలకృష్ణ ‘బొబ్బిలి సింహం’కి దాసరి నారాయణరావుగారి ‘ప్రేమాభిషేకం’ గుర్తుంది కదా... అదీ ఇన్స్పిరేషన్. ‘ప్రేమాభిషేకం’ కథలోని మగ, ఆడ రివర్స్ చేసి ‘బొబ్బిలి సింహం’ కథ చేశా. ఏయన్నార్, శ్రీదేవిని - ఈ కథలో రోజా, బాలకృష్ణ చేశా. అయితే, ఇలా ఏ కథనైనా మార్చగలనా అంటే చెప్పలేను. ఏదైనా అవసరాన్ని బట్టే వస్తుంది! సమరసింహారెడ్డి (1999): రాయలసీమ ఫ్యాక్షనిజమ్ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ గురించి ఇవాళ్టికీ చెప్పుకుంటారు. కానీ, అందరికీ ఆశ్చర్యం కలిగించే సంగతి ఒకటి చెప్పాలి. తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన ‘సింధూర పువ్వు’ ఇన్స్పిరేషన్తో ‘సమరసింహారెడ్డి’ కథ చేశా. అందులో ఒకావిడ పెంపుడు కూతుర్ని సరిగ్గా చూడదు. సొంత కూతుర్ని మాత్రం సుకుమారంగా పెంచుతుంది. ఇది నచ్చక విజయ్‌కాంత్ దగ్గర అతను కారు డ్రైవర్‌గా చేరతాడు. విజయకాంత్‌ని శత్రువులు ఎటాక్ చేయబోతే, ఇతను వెళ్లి అడ్డుకుని చనిపోతాడు. అప్పుడు విజయ్‌కాంత్‌కి తెలుస్తుంది. ఇతనికో ఫ్యామిలీ ఉందని! ఆ కుటుంబ కష్టం తీర్చడానికి ఇక్కడికొస్తాడు. ఇదీ ‘సింధూర పువ్వు’ కథ. ఆ బేస్ నాకు నచ్చింది. అప్పుడు రత్నం నా దగ్గర అసిస్టెంట్. నేను బొంబాయి మాఫియా బ్యాక్ డ్రాప్లో బాలకృష్ణ డాన్‌గా అనుకున్నా. కానీ, రాయలసీమ ఫ్యాక్షనిజమ్ పెడదామని రత్నం సలహా ఇచ్చాడు. అతనో రియల్ ఇన్సిడెంట్ చెప్పాడు. రియల్‌గా చూశాడట. విజయవాడ రైల్వే స్టేషన్‌కి స్థానికంగా బలం ఉన్న వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ ఫ్యామిలీలు రెండూ ఒకేసారి రావడం, పోలీసుల టెన్షన్... చెబితే భలే బాగుందనిపించింది. ఆ సీన్ ‘సమరసింహారెడ్డి’లో అల్లాను. సింహాద్రి (2003): 2000 ముందు వరకూ మద్రాసులో ఉండేవాణ్ణి. ‘వసంత కోకిల’ సినిమా చూసి నా అసిస్టెంట్ ‘అమ్మ’ గణేశ్‌తో ‘‘క్లైమాక్స్‌లో ఆ అమ్మాయి హీరోను వదిలివెళ్ళిపోతుంటే, గుండెల్లో గునపంతో పొడిచేసి వెళ్లిపోయినట్టుగా అనిపిస్తుంది కదూ’’ అన్నాను. వెంటనే, ‘‘హీరోయిన్, తనను ప్రేమించిన హీరో గుండెల్లో గునపంతో పొడిచేసినట్లు కథ చేద్దాం’’ అన్నాడు గణేశ్. హీరో చెడ్డవాడనుకుని హీరోయిన్ అపార్థం చేసుకుని గునపంతో పొడవాలి. ఆ అపార్థం ఏ పరిస్థితుల్లో జరిగింది? అలా... అలా ఆలోచించుకుంటూ, లాజిక్ సెట్ చేస్తూ రెండు రోజుల్లోనే కథ రెడీ చేశాం. అయితే, తెలుగు నేల కాకుండా వేరే ఏదైనా బ్యాక్‌డ్రాప్ ఉంటే బాగుంటుందనుకుంటే, కేరళ గుర్తొచ్చింది. అక్కడ ప్రకృతి వైద్యం ఫేమస్. హీరోయిన్‌తో పరిచయం పెంచుకోవడానికి జబ్బు నటించి, హీరో అక్కడకు వెళ్లాలి. ఇదీ కథ. మొదట ఈ కథను బాలకృష్ణ-బి. గోపాల్‌కి చెబితే ఓకే అన్నారు. కానీ, చివరలో వేరే కథ ఎంచుకున్నారు. ఈ విషయం తెలిసి నిర్మాత దొరస్వామిరాజు నన్ను పిలిపించారు. అప్పుడు చిన్న ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సెట్స్ పైకొచ్చింది. సై (2004): ‘సింహాద్రి’ రిలీజ్ తర్వాత జైత్రయాత్రకు వైజాగ్ వెళ్లాం. హోటల్లో ఉండగా ‘‘నాన్నగారూ! ఈసారి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేద్దాం. అలాగని లవ్‌స్టోరీ వద్దు. స్పోర్ట్స్ కావాలి’’ అన్నాడు రాజమౌళి. అప్పటికప్పుడు ఓ లైన్ చెప్పా. ఓ పాత కాలేజీలో ఆర్ట్స్, సైన్స్ గ్రూప్‌లకు మొదట నుంచీ పడదు. వాళ్లకు ఏదైనా గొడవొస్తే ఫుట్‌బాల్ ఆడుకుంటారు. ఓ అమ్మాయి కోసం రెండు గ్యాంగ్‌లూ కొట్టుకుంటాయి. ఓ రౌడీగాడు ఈ కాలేజ్‌ని కబ్జా చేయాలనుకుంటాడు. అప్పుడు ఈ రెండు గ్యాంగులూ కలిసి ఆ రౌడీని ఫుట్‌బాల్‌లో ఓడిస్తారు. కథ చెప్పిన పది రోజులు పోయాక - ‘‘ఫుట్ బాల్ అయితే కిక్ ఉండదు. రగ్బీ గేమ్‌గా మారుద్దాం’’ అన్నాడు రాజమౌళి. అందుకోసం తను చాలా రీసెర్చ్ చేశాడు. న్యూజిలాండ్ ఎక్కడ్నుంచో రగ్బీ కోచ్‌ను కూడా రప్పించారు. విక్రమార్కుడు (2006): రవితేజ డ్యుయల్ రోల్‌తో సినిమా చేద్దామనుకున్నాం. అత్తిలి సత్తిబాబు పాత్ర ముందే పుట్టేసింది. హిలేరియస్‌గా వచ్చింది. రెండో పాత్ర గురించి రాజమౌళి అడిగితే, ‘పోలీసాఫీసర్’ అని చెప్పా. ‘రొటీన్‌గా ఉంటుందేమో’ అన్నాడు. నాకు టెన్షన్ వచ్చింది. రాత్రంతా ఆలోచించా. హిందీలో ‘శూల్’, ఇంగ్లీషులో ‘ఎ ఫిస్ట్‌ఫుల్ ఆఫ్ డాలర్స్’ చూశా. దర్శకుడు ఇ. నివాస్ తీసిన ‘శూల్’లో పోలీసాఫీసర్ రైల్వేస్టేషన్లో దిగితే జట్కా బండివాడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం, ఆ వాతావరణం నచ్చింది. దాన్ని వాడుకున్నా. జట్కాబండి బదులు ట్యాక్సీ పెట్టాం. ‘ఎ ఫిస్ట్‌ఫుల్ ఆఫ్ డాలర్స్’లో విలన్, ఒకావిణ్ణి ఉంచుకుంటాడు. కొడుకు అమ్మను చూడడం కోసం దొంగతనంగా ఆ ఇంట్లోకి వెళ్లడం హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. అందులోంచి రాజీవ్ కనకాల పాత్ర పుట్టింది. అలా తయారైంది ‘విక్రమార్కుడు’ స్క్రిప్ట్. యమదొంగ (2007): ఒకసారి రాజమౌళి ‘‘తారక్‌తో యమధర్మరాజు వేషమేయిస్తే ఎలా ఉంటుంది నాన్నా?’’ అని అడిగాడు. బాగుంటుందన్నా. ‘యమగోల’, ‘యమలీల’ తరహాలో కథ చేయమన్నాడు. గ్రాఫిక్స్‌కి కథలో ఇంపార్టెన్స్ ఇవ్వమన్నాడు. అలా పుట్టిందే ‘యమదొంగ’. మగధీర (2009): ‘మగధీర’ అనగానే అందరూ ‘ఒక్కణ్ణి కాదు షేర్‌ఖాన్... వంద మందిని పంపించు’ ఎపిసోడ్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు. మా చిన్నప్పుడు కొవ్వూరులోని స్కూల్లో ఆగస్టు 15కి శివాజీ తాలూకు ఓ మరాఠీ సినిమా వేశారు. ఆ సినిమాతో పాటు, తానాజీ వీరపోరాటం, అతను చనిపోవడంతో ‘‘సింహగఢ్ దక్కింది కానీ, సింహం దక్కలేదు’’ అని శివాజీ ఏడ్చినట్లు ‘శివాజీ చరిత్ర’లో చదివిన ఘట్టం మనసులో ఉండిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడో దర్శకుడు సాగర్, సూపర్‌స్టార్ కృష్ణతో ‘జగదేకవీరుడు’ టైటిల్ చెప్పి, కథ కావాలని అడిగితే ఈ ఎపిసోడ్ చెప్పా. సాగర్‌కి కథ నచ్చింది కానీ, బడ్జెట్ ఎక్కువ అవుతుందని భయపడ్డారు. ‘సింహాద్రి’ తర్వాత చిరంజీవిగారు రాజమౌళితో సినిమా చేద్దామని పిలిచారు. అప్పుడే ఈ కథ చెప్పాం. ఎందుకనో ముందుకు వెళ్లలేదు. తర్వాత రామ్‌చరణ్‌తో అనుకున్నప్పుడు గుర్తు చేశాం. అలా ‘మగధీర’ పుట్టింది. రాజన్న (2011): నేను మద్రాసు నుంచి హైదరాబాద్ వస్తుంటే, గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ రైలులో కలిశారు. తెలంగాణ పోరాటం గురించి వాళ్ల నాన్నగారు సుద్దాల హన్మంతు గురించి చెప్పారు. రజాకార్లు ఆ ఊరి మీద పడి దౌర్జన్యం చేస్తుంటే, అందరూ పారిపోతున్నారట. అక్కడున్న ముసలావిడ ‘‘అలా సూత్తావేంట్రా... వెయ్... దెబ్బకి దెబ్బ వెయ్’’ అని అరిచిందట. దాంతో హన్మంతు పాట అందుకున్నాడట. జనానికి ఊపు వచ్చి అందరూ కలసి రజాకార్లను తరిమి తరిమి కొట్టారట. ఒక పాట ఎలా స్ఫూర్తి నింపుతుందో తెలుసుకుని నేను ఇన్స్పైర్ అయిపోయా. ఆ తర్వాత తెలంగాణ పల్లెలకు వెళ్లా. చరిత్ర చదివా. ఆలోచనలన్నీ కలిపి ‘రాజన్న’ స్క్రిప్టు చేశా. బజ్రంగీ భాయీజాన్ (2015) ఏడెనిమిదేళ్ల క్రితం నేను, కీరవాణి సోదరుడు కాంచీ, కోడెరైక్టర్ మహదేవ్ కలసి చిరంజీవి గారి ‘పసివాడి ప్రాణం’ చూస్తున్నాం. దాన్ని సోల్ తీసుకొని, కథ చేద్దామని ఓ ఐడియా వచ్చింది. హీరోకి ఓ పిల్లాడు దొరికాడు. వాడెవడో తెలీదు. ఆ పిల్లాడు డేంజర్లో ఉంటాడు. దాన్నుంచీ హీరో తప్పిస్తాడు. ఇదీ ఐడియా. ఆ తర్వాత పేపర్లో ఓ వార్త చదివా. పాకిస్తాన్ జంట తమ చిన్నపాపకు హార్ట్‌లో హోల్ ఉందని, ఆపరేషన్‌కి చెన్నై వచ్చారు. డబ్బుల్లేవు. హాస్పటల్ వాళ్లు ఫ్రీగా ఆపరేషన్ చేశారు. ఆ తల్లి ఉద్వేగంగా మీడియాతో మాట్లాడింది. అది నన్ను కదిలించింది. ఇవన్నీ కలిపి ‘బజ్రంగీ...’ స్క్రిప్టు చేశా. ఈ కథ మొదట హీరో సూర్యకు చెప్పా. అతనికి ఎక్కలేదు. రజనీకాంత్, వెంకటేశ్‌లకు కూడా ఈ కథ చెప్పా. ఆమిర్‌ఖాన్‌కి చెప్పా. అతను కొన్నాళ్ల తర్వాత ‘‘కథ బాగుంది కానీ, నేను కనెక్ట్ కాలేకపోతున్నా’’ అన్నాడు. తర్వాత దర్శకుడు కబీర్ఖాన్కి నచ్చి హీరో సల్మాన్‌ఖాన్ దగ్గరకు తీసుకువెళ్లాడు. సినిమా రిలీజయ్యాక సల్మాన్ తండ్రి - రచయిత సలీమ్ గారు ఫోన్ చేసి ‘‘ఇంత గొప్ప కథ నేనెప్పుడూ రాయలేదు’’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. రచయితల జంట సలీమ్-జావేద్‌లకు నేను వీరాభిమానిని. అలాంటి సలీమ్ గారు నన్ను మెచ్చుకోవడాన్ని మించి ఇంకేం కావాలి! ప్రస్తుతం నా దగ్గర 40-50 కథలున్నాయి. ఇక, నా డ్రీమ్ సబ్జెక్ట్ అంటారా? ఇంకా కలలోకి రాలేదు. వస్తే చెబుతాను! సంభాషణ: పులగం చిన్నారాయణ బాహుబలి (2015) ‘బాహుబలి’కి వేరే ఇన్స్పిరేషన్ లేదు. డబ్బే ఇన్స్పిరేషన్. అప్పటికప్పుడు అనుకుని రాసేసిందే! ‘‘ప్రభాస్‌తో ఫుల్ కాస్ట్యూమ్ డ్రామా కావాలి. అన్నీ గ్రే కేరెక్టర్స్ కావాలి’’ అని రాజమౌళి అడిగాడు. మర్నాడు పొద్దున్నే బాహుబలిని కట్టప్ప పొడిచే సీన్ చెప్పా. తర్వాత రోజు తల్లి నీళ్లలో బిడ్డను పెకైత్తే సీన్ చెప్పా. ఇలా అన్నీ సీన్లుగా చెప్పా. వాటి చుట్టూ కథ అల్లేశా. ‘బాహుబలి-2’ కథ కూడా రెడీ. అప్పుడే రఫ్‌గా చేసేశాం. మొన్నీ మధ్యనే నెలరోజులు కూర్చుని స్క్రిప్ట్ ఫైనల్ చేసేశాం. ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూసి మార్పులేమీ చేయలేదు. పాలిష్ చేశామంతే! -
నేను బద్రి బద్రీనాధ్!
సినిమా వెనుక స్టోరీ - 24 - పూరీ జగన్నాథ్ సినిమా పేరు ‘పాండు’. సుమన్ హీరో. డెరైక్టరేమో రామ్‌గోపాల్‌వర్మ, కృష్ణవంశీల శిష్యుడు జగన్. కెమెరామ్యాన్... డెరైక్టర్ తేజ. మ్యూజిక్ గురురాజ్. గ్రాండ్‌గా పాటల రికార్డింగ్. హేమాహేమీలంతా వచ్చి జగన్‌ని బ్లెస్ చేశారు. పాపం జగన్ బ్యాడ్‌లక్. కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టకుండానే సినిమా హుష్. ఇంకో సినిమా పేరు... థిల్లాన. ‘సూపర్‌స్టార్’ కృష్ణ హీరో. జగనే డెరైక్టర్. కొత్తవాడైనా కథ చెప్పిన విధానం నచ్చేసి వెంటనే డేట్లు ఇచ్చేశారు కృష్ణ. బి.లహరి మ్యూజిక్కు. శ్యామ్.కె.నాయుడు కెమెరా. మూడు పాటలు రికార్డ్ చేశారు. ఓ రోజు షూటింగ్ కూడా చేశారు. కట్ చేస్తే... ‘థిల్లాన’ కూడా గాయబ్. రెండు సినిమాలు ఆగిపోతే ఇంకో కొత్త డెరైక్టర్ అయితే టెన్షన్ పడిపోయేవాడు. కానీ జగన్ ఆరామ్‌గా ఉన్నాడు. పని తెలిసినవాడు ఎడారిలోనైనా బతికేస్తాడు. ద్వీపంలో వదిలేసినా బేఫికర్. జగన్ కథలు రాయగలడు. అదీ చాలా వేగంగా. రోజుకి పది కథలు రాయమన్నా రాయగలడు. దూరదర్శన్‌కి నిలబెట్టి వంద ఎపిసోడ్లు తీయగలడు. యాడ్స్ కట్ చేయగలడు. గులాబి, రంగీలా, సింధూరం, నిన్నే పెళ్లాడతా సినిమాలకు టీవీ ట్రైలర్స్ చేసి పెట్టింది అతనే. ఇన్ని రకాలుగా జగన్‌కు మార్కెట్లో డిమాండ్ ఉంది. అందుకే రెండు సినిమాలు పురిట్లోనే ఆగిపోయినా బ్యాడ్‌నేమ్ వస్తుందనే చింతలేమీ పెట్టుకోలేదతను. జగన్ ఇప్పుడు కొండకు వెంట్రుక విసురుతున్నాడు. కొండ అంటే పవన్ కల్యాణ్. ‘సుస్వాగతం’ హిట్టుతో యూత్‌లో యమా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. కొత్త టాలెంట్ కనిపిస్తే పిలిచి పట్టాభిషేకం చేస్తున్నాడు. పవన్‌ని కలిసే చాన్సొస్తే చాలు... తన కథతో మెస్మరైజ్ చేసేయగలనని జగన్‌కి ప్రగాఢ నమ్మకం. ఓషో చెప్పిన ఓ లైన్‌కు ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడో పదేళ్ల క్రితమే జగన్ ఓ కథ రాశాడు. అది కూడా కిచెన్‌లో కూర్చుని ఏక ఫ్లోలో రాసి పారేశాడు. ఓ యాడ్‌ఫిల్మ్ డెరైక్టర్ తన ప్రియురాలితో కాసిన చిలిపి పందెం. అంతే కథ. నాగార్జునకైతే బావుంటుందనుకుని ట్రయల్స్ వేశాడు. స్క్రిప్టు తీసుకెళ్లి అమలకూ ఇచ్చాడు. వర్కవుట్ కాలేదు. జగన్‌కు తెలిసిన ఓ నవలా రచయిత ఉన్నాడు. ‘‘కాన్సెప్ట్ బాగుంది. నవలగా రాసివ్వు. నా పేరుతో పబ్లిష్ చేయిస్తా. నీకు పదివేలు ఇస్తా’’ అన్నాడు. అప్పట్లో పదివేలు అంటే చాలా ఎక్కువ. జగన్ టెంప్ట్ అయ్యాడు. నవల రాయడం మొదలెట్టాడు. సగం రాశాక వేస్ట్ అనిపించి పక్కన పడేశాడు. వర్మ క్యాంప్‌లో తిరుగుతున్న టైమ్‌లో - రమణకు డెరైక్షన్ ఆఫరిచ్చారు వర్మ. అతని దగ్గర కథ లేదు. ‘‘నా దగ్గరో కథ ఉంది. కావలిస్తే ఇచ్చేస్తా’’ అని ఈ కథ చెప్పాడు జగన్. రమణకు నచ్చలేదు. ఇప్పుడీ కథతోనే పవన్ కల్యాణ్‌ని గెలవాలి. వింటే కల్యాణ్ ఫ్లాట్ అయిపోతాడు. ఇదీ జగన్ కాన్ఫిడెన్స్. పవన్ కల్యాణ్‌ను పట్టుకోవడం చాలా కష్టం. ఏదైనా సినిమా ఫంక్షన్కొస్తే కలవొచ్చు. కానీ రాడే. ఎక్కడైనా పార్టీలకెళ్తే మీట్ కావొచ్చు. కానీ వెళ్లడే. షూటింగ్ లొకేషన్కెళ్దామంటే అవుటర్స్ నాట్ అలౌడ్. కథ రాయడానిక్కూడా జగన్ కష్ట పడలేదు కానీ, కల్యాణ్‌ని కలిసే మార్గాల్ని అన్వేషించడం కోసం నానా తిప్పలు పడుతున్నాడు. ‘తొలిప్రేమ’ షూటింగ్ జరుగుతుంటే రోజూ వెళ్లొస్తున్నాడు. సిక్స్ మంత్స్ ఇలానే వేస్ట్. కల్యాణ్ రిలేటివ్ ఒకాయన ఉన్నారు. ఆయన్ని కలుస్తున్నాడు జగన్. అయినా పని కావడం లేదు. చివరకు శ్యామ్.కె. నాయుడు గుర్తొచ్చాడు. వాళ్లన్నయ్య ఛోటా.కె.నాయుడు కూడా ఫేమస్ కెమెరామ్యాన్. కల్యాణ్‌కి క్లోజ్. అంతకుమించిన రాజమార్గం ఏముంటుంది? శ్యామ్ ద్వారా ఛోటాను కలిశాడు. ‘‘ముందు నాకు కథ చెప్పు. నాకు నచ్చితే కల్యాణ్‌కి ఇంట్రడ్యూస్ చేస్తా. లేకపోతే నా మాట పోతుంది’’ నిర్మొహమాటంగా చెప్పేశాడు ఛోటా. జగన్ రెడీ. కానీ ఒక్క క్షణం ఆలోచించాడు. బుర్రలో ఏదో ప్లాన్. కల్యాణ్‌కి చెప్పాల్సిన కథ కాకుండా ‘ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం’ కథ చెప్పేశాడు. ఛోటా ఫ్లాట్. కల్యాణ్‌ని కలవడానికి మార్గం రెడీ. 1999 ఆగస్టు 24. తెల్లవారుజామున నాలుగు గంటలకు అపాయింట్మెంట్. కల్యాణ్ ఇంటికెళ్లాడు జగన్. ‘‘అరగంటే మీ టైమ్’’ అన్నాడు కల్యాణ్. ‘‘ఇది డీటైల్డ్‌గా చెప్తేనే నచ్చే కథ. అరగంటలో చెప్పడం కుదరదు’’ నసిగాడు జగన్. ‘‘అయితే వద్దు’’ టకీమని అనేశాడు కల్యాణ్. జగన్ కంగారుపడిపోయాడు. ‘‘సార్... అరగంటే కథ వినండి. ఆ తర్వాత మీకు వినాలనిపిస్తే కంటిన్యూ చేస్తా. లేకపోతే నా దారిన నే వెళ్లిపోతా’’ అని కాన్ఫిడెంట్‌గా అన్నాడు జగన్. కల్యాణ్ అతనివైపు ఓసారి తీక్షణంగా చూసి ‘‘సరే... స్టార్ట్ చేయండి’’ అన్నాడు. జగన్ కథ చెప్పడం మొదలుపెట్టాడు. అరగంట ఎప్పుడైందో తెలియలేదు. తెల్లారిపోయింది కూడా. టైం చూస్తే సుమారు ఎనిమిది అయ్యింది. జగన్‌కి షేక్‌హ్యాండ్ ఇచ్చి ‘‘వెల్ స్క్రిప్ట్’’ అంటూ ‘‘ఛోటా నాకు ఇంకో లైన్ చెప్పాడే’’ అన్నాడు కల్యాణ్. ‘‘ఆయన టేస్ట్‌కి తగ్గట్టుగా ఇంకో కథ చెప్పాను. నేను మీకు చెప్పాలనుకున్న కథ మాత్రం ఇదే’’ చెప్పాడు జగన్ నవ్వుతూ. ‘‘ఓకే. మనం సినిమా చేస్తున్నాం. కానీ ఈ క్లైమాక్స్ నాకు నచ్చలేదు. మార్చి తీసుకు రండి’’... కల్యాణ్ ఫైనల్ ట్విస్ట్. కల్యాణ్ ఓకే చేసినందుకు ఆనందపడాలో, ఈ ఫైనల్ ట్విస్ట్‌కి బాధపడాలో అర్థం కాని పరిస్థితి జగన్‌ది. రూమ్కొచ్చాడు. క్లైమాక్స్ గురించే తీవ్రాతి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. రోజుకో క్లైమాక్స్ రాశాడు. వారం రోజుల్లో 7 క్లైమాక్స్‌లు. ఆ రోజే కల్యాణ్‌ని కలిసి ఫైనల్ వెర్షన్ చెప్పాలి. వెళ్తూ వెళ్తూ ఆ క్లైమాక్స్ పేపర్ల వైపు చూశాడు జగన్. వెంటనే వాటిని చింపేసి డస్ట్ బిన్లో పారేశాడు. కల్యాణ్‌ని కలిసి క్లైమాక్స్ వినిపించాడు. ‘‘ఇదేంటి? ఇది పాత క్లైమాక్సే కదా. మార్చుకు రాలేదా?’’ ఆశ్చర్యంగా అడిగాడు కల్యాణ్. ‘‘ఏడు క్లైమాక్స్‌లు రాశాను సార్. కానీ నాకెందుకో వాటన్నింటి కంటే ఇదే నచ్చింది’’ కొంచెం ఇబ్బందిపడుతూనే అసలు నిజం చెప్పేశాడు జగన్. కల్యాణ్ ఒక్కుదుటున లేచి ‘‘కంగ్రాట్స్ జగన్... నువ్వు క్లైమాక్స్ మార్చి ఉంటే మనం సినిమా చేసేవాళ్లం కాదు. కథ మీద నీకున్న నమ్మకాన్ని టెస్ట్ చేయడం కోసమే క్లైమాక్స్ మార్చమన్నా. ‘తమ్ముడు’ షూటింగ్ అయిపోగానే ఈ సినిమా మొదలుపెడదాం’’ అని చెప్పాడు. కల్యాణ్ ఎవరికో ఫోన్ చేశాడు. అరగంట తర్వాత సీనియర్ ప్రొడ్యూసర్ టి.త్రివిక్రమరావు అక్కడికొచ్చారు. ‘‘ఇతని పేరు పూరీ జగన్నాథ్. నేను మీకు చేయబోయే సినిమాకు ఇతనే డెరైక్టర్. మిగతా విషయాలు మాట్లాడుకోండి’’ అంటూ జగన్‌ని త్రివిక్రమరావుకి ఇంట్రడ్యూస్ చేశారు. త్రివిక్రమరావు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. కల్యాణ్ ఇంత త్వరగా డేట్స్ ఇస్తాడని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. లైన్లో చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నా పిలిచి మరీ డేట్లు ఇచ్చాడాయనకు. చిరంజీవితో ‘కొండవీటి దొంగ’ తీస్తున్నప్పుడు కల్యాణ్ లొకేషన్‌కి వెళ్లేవాడు. ఆ టైమ్‌లో త్రివిక్రమరావు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారట. ఆ హాస్పిటాలిటీ కల్యాణ్‌కు గుర్తుండిపోయింది. జగన్‌కు డెరైక్షన్ చాన్సిస్తూ కల్యాణ్ ఓ కండిషన్ పెట్టాడు. ‘‘టాకీ పార్టీలో నేను వేలు పెట్టను. కానీ సాంగ్స్ పిక్చరైజేషన్ బాధ్యత అంతా నాదే.’’ జగన్‌కి ఓకే. జగన్‌కి 50 వేలు అడ్వాన్స్. ఆ డబ్బుతో ఫిల్మ్‌నగర్ టర్నింగ్లో ఆఫీస్ తీశాడు. 3 లక్షలు అప్పుచేసి ఆఫీస్ మొత్తం డెకరేట్ చేయించాడు. అప్పుడే ఇంత బిల్డప్ అవసరమా? అని ఫ్రెండ్స తిట్టారు. అయినా జగన్ డోంట్ కేర్. సినిమా స్టార్ట్ కావడానికి కొన్ని నెలల గ్యాప్. ఈలోగా షాట్ బై షాట్ బొమ్మలతో స్క్రిప్ట్ బుక్ చేసుకున్నాడు. మరోపక్క ఆర్టిస్టుల సెలెక్షన్. ఇద్దరు హీరోయిన్లు కావాలి. కొత్తవాళ్లయితే బెటర్. చలో ముంబై. నెంబరాఫ్ కో-ఆర్డినేటర్స్‌ని కాంటాక్ట్ చేశారు. ఫైనల్‌గా ఇద్దరు సెలెక్ట్. రేణూ దేశాయ్ మెయిన్ హీరోయిన్. అమీషా పటేల్ సెకెండ్ లీడ్. కల్యాణ్‌కి కూడా ఇద్దరూ నచ్చేశారు. కానీ సరయు పాత్రకు రేణు కంటే అమీషా బావుంటుందని సజెషన్. దాంతో హీరోయిన్లు రివర్స్. హీరో క్యారెక్టర్ పేరు నందా. విలన్ నేమ్ బద్రి. ఇది కూడా రివర్స్. ఇప్పుడు - హీరో పేరు ‘బద్రి’. విలన్... నందా. సినిమా టైటిల్ ‘చెలి’ అని పెడితే ఎలా ఉంటుంది? మరీ సాఫ్ట్ అయిపోతుందేమో. ఎందుకు ఎంచక్కా ‘బద్రి’ అని ఉంచేస్తే పోలా! టైటిల్ డన్. మధు అంబట్ సీనియర్ కెమెరామ్యాన్. పవన్ కల్యాణ్ చాయిస్. జగన్‌లాంటి కొత్త డెరైక్టర్‌కు అంతకన్నా పెద్ద భరోసా ఏముంటుంది? రమణ గోగుల మ్యూజిక్ డెరైక్టర్. కల్యాణ్‌కి క్లోజ్. ‘తమ్ముడు’కి అతనే మ్యూజిక్ ఇస్తున్నాడు. జగన్‌తో కూడా రమణ గోగుల బాగా కలిసిపోయాడు. టాకీ పార్ట్ షూటింగంతా హైదరాబాద్‌లోనే. కొన్ని పాటలకు మాత్రం న్యూజిలాండ్ వెళ్లారు. ‘అయామ్ ఏన్ ఇండియన్’ అంటూ ఓ ఇంగ్లిషు పాట పెట్టారు. జాలీస్ షేర్వాణి రాసిన ఆ పాటను రమణ గోగుల పాడారు. ‘బద్రి’ షూటింగ్ టైమ్‌లోనే ‘కహోనా ప్యార్ హై’ రిలీజై బ్లాక్‌బస్టర్ అయ్యింది. దాంతో అమీషాకు బాలీవుడ్లో మహా డిమాండ్. ‘బద్రి’ షూటింగ్‌కు కొంత అంతరాయం. 2000 ఏప్రిల్ 20. ‘బద్రి’ రిలీజ్. పవన్ కల్యాణ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉందన్నారు. ‘‘నువ్వు నందావైతే నేను బద్రీ’’ లాంటి డైలాగులు బాగా పేలాయి. మొదట్లో డివైడ్ టాక్. ఫైనల్‌గా హిట్‌గా డిసైడ్. కల్యాణ్‌కు వరుసగా ఆరో విజయం. పూరి జగన్నాథ్ అనే సరికొత్త అధ్యాయానికి అందమైన శ్రీకారం. జగన్‌కు ఇప్పుడు హైదరాబాద్‌లో కోట లాంటి ఆఫీస్ ఉంది. ఆయన పర్సనల్ చాంబర్లో కుడిపక్కన ‘బద్రి’ పోస్టర్ లామినేషన్ స్పెషల్‌గా కనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడల్లా జగన్‌లో ఓ కొత్త ఎనర్జీ పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. వెరీ ఇంట్రస్టింగ్... * పూరి అక్క కూతురి పేరు సరయు. అదే ఇందులో కథానాయికకు పెట్టాడు. * హిందీలో జగన్ దర్శకత్వంలోనే ‘షర్త్’ పేరుతో రీమేక్ చేశారు త్రివిక్రమరావు. తుషార్ కపూర్ హీరో. అక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. - పులగం చిన్నారాయణ -
తడిపి తడిపి తనతో నడిపి..
సినిమా వెనుక స్టోరీ - 22 హైదరాబాద్‌లో వర్షం అనుకోని అతిథి లాంటిది. ఎప్పుడొస్తుందో తెలీదు. ఆ రోజు అలానే ఊహించని విధంగా వర్షం కురిసింది. ఎమ్మెస్ రాజు కారు బంజారా హిల్స్ రోడ్లమీద వేగంగా పరిగెడుతోంది. ఆయనప్పుడే సూర్యనారాయణరాజుని కలిసి వస్తున్నారు. సూర్యనారాయణరాజు అంటే ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజుకి సొంత తమ్ముడు. వాళ్లబ్బాయ్ ప్రభాస్ అప్పుడే హీరోగా ఎంటరయ్యాడు. ‘ఈశ్వర్’, ‘రాఘవేంద్ర’... రెండు సినిమాలు చేశాడు. ‘‘మావాణ్ణి మీ చేతుల్లో పెడు తున్నాను. ఎలా చేస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టం’’ అన్నారు సూర్యనారాయణరాజు. అంత ఫ్రీడమ్ ఇస్తే ఎమ్మెస్ రాజు లాంటి ఫిల్మ్మేకర్కి ఫుల్ హ్యాపీ. దాంతో పాటే కొండంత ఒత్తిడి కూడాను. ‘‘నన్ను నమ్మి వాళ్లబ్బాయిని అప్పగిస్తున్నారు. ఎలాగైనా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి.’’ కారు కన్నా వేగంగా పరుగులు తీస్తోంది ఎమ్మెస్ రాజు మనసు. వర్షం వెలిసి పోవడంతో హైదరాబాద్ తడితడి అందాలతో మెరిసిపోతోంది. ‘ఒక్కడు’ ఆల్‌టైమ్ సూపర్‌హిట్. ఎమ్మెస్ రాజు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇండస్ట్రీ అంతా వెయిటింగ్. ఎమ్మెస్ రాజు ఎక్కువ మాట్లాడరు. ఆయన చేతల మనిషి. ఏం చేసినా సెలైంట్‌గానే చేస్తారు. ప్రభాస్‌తో పక్కా యాక్షన్ ఫిల్మ్ చేయడానికి కావాల్సిన సరంజామా సిద్ధం చేస్తున్నారాయన. పరుచూరి బ్రదర్స్ దగ్గర వీరు పోట్ల అసిస్టెంట్. ఫుల్ జెమ్. అతనో యాక్షన్ ఎపిసోడ్ చెప్పాడు. ఎమ్మెస్ రాజుకి విపరీతంగా నచ్చేసింది. దాని చుట్టూరా స్క్రిప్టు అల్లుతున్నారు. రామాయణం లాంటి కథ. సీతను రావణుడు మోహించి లంకలో బంధిస్తాడు. ఆ లంక నుంచి సీతను విడిపించడమే రాముడి లక్ష్యం. సేమ్ టు సేమ్ అలాంటి ప్యాట్రనే. ఓ అందమైన అమ్మాయి. ఆమె చుట్టూ గుడ్, బ్యాడ్, అగ్లీ క్యారెక్టర్స్. గుడ్ అంటే హీరో. బ్యాడ్ అంటే విలన్. అగ్లీ అంటే హీరోయిన్ ఫాదర్. ఈ నలుగురితో పాటు వర్షానిది కూడా ఇంపార్టెంట్ రోల్. ఇదంతా ఓకే. కానీ బ్యాక్‌డ్రాప్ అదిరి పోవాలి. ఇంతవరకూ ఏ సినిమాలోనూ వచ్చి ఉండకూడదు. ఏవేవో ఆలోచిస్తుంటే ఫైనల్‌గా దొరికింది. వరంగల్ బ్యాక్‌డ్రాప్. వేయి స్తంభాల గుడి, మిగతా హిస్టారికల్ ప్లేసెస్. ఆడియన్స్‌కి ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇవన్నీ ఇన్క్లూడ్ చేసు కుంటూ స్టోరీ సెట్ చేశారు. హిందీ సినిమా ‘తేజాబ్’లో కొన్ని క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. కూతుర్ని ఉపయోగించుకుని కోటీశ్వరుడు కావాలని కలలు కనే తండ్రిగా అనుపమ్ ఖేర్ చేశాడు. అందులో అనిల్‌కపూర్ - మాధురీ దీక్షిత్ మనస్పర్థలొచ్చి విడిపోతారు. వీటన్నిటి ఇన్స్పిరేషన్తో స్క్రిప్ట్ ఫైనల్ అయ్యింది. ఇంతకూ ఈ కథను ఎమ్మెస్ రాజు ఎవరితో డెరైక్ట్ చేయిస్తారు? ఎవరా లక్కీ గై? ‘బాబి’ సినిమా డిజాస్టర్ కావడంతో డెరైక్టర్ శోభన్ పాపం ఫుల్లీ డిప్రెస్డ్. అలాంటి టైమ్‌లో ఎమ్మెస్ రాజు నుంచి ఫోన్. పోన్లే... తుపాన్ టైమ్‌లో రొట్టె ముక్క అయినా దొరుకుతోంది. డెరైక్టర్‌గా ఎలాగూ భవిష్యత్తు లేదు. రైటర్గానైనా స్థిరపడదాం... శోభన్ ఊపిరి పీల్చుకున్నాడు. జీరో క్యాండిల్ బల్బులాగా సుమంత్ ఆర్ట్స్ ఆఫీసులోకి అడుగుపెట్టినవాడు, ఫ్లడ్ లైట్‌లాగా బయటికొచ్చాడు. నెవర్ ఎక్స్‌పెక్టింగ్ ఆఫర్. ప్రభాస్ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేయమంటారనుకుంటే... ఏకంగా డెరైక్షన్ ఆఫర్ ఇచ్చారు. స్టార్ కాని ప్రభాస్‌తో... అట్టర్ ఫ్లాప్ డెరైక్టర్‌తో... ఎమ్మెస్ రాజు సినిమానా? మరీ ఇంత మొండి ధైర్యమా? ఈ టైమ్‌లో ఏటికి ఎదురీదడం అవసరమా? ఈ కామెంట్స్ అన్నీ ఎమ్మెస్ రాజు చెవిన పడుతున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకునే స్థితిలో లేరాయన. ఓ పక్క స్క్రిప్ట్ ఫైనల్ డిస్కషన్స్. మరోపక్క కాస్టింగ్ సెలెక్షన్. కె. రాఘవేంద్రరావు ‘గంగోత్రి’ సినిమాలో ఓ కొత్తమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదితీ అగర్వాల్. హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ సిస్టర్. అదిరిపోయేలా ఉందని టాక్. ప్రభాస్ పక్కన బాగానే ఉండేట్టు ఉంది. కానీ ‘గంగోత్రి’ కంప్లీట్ అయితే తప్ప, డేట్స్ దొరకవు. వేరే ఆప్షన్ చూసుకోవాల్సిందే. చెన్నైలో ‘నాని’ షూటింగ్. సరదాగా మహేశ్‌ని కలవడానికెళ్లారు ఎమ్మెస్ రాజు. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కెళ్తుంటే - జెమినీ ఫ్లై ఓవర్ దగ్గర అప్పుడే ఓ కొత్త సినిమా వినైల్ ఫిక్స్ చేస్తున్నారు. అందులో మెరుపులాగా ఓ అమ్మాయి కనిపించింది. ఎమ్మెస్ రాజు వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టారు. విక్రమ్ పక్కన ‘సామి’ అనే తమిళ సినిమాలో చేస్తోందట. తెలుగులో కూడా ‘నీ మనసు నాకు తెలుసు’ అనే సినిమా చేస్తోంది. ఆ చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం ద్వారా ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేశారు. వెంటనే లైన్లోకొచ్చిందా అమ్మాయి. ఎమ్మెస్ రాజు చూచాయగా కథ చెబితే థ్రిల్లయిపోయింది. ఆ అమ్మాయే త్రిష. శైలజ పాత్రకు త్రిష రెడీ. ‘జయం’, ‘నిజం’ సినిమాల్లో విలన్‌గా చేసి మంచి స్వింగ్ మీదున్నాడు గోపీచంద్. ఇందులో భద్రన్న పాత్రకు అతనే ఫస్ట్ చాయిస్. ఒడ్డూ పొడుగు, క్యారెక్టర్స్ పరంగా ప్రభాస్‌తో పోటాపోటీగా ఉండాలి. గోపీచంద్ ఓకే. హీరోయిన్ ఫాదర్‌గా ప్రకాశ్‌రాజ్‌ను మించిన ఆప్షన్ ఎవరుంటారు? డైలాగ్ రైటర్ సత్యమూర్తి కొడుకైన దేవిశ్రీ ప్రసాద్‌ను ‘దేవి’తో మ్యూజిక్ డెరైక్టర్ని చేసింది ఎమ్మెస్ రాజే. ఆ తర్వాత మళ్లీ పిలవలేదు. ఈ సినిమాకు మాత్రం దేవిశ్రీతోనే మ్యూజిక్ చేయించుకోవాలని ముందే ఫిక్స్. గోల్డెన్ చాన్స్. దేవి చెలరేగిపోయాడు. ఎమ్మెస్ రాజు ఒక ట్యూన్ అడిగితే వంద ఆప్షన్లిచ్చేవాడు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అంటే ఎమ్మెస్ రాజుకి భక్తి, గౌరవం, ఆరాధన. ఆయనకు స్క్రిప్టు ఇచ్చేసి, ‘‘మీ ఇష్టం గురువుగారూ... ఎంతైనా తీసుకోండి. నాకు మంచి పాటలు కావాలి’’ అన్నారు ఎమ్మెస్ రాజు. పగలబడి నవ్వేశారు సిరివెన్నెల. అంతే... పాటల కనక వర్షం కురిసింది. టైటిల్ ‘వర్షం’ అయితే బాగుంటుంది. కానీ వీఎన్ ఆదిత్య అప్పటికే ఇదే టైటిల్‌తో నాగార్జున కోసం ఓ స్క్రిప్ట్ చేసుకుంటున్నాడు. ఎమ్మెస్ రాజు అడగ్గానే టైటిల్ ఇచ్చేశాడు. రూట్ క్లియర్. మార్చి 14... ఎమ్మెస్ రాజు శ్రీమతి పుట్టినరోజు. సెంటిమెంటల్ డే. ‘ఒక్కడు’ అదే రోజు మొదలైంది. ‘వర్షం’ కూడా అదే రోజున స్టార్ట్. ఫస్ట్ షెడ్యూల్ వర్క్ జరుగుతోంది. ఎమ్మెస్ రాజు నాట్ శాటిస్ఫైడ్ విత్ దట్ వర్క్. షూటింగ్ ఆపేశారు. 2 నెలలు బ్రేక్. మళ్లీ స్క్రిప్ట్ మీద కూర్చున్నారు. లోపాలన్నీ పట్టిపట్టి వెతుకుతున్నారు. హీరోకు విలన్‌కు మధ్య ఒకసారి ఫైట్ జరిగింది. రెండోసారి కూడా ఫైట్ పెట్టాల్సిన పరిస్థితి. కానీ పెట్టకూడదు. అంత ఎఫెక్ట్ వచ్చేంత డైలాగ్ పడాలి. పరుచూరి బ్రదర్స్ ఇలాంటి వాటిల్లో మాస్టర్స్. ‘‘శైలు కోసం నేను వందసార్లు చస్తాను. నువ్వు ఒక్కసారి చస్తావా?’’ అని హీరో, విలన్ని అడుగుతాడు. ఆ ఒక్క డైలాగ్‌తో విలన్ బుర్ర తిరిగిపోయేలా కొట్టాడు హీరో. ఇలాంటి కరెక్షన్స్ అన్నీ చేసేశారు. ఇప్పుడు స్క్రిప్ట్ పర్ఫెక్ట్. మళ్లీ షూటింగ్ స్టార్ట్. రైల్వేస్టేషన్లో ఓ పాట. అలా ఇలా ఉండకూడదు. మోతెక్కిపోవాలి. ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ కావాలి. అప్పుడతను ఆర్టిస్టుగా చాలా బిజీగా ఉన్నాడు. ఎంత బిజీ అంటే కొరియోగ్రఫీ కూడా పక్కన పెట్టేశాడు. కానీ ఎమ్మెస్ రాజు లాంటివాడు అడిగితే కాదనగలడా? జీ హుజూర్ అంటూ వచ్చేశాడు. తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ‘పనపాకం’ రైల్వేస్టేషన్. ప్రభాస్, త్రిష, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, 60-70 మంది మోడల్స్‌తో వన్ వీక్ తీశారా పాట... ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన... ఎన్నాళ్లని దాక్కుంటావే పైన’. పూతలపట్టు రైల్వేస్టేషన్... పాత బస్తీలోని సుల్తాన్ బజార్... శంకర్పల్లి దగ్గర భారీ సెట్... ఇలా చాలా చోట్ల యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. వరంగల్‌లో టెన్ డేస్ షెడ్యూల్ చేశారు. ‘‘ఇక్కడ తీసిన సినిమాలేవీ ఆడలేదు’’ అన్నాడు ఒకతను. ‘‘ఈ సినిమాతో ఆ సెంటిమెంట్ పోతుందిలే’’ చెప్పారు ఎమ్మెస్ రాజు చాలా కాన్ఫిడెంట్‌గా. ఎమ్మెస్ రాజుకి అరకు వ్యాలీ సెంటిమెంట్. అక్కడ తీసిన ఆయన సినిమాలన్నీ హిట్టే. అందుకే అరకులో కొన్ని యాక్షన్ సీన్స్, ఒక సాంగ్ తీశారు. ఇంట్రడక్షన్ షాట్ హెవీ రిస్క్. క్వారీలో బాంబు పేలుళ్ల మధ్య షాట్స్ తీయాలి. డూప్ పెడదామంటే ప్రభాస్ ఒప్పుకోలేదు. 140 వర్కింగ్ డేస్‌లో సినిమా షూటింగ్ కంప్లీటెడ్. 5 కోట్ల బడ్జెట్ తేలింది. ఈ సినిమాతో ప్రభాస్ పెద్ద రేంజ్కెళ్తాడు. ఇది ఎమ్మెస్ రాజు ప్రిడిక్షన్. ఇంతకు మించి ‘వర్షం’ గురించి ఒక్క ముక్క మాట్లాడలేదాయన. 2004 సంక్రాంతి. మంచి పోటాపోటీ సీజన్. ఎమ్మెస్ రాజు కాన్ఫిడెన్సే గెలిచింది. వర్షం... సూపర్ డూపర్ హిట్. 120 ప్రింట్స్... 200 థియేటర్స్. సెకండ్ వీక్కొచ్చేసరికి ఇంకో 80 ప్రింట్స్ పెంచాల్సిన పరిస్థితి. ప్రభాస్ ఇప్పుడు స్టార్. ‘చిరంజీవి’కి ‘ఖైదీ’లాగా ప్రభాస్‌కి ఇది టర్నింగ్ పాయింట్. త్రిషకు సూపర్ క్రేజ్. కోలా రంగారావు పాత్రలో ప్రకాశ్‌రాజ్ డీలింగ్‌కి ఫుల్ మార్క్స్. భద్రన్నగా గోపీచంద్‌కు సూపర్బ రెస్పాన్స్. గోపాలరెడ్డి కెమెరావర్క్‌కు అందరూ ఫ్లాట్. దేవి మ్యూజిక్ క్రియేటెడ్ వండర్. ఎమ్మెస్ రాజుకు డేరింగ్ డ్యాషింగ్ అండ్ డైనమిక్ ఫిలిం మేకర్‌గా బ్రాండ్. ఆ రోజు భారీ వర్షం. ఎమ్మెస్ రాజు కారులో వెళ్తూ ఆ వర్షాన్నే మురిపెంగా చూస్తున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా, ఆయన్ని ‘వర్షం’ సినిమా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. వెరీ ఇంట్రస్టింగ్... * హైదరాబాద్ - తెలుగు లలిత కళాతోరణంలో సిల్వర్‌జూబ్లీ ఫంక్షన్ చేశారు. చిరంజీవి, వెంకటేశ్, మహేశ్‌బాబు చీఫ్ గెస్ట్‌లు. * ఈ సినిమాకు పనిచేసిన వీరు పోట్ల (కథారచయిత), వంశీ పైడిపల్లి - గౌతమ్ పట్నాయక్ - శ్రావణ్ (అసోసియేట్ డెరైక్టర్స్), కె.రాంబాబు (కో-డెరైక్టర్), ప్రభుదేవా - లారెన్స్ - సుచిత్రా చంద్రబోస్ (కొరియో గ్రాఫర్స్), ఎస్.గోపాల్‌రెడ్డి (కెమెరా మ్యాన్) తర్వాతి కాలంలో డెరైక్టర్స్‌గా మారారు. ఎమ్మెస్ రాజు కూడా. * తమిళంలో ‘జయం’ రవితో ఎస్పీ బాలసుబ్రమణ్యం ‘మళై’గా రీమేక్ చేశారు. - పులగం చిన్నారాయణ -
ఫీల్ మై లవ్
సినిమా వెనుక స్టోరీ - 20 ప్రేమ - రెండక్షరాల మహా కావ్యం! రెండు కన్నీటి చుక్కల మహా సంద్రం!! ప్రేమ ఎప్పుడూ కుదురుగా ఉండ నివ్వదు. సుకుమార్ ప్రేమలో ఉన్నాడు. లిటరేచర్తో, మూవీస్‌తో మెదడులోతు ప్రేమలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే కుదురుగా ఉండలేకపోతున్నాడు. మంత్లీ ట్వంటీ థౌజండ్ శాలరీ... మేథ్స్ లెక్చెరర్‌గా బోలెడంత రెస్పెక్ట్... ఇవన్నీ వదిలేసి హైదరాబాద్‌లో అనామకంగా ఉండటమేంటి? అసిస్టెంట్ డెరైక్టర్‌గా క్లాప్బోర్డ్లు మోయడమేంటి? నెలకు పదిహేనొందల జీతమేంటి? సినిమాలంటే పిచ్చి ప్రేమ మరి. మూడంటే మూడు సినిమాలు... మనసిచ్చి చూడు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్.... ఇలా ఇంకా ఎన్ని సినిమాలకు క్లాప్ కొట్టాలో? సుకుమార్‌లోని సినిమా ప్రేమ కుదురుగా ఉండనివ్వడంలేదు. వైజాగ్ బీచ్... సుకుమార్, ప్రకాశ్, వేమారెడ్డిల మధ్య స్టోరీ డిస్కషన్స్. సుకుమార్ చెప్పిన లైన్‌కు వాళ్లిద్దరూ ఫ్లాట్. ఆ బీచ్‌లోనే కథ మొత్తం ఓ షేప్కొచ్చింది. ఈ కథతో ప్రొడ్యూసర్ని ఒప్పించాలి. హీరోని మెప్పించాలి. వెండితెరను గెలిపించాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందో? విజయ్ ఫోన్. ‘హనుమాన్ జంక్షన్’కి కెమెరా అసిస్టెంట్. వీవీ వినాయక్‌కి సొంత తమ్ముడు. ‘‘సుక్కూ... నితిన్ హీరోగా మా అన్నయ్య ‘దిల్’ సినిమా చేయబోతు న్నాడు. డెరైక్షన్ డిపార్ట్మెంట్లో నువ్వు చేద్దువుగాని రా’’ చెప్పాడు విజయ్. వైజాగ్‌లో రెడీ చేసుకున్న స్క్రిప్ట్‌ని భద్రంగా బ్యాగ్‌లో పెట్టుకుని హైదరాబాద్ వచ్చేశాడు సుకుమార్. ‘దిల్’ షూటింగ్... కొత్త ప్రొడ్యూసర్స్ రాజు-గిరి. ఇంతకు ముందు వీళ్లు డిస్ట్రిబ్యూటర్స్. మణిరత్నం ‘అమృత’ సినిమాను తెలుగులో డబ్బింగ్ కూడా చేశారు. ఇది ఫస్ట్ డెరైక్ట్ సినిమా. అంతా కుర్రగ్యాంగ్. సందడి సందడిగా ఉంది లొకేషన్. జోక్స్, కామెంట్స్... హుషారే హుషారు. సుకుమార్ మాత్రం సెలైంట్‌గా ఉండేవాడు. పనిలో మాత్రం వయొలెంట్. ఎవరైనా ఏదైనా డౌట్ అడిగితే చాలా డెప్త్‌తో మాట్లాడేవాడు. ప్రొడ్యూసర్ రాజుకి సుకుమార్ అంటే ఇంప్రెషన్. వినాయక్ కూడా ‘‘ఇతనిలో మంచి విషయం ఉంది’’ అని సర్టిఫై చేశాడు. ‘‘దిల్’ హిట్టయితే నీకు డెరైక్షన్ చాన్స్ ఇస్తా. కథ రెడీ చేసుకో’’ రాజు హామీ. సుకుమార్ ఇన్ క్లౌడ్స్. ‘దిల్’ సూపర్‌హిట్. వినాయక్ కంటే ఎక్కువ సంబరపడిపోయాడు సుకుమార్. ఎందుకంటే ఈ హిట్టు మీదే అతని ఫ్యూచర్ డిపెండ్ అయివుంది. రాజు మాట తప్పలేదు. ‘‘ఇదిగో విక్రమన్ చేసిన తమిళ సినిమా స్ట్రిప్టు. దీన్ని నువ్వు డెరైక్ట్ చేయాలి’’. సుకుమార్‌లో పెద్ద జర్క్... కన్ఫ్యూజన్. ‘‘రీమేకా? నాకిష్టం లేదు. నా కథతోనే చేస్తాను’’ అనేశాడు వెంటనే. ‘‘సరే... నీ కథేంటో చెప్పు’’ అడిగాడు రాజు. సుకుమార్ ఇమీడియట్గా కథ చెప్పేశాడు. రాజులో నో రెస్పాన్స్. నచ్చిందా? నచ్చలేదా? సుకుమార్‌లో విపరీతమైన టెన్షన్. ‘‘స్టోరీ బాగుంది కానీ, కమర్షియల్‌గా వర్కవుట్ కాదేమో. ఇంకేదైనా ఆలోచించు’’ అనేసి వెళ్లిపో యాడు రాజు. సుకుమార్ ఇన్ డిప్రెషన్. ‘దిల్’ రాజు ఆఫీసు... సుకుమార్ నీరసంగా లోపలికెళ్తున్నాడు. హాల్లో... ‘దిల్’రాజు, సురేందర్‌రెడ్డి, చందు ఇంకా చాలామంది కూర్చుని నవ్వుకుంటున్నారు. ‘‘రా సుక్కూ... నిన్న నువ్వు చెప్పిన కథ వీళ్లకు చెబితే ఎగ్జైట్ అయిపోతున్నారు. వర్కవుట్ అయ్యేట్టు ఉంది. మనమీ ప్రాజెక్ట్ చేస్తున్నాం’’ అని అప్పటికప్పుడు అనౌన్స్ చేసేశాడు ‘దిల్’ రాజు. సుకుమార్ ఇన్ ఫుల్ జోష్. నితిన్‌కు చెప్పాడు. రవితేజను కలిశాడు. ప్రభాస్ కూడా విన్నాడు. ఫైనల్‌గా కొత్త హీరోనే కరెక్ట్ అని డిసైడయ్యారు సుకుమార్ అండ్ రాజు. అదే టైమ్‌లో- ప్రభాస్ కోసం ‘దిల్’ స్పెషల్ ప్రొజెక్షన్ వేశారు ప్రసాద్ ల్యాబ్ థియేటర్లో. ప్రభాస్ ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారు. వాళ్లల్లో ఒకబ్బాయి చెంగుచెంగున అటూ ఇటూ తిరుగుతూ జోక్స్ కట్ చేస్తూ తెగ హడావిడి చేస్తున్నాడు. ‘‘అరె... అచ్చం నా హీరోలానే ఉన్నాడే’’ అనుకున్నాడు సుకుమార్. కొంచెం దగ్గరకెళ్లి చూస్తే... అల్లు అర్జున్. ‘గంగోత్రి’తో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ‘ఈ స్టోరీకి ఇతనే యాప్ట్’... ఫిక్స్ అయిపోయాడు సుకుమార్. ‘దిల్’ రాజుకి చెప్పేశాడు. ‘‘లేట్ ఎందుకు... ఇప్పుడే అడిగేస్తా’’ అంటూ అల్లు అర్జున్‌ని పిలిచాడు రాజు. వాళ్లిద్దరికీ కొంచెం దూరంగా సుకుమార్ నిలబడ్డాడు. ‘‘మా దగ్గరో కథ ఉంది. వింటావా?’’ అడిగాడు ‘దిల్’రాజు. ‘‘గంగోత్రి తర్వాత ఇప్పటికి 96 కథలు విన్నాను సార్. అన్నీ రొటీన్... బుర్ర తిరిగిపోతోంది’’ చెప్పాడు అర్జున్. ‘‘ఈ కథ విను. నీకు డెఫినెట్‌గా నచ్చుతుంది’’ భరోసా ఇచ్చాడు రాజు. కథ విని ఒక విజిల్ కొట్టాడు బన్నీ. ఇప్పుడు అల్లు అరవింద్ కథ వినాలి. ఫస్ట్ హాఫ్ వరకూ విని ‘‘అర్జంట్ మీటింగ్ ఉంది. రేపు కలుద్దాం’’ అన్నాడాయన. సుకుమార్‌కి ఏసీలో కూడా చెమట్లు పట్టేశాయి. నచ్చలేదేమో. డౌట్ల మీద డౌట్లు. అదే టైమ్‌కి బన్నీ... ‘‘ఏం టెన్షన్ పడొద్దు. డాడీకి నచ్చింది. సెకెండాఫ్ హ్యాపీగా చెప్పండి’’. నెక్స్ట్ డే - సెకెండాఫ్ విన్నారాయన. ‘‘బాగుంది... కానీ ఎక్కడో ఏదో మిస్సయ్యింది’’ చెప్పాడు అల్లు అరవింద్. ‘‘త్రీడేస్‌లో చేంజెస్ చేసి తీసుకొస్తాం’’ అన్నాడు ‘దిల్’రాజు. త్రీ డేస్ కాదు... టెన్ డేస్ కూర్చున్నారు. ఇప్పుడింకా స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా తయారైంది. కానీ ఏదో డౌట్. అల్లు అరవింద్ ఈసారైనా ఓకే చేస్తారా? ఆయనతో మనకు వర్కవుట్ కాదేమో. పవన్ కల్యాణ్‌ని ట్రై చేస్తే? గుడ్ ఐడియా. కానీ కలిసే చానలే లేదు. అరవింద్‌కి బాగా తెలిసిన వ్యక్తి ఓ మీటింగ్‌లో ‘దిల్’ రాజుని కలిశాడు. ‘‘అరవింద్ గారికి మీరేదో కథ చెప్పారట. మార్పులు చేసి తీసుకొస్తే ఓకే చేసేట్టు ఉన్నారు’’ అన్నాడతను క్యాజువల్‌గా. కట్ చేస్తే- అల్లు అరవింద్ దగ్గరున్నాడు సుకుమార్. కథ విని ఆయన ఫుల్ హ్యాపీ. కానీ చిన్న డైలమా. ‘‘వేరే ప్రాజెక్టు కూడా లైన్లో ఉంది. ఏది ముందో డిసైడ్ చేయాలి’’ చెప్పారు అరవింద్. ఆ పదిరోజులూ సుకుమార్‌కి నరకం. చివరకు సస్పెన్స్ వీడింది. సుకుమార్‌కి గ్రీన్‌సిగ్నల్. చిరంజీవి కూడా కథ విన్నారు. సుకుమార్ ప్రతి మైన్యూట్ బిట్నీ పేపర్ మీద రాసుకుని చెప్పడం ఆయన్ని ఆకట్టుకుంది. రెగ్యులర్ కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీ కాదని ఆయనకు అర్థమైపోయింది. ‘గీత’ క్యారెక్టర్‌కి ‘కిట్‌క్యాట్’ చాక్లెట్ యాడ్ మోడల్ అనూ మెహతా... ‘అజయ్’ పాత్రకు శివబాలాజీ... ఇలా కాస్టింగ్ అంతా క్లియర్. మ్యూజిక్, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ విషయంలో చాలా మొండిగా ఉన్నాడు సుకుమార్. సూపర్ టెక్నీషియన్స్ కావాలి. మిగతా విషయాల్లో బడ్జెట్ కంట్రోల్ ఓకేగానీ, ఈ మూడు క్రాఫ్ట్స్ విషయంలోనూ ఫ్రీడమ్ అడిగాడు సుకుమార్. ‘దిల్’ రాజు కూడా ఓకే. ఎడిటర్‌గా శ్రీకర్‌ప్రసాద్. లేకపోతే మార్తాండ్ కె.వెంకటేశ్ కావాలి. మార్తాండ్ ఓకే. మ్యూజిక్ డెరైక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ డబుల్ ఓకే. సాయంత్రం స్టోరీ విని మిడ్నైట్ ‘ఫీల్ మై లవ్’ ట్యూన్ రెడీ చేసిచ్చేశాడు. అంతలా కనెక్టయ్యాడు తను. ఇక మిగిలింది కెమేరామ్యాన్. తమిళంలో పాపులర్ ఎవరో ఎంక్వైరీ చేశాడు. రత్నవేలు గురించి తెలిసింది. రాజీవ్ మీనన్ శిష్యుడతను. తమిళంలో అప్పటికే 7 సినిమాలు చేశాడు. ఫస్ట్ మీటింగ్‌లోనే సుకుమార్, రత్నవేలు ఫ్రీక్వెన్సీస్ సెట్. ‘‘నచికేత... ఇదేం పేరు? ఇంత ట్రెండీ కథకు ఇంత ఓల్డ్ నేమా?’’... ‘దిల్’ రాజు ఏదైనా ఓపెన్‌గానే చెప్పేస్తాడు. సుకుమార్ మార్కెట్ నుంచి పిల్లల పేర్ల పుస్తకం తెప్పించాడు. ఫస్ట్ పేజీలోనే పేరు దొరికేసింది. బ్యూటిఫుల్ నేమ్... ‘ఆర్య’. అంటే సంస్కృతంలో ‘మొదటివాడు’. బన్నీ కసి మీద ఉన్నాడు. ఫస్ట్ సినిమా హిట్టు. సెకెండ్ది కూడా ఇంప్రెస్ చేస్తే ఇక సెటిలైపోవచ్చు. అసలే మనసుకి నచ్చిన కథ. ‘ఆర్య’ పాత్రలో లీనమవ్వడం కోసం ఎన్ని కసరత్తులు చేయాలో అన్ని చేస్తున్నాడు. హెయిర్‌స్టయిల్ మార్చేశాడు. కాస్ట్యూమ్స్... లుక్... టోటల్‌గా కొత్త బన్నీ కనిపిస్తున్నాడు. 2003 నవంబర్ 19... అన్నపూర్ణా స్టూడియోలో గ్రాండ్ ఓపెనింగ్. చిరంజీవి క్లాప్... పవన్ కల్యాణ్ కెమెరా స్విచాన్...కె.రాఘవేంద్రరావు ఫస్ట్‌షాట్ డెరైక్షన్. యంగ్ బ్లడ్.. న్యూ కాన్సెప్ట్... టీమ్ మొత్తం హుషారుగా ఉన్నారు. షూటింగూ అంతే హుషారు. సుకుమార్ క్వాలిటీ విషయంలో జగమొండి. అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చి తీరాల్సిందే. 80 రోజులు అనుకుంటే... వర్కింగ్ డేస్ 120 డేస్ అయ్యింది. బడ్జెట్టూ పెరిగింది. ‘దిల్’రాజు బేఫికర్. ప్రొడక్ట్ మీద కాన్ఫిడెన్స్ అలాంటిది. 2004 మే 7.... మోర్నింగ్ షో డివైడ్ టాక్. బాగుందనీ అనడం లేదు. బాగో లేదనీ చెప్పడం లేదు. ఏదో డైలమా. కాన్సెప్ట్ అలాంటిది కదా. ‘దిల్’రాజుకి మాత్రం నో టెన్షన్. సుకుమార్ అయితే 125 డేస్ ఫిల్మ్ అనే నమ్మాడు. ఈవినింగ్‌కి క్లారిటీ వచ్చేసింది. ‘ఆర్య’ సూపర్ డూపర్ హిట్. సుకుమార్‌కి ఫోన్ల మీద ఫోన్లు. ‘వన్‌సైడ్ లవ్’ కాన్సెప్ట్‌ని చాలా బాగా డీల్ చేశాడని క్రెడిట్స్. బన్నీకైతే ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్. ‘గంగోత్రి’కీ దీనికీ టోటల్ లుక్ ఛేంజ్. బన్నీ ఇకపై ‘స్టయిలిష్ స్టార్’ అని ఎవరో కాయిన్ చేశారు. పాటలన్నీ మార్మోగిపోయాయి. ‘ఫీల్ మై లవ్’ సాంగ్ బాగా పట్టేసింది. ‘అ అంటే అమలాపురం’ సాంగ్ అయితే ఓ కిక్ ఇచ్చింది. 4 కోట్లతో తీసిన ఈ సినిమా 16 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ మూమెంట్లో ఆడియన్సకి ‘అ’ అంటే అల్లు అర్జున్! ‘ఆ’ అంటే ఆర్య! - పులగం చిన్నారాయణ వెరీ ఇంట్రస్టింగ్... * ఆర్యను గీత ముద్దు పెట్టుకున్న స్టిల్‌ను కాలేజ్ క్యాంపస్‌లో అంటించే సీన్ గుర్తుందా? ఆ సీన్లో హీరోయిన్ని కామెంట్ చేసిన కుర్రాడు - శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాకి అసిస్టెంట్ డెరైక్టర్. తర్వాత ‘కొత్త బంగారు లోకం’తో డెరైక్టరయ్యాడు. * 2004 సెప్టెంబర్ 8న హైదరాబాద్ లలిత కళాతోరణంలో 125 రోజుల వేడుక జరిగింది. చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. -
ఐ లవ్యూ జెస్సీ!
సినిమా వెనుక స్టోరీ - 19 మనం ఎవర్ని లవ్ చేయాలో ముందే డిసైడ్ చేసుకోగలమా? పోనీ, ప్రేమను వెతుక్కుంటూ వెళ్లగలమా? ప్రేమ... దానికదే జరగాలి. ఏదో మాయ చేసినట్టు ఉండాలి. తలకిందులు చేసెయ్యాలి. ఎప్పుడూ మనతో పాటే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలున్నా... నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను? జెస్సీ... చాలా అందంగా ఉంటుంది. క్లాసీ... బాగా చదువుకుంది... తనకొక స్టయిల్ ఉంది అండ్ సెక్సీ టూ. కార్తీక్ మనసు నిండా నిండిపోయింది జెస్సీ. కార్తీక్ తెలుగబ్బాయి. జెస్సీ మలయాళీ అమ్మాయి. ఈ ‘క్రాస్ బోర్డర్ లవ్ స్టోరీ’ని నేరేట్ చేస్తున్నాడు గౌతమ్ మీనన్. మహేశ్‌బాబు చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఏదో ట్రాన్స్‌లోకి వెళ్లిపోయినట్టుగా సీన్స్, షాట్స్, ఆర్ఆర్ బిట్స్... అన్నీ చెప్పేసుకుంటూ పోతున్నాడు గౌతమ్. కథ ఇంత బాగా చెబుతున్నాడంటే, రేపు స్క్రీన్‌పై ఇంకెంత బాగా చూపిస్తాడో మహేశ్‌కి అర్థమవుతోంది. అక్క మంజుల తీసుకొచ్చిందీ ప్రపోజల్. కథ నచ్చింది. కానీ చేయలేడు. చేయకూడదు కూడా. మహేశ్‌కున్న ఇమేజ్‌కి ఇలాంటి సాఫ్ట్ లవ్‌స్టోరీ ఎలా సెట్ అవుతుంది? ‘‘గౌతమ్‌జీ... మనమో మంచి యాక్షన్ సినిమా చేద్దాం. మీరెప్పుడంటే అప్పుడు నేను రెడీ’’ చెప్పాడు మహేశ్ నవ్వుతూ. దట్స్ ఇట్. అక్కడితో ఆ కథ ఎండ్. గౌతమ్ మీనన్ ఇలా అనుకున్నాడంటే... అలా సినిమా మొదలెట్టేస్తాడు. మహేశ్ వద్దనుకున్న కథతో తమిళంలో శింబు, త్రిషతో ‘విన్నై తాండి వరువాయా’ మొదలెట్టేశాడు. ఇక్కడేమో మంజులను ఆ కథ హాంట్ చేస్తూ ఉంది. తెలుగులో ఇలాంటి ప్యూర్ అండ్ పొయిటిక్ లవ్స్టోరీలొచ్చి చాలా ఏళ్లయిపోయింది. ఇప్పుడు చేస్తే ఆడియన్స్ కచ్చితంగా కనెక్టవుతారు. మంజుల మళ్లీ కలిసింది గౌతమ్‌ని. ‘‘దీన్ని సైమల్టేనియస్‌గా తెలుగులో కూడా చేద్దాం’’ మంజుల ప్రపోజల్. ‘‘నాకేం ఇబ్బంది లేదు. మరి హీరో?’’ అడిగాడు గౌతమ్. మంజులకు నాగచైతన్య గుర్తొచ్చాడు. అప్పుడే ‘జోష్’తో లాంచ్ అయ్యాడు. క్యూట్ బాయ్. గౌతమ్‌ని తీసుకుని నాగార్జునను, నాగచైతన్యను కలిసింది. కథ వినగానే నాగ్, చైతన్య ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ప్రాజెక్ట్ సెట్. ఇక మిగిలింది జెస్సీ కేరెక్టర్. తమిళంలో చేస్తున్న త్రిషను ఇక్కడ కంటిన్యూ చేయలేరు. ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్ని పెడదామా? రకరకాల ట్రయల్స్. నాగచైతన్య కొత్తవాడు కాబట్టి కొత్తమ్మాయి అయితేనే బాగుంటుందని ఫైనల్ డెసిషన్. ఎక్కడున్నావమ్మా జెస్సీ? చెన్నై - స్టెల్లా మేరీస్ కాలేజ్‌లోకి ఓసారి కెమెరాను జూమ్ చేయండి. అదిగో వస్తోంది. క్లోజప్ వేయండి. ఎస్... తను సమంత... సమంత రూత్ ప్రభు. ఆమెతో పాటు కూర్చొని షుగర్‌లెస్ కాఫీ తాగినా తియ్యగానే ఉంటుంది. చుక్కల్లో జాబిలిలా మెరిసిపోతూ ఉంటుంది. ఆ మెరుపే ఆమెను మోడల్ని చేసింది. సమంతది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బీకామ్ ఫినిష్ చేసి ఎంబీయే కోసం ఆస్ట్రేలియా వెళ్లే ప్రయత్నంలో ఉంది. ఫ్రెండ్స్‌తో కలిసి ఓ బర్త్‌డే పార్టీకెళ్లింది. అక్కడికొచ్చిన ఓ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఆమె ఫొటోలు తీసి పేపర్లో పబ్లిష్ చేశాడు. కట్ చేస్తే - ‘నాయుడు హాల్’ అనే ఫేమస్ క్లాత్స్టోర్ట్స్కి మోడలింగ్ చాన్స్. రూ.1500 రెమ్యునరేషన్. ఫస్ట్ మోడలింగ్ సూపర్‌హిట్. సమంతకు ఫుల్ క్రేజ్. చిక్ షాంపూ... ఇవా పౌడర్... ఇలా 100 వరకూ యాడ్ ఆఫర్స్. ఇదో సరదాలా ఉందామెకు. ఆ ఫ్రాగ్రెన్స్ అక్కడితో ఆగిపోదు కదా. రవివర్మన్ అనే కెమెరామ్యాన్‌కి సమంత ‘లైక్ ఎట్ ఫస్ట్ సైట్’. ఇక్కడ మళ్లీ కట్ చేయాలి. ఎందుకంటే - సమంత ఇప్పుడు సినిమా హీరోయిన్. ‘మాస్కోవిన్ కావేరీ’ అనే మూవీ. 2007 ఆగస్టులో షూటింగ్ స్టార్ట్. సమంతకు టైం బాలేదో, ప్రొడ్యూసర్‌కి పర్సు బాలేదో... సినిమా షూటింగ్ నత్తనడక నడుస్తోంది. కానీ సమంత ఫ్రాగ్రెన్స్ మళ్లీ పనిచేసింది. ఇంకో ఆఫర్. అధర్వ హీరోగా ‘బాణా కాత్తాడి’. ఈసారి కూడా సమంతకు టైమ్ బ్యాడేనా? ఇదీ నత్తనడకే. మళ్లీ కట్ చేస్తే... గౌతమ్ మీనన్ తెలుగు సినిమా కోసం హీరోయిన్ను వెతుకుతున్నాడని సమంతకు తెలిసి, ఫొటోలు పంపించింది. ఈ వంకతోనైనా తన ఫేవరేట్ డెరైక్టర్‌ను ఒక్కసారి కలిసేయొచ్చు. ఆడిషన్స్‌కి రమ్మని కాల్. భయపడింది. వెళ్లలేదు. సెకెండ్ టైమ్ కాల్. సిగ్గుపడింది. వెళ్లలేదు. థర్డ్ టైమ్ కాల్. ఇబ్బంది పడింది. వెళ్లక తప్పలేదు. ఎదురుగా గౌతమ్. మాట్లాడకుండా కూర్చుంది. ‘‘ఒక సీన్ చెబుతాను. యాక్ట్ చేసి చూపించు. కాఫీ షాపులో కార్తీక్ ఎదురుగా కూర్చుని నువ్వు మాట్లాడాలి’’ అంటూ తెలుగులో ఏవో డైలాగ్స్ చెప్పారు గౌతమ్. సమంతలో కంగారు. నాన్న తెలుగువాడే కానీ, పుట్టి పెరిగింది అంతా చెన్నైలో కావడంతో తమిళం, ఇంగ్లిషు తప్ప ఇంకేమీ రావు. బెరుకు బెరుగ్గానే సీన్ చేసి చూపించింది. గౌతమ్ ఫేస్‌లో ఎలాంటి రెస్పాన్సూ లేదు. తన పని అవుట్. అయినా హోప్ పెట్టుకుని రాలేదుగా. గౌతమ్‌ను చూడాలనుకుంది. చూసేసింది. ఇంటికి వెళ్తూ సమంత మైండ్ నిండా ఇవే ఆలోచనలు. అక్కడితో ఆ ఎపిసోడ్ మర్చిపోయింది. కానీ గౌతమ్ మర్చిపోలేదు. సమంతలో ఆయనకు జెస్సీనే కనిపిస్తోంది. ఆ బెరుకుతనం... ఆ ముగ్ధమోహనత్వం... ఆ మలయాళీ ఫేస్ కట్. మూడ్రోజుల తర్వాత సమంతకు ఫోన్. ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని. అప్పుడు చూడాలి సమంతను. చెన్నై సముద్రం కూడా ఆమె సంతోషం ముందు చిన్నబోయినట్టే అనిపించింది. కార్తీక్‌కి డెరైక్టర్ కావాలనేది డ్రీమ్. ఎవరైనా డెరైక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ కావాలి. తమిళంలో ఆ డెరైక్టర్ క్యారెక్టర్ కేయస్ రవికుమార్ చేస్తున్నాడు. తెలుగులో కూడా ఎవరైనా పాపులర్ డెరైక్టర్ కావాలి. పూరీ జగన్నాథ్‌ను మించిన బెస్ట్ ఆప్షన్ లేదనిపించింది మంజులకు. నిజానికి పూరి స్క్రీన్ మీద కనబడ్డానికి పెద్ద ఇంట్రస్ట్ చూపడు. అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేస్తున్నప్పుడు హిందీ ‘శివ’లో స్టూడెంట్ గ్యాంగ్‌లో చేశాడు. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’లో ఓ సీన్లో కనిపించాడు. అంతకు మించి ఏ సినిమాలో కనబడలేదు. కానీ గౌతమ్ స్టోరీ చెప్పగానే ఇంప్రెస్ అయిపోయాడు. వెంటనే గ్రీన్ సిగ్నల్. షూటింగంటే... బోలెడంత హడావిడీ, హంగామా. అరుపులూ కేకలు. కానీ గౌతమ్ మాత్రం చాలా సెలైంట్‌గా షూట్ చేసేస్తున్నాడు. అన్నీ తక్కువ తక్కువ డైలాగులు. సమంతను చీరలు కట్టుకోమన్నారు. ఆమెకేమో చీర అలవాటు లేదు. ఇబ్బంది పడిపోయింది. నాగచైతన్యతో లిప్‌లాక్ సీన్. సమంత కంగారుపడిపోయింది. కానీ గౌతమ్ ఆ షాట్‌ని చాలా ఈస్తటిక్గా తీశాడు. అలెప్పీ, చెన్నై, మాల్టా, కేరళ, తిరుచ్చి, తంజావూర్, న్యూయార్క్, రోమ్... ఇలాంటి చోట్ల బ్యూటిఫుల్ లొకేషన్స్‌ని కెమెరాలో క్యాప్చర్ చేశారు. గౌతమ్‌కో అలవాటు ఉంది. క్లైమాక్స్ ముందు రాసుకోడు. ఎయిటీ పర్సంట్ వరకూ స్క్రిప్టు రెడీ చేసుకుని షూటింగ్‌కి వెళ్లిపోతాడు. షూటింగ్ మధ్యలో క్లైమాక్స్ రాసుకుంటాడు. దీనికేమో శాడ్ ఎండింగ్ అనుకున్నాడు. మంజుల మాత్రం హ్యాపీ ఎండింగ్ కావాలని పట్టుబట్టింది. ఓకే. తమిళ్‌కి శాడ్. తెలుగుకి హ్యాపీ. కార్తీక్ సినిమా డెరైక్ట్ చేస్తాడు. ఆ సినిమాకి హీరో హీరోయిన్లు కావాలి కదా. గౌతమ్ ఇక్కడో చిన్న తమాషా చేశాడు. తమిళ వెర్షన్లో నాగచైతన్య, సమంతలతో ఆ గెస్ట్ రోల్స్ చేయించాడు. తెలుగులో శింబు, త్రిషతో యాక్ట్ చేయించాడు. తెలుగులో ‘జెస్సీ’ అని టైటిల్ పెడితే బాగుంటుంది కానీ, లవ్‌స్టోరీ అనే ఫీల్ రాదు. ఏదైనా పొయిటిక్ టైటిల్ పెట్టాలి. ఏదైనా మంచి పాటలోని పల్లవి పెడితే? ‘ఒక్కడు’లో ‘నువ్వేం మాయ చేసావో కానీ..’ అంటూ ఓ పాట ఉంది. ‘ఏ మాయ చేసావె’ టైటిల్ డన్. టోటల్ బడ్జెట్... పన్నెండున్నర కోట్లు. గౌతమ్‌కి 3 కోట్లు... రెహమాన్‌కి 2 కోట్లు... రీ-రికార్డింగ్‌కి 50 లక్షలు. నాగచైతన్యకు శాటిలైట్ రైట్స్... ఇవీ రెమ్యునరేషన్స్. 2010 వేలెంటైన్స్ డే వెళ్లిపోయిన 12 రోజుల తర్వాత ‘ఏ మాయ చేసావె’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిల్వర్‌స్క్రీన్‌పై ఓ రొమాంటిక్ పొయిట్రీ చదువుతున్న ఫీలింగ్. రీ-రికార్డింగ్, విజువల్స్ అయితే ఎక్స్ట్రార్డినరీ. నాగచైతన్య - సమంత పెయిర్‌కి డిస్టింక్షన్ మార్క్స. ఏఎన్నార్, నాగార్జునలాగా నాగచైతన్య రొమాంటిసిజమ్లో ట్రేడ్‌మార్క్ చూపించాడు. సమంత అయితే అప్పుడే వికసించిన రోజాపువ్వులా ఫ్రెష్‌గా అనిపించింది. ముఖ్యంగా ఆమె వాయిస్. డబ్బింగ్ చెప్పిన చిన్మయిదే ఆ క్రెడిట్. ఒక్క హిట్‌తో సమంత కెరీర్ రూపురేఖలే మారిపోయాయి. గౌతమ్ ఈ సినిమాతో ఒక స్టెప్ ఎదిగాడు. పెద్దపెద్దవాళ్లు కూడా అప్రిషియేట్ చేశారు. సత్యన్ అందిక్కాడ్ లాంటి టాప్ మలయాళీ డెరైక్టర్, ఇప్పటివరకూ కేరళను ఇంతందంగా ఎవరూ చూపించలేదని మెచ్చుకున్నాడు. ఈ విషయంలో కెమెరామన్ మనోజ్ పరమహంసదే క్రెడిట్. అతనికిదే ఫస్ట్ సినిమా. ఇంతకీ ఈ మనోజ్ పరమహంస ఎవరో తెలుసా? ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా ‘పగడాల పడవ’ అనే సినిమా డెరైక్ట్ చేసిన యు.వి.బాబు కొడుకు. గౌతమ్ మీనన్ జీవితానుభవాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ఓ రకంగా ఇది ఆయన సెమీ-బయోగ్రాఫికల్ ఫిల్మ్. అందుకే దీనికి సీక్వెల్ చేస్తానని ఎప్పటినుంచో చెబుతున్నాడు. మరి ఈసారి ఏ మాయ చేస్తాడో చూద్దాం!! వెరీ ఇంట్రస్టింగ్... * ఇందులో సమంత అన్నయ్యగా సుధీర్‌బాబు నటించారు. ఆ తర్వాత ఆయన ‘ఎస్ఎంఎస్’తో హీరోగా పరిచయమయ్యారు. * నాగచైతన్య తండ్రిగా కనబడింది ఈ చిత్ర నిర్మాత సంజయ్ స్వరూప్. మంజుల హజ్బెండ్. - పులగం చిన్నారాయణ -
రండి.. వాంగో.. ఆయియే.. ప్లీజ్ కమ్...
చిత్రం : రెండు రెళ్లు ఆరు (1986) డెరైక్ట్ చేసింది : జంధ్యాల సినిమా తీసింది : జి. సుబ్బారావు మాటలు రాసింది : జంధ్యాల పూర్తి పేరు : రాళ్లపల్లి వెంకట నరసింహారావు పుట్టింది : 1946 ఆగస్టు 15న తూ.గో.జిల్లా, రాచపల్లిలో ఫస్ట్ సినిమా : స్త్రీ వందో సినిమా : టై లేటెస్ట్ సినిమా : భలే భలే మగాడివోయ్ (2015) టోటల్ మూవీస్ : 600 కు పైగానే రాళ్లపల్లి టాప్-10 మూవీస్ 1. ఊరుమ్మడి బతుకులు 2. తూర్పు వెళ్లే రైలు, 3. అభిలాష, 4. అన్వేషణ, 5. శ్రీవారికి ప్రేమలేఖ 6. శుభలేఖ, 7. రేపటి పౌరులు 8. సగటు మనిషి, 9. ఆలయ శిఖరం 10. ఛలో అసెంబ్లీ రాళ్లపల్లి... యాక్టింగ్‌లో ‘రత్నాల’పల్లి. కామెడీ, సెంటిమెంట్, విలనీ... ఏదైనా సునాయాసంగా చేసి పారేయగల గ్రేట్ ఆర్టిస్ట్. కానీ మన తెలుగు ఇండస్ట్రీ రాళ్లపల్లిని ఇంకా గొప్పగా వాడుకుని ఉండాల్సింది. ప్చ్. ఏం చేస్తాం!! జంధ్యాల తీసిన ‘రెండు రెళ్లు ఆరు’లో ఆయన సకల భాషా నైపుణ్యాన్ని చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఇద్దరు చైనా వాళ్లు కలుసుకుంటే చైనీస్ భాషలో మాట్లాడుకుంటారు. ఇద్దరు బెంగాలీ వాళ్లు తారసపడితే బెంగాలీలో ముచ్చటించుకుంటారు. ఇక తమిళం వాళ్లయితే మాట్లాడుకున్నా... పోట్లాడుకున్నా... అంతా అరవంలోనే. అదే మన తెలుగువాళ్లయితే మాత్రం ఇంగ్లీషులో మాట్లాడుకుంటారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అనుకోండి. దౌర్భాగ్యం అనుకోండి. ఇంకేదైనా అనుకోండి.కానీ ఈ తికమక దగ్గర మాత్రం అలాంటి కందిపప్పులుడకవు. పెసరపప్పులుడకవు. అతగాడు బెంగాలీ వాడితో బెంగాలీలో మాట్లాడగలడు. హిందీ వాడితో హిందీలో బోల్గలడు. తెలుగువాడితో ఆంగ్లం, అరవం, కన్నడం, హిందీ... ఇలా అన్నీ మాట్లాడేయగలడు. ఎందుకంటే తికమకకు అన్ని భాషలూ వచ్చు. అలాగని అతగాడు సకల విద్యా పారంగతుడనుకునేరు. ఈ ‘తికమక’ పేరు వెనుక కథేంటో, అతగాడి బహుభాషా నైపుణ్యం వెనుక కిటుకేమిటో మనం చెప్పేకన్నా అతగాడే చెప్పుకోవడం బెటర్. ఎందుకంటే - ఎవడి డప్పు వాడే కొట్టుకోవాల్సిన ట్రెండ్ ఇది మరి. అదో పల్లెటూరు. బస్సు నుంచి ఓ మిస్సు దిగింది. ట్రాక్టర్ దగ్గర వెయిటింగ్లో ఉన్న తికమక. చకచకా ఆ మిస్సు దగ్గరకెళ్లి ‘‘నమస్తే... హిందీ, వణక్కం... తమిళ్, గుడ్‌మార్నింగ్... ఇంగ్లీష్, నమస్కారం... తెలుగు’’ అన్నాడు. ఆ అమ్మాయి అయోమయంగా ఇతని వైపు చూసింది. ‘‘ఆలస్యం అయినందుకు క్షమించాలి. నిన్న రావాల్సిన ఉత్తరం అలవాటు ప్రకారం ఆలస్యంగా ఈ రోజు వచ్చింది. బండి లేటైపోతుందని ట్రాక్టర్ తీసుకొచ్చా. రండి... తెలుగు, వాంగో... తమిళ్, ఆయియే... హిందీ, ప్లీజ్ కమ్... ఇంగ్లీష్’’ అని ఆమె సూట్‌కేస్ అందుకుని ట్రాక్టర్ మీద పెట్టాడు. ఆమె ట్రాక్టర్ ఎక్కి కూర్చుంది. ‘‘మీ పెదనాన్నగారు మీ గురించి ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తున్నారు’’ అని చెబుతూ ట్రాక్టర్ స్టార్ట్ చేశాడు తికమక. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా ‘‘పెదనాన్న గారెవరు?’’ అనడిగింది. తికమక అయోమయపడిపోయి ‘‘సర్వానందంగారు... ఆయనే మీ పెదనాన్నగారు. ఇంతకూ మీ పేరు విఘ్నేశ్వరి కాదా?’’ అనడిగాడు.ఆ అమ్మాయి చాలా తాపీగా ‘‘నా పేరు వెంకటలక్ష్మి... విఘ్నేశ్వరి కాదు’’ అంది. వెంటనే తికమక ట్రాక్టర్ ఆపేశాడు. ‘‘మా గొప్ప పనిచేశావ్ కానీ, దిగు దిగవమ్మా. గాలి తీసేసిన ట్రాక్టర్ ట్యూబ్‌లాంటి మొహం చూసే అనుకున్నా. ఎవరు ఎవరి కోసం ఏ బండి కనిపించినా ఎక్కేయడమేనా...’’ అంటూ ఆమె సూట్‌కేస్‌ని కింద గిరాటు వేసినంత పనిచేసి మరీ విసుక్కున్నాడు. సరిగ్గా అప్పుడే ఇంకో బస్సు ఆగింది. అందులోంచి ఓ అమ్మాయి విత్ లగేజ్ దిగింది. ఓసారి జరిగిన పొరపాటుతో తికమక ఆమె వైపు అనుమానంగా చూస్తూ ‘‘నీ పేరు కూడా వెంకటలక్ష్మేనా?’’ అనడిగాడు. ఆమె కంగారుగా ‘‘కాదు... నా పేరు వింధ్య. కాదు కాదు... విఘ్నేశ్వరి’’ అంది. తికమక మొహం వెలిగిపోయింది. ‘‘అమ్మాయిగారూ... మీ కోసమే వచ్చా. నన్ను చిన్నప్పుడెప్పుడో చూశారు. గుర్తుండను లెండి. ఇకాతే కా హమారా గామ్ దోయే ద్యూరే’’ అన్నాడు. అసలే కంగారులో ఉన్న విఘ్నేశ్వరి ఈ అర్థంగాని భాషతో ఇంకా కంగారుపడిపోయింది. ‘‘ఇది బెంగాలీ భాషమ్మా. అంటే ఇక్కడ నుంచీ మన ఊరు రెండు మైళ్లు ఉంటుందని అర్థం’’ అని వివరణ ఇచ్చాడు తికమక. విఘ్నేశ్వరి ట్రాక్టర్ ఎక్కింది. తికమక ట్రాక్టర్ని ఊరు వైపు పరుగులెత్తిస్తూ ‘‘ఇంగానా పత్తు నిమిషం నమ్మూరు పోయిదం’’ అన్నాడు. ‘‘ఇదేం భాష?’’ అని ఆమెలో మళ్లీ ఆశ్చర్యం. ‘‘మలయాళం... అంటే పది నిమిషాల్లో ఇక్కడ నుంచీ వెళ్లిపోతామని అర్థం...’’ చెప్పాడు తికమక. ‘‘నీ పేరేంటి?’’ అడిగింది విఘ్నేశ్వరి.‘‘తికమక’’ అని చెప్పాడతను.‘‘ఏ భాషలో?’’ అని తికమకగా అడిగింది విఘ్నేశ్వరి. ‘‘అన్ని భాషల్లోనూ. తెలుగుకి ‘తి’, కన్నడకు ‘క’, మలయాళానికి ‘మ’, కొంకణికి ‘క’. ఆ భాషల పట్ల గౌరవంతో నా పేరుని ఇలా పెట్టుకున్నా. మీకు బోర్ అనిపించకపోతే నా గురించి కొంత చెప్పాలి. నేను మిలట్రీలో వంటవాడిగా పని చేసి, అంట్లు తోమలేక ఆ పని మానేశాను. అక్కడుండగా అన్ని భాషల సైనికులతో మాట్లాడ్డం కోసం ఈ భాషలన్నీ నేర్చుకున్నా. ఇప్పుడు నేను 14 భారతీయ భాషలు మాట్లాడగలను. 4 భాషలు రాయగలను. ఇదీ నా ఫ్లాష్‌బ్యాక్’’ అని తికమక చెప్పడం పూర్తయ్యేసరికి ఇల్లు వచ్చేసింది. విఘ్నేశ్వరి ట్రాక్టర్ మీద నుంచి దిగి, ఆ ఇంటిని కళ్లు పెద్దవి చేసి మరీ చూసింది. ‘‘ఇదేనమ్మా మీ ఇల్లు. 50 గదులు... 101 గుమ్మాలు... 151 అద్దాలున్న బంగ్లా... మీరు ఇక్కడే పెరిగారనుకోండి. మరిచిపోయారనుకుని ఊరకనే చెబుతున్నా. వెల్కమ్... ఇంగ్లీష్. ఏవా ఏవా... మరాఠీ. దయచేయండి... తెలుగు, వాంగో.. తమిళ్’’అంటూ విఘ్నేశ్వరిని లోపలకు తీసుకెళ్లాడు తికమక. అక్కడ సర్వానందం వేయికళ్లతో వెయిటింగ్. కళ్లు కనబడకపోయినా, చెవులు వినబడకపోయినా విఘ్వేశ్వరిని చూసి సంబరపడిపోయాడా పెద్దాయన. ‘‘ప్రయాణం చేసి అలిసిపోయుంటావ్. గదిలోకెళ్లి రెస్ట్ తీసుకోమ్మా’’ అని ఆమెకు గదిని చూపించమని తికమకకు పురమాయించాడాయన. తికమక ఆమెనో గదిలోకి తీసుకెళ్లి ‘‘దిసీజ్ యువర్ రూమ్... ఇంగ్లీషు. యే ఆప్ కా కమరా హై... హిందీ. యే తుమ్కో రూమ్... మరాఠీ. ఇదు ఉంగళ్ రూమ్... తమిళ్. ఇది నిమ్మ రూమ్... కన్నడ. ఇది మీ గది... తెలుగు’’ అని చెప్పేసి వెళ్లిపోయాడు. ఇప్పుడర్థమైందిగా తికమక కేరెక్టరైజేషన్. ఆ ఇంట్లో వాళ్లకు అతను తలలో నాలుక. నచ్చనివాళ్లకు తలలో పేను. సర్వానందంగారికి నమ్మినబంటు.ఇక్కడో ఫ్లాష్‌బ్యాక్ చెప్పాలి. చిన్నతనంలోనే విఘ్నేశ్వరిని, వెంకట శివంకిచ్చి పెళ్లి చేయిస్తారు సర్వానందంగారు. విఘ్నేశ్వరికి, వెంకట శివానికి మధ్య ఉప్పుకు నిప్పుకు ఉన్నంత వైరం. ఇద్దరూ వేర్వేరు చోట్ల పెరిగి పెద్దవుతారు. వారినెలాగైనా మళ్లీ కలపాలని సర్వానందంగారి చివరి కోరిక. వాళ్లిద్దరూ సిటీ నుంచి ఈ పల్లెటూరికొస్తారు. కానీ వారిద్దరూ రియల్ కాదు. తమ ఫ్రెండ్షిప్ కోసం వచ్చి ఇద్దరూ ఇరుక్కున్నారు. తప్పించుకుందామని చూస్తే ‘గూఢచారి 116’లాగా తికమక. ఫైనల్‌గా ఓ రాత్రి ఇద్దరూ గేటు దూకి పారిపోబోతుంటే లటిక్కిన పట్టేసుకుని సర్వానందం ముందు నిలబెట్టాడు తికమక.‘‘దూజన బావనే జాత్... బెంగాలీ. దస్గయా... పంజాబీ. తప్పిచ్చుక్కు హోహోడుగురు... కన్నడ. పారిపోతున్నారు.... తెలుగు’’ అని పెద్దాయనకు చెప్పాడు. వాళ్లిద్దరూ తికమకను కొరకొరా చూశారు. తికమక ఒకటే భాషలో నవ్వాడు. నవ్వు ఏ భాషలోనైనా ఒకటే కదా. తెలుగులో ఒకలాగా, తమిళంలో ఒకలాగా నవ్వు ఉండదు కదా. ఏది ఏమైనా తికమక లాంటి నమ్మినబంటు దొరికితే ఎవరికైనా... రొంబ సంతోషం... తమిళం. జాస్త్ ఆనంది... మరాఠీ. చాలా సంతోషం... తెలుగు. - పులగం చిన్నారాయణ -
అల ఎగసిపడుతోంది!
సినిమా వెనుక స్టోరీ - 15 ప్రేమ అంటే పచ్చదనం. ప్రేమ ఎప్పుడూ పచ్చగానే ఉండాలి. పెళ్లయిన తర్వాత కూడా..! ‘దిల్ సే’ పోస్ట్ ప్రొడక్షన్. మణిరత్నం ఫుల్ బిజీ. చిన్న టీ బ్రేక్‌లో బాల్కనీలో కూర్చుని రోడ్డు వంక చూస్తుంటే బైక్ మీద ఓ ప్రేమజంట రివ్వున దూసుకుపోతోంది. ప్రేమ ఎవ్వరికీ అంతుబట్టని ఓ మ్యాజిక్. ప్రేమలో అన్నీ ప్లస్సులే ఉంటాయా? లేదు... మైనస్సులూ ఉంటాయ్. అయితే అదేంటో... అవి పెళ్లయ్యేవరకూ కనబడవు. అప్పుడే గ్యాప్ మొదలవుతుంది. మణిరత్నం మనసు ఇలా రక రకాలుగా ఆలోచిస్తోంది. అందరూ పెళ్లితో ఎండ్ అయ్యే ప్రేమకథలే చేస్తున్నారు. ఆ తర్వాతి జీవితాన్ని ఎందుకు వదిలేయాలి? కోపాలూ తాపాలూ, ప్లస్సులూ మైనస్సులూ, వసంతాలూ శిశిరాలూ - ఇవన్నీ చూపించే కథ. ఆత్మ, హృదయం రెండూ ఉండే కథ. రైటర్ సుజాతకు ఫోన్ చేశాడు మణి. సుజాత తమిళంలో ఫేమస్ రైటర్. రిటైర్డ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్. ‘సుజాత’ అనేది ఆయన కలంపేరు. మణిరత్నానికి బాగా నమ్మక మైన మనిషి. ‘‘భార్య కనిపించకపోవడం, భర్త వెతు క్కుంటూ వెళ్లడం, ఈ అన్వేషణలో భార్య లేని లోటు, ఆమెతో జ్ఞాపకాలు గుర్తుకు రావడం... వీటన్నిటితో కథ చేద్దామను కుంటున్నా...’’ చెప్పాడు మణిరత్నం. ‘‘గో ఎ హెడ్’’ అని ఉత్సాహపరిచాడు సుజాత. మనసుపడి తీసిన తమిళ ‘ఇరువర్’ (తెలుగులో ‘ఇద్దరు’) అట్టర్ ఫ్లాప్. ఎంతో కష్టపడి చేసిన హిందీ ‘దిల్ సే’కి ఎదురు దెబ్బ. మణిరత్నం కదిలిపోయాడు. ఎక్కడో తేడా జరుగుతోంది. కొన్నాళ్లు సినిమాకు దూరంగా ఉండాల్సిందే! తప్పటడుగులు పడినప్పుడో, లక్ష్యం నుంచి దారి మళ్లినప్పుడో... బ్యాక్ టూ బేసిక్స్‌కి రావాలి. గొప్ప మేనేజ్మెంట్ సూత్రం. ఇండియాలోని టాప్ బిజినెస్ స్కూల్ జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టి ట్యూట్లో ఎంబీఏ చేసిన మణిరత్నానికి ఈ సూత్రమే గుర్తొచ్చింది. ఇప్పుడు తను కూడా బ్యాక్ టూ బేసిక్స్. నో ఎక్స్పెరి మెంట్స్. రొమాన్స్ అంటే మణిరత్నంలా ఎవ్వరూ తీయలేరు. ఇది ఆయనకున్న బ్రాండ్. ఇప్పుడదే మళ్లీ వాడాలి. సుజాతకు చెప్పిన స్టోరీలైనే తనకు శ్రీరామ రక్ష. ఆర్.సెల్వరాజ్‌ను పిలిచాడు. సూపర్ స్టోరీ, స్క్రీన్‌ప్లే రైటర్. ఇద్దరూ కూర్చుని స్క్రిప్ట్ చేస్తున్నారు. మధ్య మధ్యలో సుహాసిని జాయినవుతున్నారు. మామూలుగా అయితే స్క్రిప్ట్ వర్కులో ఎవ్వర్నీ ఎంటర్ కానివ్వడు మణిరత్నం. రిలేషన్ రిలేషనే. స్క్రిప్టు స్క్రిప్టే. కానీ సుహాసినికి మాత్రం ఎగ్జెంప్షన్. ఎందు కంటే సుహాసిని చాలా షార్ప్. నటిగా బోలెడంత అనుభవం, సమాజాన్ని చదివిన అనుభవం... దానికి తోడు భర్తకేం కావాలో ఆమెకు బాగా తెలుసు. ‘రోజా’, ‘దళపతి’, ‘బొంబాయి’, ‘ఇద్దరు’, ‘దిల్ సే’... ఇలా మణిరత్నం ప్రతి సినిమాలోనూ సుహాసిని కంట్రి బ్యూషన్ కంపల్సరీ. ఈ స్క్రిప్టులో అయితే సుహాసిని ఐడియాలు చాలా ఎక్కువే. హీరో అమ్మానాన్నలు, హీరోయిన్ అమ్మానాన్నలు కలుసుకునే సీన్ ఐడియా సుహాసినిదే. ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీకెళ్లే సీన్, తండ్రి చనిపోయాక హీరోయిన్ తల్లిని చూడ్డానికి వెళ్లిన సీన్, ‘అలై పొంగెరా’ పాట సన్నివేశం... ఇదంతా సుహాసిని క్రెడిట్టే. తమిళంలో ‘అలై పాయుదే’ (అంటే ‘అల ఎగిసిపడుతోంది’ అని అర్థం) అనే టైటిల్ పెట్టారు. తెలుగు వెర్షన్ టైటిల్ ‘సఖి’. షారుక్ ఖాన్‌తో చేస్తే బాగుంటుంది... మణిరత్నానికి ఎవరో సలహా ఇచ్చారు. కానీ మణిరత్నం ఆల్రెడీ ఫిక్సయిపోయారు... న్యూ ఫేస్‌తో ఈ సినిమా చేయాలి. ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అయితే నేచురాల్టీ మిస్సవుతుంది. ఎవరా అదృష్టవంతులైన హీరో, హీరోయిన్లు? ‘శాండల్‌వుడ్’ సోప్ యాడ్ షూట్ చేస్తున్నారు. తీసేది ఫేమస్ కెమేరామన్ కమ్ డెరైక్టర్ సంతోష్ శివన్. చేసేది నటుడు ఆర్.మాధవన్. మణిరత్నానికి సంతోష్ శివన్ బాగా క్లోజ్. ఆ విషయం మాధవన్‌కు తెలుసు. అందుకే అడిగాడు... ‘‘సార్... నన్ను మణిగారికి ఇంట్రడ్యూస్ చేయండి.’’ సంతోష్ శివన్ ‘ఎస్’ అనలేదు, ‘నో’ అనలేదు. కానీ మాధవన్కి చెప్పకుండానే మణికి ఫొటోలు పంపించాడు. అప్పుడు మణిరత్నం ‘ఇరువర్’ తీసే పనిలో ఉన్నాడు. మాధవన్‌ని పిలిపించారు. ‘ఇరువర్’కి పనికొస్తాడేమోనని మేకప్ టెస్ట్ చేయించారు. నో యూజ్. మాధవన్ నిరాశగా వెళ్లిపోయాడు. తను మళ్లీ ‘జీ’ టీవీ సీరియల్స్‌లో బిజీ. ‘ఇస్ రాత్‌కీ సుబహ్ నహీ’ (హిందీ), ‘ఇన్ఫెర్నో’ (ఇంగ్లిషు) సినిమాల్లో చిన్న చిన్న వేషాలు. ఓ రోజు అనుకోని విధంగా మాధవన్కి మణిరత్నం నుంచి పిలుపు. ‘‘నా ‘సఖి’కి నువ్వే హీరో’’ - చెప్పాడు మణి. మాధవన్ కడలి అల కన్నా ఎక్కువ ఎగిరాడు సంబరంతో. వసుంధరాదాస్‌ను పిలిచారు.. హీరోయిన్ క్యారెక్టర్ కోసం! ఆమె సింగర్. కమల్‌తో ‘హే రామ్’లో చేస్తోంది. మణిరత్నం స్క్రీన్ టెస్ట్ చేయిం చాడు. ప్చ్! ఇంకా క్యూట్‌గా కావాలి. చైల్డ్ ఆర్టిస్టుగా టాప్ రేంజ్‌కెళ్లిన బేబీ షాలిని ఇప్పుడు హీరోయిన్గా అజిత్ పక్కన ‘అమర్కళమ్’ (తెలుగులో ‘అద్భుతం’గా అనువాదమైంది) చేస్తోంది. మణికి షాలిని నచ్చేసింది. ఆమెకూ ఈ ఆఫర్ నచ్చింది. కథ నచ్చింది. కానీ రొమాంటిక్ సీన్స్‌కీ, గ్లామర్ డ్రెస్‌లు వేయడానికీ అబ్జక్షన్ చెప్పింది. ఎందుకంటే ఆమె అప్పటికే అజిత్‌తో లవ్‌లో ఉంది. మణిరత్నం ‘డోంట్ వర్రీ’ అన్నాడు. ఇక షాలినికి వర్రీ ఏముంటుంది! షాలిని అక్క పాత్రకు స్వర్ణమాల్య సెలెక్టెడ్. ఆమెను పెళ్లిచూపులు చూడడాని కొచ్చే పాత్రను ఎవరైనా హీరోతో గెస్ట్‌గా చేయిస్తే? హీరో విక్రమ్‌ను అడిగారు. మరీ ఇంత చిన్న వేషమా? పెద్దదైతే చేస్తా అన్నాడు విక్రమ్. దాంతో ఆ పాత్రకు నార్మల్ యాక్టర్‌ను తీసేసుకున్నారు. ఈ సినిమాలో మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా పాపులర్ సీనియర్ యాక్ట్రెస్ కావాలి. వాళ్లకు దొరికిన బెస్ట్ చాయిస్ జయసుధ. ఇంకో ఇంపార్టెంట్ రోల్. కుష్బూ ఓకే. ఆమె పక్కన ఎవరు బాగుంటారు? షారుక్‌ఖాన్... మమ్ముట్టి... మోహన్‌లాల్. ఫైనల్‌గా అరవింద్‌స్వామి ఓకే. ‘రోజా’తో తనను హీరోను చేసిన మణి అడిగితే, అరవింద్‌స్వామి కాదన గలడా? సినిమాలు వదిలేసి బిజినెస్‌లో బిజీ అయినవాడు కూడా గురువు కోసం వచ్చేశాడు. అప్పటి వరకూ మణిరత్నం సినిమాలకు లెనిన్ లాంటివాళ్లు ఎడిటింగ్ చేశారు. ఎందుకో మణి మార్పు కోరుకు న్నాడు. ఈ విషయం శ్రీకర్ ప్రసాద్‌కి తెలిసింది. అప్పటికే ఆయన నేషనల్ అవార్డు సినిమాలకు వర్క్ చేశాడు. మణిరత్నం, శ్రీకర్ ప్రసాద్ ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. తన మనసుకు నచ్చే టెక్నీషియన్ అనిపించింది మణిరత్నానికి. పీసీ శ్రీరామ్ టాప్ కెమేరామన్. మణిరత్నంతో కలిశాడంటే మ్యాజిక్కులే మ్యాజిక్కులు. ‘రోజా’ నుంచి రెహమాన్ చేయి వదలడం లేదు మణి. దీనికి మాత్రం వదులుతాడా? చడీచప్పుడు లేకుండా షూటింగ్ స్టార్ట్ చేసేశాడు మణిరత్నం. పూజలు, ముహూర్తపు షాట్లు కూడా లేవు. జయసుధ మీద ఫస్ట్ షాట్. నాలుగు నెలల్లో సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేసేయాలి. మణిరత్నం టార్గెట్. చెన్నై, కననూర్, ముంబై, శ్రీనగర్, పోర్ట్‌బ్లెయిర్, మహేశ్వర్, ఆగ్రా, ధోల్పూర్... ఇలా అన్నీ బ్యూటిఫుల్ లొకేషన్స్. పీసీ తన షాట్స్‌తో మేజిక్ చేయడం మొదలుపెట్టాడు. టైటిల్సాంగ్ ‘అలై పొంగెరా...’ పాట తీస్తున్నారు. అంతా పెళ్లి సందడి. పేరంటాళ్ల హడావిడి కావాలి. సుహాసిని తన బంధువులందర్నీ పిలిచారు. వాళ్ల అమ్మను కూడా! వాళ్లపై మణి ఈ పాట తీయాలి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సిగ్గుపడుతూనే ఈ పాట పూర్తి చేశాడు. మాధవన్, షాలిని పెళ్లయ్యాక కాపురం పెట్టడానికి ఓ ఇల్లు కావాలి. అది కూడా ఫినిష్ కానిది. చెన్నైలో ఓ పది బిల్డింగ్లు చూసి, ఒకటి సెలెక్ట్ చేశారు. కావాలనే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఇలాంటి అన్ఫినిష్డ్ బిల్డింగ్ ఎంచుకున్నారు. వీళ్ల మధ్య బంధం కూడా ఇలా అన్ఫినిష్డ్గానే ఉందని రిప్రజెంటేషన్ అన్నమాట. ‘పచ్చదనమే...’ పాటను రకరకాల రంగులతో కలర్ఫుల్గా ప్లాన్ చేసి తీశారు. ‘దిల్ సే’లోని ‘సత్ రంగీరే’ పాటకు ఓ రకంగా ఇది కొనసాగింపు. ‘కాయ్ లవ్ చెడుగుడు...’ పాటను రివర్స్ టెక్నిక్ యూజ్ చేసి తీశారు. కొంత వెర్షన్ తీశాక యావిడ్లో చెక్ చేసి చూస్తే లిప్ సింక్ కావడం లేదు. దాంతో మాధవన్‌ను ఆ పాటను రివర్స్‌లో పాడమన్నారు. మాధవన్ కష్టపడి బట్టీపట్టి మరీ నేర్చుకున్నాడు. తెలుగు వెర్షన్ హక్కులు ఫేమస్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎన్.వి. ప్రసాద్ తీసుకున్నాడు. తెలుగులో తన కెంత క్రేజుందో మణికి బాగా తెలుసు. ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వాళ్లకు కలగకూడదు. అందుకే ప్రతి సినిమాకీ స్పెషల్ కేర్ తీసుకుంటాడు. పాటలన్నీ వేటూరితో రాయించుకున్నాడు. వేటూరి అంటే మణికి చాలా ఇష్టం. గీతాంజలి, బొంబాయి సినిమాలకు వేటూరే పాటలు రాశారు. తెలుగు డైలాగ్స బాధ్యత అంతా శ్రీరామకృష్ణకే అప్ప గించారు. ‘బొంబాయి’ సినిమా నుంచి మణి టీమ్‌లో ఆయన పర్మినెంట్ మెంబర్. ‘సఖి’కి అందరూ గులామ్. ప్రేమజంట పెళ్లయ్యాక ఎలా బిహేవ్ చేస్తారనే కాన్సెప్ట్‌కి ఆడియన్స్ ఫిదా. అసలు మణిరత్నం టేకింగ్ ఎక్స్ట్రార్డినరీ. క్లైమాక్స్‌లో హాస్పిటల్ బెడ్ మీద మాధవన్, షాలిని మళ్లీ ‘ఐ లవ్యూ’ చెప్పుకోవడం, వాళ్ల ఎక్స్ప్రెషన్స్, చిన్న చిన్న డైలాగులు... ఇలాంటివన్నీ మణి మాత్రమే తీయగలడనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ సాంగ్స్‌తోనూ, రీరికార్డింగ్ తోనూ చెలరేగిపోయాడు. చాలా గ్యాప్ తర్వాత జానకమ్మ పాడిన ‘సెప్టెంబర్ మాసం అక్టోబర్ మాసం’ పాటను వింటుంటే పాత బాధలన్నీ మర్చిపోతాం. చాలా రోజుల గ్యాప్ తర్వాత జానకమ్మ ఆలపించిన పాట ఇది. పీసీ శ్రీరామ్ అయితే ఈ సినిమాకు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్. కెమెరాను కలంగా మార్చి సెల్యులాయిడ్‌పై రొమాంటిక్ పొయిట్రీ రాసేశాడాయన. సినిమాలో ప్రతి ఫ్రేమూ ఐ ఫీస్టే. అందుకే ‘బెస్ట్ సినిమాటోగ్రాఫర్’గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. డీటీఎస్ మిక్సింగ్ చేసిన హెచ్.శ్రీధర్‌కూ బెస్ట్ ఆడియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డు. మణిరత్నం అంటేనే బాక్సాఫీస్‌కి పచ్చదనం. అందుకే మణిరత్నం ఎప్పుడూ పచ్చగానే ఉండాలి! ఆయన తీసిన ప్రేమకథల్లో ‘సఖి’ కూడా అప్పటికీ, ఇప్పటికీ ఒక ఆకుపచ్చని జ్ఞాపకం! వెరీ ఇంట్రస్టింగ్... * సాఫ్ట్వేర్ బూమ్ గురించి తొలిసారిగా సెల్యులాయిడ్ మీద చర్చించిన సినిమా ఇదే. * మాధవన్కి శ్రీనివాసమూర్తి, షాలినికి సరిత డబ్బింగ్ చెప్పారు. ‘పిరమిడ్’ నటరాజన్‌కు సీనియర్ నటుడు నర్రా వెంకటేశ్వరరావు గాత్రదానం చేశారు. - పులగం చిన్నారాయణ -
పెన్ను తుఫాను తలొంచి చూసే... తొలి నిప్పుకణం
సినిమా వెనుక స్టోరీ - 13 పవన్ కల్యాణ్ స్టూలు మీద కూర్చున్నాడు. ఎదురుగా సోఫాలో త్రివిక్రమ్. ‘ఇక మొదలుపెట్టు’ అన్నట్టుగా పవన్ చిన్నగా తల కదిల్చాడు. త్రివిక్రమ్ కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. 5...10...15...20 నిమిషాలు... పవన్ అలా చూస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. త్రివిక్రమ్ కథ ఆపేశాడు. పవన్‌కి మెలకువ వచ్చింది. త్రివిక్రమ్ నిశ్శబ్దంగా బయటికొచ్చేశాడు. పద్మాలయా స్టూడియో ఆఫీసు రూమ్. మహేశ్‌బాబు టేబుల్ మీద ముందుకు వంగి మరీ కథ వింటున్నాడు. త్రివిక్రమ్ కథ చెప్పడం పూర్తికాగానే మహేశ్ సీరియస్‌గా లేచి వెళ్లిపోయాడు. అప్పటికే త్రివిక్రమ్ టాప్ రైటర్. రాసిన సినిమాలన్నీ సూపర్‌హిట్. తన రైటింగ్స్ కోసం హీరోలంతా వెయిటింగ్. అలాంటివాడికి ఈ ట్విస్టు అర్థం కాలేదు. కథ నచ్చలేదా? లేక సరిగ్గా చెప్పలేకపోతున్నానా? ఒకాయనేమో నిద్రపోయాడు. ఇంకొకాయన వెళ్లిపోయాడు. ఏంటిది?! ఇలాంటి ఆలోచనల్లో, ఏం చేయాలో పాలుపోక ఉన్న పరిస్థితుల్లో... కాసేపటికి లోపలికొచ్చాడు మహేశ్. ‘‘ఏంటి సార్... ఈ కథ! మైండ్ బ్లోయింగ్. ఇప్పుడే నాన్నగారికి కూడా చెప్పాను. ఈ సినిమా మనం చేస్తున్నాం. పద్మాలయా బ్యానర్లో చేయడానికి నాన్నగారు కూడా ఓకే అన్నారు’’ అని ఉద్వేగంగా చెప్పేశాడు మహేశ్. ఆ చివరి మాటలకు త్రివిక్రమ్ ఉలిక్కిపడ్డాడు. ‘నువ్వే నువ్వే’ కన్నా ముందే నన్ను డెరైక్షన్ చేయమని ‘జయభేరి’ సంస్థ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చారు. తొలి సినిమా ‘స్రవంతి’ రవికిశోర్ వాళ్ళకు చేస్తానని మాట ఇచ్చాను కాబట్టి, ‘నువ్వే - నువ్వే’ వాళ్లకు చేస్తున్నాను. ఇప్పుడీ రెండో సినిమా ‘జయభేరి’కే చేద్దామండీ’’ చెప్పాడు త్రివిక్రమ్. ‘‘ఓకే సర్... ప్లాన్ చేద్దాం. నేనే మీకు కబురు చేస్తా’’ అన్నాడు మహేశ్. అప్పుడాయన ‘టక్కరిదొంగ’ చేస్తున్నాడు. ‘టక్కరిదొంగ’ రిలీజైపోయింది. ‘బాబి’ రిలీజైపోయింది. ‘ఒక్కడు’ రిలీజైపోయింది. ‘నిజం’ రిలీజైపోయింది. ‘నాని’ జరుగుతోంది. ‘అర్జున్’ కూడా స్టార్ట్ అయిపోయింది. త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే’ ఫినిష్ చేసి ఇక్కడ వెయిటింగ్. నియర్లీ టూ ఇయర్స్. అప్పుడు మహేశ్ నుంచి కాల్ వచ్చింది. త్రివిక్రమ్ కారెక్కాడు. నటుడు - నిర్మాత ‘జయభేరి’ మురళీమోహన్ ఆఫీసులో ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఈ కథ ఎయిటీ పర్సెంట్ పాశర్లపూడి అనే పల్లెటూళ్లో జరుగుతుంది. లంకంత కొంప కావాలి. మహేశ్‌తో సహా ఇంతమంది కాస్టింగ్‌తో ఎక్కడో పల్లెటూరుకు వెళ్లి షూటింగ్ చేయడం కష్టం. హైదరాబాద్ చుట్టుపక్కల అలాంటి ఇల్లు దొరికినా అన్నేసి రోజులు షూటింగ్కివ్వలేరు. సెట్ వేసి తీరాల్సిందే. సీనియర్ ఆర్ట్ డెరైక్టర్ తోట తరణికి త్రివిక్రమ్ కథ చెప్పసాగారు. కథ చెప్పడం పూర్తయ్యే లోపే, పేపర్ మీద సెట్ డ్రా చేసి ఇచ్చేశారాయన. హైదరాబాద్ శివార్లలో నానక్‌రామ్‌గూడ అవతల ‘జయభేరి’ వాళ్లకు పెద్ద స్థలం ఉంది. అక్కడ కన్స్ట్రక్ట్ చేశారా బంగళాని! ‘వర్షం’ హిటై్ట త్రిష స్వింగ్‌లో ఉంది. మహేశ్‌కి పర్ఫెక్ట్గా సూటవుతుంది. ట్వంటీ డేస్ కాల్షీట్స్ ఓకే. సినిమాలో కీలకమైన సిక్స్టీ ప్లస్ ఏజ్డ్ కేరెక్టర్ ఒకటుంది. ప్రొడక్షన్‌వాళ్లు ఏజ్డ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల లిస్టు తెచ్చిపెట్టారు. త్రివిక్రమ్ దాని మొహం కూడా చూడలేదు. ఆయన మైండ్‌లో నాజర్ ఫిక్స్. 40 ఏళ్ల నాజర్‌తో 60 ఏళ్ల ముసలి వేషమా? కో డెరైక్టర్ రవికిరణ్‌తో పాటు మిగతా డెరైక్షన్ డిపార్ట్మెంట్ ఈ సెలక్షన్‌ని క్యూరియాసిటీతో అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్.. మల్లి. మహేశ్‌తో కలసి దంధా నడిపే వ్యక్తి. మహేశ్లాగా ఎనర్జిటిక్‌గా ఉండాలి. వెతుకుతున్నారు. ఎవ్వరూ ఆనడం లేదు. మణిరత్నం హిందీలో తీసిన ‘యువ’లో ఒకతను నచ్చేశాడు. అతనే సోనూసూద్. ‘నాని’కి గుహన్ కెమెరామన్. మన కథకు ఇలాంటివాడైతే కరెక్ట్ అని ‘నాని’ టైమ్‌లోనే అన్నాడు మహేశ్. త్రివిక్రమ్‌కి ఓకే. అప్పట్లో మహేశ్ సినిమాలన్నిటికీ మణిశర్మ పర్మినెంట్ మ్యూజిక్ డెరైక్టర్. త్రివిక్రమ్‌కి కూడా ఆయనంటే ఇష్టం. ఆయన ఫిక్స్. ఎన్నో నేషనల్ అవార్డులు గెలిచిన శ్రీకర్‌ప్రసాద్ ఎడిటింగ్ అంటే త్రివిక్రమ్‌కి ఓ అడ్మిరేషన్. ఆయన ఎంత బిజీగా ఉన్నా త్రివిక్రమ్ ఆయనే కావాలనుకున్నాడు. ‘అతడు’ స్టార్ట్ అయ్యింది. డెరైక్టర్‌గా త్రివిక్రమ్కిది రెండో సినిమా. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్. ఫుల్ క్లారిటీ. ఈ షూటింగ్ టైమ్‌కే మహేశ్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు. ‘అర్జున్’ రిలీజై పైరసీ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు. తీరా లొకేషన్కొచ్చాక త్రివిక్రమ్ వర్కింగ్ స్టయిల్‌కి మహేశ్ ఫిదా అయిపోయాడు. ఇంతకుముందు సినిమాల్లోలాగా భారీ డైలాగుల్లేవు. అన్నీ ‘కట్టె... కొట్టె... తెచ్చె’ టైపు డైలాగులే. ముందుగా రాసుకున్న డైలాగుల్ని కూడా లొకేషన్కొచ్చాక తగ్గించేశాడు త్రివిక్రమ్. టాకీ పార్ట్ చకచకా అయిపోయింది. కానీ, ముందుంది ముసళ్ల పండగ. యాక్షన్ ఎపిసోడ్స్. ముఖ్యంగా క్లైమాక్స్. పద్మాలయాలో పాత చర్చి సెట్ వేశారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్తో హాలీవుడ్ లెవెల్లో క్లైమాక్స్ డిజైన్ చేశాడు త్రివిక్రమ్. కొన్ని మోషన్ కంట్రోల్ షాట్స్ తీయాలి. మోషన్ కంట్రోల్ టెక్నాలజీ ఇంకా డెవలప్ కాని డేస్ అవి. మహేశ్ పక్కనుంచి బుల్లెట్ దూసుకెళ్లడం, ఆ బుల్లెట్‌తో సమానంగా మహేశ్ పరిగెత్తడం, గ్లాస్ బ్రేక్ అవడం... ఇవన్నీ ఒకే షాట్లో కనబడాలి. ఎగ్జిక్యూషన్కి టైమ్ పట్టేసింది. దీనికి మొగుడి లాంటి షాట్ ఇంకోటుంది. సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో, అంత కష్టపడ్డారు ఈ ఒక్క షాట్‌కి. మహేశ్, సోనూసూద్ గాలిలోకి జంప్ చేస్తూ తలపడుతుంటే ఫ్రీజ్ అయ్యే షాట్. చుట్టూ పావురాలు. ఈ బిగ్ఫ్రీజ్ షాట్ తీయడానికి వచ్చిన ఫారిన్ కంపెనీవాళ్లు... వాళ్లల్లో వాళ్లకు ఏదో గొడవొచ్చి సడన్‌గా వెళ్లిపోయారు. త్రివిక్రమ్ షాక్. అంతా ప్లాన్ చేసిన టైమ్‌లో ఇలా జరిగింది. పీటర్ హెయిన్ పాపం కిందా మీదా పడి ఓ రిగ్ తయారు చేయించి, దానికి 180 స్టిల్ కెమెరాలు సెట్ చేశాడు. దాంతో ఆ ఫ్రీజింగ్ షాట్ తీయాలి. 500 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో స్లో-మోషన్ ఎఫెక్ట్ కావాలి. క్యాన్లు, క్యాన్లు నెగిటివ్ కావాల్సిందే. మామూలు 70 ఎం.ఎం. క్యాన్ అయితే 400 ఫీట్లే ఉంటుంది. అదే 16 ఎం.ఎం. క్యాన్‌లో వెయ్యి ఫీట్ల నెగిటివ్ ఉంటుంది. కానీ 16 ఎం.ఎం. నెగిటివ్‌తో షాట్స్ తీసినా మానిటర్లో చూడలేరు. ఏదో తంటాలుపడి స్టడీకామ్ కెమెరాకు వాడే చిన్న మానిటర్‌ను తెచ్చి, దీనికి ఫిట్ చేశారు. చాలా నెగిటివ్ ఖర్చయింది కానీ, మొత్తానికి షాట్ సూపర్‌గా వచ్చింది. మొత్తం క్లైమాక్స్ తీయడానికి 27 రోజులు పట్టింది. డిసెంబర్ 31 రాత్రి అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంటే, వీళ్లు మాత్రం ఉదయం మొదలుపెట్టినవాళ్ళు జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకూ షాట్స్ తీస్తూనే ఉన్నారు. సినిమా ఓపెనింగ్ ఎపిసోడ్లో ఇంకో షాట్ ఉంది. బహిరంగ సభ వేదికపై ఉన్న శాయాజీ షిండేను దూరంగా ఉన్న బిల్డింగ్ పై నుంచి మహేశ్ గన్‌తో షూట్ చేసే షాట్. అంత దూరంలో బిల్డింగ్ పైన ఉన్న మహేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి శాయాజీ షిండేను చూసే షాట్ అంటే... అంత దూరాన్ని కవర్ చేసే జూమ్ లేదు. దాంతో ఆలోచించి, ‘స్టిచ్ జూమ్’ ఎఫెక్ట్‌లో తీశారు. ఒక్కొక్క షాట్‌ను తీసుకుంటూ టోటల్‌గా దాన్ని ఒక్క షాట్లాగా స్టిచ్ చేశారు. వెరీ డిఫికల్ట్ షాట్. నెక్ట్స్డే బ్రహ్మానందం పొట్ట మీద మహేశ్ పంచ్ కొట్టే కామెడీ ఎపిసోడ్ తీయాలి. సడన్‌గా త్రివిక్రమ్ కొడుక్కి సీరియస్ అయ్యి, హాస్పిటల్లో చేర్చారు. తెల్లారేదాకా అక్కడే ఉన్నాడు త్రివిక్రమ్. నిద్ర లేదు. అయినా ఇంటికెళ్లి స్నానం చేసి డెరైక్ట్‌గా లొకేషన్‌కెళ్లి, ఆ కామెడీ ఎపిసోడ్ తీశారు. హాస్పిటల్ విషయం ఎవరికీ చెప్పలేదు. బాధంతా గుండెల్లో దాచుకుని, ఫుల్ ఫన్‌తో ఆ సీన్స్ తీసేశాడు త్రివిక్రమ్. సీబీఐ డెరైక్టర్ వేషం. చాలా స్ట్రిక్ట్‌గా ఉండే ఆఫీసర్‌కు ఒక చిన్న హ్యూమన్ యాంగిల్ ఉండేలా డిజైన్ చేసిన పాత్ర. హాఫ్ డే కాల్షీట్ చాలు. కె.విశ్వనాథ్ లాంటి పెద్దాయన చేస్తే గమ్మత్తుగా ఉంటుంది. త్రివిక్రమ్ అడగ్గానే ఓకే అన్నారాయన. ఎమ్మెస్ నారాయణది అయితే చాలా చిన్న వేషం. అయినా ఆయన కూడా చాలా ఇష్టపడి చేశారు. క్లైమాక్స్‌కి ముందు మహేశ్ - త్రిష మధ్య కాన్వర్జేషన్. ఏవేవో డైలాగ్స్ అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ ఆ ముందు సీన్లోనే మహేశ్‌ను ఉద్దేశిస్తూ, నాజర్ చాలా మాట్లాడతాడు. దానికి కొనసాగింపుగా వచ్చే ఇక్కడ కూడా డైలాగులు ఎక్కువైతే బోర్. ఒకటి, రెండు డైలాగ్స్‌తోనే మొత్తం ఎఫెక్ట్ కనబడాలి. త్రివిక్రమ్ బుర్ర షార్ప్‌గా పనిచేసింది. డైలాగ్సన్నీ కొట్టేసి రెండే రెండు డైలాగ్స్ పెట్టారు. మహేశ్‌కి నాజర్ గన్ ఇచ్చి పంపుతుంటే, ‘‘నేనూ వస్తాను’’ అంటుంది త్రిష. దానికి మహేశ్ ఆన్సర్ ‘‘నేనే వస్తాను’’! అంటే, విలన్ని తుద ముట్టించి మళ్లీ నీ దగ్గరకు వస్తానని హీరోయిన్‌కి హీరో చెప్పాడన్నమాట! సినిమా మొత్తం కలిపి మహేశ్‌కు నాలుగైదు పేజీల డైలాగులే ఉంటాయి. రెండు గంటల్లో డబ్బింగ్ చెప్పేశాడు. నాజర్ పాత్రకు ఎస్పీ బాలుతో డబ్బింగ్ చెప్పించాలి. ఆయనైతేనే కరెక్ట్. బాలూ చాలా బిజీ. త్రివిక్రమ్ చెన్నై వెళ్లి కోదండపాణి రికార్డింగ్ స్టూడియోలో దగ్గరుండి ఆయనతో డబ్బింగ్ చెప్పించుకున్నారు. 174 రోజులు తీశారు సినిమా. ఫైనల్‌గా మణిశర్మ చేతిలోకి వెళ్లింది. మణికి సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. తన రీరికార్డింగ్‌తో ఒక్కో రీలులో మేజిక్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఆయన ఆర్.ఆర్.నూ ఓ అద్భుతంలా చూస్తూ కూర్చున్నాడు. మహేశ్ పుట్టినరోజు... ఆగస్టు 9. ఆ తర్వాత రోజే ‘అతడు’ రిలీజ్. (2005 ఆగస్టు 10). సినిమా కొత్తగా అనిపించింది. మహేశ్ కొత్తగా అనిపించాడు. మేకింగ్ కొత్తగా అనిపించింది. డైలాగులూ కొత్తగా అనిపించాయి. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్. క్రైమ్ థ్రిల్లర్‌లా కనిపించే ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అనిపించే ఎమోషనల్ స్టోరీ ఇది. ఫ్యామిలీ వాల్యూస్ కనిపించీ కనిపించకుండా... లవ్‌ను చూపించీ చూపించకుండా... త్రివిక్రమ్ చేసిన మేజికల్ యాక్షన్ థ్రిల్లింగ్‌గా అనిపించింది. పరిశ్రమ ప్రచారానికి అతీతంగా ప్రేక్షకులు తమ మనసుల్లో పట్టం కట్టారు. ‘ఎవడన్నా కసితో సినిమా తీస్తాడు, లేదా ప్రేమతో తీస్తాడు. వీడేంట్రా... ఇంత శ్రద్ధగా తీశాడు... ఏదో గోడ కడుతున్నట్టు! గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్టు... చాలా జాగ్రత్తగా... పద్ధతిగా తీశాడు’ అన్నారు. టీవీలో కొన్ని వందల సార్లు ప్రసారమైనా, ఇప్పటికీ ఆ సినిమా, సన్నివేశాలు, డైలాగ్స్‌ను జనం పదే పదే చూసి ఆనందిస్తున్నారు. అందుకే, ఒక్క ముక్కలో - ‘అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించలేరు. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. ఇవాళ్టికీ ‘అతడు’ అంటే ప్రేక్షకులకు ప్రేమతో కూడిన అభిమానం వల్ల వచ్చిన గౌరవం! - త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్ డైలాగ్స్ ⇒ గన్ చూడాలనుకోండి. తప్పులేదు. కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు. చచ్చిపోతారు! ⇒ జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపిగ్గా ఉంటుంది! మరి పులినే వేటాడాలంటే ఎంత ఓపిక కావాలి చెప్పు! ⇒ తాడే కదా అని తేలిగ్గా తీసేయకమ్మా: అది ఇక్కడ కడితే మొలతాడు. ఇక్కడ కడితే ఉరితాడు. ఇక్కడ కడితే కాశీతాడు. మరి అక్కడ కడితే...? పడతాడు! - పులగం చిన్నారాయణ -
అతడే ఆమె సైన్యం
సినిమా వెనుక స్టోరీ - 12 చార్మినార్ దగ్గర కేఫ్‌లో కూర్చుని చాయ్ తాగుతున్నాడు గుణశేఖర్. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు సినిమా పని మీద ఎప్పుడొచ్చినా గుణశేఖర్ చార్మినార్ దగ్గరకొచ్చి... ఆ కట్టడం, వాతావరణం చూస్తూ ఓ చాయ్ తాగాల్సిందే. అప్పుడుగాని ట్రిప్ సక్సెస్ అయినట్టు కాదు. గుణశేఖర్ అప్పుడు చెన్నైలో అసిస్టెంట్ డెరైక్టర్. రేపు డెరైక్టరయ్యాక ఈ చార్మినార్ దగ్గరే సినిమా తియ్యాలి. గుణశేఖర్ అలా అనుకోవడం అది ఫస్ట్ టైమ్ కాదు. వందోసారో, నూట పదహారో సారో అయ్యుంటుంది. ‘వెస్ట్ సైడ్ స్టోరీ’... పాపులర్ హాలీవుడ్ మ్యూజికల్ ఫిల్మ్. ఈ సినిమా మీద గుణశేఖర్‌కు లవ్ ఎట్ ఫస్ట్ సైట్. తీస్తే అలాంటి సినిమా తీయాలి. రెండు కుర్ర గ్యాంగ్‌లు... వాటి మధ్య కాంపిటీషన్. ఇక్కడ కూడా గుణశేఖర్ మర్చిపోలేదు... చార్మినార్‌ను. ఆ గ్యాంగ్‌ల మధ్య గొడవను మాత్రం స్ఫూర్తిగా తీసుకొని, తెలుగు నేటివిటీ కథతో చార్మినార్ సాక్షిగా, పాతబస్తీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే? గుణశేఖర్ రాయడం మొదలుపెట్టాడు. రాస్తూనే ఉన్నాడు. ఎంతకీ తరగదే?! కొన్నేళ్ళ తరువాత... హైదరాబాద్... రామానాయుడు స్టూడియో. ‘చూడాలని వుంది’ రీ-రికార్డింగ్ జరుగుతోంది. దర్శకుడు గుణశేఖర్ ఫుల్ బిజీ. ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వచ్చారు. ‘‘సారీ సర్! ఈ రోజు మీ కొత్త సినిమా ఓపెనింగ్‌కి రాలేకపోయాను. వర్క్ బిజీ’’ అంటూ గుణశేఖర్ ఎక్స్ప్లనేషన్. ‘‘ఏం పర్లేదు గుణా’’ అన్నారు అశ్వినీదత్. ‘‘కృష్ణగారబ్బాయ్ మహేశ్‌బాబు ఎలా ఉన్నాడు?’’ ఆసక్తిగా అడిగాడు గుణశేఖర్. ‘‘చాలా బావున్నాడు. నిజంగా ‘రాజకుమారుడు’లాగానే ఉన్నాడు’’ అంటూ పొద్దుటి సినిమా ఓపెనింగ్ గురించి హుషారుగా చెప్పారు అశ్వినీదత్. కారులో ఫొటోషూట్ స్టిల్స్ తెప్పించి, గుణశేఖర్‌కి చూపించారాయన. మహేశ్ ఒక్కో ఫొటో చూస్తుంటే గుణశేఖర్ మైండ్‌లో ఏవేవో ఫ్లాషెస్. చార్మినార్ టాప్ మీద వెన్నెల్లో చందమామను చూస్తూ, సిగరెట్ తాగుతూ ఓ కుర్రాడు. ఆ కుర్రాడు అచ్చం మహేశ్‌బాబులా ఉన్నాడు. నెక్ట్స్ వీక్ వైజయంతి మూవీస్ ఆఫీసు కొచ్చాడు మహేశ్. గుణశేఖర్ అక్కడే ఉన్నాడు. ఇద్దరూ సరదా చిట్‌చాట్. చార్మినార్ బ్యాక్‌డ్రాప్‌లో తాను అనుకుంటున్న స్టోరీలైన్ గురించి చెప్పాడు గుణశేఖర్. మహేశ్ థ్రిల్లయిపోయాడు. ‘‘డెఫినెట్‌గా మనం చేద్దాం సర్! మీరెప్పుడంటే అప్పుడు నేను రెడీ’’ అంటూ ఉత్సాహపడిపోయాడు. ‘మృగరాజు’ ఫ్లాప్. గుణశేఖర్‌కి పెద్ద దెబ్బ. ఆ టైమ్‌లో కూడా గుణశేఖర్ మైండ్‌లో చార్మినారే కనబడుతోంది. ఎస్... ఆ కథకు టైమొచ్చింది. మళ్లీ ఆ కథ మీద కూర్చున్నాడు గుణశేఖర్. ఆ రోజు పేపర్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ల నాన్నగారికి స్పోర్ట్స్ అంటే ఇంట్రస్ట్ లేకపోవడం, గోపీచంద్ ఎన్నో కష్టాలుపడి స్పోర్ట్స్ చాంపియన్‌గా ఎదగడం... ఇదంతా గుణశేఖర్‌కి ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఎస్... నా కథలో హీరో కూడా ఇలాంటి వాడే. తండ్రి వద్దంటున్న స్పోర్ట్స్‌లో ఎదగాలనుకుంటాడు. గుణశేఖర్ ఓ నవలలాగా స్క్రిప్టు రాస్తున్నాడు. పేజీలకు పేజీలు... నిర్మాత రామోజీరావు ఆఫీసు... గుణశేఖర్ లైన్ చెబుతుంటే రామోజీ రావు చాలా ఇదైపోయారు. ‘‘చాలా బాగుంది కథ. మనం చేద్దాం. చార్మినార్ని ఇక్కడ ఫిలింసిటీలోనే కన్స్ట్రక్ట్ చేసేద్దాం. ఎన్ని కోట్లు ఖర్చయినా పర్లేదు’’ అని చెప్పేశాడాయన. గుణశేఖర్ ఏళ్లనాటి కల నిజం కాబోతోంది. కానీ అంతలోనే బ్రేక్. రామోజీరావు ప్లేస్‌లో ఎమ్మెస్ రెడ్డి వచ్చారు. ఆయన కూడా యమా ఉత్సాహం. మళ్లీ బ్రేక్. ఏవేవో అవాంతరాలు. పద్మాలయా స్టూడియో... మహేశ్, గుణశేఖర్ ఇద్దరే కూర్చున్నారు. ‘‘నాకు తెలిసి నిర్మాత ఎమ్మెస్ రాజు గారు ఈ ప్రాజెక్ట్‌కి కరెక్ట్’’ మహేశ్‌బాబు ప్రపోజల్. గుణశేఖర్ డబుల్ ఓకే. ఎమ్మెస్ రాజుకి కాల్ వెళ్లింది. ఆయన ‘పద్మాలయా’కొచ్చారు. మహేశ్ డిటెయిల్స్ అన్నీ చెప్పాడు. ‘‘రాజుగారూ! ఈ ప్రాజెక్టు మీకే చేయాలనుకుంటున్నాం. కానీ వన్ కండిషన్. చార్మినార్ సెట్ వెయ్యాలి. ఎందుకంటే రియల్ ‘చార్మినార్’ దగ్గర అన్నాళ్లు షూటింగ్ చేయలేం. ఈ మధ్యే ఎవరో సూసైడ్ చేసుకోవడంతో పైకి కూడా వెళ్లనివ్వడం లేదట’’ చెప్పాడు మహేశ్. ‘‘నేను సెట్ వేయడానికి రెడీ. కానీ నాకు ముందు కథ నచ్చాలి’’ అన్నారు ఎమ్మెస్ రాజు. గుణశేఖర్ కథ చెప్పాడు. ఎమ్మెస్ రాజు ఫుల్ ఖుష్. పేపర్లో అనౌన్స్మెంట్. మహేశ్‌బాబు - గుణశేఖర్ కాంబినేషన్లో ఎమ్మెస్ రాజు సినిమా. ‘యువకుడు’ సినిమాలో భూమిక అప్పుడే ఫ్రెష్‌గా విరబూసిన రోజా పువ్వులా ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్సే గుణశేఖర్‌కి నచ్చేసింది. మహేశ్ పక్కన భూమిక ఖరార్. శేఖర్.వి.జోసెఫ్ కెమెరామన్. మ్యూజిక్ డెరైక్టర్ మణిశర్మ. పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రైటర్స్. ఆర్ట్ డెరైక్టర్ అశోక్. టీమ్ అంతా ఓకే. ఇక టైటిలే మిగిలింది. ‘అతడే ఆమె సైన్యం’. గుణశేఖర్ ఫస్ట్ నుంచి ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యాడు. కానీ ఎవరో రిజిస్టర్ చేసేశారు. ఎంత బతిమాలినా నో చాన్స్. ఇంకో టైటిల్ వెతుక్కోవాల్సిందే. ‘కబడ్డీ’ అని పెడదామా అని ఓ దశలో అనుకున్నారు. ఆఖరికి ‘ఒక్కడు’ అనుకున్నారు. ఒక్కళ్లు కూడా ‘నో’ అనలేదు. హైదరాబాద్ శివార్లలో గోపన్నపల్లెలో రామానాయుడుగారికి పదెకరాల ఖాళీ ల్యాండ్ ఉంది. అక్కడ చార్మినార్ సెట్ వేయాలి. రియల్‌గా చార్మినార్ హైట్ దాదాపు 176 అడుగులు. అందులో చుట్టూ ఉండే నాలుగు మినార్ల హైట్ సుమారు 78 అడుగులు. ఈ కథకు కావాల్సింది ఆ మినార్లే. అంతవరకూ కనబడితే చాలు. కింద నుంచి పైవరకూ అవసరం లేదు. అందుకే కింద బాగా తగ్గించేసి 120 అడుగుల హైట్‌లో సెట్ వర్క్ స్టార్ట్ చేశారు. చార్మినార్, చుట్టూ ఓల్డ్ సిటీ సెటప్... దీనికి అయిదెకరాల ప్లేస్. త్రీ మంత్స్... 300 మంది వర్కర్స్... ఫినిష్ అయ్యేసరికి కోటి డెబ్భై లక్షల బడ్జెట్ తేలింది. ఇంత సెట్లో రోడ్ల సెటప్ లేదు. రోడ్లు కూడా వేయాలంటే బడ్జెట్ ఇంకా పెరిగిపోతుంది. ఆ రోడ్ల వరకూ కంప్యూటర్ గ్రాఫిక్స్‌లో చేయాలని డిసైడైపోయారు. ఓ పక్క సెట్ వర్క్ జరుగుతుంటే మరోపక్క ఇండస్ట్రీలో రకరకాల కామెంట్స్. ‘మృగరాజు’ లాంటి ఫ్లాప్ తీసిన డెరైక్టర్, ‘దేవీపుత్రుడు’ లాంటి ఫ్లాప్ తీసిన ప్రొడ్యూసరూ కలిసి మహేశ్‌తో ఏం సినిమా తీస్తారు? పాపం... మహేశ్ పని గోవిందా! ఇవన్నీ వీళ్లకు వినబడుతూనే ఉన్నాయి. కోపం రాలేదు. ఇంకా కసి పెరిగింది. బ్లాక్‌బస్టర్ తీయాలి. వాళ్ల నోళ్లు మూయించాలి. షూటింగ్ స్టార్ట్. చార్మినార్ సెట్లో షెడ్యూల్. సెట్ నిడివి అర కిలోమీటర్. లైటింగ్ చెయ్యాలంటే 15 జనరేటర్లు కావాలి. మామూలు క్రేన్లు చాలవు. స్ట్రాడా క్రేన్ కావాల్సిందే. కష్టమైనా షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది. క్లైమాక్స్‌కి మాత్రం చాలా కష్టపడ్డారు. డిసెంబర్ రాత్రిళ్లు... విపరీతమైన చలి... 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు... 11 రోజుల షూటింగ్... కబడ్డీ కోసమైతే మహేశ్ నిజం ప్లేయర్‌లానే కష్టపడ్డాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కబడ్డీ ఆడింది లేదు. కేవలం ఈ సినిమా కోసం రెండ్రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడు. మహేశ్‌కి బూట్లు వేసుకోవడం అలవాటాయె. ఇక్కడేమో బూట్లు లేకుండా ఆడాలి. మోకాళ్లకు దెబ్బలు... విపరీతమైన కాళ్ల నొప్పులు. అయినా భరించాడు. ఎమ్మెస్ రాజుకు ఇలాంటి భారీ వెంచర్లు కొత్త కాదు. కానీ వాటికన్నా భిన్నమైన ప్రాజెక్ట్ ఇది. ఏ మాత్రం తేడా వచ్చినా అవుట్. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు. ఇక్కడ రాజూ ఆయనే. మొండివాడూ ఆయనే. అలా డబ్బులు పోస్తూనే ఉన్నాడు. గుణశేఖర్‌కి ఎంతవరకూ సపోర్ట్‌గా నిలబడాలో అంత వరకూ నిలబడ్డారాయన. ఆ రోజుల్లోనే ఈ సినిమాకు దాదాపు రూ. 13-14 కోట్లు వెచ్చించారు. ఫస్ట్ కాపీ వచ్చింది. ఎమ్మెస్ రాజు, గుణశేఖర్, పరుచూరి బ్రదర్స్ తదితరులు రష్ చూశారు. పరుచూరి బ్రదర్స్‌కు ఎక్కడో ఏదో కొడుతోంది. స్క్రీన్‌ప్లే ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లో ఉండటం కరెక్ట్ కాదు. స్ట్రెయిట్ నేరేషన్ చేసేయమన్నారు. వాళ్లకు ‘రష్ కింగ్స్’ అని పేరు. రష్ చూసి బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇవ్వగలరు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌తో కూర్చుని 10 నిమిషాల్లో స్ట్రయిట్ నేరేషన్గా మార్చేశాడు గుణశేఖర్. ఇప్పుడందరూ హ్యాపీ. 2003 జనవరి 15. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్... సుదర్శన్ 35 ఎం.ఎం. థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి మార్నింగ్ షో చూస్తున్నారు సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు, గుణశేఖర్, ఎమ్మెస్ రాజు. ఇంటర్వెల్లోనే రిజల్ట్ తేలిపోయింది. గుణశేఖర్ హ్యాండ్లింగ్ అదుర్స్. ఎమ్మెస్ రాజు మేకింగ్ మార్వలెస్. మహేశ్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్. అప్పుడు ఆంధ్రాలో కరువు సీజన్. ఇంకోపక్క వరల్డ్‌కప్ హంగామా. ఇండియా ఫైనల్స్‌కు కూడా వెళ్ళింది. ఇంత టెన్షన్ మూమెంట్లో కూడా ‘ఒక్కడు’ క్రియేటెడ్ రికార్డ్స్. వెరీ ఇంట్రెస్టింగ్... * తమిళంలో విజయ్, కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్ ఈ సినిమా చేశారు. * ఈ సినిమాతో మహేశ్‌ను హిందీలో లాంచ్ చేద్దామని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు చాలా ముచ్చటపడ్డారు. కానీ మహేశ్ ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ల కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో హిందీలో తీయాలనుకున్నారు అట్లూరి పూర్ణచంద్రరావు. కానీ అదీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవలే బోనీకపూర్ తన తనయుడు అర్జున్ కపూర్‌తో ‘తేవర్’గా రీమేక్ చేశారు. - పులగం చిన్నారాయణ -
వదల బొమ్మాళీ... వదల
అరుంధతి : సినిమా వెనుక స్టోరీ - 11 అయిదేళ్ల కష్టం ‘అంజి’ సినిమా. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నిర్మాత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి. కానీ దెబ్బకొట్టింది. ఆ బాధను మర్చిపోవడం కోసం పైరసీ కంట్రోల్ ప్రోగ్రామ్స్‌లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారాయన. అయినా మనిషిలో ఏదో లోటు. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ కనబడే మనిషి అలా డీలాపడిపోయేసరికి కంగారుపడిపోయారు శ్యామ్ భార్య. మనుషులతో కలిస్తే కొంచెం తేరుకుంటారనిపించింది. దాంతో ఎవ్రీ సాటర్డే అండ్ సండే బంధువులతో, ఫ్రెండ్స్‌తో డిన్నర్ పార్టీలు అరేంజ్ చేయడం మొదలు పెట్టారు. ఆ వీక్ శ్యామ్ మేనత్త ఒకావిడ వచ్చారు. గద్వాల్ సంస్థా నానికి చెందిన ఆమె గద్వాల్ కోటకు సంబంధించి నాన్‌స్టాప్‌గా ఏదో ఒకటి చెబుతూనే ఉంది. ఇవన్నీ చిన్నప్పట్నుంచీ వింటూనే ఉన్నారు శ్యామ్. తెలిసిన విష యాలే అయినా మళ్లీ వినాలనిపిస్తోంది. ఆ డిస్కషన్‌లోనే శ్యామ్ తాతగారు ఎప్పుడో చెప్పిన ఓ ఇన్సిడెంట్ ప్రస్తావన కొచ్చింది. శ్యామ్ తాతగారు వెంకటగిరి సంస్థానం అధీనంలోని ఓ గ్రామ పెద్ద. చాలా తరాల క్రితం అక్కడ ఓ సంఘటన జరిగిందట. రాజావారి కూతురు పనివాణ్ణి ఇష్టపడింది. ఓ రోజు రాజావారు పనిమీద బయటకు వెళ్ళి, ఎందుకో వెనక్కు తిరి గొచ్చారు. అప్పుడు గదిలో రాకుమారి, పనివాడు మాత్రమే ఉన్నారు. రాజావారికి అర్థమైపోయింది. ఆయన సేవకులందరినీ పిలిచి గదినే సమాధిలా చేసేయమన్నారు. లోపల ఉన్నవారికి విషయం తెలిసినా బయటకు రాలేని పరిస్థితి. ఆ గదిని క్లోజ్ చేసేశాక రాజా వారు ఆ కోట మొత్తం ఖాళీ చేసేసి ఊరి చివరి బిల్డింగ్‌కి షిఫ్ట్ అయి పోయారు. వారం రోజుల పాటు ఆ కోటలో నుంచి అరుపులు వినిపించేవని ఊళ్లోవాళ్లు చెప్పేవారట. ఈ ఎపిసోడ్ శ్యామ్‌ను కదిలించేసింది. నిద్రపట్టలేదు. అవే ఆలోచనలు. గద్వాల్ కోట... వెంకటగిరి సంస్థానం... రాకుమారి, పనివాడు... గదిలో సమాధి... ‘అంజి’కి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డ్. శ్యామ్‌లో హుషారు. తమ ప్రయత్నానికి ఓ గొప్ప రికగ్నిషన్. ప్రెసి డెంట్ నుంచి అవార్డు తీసుకున్నాక, ఆ రాత్రి తన టీమ్‌కు పార్టీ ఇచ్చారు శ్యామ్. ఆ పార్టీ తన జీవితాన్ని మలుపు తిప్పు తుందని శ్యామ్‌కు కూడా తెలీదు. అందరూ జాలీ మూడ్‌లో ఉన్నారు. మార్నింగ్ ఫంక్షన్లో ‘అంజి’ గ్రాఫిక్స్ గురించి అందరూ ప్రశంసించిన విషయం గుర్తొచ్చింది శ్యామ్‌కి. ‘‘మళ్లీ గ్రాఫిక్స్‌తో ఓ వండర్ చేద్దామా?’’ అన్నారు శ్యామ్ తన టీమ్‌తో. అందరూ ‘‘ఓకే... ఓకే’’ అంటూ హుషారుపరిచారు. ఆ రాత్రి శ్యామ్‌కు మళ్లీ నిద్ర రాలేదు. వెంటనే సినిమా తీయాలి. శ్యామ్ ఆధ్వర్యంలో కథ రెడీ అవు తోంది. రకరకాల మెమొరీస్... రకరకాల ఇన్స్పిరేషన్స్. ముఖ్యంగా గద్వాల్ కోట నేపథ్యం... వెంకటగిరి సంస్థానంలో ఎన్నో తరాల కింద జరిగిన రాకుమారి సమాధి... వీటన్నింటితో కథ ఓ కొలిక్కి వచ్చింది. టైటిల్ ఏం పెట్టాలి? అందరికీ తెలి సిన అమ్మాయి పేరు కావాలి. పెళ్లిళ్లలో అరుంధతీ నక్షత్రం చూపిస్తారు. అంతకు మించిన పాపులర్ నేమ్ ఏముంటుంది! ‘అరుంధతి’... టైటిల్ ఓకే! మంచి హైట్ - రాయల్ లుక్ ఉన్న హీరోయిన్ కావాలి. ‘అరుంధతి’ అంటే అలానే ఉండాలి. ఎవ్వరూ కనబడడం లేదు. హైట్ ఉంటే లుక్ లేదు. లుక్ ఉంటే ఇంకో డిఫెక్ట్. ఫైనల్‌గా దొరికింది మమతా మోహన్‌దాస్. మలయాళీ అమ్మాయి. ఆఫర్ వెళ్లింది. పాపం మమతకు ఎవరో రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. శ్యామ్‌తో సినిమా అంటే మంత్స్ కాదు... ఇయర్స్ కావాలి. మొత్తం కెరీర్ స్ట్రక్ అయిపో తుంది. మమత ‘నో’ చెప్పేసింది. మళ్లీ సెర్చింగ్ స్టార్ట్. ఈసారి దుర్భిణిలో ‘అనుష్క’ కనబడింది. ‘సూపర్’లో నాగార్జునతో చేసి, ప్రస్తుతం రాజమౌళి డెరైక్షన్‌లో ‘విక్రమార్కుడు’ చేస్తోంది. శ్యామ్ నుంచి కాల్ వెళ్లగానే అనుష్క కంటే రాజమౌళి ఎగ్జైట్ అయిపోయాడు. ‘‘శ్యామ్ గ్రేట్ ఫిల్మ్‌మేకర్. ఆయనతో సినిమా చేయడం నీ అదృష్టం’’ అని రాజమౌళి లాంటివాడు పొగుడుతుంటే అనుష్క థ్రిల్లయిపోయింది. ‘అరుంధతి’లో కీ-రోల్ పశుపతి. స్క్రిప్టు దశలోనే ఆ పాత్రకు తమిళ నటుడు పశుపతిని ఫిక్సయిపోయారు శ్యామ్. అందుకే ఆ పేరే పెట్టేశారు. కానీ ప్రాక్టి కల్గా వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్. అఘోరా గెటప్ వరకూ పశుపతి సూపర్. కానీ, అరుంధతిని మోహించాల్సిన చోట ఆనడం లేదు. ఇంకొకరిని వెతకాల్సిందే. ‘అశోక’ అనే హిందీ సినిమా చూస్తుంటే సోనూసూద్ తళుక్కుమన్నాడు. అతనప్ప టికే తెలుగులో ‘సూపర్’, ‘అతడు’ లాంటి సినిమాలు చేశాడు. పిలవగానే ఫొటో షూట్కొచ్చాడు. అఘోరా మేకప్‌కే నాలుగైదు గంటలు పట్టింది. అవసరమా అనిపించింది సోనూసూద్‌కి. శ్యామ్ స్కెచ్‌లు చూపించి, క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇదేదో గ్రేట్ జర్నీలా ఉందే అనుకుని, అప్పుడు ఓకే చెప్పాడు. ఫకీర్ పాత్రకు నజీరుద్దీన్ షా అయితే సూపర్బ్. నో చాన్స్. నానా పటేకర్. నో డేట్స్. అతుల్ కులకర్ణి. నాట్ అవైలబుల్. దాంతో సాయాజీ షిండేను పిలిచారు. హీ పర్ఫెక్ట్లీ సూట్స్ ద రోల్. డెరైక్టర్ సభాపతి. తమిళంలో మంచి సినిమాలు తీశాడు. ‘అంజి’ డెరైక్టర్ ఫస్ట్ అతనే. తర్వాత కోడి రామకృష్ణ వచ్చారు. సభాపతిని పిలిచారే కానీ, శ్యామ్‌లో డౌట్. ‘అరుంధతి’ని హ్యాండిల్ చేయగలడా? అందుకే క్లైమాక్స్‌ను డమ్మీగా వీడియో షూట్ చేసివ్వమన్నారు. సభాపతి అవ లీలగా చేసిచ్చేశాడు. శ్యామ్‌కు నచ్చలేదు. ‘‘టీవీ తారలతో వీడియో కెమెరాతో ఇంత కన్నా బాగా ఎలా వస్తుంది?’’ సభాపతి క్వశ్చన్. అయితే నిజం తారలతోనే రియల్‌గా చేయమన్నారు శ్యామ్. అయినా నో క్వాలిటీ. సభాపతి చెన్నై ఫ్లయిటెక్కే శాడు. కోడి రామకృష్ణ ఇంటికి కారు వెళ్లింది. శ్యామ్‌కి కోడి రామకృష్ణ ఓ బల హీనతేమో! ఆయన లేకుండా సినిమాలు చేయలేకపోతున్నారు. ఒక్క ‘ఆగ్రహం’ తప్ప ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’, ‘అమ్మోరు’, ‘అంజి’... అన్నింటికీ ఆయనే దర్శకుడు. మళ్లీ ఇద్దరూ కలవడంతో ప్రాజెక్ట్ స్పీడందుకుంది. పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి మేకింగ్‌కు చాలా కష్టపడాల్సి వచ్చింది. 1920ల నాటి సెట్స్, కాస్ట్యూమ్స్... అన్నీ జాగ్రత్తగా చూస్కోవాలి. పెద్ద ప్యాలెస్ కట్టాలి. 250 అడుగుల ఫ్లోర్ కావాలి. అన్నపూర్ణా స్టూడియోలో రెండు ఫ్లోర్లు తీసుకుని ఆ ప్యాలెస్ సెట్‌ను రెండుగా విభజించి, రెండు ఫ్లోర్లలో చెరో సగం సెట్ వేశారు. 4 నెలలు పట్టింది. ఖర్చు 85 లక్షలు. 15 నిమిషాల ఫ్లాష్‌బ్యాక్ తీశారా సెట్లో. 106 రోజులు వర్క్ చేశారు. బనగాన పల్లిలో ఉన్న ఓ పాడుబడ్డ కోటలో ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. కోట మొత్తం వార్నిష్ చేయించారు. కడియం నుంచి పాతిక లారీల మొక్కలు తెప్పించి ఓ గార్డెన్ సృష్టించారు. డ్రమ్ డ్యాన్స్ తీయడానికి 45 రోజులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఒకసారైతే అర్ధరాత్రి ఒంటి గంటకు డ్యాన్సు చేస్తూ అనుష్క కళ్లు తిరిగి పడి, స్పృహ కోల్పోయింది. అందరూ టెన్షన్ పడ్డారు. అంత ఇది జరిగినా మార్నింగ్ 7 గంటలకే మేకప్‌తో మళ్ళీ రెడీ. అంతలా లీనమైపోయి పనిచేసింది. క్లైమాక్స్ కోసం 8 కంప్రెషర్లు, 10 ఫ్యాన్లు, వయొలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం లారీల కొద్దీ ఫైన్ డస్ట్... వీటన్నిటి మధ్య కూడా అనుష్క పనిచేసింది. నోట్లోకి, ముక్కులోకి డస్ట్ వెళ్లిపోయినా ప్రొడ్యూసర్‌కి ఒక్కసారీ కంప్లయింట్ చేయలేదు. ఫిజికల్లీ టైరింగ్, మెంటల్లీ చాలెంజింగ్. ‘చంద్రముఖి’లో రజనీకాంత్ తరహాలో ఇందులో సోనూసూద్‌కు డిఫరెంట్ మేనరిజమ్ పెడదామనుకున్నారు. కానీ సోనూసూద్ బాడీ లాంగ్వేజ్ వెరీ నార్మల్. మరెలా? ఏదైనా పాట పెడితే? కనెక్ట్ అవు తుందనే గ్యారెంటీ లేదు. ఏదైనా డైలాగ్ పెడదామని కన్ క్లూజన్‌కి వచ్చారు. ఈ బాధ్యత డైలాగ్ రైటర్ చింతపల్లి రమణకు అప్పగించారు. రమణ కిందా మీదా పడి ఎనిమిది పంచ్ డైలాగులు రెడీ చేశాడు. వాటిలోంచి కోడి రామకృష్ణ ఒకటి సెలక్ట్ చేశారు. అదే ‘బొమ్మాళి’. ఈ ప్రాజెక్ట్‌కి మెయిన్ పిల్లర్ రాహుల్ నంబియార్. ‘అంజి’కి స్పెషల్ ఎఫెక్ట్స్ చేశాడు. శ్యామ్‌కి ఈ మలయాళీ కుర్రాడి మీద విపరీతమైన గురి. ‘అరుంధతి’ స్టోరీ సిట్టింగ్స్ దగ్గర్నుంచీ రాహుల్ పార్టిసిపేట్ చేశాడు. విలన్ మేకప్, సెట్స్ తాలూకు స్కెచెస్ ముందే రెడీ చేసేసుకున్నాడు. షూటింగ్ టైమ్‌లో డెరైక్టర్‌తో పాటే ఉన్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ సీన్స్‌లో ఆర్టిస్టుల కదలికలు, కెమెరా యాంగిల్స్... ఇదంతా రాహుల్ రెస్పాన్స్బిలిటీనే. అందుకే రాహుల్‌కి క్రియేటివ్ డెరైక్టర్ పోస్ట్ ఇచ్చేశారు శ్యామ్. ‘అరుంధతి’ రెడీ. రష్ చూసి శ్యామ్ డల్ అయిపోయారు. ఏదో అసంతృప్తి. ఎక్కడో ఏదో కొడుతోంది. రీ-షూట్. బాగున్నవి ఉంచేసి, బాగోలేనివి మళ్లీ తీశారు. ఇంకో 40 రోజులు ఎక్స్ట్రా. ఫైనల్‌గా సినిమా రెడీ. 55 రోజుల్లో తీయా లనుకున్న సినిమా 264 రోజులు పట్టింది. 3 లక్షల 20 వేల అడుగుల నెగిటివ్ ఎక్స్ పోజ్ చేశారు. బడ్జెట్ రూ. 14.5 కోట్లు తేలింది. ఒక్క ఏరియా కూడా బిజినెస్ చేయలేదు. అన్నిచోట్లా సొంతంగా రిలీజ్. శ్యామ్ నమ్మకమే ఫలించింది. ‘అరుంధతి’కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్. అన్ బిలీవబుల్ ఓపెనింగ్స్. ఫస్ట్ 35 ప్రింట్స్‌తో రిలీజ్ చేసిన సినిమా, సెకండ్ వీక్ 290 ఫిజికల్ ప్రింట్స్‌కి, డిజిటల్ ప్రింట్స్‌కి ఎగ బాకింది. ఫైనల్‌గా 360 ప్రింట్స్ వేశారు. దటీజ్ ద పిక్చర్స్ స్టామినా. ‘వదల బొమ్మాళీ నిన్నొదలా’ అంటూ బాక్సా ఫీస్‌కు అతుక్కుపోయింది ‘అరుంధతి’. శ్యామ్ ఇంట్లో గ్రాండ్ పార్టీ. ఆ రోజు శ్యామ్ పాతికేళ్ల వెడ్డింగ్ యానివర్సరీ. ‘అరుంధతి’ సక్సెస్‌తో ఆ పార్టీలో డబుల్ జోష్. ‘‘నీకేం గిఫ్ట్ కావాలి?’’ అడిగారు శ్యామ్ తన భార్యను. ‘‘ఇంకో రెండు సినిమాల వరకూ మీరు గ్రాఫిక్స్ జోలికి పోకూడదు’’ అడిగారామె. శ్యామ్ పగలబడి నవ్వేశారు. వెరీ ఇంట్రెస్టింగ్... * సోనూసూద్ ఈ సినిమాకు అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? 43 లక్షలు. ముందు మాట్లాడింది 18 లక్షలైతే, ఎక్స్ట్రా కాల్షీట్స్ తెచ్చింది 25 లక్షలు. * తమిళ, మలయాళ భాషల్లోకి కూడా ‘అరుంధతి’ని డబ్ చేశారు. అక్కడా బాగా ఆడింది. హిందీలో అనుష్క, రజనీకాంత్ (ఫకీర్ పాత్ర), షారుక్ ఖాన్ (పశుపతి పాత్ర)లతో రీమేక్ చేయాలని శ్యామ్ ఓ దశలో అనుకున్నారు. ఎందుకనో కుదర్లేదు. - పులగం చిన్నారాయణ -
లక లక లక...
1993... కేరళ... ఫాజిల్ టేబుల్ మీద ఫైల్స్ పేరుకుపోయున్నాయి. వాటిని కదిల్చి చాలా కాలమైనట్టుంది. కొంచెం దుమ్ము కూడా చేరుకుంది. ఫాజిల్ అంటే మలయాళంలో టాప్ డెరైక్టర్. ఆ రోజు ఏదో అవసరమై ఆ ఫైళ్లు కదిలించాడు ఫాజిల్. బాగా అడుగున రైటర్ మధు ముట్టమ్ రాసిన స్క్రిప్ట్ కనబడింది. కాసేపు అటూ ఇటూ తిరగేశాడు. తర్వాత ఆ కథలో లీనమైపోయాడు. ఓ పెద్ద బంగ్లా... నాగవల్లి అనే దెయ్యం... ఓ సైకాలజిస్ట్ ట్రీట్మెంట్... భలే ఉందే కథ అనుకున్నాడు ఫాజిల్. మధుకి కబురు వెళ్లింది. వెంటనే ఫాజిల్ ఆఫీసులో వాలిపోయాడు మధు. అతనా స్క్రిప్ట్ రాసి ఏడేళ్లవుతోంది. అప్పట్లో ఫాజిల్కిస్తే ‘ప్చ్’ అన్నాడు. ఇన్నాళ్లకు ఆ స్క్రిప్టుకు మోక్షం కలిగినట్టుంది. ఫాజిల్, మధు కలసి ఆ కథకు ‘నగిషీ’లు చెక్కడం మొదలుపెట్టారు. సినిమా స్టార్ట్. మలయాళ సూపర్‌స్టార్స్ మోహన్‌లాల్, సురేశ్ గోపీలు హీరోలు. నాగవల్లి ఆవహించే గంగ పాత్రలో శోభన. అదే ‘మణిచిత్ర తాళు’.అద్దిరిపోయింది... బాక్సాఫీస్. అవార్డులూ అంతే. శోభనకైతే బెస్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డు. 2004... బెంగళూరు... కన్నడ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్ ప్రెసిడెంట్. మీటింగ్ జరుగుతోంది. సీనియర్ కమెడియన్ ద్వారకేశ్‌కి, ఫైనాన్షియర్స్‌కి మధ్య గొడవ. ఈ వివాదాన్ని విష్ణువర్ధన్ పరిష్కరించాలి. న్యాయం ఫైనాన్షియర్ల వైపే ఉంది. కానీ ద్వారకేశ్ తనకు బాగా కావాల్సినవాడు. పైగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడిప్పుడు. జాగ్రత్తగా డీల్ చేయాలి. విష్ణువర్ధన్ డీల్ చేశాడు. ఫైనాన్షియర్లకి ద్వారకేశ్ అప్పు తీర్చేశాడు. ద్వారకేశ్‌కి విష్ణువర్ధన్ డేట్లు ఇచ్చాడు... ఎప్పుడో ఒకప్పుడు సినిమా చేసుకోమని. కానీ, పీక మీద కూర్చున్నాడు ద్వారకేశ్. ఇప్పటికిప్పుడు సినిమా చేయమంటాడు. హౌ? కథ చేయాలంటే నెలలు పడుతుంది. దీనికి ఒకటే సొల్యూషన్. రీమేక్. డెరైక్టర్ పి.వాసుకి కబురెళ్లింది. ఆయన చెన్నై నుంచి బెంగళూరు వచ్చాడు. విష్ణువర్ధన్ అర్జెంట్‌గా సినిమా చేద్దామన్నాడు. ‘‘నా ఫ్రెండ్ ఫాజిల్ పదేళ్ల క్రితం ‘మణిచిత్ర తాళు’ సినిమా చేశాడు. చాలా బావుంటుంది. మీకు కొత్తగా ఉంటుంది’’ చెప్పాడు పి.వాసు. ‘‘ఇంకేం... నేను రెడీ’’ అన్నాడు విష్ణువర్ధన్. అదే ‘ఆప్తమిత్ర’. సైకియాట్రిస్టుగా విష్ణువర్ధన్. నాగవల్లి ఆత్మ ఆవహించే గంగ పాత్రలో సౌందర్య. 2004... ఆగస్టు 27 రిలీజ్. ఫస్ట్ వీక్ నో కలెక్షన్స్. కట్ చేస్తే... బాక్సాఫీస్‌కి వసూళ్ల దెయ్యం పట్టింది. ఎంతకూ వదలదే..! 2004 అక్టోబర్ 1... చెన్నై... టి.నగర్‌లోని శివాజీ గణేశన్ ఇల్లు. ఆ రోజు పెద్దాయన జయంతి. శివాజీ గణేశన్ కొడుకులు ప్రభు, రామ్‌కుమార్‌లు ఆ ఏర్పాట్లేవో చేస్తుంటే... అనుకోని అతిథిలా రజనీకాంత్. వీళ్లంతా కంగారుపడిపోయారు. హాల్లో ఉన్న శివాజీ గణేశన్ ఫొటోకి అంజలి ఘటిస్తున్నాడు రజనీ. అతని మనసు నిండా ఏదో వేదన. తన ఇంటికి భోజనానికి రమ్మని పెద్దాయన ఎన్నిసార్లు అడిగారో. కుదర్లేదు. ఇప్పుడిలా ఆయన లేనప్పుడు వచ్చాడు. రజనీలో అదే చింత. అక్కడే భోంచేసి బయటకు రాగానే మీడియావాళ్లు చుట్టుముట్టారు. మామూలుగా రజనీ మాట్లాడడు. దణ్ణం పెట్టి వెళ్లిపోతాడు. ఆ రోజు మాట్లాడాడు. ‘‘పెద్దాయన స్థాపించిన ‘శివాజీ ప్రొడక్షన్స్’లో సినిమా చేస్తున్నా’’ అని అనౌన్స్ చేశాడు. అందరూ షాక్. రెండేళ్ల నుంచీ రజనీ సినిమా చేయడం లేదు. 2002లో వచ్చిన ‘బాబా’ డిజాస్టర్. అందుకే ఈసారి పెద్ద హిట్టు సాధించాలనే కసి మీద ఉన్నాడు రజనీ. కె.ఎస్.రవికుమార్ డెరైక్షన్‌లో ‘జగ్గూభాయ్’ అనౌన్స్ చేశాడు. ఈ రెండింట్లో ఏది ఉంటుంది? బెంగళూరు వెళ్లాడు రజనీ. ముసలాడి గెటప్‌లో ‘ఆప్తమిత్ర’ సినిమాకెళ్లాడు. ఆ సినిమా చూస్తూ... జనాల చప్పట్లు చూస్తూ... ఏదో ఆలోచిస్తున్నాడు. తనకు రైట్ టైమ్‌లో రైట్ సినిమా. సింహం ఆకలి తీర్చే సినిమా. పి.వాసుకి కాల్ చేశాడు. ప్రభుకి కూడా కాల్ చేశాడు. ‘‘ఆప్తమిత్ర’ను మనం రీమేక్ చేస్తున్నాం’’ చెప్పాడు రజనీ. పి.వాసు కంగారుపడ్డాడు. ఇదే సినిమాను ప్రభుతో తమిళ్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా రజనీనే చేస్తానంటున్నాడు. ప్రభుకైతే కలో నిజమో అర్థం కావడం లేదు. ‘‘మరి ‘జగ్గూభాయ్’?’’ అంటూ నీళ్లు నమిలాడు పి.వాసు. ‘‘అది క్యాన్సిల్. మనం ‘ఆప్తమిత్ర’ చేస్తున్నాం.’’ రజనీ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే. మణిచిత్ర తాళు... ఆప్తమిత్ర... ఈ రెండింటినీ మించేలా ఉండాలి రజనీ సినిమా. కథను మార్చకూడదు. కానీ రజనీ ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులు చేయాలి. పి.వాసు అదే చేస్తున్నాడు. రజనీ కూడా ఫుల్ ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈచ్ అండ్ ఎవ్విర్‌థింగ్ అడుగుతున్నాడు. ‘‘దెయ్యం పేరు నాగవల్లి బాలేదు. రాజుల కాలంనాటి నర్తకి కాబట్టి... ఇంకా హెవీగా ఉండాలి.’’ రజనీ చెబితే తిరుగేముంది. ఇప్పుడు దెయ్యం నాగవల్లి కాదు... చంద్రముఖి.‘ఆప్తమిత్ర’లో విష్ణువర్ధన్ ‘హౌల హౌల...’ అంటుంటాడు. రజనీకి నచ్చలేదు. మార్చాలి. ఎప్పుడో చిన్నప్పుడు మరాఠీ నాటకంలో విలన్ మేనరిజమ్ గుర్తొచ్చింది. అదే ‘లక లక లక...’. గంగ పాత్రకు ఎవరిని తీసుకోవాలి? స్నేహ... రీమాసేన్... ఎవ్వరూ ఆనడం లేదు. ఎస్... సిమ్రన్ కరెక్ట్. దుర్గ పాత్రకు కొత్తమ్మాయి నయనతార. రజనీకి పెయిర్. గోల్డెన్ చాన్స్ అంటే ఇదే. తీరా రెండ్రోజులు షూటింగ్ చేశాక, షాకింగ్ న్యూస్... ‘చంద్రముఖి’ టీమ్‌కి. స్వీట్ న్యూస్... సిమ్రన్‌కి. ఆమె ప్రెగ్నెంట్. సినిమాను వదులుకోవాల్సిన పరిస్థితి. బ్యాడ్‌లక్. కానీ జ్యోతికది గుడ్‌లక్. ఆమెకి దక్కింది అవకాశం. హైదరాబాద్‌లో షూటింగ్. దాదాపుగా అంతా ఇక్కడే. కొంతవరకు మాత్రం చెన్నైలో. రెండు పాటలకు టర్కీ వెళ్లారు. ఎంత స్పీడ్‌గా అంటే... అంత స్పీడ్‌గా ఫినిష్ అయిపోయింది సినిమా. 19 కోట్ల బడ్జెట్ తేలింది. 2005 ఏప్రిల్ 14. తెలుగు, తమిళ భాషల్లో ‘చంద్రముఖి’ చూసి ప్రేక్షకులకు దిమ్మ తిరిగిపోయింది. 10... 20... 30... 40... 50... 60... 70... ఇలా కోట్లు వస్తూనే ఉన్నాయి. 50 రోజులు... 100 రోజులు... 200 రోజులు... చెన్నైలో శివాజీ గణేశన్ సొంత థియేటర్ ‘శాంతి’లో 804 రోజులాడి సౌత్ ఇండియా రికార్డ్ సృష్టించింది. త్యాగరాజ భాగవతార్ నటించిన తమిళ ‘హరిదాస్’ (1944 అక్టోబర్ 16 రిలీజ్) ఏకధాటిగా చెన్నైలోని బ్రాడ్వే థియేటర్లో 768 రోజులాడిన రికార్డు బద్దలు. మళ్లీ రజనీ హవా మొదలు. చంద్రముఖా మజాకా! లక లక లక... - పులగం చిన్నారాయణ వెరీ ఇంట్రస్టింగ్... * ‘మిస్టర్ పెళ్లాం’ తీసిన గవర పార్ధసారథికి శోభన క్లోజ్. ఢిల్లీలో నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్లో శోభన కలిసినప్పుడు, ‘‘మణిచిత్ర తాళు’ తెలుగులో రీమేక్ చెయ్య’’మని సలహా ఇచ్చింది. రిస్క్ అని వదిలేశారు పార్ధసారథి. తర్వాత ‘చంద్రముఖి’ని పి.కరుణాకర్‌రెడ్డి, ఎస్.రమేశ్ బాబులతో కలసి తెలుగులో డబ్ చేశారు. * ‘శివాజీ ప్రొడక్షన్స్’లో రజనీకాంత్ ‘మన్నన్’ సినిమా చేశాడు. ఆ సినిమా విజయోత్సవ సభలో ఇదే సంస్థలో 50వ సినిమా చేస్తానని రజనీ మాట ఇచ్చారు. ఆ రకంగా కూడా ‘చంద్రముఖి’ చేసి రజనీ మాట నిలబెట్టుకున్నారు. * పారితోషిక రూపంలోనూ, లాభాల్లో వాటా పరంగానూ ‘చంద్రముఖి’కి రజనీకాంత్‌కు 15 కోట్ల రూపాయల వరకూ ముట్టింది. అప్పట్లో అదే హయ్యస్ట్ రెమ్యూనరేషన్. * ‘చంద్రముఖి’ తెలుగు డబ్బింగ్ వెర్షన్లో సందర్భోచితంగా ‘వారాయ్... నాన్ ఉన్నై తేడీ...’ అనే తమిళ పాట పెట్టారు. ఇప్పటికీ ఆ పాట పాపులరే. తమిళ మాతృకలో ‘రారా... సరసకు రారా...’ అంటూ భువనచంద్ర రాసిన తెలుగు పాట పెట్టారు. * ‘మణి చిత్ర తాళు’ డీవీడీ చిరంజీవికిచ్చి తెలుగులో రీమేక్ చేద్దామన్నారు దర్శకుడు వీఎన్ ఆదిత్య. అయితే చిరంజీవి ఆసక్తి చూపించలేదు. ‘చంద్రముఖి’ రిలీజై ఘనవిజయం సాధించాక, చిరంజీవి స్వయంగా ఆదిత్యకు ఫోన్‌చేసి అతని జడ్జ్మెంట్ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారట. -
ఉప్పొంగెలే..
ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరీ మా సీమకే చీనాంబరి వెతలు తీర్చుమా దేవేరీ వేదమంటి మా గోదారి శబరి కలసిన గోదారీ రామచరితకే పూదారి ‘‘నీకు గోదావరి గురించి తెలుసా?’’ అడిగాడు శేఖర్ కమ్ముల. ‘‘అది... బిగ్ రివర్ కదా’’ అంది కమలినీ ముఖర్జీ. ‘ఆనంద్’ షూటింగ్ లంచ్ బ్రేక్‌లో ఇద్దరూ భోంచేస్తూ మాట్లాడుకుంటున్నారు. గోదావరి గురించి అడిగిన శేఖర్, తర్వాత కామ్ అయిపోయి, తన మానాన తాను భోంచేస్తున్నాడు. కమలినికేం అర్థం కాలేదు. ‘‘ఏంటి శేఖర్? ఏదో చెప్తావనుకుంటే... ఏం మాట్లాడవ్?’’ అడిగింది. ‘‘ఆ... ఏం లేదు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్టోరీ అనుకుంటున్నా’’ అన్నాడు శేఖర్ చాలా సింపుల్‌గా. ‘‘అవునా! ఆ స్టోరీ ఏంటో చెప్పవా ప్లీజ్’’ అడిగింది కమలిని. చెప్పడానికి కాసేపు తటపటాయించాడు శేఖర్. ‘‘నేనేం లీక్ చేయను. ధైర్యంగా చెప్పొచ్చు’’ నవ్వుతూ చెప్పింది కమలిని. శేఖర్ చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘సోషల్ ఎవేర్నెస్ ఉన్న అబ్బాయి... ఇండివిడ్యువాలిటీ కోరుకునే అమ్మాయి... ఇద్దరూ కలసి గోదావరి నదిలో లాంచీ ప్రయాణం... రాజమండ్రి నుంచి భద్రాచలం వయా పాపికొండలు... బ్యూటిఫుల్ జర్నీ’’ అంటూ కొన్ని సీన్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు శేఖర్. కమలిని విభ్రమంగా శేఖర్ వైపు చూస్తూ వింటోంది. ‘‘బ్యూటిఫుల్ స్టోరీ శేఖర్! హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. నన్ను దృష్టిలో ఉంచుకునే రాశావు కదా. ఆ పాత్ర నేనే చేస్తాను’’ అని గలగలా మాట్లాడేస్తోంది కమలినీ. శేఖర్ కంగారుపడ్డాడు. ‘‘ఇంకా నేనేం అనుకోలేదు. ముందు ‘ఆనంద్’ రిలీజ్ కావాలి. ఆ తర్వాత చూద్దాం’’ అని చెప్పి తప్పించుకున్నాడు. కొన్ని తప్పించుకోవడం చాలా కష్టం. ఆ విషయం శేఖర్ కమ్ములకు ‘ఆనంద్’ రిలీజైన ఏడాదికి అర్థమైంది. ‘ఆనంద్’ ట్రెండ్ సెట్టింగ్ హిట్. చాన్నాళ్లకు బాపు లాంటి డెరైక్టరొచ్చా డంటూ కితాబులు. వింటూనే ఉన్నాడు శేఖర్ కమ్ముల. తనపై ఓ ఎక్స్పెక్టేషన్ రావడం ఓ పక్క ఆనందం... మరో పక్క భయం. అందుకే ఒళ్లు దగ్గరపెట్టుకుని కథ చేసుకుంటున్నాడు. ‘గోదావరి’... తనకు ఇష్టమైన కథ. ఎప్పుడో 33 ఏళ్ల క్రితం బాపు తీసిన ‘అందాల రాముడు’లా గోదావరి జర్నీ నేపథ్యంలో కథ. పోలికలు పెట్టినా ఫర్లేదు. ఈ జర్నీ మిస్ కాకూడదు. ఎప్పుడో తాను టెన్త్ క్లాసులో టీవీలో చూసిన ‘అందాల రాముడు’ ఇప్పటికీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ గుర్తుంది. తన సినిమా కూడా అలానే గుర్తుండిపోవాలి. ‘ఆనంద్’ లాగానే జీవితానికి దగ్గరగా ఉండాలి. నో అతిశయోక్తులు... నో అభూత కల్పనలు... కథ విషయంలో కిందా మీదా పడుతున్నాడు శేఖర్. ఇందులో హీరో పాత్రకు రాజకీయాలంటే ఇష్టం. దాన్నో వృత్తిగా స్వీకరించాలనుకుంటా డతను. ఈ పాత్ర కోసం శేఖర్ కొంత రీసెర్చ్ చేశాడు. తన టీమ్ మెంబర్స్‌ని చాలా పొలిటికల్ పార్టీ ఆఫీసులకి పంపించాడు. దాదాపుగా కథ ఓ కొలిక్కి వచ్చింది. వాళ్ల బావ రాసిన ఓ షార్ట్ స్టోరీ ఇన్స్పిరేషన్తో శేఖర్ చిలక జ్యోతిషం సీన్ క్రియేట్ చేశాడు. కుక్క పాత్ర కూడా అంతే. ఓ జర్నలిస్ట్ రాసిన షార్ట్ స్టోరీ దానికి ఇన్స్పిరేషన్. శేఖర్ కజిన్ సిస్టర్ తన కుక్కకు కోటేశ్వరరావు అని పేరు పెట్టుకుంది. అది గుర్తొచ్చి, ఇందులో కుక్కకి కొంచెం మాస్‌గా ‘కోటిగాడు’ అని పేరుపెట్టాడు. ఫైనల్‌గా స్క్రిప్ట్ లాక్ చేశాడు శేఖర్ కమ్ముల. చాలామంది ప్రొడ్యూసర్లొచ్చారు - ‘‘ఆనంద్’ లాంటి సినిమా తీసిపెట్టమని’’. ఒక్క జీవీజీ రాజు మాత్రం ‘‘మీకు నచ్చిన సినిమా తీయండి’’ అన్నాడు. ‘తొలిప్రేమ’ తీసిన నిర్మాత. ఫ్రీడమ్ ఇచ్చే నిర్మాత. శేఖర్‌కు ఓకే. స్క్రిప్ట్ తీసుకుని ఫిలిమ్ నగర్ మీద పడ్డాడు. పవన్ కల్యాణ్... మహేశ్‌బాబు... గోపీచంద్... ఎవ్వరూ ఖాళీగా లేరు. మరి ఈ ‘గోదావరి’ని ఈదే హీరో ఎవరు? ఇంకెవరు ‘అందాల రాముడి’ మనవడే. గుడ్ ఐడియా. సుమంత్ డేట్స్ ఓకే. ఇప్పుడు హీరోయిన్ కావాలి. మోడ్రన్‌గా కనబడాలి. ట్రెడిషనల్‌గా ఉండాలి. గూగుల్ సెర్చ్ చేసినట్టుగా చాలామందిని వెతికాడు శేఖర్. ‘‘ఎందుకండీ... మీ ‘ఆనంద్’ హీరోయిన్ ఉంది కదా!’’ అందరిదీ ఇదే సలహా. శేఖర్‌కి తప్పలేదు. కమలిని వచ్చింది. కొంటెగా నవ్వింది. ‘‘నేను చెప్పానా! ఆ క్యారెక్టర్ నా కోసమే పుట్టిందని!’’. ఓ పక్క మ్యూజిక్ సిట్టింగ్స్... మరో పక్క లొకేషన్స్ సెర్చింగ్... ‘ఆనంద్’కి మెయిన్ పిల్లర్స్ రైటర్స్ వేటూరి, మ్యూజిక్ డెరైక్టర్ కె.ఎం. రాధాకృష్ణన్. దీనికీ అంతే. పెద్దాయన వేటూరి, శేఖర్ బాగా క్లోజ్ అయి పోయారు... ఫ్రెండ్స్ అయిపోయారు. ‘గోదావరి’ కథంతా చెప్పి, ‘‘ఏ పాట ఎలా రాస్తారో మీ ఇష్టం సార్’’ అన్నాడు శేఖర్. వేటూరి ఉప్పొంగిపోయారు. ఈ రోజుల్లో ఇలా అడిగేవాళ్లు ఎక్కడున్నారు? ఎప్పుడు రాశారో ఎలా రాశారో కానీ... ఆరు పాటలూ చిటికలో రెడీ. చాలా రోజులైంది... వేటూరి ఇంత వేగంగా రాసి! చాలా రోజులైంది... వేటూరి ఇంత పొయిట్రీ రాసి!! శేఖర్ కమ్ముల, కెమెరామేన్ విజయ్.సి.కుమార్, ఆర్ట్ డెరైక్టర్ కిశోర్ కలసి రాజమండ్రి వెళ్లారు. అక్కణ్నించీ లాంచీ వేసుకుని పాపి కొండలు, భద్రాచలం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రెక్కీ చేశారు. ఎక్కడెక్కడ షూటింగ్ చేయొచ్చు, యూనిట్ ఎక్కడ స్టే చేయాలి... ఇలా పేద్దదే డిస్కషన్. రెండు లాంచీలు... 12 బోట్లు... 200 మంది యూనిట్ సభ్యులు... గోదావరిలో షూటింగ్ స్టార్ట్. గోదావరి తీరంలో సింగన్నపల్లి దగ్గర బస. తిండి, నిద్ర- అంతా అక్కడే. పొద్దున మూడింటికి లేస్తే, రాత్రి పదయ్యేది పడుకునేసరికి. మధ్యమధ్యలో వర్షాలు. అవుట్డోర్ యూనిట్‌కైతే ఒళ్ళు పులిసిపోయేది. షూటింగ్ ఎక్విప్మెంట్ నీళ్లలో తడవకుండా జాగ్రత్తగా చూసుకోవడం ఇంకో రిస్కు. అర్ధరాత్రి 2 గంటలకు గోదావరి మధ్యలో షూటింగ్... అలాంటి టైమ్‌లో శేఖర్ మొబైల్ ఫోన్‌కి కాల్ వచ్చింది. కంగారుగా తీసి చూస్తే, కమలినీ మదర్ అండ్ ఫాదర్. ‘‘మా అమ్మాయికి చెత్త రూమ్ ఇచ్చారంట? అసలు ఇంత రాత్రివేళ ఇంతమందితో షూట్ చేస్తున్నారు. సెక్యూరిటీ ఏది? ప్రొటెక్షన్ ఏది? లైఫ్ జాకెట్స్ ఏవి? ఏమైనా జరిగితే...’’ అంటూ నాన్‌స్టాప్‌గా క్లాస్ పీకేశారిద్దరూ. శేఖర్‌కి కాసేపు ఏం అర్థం కాలేదు. తర్వాత పేరెంట్స్‌గా వాళ్ల టెన్షన్‌ని అర్థం చేసుకున్నాడు. ‘‘ఇదేమన్నా టైటానిక్ షిప్పా. అన్ని జాగ్రత్తలూ తీసుకోవడానికి’’ అంటూ కమలినిని ఆటపట్టించాడు శేఖర్. ‘‘అందంగా లేనా? అసలేం బాలేనా?’’... పాట సినిమాలో చాలా ఇంపార్టెంట్. కొంచెం గ్లామరస్‌గా తీయాలి. శేఖర్ ఎలా తీస్తాడా అని అందరూ ఫుల్ వెయిటింగ్. పాపం... నిజంగానే శేఖర్ చాలా కష్టపడ్డాడు - ఈ పాట తీయడానికి. ఎక్కడా అతి లేకుండా... మితిమీరకుండా గ్లామరస్‌గానే తీయగలిగాడు. కుక్క కావాలి. అవును. ఈ సినిమాలో కుక్కది ఇంపార్టెంట్ రోల్. కానీ జంతువులతో షూటింగ్ చేయాలంటే బోలెడన్ని రిస్ట్రిక్షన్స్. అందుకే శేఖర్ తెలివిగా యానిమేటెడ్ డాగ్‌ని క్రియేట్ చేయించాడు. అలీతోనో, వేణుమాధవ్ తోనో డబ్బింగ్ చెప్పిస్తే కుక్క పాత్ర హిట్టయిపోతుంది. ఇక్కడ శేఖర్ ప్లాన్ వర్కవుట్ కాలేదు. మరి కుక్కకు డబ్బింగ్ ఎలా? ఫైనల్‌గా తనే రంగంలోకి దిగాడు. తనే కుక్కకు డబ్బింగ్ చెప్పాడు. 100 రోజులు షూటింగ్. స్మూత్‌గానే అయిపోయింది. కానీ బడ్జెట్ గోదావరిలో తడిసి మోపెడయ్యింది. ఫోర్ క్రోర్స్ అనుకుంటే, సెవెన్ క్రోర్స్ అయ్యింది. శేఖర్ రెమ్యూనరేషన్ తీసుకోకూడదని డిసైడైపోయాడు. సినిమా చూసి ప్రేక్షకులు... సినిమా తీసి నిర్మాత హ్యాపీ ఫీలవ్వాలి. ఇదే శేఖర్ స్ట్రాటజీ. 2006 మే 19... ‘ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది’... అంటూ ‘గోదావరి’ సినిమా రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర సముద్రమంత సందడి చేయకపోయినా, ‘గోదావరి’ గలగలా పారింది. ‘అందాల రాముడు’ రాసిన ముళ్లపూడి వెంకటరమణ ఈ సినిమా చూసి ఒకటే మాట అన్నారు - ‘ సినిమా హాయిగా ఉంది’. శేఖర్‌కి ఇంతకు మించిన హాయైన మాట ఏముంటుంది! - పులగం చిన్నారాయణ -
నీ స్నేహం ఇకరాను అని...
సినిమా వెనుక స్టోరీ - 6 ‘‘నేనండీ... ఎమ్మెస్ రాజుని. ఓసారి ఆఫీసుకి రాగలరా?’’... వీఎన్ ఆదిత్య హాస్పిటల్కెళ్లే హడావిడిలో ఉన్నాడు. అపాయింట్మెంట్ టైమ్‌కి వెళ్లకపోతే డాక్టర్ డీబీఎన్ మూర్తి తిడతారు. అందుకే హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న హాస్పిటల్‌కు వెళ్ళడానికి ఆదరాబాదరాగా రెడీ అవుతున్నాడు. ఆ టైమ్‌లోనే ఈ ఫోన్. ‘‘అర్జంట్ హాస్పిటల్ పనుంది. నేను మళ్లీ చేస్తానండీ’’ అని ఫోన్ పెట్టేశాడు ఆదిత్య.డాక్టర్ని కలిసి వచ్చేసరికి బాగా లేటయిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది ఎమ్మెస్ రాజు ఫోను. ఎంత ఆలోచించినా ఆయనెవరో గుర్తుకురావడం లేదు. సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీసులో తెలిసిన ఆపరేటర్ ఉంటే, అతన్నడిగాడు. ‘‘అదేంటీ... రాజుగారు తెలియదా? ‘దేవి, దేవీపుత్రుడు’ సినిమాలు తీసిన హనీబాబు ఆయనే కదా!’’ అని చెప్పాడతను. ఆదిత్య తెగ ఫీలైపోయాడు. ‘‘అరే... అంత పెద్దాయన ఫోన్ చేస్తే గుర్తుపట్టలేక పోయానే! హనీబాబుగా గుర్తుపెట్టుకుని అసలు పేరు మరిచిపోయానే...’’ అని బాధపడిపోయాడు. అయినా... ఆయన నాకెందుకు ఫోన్ చేసుంటారు? ఆదిత్య రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. అక్కడ ఎమ్మెస్ రాజు కూడా ఆలోచిస్తున్నారు. ‘దేవీపుత్రుడు’ సినిమా ఫలితం... ఆయన్ని బాగా కుదిపేసింది. ఈసారి ట్రెండు మార్చాలి... రూట్ మార్చాలి... కొత్త దర్శకుడితో క్యూట్ లవ్‌స్టోరీ తీయాలి. ఎమ్మెస్ రాజుకి రాత్రింబవళ్లూ ఇదే ఆలోచన. కెమెరామ్యాన్ ఎస్. గోపాలరెడ్డి ఆయనకు క్లోజ్ ఫ్రెండ్. అన్ని విషయాలూ ఇద్దరూ షేర్ చేసుకుంటారు. గోపాలరెడ్డి దగ్గర ఇదే టాపిక్ వచ్చింది. ‘‘మీక్కావల్సింది చాకు లాంటి కొత్త డెరైక్టరేగా? వీఎన్ ఆదిత్య అని సింగీతం, జయంత్ సి. పారాన్జీల దగ్గర పని చేశాడు. ఆదిత్య మీకు సెట్ అవుతాడు’’ అని ఆదిత్య ఫోన్ నెంబరిచ్చారు గోపాలరెడ్డి. ఎమ్మెస్ రాజు వెంటనే ఆదిత్యకు ఫోన్ కొట్టారు. అప్పుడే అతను డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పింది. సరే... నెక్ట్స్ డే చేస్తాడేమోనని ఎమ్మెస్ రాజు వెయిట్ చేశారు. నో రెస్పాన్స్. మర్చిపోయాడా? భయపడ్డాడా? ఆదిత్యకు మళ్లీ కాల్ చేశారు ఎమ్మెస్ రాజు. ‘‘సారీ సార్... అర్జంట్‌గా రాజమండ్రి వెళ్తున్నా. అక్కడ టెంపుల్లో పూజ చేయించడానికి వెళ్తున్నా’’ చెప్పాడు ఆదిత్య. ‘‘వెరీ గుడ్. వచ్చాక కలవండి’’ అన్నారు ఎమ్మెస్ రాజు. వారం గడిచినా ఆదిత్య నుంచి కాల్ రాలేదు. ‘మంచి కుర్రాడని చెప్పారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడేంటి?’ ఎమ్మెస్ రాజుకి కోపం వచ్చింది. ఫైనల్ కాల్. వస్తే వచ్చాడు. లేకపోతే కట్. సుమంత్ ఆర్ట్స్ ఆఫీస్. ఎమ్మెస్ రాజు ముందు బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు ఆదిత్య. ‘‘సారీ సార్! నాతో మీరు సినిమా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కోడి రామకృష్ణగారు ఉండగా నన్నెందుకు పిలుస్తారనుకున్నా. అందుకే కలవడానికి ఇబ్బంది పడ్డా. క్షమించండి.’’ ఎమ్మెస్ రాజు చాలా ప్రశాంతంగా ఆదిత్య మాటలు వింటున్నారు. ‘‘సార్! మీరు పెద్ద ప్రొడ్యూసరు. నేను కొత్తవాణ్ణి. లవ్‌స్టోరీతోనే కెరీర్ స్టార్ట్ చేద్దామను కుంటున్నవాణ్ణి. మీరింతవరకూ లవ్‌స్టోరీ తీయలేదు. నా కథను ఎలా జడ్జ్ చేయగలరు?’’ అని కాస్తంత ధైర్యం కూడ దీసుకుని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశాడు ఆదిత్య. ‘‘గుడ్ క్వశ్చన్. ఓ పది రోజులు ఆఫీసుకి రా! ఇద్దరం సరదాగా డిస్కస్ చేసుకుందాం. ట్యూనింగ్ కుదిరితేనే కలిసి పని చేద్దాం’’ అన్నారు ఎమ్మెస్ రాజు. ఆదిత్య షాకైపోయాడు. అంత పెద్ద ప్రొడ్యూసర్ తనలాంటి కొత్త కుర్రాణ్ణి ఇంతలా ఆదరిస్తారని కలలో కూడా ఊహించలేదు. రోజూ ఆఫీసుకొస్తున్నాడు ఆదిత్య. ఓ రోజు ఎమ్మెస్ రాజు ‘‘నీకు రెండు స్టోరీ ఐడియాలు చెబుతా. ఏది నచ్చితే దాంతోనే సినిమా చేద్దాం’’ అన్నారు. ఎమ్మెస్ రాజు ఫస్ట్ ఐడియా చెప్పారు. ‘‘ఇదేంటి సార్... ఇది ‘ప్రేమించుకుందాం రా’ కథలా ఉంది. ఆ సినిమాకి నేను అసోసియేట్ డెరైక్టర్ని. మళ్లీ అదే కథతో ఎలా సినిమా చేస్తాం?’’ అనడిగేశాడు ఆదిత్య. ఎమ్మెస్ రాజు నవ్వుతూ ‘‘గుడ్... డెరైక్షన్ ఆఫరివ్వగానే ఏది పడితే అది చేసేస్తావా, లేక ఆలోచిస్తావా అని టెస్ట్ చేశానంతే’’ అన్నారు. ఇప్పుడు రెండో ఐడియా చెప్పారు. ఆదిత్యకు నచ్చేసింది. వర్క్ మొదలైంది. హిందీలో వచ్చిన ‘అన్మోల్ ఘడీ’ (1946) సినిమా ఇన్స్పిరేషన్తో కొంతవరకూ కథను తీర్చిదిద్దారు. యాంటిక్ వాచ్ బహుమతిగా ఇవ్వడం, తన ప్రేమకథనే నవలగా రాయడం లాంటి కొన్ని సీన్స్ అలానే డెవలప్ అయ్యాయి. దర్శక - రచయిత కె. భాగ్యరాజా తీసిన ‘డార్లింగ్... డార్లింగ్’ సినిమా కూడా కొంచెం అదే తరహాలో ఉంటుంది. ఆ సినిమా ప్యాట్రన్‌లో చైల్డ్‌హుడ్ నుంచి లవ్‌స్టోరీ మొదలుపెట్టాలని ఆదిత్య కోరిక. అలాగే ‘అప్పు చేసి పప్పు కూడు’లో రేలంగి పాత్ర అంటే ఆదిత్యకు చాలా ఇష్టం. ఆ ఇన్స్పిరేషన్తో హీరో ఫ్రెండ్ కేరెక్టర్ని డిజైన్ చేశారు. ఇలా ఎమ్మెస్ రాజు, ఆదిత్య కలిసి స్క్రిప్టు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ రోజు ఎమ్మెస్ రాజుకి ఓ సీన్ వినిపించాడు ఆదిత్య. సముద్రపు ఒడ్డున భోరున వర్షం. హీరో ఏడుస్తూ ఉంటే, అతని ఫ్రెండ్ వచ్చి ఓ డైలాగ్ చెబుతాడు. ‘‘ఒరేయ్! వర్షం కూడా అప్పుడప్పుడూ మనకు మేలు చేస్తుందిరా! మన కన్నీళ్లను ఎదుటివాళ్లకు కనబడకుండా దాచేస్తుంది.’’ ఈ డైలాగ్‌కి ఎమ్మెస్ రాజు మనసు చెమర్చింది. వెంటనే చెక్‌బుక్ తీసి పాతికవేలకు చెక్ రాసిచ్చేశారు. నెక్ట్స్ డే అనౌన్స్మెంట్. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు, కొత్త కుర్రాడు వి.ఎన్.ఆదిత్యకు డెరైక్షన్ ఛాన్స్ ఇస్తూ చేస్తున్న సినిమా... ‘మనసంతా నువ్వే’. ఆ టైటిల్ కూడా ఎమ్మెస్ రాజు పెట్టిందే. ‘మనసంతా నువ్వే’ని మహేశ్‌బాబుతో చేస్తే? ఎమ్మెస్ రాజుకి ఎగ్జయిటింగ్‌గా ఉందీ ఐడియా. కానీ ఆదిత్య ఏమో కొత్తవాడైతే కరెక్ట్ అంటాడు. ఇప్పటికిప్పుడు కొత్త హీరో ఎక్కడ దొరుకుతాడు? ఆదిత్య దగ్గర ఆప్షన్ ఉంది. ‘చిత్రం’ హీరో ఉదయ్‌కిరణ్. ఇప్పుడు ‘నువ్వు-నేను’ చేస్తున్నాడు. వెంటనే ఎమ్మెస్ రాజు ‘నువ్వు-నేను’ రష్ చూడ్డానికెళ్లారు. ఆ రష్ చూసీ చూడగానే ఈ సినిమాకు ఉదయ్‌కిరణ్‌ను ఫిక్స్ చేసేశారు. ఫైనల్‌గా స్క్రిప్ట్ పరుచూరి బ్రదర్స్ దగ్గరకు వెళ్లింది. ఇక్కడే అసలు బాంబు పేలింది. కథ బాలేదన్నారు పరుచూరి గోపాలకృష్ణ. సెకండాఫ్ సరిగ్గా లేదు... చైల్డ్ ఎపిసోడ్ అంతసేపు వేస్టు... ఇలా ఒక్కోటీ చెబుతుంటే ఆదిత్య గుండె జారిపోయింది. షూటింగ్కెళ్లే టైమ్‌లో... బ్లాస్ట్. అరకులోయలో ఓ గెస్ట్‌హౌస్. టెన్ డేస్ సిట్టింగ్స్. పరుచూరి బ్రదర్స్... ఎమ్మెస్ రాజు... వీఎన్ ఆదిత్య... వీరూ పోట్ల... స్క్రిప్టు విషయంలో కిందా మీదా పడుతున్నారు. స్క్రీన్‌ప్లే ఆర్డర్ మారింది. కథ కొత్త మలుపులు తిరుగుతోంది. హమ్మయ్య... మొత్తానికి కథ పర్ఫెక్ట్లీ ఆల్రైట్. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డెరైక్టర్. ట్యూన్స్ విరగ్గొట్టేస్తున్నాడు. యాంటిక్ వాచ్ సౌండ్ కోసమైతే ఆర్పీ చాలా కష్టపడ్డాడు. మలయాళంలో విద్యాసాగర్ ‘ప్రణయ వర్ణంగల్’ (1998) కోసం ‘కన్నాడి కూడుంకూట్టి’ పాట చేశాడు. అది సూపర్ డూపర్ హిట్. దాన్ని యథాతథంగా వాడితే సిట్యుయేషన్ అదిరిపోతుంది. ఇక్కడ అదే ‘తూనీగ... తూనీగ...’ పాట అయ్యింది. 95 పర్సంట్ షూటింగ్ ఓవర్. ఓన్లీ 5 పర్సంట్ బ్యాలెన్స్. అమీర్‌పేట - చర్మాస్ షోరూమ్‌లో హాఫ్ డే షూటింగ్. రీమాసేన్ బట్టలు కొనుక్కోవడానికి వచ్చే సీన్ తీయాలి. లైటింగ్ రెడీ అవుతోంది. ఇంకాసేపట్లో సీన్ తీయాలి. చిత్రనిర్మాణంలో ప్రతి చిన్న అంశాన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే ఎమ్మెస్ రాజుకు సడెన్‌గా డౌటొచ్చింది. ఈ సీన్ బట్టల షాపులో కంటే బుక్‌షాప్‌లో తీస్తే బెటరేమో! చిన్నపాటి డిస్కషన్. షూటింగ్ ఆగింది. ఆదిత్య హర్టయిపోయాడు. అలాగే నడుచుకుంటూ బయటికొచ్చేశాడు. కృష్ణానగర్ దాకా వెళ్లాడు. ఏవేవో ఆలోచనలు. ఇప్పటికే షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. ఇప్పుడీ కోపం వల్ల మొత్తం ప్రాజెక్ట్ డామేజ్ అవుతుంది. అదేదో వాళ్లను కన్విన్స్ చేసుకుంటే బెటర్ కదా! ఆదిత్య మళ్లీ వెనక్కు తిరిగొచ్చేశాడు. లొకేషన్లో అందరూ ఆదిత్య కోసం వెతుకుతున్నారు. అప్పటికే పరుచూరి వెంకటేశ్వరరావు వచ్చి చెప్పడంతో ఎమ్మెస్ రాజు కన్విన్స్ అయ్యారట. అంతా ఓకే... రామానాయుడు స్టూడియో... ఆవిడ్ ఎడిటింగ్ రూమ్‌లో రష్ చూస్తున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. ఎమ్మెస్ రాజు, పరుచూరి గోపాలకృష్ణ, ఎస్. గోపాలరెడ్డి... ముగ్గురూ పక్కకెళ్లి సీరియస్ డిస్కషన్. ఆదిత్యకు ఏమీ అర్థం కావడం లేదు. క్లైమాక్స్ తేడా కొట్టేసింది... సినిమా కష్టం... పరుచూరి గోపాలకృష్ణ జడ్జిమెంట్ చెప్పేశారు. ఇదంతా ఎడిటర్ కె.వి. కృష్ణారెడ్డి అబ్జర్వ్ చేస్తున్నాడు. అతను వీళ్ల దగ్గరకొచ్చి ‘‘ఒక్కసారి మళ్లీ క్లైమాక్స్ చూడండి... ఎడిటింగ్‌లో చిన్న ఛేంజ్ చేశాను’’ అన్నాడు. వీళ్లు నిర్లిప్తంగానే లోపలికెళ్లారు. కాసేపటికి బయటికొచ్చిన గోపాలకృష్ణ, ఆదిత్య దగ్గరకొచ్చి ‘‘అదిరిపోయింది’’ అంటూ హగ్ చేసుకున్నాడు. ఎడిటింగ్ మేజిక్. ఫస్ట్ హాఫ్‌లోని ‘నీ స్నేహం’ పాటను మళ్లీ క్లైమాక్స్‌లో యాడ్ చేసేసరికి, ఎక్కడలేని డెప్త్ వచ్చేసింది. 2001 అక్టోబర్ 19. ఎమ్మెస్ రాజు నిర్మాతగా కొత్త ట్రెండ్ సృష్టించిన రోజు... వీఎన్ ఆదిత్య లైఫ్ టర్న్ అయిన రోజు... ఉదయ్కిరణ్కి హ్యాట్రిక్ (‘చిత్రం’, ‘నువ్వు - నేను’, ‘మనసంతా నువ్వే’) పూర్తయిన రోజు... ఎక్కడ చూసినా ‘మనసంతా నువ్వే’ టాపిక్కే. బాక్సాఫీసంతా కనక వర్షమే! - పులగం చిన్నారాయణ -
అక్రమాలను కాలరాసిన ఉక్కుపాదం ఠాగూర్
చెన్నైలో ప్రొడ్యూసర్ ‘ఆస్కార్’ రవిచంద్రన్ ఆఫీస్‌లో ఏసీ బాగా పనిచేస్తోంది. అందుకే చాలా కూల్‌గా ఉంది. రవిచంద్రన్‌తో పాటు మధుసూదన్‌రెడ్డి కూర్చుని ఉన్నారు. ఇద్దరికీ సినిమాలంటే పిచ్చి. ‘‘ఒక డెరైక్టరొస్తున్నాడు. కథ చెబుతాడు. నువ్వు కూడా సరదాగా విను’’ అన్నారు ‘ఆస్కార్’ రవిచంద్రన్. సరే అన్నారు మధు. చాలా సేపటి తర్వాత ఓ చిన్న కుర్రాడొచ్చి కూర్చున్నాడు. రవిచంద్రన్, అతను ఏదో మాట్లాడుకుంటున్నారు. ‘‘ఇంకా డెరైక్టర్ రాలేదేమిటి?’’ మధులో విసుగు. ‘‘మధూ... కథ విందామా?’’ అని రవిచంద్రన్ అనేసరికి మధు ఉలిక్కిపడ్డాడు. అరె... పొరపాటు పడ్డానే. ఈ కుర్రాడే డెరైక్టరా...! ఇంతకుముందు అజిత్‌తో ఓ సినిమా తీశాడట. సోసోగా ఆడిందట. ఇది విజయకాంత్ కోసం చేసిన కథ. అతను కథ చెప్పడం మొదలెట్టాడు. పిన్‌డ్రాప్ సెలైన్స్. ఏసీ మెషీన్ చప్పుడొక్కటే వినిపిస్తోంది. మధు ఈ లోకంలో లేడు. ఈ కథలో హీరోగా ఆయన చిరంజీవిని ఊహించుకుంటున్నారు. ఆయనకు టోటల్ పిక్చర్ కనబడుతోంది. కథ చెప్పడం పూర్తి కాగానే వారిద్దరూ అతన్ని హగ్ చేసుకున్నారు. ఆ కుర్రాడు... ఏ.ఆర్. మురుగదాస్. ఆ సినిమా... ‘రమణ’ (తమిళం). హైదరాబాద్ రాగానే మధు చేసిన మొదటి పని చిరంజీవిని కలవడం. రెండో పని అల్లు అరవింద్‌ని కలవడం. వాళ్లకు మధు చెప్పిందొక్కటే. ‘‘తమిళంలో మురుగదాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ కథ తెలుగులో చిరంజీవిగారికి యాప్ట్. డోంట్‌మిస్’’. రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. తమిళ సినిమా ‘రమణ’ సూపర్ హిట్. ఇప్పుడు టాలీవుడ్ దృష్టి అంతా ‘రమణ’ మీదే. ఎవరి ప్రయత్నాలు వాళ్లవి. హీరో రాజశేఖర్ కూడా రేసులో ఉన్నారు. చిరంజీవి స్పెషల్ షో వేయించుకుని చూశారు. బాగా నచ్చేసింది. ‘ఇంద్ర’ తర్వాత సినిమా అంటే ఇలానే ఉండాలి. దానికి తోడు తనకిది సిల్వర్ జూబ్లీ ఇయర్. స్పెషల్ సినిమా కావాలి. మధు రంగంలోకి దిగారు. రైట్స్ చేతికొచ్చేశాయి. చిరంజీవికి పరుచూరి బ్రదర్స్ అంటే గురి. వాళ్లకు చిరంజీవికి ఏం కావాలో తెలుసు. చిరంజీవిని ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో ఇంకా బాగా తెలుసు. ‘రమణ’ను వాళ్లు చిరంజీవికి అనుగుణంగా చెక్కుతున్నారు. కానీ చిక్కంతా డెరైక్టర్ దగ్గరే. మురుగదాస్‌తోనే డెరైక్ట్ చేయిస్తే? చిరంజీవి ఇమేజ్‌ని డీల్ చేయడం కష్టమేమో. ఒకవేళ చేసినా తెలుగు నేటివిటీ ప్రాబ్లమ్. ‘ఇంద్ర’ దర్శకుడు బి. గోపాల్... ఇంకా ఏవేవో ఆప్షన్లు. వినాయక్? ఎస్... మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు. దానికి తోడు చిరంజీవికి వీరాభిమాని. ‘దిల్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు వినాయక్. రాజా రవీంద్ర లొకేషన్‌కి వెళ్లి మరీ చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాడు. ‘రమణ’ చూశావా?’’ అడిగారు చిరంజీవి. ‘‘చూశాను సార్... చాలా బాగుంది. తెలుగులో మీరే చేయాలి’’ అంటూ చకచకా మార్పులు చెప్పేశాడు వినాయక్. ‘‘ఈ సినిమాకి నువ్వే డెరైక్టర్‌వి’’... చిరంజీవి అప్పటికప్పుడే అనౌన్స్ చేసేశారు. వినాయక్‌కి నోట మాట రాలేదు. ఎప్పటికైనా చిరంజీవిని డెరైక్ట్ చేయాలని ఓ ప్రొఫెసర్ కథ సిద్ధం చేసి పెట్టుకున్న వినాయక్‌కు గోల్డెన్ ఛాన్స్. మ్యూజిక్ డెరైక్టర్‌గా మణిశర్మ కన్ఫర్మ్. ఇక ఆస్థాన ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు ఎలానూ ఉన్నాడు. చిరంజీవి ఇంట్లో రోజూ మీటింగుల మీద మీటింగులు. ముందు సినిమా ‘ఇంద్ర’ బ్లాక్ బస్టర్. బాక్సాఫీస్ లెక్కలన్నీ డబుల్. బయ్యర్లు ఎంతకైనా కొనడానికి రెడీ. అందుకే కేర్‌ఫుల్‌గా ఉండాలి. చిరంజీవి టెన్షన్ దీని గురించే. ప్రొడ్యూసర్ మధుని పిలిచి ‘‘ఎక్కువ రేట్లకి అస్సలు అమ్మొద్దు. బడ్జెట్ కంట్రోల్లో ఉంచుకుని సినిమా చేద్దాం’’ అని చెప్పేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సెలక్షన్లో కూడా డిస్కషన్ల మీద డిస్కషన్లు. నందిని పాత్రకు ఫెమిలియర్ ఫేస్ కావాలి. మాధురీ దీక్షిత్ బెటరా? కానీ తను ప్రెగ్నెంట్. ఫైనల్‌గా జ్యోతిక వచ్చింది. దేవకి పాత్రకు శ్రీయ ఖరారు. గోపీ పాత్రను ఎవరితో చేయిద్దామా అని చర్చ జరుగుతుంటే, రాజా రవీంద్ర ‘‘దర్శకుడు వినాయకే బాగుంటాడు’’ అన్నాడు. చిరంజీవి వత్తాసు పలికారు. ‘ఇంద్ర’లో వీణ స్టెప్ అదుర్స్... ముఖ్యంగా పాటలన్నీ సూపర్‌హిట్. ఇందులో ఇంకా అదిరిపోవాలి. మణిశర్మ 62 ట్యూన్లు ఇచ్చాడు. అందులోంచి ది బెస్ట్ సెలక్ట్ చేశారు. చిరంజీవి సోలో సాంగ్ కోసం చంద్రబోస్ లిరిక్స్ రాస్తూనే ఉన్నాడు. ‘అంతకు మించి’ అంటున్నారు చిరంజీవి. సరిగ్గా అప్పుడే లారెన్స్ ఎంటరయ్యాడు. ఇందులో ఐదు పాటలకు అతనే కొరియోగ్రాఫర్. ‘‘అన్నయ్య కొడితే సిక్సే కొట్టాలి. పాట కూడా ఆ రేంజ్లో ఉండాలి’’ అన్నాడు. చంద్రబోస్‌కి పల్లవి వచ్చేసింది. ‘కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి...’ పాట రెడీ. ఓ సిట్యుయేషన్‌కి రక్తం మరిగేలా... వెంట్రుకలు నిక్కబొడుచుకొనేలా ఓ సాంగ్ కావాలి. అప్పుడే ‘మా టీవీ’లో చిరంజీవిపై ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌కి ‘రుద్రవీణ’ సినిమాలోని ‘నేను సైతం’ సాంగ్‌ని బ్యాక్‌డ్రాప్‌గా వాడారు. ఆ పాటే మళ్లీ వాడదామా? సరిగ్గా అదే టైమ్‌లో ఎస్పీ బాలసుబ్రమణ్యం టూ మంత్స్ ఫారిన్ ట్రిప్ వెళ్తున్నారని తెలిసింది. ముందు పాట పాడించేద్దాం. తర్వాత డెసిషన్ తీసుకుందామనుకున్నారు. సుద్దాల అశోక్‌తేజతో ‘నేను సైతం’ పాటను కొత్తగా రాయించి, ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాడించేశారు. టైటిల్ ఏం పెట్టాలి? ‘రమణ’ మరీ సాఫ్ట్‌గా ఉంది. కొంచెం పవర్‌ఫుల్‌గా ఉండాలి. పర్పస్‌ఫుల్‌గా ఉండాలి. ‘సూర్యం’ ఎలా ఉంటుంది? చిరంజీవికి ఇష్టమైన పేరు. ‘ఖైదీ’లో హీరో పేరు అదే. ఎక్కువమంది మొగ్గు చూపారు. కానీ అదే ఫైనల్ కాదు. పరుచూరి వెంకటేశ్వరరావు ‘ఠాగూర్’ అన్నారు. అందరూ డబుల్ ఓకే. షూటింగంతా హైదరాబాద్‌లోనే. సుమారు హండ్రడ్ వర్కింగ్‌డేస్. వినాయక్‌కి ఇష్టమైన హీరో, ఇష్టమైన కథ, ఇష్టమైన టీమ్... చెలరేగిపోతున్నాడు. డాక్యుమెంటరీ తీస్తున్నారనే సెటైర్లకు ఆన్సర్ చెప్పాలి. చిరంజీవి కెరీర్లో ఇది మెమరబుల్ అవుతుందని టీమ్ ఆశ.క్లైమాక్స్‌లో ఓ సీన్ భారీ జనం మధ్య భారీగా తీయాలి. చిరంజీవి రాజమండ్రిలో మదర్ థెరెసా విగ్రహావిష్కరణకు వెళ్తున్నారు. యూనిట్ కెమెరాలతో రెడీ. కానీ గోదావరి ఒడ్డున జనసముద్రం. చిరంజీవికి అడుగుపెట్టడానికే కష్టమైపోయింది. వీళ్ల ప్లాన్ ఫెయిల్. ఇంకెక్కడ తీయాలి? ‘‘తిరుపతిలో తీయండి. దగ్గరుండి ఏర్పాట్లన్నీ నేను చేస్తా’’ అని భరోసా ఇచ్చారు సీనియర్ నిర్మాత ఎన్.వి. ప్రసాద్. తిరుపతి ఆయన నేటివ్ ప్లేస్. ఎస్వీ యూనివర్సిటీలో పర్మిషన్ తీసుకున్నారు. కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టాలో ముందే ఫిక్స్. ఈసారి దెబ్బతినకూడదు. చిరంజీవిని చూడగానే జనాలు కంట్రోల్ తప్పారు. అయినా షాట్ బాగా వచ్చింది. ఛోటా క్రెడిట్ అది. క్లైమాక్స్ విషయంలో కొంత కన్ఫ్యూజన్. తమిళ వెర్షన్లో హీరో పాత్రను ఉరి తీస్తారు. ఇక్కడలా చేస్తే ఫ్యాన్స్ తట్టుకోలేరు. ఏం చేయాలి? మురుగదాస్ కూడా సిట్టింగ్స్కొచ్చాడు. రకరకాల డిస్కషన్స్. వినాయక్ అయితే తనకు తెలిసిన హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి దగ్గరికెళ్లి సలహా తీసుకొచ్చాడు. ఫైనల్‌గా హీరో పాత్రను బతికిద్దామని డిసైడ్ అయ్యారు. మొత్తానికి ఫైనల్ ప్రొడక్ట్ రెడీ. 2003 సెప్టెంబర్ 24. 605 థియేటర్లలో ‘ఠాగూర్’ భారీ రిలీజ్. ఫస్ట్ షో కే సినిమా రిజల్ట్ తెలిసిపోయింది. ఎక్కడ చూసినా ‘ఠాగూర్’ ప్రభంజనం. పవన్ కల్యాణ్ అయితే సినిమా చూసొచ్చి ‘‘అన్నయ్యా... నీ దగ్గర్నుంచీ ఇలాంటివే రావాలి’’ అన్నాడు ఉద్వేగంగా. ఆ రోజుల్లో 35 కోట్ల వరకూ కలెక్ట్ చేయడమంటే మాటలు కాదు. చిరంజీవి ఇమేజ్ డబుల్‌కి డబుల్. త్రిబుల్కి త్రిబుల్. పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా? అని పార్టీలు దడుచుకునేంత ఇమేజ్. ఎన్టీఆర్‌కి ‘సర్దార్ పాపారాయుడు’లాగా... చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి ‘ఠాగూర్’ సినిమానే ఇన్స్పిరేషన్. - పులగం చిన్నారాయణ హిట్ డైలాగ్స్ * తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట - క్షమించడం * ఆస్తుల కంటే, ఆప్తుల్ని సంపాదించుకున్నవాడే గొప్పవాడు * ఇంతవరకూ ప్రతీ నాయకుడూ పార్టీల్లోంచే పుట్టాడు... ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు * 28 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ఒక బిల్ గేట్స్ పుడితే, 102 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎందుకు బిల్ గేట్స్ పుట్టలేదు. లంచం వలన. ఇక్కడ ప్రతిభ ప్రజల్లోకి వెళ్లాలంటే లంచం కావాలి. అందుకే భారతదేశ మేధావులంతా విదేశాలకు వెళ్లిపోతున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్... ♦ శ్రీశ్రీ రచనను పల్లవిగా తీసుకుని సుద్దాల అశోక్‌తేజ రాసిన ‘నేను సైతం’ గీతానికి జాతీయ అవార్డు లభించింది. శ్రీశ్రీ (‘అల్లూరి సీతారామరాజు’లోని ‘తెలుగువీర లేవరా’ పాట), వేటూరి (‘మాతృదేవోభవ’ లోని ‘రాలిపోయె పూవా’) తర్వాత జాతీయ అవార్డు దక్కిన మూడో సినీకవి సుద్దాల. ♦ ‘ఠాగూర్’ హండ్రడ్ డేస్ ఫంక్షన్ గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్‌లు చీఫ్ గెస్ట్‌లు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియమ్లో 2004 జనవరి 14న ఫంక్షన్ చేయాలి. కానీ లాస్ట్ మినిట్‌లో పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో ఫంక్షన్ జరగలేదు. ♦ లియో ప్రాజెక్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించిన బి. మధుసూదనరెడ్డి ఆ తర్వాత ‘ఠాగూర్’ మధుగా పాపులరయ్యారు. ♦ ఇదే కథతో కన్నడంలో విష్ణువర్ధన్ ‘విష్ణుసేన’ (2005),హిందీలో అక్షయ్ కుమార్ ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ (2015) సినిమాలు చేశారు. ♦ ‘ఠాగూర్’కి సీక్వెల్ చేద్దామని మురుగదాస్, ‘ఠాగూర్’ మధు ప్లాన్ చేశారు. ‘స్టాలిన్’ తర్వాత ఈ కథపై కసరత్తు చేశారు. ‘ఎపీ అసెంబ్లీకి నలుగురు యువకులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం, వాళ్లు రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, దీని వెనుక ‘ఠాగూర్’ ఉండటం’ ఇదీ కథ. ఓ ఎమ్మెల్యే పాత్రను పవన్‌కల్యాణ్‌తో చేయించాలనుకున్నారు. ఎందుకనో కథ అక్కడికి ఆగింది. -
ఎంద చేట...
బొందితో స్వర్గానికి వెళ్లినవారి గురించి మనం పురాణాల్లో చదువుకున్నాం. కానీ, చేటతో స్టార్డమ్ తెచ్చుకున్న నటుడు గురించి మీకు తెలుసా? అయితే అర్జంటుగా మీకు మరోసారి ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ సినిమా చూపించాల్సిందే. ఛలో ఛలో... హిట్ క్యారెక్టర్ సినిమా పేరు: రాజేంద్రుడు-గజేంద్రుడు (1993) డెరైక్ట్ చేసింది: ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా తీసింది: కె. అచ్చిరెడ్డి మాటలు రాసింది: దివాకర్‌బాబు సీన్ నం.1 ‘‘నమష్కారం’’ ‘‘ఆ... నమస్కారం నమస్కారం’’ చెప్పాడు సూర్య బ్యాంకు మేనేజర్. ఆ నమష్కారం పెట్టినతను బక్కపలచగా ఉన్నాడు. తమాషాగా ఉన్నాడు... కొంటెగా ఉన్నాడు... చిత్రాతి చిత్రంగా ఉన్నాడు. పై నుంచి కింద వరకూ ప్యాంటూ చొక్కా అంతా గళ్లమయం. ‘నీకేం కావాలి బాబూ?’’ అడిగాడు బ్యాంకు మేనేజర్. ‘‘ఎంద చేట...ఎంద తూమారీ... జుంజుబిల సదస్సు నటశ్రీ బిల కాంభోజిని బిల సత్యాల కాదిని...హరిమిలై ఒరు కాట్రవల్లి కండో... కండీసరు కండెల్లు మనసిలాయ... చేట... ఒరు కారీమర... ఎంద కాట్రవల్లి కండ్రో... పల్లి... సుక్కుమరు సుర్ర... చేట... బజ్జల గూడో... చేట ఒరు కారుమిందలి... చేట... చేట... బెల్లం కుడికల్లి...’’ ఇలా ఆ కుర్రాడు ఏదో భాషలో చెప్పుకుంటూ పోతున్నాడు. బ్యాంకు మేనేజర్‌కి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. రోహిణికార్తె ఎండలో రోజంతా తిరిగినా వడదెబ్బ తగలనివాడు, ఈ చేట దెబ్బకు మాత్రం కుదేలైపోయాడు. కకావికలైపోయాడు. గ్లాసుడు మంచి నీళ్లు గటగటా తాగిపారేశాడు. ‘‘ఒరేయ్... నువ్వట్టా మాట్టాడమాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా? తమిళమా? మలయాళమా? పంజాబీనా? నాకర్థం కావడం లేదు. చేట అంటావు. బెల్లమంటావు... నీ అమ్మ కడుపు మాడా...’’ అంటూ తన టేబుల్ మీదున్న ఫైల్స్‌తో అతణ్ణి దబదబా బాది పంపించేశాడు. అమ్మయ్యా... సునామీ వెళ్లిపోయింది. సీన్ నం.2 ఆ రోడ్డులో తిరుగుతూ సబ్బులమ్ముకుంటున్నాడతను. ఈ రోజు ఈ సబ్బులన్నీ అమ్మేసి, తన మరదలితో పెళ్లి సంబంధం ఖాయం చేయించేసుకోవాలి. అదీ ప్లాను. ఇంతవరకూ ఒక్క సబ్బు సేల్ కాలేదు. ఎవడైనా బకరా దొరికితే బాగుణ్ణు. అబ్బ... దొరికేశాడు. సైకిల్ మీద వస్తున్నాడు. చిత్రవిచిత్రమైన గళ్ల డ్రెస్సు. అర్ధమైందిగా... అతనెవరో?! ఆ కుర్రాణ్ణి ఆపాడు. ‘‘సబ్బులు.. సువాసనల సబ్బులు... సినీతారలు వాడే సబ్బులు... ఒక సబ్బు కొంటే ఒక సబ్బు ఫ్రీ’’ అన్నాడు సబ్బులోడు. ఆ కుర్రాడు చాలా అమాయకంగా మొహం పెట్టి ‘‘ఎంద చేట’’ అన్నాడు. ఈ సబ్బులోడు వదిలిపెట్టేలా లేడు. ‘‘చేట కాదు సార్... సబ్బులు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వాడే సబ్బులు’’ చెప్పాడు గొప్పగా. దానికా కుర్రాడు ‘‘ఎంద చిరుయో... ఎంద బాలయో... ఎంద నాగయో... ఎంద వెంకియో... ఎంద పరంద చేట’’ అన్నాడు. ఈ సబ్బులోడికి తిక్క రేగింది. కాస్త గొంతు పెంచి ‘‘చేట కాదు సబ్బు... ఇది వాడితే గజ్జి, తామర, చిడుమూ, వంటినొప్పులు, పంటి నొప్పులు పోతాయి’’ అని చెప్పాడు. దానికా చేటగాడు ‘‘ఎంద గజ్జియో.. ఎంద తామరయో... ఎంద చుండ్రుయో... ఎంద పరింద చేట...’’ అన్నాడు. సబ్బులోడికి ఎక్కడో కాలింది. వీణ్ణి ఎలాగైనా ఓ పట్టు పట్టాలని డిసైడ్ అయిపోయాడు. ‘‘ఈ సబ్బు రాస్తే నలుపు పోతుంది. నాలా తెల్లగా తయారవుతావు’’ అని చెప్పాడు. ఆ చేటగాడు వెర్రి మొహం పెట్టి ఆ సబ్బు వంక, అతని కలర్ వంక కాసేపు చూశాడు. ‘‘ఎంద పరంద ఇంద ఫేసు’’ అని కోపంతో ఓ సబ్బు లాక్కుని నేలకేసి కొట్టాడు. ఆ సబ్బులోడిక్కూడా కోపం వచ్చినట్టుంది. తన దగ్గరున్న సబ్బుల్ని విసిరికొట్టాడు. మొత్తానికి సబ్బులన్నీ నేలపాలయ్యాయి. సీన్ నం. 3 బ్యాంకు మేనేజర్ ఇంట్లో చాలా బిజీగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎంటరయ్యాడు మన చేటగాడు. వెళ్లి నమష్కారం పెట్టి ‘‘ఎంద చేట’’ అన్నాడు. బ్యాంకులో ఒక్కసారిగా చెక్కులన్నీ బౌన్స్ అయినంతగా కంగారు పడిపోయాడు మేనేజర్. ‘‘నువ్వెక్కడ దాపురించావురా... నేనేం అపకారం చేశాన్రా’’ అంటూ అక్కడున్న కుర్చీ తీసుకుని చేటగాడికి ఒక్కటి తగిలించాడు. సీన్ నం. 4 బ్యాంకు మేనేజర్ దగ్గర మళ్లీ ప్రత్యక్షమయ్యాడు చేటగాడు. ఎలాగైనా ఈ రోజు ఈ చేట గురించి తేల్చేయాలని డిసైడైపోయాడు బ్యాంకు మేనేజర్. యాడ్స్ మధ్యలో సినిమాలాగా సబ్బులోడొచ్చాడు. ఈసారి అతని దగ్గర సబ్బుల్లేవు. పెన్నులున్నాయి. ఈ రోజు ఎలాగైనా పెన్నులమ్మేయాలని డిసైడ్ అయిపోయి మరీ వచ్చాడు. బ్యాంక్‌లో అయితే మొత్తం కొనేస్తాడని ఆశ. ‘‘వాడి దగ్గర చేట అంటే ఏంటో కనిపెడితే నీ పెన్నులన్నీ కొనేస్తా’’ ఆఫరిచ్చాడు బ్యాంకు మేనేజర్. పాళీ విరిగి ఇంకులో పడినంత ఆనందపడిపోయాడు పెన్నులోడు. కురుక్షేత్రం మొదలైంది. ఇటు చేటగాడు... అటు పెన్నులోడు. వాడు చేట అంటాడు. వీడు బుచికి బుచికీ అంటాడు. ఇద్దరూ ఎక్కడా తగ్గడం లేదు. పిచ్చి భాష... పిచ్చి పిచ్చి మాటలు... ఫైనల్‌గా పెన్నులోడు ‘‘పోలీసు బుచికీ’’ అనే మాట వాడాడు. పోలీసు మాట వినగానే చేటగాడికి కంగారు పుట్టింది. దడ పుట్టింది. బోల్డంత భయమేసేసింది. ‘‘నన్ను క్షమించండి సార్’’ అంటూ బ్యాంకు మేనేజర్ కాళ్లు పట్టుకున్నాడు. ‘‘తెలుగు రాదని చెప్పి నన్ను ఇన్నాళ్లూ హింసించావు కదరా’’ వాపోయాడు బ్యాంకు మేనేజర్. వాడు నసుగుతూ, నట్లు కొడుతూ అసలు విషయం చెప్పాడు. ‘‘నేను చేటల వ్యాపారం పెట్టుకుందామను కుంటున్నా. మీ బ్యాంకులో లోను ఇస్తారేమోనని... ఇలా వెంటపడుతున్నా...’’ ఇక బ్యాంకు మేనేజర్ ఫేసు చూడాలి. చేటంత ఫేసు చెల్లాచెదురై పోయింది. - పులగం చిన్నారాయణ ఈ చేట నా జీవితాన్నే మార్చేసింది! ‘‘నటునిగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయమది. సరిగ్గా ఆ టైమ్‌లోనే నాకో మంత్రపదం దొరికింది. అది నా జీవితాన్నే మార్చేసింది. ఆ పదమే ‘చేట’. అసలు ఈ పదం ఎలా పుట్టిందంటే... అప్పట్లో మద్రాసులో ఏమీ తోచక సినిమాలకు వెళ్లేవాణ్ణి. చివరకు మలయాళ సినిమాలు కూడా వదిలేవాణ్ణి కాదు. మమ్ముట్టి నటించిన ‘సీబీఐ డైరీ’ నాకు బాగా నచ్చేసింది. ఆ సినిమాలో సౌండ్స్ గుర్తు పెట్టుకుని పిచ్చి మలయాళం మాట్లాడేవాణ్ణి. మలయాళంలో ‘చేట’ అంటే ‘అన్న’ అని అర్థం. వైజాగ్‌లో ‘జంబలకిడి పంబ’ షూటింగ్లో సరదాగా ‘చేట’ అంటూ మాట్లాడుతుంటే, రచయిత దివాకర్‌బాబు ఆసక్తి కనబరిచారు. ఆయనే ఎస్వీ కృష్ణారెడ్డిగారికి చెబితే ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’లో ఈ పాత్ర సృష్టించారు. ఈ పాత్ర ఎంత పాపులరైందో, నాకెంత బ్రేకిచ్చిందో మీ అందరికీ తెలుసు.’’ - అలీ ఆ రెండు పాత్రల్ని బట్టి స్క్రిప్ట్ ప్లాన్ చేశాం! ‘‘మద్రాసులోని దేవర్ ఫిలిమ్స్ వాళ్ళ దగ్గర ఓ ఏనుగుపిల్ల ఉండేది. మావటివాడు ‘జూ... లగ’ అంటే, తల నిలువుగా ఊపడం, అడ్డంగా ఊపడం, కుంటడం లాంటి నాలుగు పనులు చేసేది. ఆ ఏనుగును చూసి, అది చేయగల పనులను బట్టి ఆ పాత్ర, అలీ మ్యానరిజమ్ చూసి ‘చేట’ పాత్ర - రెండూ అల్లుకొని, దాన్ని బట్టి సినిమా స్క్రిప్ట్ ప్లాన్ చేసుకున్నాం. ‘చేట’ డైలాగ్, ఆ పాత్ర అలీకి ఎంతటి స్టార్ స్టేటస్ తెచ్చాయంటే, చివరకు అలీని హీరోగా పెట్టి నేనే ‘యమలీల’ సినిమా చేశా. ఇవాళ్టికీ ‘చేట’ పాత్ర, ఆ సినిమా, ప్రతిభావంతుడైన అలీ గొప్ప ఆర్టిస్ట్‌గా ఎదిగిన తీరును చూస్తుంటే నాకెంతో ఆనందంగా, కించిత్ గర్వంగా ఉంటుంది.’’ - ఎస్.వి. కృష్ణారెడ్డి, డెరైక్టర్ -
పూరి Idea-4
ఇప్పటికి మీకు మూడు కథలు చెప్పాను. ఈరోజు మాత్రం కథ చెప్పడంలేదు. ఓ ఐడియా చెబుతాను. ఇది 2015 సంవత్సరం కదా! నెక్ట్స్ ఇయర్ ఏం జరుగుతుందో ఓసారి ఊహించండి. కొంచెం కష్టమే అయినా, చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది కదూ! అలా... పాతికేళ్ల తర్వాత అంటే 2040లో ఎలా ఉంటుందో ఊహించండి. 2040కి రోడ్లు ఎలా మారాయి... టెక్నాలజీ ఎంతలా డెవలప్ అయింది... జనాలు ఏం చేస్తుంటారు.. లాంటివేమీ చూపించనవసరం లేదు. 2040లో ఓ ఇంట్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్లు ఎలా మాట్లాడుకుంటారో నాకు కావాలి. ఎలా బిహేవ్ చేస్తారో నాకు కావాలి. ఈ వ్యవస్థలో ఎలాంటి మార్పులొచ్చాయి... పెళ్లిళ్లలో ఏవేం మార్పులొచ్చాయి... విధానాల్లో ఎటువంటి తేడాలొచ్చాయి. కొత్త దేవుళ్లు ఎవరైనా పుట్టుకొచ్చారా...! పాత దేవుళ్లలో ఎవరైనా తగ్గిపోయారా...! ఇవన్నీ డిస్కస్ చేసినా ఓకే.అయితే నాకు ప్రధానంగా కావలసింది... 2040లో మనుషులు ఎలా ఉంటారన్నదే! వాళ్ల కేరెక్టర్స్... వాళ్ల బిహేవియర్స్... వాళ్ల కాన్వర్జేషన్స్తో చక్కగా మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తే... నేను చూస్తా! ప్రెజెంటేషన్: పులగం చిన్నారాయణ పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్ స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!! ఈ పది రోజుల్లో... నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో మీరు ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి. మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే! నెల రోజులు టైం ఇస్తున్నాం. ఫిబ్రవరి 14 వేలంటైన్స్‌డే మీ ఎంట్రీలకు లాస్ట్ డే. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్‌ని directorsakshi@gmail.com కి పంపించండి. ఒక్కో కథకు ఒక్కో డైరెక్టర్ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్‌లో పెడతాం. దీంతో మీకు ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. ఎక్స్పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు. 10 డేస్...10 స్టోరీ ఐడియాస్ 10 మినిట్స్... నిన్న మూడో కథ చెప్పా. ఇవాళ నాలుగోది. ఇలా మొత్తం పది కథలు చెప్తా. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి. ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే ... నా బేనర్లో నేనే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానేమో! అయితే కొన్ని కండిషన్స్... చాలా తక్కువ ఖర్చుతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్లను డబ్బుల కోసం వేధించకూడదు. అసలు మీ సొంత డబ్బు వాడకూడదు. ఎవరో ఒకర్ని కన్విన్స్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసమే ఒకరిని కన్విన్స్ చేయలేనివాళ్లు జీవితంలో డైరెక్టర్ కాలేరు. రేపు సినిమా తీయడానికి ఏ నిర్మాతను ఒప్పించగలరు? అర్థమైందిగా.. లాస్ట్ అండ్ ఫైనల్... మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలంటే, అది మీ జీవితాన్ని మార్చేసేలా ఉండాలి. గమనిక: నా జీవితం కూడా ఇలా షార్ట్ ఫిల్మ్‌లతోనే మొదలైంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. - పూరి జగన్నాథ్ బహుమతులు అందించేవారు.. -
ఆ మూడు కోరికలూ తీరకుండానే వెళ్లిపోయారు!
- నటుడు కాంతారావు భార్య హైమవతి హైదరాబాద్... నల్లకుంట కూరగాయల మార్కెట్ దాటి కొంచెం ముందుకెళ్తే ఎడమవైపున కార్తీక్ రెసిడెన్సీ. ఫస్ట్ ఫ్లోర్‌లోని ఆ ఫ్లాట్‌లోకి అడుగుపెడితే... ఎదురుగా చిన్న మంచం మీద కూర్చుని ఓ పెద్దావిడ ఓ పుస్తకంలో సాయికోటి రాసుకుంటూ కనిపించారు. ఆ పక్కనే టీవీలో ‘లవకుశ’ సినిమాలోని ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు...’ పాట వస్తోంది. ఆ పాటలో హీరో కాంతారావును చూడగానే ఆ పెద్దావిడ మొహం వెలిగిపోయింది. ఆమె కాంతారావు భార్య హైమవతి. 81 ఏళ్ల వయసులోనూ ఆమెకు గతమంతా స్పష్టంగా గుర్తుంది. ఆ స్టార్డమ్... లంకంత కొంప... కార్లు... నౌకర్లు... ఇలా అన్నీ ఆమెకు గుర్తున్నాయి. ఆమెకు గతం రాజభోగమైతే... వర్తమానం వనవాసం. స్వర్గమైనా.. నరకమైనా... అంతా లలాట లిఖితం అనుకునే స్థితప్రజ్ఞత ఆమెది. రాజభోగాన్ని ఎలా ఆస్వాదించారో... వనవాసాన్నీ ఆమె అలానే స్వీకరిస్తున్నారు. కాంతారావంటే కత్తి ఫైటింగులు గుర్తొస్తాయి. తెరపై శత్రువులతో, జీవితంలో సమస్యలతో కత్తి ఫైటింగ్ చేసిన వీరుడాయన. రాముడి వెంట లక్ష్మణుడిలా ప్రతి క్షణం ఆయన వెన్నంటే ఉన్నారామె. నేడు కాంతారావు 91వ జయంతి. ఈ సందర్భంగా భర్త గురించి హైమవతి హృదయావిష్కరణ... మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? హైమవతి: బాగానే ఉంది. ఒకవేళ బాగోకపోయినా బాగానే ఉందని మనసులో అనుకుని తిరుగుతూనే ఉంటాను. కాంతారావుగారు చనిపోయి అయిదేళ్ళపైనే అవుతోంది కదమ్మా! హైమవతి: 2009 మార్చి 22న వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇలా ఆయన జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నా. ప్రతి పురుషుడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుందంటారు. మరి కాంతారావు గారి విజయం వెనుక మీ పాత్ర ఎంత? హైమవతి: నా పాత్ర ఏముంటుంది! ఆయనకు అనుకూలంగా ఉండేదాన్ని. మామూలుగా హీరోలు తెరపై హీరోయిన్లతో సన్నిహితంగా మెలగాల్సి వస్తుంది. అవి చూసి నేనేమీ ఫీలయ్యేదాన్ని కాదు. అదంతా నటనలో ఓ భాగమని తెలుసు. ఇంటి పోరు లేకుండా ఉంటే మగాడు సగం విజయం సాధించినట్టేగా! వాళ్లతో అంత సన్నిహితంగా ఎందుకు నటించారని అడిగితే, వాళ్లకీ మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేకుండా వాళ్లు మాత్రం ఎలా యాక్ట్ చేయగలుగుతారు! ఏ విషయంలోనూ ఆయనతో మీకు అభిప్రాయ భేదాలు రాలేదా? హైమవతి: నేనెప్పుడూ ఏ విషయంలోనూ ఆయనతో పోట్లాట పెట్టుకోలేదు. అన్నీ సమకూరుస్తున్నప్పుడు అసంతృప్తులెందుకొస్తాయి? ఆయన హీరోగా సంపాదించిందంతా, నిర్మాతగా పోగొట్టినప్పుడు కూడా మీరేమీ అనలేదా? హైమవతి: నేనేమీ అనలేదు. కనీసం సలహాలు, సూచనలు కూడా ఇచ్చేవారు కాదా? హైమవతి: నేనేమిస్తానండీ.. ఆయనకన్నీ తెలుసు. పైగా మొండి మనిషి. చెప్పినా వినే రకం కాదు. అనుకున్నది చేసేసేవారంతే! ఆయనకు వంశ పారంపర్యంగా 500 ఎకరాల పొలం ఆస్తిగా వచ్చింది. చాలామటుకు దానధర్మాలు చేసేశారు. చివరికి మా పెళ్లి నాటికి 70 ఎకరాలు మిగిలింది. ఆ తర్వాత అదీ లేదు. సినిమాలు తీసి అప్పులపాలయ్యాం. ఆయనకు ఎవ్వరికీ బాకీ ఉండడం ఇష్టం ఉండదు. ఆస్తంతా అమ్మి, అప్పులు తీర్చేశారు. ఇంట్లో మీతో ఎలా ఉండేవారు? హైమవతి: మమ్మల్ని చక్కగా చూసుకునేవారు. ఇంటికి కావాల్సినవన్నీ సమకూర్చేవారు. నేను పూర్వజన్మలో బాగా పుణ్యం చేసుకోబట్టే, దేవుడు నాకంత మంచి భర్తనిచ్చాడు. బంధుమిత్రులను కూడా బాగా చూసుకునేవారు. ఇంటికొచ్చినవారిని భోజనం పెట్టకుండా పంపించేవారు కాదు. ఒకప్పుడు మా ఇంట్లో రోజుకి 18 మంది భోజనం చేసేవారు. ఇంట్లో నాలుగు కార్లు ఉండేవి. పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్లడానికి ఓ కారు, ఆయనకో కారు, నా కోసం ఓ కారు, ఒకటి గెస్ట్‌ల కోసం. మద్రాసులో మా ఇంటి పక్కనే గుడిసెలు ఉండేవి. వర్షం వస్తే వాళ్లకు మా ఇంట్లోనే ఆశ్రయం. వాళ్లింట్లో పెళ్లిళ్లయినా మా ఇంట్లోనే హడావిడి! మా అమ్మానాన్నలను కూడా బాగా చూసుకున్నారు. అమ్మ పక్షవాతం బారిన పడితే, మూడేళ్లు మా ఇంట్లోనే పెట్టుకుని కంటికి రెప్పలా చూశాం. నేనెప్పుడైనా అమ్మను విసుక్కుంటే, ఆయన నన్ను బాగా కోప్పడేవారు. ఇంతకూ మీరు కాంతారావుగారిని మొదట ఎప్పుడు చూశారు? హైమవతి: నిజామ్ ఏలుబడిలో రజాకార్ల దురాగతాలు సాగుతున్న సమయంలో నైజామ్ ప్రాంతం నుంచి చాలామంది ఆంధ్రాకు వలస వెళ్లిపోయారు. కాంతారావుగారూ అంతే. కోదాడ దగ్గరున్న గుడిబండ గ్రామం నుంచి జగ్గయ్యపేటకు వచ్చి, మా వీధిలోనే ఆయన కాపురం పెట్టారు. మా నాన్నగారు జాతకాలు చెప్పేవారు. ఒకసారి మా నాన్నగారి దగ్గరకు జాతకం చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు చూశానాయన్ని. ఆ తర్వాత ఆయన మొదటి భార్య సుశీల, పిల్లవాడు నాకు బాగా సన్నిహితమయ్యారు. కాంతారావుగారిని పెళ్లి చేసుకోమని మిమ్మల్ని సుశీలగారే అడిగారట కదా! హైమవతి: అవును. ఆవిడకు బాగా అనారోగ్యం. అప్పట్లో కొన్ని జబ్బులకు మందులుండేవి కావు. పిల్లాడు నాకు బాగా దగ్గరవ్వడంతో ఆవిడ ఆ నిర్ణయం తీసుకున్నారు. మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆవిడే ఒప్పించారు. 1950 మార్చి 1న మా పెళ్లి హైదరాబాద్‌లోని నల్లకుంట దగ్గర్లోని ఓ సత్రంలో జరిగింది. మా పెళ్లయిన కొన్ని రోజులకే ఆవిడ పైకి వెళ్లిపోయారు. ఆ తర్వాత పిల్లాడు కూడా అనారోగ్యంతో చనిపోయాడు. మీ పెళ్లయిన వెంటనే కాంతారావుగారు మద్రాసు వెళ్లిపోయినట్టున్నారు? హైమవతి: అవును. మొదట ‘నిర్దోషి’లో చిన్న వేషం వేసే అవకాశమిచ్చారు దర్శక - నిర్మాత హెచ్.ఎమ్. రెడ్డిగారు. తర్వాత ఆయనే ‘ప్రతిజ్ఞ’తో హీరోను చేశారు. కాంతారావు గారు సినిమా ఫీల్డ్కి వెళతానంటే మీరేమన్నారు? హైమవతి: నాకప్పట్లో ఏమీ తెలిసేది కాదు! ఆయనకు ఇష్టమైన పని ఆయన చేస్తున్నారని భావించేదాన్ని. ఆయనేం చేసినా నాకు ఇష్టంగానే అనిపించేది. భర్త అడుగుజాడల్లోనే నడవాలని మా పెద్దలు చెప్పారు. నేను చదివిన పుస్తకాల సారం కూడా అదే. మిమ్మల్ని షూటింగ్స్‌కి, ప్రివ్యూలకు తీసుకెళుండేవారా? హైమవతి: చాలాసార్లు! అవుడ్డోర్ షూటింగ్స్‌కి ఎక్కువ వెళ్లేదాన్ని. నాకు ఇంగ్లీషు రాదు. కొత్తవాళ్లతో మాట్లాడడం తెలిసేది కాదు. అక్కడ లొకేషన్లో ఎవరైనా, ఏదైనా అడిగితే చెప్పేదాన్ని. లేకపోతే కుర్చీలో కూర్చుని షూటింగు చూసేదాన్ని. సినిమా ఫీల్డ్‌లో మీకు సన్నిహితులు ఎవరూ లేరా? హైమవతి: ఎవ్వరూ లేరు. నేనెక్కడికీ వెళ్లేదాన్ని కాదు. అప్పుడప్పుడూ ఆయనతో కలిసి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వెళ్లేదాన్ని. కాంతారావుగారికి దర్శకుడు విఠలాచార్య ఎంత లైఫ్ ఇచ్చారో, అంత ఇబ్బంది పెట్టారటగా? హైమవతి: ఏమో..! అవన్నీ నాకు తెలియదు. నేను అడిగేదాన్ని కాదు. ఆయన చెప్పేవారు కాదు. పరిశ్రమలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వివక్ష గురించి కూడా ఆయన మీతో ప్రస్తావించేవారు కాదా? హైమవతి: ఏ కష్టమైనా ఆయన మనసులోనే పెట్టుకునేవారు. నాకు చెప్పేవారు కాదు. (కాంతారావుగారి మూడో అబ్బాయి రాజా, తల్లి పక్కనే కూర్చుని ఆసక్తిగా ఈ సంభాషణ గమనిస్తున్నారు. ఈ ప్రశ్నకు ఆయన కల్పించుకుని జవాబు చెప్పారు). రాజా: అప్పట్లో హీరోల మధ్య పోటీ ఎలా ఉండేదో నాన్న నాకు చెబుతుండేవారు. కులం, ప్రాంతం తాలూకు ప్రభావం ఎలా ఉంటుందో రకరకాల సంఘటనలు నాకు చెప్పారు. నాన్నకు లౌక్యం తెలియదు. పారితోషికంగా ఎవరు ఎంతిచ్చినా తీసుకునేవారు. పాత్ర ప్రాధాన్యం ఎలాంటిదో తెలుసుకోకుండానే, సినిమాలు ఒప్పేసుకునేవారు. దీనివల్ల చాలా ఎదురు దెబ్బలు కూడా తిన్నారు. పారితోషికాలు కూడా పెంచేవారు కాదు. ఎప్పుడూ ఒకటే రేటు. కొంతమంది నిర్మాతలైతే - ‘కాంతారావుకు ఇంతకు మించి ఇవ్వొద్ద’ని రేటు కూడా ఫిక్స్ చేసేశారు. అయినా కూడా నాన్న ఏమీ మాట్లాడేవారు కాదు! ఇంకొంతమంది డబ్బులు కూడా పూర్తిగా ఇచ్చేవారు కాదు. హీరోగా అన్ని సినిమాలు చేసి కూడా ఆయన ఆస్తులు కూడబెట్టుకోకపోవడానికి కారణం? హైమవతి: స్థలాలు కొనలేదు కానీ, మద్రాసులోని టి. నగర్లో పెద్ద ప్యాలెస్ లాంటి బంగ్లా కట్టించారు. ఆ ఇంటి గురించి అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు. చూడడానికి చాలామంది హీరోయిన్లు కూడా వచ్చారు. బాత్రూమే బెడ్రూమ్ సైజులో ఉండేది. అందులోనే వెరైటీగా మేకప్‌రూమ్ కూడా ఏర్పాటు చేయించారు. ఆ ఇంట్లో మేం 28 ఏళ్లు ఉన్నాం. మరి ఆ ఇల్లు ఏమైంది? హైమవతి: సినిమాలు తీసి అప్పులు పెరగడంతో 1987లో చాలా చౌకగా 13 లక్షలకు అమ్మేశాం. రెండేళ్ల తర్వాత అదే ఇల్లు కోటి రూపాయల రేటు పలికిందట. ఇప్పుడైతే ఎన్ని కోట్ల విలువ చేస్తుందో..! ఆ 13 లక్షల్లో కొంత అప్పు తీర్చి, మిగిలిన డబ్బుతో ‘స్వాతి చినుకులు’ సినిమా తీశారు. అదే ఆయన తీసిన ఆఖరు చిత్రం. దాంతో మొత్తం పోయింది. నిజానికి ఆయనకు ఆ సినిమా తీయడం ఇష్టం లేదు. అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభం! అంతా లలాట లిఖితం. కాంతారావుగారి మీద మీకేం కోపం లేదా? హైమవతి: ఎందుకు కోపం? నన్ను ఓ రాజకుమారిలాగా చూసుకున్నారు. కష్టాలూ నష్టాలూ ఇవన్నీ సహజమే. డబ్బులున్నప్పుడూ... అన్నమే తిన్నాం. ఇప్పుడూ అన్నమే తింటున్నాం. మనవళ్లు డబ్బు పంపించినప్పుడు చాలా బాధపడిపోయేవారు. ‘‘ఇలా వీళ్లమీద ఆధారపడుతూ ఎన్ని రోజులు తినాలో?’’ అనేవారు నాతో. ‘‘పూర్వజన్మలో వాళ్లు మీకు బాకీ ఉండి ఉంటారు. అది తీరేవరకూ పంపిస్తార్లెండి’’ అనేదాన్ని. నిర్మాతగా కాంతారావుగారు అస్సలు లాభం చూడలేదా? రాజా: అయిదు సినిమాలు తీస్తే ఒక్కటి కూడా హిట్టు కాలేదు. కానీ, ఒకే ఒక్క సినిమా ‘గండర గండడు’కి మాత్రం కొంచెం డబ్బులొచ్చాయి. దేనికి దానికి సరిపోయాయి. మద్రాసు నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చేశారు? హైమవతి: అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడైనా అవకాశాలు వస్తాయని వచ్చేశాం. రాజా: ఆ రోజు నాకింకా గుర్తుంది. వనవాసానికి బయలుదేరిన సీతారాముల్లాగా అమ్మా నాన్న కట్టుబట్టలతో మద్రాసులో బయలుదేరి హైదరాబాద్ వచ్చేశారు. అప్పుడు ఇక్కడ మా అక్క సుశీల, డాక్టర్ కృష్ణకుమారిగారు హెల్ప్ చేశారు. మొదట హోటల్లో ఉండి, తర్వాత హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాం. మెల్లిమెల్లిగా నాన్నకు టీవీ సీరియల్స్‌లో నటించే ఆవకాశాలు రావడం మొదలు పెట్టాయి. సినిమా ఛాన్సులు మాత్రం చాలా తక్కువే వచ్చేవి. నల్లకుంట నుంచి రప్పించడం ఎందుకనుకునేవారు! నల్లకుంట ఏదో వేరే రాష్ట్రం అన్నట్టుగా! అలా కొన్ని అవకాశాలు పోయాయి. మళ్లీ చివర్లో బాగానే అవకాశాలొచ్చాయి. ఆఖరు దశలో కొన్ని షూటింగ్స్‌లో కాంతారావుగారిని అగౌరవంగా చూసేవారని ఓ టాక్. నిజమేనా? రాజా: కొత్త తరానికి కాంతారావుగారి గొప్పతనం తెలియక అలా ప్రవర్తించిన మాట వాస్తవమే. పాత తరం వాళ్లు మాత్రం చాలా గౌరవంగా చూసుకునేవాళ్లు. ఒకసారైతే ఓ ప్రొడక్షన్ వాళ్లు కారు కూడా పంపకుండా ఆటోలో లొకేషన్‌కు రమ్మన్నారు. ఆ రోజు మాత్రం నాన్న చాలా బాధపడ్డారు. ఎంతో వైభవం చూసిన ఆయన చివరకు ఇలా చితికిపోవడాన్ని జీర్ణించుకోగలిగారా? రాజా: ఈ ఫ్లాట్‌లో బాల్కనీలో కూర్చుని తన స్థితిని అప్పుడప్పుడు తలుచుకుని వాపోయేవారు. కానీ ఏనాడూ మనో నిబ్బరాన్ని కోల్పోలేదు. అంతా విధి రాత అనేవారు. తోటి నటులతో పోలిస్తే ఈయనే ఎందుకింత వెనుకబడి పోయారు? రాజా: పరిశ్రమలో నిలబడాలంటే కచ్చితంగా ఎవరో ఒకరి అండాదండా ఉండాలి. నాన్నకు అలాంటి బ్యాకింగ్ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా నాన్న ఒంటరిగానే తీసుకునేవారు. ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత నాన్న పేరే చెప్పేవారు. ఇప్పుడు క్రమంగా నాన్న పేరు చెప్పడం మానేశారు. ఇలాంటివి విన్నప్పుడు బాధ వేస్తుంది. నాన్న తీసిన అయిదు సినిమాల్లో ఒక్కటి హిట్టయినా, నిలదొక్కుకునేవారు. సంపాదించిందంతా మళ్లీ సినిమాల్లోనే పెట్టారు. అప్పట్లో జూబ్లీహిల్స్‌లో స్థలాలు పది రూపాయిలు, వంద రూపాయిలన్నట్టుగా ఉండేవి. కొనమని కొంతమంది నాన్నకు సలహా ఇచ్చినా, పట్టించుకోకుండా మళ్లీ సినిమాల్లోనే పెట్టారు. అదే పొరపాటు అయిపోయింది. ఆయన ఆఖరి స్టేజ్ గురించి చెప్పండి? హైమవతి: హీరోగా ఎంతో వైభవం చూసి, చివరకు ఓ అద్దె ఇంట్లో కాలం గడపాల్సి వచ్చినా బాధపడలేదు. ఈ అతి సామాన్య జీవితాన్ని కూడా బాగానే ఆస్వాదించారు. ఇంటికి దగ్గర్లోనే కూరగాయల మార్కెట్. హాయిగా నడుచుకుంటూ వెళ్లి కూరగాయలు కొనుక్కొచ్చేవారు. ఫంక్షన్లకు కూడా ఆటోల్లోనే వెళ్లేవారు. పిల్లలకు సంపాదించి ఇవ్వలేకపోయాననే బాధ మాత్రం ఉండేది. ‘వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలి’ అని లెక్కలు వేసుకునేవారు. మీ పిల్లల గురించి చెప్పండి? హైమవతి: మాకు నలుగురబ్బాయిలు, ఒకమ్మాయి. పెద్దవాడు, రెండోవాడు మద్రాసులో ఉంటారు. మూడోవాడు రాజా. నేను వీడితోనే ఉంటున్నాను. నాలుగోవాడూ ఇక్కడే ఉంటాడు. అమ్మాయిదీ హైదరాబాదే. ప్రస్తుతం మీ కుటుంబం ఎలా గడుస్తోంది? హైమవతి: ఆయన పోయిన దగ్గర్నుంచీ ఎలా బతుకు తున్నామో మాకే తెలీదు. ఎవరో ఒకరొచ్చి సాయం చేసి వెళ్తున్నారు. ఈ అయిదేళ్లూ బతికామంటే దైవకృప. రాజా: నాది చాలా చిన్న ఉద్యోగం. ఈ ఫ్లాట్ అద్దే - పది వేలు. ఏదో అలా కాలం గడిచిపోతోంది. 1999 నుంచి 2003 వరకూ సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారు నెల నెలా 5 వేలు పంపించేవారు. దాసరిగారు 2000 మే నుండి 2009 మార్చి వరకూ నెల నెలా 5 వేలు ఇచ్చారు. మీ పిల్లలు ఎవరూ సినిమాల్లోకి రాలేదు కదా! హైమవతి: రాజా చిన్నప్పుడు ‘సుడిగుండాలు, మరో ప్రపంచం, ఎవరు మొనగాడు, మనుషులు-మట్టి బొమ్మలు’ ఇలా కొన్ని సినిమాల్లో నటించాడు. రాజా కొడుకు సాయి ఈశ్వర్‌కి సినిమాలంటే బాగా ఆసక్తి. కాంతారావు గారి సినిమాల్లో మీకు బాగా నచ్చినవి? హైమవతి: అన్నీ నచ్చుతాయి. ముఖ్యంగా ‘లవకుశ’. శ్రీకృష్ణ తులాభారం, ఆకాశరామన్న, శాంతి నివాసం... ఈ సినిమాలన్నీ ఇష్టంగా చూస్తుంటాను. అవార్డు రాకుండా అడ్డుపుల్లలేశారు! అవార్డుల విషయంలో కూడా అన్యాయమే జరిగినట్టుంది? రాజా: కచ్చితంగా జరిగింది. ఎన్టీఆర్ అవార్డు తనకొస్తుందని నాన్న చాలా ఆశపడ్డారు. కొందరు అడ్డుపుల్లలు వేశారు. పేర్లు అనవసరం. కులం, ప్రాంతం కూడా అడ్డొచ్చుంటాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా! మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఆశిస్తున్నారా? రాజా: ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవాలని ఉంది. నాన్న కూడా అప్పట్లో అడిగి ఉంటే ఎమ్జీఆర్, జయలలిత, ఎన్టీఆర్ సాయం చేసేవారేమో. ఒకసారి దూరదర్శన్ కేంద్రంలో ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు అక్కడ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారు ఉన్నారు. అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి. ఆయనతో అరగంట గడిపారు కానీ, హెల్ప్ చేయమని అడగడానికి మొహమాట పడ్డారు. అడిగివుంటే కచ్చితంగా ఆయన హెల్ప్ చేసేవారు. నాన్న చనిపోయినపుడు కొంతమంది సినీ ప్రముఖులు ‘‘అది చేస్తాం... ఇది చేస్తాం’’ అని స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ, మళ్లీ ఎవ్వరూ కనబడలేదు. కోదాడలో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అదీ లేదు. ఆయన తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకునేవారా? రాజా: మనసులో ఉండేది. ఎప్పుడూ బయటపడలేదు. కాంతారావుగారి ఆఖరి సినిమా ఏది? హైమవతి: ‘శంకర్‌దాదా జిందాబాద్’. అయితే ‘పాండురంగడు’లో ఒకే ఒక్క సీన్లో చేశారు. అది కూడా మోహన్‌బాబుగారు చెప్పడంతో! ఒక్క రోజు వేషమే అయినా, పారితోషికం మంచిగా ఇప్పించారు. కాంతారావుగారికి తీరని కోరికలేమైనా ఉన్నాయా? హైమవతి: ముఖ్యంగా మూడు ఉండేవి. హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉండాలని తపించారు. ఒకసారి టి. సుబ్బరామిరెడ్డిగారు ఘన సన్మానం చేసి పది లక్షలిస్తే, ఇల్లు కొందామనుకున్నారు. ఈలోగా క్యాన్సర్ రావడంతో అవి వైద్యచికిత్సకే అయిపోయాయి. ఇక రెండో కోరిక ఏంటంటే - ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రభుత్వపరంగా ఆ గుర్తింపు కావాలనుకున్నారు. ఇక మూడో కోరిక ఏమిటంటే - రాష్ట్ర ప్రభుత్వమిచ్చే ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకోవాలని చాలా తపించారు. చాలా రాజకీయాలు జరిగాయి. అదీ జరగలేదు. ఇలా ఆ మూడు కోరికలూ తీరకుండానే వెళ్లిపోయారు. కాంతారావు గారికి క్యాన్సర్ ఉందన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? హైమవతి: 2005 నవంబర్ 16న సరిగ్గా ఆయన పుట్టిన రోజు నాడు మాకీ విషయం తెలిసింది. అప్పటికే క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అట! ఆసుపత్రి నుంచి తీసుకురాగానే మూడు రోజులు బాగానే ఉన్నారు. తర్వాత మళ్లీ వాంతులు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్లం. ఇలా చాలాకాలం బాధపడ్డారు. వేలకు వేల డబ్బులు అలా వెళ్లిపోయాయి. ఫిలిమ్నగర్లో చాలామందికి స్థలాలు ఇచ్చారు కదా. మరి కాంతారావుగారికి ఇవ్వలేదా? రాజా: దీనికి జవాబు నేను చెప్తాను. అమ్మకు ఆ వివరాలేమీ తెలియవు. అప్పట్లో స్థలం కోసం రెండు వేల రూపాయలు కట్టారు. తర్వాత 40 వేలు కట్టమన్నారు. అప్పటికి నాన్నగారి దగ్గర డబ్బుల్లేవు. దాంతో ఆ స్థలం రాకుండా పోయింది. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటారు? రాజా: ఆయన హీరోగానే ఉండుంటే పరిస్థితి బాగానే ఉండేది. సినిమాలు తీసి మొత్తం పోగొట్టుకున్నారు. ఆయన కెరీర్ మొదట్నుంచీ చివరి వరకూ పరిశ్రమలో ఎదురీదారు. రకరకాల పరిస్థితులు, రకరకాల ఫీలింగ్స్... ఇలా ఎన్నో! చెప్పినా ఇప్పుడు వేస్ట్! - పులగం చిన్నారాయణ -
ఆ జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి!
సింగీతం శ్రీనివాసరావు... మైండ్‌లోనే టైమ్ మెషీన్ ఉన్న సూపర్ జీనియస్! క్లాసూ... మాసూ... ఫ్యాంటసీ... సైన్స్ ఫిక్షనూ... జానపదం... పౌరాణికం... రియల్ లైఫ్ స్టోరీలూ, రీల్ లైఫ్ ఎక్స్పరిమెంట్లూ... యానిమేషన్లూ... ఇలా ఏ జానర్‌కైనా ఆయన ఆనర్ తీసుకొస్తారు. సెల్యులాయిడ్ సైంటిస్ట్... సింగీతం! నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న సింగీతం శ్రీనివాసరావు స్పెషల్ ఇంటర్వ్యూలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం!! నా కెరీర్లో టాప్ 5 సినిమాల గురించి చెప్పమంటే... కొద్దిగా కష్టమే. కానీ, ఇష్టమైన కొన్ని మైలురాళ్ళను ప్రస్తావిస్తా... సింగిల్ కాలమ్ న్యూస్ నుంచి పుట్టిన ‘మయూరి’... ఓ చిన్న వార్త నుంచి సినిమా పుడుతుందంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ ‘మయూరి’ (1984)ని చూస్తే మీరు నమ్మాల్సిందే. నిర్మాత రామోజీరావు, సుధాచంద్రన్ గురించి సింగిల్ కాలమ్ వార్త చదివి ఇన్స్పైర్ అయ్యి, నా దర్శకత్వంలో సినిమా చేద్దామనుకున్నారు. సుధాచంద్రన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు కొంత ఫిక్షన్ జత చేసి ‘మయూరి’ కథ అల్లుకున్నాం. ఎవరైనా హీరోయిన్‌తో ఈ సినిమా చేసి, ఆఖర్లో సుధాచంద్రన్ క్లోజప్ చూపిద్దామని మొదట అనుకున్నాం. సుధాచంద్రన్ దగ్గర మరిన్ని సంఘటనలు తెలుసుకుందామని కలిసినప్పుడు, ఆమె కళ్లల్లోని ఇంటెన్సిటీ నన్ను ఆకట్టుకుంది. ఆమెతోనే ఈ సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాం. మొదట ఆమె చేయనంటే, ఒప్పించాం. ఇలాంటి సినిమాలో డ్యూయట్లు పెట్టాలా? వద్దా? అనే విషయంలో డైలమా. అప్పుడు నేను ‘కన్నడ’ రాజ్‌కుమార్ షూటింగ్లో ఉన్నా. ఆయన్ను అడిగితే అద్భుతమైన సలహా చెప్పారు. అదేమిటంటే -‘‘సినిమాలో 10 రీళ్లు అద్భుతంగా ఉండి, ఆఖరి 2 రీళ్లు యావరేజ్‌గా ఉంటే, అది యావరేజ్ సినిమా అయిపోతుంది. అలాగే 10 రీళ్లు యావరేజ్‌గా ఉండి, ఆఖరి 2 రీళ్లు అద్భుతంగా ఉంటే ఆ సినిమా హిట్ కింద లెక్క. మీ సినిమా క్లైమాక్స్ అద్భుతం అంటున్నారు కాబట్టి, ముందు డ్యూయెట్లు పెట్టినా ఫరవాలేదు’’. అవార్డులు, అన్ని భాషల్లో జయకేతనాలు... ఇవన్నీ కాదు. అంగవైకల్యం ఉన్నా అందలమెక్కవచ్చని ఈ సినిమా ఎంతోమందికి ఇచ్చిన స్ఫూర్తి చాలు దర్శకునిగా నేను పూర్తిస్థాయి సంతృప్తిని ఆస్వాదించడానికి. రాజ్కపూర్కైతే విపరీతంగా నచ్చేసింది! సినిమా అంటేనే డైలాగులు పేలాలి అనుకునే కాలంలో - మూకీ సినిమా చేయడమంటే చాలామందికి సాహసం, కొంతమందికి చాదస్తం కింద లెక్క. కేవీ రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్నప్పటి నాటి కోరిక అది. ఆ తర్వాత సినిమాల హడావిడిలో పడి మర్చిపోయా. కానీ ఓ రోజు బాత్రూమ్లో స్నానం చేస్తుండగా సడన్‌గా మూకీ తీద్దామని ఆలోచనొచ్చింది. రెండు వారాల్లో స్క్రిప్టు రెడీ. కమల్‌కి చెబితే ఎక్స్లెంట్ అన్నాడు. కానీ ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు. దాంతో కథని మనసు లాకర్లో పెట్టేశా. దేనికైనా కాలం, ఖర్మం కలిసి రావాలి కదా. కొన్నేళ్లకు అదే జరిగింది. బెంగళూరులో ఓ హోటల్లో ఉన్నా. ‘కన్నడ’ రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ చేసొచ్చి, రెస్ట్ తీసుకోవడానికి రెడీ అవుతుంటే, ‘శృంగార్ ఫిలింస్’ నాగరాజ్ వచ్చారు. ఆయన నటుడు. దానికన్నా ప్రధానంగా సినిమా షూటింగ్స్‌కి ఫారిన్ కో ఆర్డినేటర్. ఏదో కబుర్లు చెప్పుకుంటూ యథాలాపంగా ఆ కథ చెప్పా. ఆయన ఫ్లాట్ అయిపోయాడు. మనం తీద్దామన్నాడు. కమల్ కూడా ఓకే అన్నాడు. అలా ‘పుష్పక విమానం’(1984) యాత్ర మొదలైంది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వారి అవార్డు ఫంక్షన్లో వ్యాఖ్యానం చేసిన ఓ అమ్మాయి నవ్వు, కళ్లు నన్ను ఆకట్టుకున్నాయి. ఆమెను చూస్తుంటే. ‘రోమన్ హాలిడే’ అనే హాలీవుడ్ సినిమాలో చేసిన ఆర్డ్రే హెప్బర్న్ గుర్తొచ్చింది. వెంటనే కథానాయికగా తీసేసుకున్నాం. ఆమె ఎవరో కాదు? అమల. హోటల్ ప్రొప్రయిటర్ పాత్రకు గుమ్మడి గారిని అనుకున్నాం. అప్పుడే ఆయన భార్యకు వంట్లో బాగోకపోవడంతో, చేయడం కుదర్లేదు. వేరే కన్నడ ఆర్టిస్టుతో చేయించేశాం. ఇక ముష్టివాడి పాత్రను పీఎల్ నారాయణతోనే చేయించాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ముంబైలో షో వేస్తే, రాజేంద్ర కుమార్, రాజ్‌కపూర్, ఆర్డీ బర్మన్ లాంటి హేమాహేమీలు మెచ్చుకున్నారు. రాజ్కపూర్కైతే ‘డెడ్‌బాడీ రొమాన్స్’ సీన్ విపరీతంగా నచ్చేసింది. నేనెన్ని ప్రయోగాలు చేసినా, ‘పుష్పక విమానం’ మోసుకొచ్చినంత పేరు ప్రఖ్యాతులు, జాబ్ శాటిస్ఫాక్షన్ ఇంకేదీ ఇవ్వలేదు. మొదట మరుగుజ్జు ప్రేమకథ అనుకున్నాం... ‘‘కమల్‌హాసన్ లాంటి గ్లామర్ హీరో ఓ మరుగుజ్జుగా కనిపిస్తే ఏం బాగుంటుంది? అందుకే అందరూ వద్దన్నారు. ఇది కమల్‌కి పుట్టిన ఆలోచనే. నాకు చెప్పగానే, నేను వెంటనే ఉద్వేగానికి గురయ్యా. నేను, కమల్, రచయిత క్రేజీ మోహన్ కలిసి ఓ కథ తయారు చేశాం. మరుగుజ్జు ప్రేమకథ అన్నమాట. ఐదారు రోజులు షూటింగ్ చేశాక, మాకే కథపై సందేహాలు మొదలయ్యాయి. నిర్మాత పంజు అరుణాచలం కథలు బాగా జడ్జ్ చేయగలరు. ఆయన్ను పిలిచి కథ వినిపిస్తే, పగ నేపథ్యంలో డ్యూయల్ రోల్‌తో చేయమని సలహా ఇచ్చారు. అలా స్క్రీన్‌ప్లే మార్చితే ‘విచిత్ర సోదరులు’(1989) కథ తయారైంది. ఇందులో తండ్రి పాత్రకు మొదట ప్రేమ్‌నజీర్ అనుకున్నాం. అస్వస్థతగా ఉండటంతో ఆయన చేయలేనన్నారు. ఎలాగో కవలలుగా చేస్తున్నారు కాబట్టి, తండ్రి వేషం కూడా మీరే చేయండని నేను కమల్‌తో చెబితే, ఆయన సరేనన్నారు. విలన్‌గా అమ్రీష్పురిలాంటి వాళ్లను తీసుకోవచ్చు కానీ, ఎవ్వరూ ఊహించని వ్యక్తితో చేయిస్తే, ప్రేక్షకులు థ్రిల్ అవుతారనిపించింది. అందుకే హాస్యనటుడు నాగేశ్‌ని విలన్‌గా తీసుకున్నాం. ఇక మేకింగ్ విషయానికొస్తే - మరుగుజ్జు కమల్ సీన్లు తీయడానికి చాలా శ్రమించాం. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేవు. మానిటర్లు లేవు. మిఛెల్ కెమెరాతోనే అద్భుతాలు చేయాలి. అసలు కమల్ని పొట్టివాడిగా ఎలా చూపించారన్నది అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. కమల్ మోకాళ్లకు స్పెషల్లీ డిజైన్డ్ షూస్ తొడిగాం. 18 అంగుళాల గొయ్యిలు రెండు తవ్వించి, ఒక దాంట్లో కమల్ని, మరొక దాంట్లో కెమెరాను పెట్టి ఒకే లెవెల్లో ఉండేలా చిత్రీకరణ జరిపేవాళ్లం. గోతిలో దిగిన కమల్ మోకాళ్లకి షూస్ తొడిగి నడిపిస్తూ ఉంటే, మరుగుజ్జు కమల్ నడుస్తున్నట్టే అనిపిస్తుంది. అలాగే ఓ సీన్లో మరుగుజ్జు కమల్ కూర్చుని కాళ్లు కదుపుతారు కదా. అదెలా తీశామో తెలుసా? అవి కమల్ కాళ్లు కావు. ఆర్టిఫీషియల్ లెగ్స్. కమల్ కాళ్లను మడిచి కూర్చుంటే, రైల్వే సిగ్నల్స్ టెక్నిక్‌లో ఆర్టిఫీషియల్ కాళ్లతో సీన్ షూట్ చేశాం. ఆడియో క్యాసెట్లు తయారు చేసే పారిశ్రామికవేత్త సహదేవన్ ఈ విషయంలో మాకు బాగా సహకరించారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పకపోతే అది పాపమే అవుతుంది. జపాన్ అనే సెట్‌బాయ్ ఈ గోతుల్ని కరెక్ట్‌గా తవ్వి, మాకు బోలెడంత టైమ్ కలిసొచ్చేలా చేశాడు. కమల్ నిర్మాత కాబట్టే ఈ సినిమాను 90 రోజుల్లో తీయగలిగాం. ఇంకెవరైనా అయ్యుంటే బడ్జెట్ పెరిగిపోయేది. షూటింగ్ డేసూ పెరిగేవి. అసలు ఈ సినిమా మేకింగ్ గురించి డాక్యుమెంటరీ తీద్దామని నేనూ, కమల్ ఎన్నాళ్లనుంచో అనుకుంటున్నాం. కుదరడం లేదు. ఎప్పటికైనా చేయాలి. నా ఇతర సినిమాల్ని మళ్లీ రీమేక్ చేయొచ్చేమో కానీ, దీన్ని మళ్లీ తీయడం మాత్రం అసాధ్యమే. ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా సరే! నాగేశ్లాంటి ఆర్టిస్టులు... ఇలాంటి బలమైన స్క్రిప్టు మళ్లీ దొరకవు. నా లైఫ్‌లో ఎప్పటికీ ఓ మెమరీ ఇది. విమానంలో కథ చెబితే థ్రిల్ అయిపోయారు! టైమ్ మెషీన్ ఎక్కి మనకు నచ్చిన కాలానికి వెళ్లిపోతే ఎంత బాగుంటుంది? అది గతమైనా కావచ్చు. భవిష్యత్తు అయినా కావచ్చు. 18వ శతాబ్దంలోనే హెచ్‌జి వెల్స్ రాసిన ‘టైమ్ మెషీన్’ కథను కాలేజీ రోజుల్లో చదివి నేను తెగ థ్రిల్ ఫీలయ్యా. అప్పుడు అనుకోలేదు... ఆ నేపథ్యంలో సినిమా తీస్తానని. ఓ రోజు నేను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విమానంలో కలిసి వెళ్తున్నాం. సరదాగా తనకు టైమ్ మెషీన్ నేపథ్యంలో కథ గురించి చెప్పా. ‘అద్భుతం’ అన్నాడాయన. అక్కడితో ఊరుకోలేదు. తనకు తెలిసిన వాళ్లందరికీ గొప్పగా చెప్పేశాడు. కానీ ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. శివలెంక కృష్ణప్రసాద్ అనే కొత్త నిర్మాత మాత్రం రెడీ అన్నాడు. టైమ్ మెషీన్ ఎపిసోడ్లో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లడం ఉంటుంది. ఆ పాత్రను చేయగల ఒకే ఒక్క హీరో బాలకృష్ణ. అందుకే ఆయనకు ఈ కథ చెబితే, వెంటనే ఓకే అన్నారు. ఈ సినిమాకు ముగ్గురు ఛాయాగ్రాహకులు పనిచేశారు. మొదట పీసీ శ్రీరామ్ వర్క్ చేశారు. ఆయనకు కడుపులో సమస్య రావడంతో, శ్రీకృష్ణ దేవరాయల ఘట్టాలను వీఎస్సార్ స్వామి తీశారు. ఇక ఫ్యూచర్ ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రిక్ ఫొటోగ్రఫీని కబీర్‌లాల్ తీసి పెట్టారు. ఇళయరాజా మ్యూజిక్కే ఈ సినిమాకు ప్రాణం. ‘ఆదిత్య 369’ (1991) సినిమా చూస్తుంటే - నాక్కూడా టైమ్‌మెషీన్ ఎక్కి ఆ రోజుల్లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. వెంటనే దీనికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనా పుడుతుంది. ‘మాయాబజార్’లో వదిలేసిన బాణీని వాడా! కేవీ రెడ్డిగారు తీసిన కళాఖండం ‘మాయాబజార్’కి పనిచేసినవాణ్ణి. ఆ సినిమా అంటే ప్రాణం నాకు. యానిమేషన్ సినిమా చేద్దామని నిర్మాత వినోద్ ప్రపోజల్ తెచ్చినపుడు, నాకు ‘మాయాబజార్’లోని ఘటోత్కచుడి పాత్ర మెదిలింది. ఆ పాత్రను బాల్యం నుంచి మొదలుపెట్టి తీద్దామనిపించింది. అప్పటికి తెలుగులో పూర్తి స్థాయిలో ఎవరూ యానిమేషన్ సినిమా చేయలేదు. నాకంతకు ముందు ఇంగ్లీషులో ‘సన్ ఆఫ్ అల్లాడిన్’ చేసిన అనుభవం ఉంది. ‘ఘటోత్కచుడు’ (2008) ఏడు భాషల్లో తీశాం. సంగీత దర్శకత్వమూ నేనే చేశా. ‘వివాహ భోజనంబు’ పాటను మాత్రం అలాగే ఉంచాం. ఆ పాటను అన్ని భాషల్లోనూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితోనే పాడించాం. కేవీరెడ్డిగారి ‘మాయాబజార్’ కోసం సాలూరు రాజేశ్వరరావుగారు నాలుగు బాణీలిచ్చారు. ‘కుశలమా ప్రియతమా’ అనే బాణీని ఆ సినిమాలో వాడలేదు. దాన్నే తీసుకుని ‘ఘటోత్కచుడు’లో ఉపయోగించా. కైరో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఎంపికైందీ సినిమా. నేను తీసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే, ఇదొక్కటీ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే నేను కూడా చిన్నపిల్లాణ్ణయిపోయి, తీసిన చిన్నపిల్లల సినిమా కదా! నా కెరీర్లో మరపురాని ఈ ఐదు సినిమాల జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి! - పులగం చిన్నారాయణ -
అది నా జీవిత కథ అని వాళ్లు తెలివిగా ప్రచారం చేశారు...
ఆమెలో అందం లేదన్నారు. అభినయం చేత కాదన్నారు. కథానాయికగా కాదు కదా... కామెడీ పాత్రలకు కూడా పనికిరాదన్నారు... మరొకరైతే ఆ దెబ్బతో ఇంటిముఖం పట్టేవారేమో! కానీ, మొండిగా ఆమె ఆ విమర్శలన్నిటినీ తట్టుకొంది. తాడిపర్తి సరస్వతి... కాస్తా అభినయ వి‘శారద’గా మారింది. ఆ పరిణామం ఎలా జరిగింది? ముచ్చటగా మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా ‘ఊర్వశి’ పురస్కారం అందుకొన్న ఈ అభినేత్రి మలయాళ సినీ ప్రియులకు ‘చేచి’ ఎలా అయింది? తెలుగులోనే కాక, తమిళ, మలయాళాల్లోనూ ఇంటింటి పేరుగా ఎలా వెలిగింది? చిన్న వయసులోనే పెద్ద వయసు అమ్మ పాత్రలు ఎలా వేసింది? జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న శారద ఆత్మకథ రాస్తానంటూనే, ఏ విషయంలో తటపటాయిస్తున్నారు? వచ్చే ఏడాదిలో సినీ జీవిత షష్టిపూర్తి చేసుకోనున్న శారద అంతరంగ ఆవిష్కరణ... నమస్కారం శారద గారూ! ఎన్నాళ్లయ్యిందండీ మిమ్మల్ని చూసి... శారద: సినిమాలు తగ్గించేశా. అందుకే కనబడటం తగ్గింది. ‘సుకుమారుడు’ తర్వాత తెలుగు సినిమా చేయలేదు. మనసుకు నచ్చిన పాత్రలే చేస్తున్నా. మీరు సినిమా పరిశ్రమకొచ్చి వచ్చే ఏడాదికి 60 ఏళ్లు అవుతుందండీ... శారద: అవునా..! అప్పుడే నేనొచ్చి 60 ఏళ్లు అవుతోందా? 1955లో ‘కన్యాశుల్కం’ కోసం తొలిసారిగా బాల నటిగా తెరపైకొచ్చా. తర్వాత చాలా గ్యాప్. 1961లో ‘ఇద్దరు మిత్రులు’తో మళ్లీ కెరీర్ మొదలైంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ అంతా గుర్తు చేసుకుంటుంటే మనసుకెంతో హాయిగా అనిపిస్తుంటుంది. ఇన్నేళ్లలో ఇంత దూరం ప్రయాణించానా అనిపిస్తుంది. జీవితంలో చాలా చూసేశా. మీరు చూసినన్ని అప్ అండ్ డౌన్స్ ఇంకెవరూ చూడలేదనుకుంటాను? శారద: ఇక్కడ అప్ అండ్ డౌన్స్ కామన్. ఎక్కువ తక్కువలుంటాయంతే. ఎక్కడ తెనాలి? ఎక్కడ మద్రాసు? సినిమాల్లోకొస్తానని కలలో కూడా అనుకోలేదు. మరి ‘కన్యాశుల్కం’లో నటించే అవకాశం ఎలా వచ్చింది? శారద: అప్పుడు నా వయసు తొమ్మిదో, పదో. మద్రాసులో జగ్గయ్యగారి పెద్దమ్మాయి, సీనియర్ నటి హేమలతమ్మగారి అమ్మాయి సుభద్ర, నేను - భరతనాట్యం నేర్చుకునేవాళ్లం. ఓ పాటలో సుభద్రతో యాక్ట్ చేయిద్దామనుకుని దర్శకుడు పి.పుల్లయ్యగారు అక్కడకొచ్చారు. నన్ను కూడా ఎంపిక చేశారు. ‘చేతాము రారే కల్యాణము’ అనే పిల్లల పాటలో పెళ్లికొడుకు తల్లి వేషం వేశా. మీది తెనాలి కదా! అప్పుడు మద్రాసు ఎందుకొచ్చినట్టు? శారద: మా నాన్నగారు వెంకటేశ్వర్లుది బంగారు నగల తయారీ వ్యాపారం. బర్మా వెళ్లాలనుకుని, కొన్నాళ్లు మద్రాసులో కాపురం పెట్టారు. రెండు మూడేళ్లు ఉండి, కుదరక తిరిగి తెనాలి వెళ్లిపోయాం. ఆ సమయంలోనే ‘కన్యాశుల్కం’లో నటించే అవకాశం వచ్చింది. నిజానికి, నా ఎనిమిదేళ్ల వయసులో ‘సంతానం’లో నటించే అవకాశం వచ్చింది. అది ఎలా వచ్చిందో ఎవరి ద్వారా వచ్చిందో కూడా గుర్తు లేదు. తీరా లొకేషన్లోకి వెళ్లాక అక్కడి వాతావరణం కొత్తగా అనిపించి భోరుమని ఏడవసాగాను. దాంతో వాళ్లు ఈ పాప కెమెరా ముందు ఏం నటిస్తుందని సందేహపడి వెనక్కు పంపేశారు. ఆ సినిమా కోసమే లతా మంగేష్కర్‌గారు ‘నిదురపోరా తమ్ముడా’ పాట పాడారు. నేను అందులో నటించి ఉంటే ఆ పాట నా మీదే చిత్రీకరించేవారు. అలాంటి సువర్ణావకాశం కోల్పోయినందుకు ఇప్పటికీ దుఃఖమే నాకు. అసలు మీరు ఈ కళారంగంలోకి ఎలా వచ్చారు? శారద: చిన్నతనం నుంచి నాకు మా ఇంట్లోవాళ్లు భరత నాట్యం నేర్పించారు. అలా కొన్ని నాటకాల్లో నటించే అవకాశం వచ్చింది. ఓ రకంగా మా కుటుంబాల్లో ఇలాంటి వాటికి అంగీకరించరు. ఆడపిల్లలకు 14 ఏళ్లకే పెళ్లి చేసేస్తారు. కానీ నా ఆసక్తి, ప్రతిభ చూసి అమ్మ ధైర్యం చేసి పంపించింది. ఇది నచ్చక మాతో మూడేళ్ల పాటు ఎవరూ మాట్లాడలేదు. అయినా అన్నీ భరించాం. ఇక నటన విషయానికొస్తే... ‘రక్త కన్నీరు’ నాటకం జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో నటుడు నాగభూషణంగారి పక్కన హీరోయిన్ వేషం. ఆ వయసులో చీర కట్టుకోవడం కూడా చేతనయ్యేది కాదు. అన్నీ అమ్మమ్మ దగ్గరుండి చూసుకునేది. వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చినట్టున్నాను. అప్పట్లో నాకు రాత్రి ఏడుగంటలకే నిద్రపోయే అలవాటు. కానీ నాటకం పూర్తయ్యేసరికి పన్నెండు గంటలయ్యేది. రోజూ నాటకం క్యాన్సిలైతే బావుండనుకునేదాన్ని. ఆ వయసులో మీరు డేరింగ్‌గా ఉండేవారా? శారద: మా నాన్నగారి అమ్మమ్మ జొన్నాదుల ఆదిలక్ష్మి చాలా డేరింగ్ అట. కళ్లు లేకపోయినా కుటుంబాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని 20 ఏళ్లు నడిపించిందట. ఆవిడది గంభీరమైన కంఠస్వరమట! అలాగే మా అమ్మమ్మ బండి కనకమ్మదీ ఫుల్ కమాండింగ్ నేచర్. మా మేనత్త పుట్టా సుశీలమ్మ కూడా అంతేనట. వాళ్ల డేరింగ్ నెస్, వాయిస్ నాకు సంక్రమించినట్టున్నాయి. మీ అసలు పేరు తాడిపర్తి సరస్వతి కదా! శారదగా మార్చుకున్నారేం? శారద: మా నాన్నగారి తొలి భార్య పేరు సరస్వతి. ఆమె చాలా చిన్న వయసులోనే చనిపోయారు. చాలా గొప్ప మనసట ఆవిడది. ఆమె పేరు నాకు పెట్టారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక అప్పటికే చాలామంది సరస్వతులు ఉండటంతో నాన్న గారే నా పేరు ‘శారద’ అని మార్చారు. ‘ఇద్దరు మిత్రులు’ లో అవకాశం ఎలా వచ్చింది? శారద: దర్శక - నిర్మాత ఎల్వీ ప్రసాద్ గారు అప్పట్లో కొత్త ఆర్టిస్టులతో సినిమా చేద్దామనుకుని నన్ను ఎంపిక చేసి కొన్నాళ్లు శిక్షణ ఇప్పించారు. కానీ ఆ సినిమా చేయలేకపోయారు. ఇంతలో ‘ఇద్దరు మిత్రులు’లో ఏయన్నార్ చెల్లెలి వేషానికి ఆర్టిస్టుల్ని వెదుకుతుంటే, ఎల్వీ ప్రసాద్ గారు నన్ను రికమెండ్ చేశారు. ఆ సినిమా పెద్ద హిట్టయ్యి, నాకూ పేరు తెచ్చి పెట్టింది. అయితే మొదట్లో మీకు కామెడీ వేషాలే ఎక్కువొచ్చినట్టున్నాయి? శారద: అవును. పద్మనాభం గారితోనే 15 సినిమాలు చేశా. ఆ తర్వాత 3, 4 ఏళ్లు వేషాలే రాలేదు. ఈ అమ్మాయిలో అందం లేదన్నారు. నటన చేతకాదన్నారు. హీరోయిన్గా కాదు కదా, కామెడీ వేషాలక్కూడా పనికిరాదన్నారు. ముక్కు బాగా లేదని కామెంట్ చేశారు. నవ్వొచ్చేదేంటంటే - ఆ తర్వాత అదే ముక్కును పొగిడారు. ప్రొఫైల్‌లో శారద ముక్కు సూపర్ అన్నారు. ఆ మూడేళ్ల గ్యాప్‌లో ఏం చేశారు? శారద: ఏం చేయాలో తెలీని పరిస్థితి. ఇక మూటాముల్లె సర్దుకుని తెనాలి వెళ్లిపోదామనుకుంటున్న సమయంలో కుంచాకో అనే దర్శక-నిర్మాత నన్ను పిలిచి మలయాళంలో ‘ఇన పావుగళ్’ అనే సినిమా చేసే అవకాశమిచ్చారు. అప్పటి నాకు మలయాళం అస్సలు రాదు. అయినా ధైర్యం చేశా. ఇక ఆ తర్వాత అక్కడ వరుసగా సినిమాలు చేశా. మలయాళీ చిత్ర పరిశ్రమ నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంది. ఎన్నెన్నో మంచిపాత్రలిచ్చి గౌరవించింది. నన్ను మలయాళీలు ప్రేమగా ‘చేచి’ అని పిలుస్తారు. ‘చేచి’ అంటే మలయాళంలో ‘అక్క’ అని అర్థం. ఇప్పటికీ అదే పిలుపు. నా తుదిశ్వాస వరకూ మలయాళీలను మర్చిపోకూడదు. అంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు వాళ్లు నాకు. మరి మీకు మలయాళం మాట్లాడటం వచ్చిందా? శారద: ప్రపంచంలో ఏ భాషైనా మాట్లాడొచ్చు కానీ మలయాళం ఉచ్చారణ చాలా కష్టం. అయినా నేర్చుకున్నా. అయితే, టి.ఆర్ ఓమన, ఫిలోమినా... ఇలా కొందరు నాకు డబ్బింగ్ చెప్పారు. ఒకటి, రెండు సినిమాలకు మాత్రం నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. అవి చాలా తక్కువ డైలాగులున్న సిని మాలు కావడంతో చెప్పా. ఎందుకంటే, భాష విషయంలో వాళ్ళకు చాలా పట్టింపు. మన వాళ్లకేమో భాష రాకపోవడం, వచ్చీరాని తెలుగు మాట్లాడటం ఫ్యాషన్. సరేనండి... ఇంతకూ మలయాళం నుంచి మళ్లీ తెలుగులోకి ఎలా వచ్చారు? శారద: మలయాళంలో విన్సెంట్‌గారు డెరైక్ట్ చేసిన ‘తులాభారం’ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేయాలని ‘జెమినీ’ వాసన్‌గారు హక్కులు తీసుకున్నారు. తెలుగు, తమిళం నేర్పి చేయించండని తన కొడుకు బాలుతో చెప్పారట వాసన్. తీరా ఇక్కడికొచ్చాక నేను తెలుగమ్మాయినే అని తెలిసి చాలా ఆశ్చర్యపోయారు.అలా తెలుగులో ‘మనుషులు మారాలి’తో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఈ సినిమా విషయంలో వాసన్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటా. వేరే తెలుగు నిర్మాత అయ్యుంటే నన్ను హీరోయిన్గా తీసుకుని ఉండేవారు కాదు. అప్పటికి తెలుగులో పాపులర్ ఎవరో వాళ్లను హీరోయిన్గా పెట్టుకునేవారు. వాసన్ గారు తీసిన ‘బాలనాగమ్మ’లో మా తెనాలికి చెందిన కాంచనమాల నటించారు. అప్పట్లో వారిద్దరి మధ్య ఏవో మనస్పర్థలొచ్చాయి. యాదృచ్ఛికం కాకపోతే తెనాలికి చెందిన కాంచనమాల ఆయన వల్ల ఇబ్బందులు పడితే, నేనేమో కొత్త జీవితం పొందా. ‘మనుషులు మారాలి’ తర్వాత తెలుగులో బిజీ అయ్యా. ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా మీరే చేశారు కదా? శారద: హీరోలు, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మారారు కానీ ఎక్కడ తీసినా నేను కామన్. హిందీలో ‘సమాజ్ కో బదల్ డాలో’గా జెమినీ వాళ్లే తీశారు. ఇలా ఒకే పాత్రను నాలుగు భాషల్లో చేసే అరుదైన అవకాశం దక్కింది. ఆ కథ, ఆ పాత్రకున్న ఘనత అలాంటిది. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం కోసం రాసిన డ్రామా అది. విన్సెంట్ గారు గొప్పగా తెరకెక్కించారు. ఆ పాత్ర చేసే సమయానికి నాకు 22 ఏళ్లు. అంత చిన్న వయసులో అంత పెద్ద వేషం. విన్సెంట్ గారు జాగ్రత్తగా చేయించారు. అప్పుడప్పుడూ వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి వస్తుంటా. ఉత్తమ నటిగా మీ తొలి జాతీయ అవార్డు ఈ సినిమాకేగా వచ్చింది? శారద: అవును. అప్పుడు ‘ఊర్వశి’ పురస్కారం అనేవారు. దాని విలువ మొదట్లో తెలియలేదు. తర్వాత ‘స్వయంవరం’ (మలయాళం), తెలుగులో ‘నిమజ్జనం’ చిత్రాలకు ‘ఊర్వశి’ పురస్కారం అందుకున్నాను. ‘నిమజ్జనం’ అవకాశం ఎలా వచ్చింది? శారద: ఇది కూడా ఓ మలయాళ రచయిత కథ. బీఎస్ నారాయణగారు డెరైక్ట్ చేశారు. ఇప్పటి రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు నిర్మించారు. ఓ ఆర్ట్ ఫిలింలా చేయాలనుకున్నారు. నేను తప్ప అంతా కొత్త ఆర్టిస్టులే. హీరోయిన్గా చేస్తూ కేరెక్టర్ ఆర్టిస్టుగా మారడం ఇబ్బందనిపించలేదా? శారద: ఎందుకు ఇబ్బంది! నేను హీరోయిన్గా గ్లామర్ పాత్రలు చేసుంటే ఇబ్బందులొచ్చేవి. నేను చేసినవన్నీ సహజమైన పాత్రలు. ఇంటి ఇల్లాలి పాత్రలంటే మొదట నన్నే అడిగేవారు. అలా చిన్న వయసులోనే తల్లి వేషాలు వేశా. కేరెక్టర్ ఆర్టిస్టుగానూ మంచి వేషాలొచ్చాయి. ‘న్యాయం కావాలి’లో మొదటిసారిగా కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశా. లాయర్ పాత్ర. ఆ తర్వాత ‘చండశాసనుడు’తో బ్రేకొచ్చింది. అది నా కెరీర్లో మైలురాయి. అప్పట్లో పోలీసు పాత్రలంటే మీకే ఇచ్చేవారు కదా... శారద: మొదట ‘ప్రతిధ్వని’లో పోలీసాఫీసర్ వేషం వేశా. చాలామంది నిర్మాత రామానాయుడి గారి దగ్గర కామెంట్లు చేశారట. ఆడ పోలీస్ ఏంటన్నారట. పోలీస్ యూనిఫామ్‌లో నేనెలా ఉంటానా అని సందేహించాను. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఒక దశలో అత్త పాత్రలు కూడా ఎక్కువ చేశారుగా... శారద: ‘అనసూయమ్మగారి అల్లుడు’లో అత్తగా నన్ను పెడదామనుకుంటే చాలామంది అనుమానం వ్యక్తం చేశారట. ‘ఎన్టీఆర్ గారు మాత్రం శారద పర్ఫెక్ట్గా సూట్ అవుతారు’ అని చెప్పారట. అదే జరిగింది. బాలకృష్ణ ఇప్పటికీ నేనెక్కడ కనపడ్డా ‘ఓయ్... అనసూయమ్మత్తో’ అని పిలుస్తారు. ‘నారీ నారీ నడుమ మురారి’లో కూడా నాది మంచి వేషం. ఆర్టిస్టుగా మొత్తం ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? శారద: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ కలిపి 350కి పైగా సినిమాలు చేశాను. నేను చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు ఇంకెవరూ చేయలేదేమో కూడా. అంతా నా అదృష్టం. కన్నడంలో అనంత్‌నాగ్, విష్ణువర్ధన్‌లతో నటించా. ఓ సినిమాలో రజనీకాంత్‌కు ప్రేయసిగా చేశాను. హిందీలో ఎన్ని సినిమాలు చేశారు? శారద: అయిదారు చేశాను. సంజీవ్‌కుమార్, శతృఘ్నసిన్హాల పక్కన హీరోయిన్గా చేశా. దిలీప్‌కుమార్ పక్కన ఓ సినిమాలో నటించాను. అది మధ్యలోనే ఆగిపోయింది. అమితాబ్‌తో మొదలైన సినిమాది కూడా అదే పరిస్థితి. దర్శకుడు హృషీకేశ్ ముఖర్జీ ‘కోషిష్’లో నన్ను తీసుకున్నారు. అప్పుడు నేను మలయాళంలో బిజీ. అవి వదులుకుని వెళ్లలేను కదా. ఇలా మీరు వదులుకున్న మంచి సినిమా ఇంకా ఉన్నాయా? శారద: ‘అంకుర్ సినిమా నేనే చేయాలి. నా కోసం దర్శకుడు శ్యామ్ బెనగళ్ ఒక నెల ఎదురు చూశారు. నా నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి ఆయనకు కోపం వచ్చింది. ఓ కొత్తమ్మాయితో చేస్తానని చెప్పి వెళ్లిపోయారు. ఆ వేషం షబనా ఆజ్మీతో చేశారు. ఆ వేషం వేయలేదని బాధ లేదు కానీ నాకు, అనవసరంగా ఆయన మనసు బాధ పెట్టాననే ఫీలింగ్ ఉంది. అలాంటి పాత్రలు మలయాళంలో నేను చాలా చేశాను. అయినా నా వల్ల షబనా ఆజ్మీ అనే గొప్ప నటి బయటికొచ్చింది కదా! ఇంతకీ మీరు హైదరాబాద్‌కు ఎందుకు షిఫ్ట్ కాలేదు? శారద: చిన్నప్పటి నుంచీ మద్రాసు అలవాటైంది. ఇక్కడ హాయిగా ఉన్నా. అందుకే షిఫ్ట్ కాలేదు. ఇక్కడ నన్ను అందరూ తమ మనిషిగా చూస్తారు. ‘అమ్మా’ అని పిలుస్తారు. ఆ పిలుపే ఆనందాన్నీ, శక్తినీ ఇస్తుంటుంది. టీవీ సీరియల్స్ ఏమైనా చేశారా? శారద: ఏవీయమ్ వాళ్ల సీరియల్ చేశా. ఆ తర్వాత మళ్లీ చేయలేదు. డెరైక్షన్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదా? శారద: నన్నెవరూ అడగలేదు. నాకూ ఆ ఆలోచన రాలేదు. డెరైక్షన్ అనేది ప్రత్యేకమైన కళ. అది అందరికీ అబ్బదు. నా వరకూ నేను డెరైక్టర్స్‌కి కొన్ని సలహాలు ఇస్తుండేదాన్ని. తీసుకోకపోయినా పట్టించుకునేదాన్ని కాదు. రాజకీయాలు, మీ రాజకీయ జీవితం, ఇప్పుడు దూరంగా ఉండడం...? శారద: ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలను. కానీ చెప్పే ఆసక్తి లేదు. మీ పర్సనల్ లైఫ్ గురించి? శారద: అస్సలు మాట్లాడను. ఒక స్త్రీగా పుట్టాక ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. అందరి జీవితాల్లోనూ ఉంటాయి. నా జీవితంలో పౌర్ణమే ఎక్కువ చూశాను. అమావాస్య తక్కువ. చాలామందితో పోలిస్తే దేవుడు నాకు మంచి జీవితం ఇచ్చాడు. ఇంతకు మించిన సక్సెస్ ఏముంది? వ్యక్తిగత జీవితంలోని ఒడుదొడుకులు కెరీర్‌పై ప్రభావం చూపలేదా? శారద: నేను సున్నిత మనస్కురాలినే కానీ, చాలా మొండిదాన్ని, ధైర్యవంతురాలిని. నటనపై వ్యక్తిగత జీవిత ప్రభావం పడకుండా చూసుకున్నా. నాకు ఒక్కడే తమ్ముడు. వాళ్ల పిల్లలే నా కుటుంబం. మీ ఆత్మకథ రాసుకునే ఉద్దేశం ఉందా? శారద: త్వరలో రాయనున్నాను. అయితే వ్యక్తిగత జీవితంలోని అన్‌హ్యాపీనెస్ గురించి ప్రస్తావించాలా, లేదా అని ఆలోచిస్తున్నాను. ఈ మధ్య తెలుగు సినిమాలు ఏమైనా చూశారా? శారద: ‘ఉయ్యాల జంపాల’ చూశా. బాగా నచ్చింది. దర్శకుడికి ఫోన్ చేసి మాట్లాడా. హీరో గమ్మత్తుగా అనిపించాడు. హీరోయినూ బాగా చేసింది. ఇప్పటి కథానాయికలను చూస్తుంటే ఏమనిపిస్తోంది? శారద: చాలా బాధగా ఉంది. అసలు దుస్తులే అక్కర్లేదన్నట్టుగా ఉంటున్నారు. దుస్తులపై ఖర్చు దండగ అనుకుంటున్నారో, ఇలా ఉంటేనే డిమాండ్ అనుకుంటున్నారో! అలా చేస్తే పోనీ సినిమాలు ఆడుతున్నాయా అంటే అదీ లేదు. ఇదేదో నేను విమర్శనా దృష్టితో అనడం లేదు. బాధతో అంటున్నాను. వస్త్రధారణ అనే కాదు, సంభాషణలూ అలానే ఉన్నాయి. మన ఇంట్లో మన పిల్లలు అలా మాట్లాడితే ఒప్పుకుంటామా? కాబోయే భర్తను కూడా వాడూ వీడూ అనడమేంటి? అసలు ఈ ధోరణే బాగాలేదు. ఒక్క హీరోయిన్ పాత్రలనే కాదు, హీరోల పాత్రలూ అలానే ఉన్నాయి. ఇప్పటి రోజుల్లో హీరో అంటే జులాయే అన్నట్టుగా చూపిస్తున్నారు. హీరో పాత్రలన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఓ చిన్న ఆలోచనతో కూడా మంచి సినిమా తీయొచ్చు. అంతేకానీ అసభ్య పదజాలం, అర్ధనగ్న దృశ్యాల వల్ల ఏ సినిమా హిట్ కాదు. సంగీత సాహిత్యాలూ అలానే ఉన్నాయి. ఏ భాషో అర్థం కావడం లేదు. తెలుగు చాలా గొప్ప భాష. రకరకాల భాషలతో సంకరం చేసి దాన్ని నాశనం చేస్తున్నారు. మీ జీవితం ఆధారంగా మలయాళంలో సినిమా వచ్చినట్టుంది? శారద: అది నిజం కాదు. ఆ సినిమాలో నేనూ యాక్ట్ చేశా. అందులో నాది క్రైస్తవ పాత్ర. వాళ్లు చాలా తెలివిగా నా జీవితకథ అని ప్రచారం చేసుకున్నారు. కానీ జనం నమ్మలేదు. అందుకే ఆ చిత్రమూ పరాజయం పాలైంది. ప్రస్తుతం మలయాళంలో చేస్తున్నారా? శారద: లేదు. కావాలని విరామం తీసుకున్నా. అయినా యాక్ట్ చేయడానికి ఇంతకు ముందున్నంత ఉద్వేగమూ లేదు. ఒత్తిడి చేస్తే, అప్పుడు చేస్తాను. ఒకప్పుడు తెగ శ్రమించారు. ఇప్పుడీ విశ్రాంత జీవితం ఏమనిపిస్తోంది? శారద: ఎక్కడండీ విశ్రాంతి? ఇప్పటికీ ఏదో పనులతో బిజీనే. ప్రస్తుత సమాజంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉందంటారు? శారద: సినిమాలు చూసి కొందరు స్త్రీలు విచిత్రమైన వస్త్రధారణలకు దిగుతున్నారు. నిన్న ఒక పెళ్లికి వెళ్తే, ఒకావిడ విచిత్రమైన బ్లౌజ్ వేసుకొచ్చింది. అందరూ బాడీని చూస్తుంటే, గొప్పనుకుంటోంది. అందాన్ని గుట్టుగా దాచుకుంటేనే విలువ. ఎముకలన్నీ చూపించడం గ్లామర్ కాదుగా! ఈ ఫీల్డ్‌లో పురుషాధిక్యత అధికం. ఇబ్బందులు, వివక్ష ఎదుర్కోలేదా? శారద: లేదు. నాకంటూ ఓ ప్రాధాన్యం, ఓ గౌరవం ఉండేవి. నన్నందరూ బాగా చూసుకునేవారు. ఆ రకంగా నేను చాలా అదృష్టవంతురాలిని. నా కెరీర్ అంతా గౌరవప్రదంగానే సాగిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రముఖ హీరోలు, దర్శకులతో పనిచేశాను. తమిళంలో ఎమ్జీఆర్తో ‘నినైత్తదై ముడిప్పవన్’ అనే ఒకే ఒక్క సినిమా చేశాను. అందులో ఆయన చెల్లెలి వేషం ధరించాను. ఆ ఆఫర్ వచ్చే సమయానికి నేను వేరే సినిమాల్లో బిజీ. కానీ ఎమ్జీఆర్ నా కోసం కొన్నాళ్లు ఆగారు. అంతకన్నా అదృష్టం ఏం కావాలి! ‘సచ్చా ఝూటా’ అనే హిందీ హిట్‌కు అది రీమేక్. ఇప్పటికీ తమిళనాడులో ఏ మతానికి చెందిన పెళ్లి జరిగినా ఆ సినిమాలోని పాట ప్లే చేస్తారు. మదర్స్ డే అంటే తెలుగు టీవీలో తప్పనిసరిగా ‘అమ్మ రాజీనామా’ వస్తుంది. మలయాళంలో అయితే ‘రాప్పగల్సినిమా వేస్తారు. మమ్ముట్టి, నయనతార, నేను కలిసి నటించిన తొలి సినిమా అది. ఇక, కార్తిక మాసం వస్తే శోభన్‌బాబు, నేను, శ్రీదేవి నటించిన ‘కార్తీకదీపం’ వేస్తారు. ఇలా చాలా సందర్భాల్లో నా సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంటాయి. నాకన్నా డబ్బులు ఎక్కువ సంపాదించినవాళ్లుంటారు కానీ, నా అంత సంతృప్తి అరుదుగా మాత్రమే లభిస్తుంది. మీ భవిష్యత్ ప్రణాళికలు? శారద: అంధులకూ, అనాథలకూ సేవ చేయాలని ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ - మూడు ప్రాంతాల్లోనూ సేవా కార్యక్రమాలు చేయాలనుంది. కచ్చితంగా చేస్తా. దేవుడు ఎంతవరకూ సహకరిస్తాడో చూడాలి. - పులగం చిన్నారాయణ -
వివరం: రామానాయుడు... ఓ ఫిలిం యూనివర్సిటీ!
టాటా బిర్లాలు... ఏ బిజినెస్ చేసినా నెంబర్వన్నే! చెత్తలో కూడా చరిత్ర లిఖించగల సమర్థులు వాళ్లు. కానీ వాళ్లు చేయలేని పని... సినిమా తీయడం! బోలెడంత కరెన్సీ... ఎంతో పలుకుబడి... మహా తెలివితేటలు... ఇవన్నీ ఉన్నా కూడా ఓ సక్సెస్ఫుల్ సినిమా తీయడం చాలా చాలా కష్టం. మహామహులే వరుసగా సినిమాలు తీయలేక చేతులెత్తేశారు. కానీ రామానాయుడు 50 ఏళ్లుగా నిర్విరామంగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇంకా తీస్తానంటున్నారు కూడా. ఏముంది రామానాయుడిలో మ్యాజిక్? ఈ లాంగ్ ఇన్నింగ్స్ ఆయనకే ఎలా సాధ్యపడింది? ఇంటర్ ఫెయిలైన రామానాయుడు ఫిలిం మేకింగ్ యూనివర్సిటీగా ఎలా మారగలిగారు? అవును. ప్రేక్షకులకే కాదు, గొప్ప గొప్ప బిజినెస్ మేనేజ్మెంట్ స్కూళ్లకు కూడా రామానాయుడి కెరీర్ ఓ గొప్ప పాఠ్యాంశం. కొండల్ని చెక్కి స్టూడియోలు కట్టినట్టుగానే, తనను తాను శిల్పంలా మలుచుకుంటూ మూవీ మొఘల్ అనిపించుకున్నారు. 50 ఏళ్ల క్రితం వ్యక్తిగా మొదలై, వ్యవస్థగా ఎదిగిన రామానాయుడి సినీజీవితంలో కొన్ని కీలకమైన రీళ్లు... బయోగ్రఫీ పుట్టింది: 1936 జూన్ 6న ప్రకాశం జిల్లా కారంచేడులో తల్లిదండ్రులు: దగ్గుబాటి లక్ష్మీదేవమ్మ, వెంకటేశ్వర్లు కుటుంబం: భార్య రాజేశ్వరి, కొడుకులు సురేష్, వెంకటేష్, కూతురు లక్ష్మి ఇప్పటిదాకా తీసిన సినిమాలు: 137 (తెలుగు 78, బెంగాలీ 2, తమిళం 10, మలయాళం 1, కన్నడం 2, ఒరియా 1, అస్సామీ 1, ఆంగ్లం 1, పంజాబీ 1, హిందీ 17. ఇవికాక, కొన్ని అనువాదాలు. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం.) కె.బాపయ్య, కె.మురళీమోహనరావు, బి.గోపాల్, బోయిన సుబ్బారావు, తిరుపతి స్వామి, జయంత్ సి పరాన్జీ వంటి 22 మంది దర్శకులు; ఖుష్బూ, టాబూ, కరిష్మాకపూర్, దివ్యభారతి, ప్రేమ వంటి 11 మంది హీరోయిన్లు; వెంకటేష్, హరీష్ లాంటి ఆరుగురు హీరోలు, జె.వి.రాఘవులు, మణిశర్మ లాంటి నలుగురు సంగీత దర్శకులు, 1 పాటల రచయిత(చంద్రబోస్) ను పరిచయం చేశారు. పురస్కారాలు: పద్మభూషణ్ (2013), దాదాసాహెబ్ ఫాల్కే (2010), రఘుపతి వెంకయ్య అవార్డు (2006), గౌరవ డాక్టరేట్, ఇంకా ఎన్నో! 1 వరుసగా 9 ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడు... ముగ్గురు హీరోలు, చాలామంది నిర్మాతలు రిజెక్ట్ చేస్తే మూలనపడి దుమ్ము పేరుకుపోయిన కథ... ఇలా స్టార్ట్ అయ్యింది రామానాయుడి ప్రయాణం. అన్నీ అపశకునాలే. చుట్టూ అనుమానపు చూపులే. అయినా రామానాయుడు డోంట్ కేర్. కథను నమ్మి ఎన్టీఆర్ డేట్లిచ్చాడు. ఆ కథనే నమ్మి రామానాయుడు మొండిగా సినిమా తీశాడు. అదే ‘రాముడు - భీముడు’. సూపర్ హిట్. ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ. అదీ దమ్మంటే! 2 ‘ద్రోహి’ పెద్ద ఫ్లాప్. ఐదు లక్షలు లాస్. టోటల్‌గా ఆరేళ్లలో 12 లక్షలు గోవిందా. ఇంకొకరైతే మూటాముల్లే సర్దుకుని బ్యాక్ టూ పెవిలియన్. లేకుంటే బాటిల్ ఓపెన్ చేసి, మత్తులో మునిగేవాడు. రామానాయుడు జగమొండి. పోయిన చోటే వెతుక్కోవాలనుకునే మనిషి. లాస్ట్ అండ్ ఫైనల్ ఎటెంప్ట్. ఏమాత్రం అటూ ఇటూ అయినా మనిషి మిగలడు. నుజ్జు నుజ్జయి పోవాల్సిందే. 15 లక్షలతో ‘ప్రేమనగర్’ మొదలెట్టాడు. వామ్మో! ఎంత గుండె ధైర్యం. రిలీజు రోజు గలీజు వర్షం. నీడన ఉన్నవాడు కూడా తడిసిపోయేంత వర్షం. మన తెలుగోడికి సినిమా బాగుంటే ఎండా లేదు, వానా లేదు. అదే జరిగింది. ‘ప్రేమనగర్’పై డబ్బుల వర్షం. రామానాయుడిపై పూల వర్షం. ఇంకేం... రామానాయుడు పాతుకుపోయాడు. ఈసారి ఏ గాలీ వానా అతన్నేం చేయలేదు. 3 ‘సెక్రటరీ’ హండ్రెడ్ డేస్ ఫంక్షన్. అందరూ మంచి జోష్‌మీదున్నారు. ‘‘ఈ సంస్థలో ఎవరు హీరోగా చేసినా హిట్టే. చివరకు నేను కూడా’’అన్నాడు కైకాల సత్యనారాయణ. ఆ ఆనందంలో మాట ఇచ్చేశాడు రామానాయుడు. కమెడియన్ నగేశ్కీ అంతే. డెరైక్షన్ ఛాన్సిస్తానని చిన్న మాట. అయినా మాటంటే మాటే! కైకాల హీరోగా, నగేశ్ డెరైక్షన్‌లో ‘మొరటోడు’ సినిమా. ఈ సంస్థలో అంత ఫ్లాప్ మళ్లీ రాలేదు. డబ్బు పోయినా మాట తప్పలేదనే సంతృప్తి రామానాయుడిది! 4 ఒక చల్లని రాత్రి... అట్టర్ ఫ్లాప్. కక్ష... 8 లక్షలు లాస్. అగ్ని పూలు... 8 లక్షలు పోయింది. ప్రేమ మందిరం... మళ్లీ నష్టం. వరుసగా నాలుగు దెబ్బలు. మనిషి కుదేలైపోయాడు. బండి అదుపు తప్పింది. అర్జెంట్‌గా హిట్ పడాలి. మళ్లీ రిస్క్ చేయాలి. అప్పట్లో కె.రాఘవేంద్రరావంటే హాట్ కేక్. అడవి రాముడు, వేటగాడు, ఊరికి మొనగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి... వరుసపెట్టి మాస్ హిట్స్. అలాంటి టైమ్‌లో రామానాయుడు తీసిన సినిమా ఏంటో తెలుసా? ‘దేవత’. పక్కా సెంటిమెంట్. నిజం చెప్పాలంటే ఏడుపుగొట్టు సినిమా. అయినా బోలెడంత క్రేజ్. బయ్యర్లు ఎగబడ్డారు. అమ్మేస్తే అప్పులన్నీ తీరిపోతాయి. ‘‘అమ్మేద్దాం నాన్నా’’ అంటాడు సురేష్‌బాబు. ‘‘లేదు. మనమే ఓన్‌గా రిలీజ్ చేద్దాం’’ అన్నాడు రామానాయుడు. మళ్లీ మళ్లీ రిస్కు. 15 లక్షలతో తీసిన సినిమా 75 లక్షలు వసూలు చేసింది. 60 లక్షల లాభం. అంత డబ్బే! సాహసవంతుడికే కదా లక్ష్మీ కటాక్షం. 5 కె.రాఘవేంద్రరావు దర్శకుడు. సూపర్‌స్టార్ కృష్ణతో సినిమా తీయాలి. ఇక్కడో సడన్ ట్విస్ట్. పార్ట్నర్గా ఇంకో నిర్మాతను పెట్టుకోమంటారు కృష్ణ. రామానాయుడు కుదరదనేశాడు. కృష్ణ కాల్షీట్లు క్యాన్సిల్. ఇప్పుడేం చేయాలి? ఇప్పటికిప్పుడు హీరో కావాలి. అమెరికాకు ఫోన్ కొడితే, చిన్న కొడుకు దిగొచ్చాడు. అతనే హీరోగా ‘కలియుగ పాండవులు’ సినిమా. గొప్ప టర్నింగ్. ఇండస్ట్రీకి నిర్మాతల హీరో దొరికాడు. ‘విక్టరీ’ వెంకటేశ్. 6 రెండు పెద్ద పెద్ద రాళ్ల గుట్టలు. ఆ కొండల్ని పగలగొట్టి స్టూడియో కట్టాలి. స్టూడియో కట్టడానికన్నా, ఆ కొండల్ని పగలగొట్టడానికే ఎక్కువ ఖర్చవుతుంది. అది కూడా హైదరాబాద్‌కి ఆమడ దూరం. అయినా లెక్కచేయలేదు. అప్పటివరకూ సంపాదించిందంతా ఆ కొండల్లో పోశాడు. కట్‌చేస్తే - రామానాయుడు స్టూడియో వెలిసింది. బౌండ్ స్క్రిప్ట్‌తో ఎంటరైతే, ఫస్ట్ కాపీతో ఎగ్జిట్ అయ్యేంత ఎక్విప్మెంట్. 7 వైజాగ్‌కి దూరంగా భీమ్లీ రోడ్లో కొండల మీద స్టూడియో. అక్కడ స్టూడియో ఏంటి? ఈలోగా స్టూడియో కూడా రెడీ. క్వశ్చన్ మార్కు ఫేసుల్లో ఆశ్చర్యార్థకం! ఎదురుగా సముద్రం. చుట్టూ పచ్చటి కొండలు. వావ్! వాట్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ అన్నారు. ఇలాంటి చోట షూటింగ్ చేస్తే, ఆ కిక్కే వేరబ్బా. రామానాయుడా మజాకానా! 8 రామానాయుడంటే 137 సినిమాలూ సురేష్ ప్రొడక్షన్ బేనరూ ఓ పెద్ద స్టూడియో బోలెడంత మంది వర్కర్లూ... ఇంతేనా! ఇవన్నీ తెరపై కనిపించేవి. తెర వెనుక ఆయనలో లెక్కలేనన్ని పార్శ్వాలున్నాయి. ఈ 50 ఏళ్లలో చాలామంది నిర్మాతలు వచ్చారు, వెళ్లారు. చాలా తక్కువ మందే నిలకడగా ఉండగలిగారు. కానీ రామానాయుడిలాగా ఇంత అలుపూ సొలుపూ లేని సుదీర్ఘ ప్రయాణం ఇంకెవ్వరూ చేయలేకపోయారు. ఇది ఎవ్వరూ బ్రేక్ చేయలేని రికార్డ్ కూడా! ఇంతమంది ఉండగా రామానాయుడే ఎందుకు సక్సెసయ్యారు? ఎలా సక్సెసయ్యారు? ఆయన దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం ఏమీ లేదు. కల్పవృక్షాలూ అక్షయ పాత్రలూ అస్సల్లేవు. అమృతం కావాలనుకున్నప్పుడు క్షీర సాగరాన్ని మధించి తీరాల్సిందే. హాలాహలమొచ్చినా తట్టుకుని నిలబడాల్సిందే. ఫైనల్‌గా రామానాయుడికి అమృతం దక్కింది. 9 రెండు మూడు సినిమాలు అసిస్టెంట్‌గా చేస్తే, డెరైక్షన్ చేయొచ్చు. ఫొటోగ్రఫీ చేయొచ్చు. ఎడిటింగ్ చేసేయొచ్చు. ఇంకా ఏమైనా చేసేయొచ్చు. మరి నిర్మాత కావాలంటే? అసిస్టెంట్ ప్రొడ్యూసర్ అనే కేటగిరీ లేదిక్కడ. అందుకే రామానాయుడి అనుభవాలను ఏ నిర్మాతల మండలివారో పూనుకుని వీడియో తీయిస్తే, భావితరాలకు ఓ ‘పెదబాల శిక్ష’ను ప్రసాదించినట్టే. 10 కథను నమ్ముకున్నవాడు - కృషిని నమ్ముకున్నవాడు - చెడిపోయిన దాఖలా సినిమా చరిత్రలోనే లేదు. ఇది నిజం! అందుకు రామానాయుడి జీవితమే 24 కళల... 24 ఫ్రేముల... నిదర్శనం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం... 1963 నవంబర్ 16... శనివారం ఉదయం 7 గంటలు... మద్రాసులోని ఓ స్టూడియో. ఎన్టీఆర్ మీద ముహూర్తం షాట్. ‘విజయా’ నాగిరెడ్డి క్లాప్. డి.సురేష్‌బాబు కెమెరా స్విచాన్. ‘రాముడు - భీముడు’ షూటింగ్ ఆరంభమైంది. ఇది రామానాయుడి తొలి ప్రయత్నం. దీనికన్నా ముందు ‘అనురాగం’ సినిమాలో భాగస్వామి. నిర్మాతగా పేరు వేయలేదు కానీ, ప్రొడక్షన్ అంతా ఆయనే చూసుకున్నాడు. తన వాటా పెట్టుబడి 20 వేలు అన్నారు. తీరా అది 50 వేలయ్యింది. సినిమా ఫ్లాప్. రామానాయుడికి ఒక్క రూపాయి రాలేదు. ఆ నష్టం కన్నా, ఆ పరాజయం కన్నా, బంధువుల, స్నేహితుల సూటి పోటి మాటలు గాయపరిచాయి. పోయిన చోటే వెతుక్కోవాలి. తలవంచిన చోటే తలెత్తుకు తిరగాలి. ఒంటరి ప్రయాణం... ఒంటరి పోరాటం... ఎవ్వరూ తోడు రానన్నారు. రీల్ ఎస్టేట్ కన్నా రియల్ ఎస్టేట్ బెస్ట్ అన్నారు దగ్గరి బంధువులు. లేదు. నేను సినిమా ఫీల్డ్‌లో సక్సెస్ సాధించి చూపిస్తా అని ప్రతిన పూనాడు రామానాయుడు. పెద్ద కొడుకు పేరు మీద ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థకు శ్రీకారం. భాగస్వాములుగా ఒక్కరూ రారాయె. సొంత అక్క కూడా వాటా వద్దంది. పిల్లనిచ్చిన మావగారు, చెల్లెలు, మరో నలుగురు బంధువులు తలో పదిపైసల వాటా తీసుకున్నారు. వాళ్లందరివీ కలిపి 6 అణాలు. రామానాయుడు ఒక్కడిదీ 10 అణాలు. అలా సంస్థకు విత్తు పడింది. దూరపు బంధువైన ప్రముఖ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి ద్వారా దర్శకుడు తాపీ చాణక్య, రచయిత డీవీ నరసరాజు పరిచయమయ్యారు. ‘రాముడు - భీముడు’ కథ చెప్పి ఎన్టీఆర్ కాల్షీట్లు తీసుకున్నాడు. జమున, ఎల్.విజయలక్ష్మి, ఎస్వీ రంగారావు, రాజనాల, పద్మనాభం లాంటి హేమాహేమీలు ముఖ్య తారలు. సినిమా చకచకా తయారైపోయింది. ఎన్టీఆర్‌కి వేరే ఏదైనా సినిమా షెడ్యూల్ క్యాన్సిలైతే, రామానాయుడికి ఫోన్ చేసేవారు, ఈయన షూటింగ్ పెట్టేసుకునేవారు. దాంతో చాలా ఎర్లీగా సినిమా పూర్తయిపోయింది. 1963 మే 21న ‘రాముడు - భీముడు’ రిలీజై, సంచలన విజయం సాధించింది. సినిమా పూర్తవడానికి 6 లక్షల 30 వేల రూపాయలు ఖర్చయ్యింది. మొదటి వారంలోనే ఈ డబ్బంతా వచ్చేసింది. రెండో వారం నుంచే ఓవర్‌ఫ్లోస్! ఇక అక్కణ్నుంచి రామానాయుడు సాధించిందంతా చరిత్రే! కొన్ని సూపర్ హిట్లు రాముడు భీముడు ప్రేమనగర్ జీవన తరంగాలు సావాసగాళ్లు సోగ్గాడు కథానాయకుడు ముందడుగు సంఘర్షణ కలియుగ పాండవులు ప్రతిధ్వని అహ నా పెళ్లంట ప్రేమ ఖైదీ ప్రేయసి రావే సర్పయాగం తాజ్‌మహల్ సూరిగాడు బొబ్బిలి రాజా ప్రేమించుకుందాం రా కలిసుందాం రా శివయ్య తోడికోడళ్లు ప్రేమించు ధర్మచక్రం నాయుడుగారి కుటుంబం గణేష్ కలిసుందాం రా జయం మనదేరా వసంతమాళిగై (తమిళం) ప్రేమ్‌నగర్ (హిందీ) ప్రేమ్‌ఖైదీ (హిందీ) అనారి (హిందీ) విజయ రహస్యాలు కథను పసిగట్టే ప్రజ్ఞ పద్ధతి ప్రకారం పని చేయడం పాత్రలకు తగ్గ తారల ఎంపిక పర్ఫెక్ట్ పేమెంట్. కొత్తవాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం ట్రేండ్లు, కాంబినేషన్ల మీద ఆధారపడకపోవడం - పులగం చిన్నారాయణ -
రిలేషణం: భానులో మంచి మ్యుజీషియన్ ఉన్నాడు!
భానుచందర్ అంటే ఒక జనరేషన్‌ని ఉర్రూతలూగించిన యాక్షన్ హీరో. ఓ పక్క టై, మెరుపుదాడిలాంటి యాక్షన్ ఫిలిమ్స్ చేసినా కూడా... తరంగిణి, నిరీక్షణ, సూత్రధారులు, మంచి మనసులులాంటి చిత్రాలతో తనలోని వెర్సటాలిటీని ఆవిష్కరించుకున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టుగా బిజీబిజీగా ఉన్న భానుచందర్ గురించి ఆయన అన్నయ్య మూర్తి చందర్ చెబుతోన్న విశేషాలివి! ‘‘మా నాన్నగారు మాస్టర్ వేణు ఫేమస్ మ్యూజిక్ డెరైక్టర్. ఆయనకు మేమిద్దరమే కొడుకులం. భానుకన్నా నేను రెండేళ్లు పెద్ద. వయసు గ్యాప్ పెద్దగా లేకపోవడం వల్లనేమో, ఇద్దరం బ్రదర్స్‌గా కన్నా క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లం. బాగా తిట్టుకుని, కొట్టుకునేవాళ్లం. నాకు పంతమెక్కువ. రెండు, మూడు రోజులు మాట్లాడకపోతే, వాడే వచ్చి బతిమాలుకునేవాడు. ఇద్దరిదీ ఒకటే మంచం. స్కూలు ఫైనల్ వరకూ ఒకే కలర్ డ్రెస్ కూడా. మా ఇద్దర్నీ రామలక్ష్మణులనేవారు. సినిమాలకు, షికార్లకు కలిసి వెళ్లాల్సిందే. ఎక్కువ ఇంగ్లిష్ సినిమాలకు వెళ్తుండేవాళ్లం. క్రికెట్ కూడా ఆడేవాళ్లం. ఇద్దరికీ మ్యూజిక్ అంటే ఇంట్రస్ట్. వాడు గిటార్ నేర్చుకుంటే, నేను పియానో ట్రై చేసేవాణ్ణి. నాన్నగారిలాగా వాడూ మ్యూజిక్ డెరైక్టర్ కావాలని అమ్మ ఆకాంక్ష. నన్నేమో డాక్టర్ని చేయాలని కోరిక. రెండూ నెరవేరలేదనుకోండి. సెప్టెంబర్ 8, ఫన్డే రిలేషణంలో... సినీనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సోదరుడు సీతారామారావుగారికి కేవలం ఇద్దరు ఆడపిల్లలు అని పొరపాటుగా ప్రచురితమైనది. వాస్తవంగా ఆయనకు ముగ్గురు పిల్లలు. ఒక మగపిల్లాడు, ఇద్దరు ఆడపిల్లలు. కుమారుడు శేషగిరిబాబు ఒక కంపెనీ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. పొరపాటుకు చింతిస్తున్నాం. నౌషాద్‌గారి దగ్గర సంగీత శిక్షణ కోసమని భాను కొన్నాళ్లు ముంబై వెళ్లాడు. ఆ టైమ్‌లో చెడు స్నేహాల వల్ల డ్రగ్స్‌కి బానిసయ్యాడు. నేను వాణ్ణి బలవంతంగా మద్రాసు తీసుకొచ్చి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను. కరాటే నేర్చుకున్నాక వాడి లైఫ్ స్టయిల్ మారిపోయింది. అప్పట్నుంచీ కరెక్ట్ రూట్లోకి వచ్చేశాడు. సినిమా ఆర్టిస్టు అవుతానంటే వద్దని నేను నిరాశపరిచేవాణ్ణి. కానీ భాను మొండివాడు. అనుకున్నది సాధించాడు. తను హీరో కావడం నాకు సర్ప్రైజ్. ఎందుకంటే చిన్నప్పుడు తనలో హీరో ఫీచర్స్ ఉండేవి కాదు. కష్టపడి, ఇష్టపడి తనను తాను డెవలప్ చేసుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. నాలో చిన్నప్పటినుంచీ స్పిర్చువల్ థాట్స్ ఎక్కువ. అందుకే పెళ్లి చేసుకోలేదు. నా గురించి భాను కూడా కొన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు. చివరకు అమ్మ ఒత్తిడి మేరకు ఆలస్యంగానైనా పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఇద్దరు కొడుకులు. వాళ్లని చూస్తుంటే అచ్చంగా మా బాల్యం గుర్తొస్తుంది. ఒకడేమో హీరో అయ్యాడు. ఇంకొకడు మెడిసిన్ చదువుతున్నాడు. మా అమ్మ కోరిక అలా నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. మా ఇద్దరికీ పోలికలున్నా, మనస్తత్వాలు పూర్తి విరుద్ధం. నేను ఇంట్రావర్ట్‌ని. వాడు ఎక్కడికైనా దూసుకుపోగలడు. నాకు మెడికల్ సీటు రాక బి.ఏ.లో చేరాను. ఆ తర్వాత మ్యూజిక్ డిపార్ట్మెంట్లో స్థిరపడిపోయాను. నేను కొన్నాళ్లు మ్యూజిక్ టీచర్‌గా ఓ స్కూల్లో పనిచేశాను. అలాగే సంగీత దర్శకుడు రాజ్ దగ్గర పదేళ్లు ఉన్నాను. నాకన్నా భానులోనే ఎక్కువ మ్యూజిక్ టాలెంట్ ఉంది. తను ఇప్పుడు తలుచుకున్నా మంచి మ్యూజిక్ డెరైక్టర్ కాగలడు. తన సినిమాల్లో నాకు ‘నిరీక్షణ’ అంటే చాలా ఇష్టం. తనలో చాలా పొటెన్షియాలిటీ ఉంది. దాన్నెవరూ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. భాను కేరెక్టర్ యాక్టర్‌గా చేయడం నాకిష్టం లేదు. చేస్తే హీరోగానే చేయాలి. తనకిలాంటి చిన్నా చితకా పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. అమితాబ్ బచ్చన్ 70 ఏళ్లు వచ్చినా కూడా శక్తిమంతమైన పాత్రలు చేస్తున్నాడు. ఈ విషయమే ఎన్నిసార్లు చెప్పినా భాను పట్టించుకోడు. ఖాళీగా కూర్చోలేను కదా అంటుంటాడు. - పులగం చిన్నారాయణ -
తెలుగువారి అపురూప గ్రంథం స్వర్ణయుగ సంగీత దర్శకులు
‘‘‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’ పుస్తకం తెలుగు వారి అపురూప గ్రంథం’’ అని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో చిమటమ్యూజిక్డాట్కామ్ ప్రచురణలో నంది అవార్డు గ్రహీత పులగం చిన్నారాయణ రచించిన ‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’ మలి ప్రచురణ పుస్తకావిష్కరణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి మాట్లాడుతూ -‘‘తెలుగుభాష గర్వించే విధంగా ఈ పుస్తకాన్ని రాశారు చిన్నారాయణ. ఈ పుస్తకం ఒక పరిశోధనాత్మక గ్రంథంగా తెలుగుజాతికి మిగిలిపోతుంది. తెలుగు సినీ సంగీతానికి చిమట శ్రీనివాస్ విశేష కృషి చేస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘తెలుగు సంస్కృతిని, తెలుగు పాటను నిలబెట్టేందుకు చిమట శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయం’’ అని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు అన్నారు. తెలుగు పాటలను గుండెల నిండా నింపుకున్న వ్యక్తి చిమట శ్రీనివాస్ అని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ అన్నారు. తెలుగు సంగీత ప్రపంచానికి ఘంటసాల సూర్యుడైతే, బాలు చంద్రుడులాంటి వాడని, సినీపాటల్లో ఉన్నతమైన పాటలు ఎన్నుకొని చేసిన ప్రయత్నమే ఈ మలి ప్రచురణ అని మాధవపెద్ది సురేష్ చెప్పారు. సంగీత దర్శకుల గురించి ఓ పుస్తకం తీసుకురావాలనే ఆలోచన రావటమే గొప్ప విషయమని సంగీత దర్శకుడు చక్రి అంటే... చరిత్రకెక్కిన మహానుభావుల గురించి రాసిన ఈ పుస్తకంతో పులగం చిన్నారాయణ, చిమటా శ్రీనివాస్ కూడా చరిత్రకెక్కారని ఆర్పీ పట్నాయక్ అన్నారు. చిమట శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘చిన్నారాయణ ఈ పుస్తకంలో అద్భుతమైన పద ప్రయోగాలు చేశారు. ఈ పుస్తకం తెచ్చే విషయంలో సూర్య గూడూరు అందించిన సహకారం మరవలేనిది’’ అని చెప్పారు. మాధవపెద్ది సురేష్, చక్రి, ఆర్.పి.పట్నాయక్ కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని సురేష్ కొండేటి, మలి ప్రతిని ఎల్.బాబురావు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో పులగం చిన్నారాయణ, సూర్య గూడూరు, రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.