ఫీల్ మై లవ్ | Feel My Love | Sakshi
Sakshi News home page

ఫీల్ మై లవ్

Published Sun, Oct 18 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

ఫీల్ మై లవ్

ఫీల్ మై లవ్

సినిమా వెనుక స్టోరీ - 20
ప్రేమ - రెండక్షరాల మహా కావ్యం! రెండు కన్నీటి చుక్కల మహా సంద్రం!!
ప్రేమ ఎప్పుడూ కుదురుగా ఉండ నివ్వదు. సుకుమార్ ప్రేమలో ఉన్నాడు. లిటరేచర్‌తో, మూవీస్‌తో మెదడులోతు ప్రేమలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే కుదురుగా ఉండలేకపోతున్నాడు. మంత్లీ ట్వంటీ థౌజండ్ శాలరీ... మేథ్స్ లెక్చెరర్‌గా బోలెడంత రెస్పెక్ట్... ఇవన్నీ వదిలేసి హైదరాబాద్‌లో అనామకంగా ఉండటమేంటి? అసిస్టెంట్ డెరైక్టర్‌గా క్లాప్‌బోర్డ్‌లు మోయడమేంటి? నెలకు పదిహేనొందల జీతమేంటి? సినిమాలంటే పిచ్చి ప్రేమ మరి.

మూడంటే మూడు సినిమాలు... మనసిచ్చి చూడు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్.... ఇలా ఇంకా ఎన్ని సినిమాలకు క్లాప్ కొట్టాలో? సుకుమార్‌లోని సినిమా ప్రేమ కుదురుగా ఉండనివ్వడంలేదు.
   
వైజాగ్ బీచ్... సుకుమార్, ప్రకాశ్, వేమారెడ్డిల మధ్య స్టోరీ డిస్కషన్స్. సుకుమార్ చెప్పిన లైన్‌కు వాళ్లిద్దరూ ఫ్లాట్. ఆ బీచ్‌లోనే కథ మొత్తం ఓ షేప్‌కొచ్చింది. ఈ కథతో ప్రొడ్యూసర్‌ని ఒప్పించాలి. హీరోని మెప్పించాలి. వెండితెరను గెలిపించాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందో?
   
విజయ్ ఫోన్. ‘హనుమాన్ జంక్షన్’కి కెమెరా అసిస్టెంట్. వీవీ వినాయక్‌కి సొంత తమ్ముడు. ‘‘సుక్కూ... నితిన్ హీరోగా మా అన్నయ్య ‘దిల్’ సినిమా చేయబోతు న్నాడు. డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌లో నువ్వు చేద్దువుగాని రా’’ చెప్పాడు విజయ్. వైజాగ్‌లో రెడీ చేసుకున్న స్క్రిప్ట్‌ని భద్రంగా బ్యాగ్‌లో పెట్టుకుని హైదరాబాద్ వచ్చేశాడు సుకుమార్.
   
‘దిల్’ షూటింగ్... కొత్త ప్రొడ్యూసర్స్ రాజు-గిరి. ఇంతకు ముందు వీళ్లు డిస్ట్రిబ్యూటర్స్. మణిరత్నం ‘అమృత’ సినిమాను తెలుగులో డబ్బింగ్ కూడా చేశారు. ఇది ఫస్ట్ డెరైక్ట్ సినిమా. అంతా కుర్రగ్యాంగ్. సందడి సందడిగా ఉంది లొకేషన్. జోక్స్, కామెంట్స్... హుషారే హుషారు. సుకుమార్ మాత్రం సెలైంట్‌గా ఉండేవాడు. పనిలో మాత్రం వయొలెంట్. ఎవరైనా ఏదైనా డౌట్ అడిగితే చాలా డెప్త్‌తో మాట్లాడేవాడు. ప్రొడ్యూసర్ రాజుకి సుకుమార్ అంటే ఇంప్రెషన్. వినాయక్ కూడా ‘‘ఇతనిలో మంచి విషయం ఉంది’’ అని సర్టిఫై చేశాడు. ‘‘దిల్’ హిట్టయితే నీకు డెరైక్షన్ చాన్స్ ఇస్తా. కథ రెడీ చేసుకో’’ రాజు హామీ. సుకుమార్ ఇన్ క్లౌడ్స్.
   
‘దిల్’ సూపర్‌హిట్. వినాయక్ కంటే ఎక్కువ సంబరపడిపోయాడు సుకుమార్. ఎందుకంటే ఈ హిట్టు మీదే అతని ఫ్యూచర్ డిపెండ్ అయివుంది. రాజు మాట తప్పలేదు. ‘‘ఇదిగో విక్రమన్ చేసిన తమిళ సినిమా స్ట్రిప్టు. దీన్ని నువ్వు డెరైక్ట్ చేయాలి’’. సుకుమార్‌లో పెద్ద జర్క్... కన్‌ఫ్యూజన్. ‘‘రీమేకా? నాకిష్టం లేదు. నా కథతోనే చేస్తాను’’ అనేశాడు వెంటనే. ‘‘సరే... నీ కథేంటో చెప్పు’’ అడిగాడు రాజు. సుకుమార్ ఇమీడియట్‌గా కథ చెప్పేశాడు. రాజులో నో రెస్పాన్స్. నచ్చిందా? నచ్చలేదా? సుకుమార్‌లో విపరీతమైన టెన్షన్. ‘‘స్టోరీ బాగుంది కానీ, కమర్షియల్‌గా వర్కవుట్ కాదేమో. ఇంకేదైనా ఆలోచించు’’ అనేసి వెళ్లిపో యాడు రాజు. సుకుమార్ ఇన్ డిప్రెషన్.
   
‘దిల్’ రాజు ఆఫీసు... సుకుమార్ నీరసంగా లోపలికెళ్తున్నాడు. హాల్లో... ‘దిల్’రాజు, సురేందర్‌రెడ్డి, చందు ఇంకా చాలామంది కూర్చుని నవ్వుకుంటున్నారు. ‘‘రా సుక్కూ... నిన్న నువ్వు చెప్పిన కథ వీళ్లకు చెబితే ఎగ్జైట్ అయిపోతున్నారు. వర్కవుట్ అయ్యేట్టు ఉంది. మనమీ ప్రాజెక్ట్ చేస్తున్నాం’’ అని అప్పటికప్పుడు అనౌన్స్ చేసేశాడు ‘దిల్’ రాజు.  సుకుమార్ ఇన్ ఫుల్ జోష్.
   
నితిన్‌కు చెప్పాడు. రవితేజను కలిశాడు. ప్రభాస్ కూడా విన్నాడు. ఫైనల్‌గా కొత్త హీరోనే కరెక్ట్ అని డిసైడయ్యారు సుకుమార్ అండ్ రాజు. అదే టైమ్‌లో- ప్రభాస్ కోసం ‘దిల్’ స్పెషల్ ప్రొజెక్షన్ వేశారు ప్రసాద్ ల్యాబ్ థియేటర్‌లో. ప్రభాస్ ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారు. వాళ్లల్లో ఒకబ్బాయి చెంగుచెంగున అటూ ఇటూ తిరుగుతూ జోక్స్ కట్ చేస్తూ తెగ హడావిడి చేస్తున్నాడు.
 
‘‘అరె... అచ్చం నా హీరోలానే ఉన్నాడే’’ అనుకున్నాడు సుకుమార్. కొంచెం దగ్గరకెళ్లి చూస్తే... అల్లు అర్జున్. ‘గంగోత్రి’తో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ‘ఈ స్టోరీకి ఇతనే యాప్ట్’... ఫిక్స్ అయిపోయాడు సుకుమార్. ‘దిల్’ రాజుకి చెప్పేశాడు. ‘‘లేట్ ఎందుకు... ఇప్పుడే అడిగేస్తా’’ అంటూ అల్లు అర్జున్‌ని పిలిచాడు రాజు. వాళ్లిద్దరికీ కొంచెం దూరంగా సుకుమార్ నిలబడ్డాడు.  ‘‘మా దగ్గరో కథ ఉంది. వింటావా?’’ అడిగాడు ‘దిల్’రాజు. ‘‘గంగోత్రి తర్వాత ఇప్పటికి 96 కథలు విన్నాను సార్. అన్నీ రొటీన్... బుర్ర తిరిగిపోతోంది’’ చెప్పాడు అర్జున్. ‘‘ఈ కథ విను. నీకు డెఫినెట్‌గా నచ్చుతుంది’’ భరోసా ఇచ్చాడు రాజు. కథ విని ఒక విజిల్ కొట్టాడు బన్నీ. ఇప్పుడు అల్లు అరవింద్ కథ వినాలి. ఫస్ట్ హాఫ్ వరకూ విని ‘‘అర్జంట్ మీటింగ్ ఉంది. రేపు కలుద్దాం’’ అన్నాడాయన. సుకుమార్‌కి ఏసీలో కూడా చెమట్లు పట్టేశాయి. నచ్చలేదేమో. డౌట్ల మీద డౌట్లు. అదే టైమ్‌కి బన్నీ... ‘‘ఏం టెన్షన్ పడొద్దు. డాడీకి నచ్చింది. సెకెండాఫ్ హ్యాపీగా చెప్పండి’’. నెక్స్ట్ డే - సెకెండాఫ్ విన్నారాయన. ‘‘బాగుంది... కానీ ఎక్కడో ఏదో మిస్సయ్యింది’’ చెప్పాడు అల్లు అరవింద్.
 
‘‘త్రీడేస్‌లో చేంజెస్ చేసి తీసుకొస్తాం’’ అన్నాడు ‘దిల్’రాజు. త్రీ డేస్ కాదు... టెన్ డేస్ కూర్చున్నారు. ఇప్పుడింకా స్క్రిప్ట్ పర్‌ఫెక్ట్‌గా తయారైంది. కానీ ఏదో డౌట్. అల్లు అరవింద్ ఈసారైనా ఓకే చేస్తారా? ఆయనతో మనకు వర్కవుట్ కాదేమో. పవన్ కల్యాణ్‌ని ట్రై చేస్తే? గుడ్ ఐడియా. కానీ కలిసే చానలే లేదు. అరవింద్‌కి బాగా తెలిసిన వ్యక్తి ఓ మీటింగ్‌లో ‘దిల్’ రాజుని కలిశాడు. ‘‘అరవింద్ గారికి మీరేదో కథ చెప్పారట. మార్పులు చేసి తీసుకొస్తే ఓకే చేసేట్టు ఉన్నారు’’ అన్నాడతను క్యాజువల్‌గా.  కట్ చేస్తే- అల్లు అరవింద్ దగ్గరున్నాడు సుకుమార్. కథ విని ఆయన ఫుల్ హ్యాపీ. కానీ చిన్న డైలమా. ‘‘వేరే ప్రాజెక్టు కూడా లైన్‌లో ఉంది. ఏది ముందో డిసైడ్ చేయాలి’’ చెప్పారు అరవింద్. ఆ పదిరోజులూ సుకుమార్‌కి నరకం. చివరకు సస్పెన్స్ వీడింది.

సుకుమార్‌కి గ్రీన్‌సిగ్నల్. చిరంజీవి కూడా కథ విన్నారు. సుకుమార్ ప్రతి మైన్యూట్ బిట్‌నీ పేపర్ మీద రాసుకుని చెప్పడం ఆయన్ని ఆకట్టుకుంది. రెగ్యులర్ కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీ కాదని ఆయనకు అర్థమైపోయింది. ‘గీత’ క్యారెక్టర్‌కి ‘కిట్‌క్యాట్’ చాక్లెట్ యాడ్ మోడల్ అనూ మెహతా... ‘అజయ్’ పాత్రకు శివబాలాజీ... ఇలా కాస్టింగ్ అంతా క్లియర్. మ్యూజిక్, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ విషయంలో చాలా మొండిగా ఉన్నాడు సుకుమార్. సూపర్ టెక్నీషియన్స్ కావాలి. మిగతా విషయాల్లో బడ్జెట్ కంట్రోల్ ఓకేగానీ, ఈ మూడు క్రాఫ్ట్స్ విషయంలోనూ ఫ్రీడమ్ అడిగాడు సుకుమార్.

‘దిల్’ రాజు కూడా ఓకే.
ఎడిటర్‌గా శ్రీకర్‌ప్రసాద్. లేకపోతే మార్తాండ్ కె.వెంకటేశ్ కావాలి. మార్తాండ్ ఓకే. మ్యూజిక్ డెరైక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ డబుల్ ఓకే. సాయంత్రం స్టోరీ విని మిడ్‌నైట్ ‘ఫీల్ మై లవ్’ ట్యూన్ రెడీ చేసిచ్చేశాడు. అంతలా కనెక్టయ్యాడు తను. ఇక మిగిలింది కెమేరామ్యాన్. తమిళంలో పాపులర్ ఎవరో ఎంక్వైరీ చేశాడు. రత్నవేలు గురించి తెలిసింది. రాజీవ్ మీనన్ శిష్యుడతను. తమిళంలో అప్పటికే 7 సినిమాలు చేశాడు. ఫస్ట్ మీటింగ్‌లోనే సుకుమార్, రత్నవేలు ఫ్రీక్వెన్సీస్ సెట్.
   
‘‘నచికేత... ఇదేం పేరు? ఇంత ట్రెండీ కథకు ఇంత ఓల్డ్ నేమా?’’... ‘దిల్’ రాజు ఏదైనా ఓపెన్‌గానే చెప్పేస్తాడు. సుకుమార్ మార్కెట్ నుంచి పిల్లల పేర్ల పుస్తకం తెప్పించాడు. ఫస్ట్ పేజీలోనే పేరు దొరికేసింది. బ్యూటిఫుల్ నేమ్... ‘ఆర్య’. అంటే సంస్కృతంలో ‘మొదటివాడు’.
   
బన్నీ కసి మీద ఉన్నాడు. ఫస్ట్ సినిమా హిట్టు. సెకెండ్‌ది కూడా ఇంప్రెస్ చేస్తే ఇక సెటిలైపోవచ్చు. అసలే మనసుకి నచ్చిన కథ. ‘ఆర్య’ పాత్రలో లీనమవ్వడం కోసం ఎన్ని కసరత్తులు చేయాలో అన్ని చేస్తున్నాడు. హెయిర్‌స్టయిల్ మార్చేశాడు. కాస్ట్యూమ్స్... లుక్... టోటల్‌గా కొత్త బన్నీ కనిపిస్తున్నాడు.
   
2003 నవంబర్ 19... అన్నపూర్ణా స్టూడియోలో గ్రాండ్ ఓపెనింగ్. చిరంజీవి క్లాప్... పవన్ కల్యాణ్  కెమెరా స్విచాన్...కె.రాఘవేంద్రరావు ఫస్ట్‌షాట్ డెరైక్షన్. యంగ్ బ్లడ్.. న్యూ కాన్సెప్ట్... టీమ్ మొత్తం హుషారుగా ఉన్నారు. షూటింగూ అంతే హుషారు. సుకుమార్ క్వాలిటీ విషయంలో జగమొండి. అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చి తీరాల్సిందే. 80 రోజులు అనుకుంటే... వర్కింగ్ డేస్ 120 డేస్ అయ్యింది. బడ్జెట్టూ పెరిగింది. ‘దిల్’రాజు బేఫికర్. ప్రొడక్ట్ మీద కాన్ఫిడెన్స్ అలాంటిది. 2004 మే 7.... మోర్నింగ్ షో డివైడ్ టాక్. బాగుందనీ అనడం లేదు. బాగో లేదనీ చెప్పడం లేదు. ఏదో డైలమా. కాన్సెప్ట్ అలాంటిది కదా. ‘దిల్’రాజుకి మాత్రం నో టెన్షన్. సుకుమార్ అయితే 125 డేస్ ఫిల్మ్ అనే నమ్మాడు.
 
ఈవినింగ్‌కి క్లారిటీ వచ్చేసింది. ‘ఆర్య’ సూపర్ డూపర్ హిట్. సుకుమార్‌కి ఫోన్ల మీద ఫోన్లు. ‘వన్‌సైడ్ లవ్’ కాన్సెప్ట్‌ని చాలా బాగా డీల్ చేశాడని క్రెడిట్స్. బన్నీకైతే ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్. ‘గంగోత్రి’కీ దీనికీ టోటల్ లుక్ ఛేంజ్. బన్నీ ఇకపై ‘స్టయిలిష్ స్టార్’ అని ఎవరో కాయిన్ చేశారు. పాటలన్నీ మార్మోగిపోయాయి. ‘ఫీల్ మై లవ్’ సాంగ్ బాగా పట్టేసింది. ‘అ అంటే అమలాపురం’ సాంగ్ అయితే ఓ కిక్ ఇచ్చింది. 4 కోట్లతో తీసిన ఈ సినిమా 16 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ మూమెంట్‌లో ఆడియన్‌‌సకి ‘అ’ అంటే అల్లు అర్జున్! ‘ఆ’ అంటే ఆర్య!

- పులగం చిన్నారాయణ
 
వెరీ ఇంట్రస్టింగ్...
* ఆర్యను గీత ముద్దు పెట్టుకున్న స్టిల్‌ను కాలేజ్ క్యాంపస్‌లో అంటించే సీన్ గుర్తుందా? ఆ సీన్‌లో హీరోయిన్‌ని కామెంట్ చేసిన కుర్రాడు - శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాకి అసిస్టెంట్ డెరైక్టర్. తర్వాత ‘కొత్త బంగారు లోకం’తో డెరైక్టరయ్యాడు.

* 2004 సెప్టెంబర్ 8న హైదరాబాద్ లలిత కళాతోరణంలో 125 రోజుల వేడుక జరిగింది. చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement