అల ఎగసిపడుతోంది! | Sakhi Movie Behind Stor | Sakshi
Sakshi News home page

అల ఎగసిపడుతోంది!

Published Sun, Sep 6 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

అల ఎగసిపడుతోంది!

అల ఎగసిపడుతోంది!

సినిమా వెనుక స్టోరీ - 15
ప్రేమ అంటే పచ్చదనం. ప్రేమ ఎప్పుడూ పచ్చగానే ఉండాలి. పెళ్లయిన తర్వాత కూడా..!
 ‘దిల్ సే’ పోస్ట్ ప్రొడక్షన్. మణిరత్నం ఫుల్ బిజీ. చిన్న టీ బ్రేక్‌లో బాల్కనీలో కూర్చుని రోడ్డు వంక చూస్తుంటే బైక్ మీద ఓ ప్రేమజంట రివ్వున దూసుకుపోతోంది.
 ప్రేమ ఎవ్వరికీ అంతుబట్టని ఓ మ్యాజిక్. ప్రేమలో అన్నీ ప్లస్సులే ఉంటాయా? లేదు... మైనస్సులూ ఉంటాయ్. అయితే అదేంటో... అవి పెళ్లయ్యేవరకూ కనబడవు. అప్పుడే గ్యాప్ మొదలవుతుంది.
 
మణిరత్నం మనసు ఇలా రక రకాలుగా ఆలోచిస్తోంది. అందరూ పెళ్లితో ఎండ్ అయ్యే ప్రేమకథలే చేస్తున్నారు. ఆ తర్వాతి జీవితాన్ని ఎందుకు వదిలేయాలి?
 కోపాలూ తాపాలూ, ప్లస్సులూ మైనస్సులూ, వసంతాలూ శిశిరాలూ - ఇవన్నీ చూపించే కథ. ఆత్మ, హృదయం రెండూ ఉండే కథ. రైటర్ సుజాతకు ఫోన్ చేశాడు మణి. సుజాత తమిళంలో ఫేమస్ రైటర్. రిటైర్డ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్. ‘సుజాత’ అనేది ఆయన కలంపేరు.

మణిరత్నానికి బాగా నమ్మక మైన మనిషి. ‘‘భార్య కనిపించకపోవడం, భర్త వెతు క్కుంటూ వెళ్లడం, ఈ అన్వేషణలో భార్య లేని లోటు, ఆమెతో జ్ఞాపకాలు గుర్తుకు రావడం... వీటన్నిటితో కథ చేద్దామను కుంటున్నా...’’ చెప్పాడు మణిరత్నం. ‘‘గో ఎ హెడ్’’ అని ఉత్సాహపరిచాడు సుజాత.
   
మనసుపడి తీసిన తమిళ ‘ఇరువర్’ (తెలుగులో ‘ఇద్దరు’) అట్టర్ ఫ్లాప్. ఎంతో కష్టపడి చేసిన హిందీ ‘దిల్ సే’కి ఎదురు దెబ్బ. మణిరత్నం కదిలిపోయాడు. ఎక్కడో తేడా జరుగుతోంది. కొన్నాళ్లు సినిమాకు దూరంగా ఉండాల్సిందే! తప్పటడుగులు పడినప్పుడో, లక్ష్యం నుంచి దారి మళ్లినప్పుడో... బ్యాక్ టూ బేసిక్స్‌కి రావాలి. గొప్ప మేనేజ్‌మెంట్ సూత్రం. ఇండియాలోని టాప్ బిజినెస్ స్కూల్ జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్టి ట్యూట్‌లో ఎంబీఏ చేసిన మణిరత్నానికి ఈ సూత్రమే గుర్తొచ్చింది. ఇప్పుడు తను కూడా బ్యాక్ టూ బేసిక్స్. నో ఎక్స్‌పెరి మెంట్స్. రొమాన్స్ అంటే మణిరత్నంలా ఎవ్వరూ తీయలేరు.

ఇది ఆయనకున్న బ్రాండ్. ఇప్పుడదే మళ్లీ వాడాలి. సుజాతకు చెప్పిన స్టోరీలైనే తనకు శ్రీరామ రక్ష. ఆర్.సెల్వరాజ్‌ను పిలిచాడు.  సూపర్ స్టోరీ, స్క్రీన్‌ప్లే రైటర్. ఇద్దరూ కూర్చుని స్క్రిప్ట్ చేస్తున్నారు. మధ్య మధ్యలో సుహాసిని జాయినవుతున్నారు. మామూలుగా అయితే స్క్రిప్ట్ వర్కులో ఎవ్వర్నీ ఎంటర్ కానివ్వడు మణిరత్నం. రిలేషన్ రిలేషనే. స్క్రిప్టు స్క్రిప్టే. కానీ సుహాసినికి మాత్రం ఎగ్జెంప్షన్. ఎందు కంటే సుహాసిని చాలా షార్ప్. నటిగా  బోలెడంత అనుభవం, సమాజాన్ని చదివిన అనుభవం... దానికి తోడు భర్తకేం కావాలో ఆమెకు బాగా తెలుసు. ‘రోజా’, ‘దళపతి’, ‘బొంబాయి’, ‘ఇద్దరు’, ‘దిల్ సే’... ఇలా మణిరత్నం ప్రతి సినిమాలోనూ సుహాసిని కంట్రి బ్యూషన్ కంపల్సరీ. ఈ స్క్రిప్టులో అయితే సుహాసిని ఐడియాలు చాలా ఎక్కువే.

హీరో అమ్మానాన్నలు, హీరోయిన్ అమ్మానాన్నలు కలుసుకునే సీన్ ఐడియా సుహాసినిదే. ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీకెళ్లే సీన్, తండ్రి చనిపోయాక హీరోయిన్ తల్లిని చూడ్డానికి వెళ్లిన సీన్, ‘అలై పొంగెరా’ పాట సన్నివేశం... ఇదంతా సుహాసిని క్రెడిట్టే. తమిళంలో ‘అలై పాయుదే’ (అంటే ‘అల ఎగిసిపడుతోంది’ అని అర్థం) అనే టైటిల్ పెట్టారు. తెలుగు వెర్షన్  టైటిల్ ‘సఖి’. షారుక్ ఖాన్‌తో చేస్తే బాగుంటుంది... మణిరత్నానికి ఎవరో సలహా ఇచ్చారు. కానీ మణిరత్నం ఆల్రెడీ ఫిక్సయిపోయారు... న్యూ ఫేస్‌తో ఈ సినిమా చేయాలి. ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అయితే నేచురాల్టీ మిస్సవుతుంది. ఎవరా అదృష్టవంతులైన హీరో, హీరోయిన్లు?
   
‘శాండల్‌వుడ్’ సోప్ యాడ్ షూట్ చేస్తున్నారు. తీసేది ఫేమస్ కెమేరామన్ కమ్ డెరైక్టర్ సంతోష్ శివన్. చేసేది నటుడు ఆర్.మాధవన్. మణిరత్నానికి సంతోష్ శివన్ బాగా క్లోజ్. ఆ విషయం మాధవన్‌కు తెలుసు. అందుకే అడిగాడు... ‘‘సార్... నన్ను మణిగారికి ఇంట్రడ్యూస్ చేయండి.’’
సంతోష్ శివన్ ‘ఎస్’ అనలేదు, ‘నో’ అనలేదు. కానీ మాధవన్‌కి చెప్పకుండానే మణికి ఫొటోలు పంపించాడు. అప్పుడు మణిరత్నం ‘ఇరువర్’ తీసే పనిలో ఉన్నాడు. మాధవన్‌ని పిలిపించారు. ‘ఇరువర్’కి పనికొస్తాడేమోనని మేకప్ టెస్ట్ చేయించారు. నో యూజ్. మాధవన్ నిరాశగా వెళ్లిపోయాడు. తను మళ్లీ ‘జీ’ టీవీ సీరియల్స్‌లో బిజీ. ‘ఇస్ రాత్‌కీ సుబహ్ నహీ’ (హిందీ), ‘ఇన్‌ఫెర్నో’ (ఇంగ్లిషు) సినిమాల్లో చిన్న చిన్న వేషాలు.
 
ఓ రోజు అనుకోని విధంగా మాధవన్‌కి మణిరత్నం నుంచి పిలుపు. ‘‘నా ‘సఖి’కి నువ్వే హీరో’’ - చెప్పాడు మణి. మాధవన్ కడలి అల కన్నా ఎక్కువ ఎగిరాడు సంబరంతో. వసుంధరాదాస్‌ను పిలిచారు.. హీరోయిన్ క్యారెక్టర్ కోసం! ఆమె సింగర్. కమల్‌తో ‘హే రామ్’లో చేస్తోంది. మణిరత్నం స్క్రీన్ టెస్ట్ చేయిం చాడు. ప్చ్! ఇంకా క్యూట్‌గా కావాలి.
 
చైల్డ్ ఆర్టిస్టుగా టాప్ రేంజ్‌కెళ్లిన బేబీ షాలిని ఇప్పుడు హీరోయిన్‌గా అజిత్ పక్కన ‘అమర్కళమ్’ (తెలుగులో ‘అద్భుతం’గా అనువాదమైంది) చేస్తోంది. మణికి షాలిని నచ్చేసింది. ఆమెకూ ఈ ఆఫర్ నచ్చింది. కథ నచ్చింది. కానీ రొమాంటిక్ సీన్స్‌కీ, గ్లామర్ డ్రెస్‌లు వేయడానికీ అబ్జక్షన్ చెప్పింది. ఎందుకంటే ఆమె అప్పటికే అజిత్‌తో లవ్‌లో ఉంది. మణిరత్నం ‘డోంట్ వర్రీ’ అన్నాడు. ఇక షాలినికి వర్రీ ఏముంటుంది!
 
షాలిని అక్క పాత్రకు స్వర్ణమాల్య సెలెక్టెడ్. ఆమెను పెళ్లిచూపులు చూడడాని కొచ్చే పాత్రను ఎవరైనా హీరోతో గెస్ట్‌గా చేయిస్తే? హీరో విక్రమ్‌ను అడిగారు. మరీ ఇంత చిన్న వేషమా? పెద్దదైతే చేస్తా అన్నాడు విక్రమ్. దాంతో ఆ పాత్రకు నార్మల్ యాక్టర్‌ను తీసేసుకున్నారు.
 ఈ సినిమాలో మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా పాపులర్ సీనియర్ యాక్ట్రెస్ కావాలి. వాళ్లకు దొరికిన బెస్ట్ చాయిస్ జయసుధ.

ఇంకో ఇంపార్టెంట్ రోల్. కుష్‌బూ ఓకే. ఆమె పక్కన ఎవరు బాగుంటారు? షారుక్‌ఖాన్... మమ్ముట్టి... మోహన్‌లాల్. ఫైనల్‌గా అరవింద్‌స్వామి ఓకే. ‘రోజా’తో తనను హీరోను చేసిన మణి అడిగితే, అరవింద్‌స్వామి కాదన గలడా? సినిమాలు వదిలేసి బిజినెస్‌లో బిజీ అయినవాడు కూడా గురువు కోసం వచ్చేశాడు.
   
అప్పటి వరకూ మణిరత్నం సినిమాలకు లెనిన్ లాంటివాళ్లు ఎడిటింగ్ చేశారు. ఎందుకో మణి మార్పు కోరుకు న్నాడు. ఈ విషయం శ్రీకర్ ప్రసాద్‌కి తెలిసింది. అప్పటికే ఆయన నేషనల్ అవార్డు సినిమాలకు వర్క్ చేశాడు. మణిరత్నం, శ్రీకర్ ప్రసాద్ ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. తన మనసుకు నచ్చే టెక్నీషియన్ అనిపించింది మణిరత్నానికి. పీసీ శ్రీరామ్ టాప్ కెమేరామన్. మణిరత్నంతో కలిశాడంటే మ్యాజిక్కులే మ్యాజిక్కులు. ‘రోజా’ నుంచి రెహమాన్ చేయి వదలడం లేదు మణి. దీనికి మాత్రం వదులుతాడా?
   
చడీచప్పుడు లేకుండా షూటింగ్ స్టార్ట్ చేసేశాడు మణిరత్నం. పూజలు, ముహూర్తపు షాట్లు కూడా లేవు. జయసుధ మీద ఫస్ట్ షాట్. నాలుగు నెలల్లో సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేసేయాలి. మణిరత్నం టార్గెట్.
చెన్నై, కననూర్, ముంబై, శ్రీనగర్, పోర్ట్‌బ్లెయిర్, మహేశ్వర్, ఆగ్రా, ధోల్‌పూర్... ఇలా అన్నీ బ్యూటిఫుల్ లొకేషన్స్. పీసీ తన షాట్స్‌తో మేజిక్ చేయడం మొదలుపెట్టాడు.
టైటిల్‌సాంగ్ ‘అలై పొంగెరా...’ పాట తీస్తున్నారు. అంతా పెళ్లి సందడి. పేరంటాళ్ల హడావిడి కావాలి. సుహాసిని తన బంధువులందర్నీ పిలిచారు.

వాళ్ల అమ్మను కూడా! వాళ్లపై మణి ఈ పాట తీయాలి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సిగ్గుపడుతూనే ఈ పాట పూర్తి చేశాడు.
 మాధవన్, షాలిని పెళ్లయ్యాక కాపురం పెట్టడానికి ఓ ఇల్లు కావాలి. అది కూడా ఫినిష్ కానిది. చెన్నైలో ఓ పది బిల్డింగ్‌లు చూసి, ఒకటి సెలెక్ట్ చేశారు. కావాలనే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఇలాంటి అన్‌ఫినిష్డ్ బిల్డింగ్ ఎంచుకున్నారు. వీళ్ల మధ్య బంధం కూడా ఇలా అన్‌ఫినిష్డ్‌గానే ఉందని రిప్రజెంటేషన్ అన్నమాట.
 
‘పచ్చదనమే...’ పాటను రకరకాల రంగులతో కలర్‌ఫుల్‌గా ప్లాన్ చేసి తీశారు. ‘దిల్ సే’లోని ‘సత్ రంగీరే’ పాటకు ఓ రకంగా ఇది కొనసాగింపు. ‘కాయ్ లవ్ చెడుగుడు...’ పాటను రివర్స్ టెక్నిక్ యూజ్ చేసి తీశారు. కొంత వెర్షన్ తీశాక యావిడ్‌లో చెక్ చేసి చూస్తే లిప్ సింక్ కావడం లేదు. దాంతో మాధవన్‌ను ఆ పాటను రివర్స్‌లో పాడమన్నారు. మాధవన్ కష్టపడి బట్టీపట్టి మరీ నేర్చుకున్నాడు.
   
తెలుగు వెర్షన్ హక్కులు ఫేమస్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎన్.వి. ప్రసాద్ తీసుకున్నాడు. తెలుగులో తన కెంత క్రేజుందో మణికి బాగా తెలుసు. ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వాళ్లకు కలగకూడదు. అందుకే ప్రతి సినిమాకీ స్పెషల్ కేర్ తీసుకుంటాడు. పాటలన్నీ వేటూరితో రాయించుకున్నాడు. వేటూరి అంటే మణికి చాలా ఇష్టం. గీతాంజలి, బొంబాయి సినిమాలకు వేటూరే పాటలు రాశారు. తెలుగు డైలాగ్‌‌స బాధ్యత అంతా శ్రీరామకృష్ణకే అప్ప గించారు. ‘బొంబాయి’ సినిమా నుంచి మణి టీమ్‌లో ఆయన పర్మినెంట్ మెంబర్.
   
‘సఖి’కి అందరూ గులామ్.  ప్రేమజంట పెళ్లయ్యాక ఎలా బిహేవ్ చేస్తారనే కాన్సెప్ట్‌కి ఆడియన్స్ ఫిదా.

అసలు మణిరత్నం టేకింగ్ ఎక్స్‌ట్రార్డినరీ. క్లైమాక్స్‌లో హాస్పిటల్ బెడ్ మీద మాధవన్, షాలిని మళ్లీ ‘ఐ లవ్యూ’ చెప్పుకోవడం, వాళ్ల ఎక్స్‌ప్రెషన్స్, చిన్న చిన్న డైలాగులు... ఇలాంటివన్నీ మణి మాత్రమే తీయగలడనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ సాంగ్స్‌తోనూ, రీరికార్డింగ్ తోనూ చెలరేగిపోయాడు. చాలా గ్యాప్ తర్వాత జానకమ్మ పాడిన ‘సెప్టెంబర్ మాసం అక్టోబర్ మాసం’ పాటను వింటుంటే పాత బాధలన్నీ మర్చిపోతాం.

చాలా రోజుల గ్యాప్ తర్వాత జానకమ్మ ఆలపించిన పాట ఇది. పీసీ శ్రీరామ్ అయితే ఈ సినిమాకు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్. కెమెరాను కలంగా మార్చి సెల్యులాయిడ్‌పై రొమాంటిక్ పొయిట్రీ రాసేశాడాయన. సినిమాలో ప్రతి ఫ్రేమూ ఐ ఫీస్టే. అందుకే ‘బెస్ట్ సినిమాటోగ్రాఫర్’గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. డీటీఎస్ మిక్సింగ్ చేసిన హెచ్.శ్రీధర్‌కూ బెస్ట్ ఆడియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డు.
   
మణిరత్నం అంటేనే బాక్సాఫీస్‌కి పచ్చదనం. అందుకే మణిరత్నం ఎప్పుడూ పచ్చగానే ఉండాలి! ఆయన తీసిన ప్రేమకథల్లో ‘సఖి’ కూడా అప్పటికీ, ఇప్పటికీ ఒక ఆకుపచ్చని జ్ఞాపకం!
 
వెరీ ఇంట్రస్టింగ్...
* సాఫ్ట్‌వేర్ బూమ్ గురించి తొలిసారిగా సెల్యులాయిడ్ మీద చర్చించిన సినిమా ఇదే.
* మాధవన్‌కి శ్రీనివాసమూర్తి, షాలినికి సరిత డబ్బింగ్ చెప్పారు. ‘పిరమిడ్’ నటరాజన్‌కు సీనియర్ నటుడు నర్రా వెంకటేశ్వరరావు గాత్రదానం చేశారు.
- పులగం చిన్నారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement