ఎంద చేట... | Rajendrudu Gajendrudu movie famous dialogue | Sakshi
Sakshi News home page

ఎంద చేట...

Published Mon, May 25 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

ఎంద చేట...

ఎంద చేట...

బొందితో స్వర్గానికి వెళ్లినవారి గురించి మనం పురాణాల్లో చదువుకున్నాం. కానీ, చేటతో స్టార్‌డమ్ తెచ్చుకున్న నటుడు గురించి మీకు తెలుసా? అయితే అర్జంటుగా మీకు మరోసారి ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ సినిమా చూపించాల్సిందే. ఛలో ఛలో...
 
హిట్ క్యారెక్టర్
సినిమా పేరు: రాజేంద్రుడు-గజేంద్రుడు (1993)
డెరైక్ట్ చేసింది: ఎస్వీ కృష్ణారెడ్డి

సినిమా తీసింది: కె. అచ్చిరెడ్డి
మాటలు రాసింది: దివాకర్‌బాబు
 
సీన్ నం.1
‘‘నమష్కారం’’
‘‘ఆ... నమస్కారం నమస్కారం’’ చెప్పాడు సూర్య బ్యాంకు మేనేజర్. ఆ నమష్కారం పెట్టినతను బక్కపలచగా ఉన్నాడు. తమాషాగా ఉన్నాడు... కొంటెగా ఉన్నాడు... చిత్రాతి చిత్రంగా ఉన్నాడు. పై నుంచి కింద వరకూ ప్యాంటూ చొక్కా అంతా గళ్లమయం.
‘నీకేం కావాలి బాబూ?’’ అడిగాడు బ్యాంకు మేనేజర్.
‘‘ఎంద చేట...ఎంద తూమారీ... జుంజుబిల సదస్సు నటశ్రీ బిల కాంభోజిని బిల సత్యాల కాదిని...హరిమిలై ఒరు కాట్రవల్లి కండో... కండీసరు కండెల్లు మనసిలాయ... చేట... ఒరు కారీమర... ఎంద కాట్రవల్లి కండ్రో... పల్లి... సుక్కుమరు సుర్ర... చేట... బజ్జల గూడో... చేట ఒరు కారుమిందలి... చేట... చేట... బెల్లం కుడికల్లి...’’
 
ఇలా ఆ కుర్రాడు ఏదో భాషలో చెప్పుకుంటూ పోతున్నాడు. బ్యాంకు మేనేజర్‌కి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. రోహిణికార్తె ఎండలో రోజంతా తిరిగినా వడదెబ్బ తగలనివాడు, ఈ చేట దెబ్బకు మాత్రం కుదేలైపోయాడు. కకావికలైపోయాడు. గ్లాసుడు మంచి నీళ్లు గటగటా తాగిపారేశాడు. ‘‘ఒరేయ్... నువ్వట్టా మాట్టాడమాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా? తమిళమా? మలయాళమా? పంజాబీనా? నాకర్థం కావడం లేదు. చేట అంటావు. బెల్లమంటావు... నీ అమ్మ కడుపు మాడా...’’ అంటూ తన టేబుల్ మీదున్న ఫైల్స్‌తో అతణ్ణి దబదబా బాది పంపించేశాడు. అమ్మయ్యా... సునామీ వెళ్లిపోయింది.
 
సీన్ నం.2
ఆ రోడ్డులో తిరుగుతూ సబ్బులమ్ముకుంటున్నాడతను. ఈ రోజు ఈ సబ్బులన్నీ అమ్మేసి, తన మరదలితో పెళ్లి సంబంధం ఖాయం చేయించేసుకోవాలి. అదీ ప్లాను.  ఇంతవరకూ ఒక్క సబ్బు సేల్ కాలేదు.  ఎవడైనా బకరా దొరికితే బాగుణ్ణు. అబ్బ... దొరికేశాడు. సైకిల్ మీద వస్తున్నాడు. చిత్రవిచిత్రమైన గళ్ల డ్రెస్సు. అర్ధమైందిగా... అతనెవరో?! ఆ కుర్రాణ్ణి ఆపాడు.
 
‘‘సబ్బులు.. సువాసనల సబ్బులు... సినీతారలు వాడే సబ్బులు... ఒక సబ్బు కొంటే ఒక సబ్బు ఫ్రీ’’ అన్నాడు సబ్బులోడు. ఆ కుర్రాడు చాలా అమాయకంగా మొహం పెట్టి ‘‘ఎంద చేట’’ అన్నాడు. ఈ సబ్బులోడు వదిలిపెట్టేలా లేడు. ‘‘చేట కాదు సార్... సబ్బులు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వాడే సబ్బులు’’ చెప్పాడు గొప్పగా. దానికా కుర్రాడు ‘‘ఎంద చిరుయో... ఎంద బాలయో... ఎంద నాగయో... ఎంద వెంకియో... ఎంద పరంద చేట’’ అన్నాడు.
 
ఈ సబ్బులోడికి తిక్క రేగింది. కాస్త గొంతు పెంచి ‘‘చేట కాదు సబ్బు... ఇది వాడితే గజ్జి, తామర, చిడుమూ, వంటినొప్పులు, పంటి నొప్పులు పోతాయి’’ అని చెప్పాడు.
 దానికా చేటగాడు ‘‘ఎంద గజ్జియో.. ఎంద తామరయో... ఎంద చుండ్రుయో... ఎంద పరింద చేట...’’ అన్నాడు. సబ్బులోడికి ఎక్కడో కాలింది. వీణ్ణి ఎలాగైనా ఓ పట్టు పట్టాలని డిసైడ్ అయిపోయాడు.
 
‘‘ఈ సబ్బు రాస్తే నలుపు పోతుంది. నాలా తెల్లగా తయారవుతావు’’ అని చెప్పాడు. ఆ చేటగాడు వెర్రి మొహం పెట్టి ఆ సబ్బు వంక, అతని కలర్ వంక కాసేపు చూశాడు.
 ‘‘ఎంద పరంద ఇంద ఫేసు’’ అని కోపంతో ఓ సబ్బు లాక్కుని నేలకేసి కొట్టాడు. ఆ సబ్బులోడిక్కూడా కోపం వచ్చినట్టుంది. తన దగ్గరున్న సబ్బుల్ని విసిరికొట్టాడు. మొత్తానికి సబ్బులన్నీ నేలపాలయ్యాయి.
 
సీన్ నం. 3
బ్యాంకు మేనేజర్ ఇంట్లో చాలా బిజీగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎంటరయ్యాడు మన చేటగాడు. వెళ్లి నమష్కారం పెట్టి ‘‘ఎంద చేట’’ అన్నాడు. బ్యాంకులో ఒక్కసారిగా చెక్కులన్నీ బౌన్స్ అయినంతగా కంగారు పడిపోయాడు మేనేజర్. ‘‘నువ్వెక్కడ దాపురించావురా... నేనేం అపకారం చేశాన్రా’’ అంటూ అక్కడున్న కుర్చీ తీసుకుని చేటగాడికి ఒక్కటి తగిలించాడు.
 
సీన్ నం. 4
బ్యాంకు మేనేజర్ దగ్గర మళ్లీ ప్రత్యక్షమయ్యాడు చేటగాడు. ఎలాగైనా ఈ రోజు ఈ చేట గురించి తేల్చేయాలని డిసైడైపోయాడు బ్యాంకు మేనేజర్. యాడ్స్ మధ్యలో సినిమాలాగా సబ్బులోడొచ్చాడు. ఈసారి అతని దగ్గర సబ్బుల్లేవు. పెన్నులున్నాయి. ఈ రోజు ఎలాగైనా పెన్నులమ్మేయాలని డిసైడ్ అయిపోయి మరీ వచ్చాడు. బ్యాంక్‌లో అయితే మొత్తం కొనేస్తాడని ఆశ. ‘‘వాడి దగ్గర చేట అంటే ఏంటో కనిపెడితే నీ పెన్నులన్నీ కొనేస్తా’’ ఆఫరిచ్చాడు బ్యాంకు మేనేజర్.
 
పాళీ విరిగి ఇంకులో పడినంత ఆనందపడిపోయాడు పెన్నులోడు. కురుక్షేత్రం మొదలైంది. ఇటు చేటగాడు... అటు పెన్నులోడు. వాడు చేట అంటాడు. వీడు బుచికి బుచికీ అంటాడు. ఇద్దరూ ఎక్కడా తగ్గడం లేదు.  పిచ్చి భాష... పిచ్చి పిచ్చి మాటలు... ఫైనల్‌గా పెన్నులోడు ‘‘పోలీసు బుచికీ’’ అనే మాట వాడాడు. పోలీసు మాట వినగానే చేటగాడికి కంగారు పుట్టింది. దడ పుట్టింది. బోల్డంత భయమేసేసింది.
 
‘‘నన్ను క్షమించండి సార్’’ అంటూ బ్యాంకు మేనేజర్ కాళ్లు పట్టుకున్నాడు. ‘‘తెలుగు రాదని చెప్పి నన్ను ఇన్నాళ్లూ హింసించావు కదరా’’ వాపోయాడు బ్యాంకు మేనేజర్. వాడు నసుగుతూ, నట్లు కొడుతూ అసలు విషయం చెప్పాడు. ‘‘నేను చేటల వ్యాపారం పెట్టుకుందామను కుంటున్నా. మీ బ్యాంకులో లోను ఇస్తారేమోనని... ఇలా వెంటపడుతున్నా...’’ ఇక బ్యాంకు మేనేజర్ ఫేసు చూడాలి. చేటంత ఫేసు చెల్లాచెదురై పోయింది.
- పులగం చిన్నారాయణ
 
ఈ చేట నా జీవితాన్నే మార్చేసింది!
‘‘నటునిగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయమది. సరిగ్గా ఆ టైమ్‌లోనే నాకో మంత్రపదం దొరికింది. అది నా జీవితాన్నే మార్చేసింది. ఆ పదమే ‘చేట’. అసలు ఈ పదం ఎలా పుట్టిందంటే... అప్పట్లో మద్రాసులో ఏమీ తోచక సినిమాలకు వెళ్లేవాణ్ణి. చివరకు మలయాళ సినిమాలు కూడా వదిలేవాణ్ణి కాదు. మమ్ముట్టి నటించిన ‘సీబీఐ డైరీ’ నాకు బాగా నచ్చేసింది. ఆ సినిమాలో సౌండ్స్ గుర్తు పెట్టుకుని పిచ్చి మలయాళం మాట్లాడేవాణ్ణి.

మలయాళంలో ‘చేట’ అంటే ‘అన్న’ అని అర్థం. వైజాగ్‌లో ‘జంబలకిడి పంబ’ షూటింగ్‌లో సరదాగా ‘చేట’ అంటూ మాట్లాడుతుంటే, రచయిత దివాకర్‌బాబు ఆసక్తి కనబరిచారు. ఆయనే ఎస్వీ కృష్ణారెడ్డిగారికి చెబితే ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’లో ఈ పాత్ర సృష్టించారు. ఈ పాత్ర ఎంత పాపులరైందో, నాకెంత బ్రేకిచ్చిందో మీ అందరికీ తెలుసు.’’                            - అలీ
 
ఆ రెండు పాత్రల్ని బట్టి స్క్రిప్ట్ ప్లాన్ చేశాం!
‘‘మద్రాసులోని దేవర్ ఫిలిమ్స్ వాళ్ళ దగ్గర ఓ ఏనుగుపిల్ల ఉండేది. మావటివాడు ‘జూ... లగ’ అంటే, తల నిలువుగా ఊపడం, అడ్డంగా ఊపడం, కుంటడం లాంటి నాలుగు పనులు చేసేది. ఆ ఏనుగును చూసి, అది చేయగల పనులను బట్టి ఆ పాత్ర, అలీ మ్యానరిజమ్ చూసి ‘చేట’ పాత్ర - రెండూ అల్లుకొని, దాన్ని బట్టి సినిమా స్క్రిప్ట్ ప్లాన్ చేసుకున్నాం.

‘చేట’ డైలాగ్, ఆ పాత్ర అలీకి ఎంతటి స్టార్ స్టేటస్ తెచ్చాయంటే, చివరకు అలీని హీరోగా పెట్టి నేనే ‘యమలీల’ సినిమా చేశా. ఇవాళ్టికీ ‘చేట’ పాత్ర, ఆ సినిమా, ప్రతిభావంతుడైన అలీ గొప్ప ఆర్టిస్ట్‌గా ఎదిగిన తీరును చూస్తుంటే నాకెంతో ఆనందంగా, కించిత్ గర్వంగా ఉంటుంది.’’                                         - ఎస్.వి. కృష్ణారెడ్డి, డెరైక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement