సాక్షి, చెన్నూర్: చిన్ననాటి నుంచి ఆమెకు నాటకాలు, డ్రామాలు అంటే మక్కువ. ఆ మక్కువే నేడు సినిమాలో చాన్స్ దక్కించింది. చదువుకునే సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంలో వెబ్‌సీరిస్‌లోకి అడుగుపెట్టింది. “వరంగల్ వందన’ వెబ్‌సీరిస్‌లో తన నటనకు మంచి మార్కులు దక్కించుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌లో నంబర్‌వన్ స్థానంలోకి చేరింది. ఇటీవల సినిమాలో సైతం చాన్స్ దక్కించుకుంది. ఫలితంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణం నుంచి వెండితెరపై మెరవనున్న తొలి మహిళగా సుష్మగోపాల్ నిలవనుంది.
సినీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డితో సుష్మగోపాల్
చెన్నూర్‌కు చెందిన సుష్మ...
చెన్నూర్‌కు చెందిన ప్రైవేట్ వైద్యుడు తిప్పార్తి వేణుగోపాల్, శ్రీకళ దంపతుల కుమార్తె సుష్మగోపాల్. చెన్నూర్‌లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంది. 2019న హైదరాబాద్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుండగా.. వరంగల్ వందన వెబ్‌సీరిస్‌లో చాన్స్ దక్కింది. రచయిత ప్రజా ప్రభాకర్, డైరెక్టర్ శృతి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వెబ్ సీరిస్‌లో నటించింది. ఇప్పటివరకు 80కి పైగా వెబ్ సీరిస్‌లో నటించిన సుష్మగోపాల్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ట్రెండింగ్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. ఓవైపు వెబ్‌సీరిస్‌లో నటిస్తూనే ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో డిగ్రీ చేస్తూ మరోవైపు వెబ్ సీరిస్‌ల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం సినిమాలో నటించే చాన్స్ రావడంతో సుష్మగోపాల్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సభ్యులతో ..
సినీ రంగ ప్రవేశం
వెబ్‌సిరీస్‌లో రాణిస్తున్న సుష్మగోపాల్‌కు ఒక్కసారిగా వెండితెరపై నటించే అవకాశం వచ్చింది. సినీ నటుడు అలీ, నరేశ్ నటిస్తున్న అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాను శ్రీపురం కిరణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది. సినిమాలో ప్రధాన పాత్రధారి చెల్లె పాత్రలో సుష్మ నటిస్తోంది.
10 లక్షల చేరువలో వెబ్‌సీరిస్
వరంగల్ వందన వెబ్‌సీరిస్ ఏడాదికి లక్ష మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది. దీంతో వరంగల్ కలెక్టర్ పాటిల్ ప్రశాంత్‌జీవన్ వెబ్ సిరీస్ బృందాన్ని అభినందించి మెమోంటో అందజేశారు. ప్రస్తుతం వరంగల్ వందన యూట్యూబ్ వెబ్ సిరీస్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 10లక్షల సబ్ స్క్రైబర్‌కు చేరువలో ఉంది. సుష్మగోపాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 50వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది.
చదువుతో పాటు...
చదువుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లాను. మా అన్నయ్య విష్ణు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటర్ చదువుతూనే వెబ్‌సిరీస్‌లో నటించాను. మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఓ సినిమాలో చాన్స్ వచ్చింది. రానున్న రోజుల్లో మంచి పేరు తీసుకువచ్చే పాత్ర చేస్తా. మంచి నటిగా పేరు సంపాదించాలనేదే నా లక్ష్యం.
– తిప్పార్తి సుష్మగోపాల్, సినీనటి, చెన్నూర్
Comments
Please login to add a commentAdd a comment