rajendrudu-gajendrudu
-
ఎంద చేట...
బొందితో స్వర్గానికి వెళ్లినవారి గురించి మనం పురాణాల్లో చదువుకున్నాం. కానీ, చేటతో స్టార్డమ్ తెచ్చుకున్న నటుడు గురించి మీకు తెలుసా? అయితే అర్జంటుగా మీకు మరోసారి ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ సినిమా చూపించాల్సిందే. ఛలో ఛలో... హిట్ క్యారెక్టర్ సినిమా పేరు: రాజేంద్రుడు-గజేంద్రుడు (1993) డెరైక్ట్ చేసింది: ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా తీసింది: కె. అచ్చిరెడ్డి మాటలు రాసింది: దివాకర్‌బాబు సీన్ నం.1 ‘‘నమష్కారం’’ ‘‘ఆ... నమస్కారం నమస్కారం’’ చెప్పాడు సూర్య బ్యాంకు మేనేజర్. ఆ నమష్కారం పెట్టినతను బక్కపలచగా ఉన్నాడు. తమాషాగా ఉన్నాడు... కొంటెగా ఉన్నాడు... చిత్రాతి చిత్రంగా ఉన్నాడు. పై నుంచి కింద వరకూ ప్యాంటూ చొక్కా అంతా గళ్లమయం. ‘నీకేం కావాలి బాబూ?’’ అడిగాడు బ్యాంకు మేనేజర్. ‘‘ఎంద చేట...ఎంద తూమారీ... జుంజుబిల సదస్సు నటశ్రీ బిల కాంభోజిని బిల సత్యాల కాదిని...హరిమిలై ఒరు కాట్రవల్లి కండో... కండీసరు కండెల్లు మనసిలాయ... చేట... ఒరు కారీమర... ఎంద కాట్రవల్లి కండ్రో... పల్లి... సుక్కుమరు సుర్ర... చేట... బజ్జల గూడో... చేట ఒరు కారుమిందలి... చేట... చేట... బెల్లం కుడికల్లి...’’ ఇలా ఆ కుర్రాడు ఏదో భాషలో చెప్పుకుంటూ పోతున్నాడు. బ్యాంకు మేనేజర్‌కి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. రోహిణికార్తె ఎండలో రోజంతా తిరిగినా వడదెబ్బ తగలనివాడు, ఈ చేట దెబ్బకు మాత్రం కుదేలైపోయాడు. కకావికలైపోయాడు. గ్లాసుడు మంచి నీళ్లు గటగటా తాగిపారేశాడు. ‘‘ఒరేయ్... నువ్వట్టా మాట్టాడమాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా? తమిళమా? మలయాళమా? పంజాబీనా? నాకర్థం కావడం లేదు. చేట అంటావు. బెల్లమంటావు... నీ అమ్మ కడుపు మాడా...’’ అంటూ తన టేబుల్ మీదున్న ఫైల్స్‌తో అతణ్ణి దబదబా బాది పంపించేశాడు. అమ్మయ్యా... సునామీ వెళ్లిపోయింది. సీన్ నం.2 ఆ రోడ్డులో తిరుగుతూ సబ్బులమ్ముకుంటున్నాడతను. ఈ రోజు ఈ సబ్బులన్నీ అమ్మేసి, తన మరదలితో పెళ్లి సంబంధం ఖాయం చేయించేసుకోవాలి. అదీ ప్లాను. ఇంతవరకూ ఒక్క సబ్బు సేల్ కాలేదు. ఎవడైనా బకరా దొరికితే బాగుణ్ణు. అబ్బ... దొరికేశాడు. సైకిల్ మీద వస్తున్నాడు. చిత్రవిచిత్రమైన గళ్ల డ్రెస్సు. అర్ధమైందిగా... అతనెవరో?! ఆ కుర్రాణ్ణి ఆపాడు. ‘‘సబ్బులు.. సువాసనల సబ్బులు... సినీతారలు వాడే సబ్బులు... ఒక సబ్బు కొంటే ఒక సబ్బు ఫ్రీ’’ అన్నాడు సబ్బులోడు. ఆ కుర్రాడు చాలా అమాయకంగా మొహం పెట్టి ‘‘ఎంద చేట’’ అన్నాడు. ఈ సబ్బులోడు వదిలిపెట్టేలా లేడు. ‘‘చేట కాదు సార్... సబ్బులు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వాడే సబ్బులు’’ చెప్పాడు గొప్పగా. దానికా కుర్రాడు ‘‘ఎంద చిరుయో... ఎంద బాలయో... ఎంద నాగయో... ఎంద వెంకియో... ఎంద పరంద చేట’’ అన్నాడు. ఈ సబ్బులోడికి తిక్క రేగింది. కాస్త గొంతు పెంచి ‘‘చేట కాదు సబ్బు... ఇది వాడితే గజ్జి, తామర, చిడుమూ, వంటినొప్పులు, పంటి నొప్పులు పోతాయి’’ అని చెప్పాడు. దానికా చేటగాడు ‘‘ఎంద గజ్జియో.. ఎంద తామరయో... ఎంద చుండ్రుయో... ఎంద పరింద చేట...’’ అన్నాడు. సబ్బులోడికి ఎక్కడో కాలింది. వీణ్ణి ఎలాగైనా ఓ పట్టు పట్టాలని డిసైడ్ అయిపోయాడు. ‘‘ఈ సబ్బు రాస్తే నలుపు పోతుంది. నాలా తెల్లగా తయారవుతావు’’ అని చెప్పాడు. ఆ చేటగాడు వెర్రి మొహం పెట్టి ఆ సబ్బు వంక, అతని కలర్ వంక కాసేపు చూశాడు. ‘‘ఎంద పరంద ఇంద ఫేసు’’ అని కోపంతో ఓ సబ్బు లాక్కుని నేలకేసి కొట్టాడు. ఆ సబ్బులోడిక్కూడా కోపం వచ్చినట్టుంది. తన దగ్గరున్న సబ్బుల్ని విసిరికొట్టాడు. మొత్తానికి సబ్బులన్నీ నేలపాలయ్యాయి. సీన్ నం. 3 బ్యాంకు మేనేజర్ ఇంట్లో చాలా బిజీగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎంటరయ్యాడు మన చేటగాడు. వెళ్లి నమష్కారం పెట్టి ‘‘ఎంద చేట’’ అన్నాడు. బ్యాంకులో ఒక్కసారిగా చెక్కులన్నీ బౌన్స్ అయినంతగా కంగారు పడిపోయాడు మేనేజర్. ‘‘నువ్వెక్కడ దాపురించావురా... నేనేం అపకారం చేశాన్రా’’ అంటూ అక్కడున్న కుర్చీ తీసుకుని చేటగాడికి ఒక్కటి తగిలించాడు. సీన్ నం. 4 బ్యాంకు మేనేజర్ దగ్గర మళ్లీ ప్రత్యక్షమయ్యాడు చేటగాడు. ఎలాగైనా ఈ రోజు ఈ చేట గురించి తేల్చేయాలని డిసైడైపోయాడు బ్యాంకు మేనేజర్. యాడ్స్ మధ్యలో సినిమాలాగా సబ్బులోడొచ్చాడు. ఈసారి అతని దగ్గర సబ్బుల్లేవు. పెన్నులున్నాయి. ఈ రోజు ఎలాగైనా పెన్నులమ్మేయాలని డిసైడ్ అయిపోయి మరీ వచ్చాడు. బ్యాంక్‌లో అయితే మొత్తం కొనేస్తాడని ఆశ. ‘‘వాడి దగ్గర చేట అంటే ఏంటో కనిపెడితే నీ పెన్నులన్నీ కొనేస్తా’’ ఆఫరిచ్చాడు బ్యాంకు మేనేజర్. పాళీ విరిగి ఇంకులో పడినంత ఆనందపడిపోయాడు పెన్నులోడు. కురుక్షేత్రం మొదలైంది. ఇటు చేటగాడు... అటు పెన్నులోడు. వాడు చేట అంటాడు. వీడు బుచికి బుచికీ అంటాడు. ఇద్దరూ ఎక్కడా తగ్గడం లేదు. పిచ్చి భాష... పిచ్చి పిచ్చి మాటలు... ఫైనల్‌గా పెన్నులోడు ‘‘పోలీసు బుచికీ’’ అనే మాట వాడాడు. పోలీసు మాట వినగానే చేటగాడికి కంగారు పుట్టింది. దడ పుట్టింది. బోల్డంత భయమేసేసింది. ‘‘నన్ను క్షమించండి సార్’’ అంటూ బ్యాంకు మేనేజర్ కాళ్లు పట్టుకున్నాడు. ‘‘తెలుగు రాదని చెప్పి నన్ను ఇన్నాళ్లూ హింసించావు కదరా’’ వాపోయాడు బ్యాంకు మేనేజర్. వాడు నసుగుతూ, నట్లు కొడుతూ అసలు విషయం చెప్పాడు. ‘‘నేను చేటల వ్యాపారం పెట్టుకుందామను కుంటున్నా. మీ బ్యాంకులో లోను ఇస్తారేమోనని... ఇలా వెంటపడుతున్నా...’’ ఇక బ్యాంకు మేనేజర్ ఫేసు చూడాలి. చేటంత ఫేసు చెల్లాచెదురై పోయింది. - పులగం చిన్నారాయణ ఈ చేట నా జీవితాన్నే మార్చేసింది! ‘‘నటునిగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయమది. సరిగ్గా ఆ టైమ్‌లోనే నాకో మంత్రపదం దొరికింది. అది నా జీవితాన్నే మార్చేసింది. ఆ పదమే ‘చేట’. అసలు ఈ పదం ఎలా పుట్టిందంటే... అప్పట్లో మద్రాసులో ఏమీ తోచక సినిమాలకు వెళ్లేవాణ్ణి. చివరకు మలయాళ సినిమాలు కూడా వదిలేవాణ్ణి కాదు. మమ్ముట్టి నటించిన ‘సీబీఐ డైరీ’ నాకు బాగా నచ్చేసింది. ఆ సినిమాలో సౌండ్స్ గుర్తు పెట్టుకుని పిచ్చి మలయాళం మాట్లాడేవాణ్ణి. మలయాళంలో ‘చేట’ అంటే ‘అన్న’ అని అర్థం. వైజాగ్‌లో ‘జంబలకిడి పంబ’ షూటింగ్లో సరదాగా ‘చేట’ అంటూ మాట్లాడుతుంటే, రచయిత దివాకర్‌బాబు ఆసక్తి కనబరిచారు. ఆయనే ఎస్వీ కృష్ణారెడ్డిగారికి చెబితే ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’లో ఈ పాత్ర సృష్టించారు. ఈ పాత్ర ఎంత పాపులరైందో, నాకెంత బ్రేకిచ్చిందో మీ అందరికీ తెలుసు.’’ - అలీ ఆ రెండు పాత్రల్ని బట్టి స్క్రిప్ట్ ప్లాన్ చేశాం! ‘‘మద్రాసులోని దేవర్ ఫిలిమ్స్ వాళ్ళ దగ్గర ఓ ఏనుగుపిల్ల ఉండేది. మావటివాడు ‘జూ... లగ’ అంటే, తల నిలువుగా ఊపడం, అడ్డంగా ఊపడం, కుంటడం లాంటి నాలుగు పనులు చేసేది. ఆ ఏనుగును చూసి, అది చేయగల పనులను బట్టి ఆ పాత్ర, అలీ మ్యానరిజమ్ చూసి ‘చేట’ పాత్ర - రెండూ అల్లుకొని, దాన్ని బట్టి సినిమా స్క్రిప్ట్ ప్లాన్ చేసుకున్నాం. ‘చేట’ డైలాగ్, ఆ పాత్ర అలీకి ఎంతటి స్టార్ స్టేటస్ తెచ్చాయంటే, చివరకు అలీని హీరోగా పెట్టి నేనే ‘యమలీల’ సినిమా చేశా. ఇవాళ్టికీ ‘చేట’ పాత్ర, ఆ సినిమా, ప్రతిభావంతుడైన అలీ గొప్ప ఆర్టిస్ట్‌గా ఎదిగిన తీరును చూస్తుంటే నాకెంతో ఆనందంగా, కించిత్ గర్వంగా ఉంటుంది.’’ - ఎస్.వి. కృష్ణారెడ్డి, డెరైక్టర్ -
నా రూట్‌లోట్రైన్ పరిగెత్తాలంటే దానికి సిద్ధపడే ప్రయాణికులు కావాలి
‘మనం ఆ స్థాయికి చేరుకోవాలి’ అని ఊహాగానాలు చేస్తే, అది అబద్ధపు కల అవుతుంది. అందుకే, చేరుకో బోయే స్థాయి గురించి కాకుండా, మార్గం గురించి మాత్రమే ఆలోచించాలి. వృత్తిపరంగా నా ఎదుగుదల మీద నాకెలాంటి అపనమ్మకమూ ఉండేది కాదు. ఎదుగుతానని తెలుసు.. కానీ ఈ స్థాయిని మాత్రం ఊహించలేదు. ‘‘అందరూ వెళ్లే దారిని అనుసరిస్తే, క్యూలో వెనుక బడిపోతాం. అదే మనదైన దారి సృష్టించుకుంటే క్యూలో ముందుంటాం. అందుకే, నా దారిలోనే నేను వెళతాను’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘రాజేంద్రుడు-గజేంద్రుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, మావిచిగురు...’ ఇలా కుటుంబసమేతంగా చూడదగ్గ అనేక చిత్రాలను అందించిన ఘనత ఎస్వీకేది. కొంత విరామం తర్వాత ఆయన ‘యమలీల 2’కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఎస్వీకే పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... ఈ మధ్య కాస్త వెనకబడ్డారు. ఇలా వెనకడుగు వేయడం మళ్లీ విజృంభించడానికేనా? సినిమాల్లో వెనకడుగు, ముందడుగు అనేవి ఉండవు. దేన్నయినా సరే కాలమే ప్రశ్నిస్తుంది.. కాలమే సమాధానం చెబుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా జరగడం సహజం. నేను వెనుకబడింది వాస్తవమే. దీనికి కారణం నేను చేసిన ఇంగ్లిష్ సినిమా ‘డైవోర్స్ ఇన్విటేషన్’. ఓ ఏడాదిలో ఆ సినిమాని పూర్తి చేద్దామనుకున్నా. కానీ, మూడేళ్లు పట్టింది. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేద్దామనుకున్నా. కానీ, నా మార్క్ సినిమాలు తీసే నిర్మాతలు కావాలి కదా. ‘నాతో సినిమా చేస్తారా’ అని ఎవరినైనా అడగడం నాకు చేతకాని విద్య. నా మొదటి సినిమా కూడా మా సొంత సంస్థలోనే చేశాం. ద్వంద్వార్థాలతో అభ్యంతరకరమైన సినిమాలు అస్సలు చేయను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి నియమాలు పెట్టుకున్నవాళ్లతో ఎవరు సినిమాలు చేస్తారు? అలాగని, నా తీరు మార్చుకోలేను. ‘డబ్బులు (ఖర్చు) తక్కువ, బూతులెక్కువ’ ఉన్న సినిమాలైతే ‘ఓకే’ అనే తరహాలో ఉన్న నిర్మాతల సంఖ్యే ప్రస్తుతం ఎక్కువ. కానీ, నా రూల్స్ నేను అధిగమించలేను. ఫైనల్‌గా సినిమాలంటే మమకారం ఉన్నవాళ్లు దొరకడంతో ‘యమలీల 2’ చేశా. మీ నుంచి సినిమాలు రాకపోవడంతో మిమ్మల్ని ఇష్టపడేవాళ్లకు అది ఓ వెలితిగా మారింది... అవును.. ‘ఏంటండీ సినిమాలు చేయడంలేదు’ అని వాళ్లు అడిగినప్పుడల్లా, నేనూ ఫీలవుతుంటాను. కానీ, ‘మీ సంస్కారాన్ని మీరు వదులుకోవాల్సిన అవసరం లేదు. మీ మార్క్ సినిమా తీద్దాం. మీ రూల్స్ మీరు దాటొద్దు’ అనే నిర్మాతలు రావాలి కదా. అలాగని నిర్మాతలను తప్పుబట్టలేం. డబ్బులు పెట్టే నిర్మాతలు ‘మొన్న ఫలానా సినిమా వచ్చింది. దాంట్లో మంచి మసాలా ఉంది. అలాంటి సినిమా చేద్దాం’ అనుకుంటారు. అది వాళ్ల ఇష్టం. ఇక, నా సినిమాలో హీరోయిన్గా నటించమని స్టార్ హీరోయిన్లను అడిగితే.. ‘చీర కట్టుకోమంటారేమో’ అనుకుంటారు. నేను గీసుకున్న గీత దాటడం నాకిష్టం లేదు. నా రూట్లో ట్రైన్ పరుగెత్తాలంటే దానికి సిద్ధపడే ప్రయాణికులు కావాలి. యముడి నేపథ్యం ‘సేఫ్’ అని ‘యమలీల 2’ చేస్తున్నారా? వంద శాతం ఆ నమ్మకంతోనే తీస్తున్నాను. కృష్ణారెడ్డి సినిమా అంటే ‘ఫలానా విధంగా ఉంటుంది’ అనే అంచనాలుంటాయి. ఇప్పుడు నేను ఒక సినిమా తీసి, దానికి సాఫ్ట్ టైటిల్ పెట్టాననుకోండి ‘కృష్ణారెడ్డి ఇంకా అక్కడే ఆగిపోయాడు.. ఓల్డ్ స్కూల్’ అనేస్తారు. అదే ‘యమలీల’ అనుకోండి హిట్ ఫార్ములా. ఈ ఫార్ములాతో అలీ హీరోగా నేనే హిట్ సినిమా తీశా. అందుకే, మళ్లీ ఇదే ఫార్ములానే తీసుకున్నా. భయం వల్లే ఈ ‘యమ’ హిట్ ఫార్ములా నేపథ్య చిత్రాన్ని ఎంచుకున్నారా? భయంతో కాదు.. నమ్మకంతో. యముడికో బ్రాండ్ వేల్యూ ఉంది. అది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందని ఈ చిత్రం తీశాను. గతంలో నేను తీసిన ‘యమలీల’ను చూసినవాళ్లు.. ‘ఆ సినిమా బాగుంది కదా.. ఇదెలా ఉంటుందో చూద్దాం’ అని థియేటర్‌కి వస్తారు. కాబట్టి, ఇరవయ్యేళ్ల క్రితం ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడ్డానికి ఇష్టపడతారు. అలాగే, ఓ మంచి ఎంటర్టైనర్ని చూపించాలని పిల్లలనూ తీసుకు వస్తారు. ఆ రకంగా అప్పటి ప్రేక్షకులను, ఇప్పటి ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశం - యమలీల. యముడు సినిమాలను చక్కగా తీస్తే, హిట్ గ్యారంటీ. ‘దేవాంతకుడు, యమగోల, యముడికి మొగుడు, యమలీల..’ ఇలా ఆ కోవలోని సినిమా లన్నీ హిట్లే. మధ్యలో కొన్ని చిత్రాలు మాత్రం ఆడలేదంటే, వాటిని సరిగ్గా తీయకపోవడమే కారణం. పాత ‘యమలీల’లో లాగా ఈ సినిమాలో కూడా యముడితో హిమక్రీములు తినిపించారా? హిమక్రీములు ఇందులోనూ ఉన్నాయి. ఈ యముడూ డాన్స్ చేస్తాడు, అల్లరి చేస్తాడు. మోహన్ బాబుగారి స్థాయిని, యముడికి ఉండే శక్తిని కలిపి ఈ పాత్ర సృష్టించాను. ఎన్టీఆర్‌గారిని ప్రేరణగా తీసుకొని ఇందులో మోహన్‌బాబుగారి గెటప్‌ను విభిన్నంగా తీర్చిదిద్దాను. ‘యమలీల’కు సీక్వెల్ ‘యమలీల 2’ అనుకోవచ్చా? సీక్వెల్ కాదు. సిరీస్ అనొచ్చు. చిత్రగుప్తుడు పుస్తకం పడేసుకున్నప్పుడల్లా కొత్త కథ పుడుతుంది కదా! వ్యాపార రంగంలోని వ్యక్తిని హీరోగా ఎంపిక చేయడానికి కారణం? నా ఉద్దేశంలో... వ్యాపార రంగంలోని వ్యక్తితో హీరో పాత్ర చేయించారేమిటని ఎవరూ అనుకోరు. ‘అప్పట్లో అలీని పెట్టి సినిమా తీసిన కృష్ణారెడ్డి ఇప్పుడు కొత్త హీరోతో ఎందుకు చేయలేడు?’ అనే చాలామందనుకుంటారు. పైగా, సతీష్ అద్భుతంగా నటించాడు. తనకిది మొదటి సినిమా అని అనిపించదు. ఓకే.. హాలీవుడ్లో చేసిన ‘డైవోర్స్ ఇన్విటేషన్’ విషయానికొద్దాం... అక్కడ పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం. మరి... ఈ కథాంశంతో అక్కడ సినిమా అంటే...? అందుకే, వేరే రీతిలో వెళ్లాను. విడిపోయే హక్కు భార్యాభర్తలకు ఉంటుంది. కానీ, ఆ ఇద్దరి తాలూకు ప్రేమకు సంబంధించిన సర్వహక్కులూ పిల్లలకు చెందుతాయి. అమ్మానాన్నా ఇద్దరూ కావాలని ఆ పిల్లలు కోరుకుంటారు. అందుకే విడిపోవాలనుకునేవాళ్లు బిడ్డలను కనకూడదనే కథతో ‘డైవోర్స్ ఇన్విటేషన్’ తీశా. అది అందరికీ నచ్చింది కూడా. అసలు హాలీవుడ్ సినిమా తీయాలని ఎందుకు అనుకున్నారు? చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే ప్రేమ. ఇంకా చెప్పాలంటే, ప్రేమ అనే కన్నా పిచ్చి అనడం సబబు. హాలీవుడ్ సినిమా తీయాలనే కోరిక మొదట్నుంచీ ఉండేది. అందుకే తీశా. హాలీవుడ్లో వర్కింగ్ స్టయిల్ ఎలా ఉంది? దర్శకులు కేవీ రెడ్డిగారు గుర్తొచ్చారు. బౌండ్ స్క్రిప్ట్‌తో ఆయన షూటింగ్‌కి వెళ్లేవారు. చాలా ఏళ్లు మనం దాన్నే అనుసరించాం. ఇప్పుడలా చేస్తున్నవాళ్లని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కానీ, హాలీవుడ్లో ఇప్పటికీ ఆ పాత విధానాన్నే అనుసరిస్తున్నారు. నాది కూడా ఆ బాటే కాబట్టి, చాలా అద్భుతంగా అనిపించింది. మీ పుట్టినరోజు విశేషాలు చెబుతారా? ప్రత్యేకంగా విశేషాలేవీ లేవు. సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను. ఇంకా అదే ఎనర్జీ ఉంది. ఇక వరుసగా సినిమాలు చేస్తారన్నమాట? అవును. ‘యమలీల 2’ తర్వాత మళ్లీ సతీష్ హీరోగా మరో సినిమా చేయబోతున్నాను. - డి.జి. భవాని