నా రూట్‌లోట్రైన్ పరిగెత్తాలంటే దానికి సిద్ధపడే ప్రయాణికులు కావాలి | There should be travellers in the train that goes in my route | Sakshi
Sakshi News home page

నా రూట్‌లోట్రైన్ పరిగెత్తాలంటే దానికి సిద్ధపడే ప్రయాణికులు కావాలి

Published Sat, May 31 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

నా రూట్‌లోట్రైన్ పరిగెత్తాలంటే దానికి సిద్ధపడే ప్రయాణికులు కావాలి

నా రూట్‌లోట్రైన్ పరిగెత్తాలంటే దానికి సిద్ధపడే ప్రయాణికులు కావాలి

‘మనం ఆ స్థాయికి చేరుకోవాలి’ అని ఊహాగానాలు చేస్తే, అది అబద్ధపు కల అవుతుంది. అందుకే, చేరుకో బోయే స్థాయి గురించి కాకుండా, మార్గం గురించి మాత్రమే ఆలోచించాలి. వృత్తిపరంగా నా ఎదుగుదల మీద నాకెలాంటి అపనమ్మకమూ ఉండేది కాదు. ఎదుగుతానని తెలుసు.. కానీ ఈ స్థాయిని మాత్రం ఊహించలేదు.
 
 ‘‘అందరూ వెళ్లే దారిని అనుసరిస్తే, క్యూలో వెనుక బడిపోతాం. అదే మనదైన దారి సృష్టించుకుంటే క్యూలో ముందుంటాం. అందుకే, నా దారిలోనే నేను వెళతాను’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘రాజేంద్రుడు-గజేంద్రుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, మావిచిగురు...’ ఇలా కుటుంబసమేతంగా చూడదగ్గ అనేక చిత్రాలను అందించిన ఘనత ఎస్వీకేది. కొంత విరామం తర్వాత ఆయన ‘యమలీల 2’కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఎస్వీకే పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
 
 ఈ మధ్య కాస్త వెనకబడ్డారు. ఇలా వెనకడుగు వేయడం మళ్లీ విజృంభించడానికేనా?
 సినిమాల్లో వెనకడుగు, ముందడుగు అనేవి ఉండవు. దేన్నయినా సరే కాలమే ప్రశ్నిస్తుంది.. కాలమే సమాధానం చెబుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా జరగడం సహజం. నేను వెనుకబడింది వాస్తవమే. దీనికి కారణం నేను చేసిన ఇంగ్లిష్ సినిమా ‘డైవోర్స్ ఇన్విటేషన్’. ఓ ఏడాదిలో ఆ సినిమాని పూర్తి చేద్దామనుకున్నా. కానీ, మూడేళ్లు పట్టింది. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేద్దామనుకున్నా. కానీ, నా మార్క్ సినిమాలు తీసే నిర్మాతలు కావాలి కదా. ‘నాతో సినిమా చేస్తారా’ అని ఎవరినైనా అడగడం నాకు చేతకాని విద్య. నా మొదటి సినిమా కూడా మా సొంత సంస్థలోనే చేశాం. ద్వంద్వార్థాలతో అభ్యంతరకరమైన సినిమాలు అస్సలు చేయను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి నియమాలు పెట్టుకున్నవాళ్లతో ఎవరు సినిమాలు చేస్తారు? అలాగని, నా తీరు మార్చుకోలేను. ‘డబ్బులు (ఖర్చు) తక్కువ, బూతులెక్కువ’ ఉన్న సినిమాలైతే ‘ఓకే’ అనే తరహాలో ఉన్న నిర్మాతల సంఖ్యే ప్రస్తుతం ఎక్కువ. కానీ, నా రూల్స్ నేను అధిగమించలేను. ఫైనల్‌గా సినిమాలంటే మమకారం ఉన్నవాళ్లు దొరకడంతో ‘యమలీల 2’ చేశా.
 
 మీ నుంచి సినిమాలు రాకపోవడంతో మిమ్మల్ని ఇష్టపడేవాళ్లకు అది ఓ వెలితిగా మారింది...
 అవును.. ‘ఏంటండీ సినిమాలు చేయడంలేదు’ అని వాళ్లు అడిగినప్పుడల్లా, నేనూ ఫీలవుతుంటాను. కానీ, ‘మీ సంస్కారాన్ని మీరు వదులుకోవాల్సిన అవసరం లేదు. మీ మార్క్ సినిమా తీద్దాం. మీ రూల్స్ మీరు దాటొద్దు’ అనే నిర్మాతలు రావాలి కదా. అలాగని నిర్మాతలను తప్పుబట్టలేం. డబ్బులు పెట్టే నిర్మాతలు ‘మొన్న ఫలానా సినిమా వచ్చింది. దాంట్లో మంచి మసాలా ఉంది. అలాంటి సినిమా చేద్దాం’ అనుకుంటారు. అది వాళ్ల ఇష్టం. ఇక, నా సినిమాలో హీరోయిన్‌గా నటించమని స్టార్ హీరోయిన్లను అడిగితే.. ‘చీర కట్టుకోమంటారేమో’ అనుకుంటారు. నేను గీసుకున్న గీత దాటడం నాకిష్టం లేదు. నా రూట్‌లో ట్రైన్ పరుగెత్తాలంటే దానికి సిద్ధపడే ప్రయాణికులు కావాలి.
 
 యముడి నేపథ్యం ‘సేఫ్’ అని ‘యమలీల 2’ చేస్తున్నారా?
 వంద శాతం ఆ నమ్మకంతోనే తీస్తున్నాను. కృష్ణారెడ్డి సినిమా అంటే ‘ఫలానా విధంగా ఉంటుంది’ అనే అంచనాలుంటాయి. ఇప్పుడు నేను ఒక సినిమా తీసి, దానికి సాఫ్ట్ టైటిల్ పెట్టాననుకోండి ‘కృష్ణారెడ్డి ఇంకా అక్కడే ఆగిపోయాడు.. ఓల్డ్ స్కూల్’ అనేస్తారు. అదే ‘యమలీల’ అనుకోండి హిట్ ఫార్ములా. ఈ ఫార్ములాతో అలీ హీరోగా నేనే హిట్ సినిమా తీశా. అందుకే, మళ్లీ ఇదే ఫార్ములానే తీసుకున్నా.
 
 భయం వల్లే ఈ ‘యమ’ హిట్ ఫార్ములా నేపథ్య చిత్రాన్ని ఎంచుకున్నారా?
 భయంతో కాదు.. నమ్మకంతో. యముడికో బ్రాండ్ వేల్యూ ఉంది. అది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందని ఈ చిత్రం తీశాను. గతంలో నేను తీసిన ‘యమలీల’ను చూసినవాళ్లు.. ‘ఆ సినిమా బాగుంది కదా.. ఇదెలా ఉంటుందో చూద్దాం’ అని థియేటర్‌కి వస్తారు. కాబట్టి, ఇరవయ్యేళ్ల క్రితం ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడ్డానికి ఇష్టపడతారు. అలాగే, ఓ మంచి ఎంటర్‌టైనర్‌ని చూపించాలని పిల్లలనూ తీసుకు వస్తారు. ఆ రకంగా అప్పటి ప్రేక్షకులను, ఇప్పటి ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశం - యమలీల. యముడు సినిమాలను చక్కగా తీస్తే, హిట్ గ్యారంటీ. ‘దేవాంతకుడు, యమగోల, యముడికి మొగుడు, యమలీల..’ ఇలా ఆ కోవలోని సినిమా లన్నీ హిట్లే. మధ్యలో కొన్ని చిత్రాలు మాత్రం ఆడలేదంటే, వాటిని సరిగ్గా తీయకపోవడమే కారణం.
 
 పాత ‘యమలీల’లో లాగా ఈ సినిమాలో కూడా యముడితో హిమక్రీములు తినిపించారా?

 హిమక్రీములు ఇందులోనూ ఉన్నాయి. ఈ యముడూ డాన్స్ చేస్తాడు, అల్లరి చేస్తాడు. మోహన్ బాబుగారి స్థాయిని, యముడికి ఉండే శక్తిని కలిపి ఈ పాత్ర సృష్టించాను. ఎన్టీఆర్‌గారిని ప్రేరణగా తీసుకొని ఇందులో మోహన్‌బాబుగారి గెటప్‌ను విభిన్నంగా తీర్చిదిద్దాను.
 
 ‘యమలీల’కు సీక్వెల్ ‘యమలీల 2’ అనుకోవచ్చా?
 సీక్వెల్ కాదు. సిరీస్ అనొచ్చు. చిత్రగుప్తుడు పుస్తకం పడేసుకున్నప్పుడల్లా కొత్త కథ పుడుతుంది కదా!


 వ్యాపార రంగంలోని వ్యక్తిని హీరోగా ఎంపిక చేయడానికి కారణం?
 నా ఉద్దేశంలో... వ్యాపార రంగంలోని వ్యక్తితో హీరో పాత్ర చేయించారేమిటని ఎవరూ అనుకోరు. ‘అప్పట్లో అలీని పెట్టి సినిమా తీసిన కృష్ణారెడ్డి ఇప్పుడు కొత్త హీరోతో ఎందుకు చేయలేడు?’ అనే చాలామందనుకుంటారు. పైగా, సతీష్ అద్భుతంగా నటించాడు. తనకిది మొదటి సినిమా అని అనిపించదు. ఓకే.. హాలీవుడ్‌లో చేసిన  ‘డైవోర్స్ ఇన్విటేషన్’ విషయానికొద్దాం...  అక్కడ పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం.

మరి... ఈ కథాంశంతో అక్కడ సినిమా అంటే...?
 అందుకే, వేరే రీతిలో వెళ్లాను. విడిపోయే హక్కు భార్యాభర్తలకు ఉంటుంది. కానీ, ఆ ఇద్దరి తాలూకు ప్రేమకు సంబంధించిన సర్వహక్కులూ పిల్లలకు చెందుతాయి. అమ్మానాన్నా ఇద్దరూ కావాలని ఆ పిల్లలు కోరుకుంటారు. అందుకే విడిపోవాలనుకునేవాళ్లు బిడ్డలను కనకూడదనే కథతో ‘డైవోర్స్ ఇన్విటేషన్’ తీశా. అది అందరికీ నచ్చింది కూడా.
 
 అసలు హాలీవుడ్ సినిమా తీయాలని ఎందుకు అనుకున్నారు?
 చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే ప్రేమ. ఇంకా చెప్పాలంటే, ప్రేమ అనే కన్నా పిచ్చి అనడం సబబు. హాలీవుడ్ సినిమా తీయాలనే కోరిక మొదట్నుంచీ ఉండేది. అందుకే తీశా.
 
 హాలీవుడ్‌లో వర్కింగ్ స్టయిల్ ఎలా ఉంది?
 దర్శకులు కేవీ రెడ్డిగారు గుర్తొచ్చారు. బౌండ్ స్క్రిప్ట్‌తో ఆయన షూటింగ్‌కి వెళ్లేవారు. చాలా ఏళ్లు మనం దాన్నే అనుసరించాం. ఇప్పుడలా చేస్తున్నవాళ్లని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కానీ, హాలీవుడ్‌లో ఇప్పటికీ ఆ పాత విధానాన్నే అనుసరిస్తున్నారు. నాది కూడా ఆ బాటే కాబట్టి, చాలా అద్భుతంగా అనిపించింది.
 
 మీ పుట్టినరోజు విశేషాలు చెబుతారా?
 ప్రత్యేకంగా విశేషాలేవీ లేవు. సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను. ఇంకా అదే ఎనర్జీ ఉంది.
 
 ఇక వరుసగా సినిమాలు చేస్తారన్నమాట?
 అవును. ‘యమలీల 2’ తర్వాత మళ్లీ సతీష్ హీరోగా మరో సినిమా చేయబోతున్నాను.
 - డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement