ఆ చిత్రాలకు ఎన్ని సిరీస్‌లైనా చేయొచ్చు!
‘‘ఓ సినిమాకు సిరీస్‌గా ఎన్ని చిత్రాలైనా తీసుకోవచ్చు. కానీ, కొనసాగింపు భాగాలైన సీక్వెల్స్ మాత్రం చేయలేం. ‘యమలీల’కు ‘యమలీల-2’ సీక్వెల్ కాదు. సిరీస్ మాత్రమే. భావోద్వేగాలతో పాటు చక్కని వినోదం, వినసొంపైన సంగీతం ఉన్న సినిమా ఇది’’ అని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారు. కె.వి.సతీశ్‌ని హీరోగా పరిచయం చేస్తూ క్రిష్వీ ఫిలింస్ పతాకంపై ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘యమలీల-2’ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. పాటలకు చక్కని స్పందన లభిస్తోందని ఎస్వీ కృష్ణారెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ... శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
‘‘చాలాకాలం తర్వాత నేను స్వరపరిచిన ఆల్బమ్ ఇది. ‘యమలీల’లో ‘సిరులొలికించే చిన్నినవ్వులే’ పాట ఎంత హిట్ అయ్యిందో, ‘యమలీల-2’లో ‘కృష్ణం భజే...’ పాట అంత హిట్టయ్యిందని అందరూ అంటున్నారు. ఆనందంగా ఉంది. అనంతశ్రీరామ్ అర్థవంతమైన సాహిత్యం అందించాడు. ఆల్బమ్‌లో ఆ పాట వింటుంటే స్వరపరిచిన నాకే కొత్తగా అనిపిస్తోంది. సంగీతంపై నాకున్న పట్టు ఈ విజయానికి కారణం. భవిష్యత్తులో బయటి చిత్రాలకు కూడా సంగీతం అందించాలని ఉంది’’ అని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు.
ఇందులో యమునిగా మోహన్‌బాబు రాజసం చూస్తే ఎన్టీఆర్ గుర్తొచ్చారనీ, ఎన్టీఆర్ తర్వాత ఆ పాత్రలో అంత అందంగా మోహన్‌బాబే ఉన్నారనీ, బ్రహ్మానందం పోషించిన చిత్రగుప్తుడి పాత్ర ప్రేక్షకుల్ని గిలిగింతలు పెడుతుందని ఎస్వీకె చెప్పారు. హీరోగా నటిస్తున్న సతీశ్‌కి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందనీ, బేబీ హర్షిత పాత్ర కీలకమనీ ఆయన అన్నారు. గతంలో తాను తెరకెక్కించిన ‘రాజేం ద్రుడు-గజేంద్రుడు, మాయలోడు, వినోదం’కు ఎన్ని సిరీస్‌లైనా చేయొచ్చనీ, ఆ దిశగా ఆలోచిస్తున్నాననీ కృష్ణారెడ్డి అన్నారు.