లక లక లక... | chandramukhi movie story | Sakshi
Sakshi News home page

లక లక లక...

Published Sun, Jul 19 2015 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

లక లక లక...

లక లక లక...

1993... కేరళ... ఫాజిల్ టేబుల్ మీద ఫైల్స్ పేరుకుపోయున్నాయి. వాటిని కదిల్చి చాలా కాలమైనట్టుంది. కొంచెం దుమ్ము కూడా చేరుకుంది. ఫాజిల్ అంటే మలయాళంలో టాప్ డెరైక్టర్. ఆ రోజు ఏదో అవసరమై ఆ ఫైళ్లు కదిలించాడు ఫాజిల్. బాగా అడుగున రైటర్ మధు ముట్టమ్ రాసిన స్క్రిప్ట్ కనబడింది. కాసేపు అటూ ఇటూ తిరగేశాడు. తర్వాత ఆ కథలో లీనమైపోయాడు. ఓ పెద్ద బంగ్లా... నాగవల్లి అనే దెయ్యం... ఓ సైకాలజిస్ట్ ట్రీట్‌మెంట్... భలే ఉందే కథ అనుకున్నాడు ఫాజిల్.

మధుకి కబురు వెళ్లింది. వెంటనే ఫాజిల్ ఆఫీసులో వాలిపోయాడు మధు. అతనా స్క్రిప్ట్ రాసి ఏడేళ్లవుతోంది. అప్పట్లో ఫాజిల్‌కిస్తే ‘ప్చ్’ అన్నాడు. ఇన్నాళ్లకు ఆ స్క్రిప్టుకు మోక్షం కలిగినట్టుంది.
 ఫాజిల్, మధు కలసి ఆ కథకు ‘నగిషీ’లు చెక్కడం మొదలుపెట్టారు. సినిమా స్టార్ట్. మలయాళ సూపర్‌స్టార్స్ మోహన్‌లాల్, సురేశ్ గోపీలు హీరోలు. నాగవల్లి ఆవహించే గంగ పాత్రలో శోభన. అదే ‘మణిచిత్ర తాళు’.అద్దిరిపోయింది... బాక్సాఫీస్. అవార్డులూ అంతే. శోభనకైతే బెస్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డు.
   
2004... బెంగళూరు...
కన్నడ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్ ప్రెసిడెంట్.
 మీటింగ్ జరుగుతోంది.
 సీనియర్ కమెడియన్ ద్వారకేశ్‌కి, ఫైనాన్షియర్స్‌కి మధ్య గొడవ. ఈ వివాదాన్ని విష్ణువర్ధన్ పరిష్కరించాలి.
 న్యాయం ఫైనాన్షియర్ల వైపే ఉంది. కానీ ద్వారకేశ్ తనకు బాగా కావాల్సినవాడు. పైగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడిప్పుడు.

జాగ్రత్తగా డీల్ చేయాలి. విష్ణువర్ధన్ డీల్ చేశాడు. ఫైనాన్షియర్లకి ద్వారకేశ్ అప్పు తీర్చేశాడు.
 ద్వారకేశ్‌కి విష్ణువర్ధన్ డేట్లు ఇచ్చాడు... ఎప్పుడో ఒకప్పుడు సినిమా చేసుకోమని. కానీ, పీక మీద కూర్చున్నాడు ద్వారకేశ్. ఇప్పటికిప్పుడు సినిమా చేయమంటాడు.
 హౌ?
 కథ చేయాలంటే నెలలు పడుతుంది. దీనికి ఒకటే సొల్యూషన్. రీమేక్.

డెరైక్టర్ పి.వాసుకి కబురెళ్లింది. ఆయన చెన్నై నుంచి బెంగళూరు వచ్చాడు.
 విష్ణువర్ధన్ అర్జెంట్‌గా సినిమా చేద్దామన్నాడు.
 ‘‘నా ఫ్రెండ్ ఫాజిల్ పదేళ్ల క్రితం ‘మణిచిత్ర తాళు’ సినిమా చేశాడు. చాలా బావుంటుంది. మీకు కొత్తగా ఉంటుంది’’ చెప్పాడు పి.వాసు.
 ‘‘ఇంకేం... నేను రెడీ’’ అన్నాడు విష్ణువర్ధన్.
 అదే ‘ఆప్తమిత్ర’.
 
సైకియాట్రిస్టుగా విష్ణువర్ధన్. నాగవల్లి ఆత్మ ఆవహించే గంగ పాత్రలో సౌందర్య.
 2004... ఆగస్టు 27 రిలీజ్. ఫస్ట్ వీక్ నో కలెక్షన్స్. కట్ చేస్తే... బాక్సాఫీస్‌కి వసూళ్ల దెయ్యం పట్టింది. ఎంతకూ వదలదే..!
   
 2004 అక్టోబర్ 1... చెన్నై... టి.నగర్‌లోని శివాజీ గణేశన్ ఇల్లు. ఆ రోజు పెద్దాయన జయంతి.
 శివాజీ గణేశన్ కొడుకులు ప్రభు, రామ్‌కుమార్‌లు ఆ ఏర్పాట్లేవో చేస్తుంటే... అనుకోని అతిథిలా రజనీకాంత్. వీళ్లంతా కంగారుపడిపోయారు. హాల్లో ఉన్న శివాజీ గణేశన్ ఫొటోకి అంజలి ఘటిస్తున్నాడు రజనీ. అతని మనసు నిండా ఏదో వేదన. తన ఇంటికి భోజనానికి రమ్మని పెద్దాయన ఎన్నిసార్లు అడిగారో. కుదర్లేదు. ఇప్పుడిలా ఆయన లేనప్పుడు వచ్చాడు. రజనీలో అదే చింత. అక్కడే భోంచేసి బయటకు రాగానే మీడియావాళ్లు చుట్టుముట్టారు.
 
మామూలుగా రజనీ మాట్లాడడు. దణ్ణం పెట్టి వెళ్లిపోతాడు. ఆ రోజు మాట్లాడాడు. ‘‘పెద్దాయన స్థాపించిన ‘శివాజీ ప్రొడక్షన్స్’లో సినిమా చేస్తున్నా’’ అని అనౌన్స్ చేశాడు. అందరూ షాక్. రెండేళ్ల నుంచీ రజనీ సినిమా చేయడం లేదు. 2002లో వచ్చిన ‘బాబా’ డిజాస్టర్. అందుకే ఈసారి పెద్ద హిట్టు సాధించాలనే కసి మీద ఉన్నాడు రజనీ. కె.ఎస్.రవికుమార్ డెరైక్షన్‌లో ‘జగ్గూభాయ్’ అనౌన్స్ చేశాడు. ఈ రెండింట్లో ఏది ఉంటుంది?
   
బెంగళూరు వెళ్లాడు రజనీ. ముసలాడి గెటప్‌లో ‘ఆప్తమిత్ర’ సినిమాకెళ్లాడు. ఆ సినిమా చూస్తూ... జనాల చప్పట్లు చూస్తూ... ఏదో ఆలోచిస్తున్నాడు. తనకు రైట్ టైమ్‌లో రైట్ సినిమా. సింహం ఆకలి తీర్చే సినిమా. పి.వాసుకి కాల్ చేశాడు. ప్రభుకి కూడా కాల్ చేశాడు. ‘‘ఆప్తమిత్ర’ను మనం రీమేక్ చేస్తున్నాం’’ చెప్పాడు రజనీ. పి.వాసు కంగారుపడ్డాడు.
 
ఇదే సినిమాను ప్రభుతో తమిళ్‌లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా రజనీనే చేస్తానంటున్నాడు. ప్రభుకైతే కలో నిజమో అర్థం కావడం లేదు.
 ‘‘మరి ‘జగ్గూభాయ్’?’’ అంటూ నీళ్లు నమిలాడు పి.వాసు.
 ‘‘అది క్యాన్సిల్. మనం ‘ఆప్తమిత్ర’ చేస్తున్నాం.’’
 రజనీ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే.
   
మణిచిత్ర తాళు... ఆప్తమిత్ర... ఈ రెండింటినీ మించేలా ఉండాలి రజనీ సినిమా.
 కథను మార్చకూడదు. కానీ రజనీ ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులు చేయాలి.
 పి.వాసు అదే చేస్తున్నాడు. రజనీ కూడా ఫుల్ ఇన్‌వాల్వ్ అవుతున్నాడు. ఈచ్ అండ్ ఎవ్విర్‌థింగ్ అడుగుతున్నాడు. ‘‘దెయ్యం పేరు నాగవల్లి బాలేదు. రాజుల కాలంనాటి నర్తకి కాబట్టి... ఇంకా హెవీగా ఉండాలి.’’
 
రజనీ చెబితే తిరుగేముంది. ఇప్పుడు దెయ్యం నాగవల్లి కాదు... చంద్రముఖి.‘ఆప్తమిత్ర’లో విష్ణువర్ధన్ ‘హౌల హౌల...’ అంటుంటాడు. రజనీకి నచ్చలేదు. మార్చాలి. ఎప్పుడో చిన్నప్పుడు మరాఠీ నాటకంలో విలన్ మేనరిజమ్ గుర్తొచ్చింది. అదే ‘లక లక లక...’. గంగ పాత్రకు ఎవరిని తీసుకోవాలి? స్నేహ... రీమాసేన్... ఎవ్వరూ ఆనడం లేదు. ఎస్... సిమ్రన్ కరెక్ట్. దుర్గ పాత్రకు కొత్తమ్మాయి నయనతార. రజనీకి పెయిర్. గోల్డెన్ చాన్స్ అంటే ఇదే. తీరా రెండ్రోజులు షూటింగ్ చేశాక, షాకింగ్ న్యూస్... ‘చంద్రముఖి’ టీమ్‌కి. స్వీట్ న్యూస్... సిమ్రన్‌కి. ఆమె ప్రెగ్నెంట్. సినిమాను వదులుకోవాల్సిన పరిస్థితి. బ్యాడ్‌లక్. కానీ జ్యోతికది గుడ్‌లక్. ఆమెకి దక్కింది అవకాశం.
   
హైదరాబాద్‌లో షూటింగ్. దాదాపుగా అంతా ఇక్కడే. కొంతవరకు మాత్రం చెన్నైలో. రెండు పాటలకు టర్కీ వెళ్లారు. ఎంత స్పీడ్‌గా అంటే... అంత స్పీడ్‌గా ఫినిష్ అయిపోయింది సినిమా. 19 కోట్ల బడ్జెట్ తేలింది.
   
2005 ఏప్రిల్ 14. తెలుగు, తమిళ భాషల్లో ‘చంద్రముఖి’ చూసి ప్రేక్షకులకు దిమ్మ తిరిగిపోయింది. 10... 20... 30... 40... 50... 60... 70... ఇలా కోట్లు వస్తూనే ఉన్నాయి. 50 రోజులు... 100 రోజులు... 200 రోజులు... చెన్నైలో శివాజీ గణేశన్ సొంత థియేటర్ ‘శాంతి’లో 804 రోజులాడి సౌత్ ఇండియా రికార్డ్ సృష్టించింది. త్యాగరాజ భాగవతార్ నటించిన తమిళ ‘హరిదాస్’ (1944 అక్టోబర్ 16 రిలీజ్) ఏకధాటిగా చెన్నైలోని బ్రాడ్వే థియేటర్లో 768 రోజులాడిన రికార్డు బద్దలు. మళ్లీ రజనీ హవా మొదలు. చంద్రముఖా మజాకా! లక లక లక...    
- పులగం చిన్నారాయణ
 
వెరీ ఇంట్రస్టింగ్...
* ‘మిస్టర్ పెళ్లాం’ తీసిన గవర పార్ధసారథికి శోభన క్లోజ్. ఢిల్లీలో నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్‌లో శోభన కలిసినప్పుడు, ‘‘మణిచిత్ర తాళు’ తెలుగులో రీమేక్ చెయ్య’’మని సలహా ఇచ్చింది. రిస్క్ అని వదిలేశారు పార్ధసారథి. తర్వాత ‘చంద్రముఖి’ని పి.కరుణాకర్‌రెడ్డి, ఎస్.రమేశ్ బాబులతో కలసి తెలుగులో డబ్ చేశారు.
* ‘శివాజీ ప్రొడక్షన్స్’లో రజనీకాంత్ ‘మన్నన్’ సినిమా చేశాడు. ఆ సినిమా విజయోత్సవ సభలో ఇదే సంస్థలో 50వ సినిమా చేస్తానని రజనీ మాట ఇచ్చారు. ఆ రకంగా కూడా ‘చంద్రముఖి’ చేసి రజనీ మాట నిలబెట్టుకున్నారు.
* పారితోషిక రూపంలోనూ, లాభాల్లో వాటా పరంగానూ ‘చంద్రముఖి’కి రజనీకాంత్‌కు 15 కోట్ల రూపాయల వరకూ ముట్టింది. అప్పట్లో అదే హయ్యస్ట్ రెమ్యూనరేషన్.
* ‘చంద్రముఖి’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో సందర్భోచితంగా ‘వారాయ్... నాన్ ఉన్నై తేడీ...’ అనే తమిళ పాట పెట్టారు. ఇప్పటికీ ఆ పాట పాపులరే. తమిళ మాతృకలో ‘రారా... సరసకు రారా...’ అంటూ భువనచంద్ర రాసిన తెలుగు పాట పెట్టారు.
* ‘మణి చిత్ర తాళు’ డీవీడీ చిరంజీవికిచ్చి తెలుగులో రీమేక్ చేద్దామన్నారు దర్శకుడు వీఎన్ ఆదిత్య. అయితే చిరంజీవి ఆసక్తి చూపించలేదు. ‘చంద్రముఖి’ రిలీజై ఘనవిజయం సాధించాక, చిరంజీవి స్వయంగా ఆదిత్యకు ఫోన్‌చేసి అతని జడ్జ్‌మెంట్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement