అక్రమాలను కాలరాసిన ఉక్కుపాదం ఠాగూర్ | special story on tagore film | Sakshi
Sakshi News home page

అక్రమాలను కాలరాసిన ఉక్కుపాదం ఠాగూర్

Published Sun, Jun 21 2015 1:01 AM | Last Updated on Mon, Sep 17 2018 5:12 PM

అక్రమాలను కాలరాసిన ఉక్కుపాదం ఠాగూర్ - Sakshi

అక్రమాలను కాలరాసిన ఉక్కుపాదం ఠాగూర్

చెన్నైలో ప్రొడ్యూసర్ ‘ఆస్కార్’ రవిచంద్రన్ ఆఫీస్‌లో ఏసీ బాగా పనిచేస్తోంది. అందుకే చాలా కూల్‌గా ఉంది. రవిచంద్రన్‌తో పాటు మధుసూదన్‌రెడ్డి కూర్చుని ఉన్నారు. ఇద్దరికీ సినిమాలంటే పిచ్చి. ‘‘ఒక డెరైక్టరొస్తున్నాడు. కథ చెబుతాడు. నువ్వు కూడా సరదాగా విను’’ అన్నారు ‘ఆస్కార్’ రవిచంద్రన్. సరే అన్నారు మధు. చాలా సేపటి తర్వాత ఓ చిన్న కుర్రాడొచ్చి కూర్చున్నాడు. రవిచంద్రన్, అతను ఏదో మాట్లాడుకుంటున్నారు. ‘‘ఇంకా డెరైక్టర్ రాలేదేమిటి?’’ మధులో విసుగు. ‘‘మధూ... కథ విందామా?’’ అని రవిచంద్రన్ అనేసరికి మధు ఉలిక్కిపడ్డాడు.

అరె... పొరపాటు పడ్డానే. ఈ కుర్రాడే డెరైక్టరా...! ఇంతకుముందు అజిత్‌తో ఓ సినిమా తీశాడట. సోసోగా ఆడిందట. ఇది విజయకాంత్ కోసం చేసిన కథ. అతను కథ చెప్పడం మొదలెట్టాడు. పిన్‌డ్రాప్ సెలైన్స్. ఏసీ మెషీన్ చప్పుడొక్కటే వినిపిస్తోంది. మధు ఈ లోకంలో లేడు. ఈ కథలో హీరోగా ఆయన చిరంజీవిని ఊహించుకుంటున్నారు. ఆయనకు టోటల్ పిక్చర్ కనబడుతోంది. కథ చెప్పడం పూర్తి కాగానే వారిద్దరూ అతన్ని హగ్ చేసుకున్నారు. ఆ కుర్రాడు... ఏ.ఆర్. మురుగదాస్. ఆ సినిమా... ‘రమణ’ (తమిళం).
     
హైదరాబాద్ రాగానే మధు చేసిన మొదటి పని చిరంజీవిని కలవడం. రెండో పని అల్లు అరవింద్‌ని కలవడం. వాళ్లకు మధు చెప్పిందొక్కటే. ‘‘తమిళంలో మురుగదాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ కథ తెలుగులో చిరంజీవిగారికి యాప్ట్. డోంట్‌మిస్’’.
 రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. తమిళ సినిమా ‘రమణ’ సూపర్ హిట్. ఇప్పుడు టాలీవుడ్ దృష్టి అంతా ‘రమణ’ మీదే. ఎవరి ప్రయత్నాలు వాళ్లవి. హీరో రాజశేఖర్ కూడా రేసులో ఉన్నారు.
 చిరంజీవి స్పెషల్ షో వేయించుకుని చూశారు. బాగా నచ్చేసింది. ‘ఇంద్ర’ తర్వాత సినిమా అంటే ఇలానే ఉండాలి. దానికి తోడు తనకిది సిల్వర్ జూబ్లీ ఇయర్. స్పెషల్ సినిమా కావాలి. మధు రంగంలోకి దిగారు. రైట్స్ చేతికొచ్చేశాయి.
     
చిరంజీవికి పరుచూరి బ్రదర్స్ అంటే గురి. వాళ్లకు చిరంజీవికి ఏం కావాలో తెలుసు. చిరంజీవిని ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో ఇంకా బాగా తెలుసు. ‘రమణ’ను వాళ్లు చిరంజీవికి అనుగుణంగా చెక్కుతున్నారు. కానీ చిక్కంతా డెరైక్టర్ దగ్గరే.
 మురుగదాస్‌తోనే డెరైక్ట్ చేయిస్తే? చిరంజీవి ఇమేజ్‌ని డీల్ చేయడం కష్టమేమో. ఒకవేళ చేసినా తెలుగు నేటివిటీ ప్రాబ్లమ్. ‘ఇంద్ర’ దర్శకుడు బి. గోపాల్... ఇంకా ఏవేవో ఆప్షన్లు. వినాయక్? ఎస్... మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు. దానికి తోడు చిరంజీవికి వీరాభిమాని.
 
‘దిల్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు వినాయక్. రాజా రవీంద్ర లొకేషన్‌కి వెళ్లి మరీ చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాడు. ‘రమణ’ చూశావా?’’ అడిగారు చిరంజీవి.
‘‘చూశాను సార్... చాలా బాగుంది. తెలుగులో మీరే చేయాలి’’ అంటూ చకచకా మార్పులు చెప్పేశాడు వినాయక్. ‘‘ఈ సినిమాకి నువ్వే డెరైక్టర్‌వి’’... చిరంజీవి అప్పటికప్పుడే అనౌన్స్ చేసేశారు. వినాయక్‌కి నోట మాట రాలేదు. ఎప్పటికైనా చిరంజీవిని డెరైక్ట్ చేయాలని ఓ ప్రొఫెసర్ కథ సిద్ధం చేసి పెట్టుకున్న వినాయక్‌కు గోల్డెన్ ఛాన్స్. మ్యూజిక్ డెరైక్టర్‌గా మణిశర్మ కన్‌ఫర్మ్. ఇక ఆస్థాన ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు ఎలానూ ఉన్నాడు.
     
చిరంజీవి ఇంట్లో రోజూ మీటింగుల మీద మీటింగులు. ముందు సినిమా ‘ఇంద్ర’ బ్లాక్ బస్టర్. బాక్సాఫీస్ లెక్కలన్నీ డబుల్. బయ్యర్లు ఎంతకైనా కొనడానికి రెడీ. అందుకే కేర్‌ఫుల్‌గా ఉండాలి. చిరంజీవి టెన్షన్ దీని గురించే. ప్రొడ్యూసర్ మధుని పిలిచి ‘‘ఎక్కువ రేట్లకి అస్సలు అమ్మొద్దు. బడ్జెట్ కంట్రోల్‌లో ఉంచుకుని సినిమా చేద్దాం’’ అని చెప్పేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సెలక్షన్‌లో కూడా డిస్కషన్ల మీద డిస్కషన్లు. నందిని పాత్రకు ఫెమిలియర్ ఫేస్ కావాలి. మాధురీ దీక్షిత్ బెటరా? కానీ తను ప్రెగ్నెంట్. ఫైనల్‌గా జ్యోతిక వచ్చింది. దేవకి పాత్రకు శ్రీయ ఖరారు. గోపీ పాత్రను ఎవరితో చేయిద్దామా అని చర్చ జరుగుతుంటే, రాజా రవీంద్ర ‘‘దర్శకుడు వినాయకే బాగుంటాడు’’ అన్నాడు. చిరంజీవి వత్తాసు పలికారు.
 
‘ఇంద్ర’లో వీణ స్టెప్ అదుర్స్... ముఖ్యంగా పాటలన్నీ సూపర్‌హిట్. ఇందులో ఇంకా అదిరిపోవాలి. మణిశర్మ 62 ట్యూన్లు ఇచ్చాడు. అందులోంచి ది బెస్ట్ సెలక్ట్ చేశారు. చిరంజీవి సోలో సాంగ్ కోసం చంద్రబోస్ లిరిక్స్ రాస్తూనే ఉన్నాడు. ‘అంతకు మించి’ అంటున్నారు చిరంజీవి. సరిగ్గా అప్పుడే లారెన్స్ ఎంటరయ్యాడు. ఇందులో ఐదు పాటలకు అతనే కొరియోగ్రాఫర్. ‘‘అన్నయ్య కొడితే సిక్సే కొట్టాలి. పాట కూడా ఆ రేంజ్‌లో ఉండాలి’’ అన్నాడు. చంద్రబోస్‌కి పల్లవి వచ్చేసింది. ‘కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి...’ పాట రెడీ.
 
ఓ సిట్యుయేషన్‌కి రక్తం మరిగేలా... వెంట్రుకలు నిక్కబొడుచుకొనేలా ఓ సాంగ్ కావాలి. అప్పుడే ‘మా టీవీ’లో చిరంజీవిపై ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌కి ‘రుద్రవీణ’ సినిమాలోని ‘నేను సైతం’ సాంగ్‌ని బ్యాక్‌డ్రాప్‌గా వాడారు. ఆ పాటే మళ్లీ వాడదామా? సరిగ్గా అదే టైమ్‌లో ఎస్పీ బాలసుబ్రమణ్యం టూ మంత్స్ ఫారిన్ ట్రిప్ వెళ్తున్నారని తెలిసింది. ముందు పాట పాడించేద్దాం. తర్వాత డెసిషన్ తీసుకుందామనుకున్నారు. సుద్దాల అశోక్‌తేజతో ‘నేను సైతం’ పాటను కొత్తగా రాయించి, ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాడించేశారు.
 
టైటిల్ ఏం పెట్టాలి?
 ‘రమణ’ మరీ సాఫ్ట్‌గా ఉంది. కొంచెం పవర్‌ఫుల్‌గా ఉండాలి. పర్పస్‌ఫుల్‌గా ఉండాలి. ‘సూర్యం’ ఎలా ఉంటుంది? చిరంజీవికి ఇష్టమైన పేరు. ‘ఖైదీ’లో హీరో పేరు అదే. ఎక్కువమంది మొగ్గు చూపారు. కానీ అదే ఫైనల్ కాదు. పరుచూరి వెంకటేశ్వరరావు ‘ఠాగూర్’ అన్నారు. అందరూ డబుల్ ఓకే.
     
షూటింగంతా హైదరాబాద్‌లోనే. సుమారు హండ్రడ్ వర్కింగ్‌డేస్. వినాయక్‌కి ఇష్టమైన హీరో, ఇష్టమైన కథ, ఇష్టమైన టీమ్... చెలరేగిపోతున్నాడు. డాక్యుమెంటరీ తీస్తున్నారనే సెటైర్లకు ఆన్సర్ చెప్పాలి. చిరంజీవి కెరీర్‌లో ఇది మెమరబుల్ అవుతుందని టీమ్ ఆశ.క్లైమాక్స్‌లో ఓ సీన్ భారీ జనం మధ్య భారీగా తీయాలి. చిరంజీవి రాజమండ్రిలో మదర్ థెరెసా విగ్రహావిష్కరణకు వెళ్తున్నారు. యూనిట్ కెమెరాలతో రెడీ. కానీ గోదావరి ఒడ్డున జనసముద్రం. చిరంజీవికి అడుగుపెట్టడానికే కష్టమైపోయింది. వీళ్ల ప్లాన్ ఫెయిల్.
 
ఇంకెక్కడ తీయాలి?
 ‘‘తిరుపతిలో తీయండి. దగ్గరుండి ఏర్పాట్లన్నీ నేను చేస్తా’’ అని భరోసా ఇచ్చారు సీనియర్ నిర్మాత ఎన్.వి. ప్రసాద్. తిరుపతి ఆయన నేటివ్ ప్లేస్. ఎస్వీ యూనివర్సిటీలో పర్మిషన్ తీసుకున్నారు. కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టాలో ముందే ఫిక్స్. ఈసారి దెబ్బతినకూడదు. చిరంజీవిని చూడగానే జనాలు కంట్రోల్ తప్పారు. అయినా షాట్ బాగా వచ్చింది. ఛోటా క్రెడిట్ అది.
 క్లైమాక్స్ విషయంలో కొంత కన్‌ఫ్యూజన్. తమిళ వెర్షన్‌లో హీరో పాత్రను ఉరి తీస్తారు. ఇక్కడలా చేస్తే ఫ్యాన్స్ తట్టుకోలేరు. ఏం చేయాలి? మురుగదాస్ కూడా సిట్టింగ్స్‌కొచ్చాడు. రకరకాల డిస్కషన్స్. వినాయక్ అయితే తనకు తెలిసిన హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి దగ్గరికెళ్లి సలహా తీసుకొచ్చాడు. ఫైనల్‌గా హీరో పాత్రను బతికిద్దామని డిసైడ్ అయ్యారు. మొత్తానికి ఫైనల్ ప్రొడక్ట్ రెడీ.
     
2003 సెప్టెంబర్ 24.
605 థియేటర్లలో ‘ఠాగూర్’ భారీ రిలీజ్. ఫస్ట్ షో కే సినిమా రిజల్ట్ తెలిసిపోయింది. ఎక్కడ చూసినా ‘ఠాగూర్’ ప్రభంజనం. పవన్ కల్యాణ్ అయితే సినిమా చూసొచ్చి ‘‘అన్నయ్యా... నీ దగ్గర్నుంచీ ఇలాంటివే రావాలి’’ అన్నాడు ఉద్వేగంగా.
 ఆ రోజుల్లో 35 కోట్ల వరకూ కలెక్ట్  చేయడమంటే మాటలు కాదు. చిరంజీవి ఇమేజ్ డబుల్‌కి డబుల్. త్రిబుల్‌కి త్రిబుల్. పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా? అని పార్టీలు దడుచుకునేంత ఇమేజ్. ఎన్టీఆర్‌కి ‘సర్దార్ పాపారాయుడు’లాగా... చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి ‘ఠాగూర్’ సినిమానే ఇన్‌స్పిరేషన్.
- పులగం చిన్నారాయణ
 
హిట్ డైలాగ్స్
* తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట - క్షమించడం  
* ఆస్తుల కంటే, ఆప్తుల్ని సంపాదించుకున్నవాడే గొప్పవాడు  
* ఇంతవరకూ ప్రతీ నాయకుడూ పార్టీల్లోంచే పుట్టాడు... ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు   
* 28 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ఒక బిల్ గేట్స్ పుడితే, 102 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎందుకు బిల్ గేట్స్ పుట్టలేదు. లంచం వలన. ఇక్కడ ప్రతిభ ప్రజల్లోకి వెళ్లాలంటే లంచం కావాలి. అందుకే భారతదేశ మేధావులంతా విదేశాలకు వెళ్లిపోతున్నారు.
 
వెరీ ఇంట్రెస్టింగ్...
శ్రీశ్రీ రచనను పల్లవిగా తీసుకుని సుద్దాల అశోక్‌తేజ రాసిన ‘నేను సైతం’ గీతానికి జాతీయ అవార్డు లభించింది. శ్రీశ్రీ (‘అల్లూరి సీతారామరాజు’లోని ‘తెలుగువీర లేవరా’ పాట), వేటూరి (‘మాతృదేవోభవ’ లోని ‘రాలిపోయె పూవా’) తర్వాత జాతీయ అవార్డు దక్కిన మూడో సినీకవి సుద్దాల.
‘ఠాగూర్’ హండ్రడ్ డేస్ ఫంక్షన్ గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్‌లు చీఫ్ గెస్ట్‌లు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియమ్‌లో 2004 జనవరి 14న ఫంక్షన్ చేయాలి. కానీ లాస్ట్ మినిట్‌లో పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో ఫంక్షన్ జరగలేదు.
లియో ప్రాజెక్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించిన బి. మధుసూదనరెడ్డి ఆ తర్వాత ‘ఠాగూర్’ మధుగా పాపులరయ్యారు.
ఇదే కథతో కన్నడంలో విష్ణువర్ధన్ ‘విష్ణుసేన’ (2005),హిందీలో అక్షయ్ కుమార్ ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ (2015) సినిమాలు చేశారు.
‘ఠాగూర్’కి సీక్వెల్ చేద్దామని మురుగదాస్, ‘ఠాగూర్’ మధు ప్లాన్ చేశారు. ‘స్టాలిన్’ తర్వాత ఈ కథపై కసరత్తు చేశారు. ‘ఎపీ అసెంబ్లీకి నలుగురు యువకులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం, వాళ్లు రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, దీని వెనుక ‘ఠాగూర్’ ఉండటం’ ఇదీ కథ. ఓ ఎమ్మెల్యే పాత్రను పవన్‌కల్యాణ్‌తో చేయించాలనుకున్నారు. ఎందుకనో కథ అక్కడికి ఆగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement