నేను బద్రి బద్రీనాధ్! | Story behind Movie - 24 badri movie! | Sakshi
Sakshi News home page

నేను బద్రి బద్రీనాధ్!

Published Sun, Nov 15 2015 2:10 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

నేను బద్రి బద్రీనాధ్! - Sakshi

నేను బద్రి బద్రీనాధ్!

సినిమా వెనుక స్టోరీ - 24
- పూరీ జగన్నాథ్

సినిమా పేరు ‘పాండు’. సుమన్ హీరో.  డెరైక్టరేమో రామ్‌గోపాల్‌వర్మ, కృష్ణవంశీల శిష్యుడు జగన్. కెమెరామ్యాన్... డెరైక్టర్ తేజ. మ్యూజిక్ గురురాజ్. గ్రాండ్‌గా పాటల రికార్డింగ్. హేమాహేమీలంతా వచ్చి జగన్‌ని బ్లెస్ చేశారు. పాపం జగన్ బ్యాడ్‌లక్. కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టకుండానే సినిమా హుష్.
   
ఇంకో సినిమా పేరు... థిల్లాన. ‘సూపర్‌స్టార్’ కృష్ణ హీరో. జగనే డెరైక్టర్. కొత్తవాడైనా కథ చెప్పిన విధానం నచ్చేసి వెంటనే డేట్లు ఇచ్చేశారు కృష్ణ. బి.లహరి మ్యూజిక్కు. శ్యామ్.కె.నాయుడు కెమెరా. మూడు పాటలు రికార్డ్ చేశారు. ఓ రోజు షూటింగ్ కూడా చేశారు. కట్ చేస్తే... ‘థిల్లాన’ కూడా గాయబ్.
   
రెండు సినిమాలు ఆగిపోతే ఇంకో కొత్త డెరైక్టర్ అయితే టెన్షన్ పడిపోయేవాడు. కానీ జగన్ ఆరామ్‌గా ఉన్నాడు. పని తెలిసినవాడు ఎడారిలోనైనా బతికేస్తాడు. ద్వీపంలో వదిలేసినా బేఫికర్. జగన్ కథలు రాయగలడు. అదీ చాలా వేగంగా. రోజుకి పది కథలు రాయమన్నా రాయగలడు. దూరదర్శన్‌కి నిలబెట్టి వంద ఎపిసోడ్లు తీయగలడు. యాడ్స్ కట్ చేయగలడు. గులాబి, రంగీలా, సింధూరం, నిన్నే పెళ్లాడతా సినిమాలకు టీవీ ట్రైలర్స్ చేసి పెట్టింది అతనే. ఇన్ని రకాలుగా జగన్‌కు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. అందుకే రెండు సినిమాలు పురిట్లోనే ఆగిపోయినా బ్యాడ్‌నేమ్ వస్తుందనే చింతలేమీ పెట్టుకోలేదతను.
 
జగన్ ఇప్పుడు కొండకు వెంట్రుక విసురుతున్నాడు. కొండ అంటే పవన్ కల్యాణ్. ‘సుస్వాగతం’ హిట్టుతో యూత్‌లో యమా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. కొత్త టాలెంట్ కనిపిస్తే పిలిచి పట్టాభిషేకం చేస్తున్నాడు. పవన్‌ని కలిసే చాన్సొస్తే చాలు... తన కథతో మెస్మరైజ్ చేసేయగలనని జగన్‌కి ప్రగాఢ నమ్మకం. ఓషో చెప్పిన ఓ లైన్‌కు ఇన్‌స్పైర్ అయ్యి ఎప్పుడో పదేళ్ల క్రితమే జగన్ ఓ కథ రాశాడు. అది కూడా కిచెన్‌లో కూర్చుని ఏక ఫ్లోలో రాసి పారేశాడు. ఓ యాడ్‌ఫిల్మ్ డెరైక్టర్ తన ప్రియురాలితో కాసిన చిలిపి పందెం. అంతే కథ. నాగార్జునకైతే బావుంటుందనుకుని ట్రయల్స్ వేశాడు. స్క్రిప్టు తీసుకెళ్లి అమలకూ ఇచ్చాడు. వర్కవుట్ కాలేదు.
 
జగన్‌కు తెలిసిన ఓ నవలా రచయిత ఉన్నాడు. ‘‘కాన్సెప్ట్ బాగుంది. నవలగా రాసివ్వు. నా పేరుతో పబ్లిష్ చేయిస్తా. నీకు పదివేలు ఇస్తా’’ అన్నాడు. అప్పట్లో పదివేలు అంటే చాలా ఎక్కువ. జగన్ టెంప్ట్ అయ్యాడు. నవల రాయడం మొదలెట్టాడు. సగం రాశాక వేస్ట్ అనిపించి పక్కన పడేశాడు. వర్మ క్యాంప్‌లో తిరుగుతున్న టైమ్‌లో - రమణకు డెరైక్షన్ ఆఫరిచ్చారు వర్మ. అతని దగ్గర కథ లేదు. ‘‘నా దగ్గరో కథ ఉంది. కావలిస్తే ఇచ్చేస్తా’’ అని ఈ కథ చెప్పాడు జగన్. రమణకు నచ్చలేదు.
 ఇప్పుడీ కథతోనే పవన్ కల్యాణ్‌ని గెలవాలి. వింటే కల్యాణ్ ఫ్లాట్ అయిపోతాడు. ఇదీ జగన్ కాన్ఫిడెన్స్.
   
పవన్ కల్యాణ్‌ను పట్టుకోవడం చాలా కష్టం. ఏదైనా సినిమా ఫంక్షన్‌కొస్తే కలవొచ్చు. కానీ రాడే. ఎక్కడైనా పార్టీలకెళ్తే మీట్ కావొచ్చు. కానీ వెళ్లడే. షూటింగ్ లొకేషన్‌కెళ్దామంటే అవుటర్స్ నాట్ అలౌడ్. కథ రాయడానిక్కూడా జగన్ కష్ట పడలేదు కానీ, కల్యాణ్‌ని కలిసే మార్గాల్ని అన్వేషించడం కోసం నానా తిప్పలు పడుతున్నాడు. ‘తొలిప్రేమ’ షూటింగ్ జరుగుతుంటే రోజూ వెళ్లొస్తున్నాడు. సిక్స్ మంత్స్ ఇలానే వేస్ట్.
 
కల్యాణ్ రిలేటివ్ ఒకాయన ఉన్నారు. ఆయన్ని కలుస్తున్నాడు జగన్. అయినా పని కావడం లేదు. చివరకు శ్యామ్.కె. నాయుడు గుర్తొచ్చాడు. వాళ్లన్నయ్య ఛోటా.కె.నాయుడు కూడా ఫేమస్ కెమెరామ్యాన్. కల్యాణ్‌కి క్లోజ్. అంతకుమించిన రాజమార్గం ఏముంటుంది? శ్యామ్ ద్వారా ఛోటాను కలిశాడు. ‘‘ముందు నాకు కథ చెప్పు. నాకు నచ్చితే కల్యాణ్‌కి ఇంట్రడ్యూస్ చేస్తా. లేకపోతే నా మాట పోతుంది’’ నిర్మొహమాటంగా చెప్పేశాడు ఛోటా. జగన్ రెడీ. కానీ ఒక్క క్షణం ఆలోచించాడు. బుర్రలో ఏదో ప్లాన్. కల్యాణ్‌కి చెప్పాల్సిన కథ కాకుండా ‘ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం’ కథ చెప్పేశాడు. ఛోటా ఫ్లాట్. కల్యాణ్‌ని కలవడానికి మార్గం రెడీ.
   
1999 ఆగస్టు 24. తెల్లవారుజామున నాలుగు గంటలకు అపాయింట్‌మెంట్. కల్యాణ్ ఇంటికెళ్లాడు జగన్. ‘‘అరగంటే మీ టైమ్’’ అన్నాడు కల్యాణ్. ‘‘ఇది డీటైల్డ్‌గా చెప్తేనే నచ్చే కథ. అరగంటలో చెప్పడం కుదరదు’’ నసిగాడు జగన్. ‘‘అయితే వద్దు’’ టకీమని అనేశాడు కల్యాణ్. జగన్ కంగారుపడిపోయాడు.
 ‘‘సార్... అరగంటే కథ వినండి. ఆ తర్వాత మీకు వినాలనిపిస్తే కంటిన్యూ చేస్తా. లేకపోతే నా దారిన నే వెళ్లిపోతా’’ అని కాన్ఫిడెంట్‌గా అన్నాడు జగన్.
 
కల్యాణ్ అతనివైపు ఓసారి తీక్షణంగా చూసి ‘‘సరే... స్టార్ట్ చేయండి’’ అన్నాడు.
 జగన్ కథ చెప్పడం మొదలుపెట్టాడు. అరగంట ఎప్పుడైందో తెలియలేదు. తెల్లారిపోయింది కూడా. టైం చూస్తే సుమారు ఎనిమిది అయ్యింది. జగన్‌కి షేక్‌హ్యాండ్ ఇచ్చి ‘‘వెల్ స్క్రిప్ట్’’ అంటూ ‘‘ఛోటా నాకు ఇంకో లైన్ చెప్పాడే’’ అన్నాడు కల్యాణ్.
 ‘‘ఆయన టేస్ట్‌కి తగ్గట్టుగా ఇంకో కథ చెప్పాను. నేను మీకు చెప్పాలనుకున్న కథ మాత్రం ఇదే’’ చెప్పాడు జగన్ నవ్వుతూ.
 ‘‘ఓకే. మనం సినిమా చేస్తున్నాం. కానీ ఈ క్లైమాక్స్ నాకు నచ్చలేదు. మార్చి తీసుకు రండి’’... కల్యాణ్ ఫైనల్ ట్విస్ట్.
 
కల్యాణ్ ఓకే చేసినందుకు ఆనందపడాలో, ఈ ఫైనల్ ట్విస్ట్‌కి బాధపడాలో అర్థం కాని పరిస్థితి జగన్‌ది. రూమ్‌కొచ్చాడు. క్లైమాక్స్ గురించే తీవ్రాతి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. రోజుకో క్లైమాక్స్ రాశాడు. వారం రోజుల్లో 7 క్లైమాక్స్‌లు. ఆ రోజే కల్యాణ్‌ని కలిసి ఫైనల్ వెర్షన్ చెప్పాలి. వెళ్తూ వెళ్తూ ఆ  క్లైమాక్స్ పేపర్ల వైపు చూశాడు జగన్. వెంటనే వాటిని చింపేసి డస్ట్ బిన్‌లో పారేశాడు. కల్యాణ్‌ని కలిసి క్లైమాక్స్ వినిపించాడు.
 
‘‘ఇదేంటి? ఇది పాత క్లైమాక్సే కదా. మార్చుకు రాలేదా?’’ ఆశ్చర్యంగా అడిగాడు కల్యాణ్. ‘‘ఏడు క్లైమాక్స్‌లు రాశాను సార్. కానీ నాకెందుకో వాటన్నింటి కంటే ఇదే నచ్చింది’’ కొంచెం ఇబ్బందిపడుతూనే అసలు నిజం చెప్పేశాడు జగన్. కల్యాణ్ ఒక్కుదుటున లేచి ‘‘కంగ్రాట్స్ జగన్... నువ్వు క్లైమాక్స్ మార్చి ఉంటే మనం సినిమా చేసేవాళ్లం కాదు. కథ మీద నీకున్న నమ్మకాన్ని టెస్ట్ చేయడం కోసమే క్లైమాక్స్ మార్చమన్నా. ‘తమ్ముడు’ షూటింగ్ అయిపోగానే ఈ సినిమా మొదలుపెడదాం’’ అని చెప్పాడు.
 
కల్యాణ్ ఎవరికో ఫోన్ చేశాడు. అరగంట తర్వాత సీనియర్ ప్రొడ్యూసర్ టి.త్రివిక్రమరావు అక్కడికొచ్చారు. ‘‘ఇతని పేరు పూరీ జగన్నాథ్. నేను మీకు చేయబోయే సినిమాకు ఇతనే డెరైక్టర్. మిగతా విషయాలు మాట్లాడుకోండి’’ అంటూ జగన్‌ని త్రివిక్రమరావుకి ఇంట్రడ్యూస్ చేశారు.
 
త్రివిక్రమరావు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. కల్యాణ్ ఇంత త్వరగా డేట్స్ ఇస్తాడని ఆయన ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లైన్‌లో చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నా పిలిచి మరీ డేట్లు ఇచ్చాడాయనకు. చిరంజీవితో ‘కొండవీటి దొంగ’ తీస్తున్నప్పుడు కల్యాణ్ లొకేషన్‌కి వెళ్లేవాడు. ఆ టైమ్‌లో త్రివిక్రమరావు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారట. ఆ హాస్పిటాలిటీ కల్యాణ్‌కు గుర్తుండిపోయింది.
 జగన్‌కు డెరైక్షన్ చాన్సిస్తూ కల్యాణ్ ఓ కండిషన్ పెట్టాడు. ‘‘టాకీ పార్టీలో నేను వేలు పెట్టను. కానీ సాంగ్స్ పిక్చరైజేషన్ బాధ్యత అంతా నాదే.’’ జగన్‌కి ఓకే.
   
జగన్‌కి 50 వేలు అడ్వాన్స్. ఆ డబ్బుతో ఫిల్మ్‌నగర్ టర్నింగ్‌లో ఆఫీస్ తీశాడు. 3 లక్షలు అప్పుచేసి ఆఫీస్ మొత్తం డెకరేట్ చేయించాడు. అప్పుడే ఇంత బిల్డప్ అవసరమా? అని ఫ్రెండ్‌‌స తిట్టారు. అయినా జగన్ డోంట్ కేర్.
 
సినిమా స్టార్ట్ కావడానికి కొన్ని నెలల గ్యాప్. ఈలోగా షాట్ బై షాట్ బొమ్మలతో స్క్రిప్ట్ బుక్ చేసుకున్నాడు. మరోపక్క ఆర్టిస్టుల సెలెక్షన్. ఇద్దరు హీరోయిన్లు కావాలి. కొత్తవాళ్లయితే బెటర్. చలో ముంబై. నెంబరాఫ్ కో-ఆర్డినేటర్స్‌ని కాంటాక్ట్ చేశారు. ఫైనల్‌గా ఇద్దరు సెలెక్ట్. రేణూ దేశాయ్ మెయిన్ హీరోయిన్. అమీషా పటేల్ సెకెండ్ లీడ్. కల్యాణ్‌కి కూడా ఇద్దరూ నచ్చేశారు. కానీ సరయు పాత్రకు రేణు కంటే అమీషా బావుంటుందని సజెషన్. దాంతో హీరోయిన్లు రివర్స్.
 హీరో క్యారెక్టర్ పేరు నందా. విలన్ నేమ్ బద్రి. ఇది కూడా రివర్స్. ఇప్పుడు - హీరో పేరు ‘బద్రి’. విలన్... నందా.
 
సినిమా టైటిల్ ‘చెలి’ అని పెడితే ఎలా ఉంటుంది? మరీ సాఫ్ట్ అయిపోతుందేమో. ఎందుకు ఎంచక్కా ‘బద్రి’ అని ఉంచేస్తే పోలా! టైటిల్ డన్.
 మధు అంబట్ సీనియర్ కెమెరామ్యాన్. పవన్ కల్యాణ్ చాయిస్. జగన్‌లాంటి కొత్త డెరైక్టర్‌కు అంతకన్నా పెద్ద భరోసా ఏముంటుంది?
 రమణ గోగుల మ్యూజిక్ డెరైక్టర్. కల్యాణ్‌కి క్లోజ్. ‘తమ్ముడు’కి అతనే మ్యూజిక్ ఇస్తున్నాడు. జగన్‌తో కూడా రమణ గోగుల బాగా కలిసిపోయాడు.
   
టాకీ పార్ట్ షూటింగంతా హైదరాబాద్‌లోనే. కొన్ని పాటలకు మాత్రం న్యూజిలాండ్ వెళ్లారు. ‘అయామ్ ఏన్ ఇండియన్’ అంటూ ఓ ఇంగ్లిషు పాట పెట్టారు. జాలీస్ షేర్వాణి రాసిన ఆ పాటను రమణ గోగుల పాడారు.
 ‘బద్రి’ షూటింగ్ టైమ్‌లోనే ‘కహోనా ప్యార్ హై’ రిలీజై బ్లాక్‌బస్టర్ అయ్యింది. దాంతో అమీషాకు బాలీవుడ్‌లో మహా డిమాండ్. ‘బద్రి’ షూటింగ్‌కు కొంత అంతరాయం.
   
 2000 ఏప్రిల్ 20. ‘బద్రి’ రిలీజ్. పవన్ కల్యాణ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉందన్నారు. ‘‘నువ్వు నందావైతే నేను బద్రీ’’ లాంటి డైలాగులు బాగా పేలాయి. మొదట్లో డివైడ్ టాక్. ఫైనల్‌గా హిట్‌గా డిసైడ్. కల్యాణ్‌కు వరుసగా ఆరో విజయం. పూరి జగన్నాథ్ అనే సరికొత్త అధ్యాయానికి అందమైన శ్రీకారం.
   
 జగన్‌కు ఇప్పుడు హైదరాబాద్‌లో కోట లాంటి ఆఫీస్ ఉంది. ఆయన పర్సనల్ చాంబర్‌లో కుడిపక్కన ‘బద్రి’ పోస్టర్ లామినేషన్ స్పెషల్‌గా కనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడల్లా జగన్‌లో ఓ కొత్త ఎనర్జీ పరవళ్లు తొక్కుతూ ఉంటుంది.
 
 వెరీ ఇంట్రస్టింగ్...
* పూరి అక్క కూతురి పేరు సరయు. అదే ఇందులో కథానాయికకు పెట్టాడు.
* హిందీలో జగన్ దర్శకత్వంలోనే ‘షర్త్’ పేరుతో రీమేక్ చేశారు త్రివిక్రమరావు. తుషార్ కపూర్ హీరో. అక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
 
 - పులగం చిన్నారాయణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement