రిలేషణం: భానులో మంచి మ్యుజీషియన్ ఉన్నాడు!
భానుచందర్ అంటే ఒక జనరేషన్‌ని ఉర్రూతలూగించిన యాక్షన్ హీరో. ఓ పక్క టై, మెరుపుదాడిలాంటి యాక్షన్ ఫిలిమ్స్ చేసినా కూడా... తరంగిణి, నిరీక్షణ, సూత్రధారులు, మంచి మనసులులాంటి చిత్రాలతో తనలోని వెర్సటాలిటీని ఆవిష్కరించుకున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టుగా బిజీబిజీగా ఉన్న భానుచందర్ గురించి ఆయన అన్నయ్య మూర్తి చందర్ చెబుతోన్న విశేషాలివి!
‘‘మా నాన్నగారు మాస్టర్ వేణు ఫేమస్ మ్యూజిక్ డెరైక్టర్. ఆయనకు మేమిద్దరమే కొడుకులం. భానుకన్నా నేను రెండేళ్లు పెద్ద. వయసు గ్యాప్ పెద్దగా లేకపోవడం వల్లనేమో, ఇద్దరం బ్రదర్స్‌గా కన్నా క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లం. బాగా తిట్టుకుని, కొట్టుకునేవాళ్లం. నాకు పంతమెక్కువ. రెండు, మూడు రోజులు మాట్లాడకపోతే, వాడే వచ్చి బతిమాలుకునేవాడు. ఇద్దరిదీ ఒకటే మంచం. స్కూలు ఫైనల్ వరకూ ఒకే కలర్ డ్రెస్ కూడా. మా ఇద్దర్నీ రామలక్ష్మణులనేవారు. సినిమాలకు, షికార్లకు కలిసి వెళ్లాల్సిందే. ఎక్కువ ఇంగ్లిష్ సినిమాలకు వెళ్తుండేవాళ్లం. క్రికెట్ కూడా ఆడేవాళ్లం. ఇద్దరికీ మ్యూజిక్ అంటే ఇంట్రస్ట్. వాడు గిటార్ నేర్చుకుంటే, నేను పియానో ట్రై చేసేవాణ్ణి. నాన్నగారిలాగా వాడూ మ్యూజిక్ డెరైక్టర్ కావాలని అమ్మ ఆకాంక్ష. నన్నేమో డాక్టర్‌ని చేయాలని కోరిక. రెండూ నెరవేరలేదనుకోండి.
సెప్టెంబర్ 8, ఫన్‌డే రిలేషణంలో... సినీనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సోదరుడు సీతారామారావుగారికి కేవలం ఇద్దరు ఆడపిల్లలు అని పొరపాటుగా ప్రచురితమైనది. వాస్తవంగా ఆయనకు ముగ్గురు పిల్లలు. ఒక మగపిల్లాడు, ఇద్దరు ఆడపిల్లలు. కుమారుడు శేషగిరిబాబు ఒక కంపెనీ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. పొరపాటుకు చింతిస్తున్నాం.
నౌషాద్‌గారి దగ్గర సంగీత శిక్షణ కోసమని భాను కొన్నాళ్లు ముంబై వెళ్లాడు. ఆ టైమ్‌లో చెడు స్నేహాల వల్ల డ్రగ్స్‌కి బానిసయ్యాడు. నేను వాణ్ణి బలవంతంగా మద్రాసు తీసుకొచ్చి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను. కరాటే నేర్చుకున్నాక వాడి లైఫ్ స్టయిల్ మారిపోయింది. అప్పట్నుంచీ కరెక్ట్ రూట్‌లోకి వచ్చేశాడు. సినిమా ఆర్టిస్టు అవుతానంటే వద్దని నేను నిరాశపరిచేవాణ్ణి. కానీ భాను మొండివాడు. అనుకున్నది సాధించాడు. తను హీరో కావడం నాకు సర్‌ప్రైజ్. ఎందుకంటే చిన్నప్పుడు తనలో హీరో ఫీచర్స్ ఉండేవి కాదు. కష్టపడి, ఇష్టపడి తనను తాను డెవలప్ చేసుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. నాలో చిన్నప్పటినుంచీ స్పిర్చువల్ థాట్స్ ఎక్కువ. అందుకే పెళ్లి చేసుకోలేదు. నా గురించి భాను కూడా కొన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు. చివరకు అమ్మ ఒత్తిడి మేరకు ఆలస్యంగానైనా పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఇద్దరు కొడుకులు. వాళ్లని చూస్తుంటే అచ్చంగా మా బాల్యం గుర్తొస్తుంది. ఒకడేమో హీరో అయ్యాడు. ఇంకొకడు మెడిసిన్ చదువుతున్నాడు. మా అమ్మ కోరిక అలా నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది.
మా ఇద్దరికీ పోలికలున్నా, మనస్తత్వాలు పూర్తి విరుద్ధం. నేను ఇంట్రావర్ట్‌ని. వాడు ఎక్కడికైనా దూసుకుపోగలడు. నాకు మెడికల్ సీటు రాక బి.ఏ.లో చేరాను. ఆ తర్వాత మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో స్థిరపడిపోయాను. నేను కొన్నాళ్లు మ్యూజిక్ టీచర్‌గా ఓ స్కూల్లో పనిచేశాను. అలాగే సంగీత దర్శకుడు రాజ్ దగ్గర పదేళ్లు ఉన్నాను. నాకన్నా భానులోనే ఎక్కువ మ్యూజిక్ టాలెంట్ ఉంది. తను ఇప్పుడు తలుచుకున్నా మంచి మ్యూజిక్ డెరైక్టర్ కాగలడు.
తన సినిమాల్లో నాకు ‘నిరీక్షణ’ అంటే చాలా ఇష్టం. తనలో చాలా పొటెన్షియాలిటీ ఉంది. దాన్నెవరూ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. భాను కేరెక్టర్ యాక్టర్‌గా చేయడం నాకిష్టం లేదు. చేస్తే హీరోగానే చేయాలి. తనకిలాంటి చిన్నా చితకా పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. అమితాబ్ బచ్చన్ 70 ఏళ్లు వచ్చినా కూడా శక్తిమంతమైన పాత్రలు చేస్తున్నాడు. ఈ విషయమే ఎన్నిసార్లు చెప్పినా భాను పట్టించుకోడు. ఖాళీగా కూర్చోలేను కదా అంటుంటాడు.
- పులగం చిన్నారాయణ