‘‘ఎంతటి కళాకారుడైనా.. ఎంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మంచి విద్యార్థిగానే ఉండాలి’’.. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తరచూ చెప్పే మాట ఇది. మూడేళ్ల వయసుకే తబలాపై చిట్టి చేతులేసి.. ఏడేళ్లకే స్టేజ్ షో ఇచ్చి.. 12 ఏళ్లకే అంతర్జాతీయ సంగీత కచేరీలు.. ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన సంగీత ప్రయాణం ముగిసింది.
జాకీర్ హుస్సేన్ మరణంతో.. ఆయన జ్ఞాపకాలను కొందరు తెరపైకి తెస్తున్నారు. ఆయన నేపథ్యం, ఆయన పరిచయాలు, ఆసక్తికర ఘటనలు.. ఇలా ఎన్నింటినో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ తబలా విద్వాంసుడు.. చివరి పోస్టుగా ‘అద్భుతమైన క్షణం’ ఉంచారు.
ఈ అక్టోబర్‌లో అమెరికాలో ఉన్న ఆయన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటూ.. ప్రకృతి వీడియోను స్వయంగా చిత్రీకరించి షేర్ చేశారాయన. ఆ పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఓ గురువు నేర్పడం కాదు.. ఓ విద్యార్థి నేర్చుకోవడం అనేది ముఖ్యం. గురువును ఆ విద్యార్థి నేర్పే విధంగా ఇన్‌స్పైర్ చేయాలి. అంటూ ఆయన చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అలాగే..
నా మొదటి గురువు నా తండ్రే. ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎప్పుడూ నేర్చుకోగలగడం చాలా ముఖ్యం. మనల్ని మనం బెస్ట్ అని అనుకోకూడదని మా నాన్న చెబుతుండేవారు. ఓ కళాకారుడు ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మంచి విద్యార్థిగా ఉండాలి. అప్పుడే విజయం సాధిస్తారు.
గొప్ప గొప్ప సంగీత విద్వాంసులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే చెప్పారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉన్నామన్నారు. వారి మాటలు నాలో స్ఫూర్తినింపాయి. నా రంగంలో నేను అత్యుత్తమంగా ఉన్నాను. అయినా ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదు. నాకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే కనీసం 15 మంది పేర్లు చెబుతాను.. అని జాకీర్ హుస్సేన్ మాటలు ‘‘వహ్ ఉస్తాద్ వహ్..’’ అని నెటిజన్లతో అనిపిస్తున్నాయి.
క్లిక్ చేయండి: ఇక సెలవు మిత్రమా.. చితి వద్ద జాకీర్ హుస్సేన్ కన్నీళ్లు
Comments
Please login to add a commentAdd a comment