Musician
-
‘పోవే, నాకు విశ్రాంతి ఏంటి?!’
‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది, కూసుండనీదురా కూసింత సేపు‘ అంటారు నండూరి సుబ్బారావు తన ఎంకి పాటల్లో. 107 ఏళ్ల వయసున్న కుంజమ్మకు ఈ మాట సరిగ్గా సరిపోలుతుంది. కుంజమ్మ గాయని. కర్ణాటక సంగీతకారిణి. తన పన్నెండవ ఏట నుండి ఆమె గుండె ఆమె గొంతులో స్వరబద్ధంగా కొట్టుకుంటూ ఉంది. ‘సంగీతమే నా హృదయ స్పందన’ అంటారు కుంజమ్మ, గమకం వంటి ఒక చిరునవ్వుతో. కుంజమ్మ 21వ ఏట ఆమె భర్త చనిపోయారు. ఆర్మీలో పనిచేసేవారు ఆయన. ఆనాటి నుంచీ సంగీతమే ఆమెకు జీవనాధారం, ్రపాణాధారం అయింది. నేటికీ కొల్లమ్‌లో ఆమె ఉంటున్న పూయప్పల్లిలో ఆమె గాత్రం గుడి గంట వంటిది. ఆ ఊళ్ళో ఏ వేడుకా, ఏ పెళ్ళీ, ఏ పుట్టిన రోజూ ఆమె పాడకుండా, ఆమె హార్మనీ వాయించకుండా మొదలైనట్టు కాదు, ముగిసినట్టూ కాదు. అంత్యక్రియల్లోనూ ఆమె స్వరం అనునయిస్తూనే అవతలి వారిని సాంత్వన పరుస్తుంది. కుంజమ్మకు కూతురు లిల్లీకుట్టి. కుంజమ్మకు పూయప్పల్లి ఆత్మబంధువు. ఊరికన్నా ఆమె చిన్నదో, ఆమెకన్నా ఊరు చిన్నదో చెప్పలేం. లేదా కుంజమ్మ, పూయప్పల్లి కవలలు అయి ఉండాలి. ఆమెకు కాస్త విశ్రాంతిని ఇచ్చేటందుకు ఆమె వయసు ఎంత ప్రయత్నిస్తున్నా... ‘పోవే, నాకు విశ్రాంతి ఏంటీ?!’ అని గాత్రాన్ని, సంగీత వాద్యాన్ని శ్రావ్యంగా పలికిస్తూనే, సుమధుర రాగాలను ఒలికిస్తూనే ఉన్నారు కుంజమ్మ!! -
శేషాచలంలో సాగర ఘోష!
ఉత్తర భారతదేశంలోని సంగీత సాధకులు కొందరు తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోదలిచారు. అదే విషయం తమ సంగీత విద్వాంసుడికి చెప్పారు. ఆ విద్వాంసుడు చాలా సంతోషించి ‘అలాగే, అక్కడి శేషాచలం కొండల్లోని సముద్రాన్ని చూసి రమ్మని’ చెప్పి పంపాడు.ప్రయాణం మొదలైనప్పటినుంచీ ఆ సాధకుల్లో ఓ సందేహం మొదలయ్యింది. ‘తిరుమల శేషాచలం కొండల దగ్గర సముద్రం ఉందని ఎన్నడూ వినలేదు, మరి గురువు ఎందుకు అలా చెప్పాడో...’ అని. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎందరో పండితులను విచారించినా తిరుమల కొండ సమీపంలో సముద్రం ఏదీ లేదని తెలుసుకున్నారు. ‘అయినా గురువు తప్పు చెప్పడు కదా!’ అని ఆలోచించారు. ‘ఎలాగూ వెళ్తున్నాము కదా, కొండ పరిసరాల్లో వెదికి చూద్దాం!’ అనుకున్నారు. అలిపిరి మెట్ల నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గుండు గీయడమంటే పాపాలు పోగొట్టుకోవడమే అని నమ్మిన ఆ సాధకులు స్వామికి తలనీలాలు సమర్పించారు. పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. లడ్డు ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే, వారికి గురువు చెప్పింది గుర్తుకొచ్చింది. కనిపించిన భక్తులతో సముద్రం గురించి ఆరా తీశారు. వారు సమాధానం ఇవ్వకపోగా వీరి వైపు వింతగా చూశారు. ‘తిరుమల కొండలపైన సముద్రం కాకపోయినా, సముద్రం లాంటిదేమైనా ఉంటుందేమో చూద్దామని’ బయలుదేరారు. ఆకాశ గంగ, పాపవినాశనం, జాపాలి, పాండవ తీర్థం లాంటి ప్రదేశాలన్నీ గాలించారు. వారికెక్కడా సముద్రం ఆనవాలు కనిపించలేదు. గురువు పొరపాటుగా చెప్పినట్లున్నారని తీర్మానించుకుని కొండ దిగడం ్రపారంభించారు.వారికి దారిలో ఏడవ మైలు వద్ద ఆకాశం ఎత్తు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. భక్తితో నమస్కరించి కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా కూర్చున్నారు. వారి చెవులకు... లీలగా... మైకులో నుంచి ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము... పదివేల శేషుల పడగల మయము‘ అనే అన్నమాచార్య కీర్తన వినిపించింది. వారి ఒళ్ళు పులకరించింది. ముఖాల్లో నేతి దీపాల మెరుపు మొదలయ్యింది. గురువు చెప్పిన ‘సముద్రం’ లోతు తెలిసింది. ఏడు స్వరాలు ఏడుకొండలై అన్నమయ్య సంగీత స్వరంతో ప్రవహించడం గమనించారు.‘మనమనుకునే ఉప్పు నీటి సముద్రం శేషాచలం కొండల్లో లేదు కానీ అన్నమయ్య గానామృత సముద్రం ఈ కొండల దగ్గర ఉంది’ అని తెలుసుకున్నారు. పండితులను, పామరులను సైతం ఓలలాడించే ముప్పది రెండువేల సంకీర్తనలు తెలుగులో అందించిన ఆ పదకవితా పితా మహుడికి మనస్సులోనే ధన్యవాదాలు తెలిపారు. గోవింద నామస్మరణలు చేస్తూ కొండ దిగారు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
US: అమెరికాలో మరో భారతీయుడి హత్య
అలబామా: అమెరికాలో భారతీయుల వరుస మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా సిక్కులకు సంబంధించిన ఒక కీర్తన కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్‌సింగ్ అలియాస్ గోల్డీ(23)ని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. కీర్తన కార్యక్రమంలో పాల్గొని గురుద్వారా బయటికి వచ్చిన తర్వాత జరిగిన కాల్పుల్లో రాజాసింగ్ మృతిచెందాడు. రాజాసింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని టండా సాహువాలా గ్రామం. ఐదేళ్ల క్రితమే రాజాసింగ్ తండ్రి మరణించాడు. కుటుంబానికి రాజాసింగ్ సంపాదనే ఆధారం. రాజాసింగ్ మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు సాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అతడి కుటుంబం కోరింది. కాగా, ఇటీవలి కాలంలో అమెరికాలతో భారత్, భారత సంతతికి చెందిన వారి మరణాలు ఎక్కువయ్యాయి. గడిచిన రెండు మూడు నెలల కాలంలో అమెరికాలో మరణించి వారిలో భారత విద్యార్థులతో పాటు ఒక వ్యాపారవేత్త కూడా ఉండటం గమనార్హం. ఈ వరుస మరణాలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పందించింది. మరణాల వెనుక ప్రత్యేక కుట్ర లేదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి.. ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం -
ఈ మ్యూజికల్ సునామీ ఎవరో గుర్తు పట్టండి! (ఫోటోలు)
-
అరుదైన సంగీత శస్త్ర చికిత్స: బ్యాండు మేళం వాయిస్తుంటే.. సర్జరీ చేసేశారు
ఇటలీలోని ఒక వ్యక్తి అత్యంత అరుదైన శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. అతను శాక్సోఫోన్(బ్యాండు మేళ వాయిద్యం) వాయిస్తూ...ఉంటే ఆపరేషన్ చేసేశారు. అది కూడా దాదాపు తొమ్మిది గంటల ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ఈ మేరకు జీజెడ్ అనే 35 ఏళ్ల వ్యక్తికి రోమ్‌లోని పైడియా ఇంటర్నేషనల్ ఆస్పత్రి ఈ అరుదైన శస్త్ర చికిత్స చేసింది. డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా ఈ శస్త్ర చికిత్స గురించి మాట్లాడుతూ..."ఈ సర్జరీలో రోగి స్ప్రుహలోనే ఉండాలి. అతని మెదడుకు సంబంధించిన న్యూరానల్ ఫంక్షన్ జరుగుతుండాలి. అంటే మాట్లాడటం, కదలడం, లెక్కించడం, గుర్తించడం, ఆడటం వంటివి అన్నమాట. పేషంట్ ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఈ శస్త్ర చికిత్సను సుమారు 10 మందితో కూడిన వైద్యా బృందం చేస్తోంది. మొదటగా వైద్యులకు ఈ శస్త్ర చికిత్స ఎలా సాధ్యం అనే సందేహం కలిగింది. ఎందుకంటే చేసేది బ్రెయిన్ సర్జరీ. అందుకు రోగి పూర్తిగా సహకరించాలి. ఏ మాత్రం భయపడకుండా మేల్కొని ఉండి చేయించుకోవాలి. అసలు టెన్షన్‌కి గురికాకూడదు. వైద్యులుకు కూడా ఈ శస్త్ర చికిత్స అతిపెద్ద సవాలుతో కూడుకున్నది. దీంతో వైద్యుల సదరు రోగితో మాట్లాడుతుండగా... అతను సంగీతకారుడని తెలుసుకున్నాం. దీంతో తాము ఈ చికిత్స సమయంలో తనకు ఇష్టమైన సంగీత వాయిద్యాన్ని వాయిస్తుండమని, నిద్రపోకూడదని చెప్పాం. దీంతో జీజెడ్ కూడా వైద్యులకు పూర్తిగా సహకరించి, ఏ మాత్రం భయపడకుండా బ్యాండు మేళ వాయిస్తూ చేయించుకున్నాడు. ఈ శస్త్ర చికిత్స ద్వారా రోగి బ్రెయిన్లో ఒక నిర్థిష్ట ప్రాంతంలో ఉన్న కణితిని తొలగించి వ్యాధిని నయం చేస్తాం. అంతేకాదండోయ్ సదరు పేషంట్ శస్త్ర చికిత్స జరుగుతున్నంత సేపు ఇటాలియన్ జాతీయ గీతాన్ని, 1970ల లవ్‌స్టోరీ చిత్రంలోని థీమ్ సాంగ్‌ని వాయించాడని వైద్యులు చెప్పారు. తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రోగి మేల్కోని ఉండగానే ఈ శస్త్ర చికిత్స చేయగలిగాం." అని డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా సంతోషంగా చెప్పారు. (చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు) -
చిన్మయి త్రిపాఠి.. ఈమె కవిత్వం పాడుతుంది! రాక్ బ్యాండ్ ద్వారా...
తిలక్‌ని, కృష్ణశాస్త్రిని, శ్రీశ్రీని, జాషువాని పాడుతూ ఒక రాక్‌బ్యాండ్ ఉంటే ఎలా ఉంటుంది? తెలుగులో అలాంటిది లేదు. కాని చిన్మయి త్రిపాఠికి కవిత్వం అంటే ఇష్టం. కబీర్‌ని, తులసీదాస్‌ని, ఆధునిక హిందీ కవులను ఆమె తన రాక్ బ్యాండ్ ద్వారా పాడుతూ దేశమంతా తిరుగుతూ ఉంటుంది. ‘మ్యూజిక్ అండ్ పొయెట్రీ స్టుడియో’ పేరుతో చేస్తున్న ఈ కృషి చిన్మయిని ప్రత్యేకంగా నిలబెట్టింది. స్టేజ్ మీద ఇద్దరు ముగ్గురు వాద్యకారులు తప్ప ఎక్కువ మంది ఉండరు. చిన్మయి త్రిపాఠి తన భుజానికి ‘దోతార’ అనే సంప్రదాయ తీగ వాయిద్యాన్ని తగిలించుకుని పాడటం మొదలెడుతుంది. పాటంటే పాట కాదు. కవిత్వం. ఉదాహరణకు ప్రఖ్యాత హిందీ కవి వినోద్ కుమార్ శుక్లా రాసిన ‘మా ఇంటికి రాని అతిథుల కోసం’ అనే కవితను పాడుతుంది. ‘మా ఇంటికి కొందరు అతిథులు ఎప్పటికీ రారు. కొండలు, నదులు, రంగు రంగు చెట్లు, విరగపండిన పొలాలు ఇవి ఎప్పటికీ రావు. నేనే ఆ పొలాల వంటి మనుషులను కలవడానికి వెళతాను. నదుల వంటి మనుషుల్ని, కొండల వంటి, కొండ కొసల వంటి, చెట్లతో నిండిన అడవుల వంటి మనుషులను కలవడానికి వెళతాను. ఇదేదో నేను తీరుబడి చూసుకొని చేసే పని కాదు. చాలా అత్యవసరమైన పని అన్నట్టుగా వెళ్లి కలుస్తాను. మా ఇంటికి ఎప్పటికీ రాని అతిథుల కోసం నేనే బయలుదేరుతాను’ ఈ కవిత ఆమె పాడుతుంటే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె సుశీల్ శుక్లా అనే కవి రాసిన ‘వృక్షమా... నీవొక దర్జీవి’ అనే కవితను పాడుతుంది. ‘ఎన్ని గూళ్లను అల్లి ఉంటావు. ఎన్ని గాలులను కుట్టి ఉంచాము. ఎన్ని నీడలను ముక్కలు ముక్కలు చేసి కింద పరిచి ఉంటావు... ఓ వృక్షమా... నీవొక దర్జీవి’ అనే కవితను చాలా అందంగా పాడుతుంది. చిన్మయి త్రిపాఠిని చూస్తుంటే ఇలాంటి గాయని తెలుగులో గొప్ప గొప్ప కవిత్వాన్ని పాడేలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఢిల్లీకి చెందిన చిన్మయి త్రిపాఠి ‘మ్యూజిక్ అండ్ పొయెట్రీ స్టుడియో’ స్థాపించి గాయకుడు, జీవన సహచరుడు అయిన జోయెల్ ముఖర్జీతో కలిసి హిందీ కవిత్వాన్ని దేశమంతా పాడుతోంది. నేను ఇందుకు పుట్టలేదు అనిపించింది ‘మాది ఢిల్లీ. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నాను. కాని అందరిలా చదువులో కొట్టుకుపోయాను. ఎం.బి.ఏ చేసి ఉద్యోగం మొదలెట్టాక నేను ఇందుకు పుట్టలేదు అనిపించింది. ‘స్పైస్ రూట్’ అనే ర్యాక్ బ్యాండ్ మొదలెట్టాను. కాని అది ఎక్కువ రోజులు నడవలేదు. ఒకరోజు స్నేహితులతో మాట్లాడుతుంటే ఇవాళ్టి పాటల్లో సరైన కవిత్వమే ఉండటం లేదన్న చర్చ వచ్చింది. హిందీలో భారతీయ సాహిత్యంలో ఎంతో గొప్ప కవిత్వం ఉంది. దానిని మళ్లీ ఈ తరానికి వినిపిస్తే ఎలా ఉంటుంది... అనిపించింది. ఈ విషయాన్ని నేనో క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌తో షేర్ చేసుకున్నాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంటనే రంగంలో దిగాను’ అంటుంది చిన్మయి త్రిపాఠి. చిన్మయి కూడా కవిత్వం రాస్తుంది. చాలా కవిత్వం చదువుతుంది. కనుక ఆ కవిత్వం మీద ప్రేమతో పాడటం వల్ల వెంటనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. కబీర్ దాస్‌తో మొదలెట్టి హిందీలో ఆధునిక కవులు– హరివంశ్రాయ్ బచ్చన్, మహదేవి వర్మ, నిరాలా, ధర్మ్వీర్ భారతి... వీరందరి కవిత్వాన్ని తనే ట్యూన్ కట్టి పాడుతుంది. చిన్మయి గొంతు చాలా భావాత్మకంగా ఉంటుంది. అందుకని కవిత్వంలో ఉండే ఎక్స్ప్రెషన్ బాగా పలుకుతుంది. ‘మన దేశంలో ఉర్దూలో చాలా మంచి కవిత్వం వచ్చి మరుగున పడిపోయింది. ఇప్పుడు దానిని వెతికి తీసే ప్రయత్నంలో ఉన్నాను’ అంటుంది చిన్మయి. ముంబైలో ఉంటూ తన బ్యాండ్‌తో తిరిగే చిన్మయి లండన్‌లో ప్రదర్శన ఇచ్చినప్పుడు అక్కడి ఇంగ్లిష్ ప్రేక్షకులకు హిందీ తెలియకపోయినా ఆ శబ్దాలకు తన్మయులయ్యారని చెబుతుంది చిన్మయి. తన ప్రదర్శనల్లో కశ్మీరీ, బెంగాలీ కవిత్వం కూడా పాడుతోంది చిన్మయి. ‘త్వరలో నేను భగవద్గీతను ఆధునిక సంగీత పరికరాలతో పాడాలని నిశ్చయించుకున్నాను. అదీ ఒక గొప్ప కవిత్వమే కదా’ అంటుంది చిన్మయి. మనకు ఘంటసాల పాడిన భగవద్గీత తెలుసు. ఆధునిక లయతో చిన్మయి ఎలా పాడుతుందో చూడాలి. చదవండి: గూగుల్‌ను వీడి.. పర్యావరణ పరిరక్షణ కోసం! నెదర్లాండ్స్ అమ్మాయి.. వ్యాన్నే ఇల్లుగా చేసుకుని! మన దేశమంతా చుట్టేస్తూ! View this post on Instagram A post shared by Chinmayi (@chinmayitripathi) -
భారత్‌కు పాక్ మ్యుజీషియన్ కానుక.. ‘రబాబ్’పై జనగణమన వినిపించి..!
ఇస్లామాబాద్: భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పుసర్కరించుకుని.. మన జాతీయ గీతమైన ‘జనగణమన’ను ‘రబాబ్’ ద్వారా వాయించి భారతీయులకు అంకితమిచ్చాడు పాకిస్థాన్‌కు చెందిన సియాల్ ఖాన్ రబాబ్ వాయిద్యకారుడు. భారత జాతీయ గీతమైన ‘జనగణమన’ను రబాబ్(తంబూర తరహాలో ఉండే రబాబ్ పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌తోపాటు కశ్మీర్‌లోనూ ప్రసిద్ధి)తో అద్భుతంగా వాయించారు సియాల్ ఖాన్. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘సరిహద్దుల్లో ఉన్న వీక్షకులకు నా కానుక’ అంటూ ఆ వీడియోను పోస్టు చేశారు సియాల్ఖాన్. ‘భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇరు దేశాల మధ్య శాంతి, సామర్యం, సంబంధాలు ఏర్పడేందుకు.. స్నేహం, సద్భావనకు చిహ్నంగా భారతదేశ జాతీయ గీతాన్ని ప్రయత్నించాను’ అంటూ సంగీతకారుడు జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు ఒక మిలియన్ మంది వీక్షించారు. Here’s a gift for my viewers across the border. 🇵🇰🇮🇳 pic.twitter.com/apEcPN9EnN — Siyal Khan (@siyaltunes) August 14, 2022 ఇదీ చదవండి: పామును ముక్కలుగా కొరికేసిన రెండేళ్ల చిన్నారి! -
సంతూర్ విద్వాంసుడు సొపోరి కన్నుమూత
న్యూఢిల్లీ: సంతూర్ విద్వాంసుడు భజన్ సొపోరి (73) కన్నుమూశారు. కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురుగ్రాం ఆస్పత్రిలో గురవారం తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు అభయ్ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. సంతూర్ మేస్ట్రో పండిట్ శివకుమార్ శర్మ మరణించిన కొన్ని వారాలకే సొపోరి కూడా వెళ్లిపోవడం సంగీత ప్రపంచంలో విషాదం నింపింది. కశ్మీర్‌కు చెందిన సొపోరి పదేళ్ల వయసులోనే కచేరి చేశారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అలరించారు. హిందీ కశ్మీరీ, డోగ్రీ, సింధీ, ఉర్దూ, భోజ్‌పురీ, పర్షియన్, అరబిక్ భాషల్లో 6 వేలకుపైగా పాటలు కంపోజ్ చేశారు. గాలిబ్ గజల్స్‌కూ బాణీలు కట్టారు. 2004లో పద్మశ్రీ అందుకున్నారు. -
విషాదం.. ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత
ముంబై: ప్రఖ్యాత సంతూర్ వాద్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ శివకుమార్ శర్మ (84) కన్నుమూశారు. సంతూర్ వాయిద్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టడమే కాకుండా అటు సంప్రదాయ సంగీతంలోనూ, ఇటు సినీ సంగీతంలోనూ తనదైన ముద్ర వేశారు. మంగళవారం ఉదయం 8– 8:30 గంటల మధ్యలో శివకుమార్ శర్మ గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్టుగా ఆయన సెక్రటరీ దినేష్ వెల్లడించారు. కిడ్నీ సంబంధ వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్న శర్మ డయాలసిస్ మీదున్నారు. అయినప్పటికీ ఆయన తనలో ఊపిరి ఉన్నంతవరకు సంతూర్ వాద్యనాదంతో అభిమానుల్ని అలరించారు. వచ్చే వారం భోపాల్‌లో ఆయన సంగీత కచేరి కూడా చేయాల్సి ఉన్న సమయంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శివకుమార్ శర్మకు భార్య మనోరమ, కుమారులు రాహుల్, రోహిత్ ఉన్నారు. మనోరమ, రాహుల్ కూడా సంతూర్ వాద్యకారులే. తీవ్రమైన గుండెపోటు రావడంతో శర్మ ఉదయం బాత్రూమ్లోనే కుప్పకూలిపోయారు. ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుండగా నిముషాల్లోనే ప్రాణాలు కోల్పోయారని, ప్రసిద్ధ సంగీతకారుడు పండిట్ జస్రాజ్ కుమార్తె దుర్గా జస్రాజ్ చెప్పారు. శివకుమార్ శర్మ తనకు రెండో తండ్రిలాంటివారని,, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనని బతికించుకోలేకపోయామంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 1938లో జమ్మూలో జన్మించిన శర్మ సంతూర్ పరికరాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తొలి సంగీత కళాకారుడు. దేశవ్యాప్తంగా నివాళులు శివకుమార్ మృతికి దేశవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. సంగీతప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసిన శర్మ సంతూర నాదం ఇప్పుడు మౌనంగా రోదిస్తోంది అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన సంతాప సందేశంలో పేర్కొంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శివకుమార్ శర్మ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని అన్నారు. రాబోయే తరాలను ఆయన సంతూర్ వాద్యం ఆకర్షిస్తుందన్నారు. ఆయనతో తాను గడిపిన సమయాన్ని మోదీ ఒక ట్వీట్లో గుర్తు చేసుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా తమ మట్టి బిడ్డ అంతర్జాతీయ ఖ్యాతినార్జించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు. ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని శివకుమార్ శర్మ సంతూర్ వాద్యాన్ని యావత్ ప్రపంచమే ఆరాధించిందని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వెల్లడించారు. బాలీవుడ్‌లోనూ హవా జమ్మూ కశ్మీర్‌కు చెందిన జానపద వాయిద్యమైన సంతూర్‌పై భారతీయ సంప్రదాయ సంగీతాన్ని అద్భుతంగా పలికించి అంతర్జాతీయంగా ఆ వాద్యపరికరానికి శివప్రసాద్ ఒక గుర్తింపును తీసుకువచ్చారు. బాలీవుడ్ సినిమాల్లో వేణుగాన విద్వాంసుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియాతో కలిసి శివ్–హరి పేరుతో సిల్సిలా, లమ్హే, చాందిని, డర్ వంటి సినిమాలకు సంగీతాన్ని అందించి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. -
ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత..
Tabla Musician Tabla Prasad Passed Away: ప్రముఖ సంగీత విద్వాంసుడు 'తబలా ప్రసాద్' శుక్రవారం (మార్చి 18) ఉదయం కన్నుమూశారు. తబలా ప్రసాద్ 70 సంవత్సరాలకుపైగా తమిళం, హిందీ, తెలుగులో 4 తరాల స్వరకర్తలతో పనిచేశారు. ఆయన తబలా సంగీతం ఇచ్చిన ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. ఉత్తర భారదేశంలో ఆర్డి బర్మన్, సి. రామచంద్ర, లక్ష్మీకాంత్ ప్యారీలాల్, నవ్‌షత్, పప్పిలహరితోపాటు సౌత్ ఇండియాలో స్క్రీన్ మ్యుజిషియన్ తిలక్ కెవిఎం, మెలోడీ కింగ్ ఎమ్ఎస్వి, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా వంటి చాలా మందికి తబలా వాయించారు. అంతేకాకుండా ఈ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా, జివి ప్రకాష్‌తో కలిసి ఐదుకుపైగా భాషల్లో సుమారు 2500 చిత్రాలకు పనిచేశారు. వీటన్నింటితో కలిపి దాదాపు 60000 పాటలకు ఆయన తబలా వాయించారు. 79 ఏళ్ల తబలా ప్రసాద్‌కు భార్య కృష్ణవేణి, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుమారులైన రమణ, కుమార్‌లు కూడా సంగీత విద్వాంసులుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తబలా ప్రసాద్ భౌతికకాయానికి శనివారం చెన్నైలోని వడపళనిలో ఉన్న ఏవీఎం స్డూడియో సమీపంలో ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
తాలిబన్ల పైశాచికం.. వీడియో వైరల్
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దురాగతాలు మరోసారి వైరల్ వీడియోలో బట్టబయలయ్యాయి. దేశంలోని పాక్టియా ప్రావిన్స్‌లో.. ఒక సంగీతకారుడి సంగీత పరికరాన్ని తాలిబానీ పురుషులు తగులబెట్టారు. దీనిని చూస్తూ ఒకవైపు సంగీతకారుడు ఏడుస్తుండగా, మరోవైపు తాలిబన్లు తుపాకులు ధరించి దీనిని చూస్తూ పైశాచిక ఆనందం పోందడం గమనించవచ్చు. ఈ వీడియోను అబ్దుల్ హక్ ఒమేరి అనే జర్నలిస్ట్ ట్విటర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్పై తాలిబాన్లు తమ ఆధీనంలోకి వచ్చినప్పటి నుండి, దేశంలో అనేక మార్పులు వచ్చాయి. కార్లలో, వివాహా వేడుకల సమయంలో సంగీతం వినడాన్ని తాలిబాన్ చట్టవిరుద్ధం చేసింది. పురుషులు, స్త్రీలు వేర్వేరు వేదికలలో వివాహాలు జరుపుకోవాలని బలవంతం చేశారు. Video : Taliban burn musician's musical instrument as local musicians weeps. This incident happened in #ZazaiArub District #Paktia Province #Afghanistan . pic.twitter.com/zzCp0POeKl — Abdulhaq Omeri (@AbdulhaqOmeri) January 15, 2022 చదవండి: (అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'వారిని పార్టీలోకి చేర్చుకునేది లేదు') -
సంగీతం ఎందుకు నేర్పుతున్నానో తెలుసా !!!
వాగ్గేయకారులలో ఒకరిగా ఖ్యాతి గడించిన శ్యామశాస్త్రి గారు పచ్చిమిరియం అప్పయ్య శాస్త్రి గారనే సంగీత విద్వాంసుడి దగ్గర అభ్యాసం కొనసాగిస్తున్నారు. ఒక సదాచారం ఏమిటంటే గురువుల ముందు తాంబూల చర్వణం చేయకూడదు. కానీ శ్యామశాస్త్రి గారికి తాంబూలం బాగా అలవాటు. గురువుగారు కూడా కాదని ఏనాడూ అనలేదు. ఒకనాడు గురువుగారితో మాట్లాడుతుండగా నోటిలో ఉన్న తాంబూల ఉచ్చిష్టం గురువుగారి ఉత్తరీయం మీద పడింది. పశ్చాత్తాప భావనతో వెంటనే శ్యామశాస్త్రి గారు... ఆ ఉత్తరీయం ఇస్తే ఉతికి పట్టుకొస్తానన్నారు. దానికి గురువుగారు...‘‘నీకు సంగీతం ఎందుకు నేర్పుతున్నానో తెలుసా ? ఏ నాటికయినా నీ నోటి తాంబూలం ఈ ఉత్తరీయం మీద పడాలని...’’ అన్నారు. అమ్మవారే పురుష స్వరూపంలో పుట్టిందని భావించిన అప్పయ్య శాస్తిగ్రారు– శ్యామశాస్త్రిని ఆ పేరుతో పిలిచేవారు కారు... ‘కామాక్షీ’ అని పిలిచేవారు. ఈ శిష్యుడికి తాను సంగీతం నేర్పడం లేదు, అతనిలో అప్పటికే ఉన్న సంగీతాన్ని ప్రచోదనం చేస్తున్నానంతే – అని భావించేవారు. సౌందర్యలహరిలో శంకరులంటారు – అమ్మవారి తాంబూలం ఎవరినోట్లోకయినా వెళ్ళిందా వారు మహా కవులయి పోతారు– అని. అలాభావించినగురువుగారు పొంగిపోయారు. తరువాత కాలంలో శ్యామశాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులయ్యారు.ఆ రోజుల్లో భూలోకం చాపచుట్టు కేశవయ్య గారని బిరుదులతో కూడిన గొప్ప సంగీత విద్వాంసుడు ఏనుగెక్కి వస్తుండేవారు. ‘నన్ను గెలవగలిగిన వాడెవడయినా ఉన్నాడా ?’ అని చాటింపు వేసుకుని వచ్చాడు. శ్యామశాస్త్రి గారితో వాదనకు రాజాస్థానంలో ఏర్పాటు చేసారు. వాదనలో మొదటివంతు శ్యామశాస్త్రి గారిది. శిరస్సు కదపకుండా తానం పలకమన్నారు. శాస్త్రరీత్యా తానం పలికేటప్పుడు శిరస్సు కదపకూడదు. వచ్చిన ఆ విద్వాంసుడు అలా చేయలేకపోయారు. తరువాతి వంతు కేశవయ్యగారిది. సింహనందనరాగంలో పాడమని సవాల్ విసిరారు. శ్యామశాస్త్రి అలవోకగా పాడేసారు. తరువాతి వంతు వచ్చినప్పుడు.. శరభనందన రాగంలో పాడమని ఆయన కేశవయ్యగారిని అడిగారు. శరభుడంటే సింహాన్ని చంపగలిగి, 8 కాళ్ళు కలిగి, పక్షి శిరస్సు కలిగిన ఒక స్వరూపం. ఈ రాగాన్ని శ్యామశాస్త్రి గారు అభివృద్ధి చేసారు. అందులో 19 3/4 వంతు మాత్రలు. ఒక ఆవృతిలో 79 అక్షరాలు వచ్చేటట్లుగా ఆలాపన చేయాలని సవాల్ విసిరారు. ఓటమిని అంగీకరించిన కేశవయ్యగారు, శ్యామశాస్త్రి గారి ఔన్నత్యాన్ని అభినందించి వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆయన నాయకరాజుల గౌరవాన్ని నిలబెట్టారు.శ్యామశాస్త్రి జ్యోతిష శాస్త్ర నిపుణులు కూడా. తన భార్య మరణించిన ఐదవరోజున తాను మరణిస్తానని ముందుగానే చెప్పారు. చెప్పినట్లుగానే ఆయన ఇచ్ఛామోక్షాన్ని పొందారు. మిగిలిన ఇద్దరూ... త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు కూడా ఇలా ఇచ్ఛామోక్షాన్ని పొందిన వారే. త్యాగయ్యగారి కయితే బ్రహ్మకపాల మేధనం జరిగింది. ఈ ముగ్గురూ నాదోపాసన చేసిన వారే.శ్యామశాస్త్రి గారు అద్భుతమైన రెండు కీర్తనల్ని సంస్కృతంలో, తెలుగులో ఇచ్చారు. ఈ రెండూ కళ్యాణి రాగంలో ఉంటాయి. వీటిని మీరు ఏదయినా సంగీత వాద్య పరికరంమీద మోగిస్తే, ఏ కీర్తన పలికిస్తున్నారో తెలియదు. కేవలం కంఠంతో పాడితేనే ఇది ఫలానా కీర్తన అని తెలుస్తుంది. అలా ఇచ్చిన కీర్తనలో ఒకటి–‘హిమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే/సుమేరుమధ్యవాసినీ, అంబ శ్రీకామాక్షి....’ -
నాదస్వర విద్వాన్ నాగూర్ కన్నుమూత
అద్దంకి: నాదస్వర విద్వాన్ నాగూర్ సాహెబ్ (90 ) గురువారం అద్దంకిలోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం కశ్యాపురం గ్రామానికి చెందిన నాగూర్ సాహెబ్ తండ్రి ఖాశీం సాహెబ్ పేరు మోసిన నాదస్వర విద్వాంసులు. తల్లి హుస్సేన్భీ. 1930వ సంవత్సరంలో నాగూర్ సాహెబ్ జన్మించారు. ఆయన సోదరుడు దస్తగిరి సైతం నాదస్వర విద్వాంసులు. అద్దంకి ప్రాంతంలో ఇద్దరూ నాదస్వర ద్వయంగా పేరు గాంచారు. తొలి గురువు అయిన తండ్రి వద్దే సంగీతంలో ప్రాథమిక విద్యను నేర్చుకున్నారు. తరువాత మేనమామ నాగులుప్పలపాడు మండల గొనసపూడికి చెందిన మస్తాన్ సాహెబ్ దగ్గర ఉన్నత విద్యను నేర్చుకున్నారు. తమిళనాడులోని తంజావూరు గ్రామానికి చెందిన దొరై కణ్ణన్∙ వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో 1965 నుంచి 2000 సంవత్సరం వరకు నాదస్వర కచేరీలు చేశారు. అక్కడ బీ హైగ్రేడు, ఏ గ్రేడు కళాకారునిగా గుర్తింపు పొందారు. 2011లో తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రముఖ నాదస్వర విద్వాంసుడు పద్మశ్రీ షేక్ చినమౌలానా స్మారక అవార్డును, నాదస్వర విద్వాన్, నాద కోవిద బిరుదులను అందుకున్నారు. ఈయన శిష్యుడు ప్రముఖ నాదస్వర విద్వాంసుడు చినమౌలానా మనవడు బాబుల్ మధురైలో గొప్ప విద్వాంసుడుగా పేరు పొందారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సంగీత దర్శకుడు కె.విశ్వనాథ్‌చే నాదస్వర మణిరత్న బిరుదును పొందారు. సుమారు 5వేల మందికిపైగా ఔత్సాహిక కళాకారులకు హర్మోనియం, నాదస్వరం, ప్లూట్, క్లారినట్ వంటి ఎన్నో వాయిద్యాలను నేర్పారు. నాగూర్‌సాహెబ్‌కు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఒక కుమారుడు ఎస్కే షాజహాన్ గూడూరులో ఎక్సైజ్ ఇన్చార్జ్ సీఐగా పనిచేస్తున్నారు. మరో కుమారుడు తండ్రి వారసత్వాన్ని స్వీకరించి నాదస్వర కళాకారుడయ్యాడు. రెండున్నరేళ్లుగా అనారోగ్య కారణంగా వాయిద్యానికి దూరంగా ఉంటూ గురువారం తన స్వగృహంలో తదిశ్వాస విడిచారు. గాత్ర వాయిద్య కళాకారుల సంఘ నాయకుడు శేషగిరిరావు, కోలాటం కళాకారుడు జాన్ సాహెబ్, రంగస్థల కళాకారుడు అద్దంకి నాగేశ్వరరావు, కోటేశ్వరమ్మతోపాటు మరి కొందరు కళాకారులు, నూర్ భాషా సంఘ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. -
సంగీత కళాకారుడు ఆత్మహత్య..
సాక్షి, గుంటూరు: అనారోగ్యంతో బాధపడుతున్న సంగీత కళాకారుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరకు ఆత్మహత్యేశరణ్యమని భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలివి.. జిల్లాలోని అరండల్‌పేట శ్రీనగర్‌కు చెందిన సుదర్శనం జాన్సన్(63)కు సంగీత కళాకారుడిగా మంచి పేరుంది. ముప్పయేళ్లుగా సంగీత విభావరిలు నిర్వహిస్తున్న ఆయన అనేక మందికి సుపరిచితుడు. కొంతకాలంగాఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ మనోవేదనకు గురయ్యారు. కుటుంబ సభ్యులతో కూడా ఏమాత్రం మాట్లాడకుండా తనలో తానే బాధపడుతుండేవాడు. జాన్సన్ భార్య విజయలక్ష్మి సంగీతం టీచర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో జాన్సన్ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యలు వచ్చి పోలీసులకు సమాచారం అందిచండంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాన్సన్ సంగీత కళాకారుల అసోసియేషన్‌కు సంబంధించిన వారు చాలా మంది కీలక పదవుల్లో ఉన్నట్లు బంధువులు తెలిపారు. -
కడప గడపలో మురళీగానం
కడప కల్చరల్ : భారత దేశానికి గర్వకారణంగా నిలిచిన గంధర్వ గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళవారం తనువు చాలించారు. తన గంధర్వ గానాన్ని దివిలోని గంధర్వులకు నేర్పేందుకు ఆయన తరలి వెళ్లారని కడప నగరానికి చెందిన పలువురు పెద్దలు, సంగీతజ్ఞులు ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కడప నగరంలో రెండు రోజులు వరుసగా కచేరీలు చేసినపుడు తాము పాల్గొన్న జ్ఞాపకాలను తలచుకుంటున్నారు. మహా గాయకుడు మంగళంపల్లి కడప నగర పర్యటన గురించి పలువురు పెద్దలు చెప్పిన సమాచారం 'సాక్షి' పాఠకుల కోసం.. - మంగళంపల్లి బాలమురళీకృష్ణ 1982లో కడప నగరంలోని శ్రీరామకృష్ణ హైస్కూలు ఆవరణంలోగల వివేకానంద ఆడిటోరియంలో వరుసగా రెండు రోజులు కచేరీలు చేశారు. అప్పట్లో స్థానిక కవి, రిటైర్డ్ ఎండీఓ ఎన్సీ రామసుబ్బారెడ్డి నాగరాజుపేటలో త్యాగరాజ సంగీత నృత్య కళాశాల నిర్వహించేవారు. జిల్లా వాసులకు మంగళంపల్లి గానమాధుర్యాన్ని రుచి చూపి సంగీతం పట్ల ఎక్కువ మందికి మక్కువ కల్పించాలని రామసుబ్బారెడ్డి మంగళంపల్లిని కడప నగరానికి ఆహ్వానించారు. 1982 జూన్ 22న మంగళంపల్లి కడప నగరానికి వచ్చారు. వివేకానంద ఆడిటోరియంలో ఆహూతులైన ప్రేక్షకుల సమక్షంలో సంగీత కచేరీ చేశారు. తన గానమాధుర్యంతో నగర వాసులను ఓలలాడించారు. దీంతో స్థానిక బ్రాహ్మణ సంఘాలు మరోరోజు కచేరీ చేయాలని ఆయనను ఒత్తిడి చేశారు. అంగీకరించిన బాలమురళి 23వ తేది కూడా కచేరీ చేశారు. ఆడిటోరియం సరిపోక అప్పటికప్పుడు మరికొన్ని కుర్చీలు తెప్పించి ఆడిటోరియం బయట కూడా వేయించారు. కచేరీ రెండు గంటలపాటు కొనసాగింది. - సరస్వతిపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు కచేరీ సమయంలో బాలమురళి పక్కనే కూర్చొని సంగీతాన్ని ఆస్వాదించారు. ఎప్పుడూ ఎవరినీ పొగడని ఆయన వేదికపై బాలమురళి గాత్రాన్ని ఎంతో మెచ్చుకున్నారు. అదే రోజు బాలమురళి స్థానిక కవులు, రచయితలు, నగర ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. - ఆకాశవాణి కడప కేంద్రం అప్పటిస్టేషన్ డైరెక్టర్ పీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళంపల్లి కచేరీని రికార్డు చేసింది. నాటి రెండు రోజుల సభకు ఆకాశవాణికి చెందిన మడిపల్లి దక్షిణామూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంగీతజ్ఞుల నివాళి.. బాలమురళీకృష్ణ కడపలో చేసిన సంగీత కచేరీలకు హాజరైన సీనియర్ కవి ఎన్సీ రామసుబ్బారెడ్డి, ఆయన సహచరుడు, కవి సుబ్బరాయుడు, ప్రముఖులు డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి బాలమురళి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ గాయకులు వీఎస్ రామానుజచార్యులు, టీవీఎస్ ప్రకాశ్, యలమర్తి మధుసూదన, నేలబొట్ల చంద్రశేఖర్‌రావు, శ్రీవాణి అర్జున్‌లు మంగళంపల్లి మృతితో భారతీయ, శాస్త్రీయ సంగీత మేరువు కూలిపోయినట్లేనని నివాళులర్పించారు. కొండూరు పిచ్చమ్మ, వెంకట్రాజు స్మారక సంస్థ వ్యవస్థాపకులు కొండూరు జనార్దన్‌రాజు, వైవీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి, డాక్టర్ మూలమల్లికార్జునరెడ్డి, అంధుల పాఠశాల ఉపాధ్యాయుడు, కళాకారుడు సాంబశివుడు, బి.కోడూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్, ఇంకా పలువురు సంగీతాభిమానులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
సంగీత దర్శకుడికి గాయాలు, ఆస్పత్రిపాలు
బాలీవుడ్లో అద్భుత చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించిన సంగీత ద్వయం నదీమ్ - శ్రవణ్‌ల జోడీలోని శ్రవణ్ ప్రమాదానికి గురయ్యారు. ఢిల్లీ జైపూర్ హైవే పై ప్రయాణిస్తుండగా ఆయన వాహనం ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం శ్రవణ్, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 1979లో రిలీజ్ అయిన దంగల్ సినిమాతో సంగీత ప్రయాణం మొదలు పెట్టిన నదీమ్ శ్రవణ్‌లు 2005 వరకు కలిసి పనిచేశారు. ఆ తరువాత ఇద్దరు విడి విడిగా సంగీత దర్శకత్వం చేస్తున్నప్పటికీ భారీ విజయాలను మాత్రం నమోదు చేయలేకపోయారు. -
అంధత్వం నుంచి అమరత్వానికి..
- కళ్లు లేకున్నా .. కలకాలం నిలిచిపోయే సంగీతం అందించిన రవీంద్ర జైన్ - బాలీవుడ్ మెస్ట్రో.. ఆథ్యాత్మిక ఆల్బమ్స్‌కు కేరాఫ్‌గా ప్రపంచ ఖ్యాతి - మహాభారత్, రామాయణ్, అలీఫ్ లైలా తదితర సీరియళ్లకు ఆయన సంతీతమే ప్రాణం - కిడ్నీ సంబంధిత వ్యాధితో ముంబైలో కన్నుమూత.. సంగీత లోకం దిగ్భ్రాంతి.. దక్షిణభారతాన్ని మేల్కొల్పేది.. 'ఓం కౌసల్యా సుప్రజా రామా పూర్వా..' అంటూ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి ఆలపించిన వేంకటేశ్వర సుప్రభాతం. మరి ఉత్తరాదిని..? అంతకు ముందు ఏదో తెలియదుగానీ, 80వ దశకం తర్వాత మాత్రం ఉత్తర భారతం మేల్కొంటున్నది 'ఓం నమః శివాయ నమ: శివాయః హరహర భోలే..' అనే రవీంద్ర జైన్ సంగీత సృష్టితోనే! అది 1944, ఫిబ్రవరి 28.. అలీగఢ్ లో సంస్కృత పండితుడు, ఆయుర్వేద ఆచార్యుడిగా పేరుమోసిన ఇంద్రమణి జైన్ నివాసం. ఆయన భార్య కిరణ్ జైన్ మూడో సంతానానికి జన్మనిచ్చింది. మంత్రసాని పిల్లాడిని పరీక్షగా చూసింది. అన్నీ బాగున్నాయి. కళ్లు కూడా. కానీ చూపు లేదు. ఇంద్రమణి- కిరణ్ జైన్ లకు ఏడుగురు సంతానం వారిలో మూడోవాడు.. అంధుడు రవీంద్ర జైన్. అయితే చదువు నేర్పిన సంస్కారంతో ఆ కుటుంబం రవీంద్ర ను 'స్పెషల్' గా కాక సాధరణంగానే ట్రీట్ చేసేది. బ్లైండ్ స్కూలులో ప్రాథమిక విద్యసాగుతుండగానే.. రవీందర్ కు సంగీతం పట్ల ప్రేమ కలిగింది. ఇంట్లో నిత్యం జరిగే భజనలు వింటూ.. పాడటం నేర్చుకున్న రవీంద్ర.. చుట్టుపక్కల ఆలయాల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రత్యేక గీతాలు ఆలపించే స్థాయికి ఎదగాడు. ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు దిగ్గజాలైన జీఎల్ జైన్, జనార్థన్ శర్మ, పండిట్ నాథూరామ్ ల వద్ద శిక్షణ ఇప్పించారు. రవీంద్ర ప్రతిభను గుర్తించిన ప్రతిభూషణ్ జైన్ అనే ఆయన తన సినిమాకు పనిచేయమంటూ కొల్ కతా తీసుకెళ్లాడు. పదేళ్లతర్వాత.. అంటే 1972లో ముంబైలో అడుగుపెట్టాడు రవీంద్ర జైన్.. ఒక అంధుడు సంగీత దర్శకుడయ్యాడు అనే సంచలనం కంటే రవీంద్ర జైన్ అందించే ట్యూన్లే మరింత సంచలనాలు అయ్యేవి. చోర్ మచాచే షోర్ (1975), తీత్ గాతా చల్ (1975), చిత్ చోర్ (1976), అఖియో కే జరోఖోఃసే (1978) లాంటి చిత్రాలు అతడు వార్చిన సంగీతామృతంలో నాలుగు పలుకులు! సంగీతకారుడిగానే కాక పాటల రచయితగానూ విశేషంగా రాణించారాయన. అమితాబ్ బచ్చన్ కు తొలి మ్యూజికల్ హిట్ గా నిలిచిన 'సౌదాగర్' ఆయనదే. రాజ్ కపూర్ తో రవీంద్ర జైన్ ది హిట్ కాంబినేషన్. రామ్ తెరీ గంగా మైలి, దో జాసూస్ చిత్రాలతో ప్రారంభమైన వారి మైత్రి చాలాకాలం కొనసాగింది. హిందీతోపాటు ఇతర భాషల్లోనూ దాదాపు 200 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారాయన. తెలుగులో నందమూరి తారకరామారావు 1991లో రూపొందించిన 'బ్రహ్మర్శి విశ్వామిత్ర' చిత్రానికి సంగీతం అందించింది రవీంద్రే! అటు మలయాళం, హర్వాణి, పంజాబి, గుజరాతి, భోజ్ పురి, బెంగాలీ, ఒరియా, రాజస్థానీ భాషల్లోనూ పలు చిత్రాలకు పనిచేశారు. మలయాళ గాయకుడు కె.జె. యేసుదాసు రవీంద్రకు మంచి మిత్రుడు కూడా. యేసుదాసును బాలీవుడ్ కు పరిచయం చేసిందికూడా ఆయనే. ఓవైపు సినీ సంగీతమేకాక భక్తి పాటలనూ రూపొందిచే రవీంద్ర జైన్.. 1980లో ఆశా భోంస్లేతో కలిసి శివుణ్ని స్తుతిస్తూ ఓ ఆల్బం చేశారు. అందులోని 'ఓం నమః శివాయః ఓం నమః శివాయః' పాట దేశవ్యాప్తంగా పెనుసంచలనమైంది. ఉత్తరాదికి సుప్రభాతంలా మారిన ఆ పాట చాలా మంది ఫోన్లకు రింగ్ టోన్ కూడా. భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే అతి పెద్ద ఆథ్యాత్మిక వేడుకలపై రవీంద్రజైన్ ఆల్బమ్స్ రూపొందించారు. మహాభారతం సహా పలు ఆథ్యాత్మిక టీవీ సీరియళ్లకు నేపథ్య సంగీతం అందించింది కూడా రవీంద్రజైనే కావడం విశేషం. వీటిలో జై హనుమాన్, రామాయణం, శ్రీ కృష్ణ, అలీఫ్ లైలా, ఇతిహాస్ కి కహానియా, జై మహాలక్ష్మి, శ్రీ బ్రహ్మ విష్ణు మహేష్, సాయి బాబా , జై మా దుర్గా, దర్తీ కా వీర్ యోధ పృథ్వీరాజ్ చౌహాన్ తదితర సీరియళ్లు ఎంత ఆదరణ పొందాయో చెప్పనవసరం లేదు. ఈ ఏడాదే (2015లో) రవీంద్ర జైన్ కు భారతదేశ నాలుగో అత్యున్నత పౌరపురస్కారం పద్మశ్రీ లభించింది. రామ్ తెరి గంగా మైలి, చిత్ చోర్, అఖియోన్ కే.. , చిత్రాలకు గానూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. రెండు సార్లు బెస్ట్ లిరిసిస్ట్ గానూ ఫిలింఫేర్ లు సాధించారు. మూత్రనాళంలో ఇన్ ఫెక్షన్ రావడం, అది కిడ్నీల వ్యాధికి దారితీయడంతో అనారోగ్యానికి గురైన రవీద్రజైన్.. చాలా కాలంగా చికిత్స పొదతుతున్నారు. అలాంటి స్థితిలోనూ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాగపూర్ వెళ్లి అపస్మారక స్థితికి లోనయ్యారు. ఎయిర్ ఆంబులెన్స్ ద్వారా ఆయనను ముంబైలోని జేజే ఆసుపత్రికి చేర్చారు. శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ప్రతికూలతను జయించడం, అక్కడి నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవడం గురించి మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవలసింది ఆయన పేరే. అంధత్వంతో జన్మించి అటుపై దానిని జయించి సంగీత దర్శకుడిగా.. బాలీవుడ్ మెస్ట్రోగా కీర్తినందుకున్న రవీంద్ర జైన్ (71) ఇక లేరన్న వార్త సనీజగత్తును దిగ్భ్రాంతికి గురిచేసింది. భౌతికంగా లేకున్నా ఆయన అందించిన సంగీతం అజరామరం. -
అబ్రకదబ్ర...!
‘‘అబ్రకదబ్ర.. మాయూ లేదు.. మంత్రం లేదు.. హాంఫట్..’’ అనగానే చేతిలో ఉన్న పాలపిట్ట పూలగుత్తిలా.. ఆ తర్వాత కోడిగుడ్డులా మారిపోతుంది.. ఇలాంటి ఇంద్రజాల విన్యాసాలెన్నో మనం చూస్తూనే ఉంటాం.. అబ్బురపడి హర్షధ్వానాలు చేసే ఉంటాం.. మాయాలేదు.. మంత్రం లేదంటూ ఆ ఇంద్రజాలికులు చేసే విన్యాసం గుట్టు విప్పినప్పుడు ఓ ఇంతేనా అని నిట్టూర్చే ఉంటాం. తమ మ్యాజిక్‌లతో ప్రజలను మెప్పిస్తూ మూఢనమ్మకాల గుట్టు విప్పుతూ ప్రజలను, సమాజాన్ని చైతన్య పరిచే ఇంద్రజాలికులు నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నారు.. పశ్చిమబెగాల్కు చెందిన ప్రఖ్యాత ఇంద్రజాలికులు పీసీ సర్కార్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జరిగే ప్రపంచ ఇంద్రజాల దినోత్సవంపై ప్రత్యేక కథనం.. - ఇంద్రియూలను మాయచేసే ఇంద్రజాలం - మూఢ నమ్మకాలపై ప్రజలను చైతన్యపరుస్తున్న మెజీషియన్లు - నేడు ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం సత్తుపల్లి టౌన్ : మ్యాజిక్ అంటే ఇంద్రజాలం. మానవ ఇంద్రియాలను(చెవి, ముక్కు, కన్ను, చర్మం, నాలుక) పక్కదోవ పట్టించేదే ఇంద్రజాలం. వీధుల్లో పొట్టకూటికోసం చేసే పలు మాయలను గారడీలుగా చెప్పుకుంటాం.. కాషాయ వస్త్రాలు ధరించిన కొందరు ప్రజలను మభ్యపెట్టేందుకు సృష్టించే పలు రకాల వస్తువులను చూసి వారి మహిమగా భావిస్తారు.. ఈ విషయూలపై ప్రజలను చైతన్య పరిచేందుకు వీటిని ఒక వేదికపై ప్రదర్శిస్తే ఇంద్రజాలం అంటారు. చేతబడులు, బాణామతి, దయ్యాలు, భూతాలు వంటివి ఉండవనే ఈ ఇంద్రజాల ప్రదర్శకులు వారి ప్రదర్శనల ద్వారా నిరూపిస్తారు. వీరు ప్రజలను చైతన్య పరుస్తూనే పలు ప్రభుత్వ పథకాలకు ప్రచారానికి పని చేస్తుంటారు. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా.. : ప్రేక్షకులను మైమరిపిస్తూ.. మాయాలేదు.. మంత్రం లేదంటూనే గాలిలోనే పూలు పూయించటం ఇంద్రజాలికులకే సొంతం. సాధ్యం కానివాటిని సుసాధ్యం చేస్తూ అబ్బుర పరిచేదే ఇంద్రజాల ప్రదర్శనలు. ఇవి నేటి యాంత్రిక జీవనంలో మనస్సుకు ఉత్తేజాన్ని.. ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఈ స్పీడ్ యుగంలో ఎన్నో ప్రాచీన కలలు మరుగున పడుతున్నాయి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికి మూఢవిశ్వాసాలలో కొందరు కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. గగుర్పొడిచే విన్యాసాలు : ఇంద్రజాలికులు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ప్రేక్షకులు చూస్తుండగానే ఖాళీ చేతుల్లో నుంచి పావురాలు, గొడుగులు సృష్టించటం.. మనిషిమెడలో నుంచి కత్తి గుచ్చటం.. గాలిలోనే టేబుల్‌ను నిలబెట్టడం.. తలపై మంటవెలిగించి టీ తయారు చేయటం.. వంటి ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేస్తూ వాటి రహస్యాలను విప్పి చెపుతున్నారు. మనిషిని రెండు ముక్కలు చేయించటం.. ఖాళీ టోపీలో నుంచి కోడిపిల్లలను ఇలా రకరకాల ఇంద్రజాల ప్రదర్శనలతో మెప్పిస్తున్నారు. కానీ తమ శ్రమ, కష్టాలు, ఇబ్బందులు పాలకులకు పట్టడం లేదని ఇంద్రజాలికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, ఇతర ప్రచార కార్యక్రమాలలో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. చైతన్యం తెచ్చేదే ఇంద్రజాలం : ఇప్పటి వరకు 1500లకు పైగా ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చా. ఈ ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం. మూఢ విశ్వాసాలను పారద్రోలేందుకు కృషి చేస్తున్నాం. నేటి యాంత్రిక జీవ నంలో ఒత్తిడి నుంచి బయటపడటానికి, మానసిక ఉల్లాసానికి మా ప్రదర్శనలు దోహదపడుతున్నాయి. - జుజ్జూరి వెంకటేశ్వర్లు, మెజీషియన్, సత్తుపల్లి ప్రోత్సహించాలి : నేటి సాంకేతిక సమాజంలో విద్యావంతులు కూడా మూఢ నమ్మకాలు నమ్ముతున్నారు. వీరిలో మార్పు తెచ్చేందుకు ఇంద్రజాలం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. సమాజానికి ఉపయోగపడే ఇంద్రజాల 2విద్యను అందరు ప్రోత్సహించాలి. ఇంద్రజాలికులను ప్రభుత్వం గుర్తించాలి. - జె.సాయి, సత్తుపల్లి -
అబ్రకదబ్ర మాయూ లేదు.. మర్మం లేదు..
నేడు వరల్డ్ మెజీషియన్ డే ఇంద్రజాలం.. ఆనందం, ఉత్కంఠను కలిగిస్తోంది.. కార్పొరేట్ జీవితంలో ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు.. మనసును రీచార్జి చేసేందుకు మేజిక్ దోహదపడుతుంది. మాయలోళ్లు (మెజీషియన్) చేసే విన్యాసాలు అబ్బురపరచడంతో విశ్వవాప్తంగా ఈ కళ పేర్గాంచింది. ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన ఇంద్రజాలం రానురానూ చిన్నచూపునకు గురవుతోంది. ఉత్సవాలు, వివాహ, పుట్టినరోజు వేడుకలు, రాజకీయ నాయకుల సభావేదికలపై ఆహుతులను ఉత్తేజపరిచేందుకు ఈరోజుల్లో ఎక్కువుగా మేజిక్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల పలువురు మెజీషియన్లు ఇతర వృత్తులవైపు చూస్తున్నారు. గతంలో జిల్లాలో 100 మందికిపైగా ఉన్న ఇంద్రజాలికులు ప్రస్తుతం 10 మంది మాత్రమే ఉండటం ఇందుకు నిదర్శనం. ఫిబ్రవరి 23వ తేదీన ప్రపంచ ఇంద్ర జాలికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. - ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) మేజిక్‌లు 23 రకాలు ఇంద్రజాల కళలో 23 రకాలు ఉన్నారుు. ఒక్కో కళాకారుడూ కొన్ని రకాలను మాత్రమే ప్రదర్శించడంలో నిష్ణాతులవుతుంటారు. అన్ని రకాల కళలను ఒకే వ్యక్తి చేసే అవకాశం ఉండదని మెజీషియన్లు అంటున్నారు. సుమారు 10 రకాల మేజిక్‌లు మాత్రమే తరచుగా చేస్తుంటారు. వాటిలో మెకానికల్ రకం మొదటిది దీనిలో కొన్ని రకాల వస్తువులను ఉపయోగించి ఇంద్రజాలికులు మేజిక్ చేస్తారు. హస్త లాఘవం మరో రకం. వస్తువులను చేతిలోనే దాచి, గాలిలో నుంచి తీసినట్టుగా చూపించడం దీని ప్రత్యేకత. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతూ.. ఇల్యూయన్ మరో రకం. ఇది ఆహుతులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతోంది. మనిషి లేదా జంతువును ముక్కలుగా చేయడం, అక్కడి నుంచి మాయం చేయడం. మరలా యథావిధిగా అమర్చడం దీని ప్రత్యేకత. ఇటువంటి మేజిక్‌లను మనం ఎక్కువుగా ఎగ్జిబిషన్లలో చూస్తుంటాం. వెంట్రిలాక్విజం రకానికి ప్రత్యేక స్థానం ఉంది. బొమ్మతో మాట్లాడించడం ఇందులో మనకు కనిపిస్తోంది. సైంటిఫిక్ మేజిక్ మరో రకం. లెక్కలు, సైన్స్‌పై మేజిక్‌లు చేయడం ఈ రకంలోకి వస్తుంది. ఇటువంటి రకాలు ఎక్కువుగా ప్రాచుర్యంలో ఉన్నారుు. కొత్తవారు రావడం లేదు మెజీషియన్ వృత్తిలోకి కొత్తగా ఎవరూ రావడం లేదని కళాకారులు అంటున్నారు. అభిరుచి మేరకు నేర్చుకుని వారి ఖాళీ సమాయాల్లో స్నేహితులు, కుటుంబసభ్యులను మెప్పించడానికే ఈ కళను నేర్చుకున్న వారు తప్ప ఇదే జీవనాధారంగా గడిపేవారు జిల్లాలో ఒకరిద్దరూ తప్ప ఎవరూ లేరనే చెప్పాలి. 14 ఏళ్ల వయసు నుంచీ.. ఏలూరుకు చెందిన సాయిరామ్ ఈవెంట్స్ అధినేత కొవ్వలి శ్రీనివాస్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఇంద్రజాలికుడిగా నిలిచారు.1964లో కొవ్వలి సేతు మాధవరావు, లక్ష్మి నరసమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించిన శ్రీనివాస్ చిన్నతనం నుంచి ఇంద్రజాలంపై ఆసక్తి పెంచుకున్నారు. విఠలాచార్య చిత్రాలు చూసి మాయలు, మంత్రాలకు ఆకర్షితులయ్యూరు. 14 ఏళ్ల వయసులో ఏలూరులో ఆచార్య జి.డీలానంద్ అనే సినీ ఆర్చురీ డెరైక్టర్ (లవకుశ చిత్రంలో ధనుర్ విద్య) వద్ద శిష్యునిగా చేరారు. 1979 నుంచి మెజీషియన్‌గా షోలు చేస్తున్నారు. దీనినే జీవనాధారంగా భావించి ముందుకు సాగుతున్నారు. ఆదరణ తగ్గలేదు దేశంలోని పలు ప్రాంతాల్లో వేలాది కార్యక్రమాలను నిర్వహించి అభిమానులను సొంతం చేసుకున్నాను. నా వద్ద సుమారు 30 మంది ఇంద్రజాల విద్యను నేర్చుకుని పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అభిరుచి ఉన్నవారే. ఇంద్రజాల కళకు ఆదరణ తగ్గలేదు. గతంలో కంటే ఎక్కువ షోలు చేస్తున్నాం. - కొవ్వలి శ్రీనివాస్, సీనియర్ మెజీషియన్ -
మ్యాజిక్‌తో దొంగ బాబాల చలామణి
జనవిజ్ఞాన వేదిక అంతర్జాతీయ స్థాయి మెజీషియన్, ప్రొఫెసర్ రమేష్ సలసల కాగే నూనెలో చేతితో బజ్జీలు తీసిన మహిళలు ఎర్రటి నిప్పులపై నడక జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రదర్శనలు నాచినపల్లి(దుగ్గొండి) : భక్తులను నమ్మించి మోసం చేసే దొంగ బాబాలవి మహిమలు కావని, అవి కేవలం ఇంద్రజాల ప్రదర్శన మాత్రమేనని జనవిజ్ఞాన వేదిక అంతర్జాతీయ స్థాయి మెజీషియన్, ప్రొఫెసర్ రమేష్ అన్నారు. మండలంలోని నాచినపల్లి గ్రామం లో ఆదర్శ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జనవిజ్ఞాన వేదిక వారి సౌజన్యంతో ఆదివారం రాత్రి మూఢ నమ్మకాలపై చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన జన విజ్ఞాన వేదిక సభ్యులు ప్రసంగించడంతోపాటు ఇంద్రజాల ప్రదర్శనలు చేశారు. ఎర్రటి నిప్పులపై గ్రామస్తులను నడిపించారు. సలసల కాగే నూనెలోని బజ్జీలను మహిళల చేత చేతులు పెట్టి తీయించారు. ఎందుకు కాలదో స్వయంగా సైన్స్‌పరంగా వివరించారు. దయ్యాలు, భూతాలు, అర చేతిలో విభూతి సృష్టించడంలాంటి అనేక ప్రదర్శనలు చేసి చూపించారు. వ్యాఖ్యాతగా వనప్రేమి అవార్డు గ్ర హీత రాయబోసు వ్యవహరించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, రాములు, జగదీష్‌బాబు, దయానంద్, ఎర్రన్న, ఆదర్శ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు బొమ్మినేని నర్సింహారెడ్డి, మురళి, దేవేందర్, ప్రవీణ్, ప్రభాకర్, తిరుపతి, లక్ష్మీనారాయణ, జనార్దన్‌రెడ్డి, పద్మారావు, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వయొలిన్ విద్వాంసులు ఇవటూరి కన్నుమూత
విశాఖ : ప్రముఖ వయొలిన్ విద్వాంసులు ఇవటూరి విజయేశ్వరరావు (76) కన్నుమూశారు. విశాఖలోని ఆయన స్వగృహంలో శనివారం ఉదయం ఇవటూరి స్వర్గస్తులైనారు. ఇవటూరి విజయేశ్వరరావు 1938, మే 29న విశాఖలో జన్మించారు. చూపు లేకపోయినా, ఎందరికో సంగీత పాఠాలు నేర్పి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నంలో సంగీత విద్వాంసులను తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇవటూరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2011లో ప్రతిభా రాజీవ్ పురస్కారంతో సన్మానించింది. ప్రముఖ వయొలిన్ విద్వాంసులు స్వర్గీయ ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రియశిష్యుల్లో ఇవటూరి విజయేశ్వరరావు ఒకరు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. -
జగమంతా నిండాలి జానపదం
- సంగీత విద్వాంసుడు హైటెక్ తరంలోని యువతను జానపదం వైపు మళ్లించాలనేదే తన ధ్యేయమని చెబుతున్నారు సంగీత విద్వాంసుడు, ఆమెరికాలోని ఫార్మి(ఫోక్ ఆర్ట్స్ రీసెర్చ్ అండ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్) వ్యవస్థాపకుడు మానాప్రగడ శ్రీసాయి సాయిచక్. జానపద గీతోత్సవంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన సాయిచక్ ‘సిటీ ప్లస్’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నాన్న నుంచి కళలు.. మా నాన్న మానాప్రగడ నరసింహమూర్తి. జానపద కళాభిమాని, కళాకారుడు. ఆయన నుంచే నాకు కళలు అబ్బాయి. మూడేళ్ల వయసు నుంచే సంగీతం నేర్చుకున్నాను. హార్మోనియంతో మొదలుపెట్టి కీబోర్డు వాయించడం వరకు చిన్నప్పుడే నేర్చుకున్నాను. పియానోపై మక్కువతో వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా. రెండింటిలోనూ ప్రావీణ్యం సాధించడంతో అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. పియానో వాయించడంలో నాకంటూ సొంత స్టైల్ ఉండాలని భావించా. ‘జల్రా’ పేరిట పియానో స్టైల్ సృష్టించా. ‘వందేమాతరం’తో గిన్నిస్ రికార్డు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో 2010 మే 16న వందేమాతరం గీతాన్ని 265 భాషల్లో పాడినందుకు తొలి గిన్నిస్ రికార్డు సాధించా. ప్రీమౌంట్ సిటీలో 2010 ఆగస్టు 15న ఒకే బృందంతో 277 భాషల్లో పాడి రెండోసారి గిన్నిస్ రికార్డు సాధించా. ఆ తర్వాత.. 2011, నవంబర్ 18న అత్యంత వేగంగా పియానో వాయించే కళాకారుడిగా మూడో గిన్నిస్ రికార్డు సాధించా. అమెరికా ప్రభుత్వం ఔట్‌స్టాండింగ్ రీసెర్చర్‌గా గుర్తింపునిచ్చింది. అది కమిషనర్ స్థాయి హోదా. స్వరాలు ఒకటే.. బాణీలే వేరు భారతీయ, అమెరికన్ సంగీతాల్లో స్వరాలు ఒకటే.. బాణీలు వేరు. భారత్‌లో గళానికి, రచనకు ప్రాధాన్యమిస్తారు. అమెరికాలో సంగీతానికి ప్రాధాన్యమిస్తారు. మా నాన్న జానపదాలపై పరిశోధన చేశారు. ఆయన శ్రమ వృథా కాకూడదు. ఆయన కృషిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఏటా భారత్ వచ్చి జానపద గీతోత్సవం ఏర్పాటు చేస్తున్నా. పదేళ్లుగా 30 మంది విశ్రాంత జానపద కళాకారులకు ఆర్థిక సహాయం చేస్తున్నా. - కోన సుధాకర్‌రెడ్డి -
దేవుడి ముందు బిక్షగాడిలా వేడుకుంటాను...
‘‘భారతీయుడిగా పుట్టడమే ఓ గొప్ప అదృష్టం. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానాన్ని పొందడం అంటే ఇంకా గొప్ప విషయం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా గురువులకు ధన్యవాదాలు’’ అంటూ ఉద్వేగంగా తన హృదయాన్ని ఆవిష్కరించారు ఎ.ఆర్. రహమాన్. సంగీత రంగానికి రెహమాన్ చేస్తున్న సేవలకుగాను ప్రపంచవ్యాప్తంగా ఆయన 25వ లెజెండ్‌గా గుర్తింపు పొందారు. గత నెల ఈ అవార్డుని స్వీకరిస్తున్న సమయంలో రెహమాన్ చెప్పిన మాటలివి. నేడు ఈ సంగీత సంచలనం పుట్టినరోజు. ఈ సందర్భంగా రెహమాన్ మనోభావాలు ఈ విధంగా... మ్యూజిక్‌ని మన దేశంలో సీరియస్‌గా తీసుకోవాలి. దీన్ని ఒక వృత్తిగా తీసుకోవడానికి వెనకాడుతున్నారు. తమ అబ్బాయి లేక అమ్మాయి డాక్టరో, ఇంజినీరో అవ్వాలని తల్లిదండ్రులు అనుకుంటారు. అంతేకానీ ఓ మంచి మ్యుజీషియన్ అవ్వాలని కోరుకోరు. కానీ, నా చిన్నప్పుడు మా ఇంట్లో పరిస్థితి వేరు. నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అవ్వాలనుకునేవాణ్ణి. అయితే, మా అమ్మగారికి మాత్రం నన్ను మ్యుజీషియన్‌గా చూడాలని ఉండేది. మన దేశంలో మ్యూజిక్ ప్రపంచంలోకి వచ్చేవారి సంఖ్య తక్కువే. అదే విదేశాల్లో అనుకోండి.. మా అబ్బాయి పాప్ ఆర్టిస్ట్ అనో మా అమ్మాయి రాక్‌స్టార్ అనో చెప్పుకోవడానికి గర్వపడతారు. మనం దేశంలో కూడా ఆ మార్పు వస్తుందని ఆశిస్తున్నా. నాకు సంగీతం అంటే ప్రాణం. అందుకని నా పిల్లలు ఈ రంగంలోకి వస్తానంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది? అయితే, పిల్లలను ఏ విషయంలోనూ ఒత్తిడి చేయకూడదు. వాళ్ల అభిరుచులను గౌరవించాలి. అందుకే, నా పిల్లలు ఏం చేస్తానంటే ఓ తండ్రిగా దాన్ని ప్రోత్సహిస్తా. మా అమ్మాయి ఖతీజా బాగా చదువుతోంది. ప్లస్ టూలో 94 పర్సంట్ సాధించింది. నేనొకప్పుడు సాదా సీదా వ్యక్తిని. ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి మా అమ్మగారు కారణం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన సంగీత పరికరాలను అద్దెకి ఇచ్చేది మా అమ్మగారు. ఆ డబ్బుతో మమ్మల్ని పోషించేది. వాటిని అమ్మేస్తే ఎక్కువ డబ్బులొస్తాయని, ఆ డబ్బుని వడ్డీకి ఇస్తే కుటుంబం గడిచిపోతుందని కొంతమంది మా అమ్మగారికి సలహా ఇచ్చారు. కానీ, ఆమె అందుకు ఒప్పుకోలేదు. ‘నాకో కొడుకు ఉన్నాడు. తను చూసుకుంటాడు’ అని ధీమాగా చెప్పేది. నాకు సంగీతం, దేవుడు తప్ప మరొకటి తెలియదు. నేనీ స్థాయిలో ఉండటానికి కారణం ఆ దేవుడే. అందుకే, స్టార్డమ్ నాలో ఏ మార్పూ తీసుకు రాలేదు. డబ్బులు వస్తాయి.. పోతాయి. ఫేమ్ వస్తుంది.. పోతుంది. అందుకే వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. నా దృష్టిలో ఎవరి స్థాయిలో వాళ్లు సెలబ్రిటీయే. సక్సెస్ అవ్వడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు. వినయంగా ఉండటం కూడా అవసరం. విజయాన్ని, పేరుని నెత్తికి ఎక్కించుకుంటే ప్రమాదం. ఆ ప్రమాదం దరిదాపుల్లోకి కూడా నేను వెళ్లను. ఈ సందర్భంగా ఓ ఉదాహరణ చెబుతా. మనం కనక హైవేలో కారుని మితిమీరిన వేగంతో నడిపాం అనుకోండి.. అదుపు తప్పుతాం. జీవితం కూడా అంతే. డబ్బు, పేరుని నెత్తికెక్కించుకోకుండా అదుపులో పెట్టుకోవాలి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నేను సక్సెస్‌ఫుల్‌గా ఉండటానికి ఓ కారణం నా భార్య. మా పెళ్లికి ముందు నేను తనతో మనసు విప్పి కొన్ని విషయాలు చెప్పాను. ‘పెళ్లయిన తర్వాత మనిద్దరం ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నప్పుడు, ఎవరైనా అర్జంటుగా పాట తయారు చేసి ఇవ్వమని అడగొచ్చు. అప్పుడు మన ప్లాన్‌ని మార్చుకోవాల్సి వస్తుంది’ అన్నాను. నా జీవితం ఇలా ఉంటుంది అని పెళ్లికి ముందే తనకు చెప్పడంవల్ల ఈ రోజు మేమిద్దరం కలిసి ఉన్నాం. లేకపోతే ఎప్పుడో విడిపోయేవాళ్లం. నేనో పాట తయారు చేయడం మొదలుపెట్టిన ప్రతిసారీ... ఇక అయిపోయాం అనిపిస్తుంది. దేవుడి ముందు బిక్షగాడిలా గిన్నె పట్టుకుని, ఆ గిన్నెలో ‘సరైన ఆలోచనలు నింపు’ అని వేడుకుంటాను. ఇలా ప్రతి పాటకూ ఆ దేవుడి సహాయం తీసుకుంటాను. ఎప్పటికప్పుడు ఆ భగవంతుడు నా మీద చాలా దయ చూపిస్తున్నాడు. అందుకు ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను. -
రిలేషణం: భానులో మంచి మ్యుజీషియన్ ఉన్నాడు!
భానుచందర్ అంటే ఒక జనరేషన్‌ని ఉర్రూతలూగించిన యాక్షన్ హీరో. ఓ పక్క టై, మెరుపుదాడిలాంటి యాక్షన్ ఫిలిమ్స్ చేసినా కూడా... తరంగిణి, నిరీక్షణ, సూత్రధారులు, మంచి మనసులులాంటి చిత్రాలతో తనలోని వెర్సటాలిటీని ఆవిష్కరించుకున్నారు. ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టుగా బిజీబిజీగా ఉన్న భానుచందర్ గురించి ఆయన అన్నయ్య మూర్తి చందర్ చెబుతోన్న విశేషాలివి! ‘‘మా నాన్నగారు మాస్టర్ వేణు ఫేమస్ మ్యూజిక్ డెరైక్టర్. ఆయనకు మేమిద్దరమే కొడుకులం. భానుకన్నా నేను రెండేళ్లు పెద్ద. వయసు గ్యాప్ పెద్దగా లేకపోవడం వల్లనేమో, ఇద్దరం బ్రదర్స్‌గా కన్నా క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లం. బాగా తిట్టుకుని, కొట్టుకునేవాళ్లం. నాకు పంతమెక్కువ. రెండు, మూడు రోజులు మాట్లాడకపోతే, వాడే వచ్చి బతిమాలుకునేవాడు. ఇద్దరిదీ ఒకటే మంచం. స్కూలు ఫైనల్ వరకూ ఒకే కలర్ డ్రెస్ కూడా. మా ఇద్దర్నీ రామలక్ష్మణులనేవారు. సినిమాలకు, షికార్లకు కలిసి వెళ్లాల్సిందే. ఎక్కువ ఇంగ్లిష్ సినిమాలకు వెళ్తుండేవాళ్లం. క్రికెట్ కూడా ఆడేవాళ్లం. ఇద్దరికీ మ్యూజిక్ అంటే ఇంట్రస్ట్. వాడు గిటార్ నేర్చుకుంటే, నేను పియానో ట్రై చేసేవాణ్ణి. నాన్నగారిలాగా వాడూ మ్యూజిక్ డెరైక్టర్ కావాలని అమ్మ ఆకాంక్ష. నన్నేమో డాక్టర్ని చేయాలని కోరిక. రెండూ నెరవేరలేదనుకోండి. సెప్టెంబర్ 8, ఫన్డే రిలేషణంలో... సినీనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం సోదరుడు సీతారామారావుగారికి కేవలం ఇద్దరు ఆడపిల్లలు అని పొరపాటుగా ప్రచురితమైనది. వాస్తవంగా ఆయనకు ముగ్గురు పిల్లలు. ఒక మగపిల్లాడు, ఇద్దరు ఆడపిల్లలు. కుమారుడు శేషగిరిబాబు ఒక కంపెనీ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. పొరపాటుకు చింతిస్తున్నాం. నౌషాద్‌గారి దగ్గర సంగీత శిక్షణ కోసమని భాను కొన్నాళ్లు ముంబై వెళ్లాడు. ఆ టైమ్‌లో చెడు స్నేహాల వల్ల డ్రగ్స్‌కి బానిసయ్యాడు. నేను వాణ్ణి బలవంతంగా మద్రాసు తీసుకొచ్చి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను. కరాటే నేర్చుకున్నాక వాడి లైఫ్ స్టయిల్ మారిపోయింది. అప్పట్నుంచీ కరెక్ట్ రూట్లోకి వచ్చేశాడు. సినిమా ఆర్టిస్టు అవుతానంటే వద్దని నేను నిరాశపరిచేవాణ్ణి. కానీ భాను మొండివాడు. అనుకున్నది సాధించాడు. తను హీరో కావడం నాకు సర్ప్రైజ్. ఎందుకంటే చిన్నప్పుడు తనలో హీరో ఫీచర్స్ ఉండేవి కాదు. కష్టపడి, ఇష్టపడి తనను తాను డెవలప్ చేసుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. నాలో చిన్నప్పటినుంచీ స్పిర్చువల్ థాట్స్ ఎక్కువ. అందుకే పెళ్లి చేసుకోలేదు. నా గురించి భాను కూడా కొన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు. చివరకు అమ్మ ఒత్తిడి మేరకు ఆలస్యంగానైనా పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఇద్దరు కొడుకులు. వాళ్లని చూస్తుంటే అచ్చంగా మా బాల్యం గుర్తొస్తుంది. ఒకడేమో హీరో అయ్యాడు. ఇంకొకడు మెడిసిన్ చదువుతున్నాడు. మా అమ్మ కోరిక అలా నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. మా ఇద్దరికీ పోలికలున్నా, మనస్తత్వాలు పూర్తి విరుద్ధం. నేను ఇంట్రావర్ట్‌ని. వాడు ఎక్కడికైనా దూసుకుపోగలడు. నాకు మెడికల్ సీటు రాక బి.ఏ.లో చేరాను. ఆ తర్వాత మ్యూజిక్ డిపార్ట్మెంట్లో స్థిరపడిపోయాను. నేను కొన్నాళ్లు మ్యూజిక్ టీచర్‌గా ఓ స్కూల్లో పనిచేశాను. అలాగే సంగీత దర్శకుడు రాజ్ దగ్గర పదేళ్లు ఉన్నాను. నాకన్నా భానులోనే ఎక్కువ మ్యూజిక్ టాలెంట్ ఉంది. తను ఇప్పుడు తలుచుకున్నా మంచి మ్యూజిక్ డెరైక్టర్ కాగలడు. తన సినిమాల్లో నాకు ‘నిరీక్షణ’ అంటే చాలా ఇష్టం. తనలో చాలా పొటెన్షియాలిటీ ఉంది. దాన్నెవరూ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. భాను కేరెక్టర్ యాక్టర్‌గా చేయడం నాకిష్టం లేదు. చేస్తే హీరోగానే చేయాలి. తనకిలాంటి చిన్నా చితకా పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. అమితాబ్ బచ్చన్ 70 ఏళ్లు వచ్చినా కూడా శక్తిమంతమైన పాత్రలు చేస్తున్నాడు. ఈ విషయమే ఎన్నిసార్లు చెప్పినా భాను పట్టించుకోడు. ఖాళీగా కూర్చోలేను కదా అంటుంటాడు. - పులగం చిన్నారాయణ -
‘గూగుల్’ సుబ్బలక్ష్మి
న్యూఢిల్లీ: ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి గూగుల్ సంస్థ అరుదైన గౌరవాన్ని చ్చింది. ఆమె 97వ జయంతి సందర్భంగా సోమవారం గూగుల్ ‘డూడుల్(గూగుల్ వెబ్సైట్ హోంపేజీ లో వచ్చే లోగో)’గా సుబ్బలక్ష్మి చిత్రాన్ని పెట్టింది. నుదుటిపై ఎరుపు, నలుపు బొట్టుతో.. చేతిలో తంబురా పట్టుకొని కూర్చున్న సుబ్బలక్ష్మి, పక్కన తబలా, మృదంగం వంటి వాయిద్యాలను చిత్రంలో ఉంచారు. సుబ్బలక్ష్మి 1916 సెప్టెంబర్ 16న తమిళనాడులోని మదురైలో జన్మించారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ సహా ఎన్నో ఉన్నత సత్కారాలను సుబ్బలక్ష్మి పొందారు. 1996లో ప్రభుత్వం ఆమెను ‘భారత రత్న’తో గౌరవించింది.