అబ్రకదబ్ర...! | today World magic Day | Sakshi
Sakshi News home page

అబ్రకదబ్ర...!

Published Mon, Feb 23 2015 5:56 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

today World magic Day

‘‘అబ్రకదబ్ర.. మాయూ లేదు.. మంత్రం లేదు.. హాంఫట్..’’ అనగానే చేతిలో ఉన్న పాలపిట్ట పూలగుత్తిలా.. ఆ తర్వాత కోడిగుడ్డులా మారిపోతుంది.. ఇలాంటి ఇంద్రజాల విన్యాసాలెన్నో మనం చూస్తూనే ఉంటాం.. అబ్బురపడి హర్షధ్వానాలు చేసే ఉంటాం.. మాయాలేదు.. మంత్రం లేదంటూ ఆ ఇంద్రజాలికులు చేసే విన్యాసం గుట్టు విప్పినప్పుడు ఓ ఇంతేనా అని నిట్టూర్చే ఉంటాం. 
తమ మ్యాజిక్‌లతో ప్రజలను మెప్పిస్తూ  మూఢనమ్మకాల గుట్టు విప్పుతూ ప్రజలను, సమాజాన్ని చైతన్య పరిచే ఇంద్రజాలికులు నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నారు.. పశ్చిమబెగాల్‌కు చెందిన ప్రఖ్యాత ఇంద్రజాలికులు  పీసీ సర్కార్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జరిగే ప్రపంచ ఇంద్రజాల దినోత్సవంపై ప్రత్యేక కథనం..

 
- ఇంద్రియూలను మాయచేసే ఇంద్రజాలం
- మూఢ నమ్మకాలపై ప్రజలను చైతన్యపరుస్తున్న మెజీషియన్లు
- నేడు ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం
సత్తుపల్లి టౌన్ : మ్యాజిక్ అంటే ఇంద్రజాలం. మానవ ఇంద్రియాలను(చెవి, ముక్కు, కన్ను, చర్మం, నాలుక) పక్కదోవ పట్టించేదే ఇంద్రజాలం. వీధుల్లో పొట్టకూటికోసం చేసే పలు మాయలను గారడీలుగా చెప్పుకుంటాం.. కాషాయ వస్త్రాలు ధరించిన కొందరు ప్రజలను మభ్యపెట్టేందుకు సృష్టించే పలు రకాల వస్తువులను చూసి వారి మహిమగా భావిస్తారు.. ఈ విషయూలపై ప్రజలను చైతన్య పరిచేందుకు వీటిని ఒక వేదికపై ప్రదర్శిస్తే ఇంద్రజాలం అంటారు. చేతబడులు, బాణామతి, దయ్యాలు, భూతాలు వంటివి ఉండవనే ఈ ఇంద్రజాల ప్రదర్శకులు వారి ప్రదర్శనల ద్వారా నిరూపిస్తారు. వీరు ప్రజలను చైతన్య పరుస్తూనే పలు ప్రభుత్వ పథకాలకు ప్రచారానికి పని చేస్తుంటారు.  
 ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా.. :
ప్రేక్షకులను మైమరిపిస్తూ.. మాయాలేదు.. మంత్రం లేదంటూనే గాలిలోనే పూలు పూయించటం ఇంద్రజాలికులకే సొంతం. సాధ్యం కానివాటిని సుసాధ్యం చేస్తూ అబ్బుర పరిచేదే ఇంద్రజాల ప్రదర్శనలు. ఇవి నేటి యాంత్రిక జీవనంలో మనస్సుకు ఉత్తేజాన్ని.. ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఈ స్పీడ్ యుగంలో ఎన్నో ప్రాచీన కలలు మరుగున పడుతున్నాయి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికి మూఢవిశ్వాసాలలో కొందరు కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు.
 
గగుర్పొడిచే విన్యాసాలు :
ఇంద్రజాలికులు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ప్రేక్షకులు చూస్తుండగానే ఖాళీ చేతుల్లో నుంచి పావురాలు, గొడుగులు సృష్టించటం.. మనిషిమెడలో నుంచి కత్తి గుచ్చటం.. గాలిలోనే టేబుల్‌ను నిలబెట్టడం.. తలపై మంటవెలిగించి టీ తయారు చేయటం.. వంటి ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేస్తూ వాటి రహస్యాలను విప్పి చెపుతున్నారు. మనిషిని రెండు ముక్కలు చేయించటం.. ఖాళీ టోపీలో నుంచి కోడిపిల్లలను ఇలా రకరకాల ఇంద్రజాల ప్రదర్శనలతో మెప్పిస్తున్నారు. కానీ తమ శ్రమ, కష్టాలు, ఇబ్బందులు పాలకులకు పట్టడం లేదని ఇంద్రజాలికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, ఇతర ప్రచార కార్యక్రమాలలో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
 
చైతన్యం తెచ్చేదే ఇంద్రజాలం :
ఇప్పటి వరకు 1500లకు పైగా ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చా. ఈ ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం. మూఢ విశ్వాసాలను పారద్రోలేందుకు కృషి చేస్తున్నాం. నేటి యాంత్రిక జీవ నంలో ఒత్తిడి నుంచి బయటపడటానికి, మానసిక ఉల్లాసానికి మా ప్రదర్శనలు దోహదపడుతున్నాయి.
- జుజ్జూరి వెంకటేశ్వర్లు, మెజీషియన్, సత్తుపల్లి
 
ప్రోత్సహించాలి :
నేటి సాంకేతిక సమాజంలో విద్యావంతులు కూడా మూఢ నమ్మకాలు నమ్ముతున్నారు. వీరిలో మార్పు తెచ్చేందుకు ఇంద్రజాలం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. సమాజానికి ఉపయోగపడే ఇంద్రజాల 2విద్యను అందరు ప్రోత్సహించాలి. ఇంద్రజాలికులను ప్రభుత్వం గుర్తించాలి.
- జె.సాయి, సత్తుపల్లి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement