ఆధ్యాత్మికథ
ఉత్తర భారతదేశంలోని సంగీత సాధకులు కొందరు తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోదలిచారు. అదే విషయం తమ సంగీత విద్వాంసుడికి చెప్పారు. ఆ విద్వాంసుడు చాలా సంతోషించి ‘అలాగే, అక్కడి శేషాచలం కొండల్లోని సముద్రాన్ని చూసి రమ్మని’ చెప్పి పంపాడు.
ప్రయాణం మొదలైనప్పటినుంచీ ఆ సాధకుల్లో ఓ సందేహం మొదలయ్యింది. ‘తిరుమల శేషాచలం కొండల దగ్గర సముద్రం ఉందని ఎన్నడూ వినలేదు, మరి గురువు ఎందుకు అలా చెప్పాడో...’ అని. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎందరో పండితులను విచారించినా తిరుమల కొండ సమీపంలో సముద్రం ఏదీ లేదని తెలుసుకున్నారు. ‘అయినా గురువు తప్పు చెప్పడు కదా!’ అని ఆలోచించారు. ‘ఎలాగూ వెళ్తున్నాము కదా, కొండ పరిసరాల్లో వెదికి చూద్దాం!’ అనుకున్నారు.
అలిపిరి మెట్ల నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గుండు గీయడమంటే పాపాలు పోగొట్టుకోవడమే అని నమ్మిన ఆ సాధకులు స్వామికి తలనీలాలు సమర్పించారు. పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. లడ్డు ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే, వారికి గురువు చెప్పింది గుర్తుకొచ్చింది. కనిపించిన భక్తులతో సముద్రం గురించి ఆరా తీశారు. వారు సమాధానం ఇవ్వకపోగా వీరి వైపు వింతగా చూశారు.
‘తిరుమల కొండలపైన సముద్రం కాకపోయినా, సముద్రం లాంటిదేమైనా ఉంటుందేమో చూద్దామని’ బయలుదేరారు. ఆకాశ గంగ, పాపవినాశనం, జాపాలి, పాండవ తీర్థం లాంటి ప్రదేశాలన్నీ గాలించారు. వారికెక్కడా సముద్రం ఆనవాలు కనిపించలేదు. గురువు పొరపాటుగా చెప్పినట్లున్నారని తీర్మానించుకుని కొండ దిగడం ్రపారంభించారు.
వారికి దారిలో ఏడవ మైలు వద్ద ఆకాశం ఎత్తు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. భక్తితో నమస్కరించి కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా కూర్చున్నారు.
వారి చెవులకు... లీలగా... మైకులో నుంచి ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము... పదివేల శేషుల పడగల మయము‘ అనే అన్నమాచార్య కీర్తన వినిపించింది. వారి ఒళ్ళు పులకరించింది. ముఖాల్లో నేతి దీపాల మెరుపు మొదలయ్యింది. గురువు చెప్పిన ‘సముద్రం’ లోతు తెలిసింది. ఏడు స్వరాలు ఏడుకొండలై అన్నమయ్య సంగీత స్వరంతో ప్రవహించడం గమనించారు.
‘మనమనుకునే ఉప్పు నీటి సముద్రం శేషాచలం కొండల్లో లేదు కానీ అన్నమయ్య గానామృత సముద్రం ఈ కొండల దగ్గర ఉంది’ అని తెలుసుకున్నారు. పండితులను, పామరులను సైతం ఓలలాడించే ముప్పది రెండువేల సంకీర్తనలు తెలుగులో అందించిన ఆ పదకవితా పితా మహుడికి మనస్సులోనే ధన్యవాదాలు తెలిపారు. గోవింద నామస్మరణలు చేస్తూ కొండ దిగారు.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
Comments
Please login to add a commentAdd a comment