Seven hills
-
శేషాచలంలో సాగర ఘోష!
ఉత్తర భారతదేశంలోని సంగీత సాధకులు కొందరు తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోదలిచారు. అదే విషయం తమ సంగీత విద్వాంసుడికి చెప్పారు. ఆ విద్వాంసుడు చాలా సంతోషించి ‘అలాగే, అక్కడి శేషాచలం కొండల్లోని సముద్రాన్ని చూసి రమ్మని’ చెప్పి పంపాడు.ప్రయాణం మొదలైనప్పటినుంచీ ఆ సాధకుల్లో ఓ సందేహం మొదలయ్యింది. ‘తిరుమల శేషాచలం కొండల దగ్గర సముద్రం ఉందని ఎన్నడూ వినలేదు, మరి గురువు ఎందుకు అలా చెప్పాడో...’ అని. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎందరో పండితులను విచారించినా తిరుమల కొండ సమీపంలో సముద్రం ఏదీ లేదని తెలుసుకున్నారు. ‘అయినా గురువు తప్పు చెప్పడు కదా!’ అని ఆలోచించారు. ‘ఎలాగూ వెళ్తున్నాము కదా, కొండ పరిసరాల్లో వెదికి చూద్దాం!’ అనుకున్నారు. అలిపిరి మెట్ల నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గుండు గీయడమంటే పాపాలు పోగొట్టుకోవడమే అని నమ్మిన ఆ సాధకులు స్వామికి తలనీలాలు సమర్పించారు. పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. లడ్డు ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే, వారికి గురువు చెప్పింది గుర్తుకొచ్చింది. కనిపించిన భక్తులతో సముద్రం గురించి ఆరా తీశారు. వారు సమాధానం ఇవ్వకపోగా వీరి వైపు వింతగా చూశారు. ‘తిరుమల కొండలపైన సముద్రం కాకపోయినా, సముద్రం లాంటిదేమైనా ఉంటుందేమో చూద్దామని’ బయలుదేరారు. ఆకాశ గంగ, పాపవినాశనం, జాపాలి, పాండవ తీర్థం లాంటి ప్రదేశాలన్నీ గాలించారు. వారికెక్కడా సముద్రం ఆనవాలు కనిపించలేదు. గురువు పొరపాటుగా చెప్పినట్లున్నారని తీర్మానించుకుని కొండ దిగడం ్రపారంభించారు.వారికి దారిలో ఏడవ మైలు వద్ద ఆకాశం ఎత్తు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. భక్తితో నమస్కరించి కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా కూర్చున్నారు. వారి చెవులకు... లీలగా... మైకులో నుంచి ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము... పదివేల శేషుల పడగల మయము‘ అనే అన్నమాచార్య కీర్తన వినిపించింది. వారి ఒళ్ళు పులకరించింది. ముఖాల్లో నేతి దీపాల మెరుపు మొదలయ్యింది. గురువు చెప్పిన ‘సముద్రం’ లోతు తెలిసింది. ఏడు స్వరాలు ఏడుకొండలై అన్నమయ్య సంగీత స్వరంతో ప్రవహించడం గమనించారు.‘మనమనుకునే ఉప్పు నీటి సముద్రం శేషాచలం కొండల్లో లేదు కానీ అన్నమయ్య గానామృత సముద్రం ఈ కొండల దగ్గర ఉంది’ అని తెలుసుకున్నారు. పండితులను, పామరులను సైతం ఓలలాడించే ముప్పది రెండువేల సంకీర్తనలు తెలుగులో అందించిన ఆ పదకవితా పితా మహుడికి మనస్సులోనే ధన్యవాదాలు తెలిపారు. గోవింద నామస్మరణలు చేస్తూ కొండ దిగారు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
మధ్య తరగతి కుర్రాడి కథ
గౌతం కృష్ణ హీరోగా, శ్వేత అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా పి. నవీన్‌కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్‌పై సెవెన్ హిల్స్ సతీష్‌కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పి. నవీన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఒక స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన మధ్య తరగతి కుర్రాడి కథతో ఈ సినిమా రూపొందుతోంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని మా సినిమా అలరిస్తుంది’’ అన్నారు. ‘‘త్వరలో మా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అన్నారు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్. పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, ఆనంద్ చక్రపాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: త్రిలోక్ సిద్ధు, సంగీతం: జుడా శాండీ. ∙పోసాని కృష్ణ మురళి, గౌతం కృష్ణ, శ్వేత -
తిరుమలలో సుందర దృశ్యాలు.. మైమరచిపోతున్న భక్తులు
సాక్షి, తిరుమల: జోరు వర్షాలతో ఏడు కొండలు కొత్త శోభను సంతరించుకున్నాయి. తిరుమలలో సుందర దృశ్యాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. దేవ దేవుడు కొలువైన శేషాచలం అందాలు కనువిందు చేస్తుంది. సుకుమారంగా తాకుతున్న మేఘాల డోలికల్లో సప్తగిరులు మునిగి తేలుతున్నాయి. చెక్కిలి గింతలు పెడుతున్న పిల్ల గాలులకు మైమరచి పోతున్నాయి ఏడు కొండలు. తనువంతా పచ్చదనాన్ని నింపుకుని సప్తగిరులు శోభాయమానంగా ప్రకాశిస్తుంది. సుకుమారంగా తాకుతున్న మేఘాలు శ్వేత వర్ణ సొగసులద్దాయి. వెరసి.. కలియుగ దైవం కొలువైన ఏడుకొండలు సప్త పదుల రాగాలు పాడుకుంటున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సప్తగిరుల అందాలు కనువిందు చేస్తున్బాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను శేషాచల అందాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలిపిరి, ఘాట్ రోడ్లలో దృశ్యాలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. దీంతో ఫోటోలు, సెల్పీలు తీసుకుంటూ ఆస్వాదిస్తున్నారు. చదవండి: (సూపర్‌స్టార్ కోసం ఒక సీట్ రిజర్వ్.. నవరంగ్ థియేటర్ ఘననివాళి) -
బంగారు పూలు నాకెందుకు!
‘‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు /కొండలంత వరములు గుప్పెడువాడు’’. ఆ కొండలు ఈనాటి కొండలు కావు. అసలు ఆ కొండలే వేంకటేశ్వరుడంటారు. అందుకనే ఆ కొండ పాదాన్ని స్వామి పాదుకలుగా భావించి అర్చన చేస్తారు. వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వేంకటాద్రి, శేషాద్రి, నారాయణాద్రి– అవి ఏడు కొండలు. ఒక్కొక్క కొండ ఎందుకొచ్చిందో ఆ విశేషాల్ని వరాహ పురాణం వర్ణించింది. అది –‘‘కృతే వృషాద్రిం వక్ష్యంతి/త్రేతాయాం అంజనాచలమ్ /ద్వాపరే శేషశైలతే /కలౌ శ్రీ వేంకటాచలమ్.’’ కృత యుగంలో వృషాద్రి అని, త్రేతా యుగంలో అంజనాద్రి అని, ద్వాపర యుగంలో శేషాద్రి అని, కలి యుగంలో వేంకటాద్రి పేరిట ఈ దివ్య క్షేత్రం కొన్ని కోట్ల సంవత్సరాలుగా విరాజిల్లుతోంది. ఇప్పటికీ వేంకటాచలంపైన శిలాతోరణం ఉంది. అది ఎప్పటిదో ఎవ్వరికీ తెలియదు. దానంతట అదిగా ఏర్పడింది. అది క్రీడాద్రి. శ్రీమన్నారాయణుడు విహరించిన ఉద్యానవనం. దానిని గరుడుడు తీసుకొచ్చి భూమిమీద పెట్టాడు.ఇక కోనేరు–దానిని స్వామి పుష్కరిణి అంటాం. మనకు జీవితంలో మూడే మూడు దుర్లభమయినవని వరాహ పురాణం చెబుతున్నది. ఈ మూడింటిలో ఏదయినా నీకు దొరికితే నీవు అదృష్టవంతుడి కింద లెక్క. అవి– ‘సద్గురోః పాదసేవనం’. సర్వకాలాల్లో భగవంతుని పాదారవిందాలనుంచీ స్రవించే అమృతపానంతో మత్తెక్కిపోయిన హృదయమున్న పరమ భాగవతుడైన జ్ఞాని పాదసేవ అంత సులభం కాదు. సమస్త తీర్థాలు అటువంటి గురువు పాదాలలో ఉంటాయి. అలాగే ఏకాదశీ వ్రతాన్ని శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేయడం చాలా కష్టం. ఇక మూడవది–పుష్కరిణీ స్నానం. ఘటికాచల మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు చెప్తాడు... అక్కడ స్నానం చేస్తే అకాల మృత్యువు, మతి భ్రమణం ఇతర అనారోగ్యాలు దరి చేరవంటాడు. అందులో కొన్ని వందల తీర్థాలు అంతర్వాహినిగా కలుస్తుంటాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీదేవి, భూదేవిలతో కలిసి జలకాలాడిన పరమ పావనమైన పుష్కరిణీ స్నానం విశేషమైనది. దానికి రాయడు అంటే రాజు అటువంటి దుర్లభమైన పుష్కరిణీ స్నాన అవకాశాన్ని మనకు కలిగించాడు. అందుకని కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడైనాడు.కొండలంత వరములు గుప్పెడు వాడు..వాడు కొండలలో ఉన్నాడు. సాధారణంగా మనం ఒక మాట అంటుంటాం. ఆయనేం ఇవ్వలేడు కనుక. కొండంత ఇచ్చేస్తాడు–అని. ఆయన ఏదయినా ఇవ్వగలడు, కరుణా సముద్రుడు. ఎవరయినా ఏదయినా ఇస్తారు. తనదే ఇవ్వమంటే తనకున్న స్థితి నుంచి కిందకొచ్చి ఇవ్వలేరు. అలా భక్తికి ఎంతగా పరవశించిపోతాడో చూపడానికి అన్నమాచార్యులవారు తన కీర్తనలో..‘‘కుమ్మర దాసుడైన కురువరతినంబి యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు. దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు’’ అన్నాడు. శ్రీవేంకటాచలం క్షేత్రానికి దగ్గరలో కుండలు చేసుకుంటూ జీవనం సాగించే భీముడనే కుమ్మరి.. స్వామివారి భక్తుడు. తన పూరి గుడిసెలోనే ఒక మూలన స్వామి వారి విగ్రహాన్ని పెట్టుకుని తాను కుండలు చేసే ముందు మట్టితో చేసిన తులసీదళాలను స్వామి వారికి అర్పిస్తూ అర్చన చేసేవాడు. ‘బంగారు దళాలతో పూజచేసే తొండమాన్ చక్రవర్తి అహంకారాన్ని అణచడానికి, నిస్వార్థంగా, పారవశ్యంతో పూజించే భీముడింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించావు. ఎంత దయాసముద్రుడివయ్యా’– అని పొంగిపోతూ కీర్తన చేసారు అన్నమయ్య. స్వామికి కావలసింది బంగారు పుష్పాలు కాదు, హృదయ పుష్పాలు. -
శ్రీవారి సన్నిధే వారి పెన్నిధి!
భక్తులకు ఏడుకొండలవాడి దర్శనాన్ని కల్పించి, ఆ దేవదేవుడి దీవెనలను అందించే తిరుమల తిరుపతి దేవస్థానం... కొన్ని వేలమందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది. ఈ కొలువులో దాదాపు 23 వేల మంది పని చేస్తున్నారు. వారంతా పలు రకాల విధులను నిర్వర్తిస్తూ స్వామివారి సన్నిధి సాక్షిగా జీవితాలను సాగిస్తున్నారు. టీటీడీలో మొత్తం 8 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 15 వేల మందికిపైగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 2013-14 బడ్జెట్ ప్రకారం రెగ్యులర్ ఉద్యోగుల జీతభత్యాలు రూ.350 కోట్లు కాగా, ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాలు రూ.92 కోట్లు. ఈ ఉద్యోగుల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉండటం గమనార్హం. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయవాడ... తెలంగాణలోని పలు జిల్లాలకు చెందినవారూ ఉన్నారు. తమిళనాడులోని వేలూరు, సేలం, తిరుత్తణి, తిరువళ్లూరు, చెన్నై, కర్ణాటకలోని బళ్లారి, కోలార్, బెంగళూరు ప్రాంతాలకు చెందినవారూ ఉపాధి పొందుతున్నారు. తిరుమల ఆలయం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉండటం వల్ల, తమిళ సంప్రదాయాలు ఎక్కువగా పాటించడం జరుగుతోంది. అందుకే అర్చకులు, ప్రసాదాలు తయారుచేసే పోటు ఉద్యోగుల్లో తమిళులే అధికం! జియ్యంగార్లు కీలకం! ఆలయ నిర్వహణకు సంబంధించి జియ్యంగార్ల సూచనలు, సలహాలు అత్యంత కీలకం. అదే విధంగా భక్తుల సదుపాయాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ధర్మకర్తల మండలి తీసుకునే నిర్ణయాలను అమలుపర్చే బాధ్యత కూడా జియ్యంగార్లదే. ప్రస్తుతం దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులు జియ్యంగార్ వ్యవస్థ కిందికే వస్తారు. ఇప్పుడు ఈవో నేతృత్వంలో ఇద్దరు జేఈవోలు, సీవీఎస్వో, డిప్యూటీ ఈవోలు, ఇతర అనుబంధ విభాగాల అధికారులు, అటెండర్‌స్థాయి సిబ్బంది వరకు మొత్తం 8 వేల పైచిలుకు పనిచేస్తున్నారు. ఆలయ పూజాకార్యక్రమాల నిర్వహణలో ప్రధాన పర్యవేక్షకుడుగా పెద్ద జీయర్, ఈయనకు సహాయకుడిగా చిన్న జీయర్ వ్యవహరిస్తారు. వీరు ఆలయ నిర్వహణ, స్వామి వారి నిత్య కైంకర్యాల బాధ్యతను పర్యవేక్షిస్తారు. పూజలు మాత్రం వైఖానస అర్చకులు నిర్వహిస్తారు. నిత్య పూజా కైంకర్యాల్లో లోటుపాట్లు లేకుండా పర్యవేక్షించే బాధ్యతంతా వీరి పైనే ఉంటుంది. జియ్యంగార్లంటే సన్యాసులు కారు. సంసార సాగరాన్ని ఈదిన వారే. అయితే ఈ పదవిలోకి వచ్చిన క్షణం నుంచి వీరు సన్యాస ధర్మాలను తప్పక ఆచరించాలి. మఠం పరిపాలన, శ్రీవారి ఆలయంలో వేకువజామున సన్నిధి గొల్ల ఆలయ తలుపులు తెరిచే కార్యక్రమం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని పూజా కార్యక్రమాలనూ జీయర్ లేదా వారి ప్రతినిధులు పర్యవేక్షించాలి. శ్రీవారి పూజలకు సంబంధించిన పువ్వులు మొదలు అన్ని రకాల వస్తువులూ వీరి చేతుల మీదుగానే అర్చకులకు అందాలి. జియ్యంగార్ల మఠాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం టీటీడీ ఏటా రూ.కోటిన్నర దాకా వెచ్చిస్తోంది. కొనుగోళ్లతో వేలాది మందికి ఉపాధి నిత్యాన్నదానంలో ఏడాదికి 3,650 టన్నుల బియ్యం, 360 టన్నుల పప్పుదినుసులు అవసరమవుతాయి. అన్న ప్రసాదాలు, లడ్డు, వడలు తదితర ప్రసాదాలు, అన్నదాన భోజనం తయారీ వంటి వాటి కోసం దేశ విదేశాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సరుకులు కొనుగోలు చేస్తోంది టీటీడీ. దీనికి ఏటా రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది. బియ్యం, చక్కెర, నెయ్యి, పప్పు దినుసులు, బెల్లం, అరటి ఆకులు, కూరగాయలు, పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, పాలు వంటి సరుకుల కొనుగోళ్లపై ఎక్కువ స్థాయిలో ఖర్చు అవుతోంది. ప్రసాదం వితరణ చేసే దొన్నెలు, పారిశుద్ధ్యానికి వినియోగించే చీపుర్లపై కూడా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల కొన్ని వేల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తోంది.