musicians
-
శేషాచలంలో సాగర ఘోష!
ఉత్తర భారతదేశంలోని సంగీత సాధకులు కొందరు తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోదలిచారు. అదే విషయం తమ సంగీత విద్వాంసుడికి చెప్పారు. ఆ విద్వాంసుడు చాలా సంతోషించి ‘అలాగే, అక్కడి శేషాచలం కొండల్లోని సముద్రాన్ని చూసి రమ్మని’ చెప్పి పంపాడు.ప్రయాణం మొదలైనప్పటినుంచీ ఆ సాధకుల్లో ఓ సందేహం మొదలయ్యింది. ‘తిరుమల శేషాచలం కొండల దగ్గర సముద్రం ఉందని ఎన్నడూ వినలేదు, మరి గురువు ఎందుకు అలా చెప్పాడో...’ అని. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎందరో పండితులను విచారించినా తిరుమల కొండ సమీపంలో సముద్రం ఏదీ లేదని తెలుసుకున్నారు. ‘అయినా గురువు తప్పు చెప్పడు కదా!’ అని ఆలోచించారు. ‘ఎలాగూ వెళ్తున్నాము కదా, కొండ పరిసరాల్లో వెదికి చూద్దాం!’ అనుకున్నారు. అలిపిరి మెట్ల నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గుండు గీయడమంటే పాపాలు పోగొట్టుకోవడమే అని నమ్మిన ఆ సాధకులు స్వామికి తలనీలాలు సమర్పించారు. పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. లడ్డు ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే, వారికి గురువు చెప్పింది గుర్తుకొచ్చింది. కనిపించిన భక్తులతో సముద్రం గురించి ఆరా తీశారు. వారు సమాధానం ఇవ్వకపోగా వీరి వైపు వింతగా చూశారు. ‘తిరుమల కొండలపైన సముద్రం కాకపోయినా, సముద్రం లాంటిదేమైనా ఉంటుందేమో చూద్దామని’ బయలుదేరారు. ఆకాశ గంగ, పాపవినాశనం, జాపాలి, పాండవ తీర్థం లాంటి ప్రదేశాలన్నీ గాలించారు. వారికెక్కడా సముద్రం ఆనవాలు కనిపించలేదు. గురువు పొరపాటుగా చెప్పినట్లున్నారని తీర్మానించుకుని కొండ దిగడం ్రపారంభించారు.వారికి దారిలో ఏడవ మైలు వద్ద ఆకాశం ఎత్తు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. భక్తితో నమస్కరించి కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా కూర్చున్నారు. వారి చెవులకు... లీలగా... మైకులో నుంచి ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము... పదివేల శేషుల పడగల మయము‘ అనే అన్నమాచార్య కీర్తన వినిపించింది. వారి ఒళ్ళు పులకరించింది. ముఖాల్లో నేతి దీపాల మెరుపు మొదలయ్యింది. గురువు చెప్పిన ‘సముద్రం’ లోతు తెలిసింది. ఏడు స్వరాలు ఏడుకొండలై అన్నమయ్య సంగీత స్వరంతో ప్రవహించడం గమనించారు.‘మనమనుకునే ఉప్పు నీటి సముద్రం శేషాచలం కొండల్లో లేదు కానీ అన్నమయ్య గానామృత సముద్రం ఈ కొండల దగ్గర ఉంది’ అని తెలుసుకున్నారు. పండితులను, పామరులను సైతం ఓలలాడించే ముప్పది రెండువేల సంకీర్తనలు తెలుగులో అందించిన ఆ పదకవితా పితా మహుడికి మనస్సులోనే ధన్యవాదాలు తెలిపారు. గోవింద నామస్మరణలు చేస్తూ కొండ దిగారు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
‘బిట్ బోర్డ్’ ఇది మార్కెట్లోకి వస్తే.. సంగీతకారులకు పండగే!
ఎలక్ట్రానిక్ కీబోర్డులు వచ్చాక సంగీత సృజన కొంత తేలికైంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరం సంగీత సృజనను మరింత సులభతరం చేస్తుంది. కాలిఫోర్నియాలో స్థిరపడిన చైనీస్ డిజైనర్ చెన్ సిన్ ఈ పరికరాన్ని ‘బిట్ బోర్డ్’ పేరుతో ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఈ అధునాతన సంగీత పరికరాన్ని రూపొందించినందుకు ఈ ఏడాది ‘రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్స్’ పోటీల్లో ‘బెస్ట్ ఆఫ్ ద బెస్ట్’ అవార్డును కూడా సాధించారు. ఇది ఎక్కడికైనా తీసుకువెళ్లడానికి అనువుగా ఉండటమే కాదు, ఇందులో నానా రకాల తంత్ర, తాళవాద్యాల ధ్వనులను శ్రావ్యంగా పలికించుకోవచ్చు. ఇందులోని ఆప్షన్స్‌ను ఉపయోగించుకుని, ఏకకాలంలోనే పలు వాద్యాల ధ్వనులనూ పలికించుకోవచ్చు. ఇందులో వాల్యూమ్ కంట్రోల్, లూపింగ్, బ్లూటూత్ ద్వారా వైర్లెస్ కనెక్టివిటీ వంటి ఆప్షన్స్ కూడా ఉండటం విశేషం. ఈ పరికరం ఇంకా మార్కెట్లోకి రావాల్సి ఉంది. ఇది అందుబాటులోకి వస్తే, సంగీతకారులకు పండగేనని చెప్పవచ్చు. చదవండి: ‘బకరాల్ని చేశాడు.. మస్క్ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్’ -
శతతంత్రుల మాంత్రికుడు
భారత శాస్త్రీయ సంగీతానికి మే 10 అత్యంత విషాదకరమైన రోజులలో ఒకటి. పండిట్ రాజన్ మిశ్రా, పండిట్ బిర్జూ మహారాజ్‌ల తర్వాత... ఆ రోజున మనం మరొక సంగీత దిగ్గజం పండిట్ శివకుమార్ శర్మను కోల్పోయాం. ఏళ్ల క్రితం హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో సితార్, సరోద్, వయోలిన్లు ఆధిపత్యం చలాయిస్తున్న సమయంలో పండిట్ శివకుమార్ శర్మ శతతంత్రీ వీణ (సంతూర్) ఆ మూడు వాద్యాలకు సమవుజ్జీగా స్థానం సంపాదించిందంటే ఆ ఘనత శర్మాజీదే. 60–70 ఏళ్ల క్రితం సంతూర్ అనే ఈ జమ్మూకశ్మీర్ పల్లెసీమల, జానపదుల సూఫీ సంగీతపు నూరు తంత్రుల పక్క వాద్యాన్ని శర్మాజీ అత్యద్భు తంగా మలిచి, పలికించారు. ప్రతి కొత్త విషయానికి జరిగినట్లే ఇక్కడా జరిగింది. అందుకు నేనొక సాక్షిని. సంతూర్ అనే ఆ కొత్త పరికరం గురించి ప్రేక్షకులు సందేహాలు వ్యక్తం చేశారు. సంతూర్ ధ్వనిలో భారత శాస్త్రీయ సంగీత సారాంశం లేదని పెదవి విరిచారు. గమకాలు, స్వర విరామాలు శ్రావ్యంగా లేవని అన్నారు. కానీ పండిట్ శర్మ ఆ వాద్యానికి, వాద్య ధ్వనికి ఏకంగా దేవశ్రుతినే కల్పించారు. కుడిచేతి బొటనవేలితో తంత్రుల్ని మూర్ఛనలు పోనిచ్చారు. ఉదాహరణకు, రూపకతాళం అనే ఒక్క ఏడు లయల భావాంశం లోనే పండిట్జీ ఝప్తాల్ (10 బీట్లు), ఏక్ తాల్ (12 బీట్లు), తీన్ తాల్ (16 బీట్లు) కూడా పలికించేవారు. పండిట్జీ కొద్దిమాటల మనిషి. ప్రశాంతంగా, మౌనంగా, మర్యాదగా, వినయంగా ఉండేవారు. కచేరీ ప్రారంభానికి ముందు వేదిక తెరల వెనుక ధ్యానముద్రలోకి వెళ్లిపోయేవారు. ఆలోచనల్ని వేళ్లలోకి తెచ్చేసుకునేవారు. ఎంతటి మాటల పొదు పరి అయినా సహ కళాకారుల గురించి ఆరా తీసేవారు. వారిని ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన ఎవర్నయినా విమర్శించడం నేను ఎప్పుడూ చూడ లేదు. ఆయనలో హాస్య ప్రియత్వం ఉండేది. ఒకసారి ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూకి ముందు ‘నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి’ అని అన్న ప్పుడు, పండిట్జీ ఇలా సమాధానమిచ్చారు: ‘క్షమిస్తాను. ముందు మీరు తప్పు చేయండి’. శర్మాజీ మొదట్లో తబలా వాద్యకారులు. 1950వ దశకం చివరిలో మా కుటుంబానికి యువ శర్మ గురించిన తొలి జ్ఞాప కాలలో ఒకటి... మా అన్నగారు, సితార్ వాద్యకారుడు పండిట్ శశి మోహన్ భట్ జమ్మూలో ఆల్ ఇండియా రేడియో షో కోసం రికార్డింగ్ చేస్తున్నప్పుడు శివకుమార్ శర్మ తబలా వాయించడం! సంవత్సరాల తరువాత శర్మాజీ, నేనూ ఒకే కచేరీలో వాద్యకారు లుగా కలుసుకున్నాం. ఆయన పండిట్ హరిప్రసాద్ చౌరాసి యాతో (శివ్–హరిగా) కలిసి యుగళ గీతాలకు సంతూర్ స్వర ప్రతిష్ఠ చేసేవారు. నేనప్పటికి జూనియర్ ఆర్టిస్ట్‌ని మాత్రమే! శర్మాజీ, నేను కలిసి ఎప్పుడూ యుగళ గీతాలను పలికించలేదు. కానీ మేము ఒకే విమానంలో న్యూయార్క్‌లోని భారతీయ విద్యా భవన్లో కచేరీలకు, ఎ.ఆర్. రెహమాన్ ‘జనగణమన’ వీడియో షూట్ల కోసం లేహ్, లద్దాఖ్, మాంట్రియల్‌కు వెళ్లాం. పండిట్ జస్రాజ్ కుమార్తె దుర్గా జస్రాజ్ ఏర్పాటు చేసిన టెలివిజన్ షో రికార్డింగ్‌లో ఆమె నా పేరును ప్రస్తావించినప్పుడు, పండిట్ శివ కుమార్ శర్మాజీ... ‘అతను మోహన వీణను ప్రపంచమంతటికీ తీసుకెళ్లాడు’ అని నా పరిచయానికి జోడింపునిచ్చారు. నేను గ్రామీ (1994) గెలుచుకున్నప్పుడు ‘నువ్వు గొప్పగా చేశావు’ అన్నారు. ఆయన్నుంచి నాకు లభించిన ఆశీస్సులవి. సంగీతకారులకే పథనిర్దేశం చేసిన సంగీత విద్వాంసులు పండిట్జీ. ఒక గంట పాటు మనం ఆయన మాటల్ని వింటే, సంగీతంలో తాకగల ఎత్తులు ఎన్నో ఉన్నాయని మన గ్రహింపునకు వస్తుంది. సృజనశీలురు తమ ఊహల నుండి సృష్టిస్తారు. కానీ మనం శర్మాజీ జ్ఞానం, శైలి నుంచి నేర్చుకున్న నైపుణ్యాలతోనైనా నవ రాగాలకు ఊపిరి పొయ్యొచ్చు. చాలామంది కళాకారుల మాదిరిగా పండిట్జీ నుంచి నేను కూడా రాగాలను ఎలా నియంత్రించాలి, లయలను ఎలా విభజించాలి, కూర్పులో ఎన్ని వైవిధ్యాలు తీసుకురావాలి, ఇవన్నీ చేస్తున్న ప్పుడు ప్రేక్షకుల ధ్యాసను ఎలా పట్టుకోవాలి; సంప్రదాయానికీ, ఆధునికతకూ ఎలా వంతెన వేయాలి అనే విషయాలను నేర్చు కున్నాను. కొత్తవాద్యంతో సంప్రదాయ ప్రేక్షకులను ఒప్పించి, మెప్పించడం చాలా కష్టమైన పని. కానీ పండిట్జీ గొప్ప శక్తితో, ఉత్సాహంతో ఆ పని చేయగలిగారు. నావంటి వారికి ఒక కొత్త ప్రయోగాన్ని చెయ్యడానికి అవసరమైన ధైర్యాన్ని ఇచ్చారు. విశ్వమోహన్ భట్ వ్యాసకర్త ప్రసిద్ధ వాద్య సంగీతకారులు,గ్రామీ అవార్డు గ్రహీత -
రెండే రెండు నిమిషాల్లో బాద్షా సాంగ్, స్పందించిన ర్యాపర్
హ్యూమర్ అంటే ఇష్టం లేనిది ఎవరికి? ఆ మాటకొస్తే మ్యూజిక్ అంటే కూడా! ఈ రెండిటినీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుందిగానీ, ఆ కళ కాస్త గట్టిగా తెలిసుండాలి. సరిగ్గా ఈ కోవకు చెందిన మ్యూజిషియన్ అన్ష్మన్ శర్మ. ‘హౌ టూ మేక్ ఏ బాద్షా సాంగ్ ఇన్ 2 మినిట్స్’ పేరుతో ఆయన ఒక వీడియో రూపొందించాడు. సాంగ్ మేకింగ్ గురించి ఎనిమిది స్టెప్స్‌తో జనవరి 10న పోస్టు చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 9 లక్షల పైనా వ్యూవ్స్ వచ్చాయి. ఇలాంటి వీడియోనే గతంలో రిత్విక్, ప్రతీక్ పాటల గురించి చేసి శబ్భాష్ అనిపించుకున్నాడు శర్మ. అయితే ఈ వైరల్ వీడియో చివరికి రాపర్ దృష్టిని ఆకర్షించింది. దీనిపై స్పందిస్తూ ‘అతను దాదాపు కొల్లగొట్టాడని ప్రమాణం చేస్తున్నాను" అంటూ బాద్షా నవ్వుతున్న ఎమోజీ షేర్ చేశారు. How to make a Badshah song in 2 minutes! pic.twitter.com/MtpILEwgvi — Anshuman Sharma (@anshumonsharma) January 10, 2022 -
స్మృతి ఇరానీ పోస్ట్.. నవ్వకుండా ఉండలేం!
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫన్నీ మీమ్స్, ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటారు. ఆమె తాజాగా ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మీ చార్టర్డ్ అకౌంటెంట్ స్నేహితులు మార్చి నెల ముగిసే సమయంలో ఇలాగే ఉత్సాహంగా ప్రవర్తిస్తారు’ అంటూ సరదాగా కామెంట్ జతచేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో నలుగురు సంగీత వాయద్యకారులు తమను తాము మరిచి ఉత్సహభరితంగా పాట పాడుతూ తబలా, హార్మోనియం వాయిస్తారు. ఆ సంగీత వాయిద్యకారులు ఇచ్చే ముఖకవలికలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మరింత ఫన్నిగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చేసిన తర్వాత నవ్వకుండా ఉండలేమంటున్నారు. అదే విధంగా ఈ వీడియోను ముంబై పోలీసులు కూడా తమ ఆధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘హ్యాకర్లు చాలా సులభమైన పాస్వర్డ్ ద్వారా అకౌంట్లను ఓపెన్ చేస్తే.. ఈ వీడియోలో ఉన్నవారిలాగానే ఉత్సహంగా ఉంటారు’ అని కామెంట్ జత చేసింది. -
డ్రగ్స్ వాడకం.. నటులు, మ్యూజిషియన్స్పై దృష్టి
బెంగళూరు: వారం రోజుల క్రితం కర్ణాటకలో వెలుగు చూసిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసు దర్యాప్తులో భాగంగా కొందరు ‘ప్రముఖ సంగీతకారులు, నటులు’ ప్రస్తుతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వివరాలు.. ఆగస్టు 21న ఎన్సీబీ బృందం.. బెంగళూరు కల్యాణ్ నగర్‌లోని రాయల్ సూట్స్ హోటల్ అపార్ట్మెంట్ నుంచి 145 ఎండీఎంఏ మాత్రలు, 2.20 లక్షల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఆ తరువాతి చర్యల్లో భాగంగా ఈ బృందం బెంగళూరులోని నికూ అపార్ట్మెంట్లో మరో 96 మాత్రలు, 180 ఎల్ఎస్డీ బ్లాట్లను స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ (ఆపరేషన్స్) కె పి ఎస్ మల్హోత్రా ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాక ‘ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఒక లేడీ డ్రగ్ సప్లయర్‌ని అదుపులోకి తీసుకోవడమే కాక బెంగళూరు దోడగుబ్బీలోని ఆమె ఇంటి నుంచి 270 ఎండీఎంఏ మాత్రలు స్వాధీనం చేసుకున్నాము’ అని మల్హోత్ర తెలిపారు. (చదవండి: రూ. 100 కోట్ల డ్రగ్స్ పట్టివేత!) ఈ దాడుల సమయంలో ఎం అనూప్, ఆర్ రవీంద్రన్, అనిఖా డి అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు మల్హోత్ర తెలిపారు. ప్రముఖ సంగీతకారులు, నటులతో పాటు కళాశాల విద్యార్థులు, యువకులకు సహా సమాజంలోని సంపన్న వర్గాలకు చెందిన వారికి.. నిందితులు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు మల్హోత్ర. ఈ కేసులో ఎన్సీబీ బెంగళూరు యూనిట్ త్వరలోనే మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఫెడరల్ యాంటీ-నార్కోటిక్స్ ఏజెన్సీ, ఈ నెల ప్రారంభంలో మాదకద్రవ్యాల వ్యవహారంలో రెహమాన్.కె అనే వ్యక్తిని అరెస్టు చేసింది. అతడు కళాశాల విద్యార్థులు, యువకులకు ఎండీఎంఏతో పాటు ఇతర డ్రగ్స్‌ని విక్రయిస్తున్నాడని ఎన్సీబీ తెలిపింది. వినియోగదారులు బిట్ కాయిన్స్ ద్యారా ఆన్లైన్లో ఈ మాత్రలను కొనుగోలు చేసినట్లు గుర్తించామని.. కొద్ది రోజుల కిందట ఇదే తరహా మాత్రలను కొనుగోలు చేసిన జంటను ముంబాయిలో పట్టుకున్నామని మల్హోత్ర తెలిపారు. -
సినీ మ్యుజిషియన్స్ స్వరసంగమం
-
సంగీత ప్రియులకు ఫ్లామెన్కో గిటార్ మ్యూజిక్
సంగీత ప్రియులను ఫ్లామెన్కో గిటార్ మ్యూజిక్ మైమరిపించింది. లాడ్ దెబస్సీ క్లాసిక్స్‌తో మాదాపూర్‌లోని ద వెస్టిన్ ఓలలాడింది. ఫ్రెంచ్ మ్యుజీషియన్స్ సెర్జ్ లోపేజ్, నథాలి మారిన్‌లు బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘డియో- ఫ్లామెన్కో కన్సర్ట్ (గిటార్ అండ్ పియానో)’ ఆద్యంతం ఆహూతులను అలరించింది. హైదరాబాద్‌కు మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ గాయనీ గాయకులు తమ నేపథ్యాన్ని సిటీప్లస్‌తో పంచుకున్నారు. ..:: వీఎస్ ‘నాన్న మార్సెజ్ లోపేజ్ కార్లు రిపేర్ చేసేవారు. అమ్మ హుగువిటి లోపేజ్ ఓ బేకరిలో పనిచేశారు. చిన్నప్పటి నుంచి నా చుట్టూ పరిస్థితులే ఏదో ఒకటి చేయాలన్న ధృడ సంకల్పానికి బాటలు వేశాయి. 16వ ఏట మా పేరేంట్స్ స్వస్థలం స్పెయిన్‌లో జరిగిన ఓ లైవ్ కన్సర్ట్కు వెళ్లా. అక్కడి గిటార్ మ్యూజిక్ ఫ్లామెన్కో నన్ను ఆకట్టుకుంది. ఫలితం... నేను ఫ్లామెన్కో గిటారిస్ట్‌గా మారిన. ఇది స్పెయిన్‌లోని అండ లూసియా ప్రాంత మ్యూజిక్. ఇష్టంతో నాకు నేనుగా నేర్చుకున్నా. ఫ్రాన్స్, స్పెయిన్, యూకేతో పాటు వివిధ దేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చాను’ అని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు సెర్జ్ లోపేజ్. మంచి స్పందన.. అర్కెస్ట్రా నిర్వాహకురాలిగా అంతర్జాతీయ కీర్తి తెచ్చుకున్న నథాలి మారిన్ చిన్ననాటి నుంచే మ్యూజిక్‌ను ఆస్వాదిస్తోంది. ‘నాకు మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి. ఫ్యాబ్రిక్ మేనేజరైన నాన్న జియాన్ మారిన్, ఉపాధ్యాయురాలైన అమ్మ క్రిస్టియన్ మారిన్ నన్ను ఎంకరేజ్ చేశారు. వారి ప్రోత్సాహం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ తర్వాతే మ్యూజికే నా ప్రాణమైంది. మా బ్రదర్ గిల్టియో మారిన్ ఫ్లూట్ వాయిస్తాడు. ఇక నేను ఇప్పటివరకు ఫ్రాన్స్‌తో పాటు అనేక దేశాల్లో ప్రదర్శనలిచ్చా. సెర్జ్ లోపేజ్తో కలసి భారత్‌లో కన్సర్ట్లివ్వడం ఆనందంగా ఉంది. ఇక్కడ అభిమానుల నుంచి మాకు అద్వితీయ స్పందన లభిస్తోంది. ఇప్పటికే అలయన్స్ ఫ్రాంచైజ్ భాగస్వామ్యంతో గోవా, తిరువనంతపురం, బెంగళూరులలో ప్రదర్శనలిచ్చాం. హైదరాబాద్‌లో అయితే ఇదే తొలిసారి. ఇక్కడి వంటకాలు బాగున్నాయి. మరిన్ని ప్రదర్శనలకు హైదరాబాద్ మాకు ఆహ్వానం పలుకుతుందని ఆశిస్తున్నాం’ అని అంటోంది నథాలి మారిన్. -
లలిత స్వర కమలం
లేలేత పదాలు.. సంగీతంలో లాలిత్యం.. గానంలో మాధుర్యం.. కలగలసిన కమ్మదనం లలిత గీతం. తేటతెలుగుతో ముడివేసుకున్న లలిత సంగీత ఝరి.. ఈనాటి సంగీత ఆధునిక హోరులో వినిపించకుండా పోయింది. శిశిరాన్ని తరిమి కోకిలకు గొంతుక య్యే వసంతంలా.. లలిత సంగీతానికి పూర్వవైభవం తెచ్చే ఆమని రాగం వస్తుందన్నారు ప్రముఖ గాయకురాలు వేదవతి ప్రభాకర్. లలిత గీతాలకు చలనం నేర్పిన స్వరకర్త, పదకర్త పాలగుమ్మి విశ్వనాథం సంస్మరణార్థం సప్తపర్ణిలో శనివారం జరిగిన స్మృత్యాంజలి కార్యక్రమంలో ఆమె లలిత గీతాలతో అలరించారు. ఈ సందర్భంగా ఆమె సిటీప్లస్‌తో పంచుకున్న మరిన్ని విషయాలు.. పాలగుమ్మి విశ్వనాథం అనేక మంది లలిత సంగీతకారులకు అవకాశం కల్పించారు. అయితే ఆయన స్వరకల్పన చేసిన, రాసిన ఎక్కువ గీతాలు పాడే అవకాశం, అదృష్టం నాకు లభించింది. ఆయన కేవలం స్వరకర్తే కాదు, ఎంతో బాగా పాటను నేర్పించే వారు. లలిత సంగీతం ఎలా పాడాలి, పాడటానికి కావలసిన మెలకువలు, ఈ సంగీతానికి గాత్రాన్ని ఎలా పలికించాలి,మైక్ ఎలా వాడాలి ఇలా ఎన్నో ఆయన నేర్పించారు. నాడు ప్రాభవం లలిత సంగీతానికి ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత లేదు. అప్పట్లో సినిమా సంగీతంతో పాటు లలిత సంగీతానికి ఎంతో ప్రాధాన్యం, ఆదరణ వుండేది. ఆ సమయం లైట్ మ్యూజిక్ స్వర్ణయుగం అని చెప్పాలి. అప్పట్లో అనేక మంది లైట్ మ్యూజిక్ కంపోజర్స్ ఉండేవారు. ఈ కాలంలో క్లాసికల్, లైట్ మ్యూజిక్‌కి ఆడియన్స్తగ్గిపోయారని చెప్పాలి. లలిత సంగీత కచేరీకి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు సినిమా పాటలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది. సంగతుల సంగతి.. లైట్ మ్యూజిక్ అంటే చాలా తేలికగా పాడవచ్చుఅనుకుంటారు. కానీ అది అంత సులువైన విషయం కాదు. సంగీతంలో సంగతుల సాధన చాలా ముఖ్యం. అందుకే వెస్ట్రన్ మ్యూజిక్ అయినా, హిందుస్తానీ, కర్ణాటిక్ ఏ సంగీతమైనా పాడుతూ ఉండాలి. కొన్ని సినిమా పాటల్లో క్లిష్టమైన సంగతులు ఉంటాయి. వాటినీ ప్రయత్నించాలి. మనసులో అనుకున్న భావాన్ని గొంతులో పలికించగలిగితేనే లలిత గీతం ఆకట్టుకుంటుంది. లలిత రాగాలు.. శాస్త్రీయ రాగాలపై అవగాహన ఉంటే లలిత సంగీతం వినసొంపుగా ప్రజెంట్ చేయగలుగుతాం. లలిత సంగీతంలో శాస్త్రీయ పోకడ ఎక్కువగా కనిపించకపోయినా.. ప్రభావం మాత్రం ఎంతో కొంత ఉంటుంది. శాస్త్రీయ సంగీత సాధన చేస్తే మన గొంతుకను లలిత సంగీతానికి అనువుగా మలచుకోవడం సులువవుతుంది. అలా కాకుండా లలిత సంగీతం పాడినా.. అది ఎక్కువ రోజులు నిలబడలేదు. ఈ తరం సుస్వరం.. ఈ తరం పిల్లల్లో లలిత గీతాలపై మక్కువ కనిపిస్తోంది. సాలూరి రాజేశ్వరరావు, రావు బాలసరస్వతి ఇలా ఆనాటి మేటి తరం పాటలను ఇంటరె ్నట్లో వెతుక్కుని మరీ నేర్చుకుంటున్నారు. పలు టీవీ షోల్లో చిన్నారులు చూపుతున్న ప్రతిభ చూస్తుంటే ఆనందం వేస్తోంది. బుల్లితెర..భారీ బాధ్యత.. లలిత సంగీతానికి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే టీవీ ద్వారానే సాధ్యం. ఈ విషయంలో మనం చేసే ప్రయత్నం ఎక్కువ మందికి రీచ్ కావాలంటే బుల్లితెరతోనే సాధ్యం. అప్పట్లో దూరదర్శన్, రేడియో మాత్రమే ఉండేవి. ఆడియన్స్‌కు లైట్ మ్యూజిక్‌ని వినే అవకాశం కల్పిస్తే ఆదరణ తప్పకుండా ఉంటుంది. మంచి సినిమా వస్తే ఎలాగైతే చూస్తారో.. మంచి సంగీతం వస్తే కూడా తప్పకుండా వింటారు. అందుకే టీ వీ చానళ్లు బాధ్యతగా తీసుకుంటే లలిత సంగీతానికి తప్పకుండా మంచిరోజులు వస్తాయి. -
అభిమాన తరంగం
ఘనంగా టీఎస్సార్ జన్మదిన వేడుకలు సిరిపురం: కళాకారులు, సినీరంగ ప్రముఖులు, పండితులు, విద్వాంసులు, రాజకీయ నాయకులు, అభిమానుల నడుమ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. టీఎస్సార్ లలితా కళాపరిషత్ పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకల్లో హేమాహేమీలంతా పాల్గొని టీఎస్సార్‌ను గజమాలలతో, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. సర్వధర్మ సమ్మేళానికి నిదర్శనంగా క్రీస్తు, సిక్కు, ముస్లిం, హిందూ మత గురువులతో కలిసి టీఎస్సార్ దండాలను ధరించి అందరూ సమానమే అంటూ తెలియచెప్పారు. వారందరినీ సత్కరించారు. ఈ సందర్భంగా టీఎస్సార్ తల్లిదండ్రులు బాబురెడ్డి, రుక్మిణమ్మల తైలవర్ణ చిత్ర పటంతోపాటు దివంగత సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సభలో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా విశాఖ ప్రజల మధ్యే పుట్టిన రోజును జరుపుకుంటున్నానని, ఈ సందర్భంగా కళాకారులను సత్కరించడం ఆనందంగా భావిస్తానన్నారు. అంతేకాదు పేదలకు సాయం చేయడంతోపాటు విశాఖ ప్రజలకు దైవాశీస్సులు కలగాలని కోరుతూ దైవారాధకుల్ని తీసుకు వస్తున్నట్లు చెప్పారు.తాను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడినైనప్పటికీ రాజకీయాలకతీతంగా సేవ చేయాలన్నదే తన సిద్ధాంతమన్నారు. రెండేళ్లలో బాలసుబ్రమణ్యం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను మనమే జరుపుకుంటామని టీఎస్సార్ తెలిపారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డి అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉంటారని, ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. తన సంపాదించిన దాంట్లో కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఒక్క టీఎస్సార్కే దక్కుతుందన్నారు. రాజ్యసభ వైస్ చైర్మన్ పి.జె.కురియన్ మాట్లాడుతూ పార్లమెంట్లో ఎంతో గౌరవంగా, హుందాగా టీఎస్సార్ మెలుగుతారన్నారు. 18 ఏళ్లుగా ఇద్దరం పార్లమెంట్లో మంచి మిత్రులమని, టీఎస్సార్ నాలుగోసారి కూడా రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాట్లాడుతూ పుట్టిన రోజునాడు కళాకారులను సత్కరించి నిజమైన కళాబంధుగా నిలిచారన్నారు. జన్మదినంనాడు ప్రముఖ సంగీత గాయకుడు కె.జె.ఏసుదాసును విశాఖవాసుల మధ్య సన్మానించడం ఈ ప్రాంతవాసులు చేసుకున్న పుణ్యమన్నారు. శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ ప్రజల మధ్య ఘనంగా పుట్టిన రోజు గడుపుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది టీఎస్సార్ తప్ప మరెవ్వరూ కాదన్నారు. హరిహరాసనం అనే పాటను వింటే చాలు టక్కున గుర్తుచ్చేది కె.జె.ఏసుదాసేనని తెలిపారు. ఎంపీ కె.వి.పి.రామచందర్‌రావు, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, డి.శ్రీనివాస్, మాజీ ఎంపిలు ఎంవీవీఎస్ మూర్తి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, జమునారాణి, ఎల్ ఆర్ ఈశ్వరి, సినీ నటులు మోహన్‌బాబు, బ్రహ్మానందం, ప్రముఖ నటి పూర్ణిమ, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి శుభాకాంక్షలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సుబ్బరామిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ పంపారు. పుట్టిన రోజు సందర్భంగా ఆ లేఖలోని సారాంశాన్ని అభిమానలుందరికీ చదివి వినిపించారు. ఏసుదాస్‌కు విశ్వవిఖ్యాత సంగీతకళానిధి బిరుదు భారతదేశం గర్వించదగ్గ గాయకుడు కె.జె.ఏసుదాస్‌కు ‘విశ్వవిఖ్యాత సంగీత కళానిధి’ బిరుదును గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు. స్వర్ణ బంగారు కంకణాన్ని రాజ్యసభ వైస్ చైర్మన్ కురియన్ తొడిగారు. మోన్బాబు గదను బహూకరించగా, చిరంజీవి శాలువాతో సత్కరించారు. అనంతరం కె.జె.ఏసుదాస్ , ఎస్.పి బాలసుబ్రమణ్యం పాటలు ప్రేక్షకులను మైమరపించాయి. అంతకుముందు సాలూరి వాసూరావు బృందం పాడిన భక్తిగీతాలు ప్రేక్షకులను అలరించాయి.