సంగీత ప్రియులకు ఫ్లామెన్కో గిటార్ మ్యూజిక్ | Phlamenko guitar music to music lovers | Sakshi
Sakshi News home page

సంగీత ప్రియులకు ఫ్లామెన్కో గిటార్ మ్యూజిక్

Published Fri, Feb 6 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

సంగీత ప్రియులకు ఫ్లామెన్కో గిటార్ మ్యూజిక్

సంగీత ప్రియులకు ఫ్లామెన్కో గిటార్ మ్యూజిక్

సంగీత ప్రియులను ఫ్లామెన్కో గిటార్ మ్యూజిక్ మైమరిపించింది. లాడ్ దెబస్సీ క్లాసిక్స్‌తో మాదాపూర్‌లోని ద వెస్టిన్ ఓలలాడింది. ఫ్రెంచ్ మ్యుజీషియన్స్ సెర్జ్ లోపేజ్, నథాలి మారిన్‌లు బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘డియో- ఫ్లామెన్కో కన్సర్ట్ (గిటార్ అండ్ పియానో)’ ఆద్యంతం ఆహూతులను అలరించింది. హైదరాబాద్‌కు మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ గాయనీ గాయకులు తమ నేపథ్యాన్ని సిటీప్లస్‌తో పంచుకున్నారు.
 ..:: వీఎస్

‘నాన్న మార్సెజ్ లోపేజ్ కార్లు రిపేర్ చేసేవారు. అమ్మ హుగువిటి లోపేజ్ ఓ బేకరిలో పనిచేశారు. చిన్నప్పటి నుంచి నా చుట్టూ పరిస్థితులే ఏదో ఒకటి చేయాలన్న ధృడ సంకల్పానికి బాటలు వేశాయి. 16వ ఏట  మా పేరేంట్స్ స్వస్థలం స్పెయిన్‌లో జరిగిన ఓ లైవ్ కన్సర్ట్‌కు వెళ్లా. అక్కడి గిటార్ మ్యూజిక్ ఫ్లామెన్కో నన్ను ఆకట్టుకుంది. ఫలితం... నేను ఫ్లామెన్కో గిటారిస్ట్‌గా మారిన. ఇది స్పెయిన్‌లోని
 అండ లూసియా ప్రాంత మ్యూజిక్. ఇష్టంతో నాకు నేనుగా నేర్చుకున్నా. ఫ్రాన్స్, స్పెయిన్, యూకేతో పాటు వివిధ దేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చాను’ అని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు సెర్జ్ లోపేజ్.
 
మంచి స్పందన..

అర్కెస్ట్రా నిర్వాహకురాలిగా అంతర్జాతీయ కీర్తి తెచ్చుకున్న నథాలి మారిన్ చిన్ననాటి నుంచే మ్యూజిక్‌ను ఆస్వాదిస్తోంది. ‘నాకు మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి. ఫ్యాబ్రిక్ మేనేజరైన నాన్న జియాన్ మారిన్, ఉపాధ్యాయురాలైన అమ్మ క్రిస్టియన్ మారిన్ నన్ను ఎంకరేజ్ చేశారు. వారి ప్రోత్సాహం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ తర్వాతే మ్యూజికే నా ప్రాణమైంది. మా బ్రదర్ గిల్టియో మారిన్ ఫ్లూట్ వాయిస్తాడు. ఇక నేను ఇప్పటివరకు ఫ్రాన్స్‌తో పాటు అనేక దేశాల్లో ప్రదర్శనలిచ్చా. సెర్జ్ లోపేజ్‌తో కలసి భారత్‌లో కన్సర్ట్‌లివ్వడం ఆనందంగా ఉంది. ఇక్కడ అభిమానుల నుంచి మాకు అద్వితీయ స్పందన లభిస్తోంది. ఇప్పటికే అలయన్స్ ఫ్రాంచైజ్ భాగస్వామ్యంతో గోవా, తిరువనంతపురం, బెంగళూరులలో ప్రదర్శనలిచ్చాం.
 
హైదరాబాద్‌లో అయితే  ఇదే తొలిసారి. ఇక్కడి  వంటకాలు బాగున్నాయి. మరిన్ని ప్రదర్శనలకు హైదరాబాద్ మాకు ఆహ్వానం పలుకుతుందని ఆశిస్తున్నాం’ అని అంటోంది నథాలి మారిన్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement