మ్యూజియం నుంచి వెలకట్టలేని పురాతన వజ్రాభరణాలను ఎత్తుకెళ్లిన దొంగలు
లౌరీ మ్యూజియంలో 4 నిమిషాల్లో చోరీచేసి పారిపోయిన చోర శిఖామణులు
నెపోలియన్, రాణి సేకరించిన ఆభరణాలు మాయం
పారిస్: ఫ్రెంచ్ ్రౖఫైస్ దుంపల వేపుడును తినాలన్నా ఏడెనిమిది నిమిషాలు పడుతుంది. అంతకంటే తక్కువగా అంటే కేవలం నాలుగు నిమిషాల్లోనే చోరశిఖామణులు వెలకట్టలేని చారిత్రక వజ్రాభరణాలను దొంగలించిన ఉదంతం ఫ్రాన్స్‌లో జరిగింది. పారిస్ నగరంలో ప్రపంచ ప్రఖ్యాత లౌరీ మ్యూజియంలో ఆదివారం ఉదయం భారీ చోరీ చోటుచేసుకుంది. నెపోలియన్ చక్రవర్తి, రాణి సేకరించిన అరుదైన, పురాతన వజ్రాభరణాలను దొంగలు అలవోకగా కాజేసి ఎంచక్కా బైక్‌లపై ఉడాయించిన ఉదంతం ఇప్పుడు ఫ్రాన్స్‌సహా యూరప్ దేశాల్లో చర్చనీయాంశమైంది.
విశ్వవిఖ్యాత లియోనార్డో డావిన్సీ ‘మోనాలిసా’ చిత్రరాజం సైతం ఇదే మ్యూజియంలో కొలువై రోజూ వేలాది మంది ప్రపంచపర్యాటకులను ఆకర్షిస్తున్న విషయం తెల్సిందే. వందేళ్ల క్రితం ఇదే మ్యూజియంలో ఇదే మోనాలిసా పెయింటింగ్ సైతం చోరీకి గురై రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు దొరికింది. ఇప్పుడు ఆదివారం చోరీకి గురైన అత్యంత విలువైన వజ్రాభరణాలు ఎప్పుడు దొరుకుతాయో, అసలు దొరుకుతాయో లేదోనన్న చర్చ ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఎక్కువైంది. మ్యూజియం తలపులు తెరచిన అరగంట తర్వాత ఈ చోరీ జరగడం గమనార్హం. అపోలో గ్యాలరీలోకి ఇంకా ఎవరూ రాకముందే ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.
బాస్కెట్ లిఫ్ట్‌తో వచ్చి, కట్టర్‌తో కత్తిరించి..
దొంగలు పక్కా ప్రణాళికతో వచ్చి దొంగతనం చేసినట్లు స్పష్టమవుతోంది. ఎక్కడా ఎలాంటి అనుమానం రాకుండా చడీచప్పుడులేకుండా తమ పని కానిచ్చేశారు. ఫ్రెంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు లేదా నలుగురు ముసుగు ధరించిన వ్యక్తులు ఈ చోరీ చేశారు. మ్యూజియంకు కుడివైపున ‘సీన్’ నది ప్రవహిస్తోంది. అటువైపు మ్యూజియం గోడ వద్ద మరమ్మతులు జరుగుతున్నాయి. అదే ప్రాంతాన్ని దొంగలు తమకు అనువుగా మలచుకున్నారు. వీధుల్లో ఎత్తయిన వీధిలైట్లను మార్చేందుకు వాడే ‘బాస్కెట్’ హైడ్రాలిక్ లిఫ్ట్ సాయంతో పైకి వచ్చి ఉదయం 9.30 గంటలప్పుడు మ్యూజియం భారీ కిటికీ వద్దకు చేరుకున్నారు.
వెంట తెచ్చుకున్న పదునైన రంపపు కోత మెషీన్లతో దానిని పరపరా కోసేశారు. తర్వాత నేరుగా డెనన్ వింగ్ విభాగం హాల్‌లో ఉన్న అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. ఈ గ్యాలరీలో సాధారణంగా ఫ్రాన్స్ చక్రవర్తుల సంబంధిత 23 కిరీటాలు, ఆభరణాలను ప్రదర్శనకు ఉంచుతారు. అందులోనే నెపోలియన్–3 రాజు, రాణిలకు సంబంధించిన వజ్రా భరణాలు ఉన్నాయి. ప్రదర్శన పేటికలను బద్దలు కొట్టి వీటిల్లో తొమ్మిదింటిని దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే వాటిల్లో రాణి యుజెనీకి చెందిన ఒక కిరీటంలోంచి విరిగిపడిన కొన్ని ముక్కలు మాత్రం మ్యూజియం ఆవరణలో కనిపించాయి. వీటిని పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. మ్యూజియం వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం ఈ స్వర్ణకిరీటంలో 1,354 చిన్న వజ్రాలు, 56 మరకతమణులు పొదిగి ఉన్నాయి.
ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం
విస్తీర్ణంపరంగా లౌరీ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్దది. 73,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంటే ఏకంగా 10 ఫుట్‌బాల్ స్టేడియాల విస్తీర్ణంలో ఈ మ్యూజియం ఉంటుంది. ఏకంగా 35,000 పురాతన వస్తువులను ఇందులో ప్రదర్శిస్తారు. ప్రపంచంలో అత్యంత సందర్శకుల రద్దీ ఉన్న మ్యూజియం కూడా ఇదే.
ఇంటిదొంగల పనా?
మ్యూజియంలోని ఉద్యోగుల పాత్ర ఏదైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. దొంగలు ఉపయోగించిన బాస్కెట్ లిఫ్ట్‌ను పారిస్‌లో సర్వసాధారణంగా వాడతారు. అపార్ట్‌మెంట్‌లలో మూడు, నాలుగు అంతస్తుల ఫ్లాట్‌లలోకి ఫర్నీచర్‌ను తరలించేందుకు దీనినే వాడతారు. ఈ హైడ్రాలిక్ నిచ్చెనను చెర్రీ పికర్ అని కూడా పిలుస్తారు. ఇది అక్కడ ఉండటంతో అటుగా వెళ్లేవాళ్లకు ఎలాంటి అనుమానం రాలే దని తెలుస్తోంది. అపోలో గ్యాలరీలో అత్యంత విలువైన రీజెంట్, సాన్సీ, హోర్టెన్సియా వజ్రాలను సైతం ప్రదర్శనకు ఉంచారు. ఇవి చోరీకి గురయ్యాయో లేదో తెలియరాలేదు. ఇది మాత్రమేకాదు ప్రాన్స్‌లో మ్యూజియంలలో చోరీలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో పురాతన వస్తువులకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో వాటి కోసం దొంగలు మ్యూజియంలపై పడుతున్నారు.
ఇదీ చదవండి:
హమాస్ మరో డేంజర్ ప్లాన్.. అమెరికా సీరియస్ వార్నింగ్


