Louvre Museum
-
షాకింగ్ ఘటన: మోనాలిసా పెయింటింగ్ ధ్వంసానికి యత్నం!
ప్యారిస్: సుప్రసిద్ధ కళాకృతి, ప్రపంచంలోనే పాపులర్ పెయింటింగ్ మోనాలిసాను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. కళా ప్రియులు, సందర్శకుల సమక్షంలోనే ఇది జరగడం గమనార్హం. వృద్ధురాలి గెటప్‌లో వీల్‌చైర్‌లో సందర్శనకు వచ్చిన ఓ యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. వీల్‌చైర్ నుంచి ఒక్కసారిగా బయటకు దూకి.. పెయింటింగ్ వైపు దూసుకెళ్లాడు. ఆపై కేక్‌ను పెయిటింగ్ మీదకు విసిరికొట్టాడు. అంతటితో ఆగకుండా మళ్లీ పెయింటింగ్ దగ్గరగా దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డులు అతన్ని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. అయితే పెయింటింగ్ మీద ఉన్న గ్లాస్‌కు ఆ కేక్ అంటడంతో పెయింటింగ్‌కు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. సుప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ గీసిన ఈ పెయింటింగ్.. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ప్రదర్శనకు ఉంది. ప్రస్తుతం దాడి వీడియో వైరల్ అవుతోంది. దాడికి పాల్పడిన వ్యక్తి పర్యావరణవేత్తగా తెలుస్తోంది. ఈ భూమిని కొందరు నాశనం చేయాలనుకుంటున్నారు అంటూ ఫ్రెంచ్‌లో అతను నినాదాలు చేయడం విశేషం. Can anybody translate what ole dude was saying as they where escorting him out?😂 pic.twitter.com/Uy2taZ4ZMm — Lukeee🧃 (@lukeXC2002) May 29, 2022 అతను పెయింటింగ్ ధ్వంసం కోసమే యత్నించాడా? లేదంటే కేక్ పూయడం ద్వారా నిరసన తెలపాలనుకున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సెక్యూరిటీ కళ్లు గప్పి అసలు కేకును అతను లోపలికి ఎలా తీసుకెళ్లడన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇదిలా ఉంటే.. మోనాలిసా పెయింటింగ్ ఇలా దాడులకు లక్ష్యంగా మారడం ఇదేం కొత్త కాదు. 1956లో ఓ ఆగంతకుడి సల్ఫ్యూరిక్ యాసిడ్ దాడిలో పెయింటింగ్ కింది భాగంగా.. బాగా డ్యామేజ్ అయ్యింది కూడా. అప్పటి నుంచి బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాసులో ఆ పెయింటింగ్‌ను భద్రపరిచారు. -
8 వేల ఏళ్ల నాటి ముత్యం
అబుధాబి: యూఏఈలోని మరవాహ్ ద్వీపంలో జరిపిన తవ్వకాల్లో అత్యంత ప్రాచీన ముత్యం బయల్పడింది. ఇది 8 వేల ఏళ్ల నాటి నియోలిథిక్ కాలానికి చెందిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్న లౌవ్రె అబుధాబి ఎగ్జిబిషన్లో ఈ ముత్యాన్ని ప్రదర్శించనున్నారు. ముత్యపు పొరలపై జరిపిన కార్బన్ డేటింగ్లో ఇది క్రీ.పూ 5800–5600 కాలానికి సంబంధించిందిగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. యూఏఈలో దొరికిన అత్యంత ప్రాచీన వస్తువు కూడా ఇదే కావడం గమనార్హం. -
పారిస్ లౌరీ మ్యూజియం మూసివేత
ఉత్తర యూరోప్ లోని బెల్జియం, జెర్మనీ, ఫ్రాన్స్ లలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్ రాజధాని పారిస్ గుండా ప్రవహించే సీన్ నది ప్రమాద స్థాయిలో ఉప్పొంగుతోంది. సాధారణ స్థాయి కంటే సుమారు ఆరు మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఫ్రాన్స్‌లో నదులు పొంగి ప్రవహిస్తుండడంతో అనేక చారిత్రాత్మక కట్టడాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పారిస్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత లౌరీ, ఆర్సే మ్యూజియంలను మూసివేస్తున్నట్టు ఫ్రెంచ్ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం ఒక ప్రకటనలోతెలిపింది. ఆ మ్యూజియాల్లో ఉన్న కళాఖండాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేదుకు వీలుగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. దక్షిణ పారిస్ లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గత వారం నుంచి కురుస్తున్న వానలు గురువారం మరింత భీకరంగా మారాయి. దీంతో ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఇప్పటివరకు 11 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే సూచనలు రావడంతో ఆయా యూరోప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. సుమారు 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సీన్ నది ప్రవాహ స్థాయి ఈ వారాంతంలో మరింత పెరగనుందని వాతావరణ శాస్త్రజ్ఞుడు ఎరిక్ సూచించారు. బెల్జియం, పోలాండ్ దేశాల్లోనూ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.