పారిస్ లౌరీ మ్యూజియం మూసివేత
ఉత్తర యూరోప్ లోని బెల్జియం, జెర్మనీ, ఫ్రాన్స్ లలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్ రాజధాని పారిస్ గుండా ప్రవహించే సీన్ నది ప్రమాద స్థాయిలో ఉప్పొంగుతోంది. సాధారణ స్థాయి కంటే సుమారు ఆరు మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఫ్రాన్స్‌లో నదులు పొంగి ప్రవహిస్తుండడంతో అనేక చారిత్రాత్మక కట్టడాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పారిస్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత లౌరీ, ఆర్సే మ్యూజియంలను మూసివేస్తున్నట్టు ఫ్రెంచ్ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం ఒక ప్రకటనలోతెలిపింది. ఆ మ్యూజియాల్లో ఉన్న కళాఖండాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేదుకు వీలుగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. దక్షిణ పారిస్ లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా గత వారం నుంచి కురుస్తున్న వానలు గురువారం మరింత భీకరంగా మారాయి. దీంతో ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఇప్పటివరకు 11 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే సూచనలు రావడంతో ఆయా యూరోప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. సుమారు 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సీన్ నది ప్రవాహ స్థాయి ఈ వారాంతంలో మరింత పెరగనుందని వాతావరణ శాస్త్రజ్ఞుడు ఎరిక్ సూచించారు. బెల్జియం, పోలాండ్ దేశాల్లోనూ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.