Seine river
-
పారిస్‌కు వరద ముప్పు
పారిస్, ఫ్రాన్స్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు వరద ముప్పు పొంచి ఉంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో నగరం గుండా వెళ్తున్న సీనే నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో వందల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదం జరిగితే ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని రోడ్లను ముందు జాగ్రత్తగా మూసివేశారు. సీనే నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటం ప్రజలను ఆందోళనలో పడేస్తోంది. మంగళవారం నది ఉప్పొంగి నీరు రోడ్లపైకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. విస్తారంగా కురిసిన వర్షాల కారణంగానే వరద ముప్పు వాటిల్లిందని పారిస్ అధికారులు వెల్లడించారు. సగటు వర్షపాతం ఈ ఏడాది సాధారణం కన్నా రెండు రెట్లు ఎక్కువగా నమోదైనట్లు చెప్పారు. వరద సంభవిస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యూజియం ‘లోవ్రో’లోకి కూడా నీరు వెళ్తుందని తెలిపారు. -
పారిస్ లౌరీ మ్యూజియం మూసివేత
ఉత్తర యూరోప్ లోని బెల్జియం, జెర్మనీ, ఫ్రాన్స్ లలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్ రాజధాని పారిస్ గుండా ప్రవహించే సీన్ నది ప్రమాద స్థాయిలో ఉప్పొంగుతోంది. సాధారణ స్థాయి కంటే సుమారు ఆరు మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఫ్రాన్స్‌లో నదులు పొంగి ప్రవహిస్తుండడంతో అనేక చారిత్రాత్మక కట్టడాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పారిస్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత లౌరీ, ఆర్సే మ్యూజియంలను మూసివేస్తున్నట్టు ఫ్రెంచ్ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం ఒక ప్రకటనలోతెలిపింది. ఆ మ్యూజియాల్లో ఉన్న కళాఖండాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేదుకు వీలుగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. దక్షిణ పారిస్ లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గత వారం నుంచి కురుస్తున్న వానలు గురువారం మరింత భీకరంగా మారాయి. దీంతో ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఇప్పటివరకు 11 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే సూచనలు రావడంతో ఆయా యూరోప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. సుమారు 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సీన్ నది ప్రవాహ స్థాయి ఈ వారాంతంలో మరింత పెరగనుందని వాతావరణ శాస్త్రజ్ఞుడు ఎరిక్ సూచించారు. బెల్జియం, పోలాండ్ దేశాల్లోనూ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
ప్రేమ వంతెనకు పారిస్
విహంగం అది ఫ్యాషన్‌కు పరాకాష్ట అయిన పారిస్ నగరం. ఆ పారిస్ నగరంలో సీయెన్ నది. ఆ నది మీద ఓ వంతెన. పేరు పాంట్ ద ఆర్ట్స్. ఈ వంతెన జనాన్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తరలించడంతో ఊరుకోదు. ప్రేమికుల మధ్య ప్రేమబంధాన్ని కలకాలం నిలబెడుతుంది. వంతెన మీద పాదచారులు నడవడానికి ఆసరాగా ఉండే రెయిలింగ్‌కు రకరకాల తాళాలు కనిపిస్తాయి. అవన్నీ ప్రేమికులు ప్రేమతో వేసినవే. తాళం కప్ప మీద తమ పేర్లు రాసుకుని వంతెన కమ్మీలకు దూర్చి తాళం వేస్తారు. తాళం చెవిని నదిలోకి విసిరేస్తారు. అంతే... అలా చేస్తే తమ ప్రేమబంధానికి తాళం వేసినట్లేనని వారి నమ్మకం. అలా తాళం వేస్తే ప్రేమికులు దూరం అవుతారేమోననే భయం అక్కర్లేదని వారి విశ్వాసం. ఇది సరదాగా ఉన్నట్లే అనిపిస్తోంది. కానీ ఈ విషయం విపరీతంగా ప్రాచుర్యంలోకి రావడంతో స్థానికులే కాక పారిస్ పర్యటనకు వచ్చిన వాళ్లు కూడా తాళాలు వేయడం మొదలుపెట్టారు. ప్రపంచప్రేమికుల ప్రేమ బరువు మోయలేక వంతెన చేతులెత్తేసింది. ఇప్పుడు ఇక తాళాలు వేయవద్దు బాబోయ్ అంటూ వేడుకుంటున్నారు నగర నిర్వహకులు. అయినా వారి కళ్లుగప్పి తాళాలు పడుతూనే ఉన్నాయి. వాటిని తొలగించే పని కూడా జరుగుతోంది. ఎంత చెప్పినా ఒక నమ్మకం బలపడిందంటే దానిని వదిలించడం అంత సులభం కాదు. ఆ నవలే రాకపోతే... ఇది నిజానికి ఫ్రెంచి వాళ్ల నమ్మకం కానే కాదు. 2006లో ఇటాలియన్ నవల ‘ఐ వాంట్ యు’ బుక్ ప్రచురితమైంది. అందులో ఇద్దరు రోమన్ ప్రేమికులు ప్రేమను పండించుకోవడానికి వంతెనకు తాళం వేయడాన్ని వర్ణించారు. అప్పటి నుంచి ఈ వేలంవెర్రి వెర్రితలలు వేసింది. తాళాల బరువుకు వంతెన వంగిపోసాగింది. అయినా తాళాలు పడడం ఆగలేదు. ఇక జూన్ నెలలో వంతెన ప్యానెల్స్ కూలిపోయాయి. దాంతో ప్రేమతాళాలను విప్పక తప్పలేదు. ఇంతకీ వంతెనకు వేసిన తాళాలెన్ని ఉంటాయనుకుంటున్నారు? 2014 చివరికి ఏడు లక్షల తాళాలు పడి ఉంటాయని అంచనా. వంతెనను కాపాడుకోవడానికి ‘తాళాలు వేయడానికి బదులు ప్రేమికులు ఈ వంతెన మీదకు వచ్చి ఒక సెల్ఫీ తీసుకుంటే చాలు. ప్రేమ నిలుస్తుంద’ని ప్రచారం మొదలుపెట్టారు. ‘లవ్ వితవుట్ లాక్స్’ ప్రచారం కూడా ఊపందుకుంటోంది. పారిస్‌లోనే కాదు! ఒక్క పారిస్‌లోనే కాదు. ఇలాంటి నమ్మకాలు చాలా దేశాల్లో ఉన్నాయి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం ఇష్టంలేక ప్రేమబంధాన్ని గట్టి చేసుకోమని ప్రోత్సహిస్తున్న నిర్మాణాలు కూడా ఉన్నాయి. సౌత్ కొరియాలో... సౌత్ కొరియాలోని డియాగులో ఉన్న సుసియాంగ్ సరస్సు కూడా ప్రేమికుల సెంటిమెంట్‌ను పండించే అడ్డానే. ఈ వంతెన మీద ఉండే రెయిలింగ్‌కు తాళాలు వేసి తాళం చెవిని నీటిలోకి విసిరేస్తారు. స్కాట్లాండ్లో... యు.కెలోని ‘మార్క్ యువర్ స్పాట్’ ఇలాంటిదే. ఫోర్త్ రోడ్ బ్రిడ్జి మీద ఏటా ప్రేమ వేడుకలు జరుగుతాయి. గత సెప్టెంబరులో 50వ సంవత్సరం వేడుకలు జరిగాయి కూడా. కొన్ని చోట్ల వంతెనలకు తాళాలు వేయడాన్ని నిషేధిస్తున్నారు. ఈ నిషేధం తాళాలకే కానీ ప్రేమకు కాదు.