ప్రేమ వంతెనకు పారిస్
విహంగం
అది ఫ్యాషన్‌కు పరాకాష్ట అయిన పారిస్ నగరం. ఆ పారిస్ నగరంలో సీయెన్ నది. ఆ నది మీద ఓ వంతెన. పేరు పాంట్ ద ఆర్ట్స్. ఈ వంతెన జనాన్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తరలించడంతో ఊరుకోదు. ప్రేమికుల మధ్య ప్రేమబంధాన్ని కలకాలం నిలబెడుతుంది. వంతెన మీద పాదచారులు నడవడానికి ఆసరాగా ఉండే రెయిలింగ్‌కు రకరకాల తాళాలు కనిపిస్తాయి. అవన్నీ ప్రేమికులు ప్రేమతో వేసినవే. తాళం కప్ప మీద తమ పేర్లు రాసుకుని వంతెన కమ్మీలకు దూర్చి తాళం వేస్తారు. తాళం చెవిని నదిలోకి విసిరేస్తారు. అంతే... అలా చేస్తే తమ ప్రేమబంధానికి తాళం వేసినట్లేనని వారి నమ్మకం.
అలా తాళం వేస్తే ప్రేమికులు దూరం అవుతారేమోననే భయం అక్కర్లేదని వారి విశ్వాసం. ఇది సరదాగా ఉన్నట్లే అనిపిస్తోంది. కానీ ఈ విషయం విపరీతంగా ప్రాచుర్యంలోకి రావడంతో స్థానికులే కాక పారిస్ పర్యటనకు వచ్చిన వాళ్లు కూడా తాళాలు వేయడం మొదలుపెట్టారు. ప్రపంచప్రేమికుల ప్రేమ బరువు మోయలేక వంతెన చేతులెత్తేసింది. ఇప్పుడు ఇక తాళాలు వేయవద్దు బాబోయ్ అంటూ వేడుకుంటున్నారు నగర నిర్వహకులు. అయినా వారి కళ్లుగప్పి తాళాలు పడుతూనే ఉన్నాయి. వాటిని తొలగించే పని కూడా జరుగుతోంది. ఎంత చెప్పినా ఒక నమ్మకం బలపడిందంటే దానిని వదిలించడం అంత సులభం కాదు.
ఆ నవలే రాకపోతే...
ఇది నిజానికి ఫ్రెంచి వాళ్ల నమ్మకం కానే కాదు. 2006లో ఇటాలియన్ నవల ‘ఐ వాంట్ యు’ బుక్ ప్రచురితమైంది. అందులో ఇద్దరు రోమన్ ప్రేమికులు ప్రేమను పండించుకోవడానికి వంతెనకు తాళం వేయడాన్ని వర్ణించారు. అప్పటి నుంచి ఈ వేలంవెర్రి వెర్రితలలు వేసింది. తాళాల బరువుకు వంతెన వంగిపోసాగింది. అయినా తాళాలు పడడం ఆగలేదు. ఇక జూన్ నెలలో వంతెన ప్యానెల్స్ కూలిపోయాయి. దాంతో ప్రేమతాళాలను విప్పక తప్పలేదు. ఇంతకీ వంతెనకు వేసిన తాళాలెన్ని ఉంటాయనుకుంటున్నారు? 2014 చివరికి ఏడు లక్షల తాళాలు పడి ఉంటాయని అంచనా.
వంతెనను కాపాడుకోవడానికి ‘తాళాలు వేయడానికి బదులు ప్రేమికులు ఈ వంతెన మీదకు వచ్చి ఒక సెల్ఫీ తీసుకుంటే చాలు. ప్రేమ నిలుస్తుంద’ని ప్రచారం మొదలుపెట్టారు. ‘లవ్ వితవుట్ లాక్స్’ ప్రచారం కూడా ఊపందుకుంటోంది.
పారిస్‌లోనే కాదు!
ఒక్క పారిస్‌లోనే కాదు. ఇలాంటి నమ్మకాలు చాలా దేశాల్లో ఉన్నాయి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం ఇష్టంలేక ప్రేమబంధాన్ని గట్టి చేసుకోమని ప్రోత్సహిస్తున్న నిర్మాణాలు కూడా ఉన్నాయి.
సౌత్ కొరియాలో...
సౌత్ కొరియాలోని డియాగులో ఉన్న సుసియాంగ్ సరస్సు కూడా ప్రేమికుల సెంటిమెంట్‌ను పండించే అడ్డానే. ఈ వంతెన మీద ఉండే రెయిలింగ్‌కు తాళాలు వేసి తాళం చెవిని నీటిలోకి విసిరేస్తారు.
స్కాట్లాండ్‌లో...
యు.కెలోని ‘మార్క్ యువర్ స్పాట్’ ఇలాంటిదే. ఫోర్త్ రోడ్ బ్రిడ్జి మీద ఏటా ప్రేమ వేడుకలు జరుగుతాయి. గత సెప్టెంబరులో 50వ సంవత్సరం వేడుకలు జరిగాయి కూడా. కొన్ని చోట్ల వంతెనలకు తాళాలు వేయడాన్ని నిషేధిస్తున్నారు. ఈ నిషేధం తాళాలకే కానీ ప్రేమకు కాదు.