friday
-
వరలక్ష్మి కృపకు ఆఖరి శుక్రవారం...ముఖ్యంగా పెళ్లికాని పడతులకు
మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతం శ్రావణమాసపు రెండో శుక్రవారం జరుపుకోవడం శాస్త్రంగా ఎంతో కాలం జరుగుతూ వస్తున్నది. అయితే ఏదైనా కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం కానీ, ప్రత్యేక పూజలు కానీ చేసుకోలేని వాళ్లకు ఆఖరి శుక్రవారం చివరి అవకాశంగా భావిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి, సకలశుభాలు కలగాలని ప్రార్థిస్తారు.చివరి రోజు మరింత ప్రత్యేకం..శ్రావణమాసం, శుక్రవారాలు ఎంత ప్రత్యేకమైనవో వేరుగా చెప్పక్కర్లేదు. అయితే శుభప్రదమైన శ్రావణమాసంలో చివరి వారం కావడంతో బోలెడంత సందడి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిల లక్ష్మీ దేవి పూజకు మరింత ప్రత్యేకమని చెప్పాలి. ఆఖరి రోజు వ్రతం చేస్తే:ఆఖరి రోజున ఉపవాసం పాటించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. ఈ రోజున యథావిధిగా రకరకాల పిండి వంటలు, క్షీరాన్నం, పళ్లు, పూలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ శుభసమయంలో శ్రీ యంత్రానికి పూజలు నిర్వహిస్తారు. రాత్రి నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ హ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే లక్ష్మి ఇంట్లో నివాసం ఉంటుందని నమ్మకం.అలాగే వరలక్ష్మి రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 11 పసుపు పిండి ముద్దలను లక్ష్మీదేవి పాదాలకు సమర్పించి, పూజ తర్వాత వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో ఉంచితే దీనివల్ల ఆర్థిక లబ్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. లక్ష్మీదేవికి కొబ్బరికాయ సమర్పించాలి. దీనివల్ల ఆర్థిక లబ్ది పొందే అవకాశం ఏర్పడుతుంది. పెళ్లికాని పడుచులకు వరం..పూజ చేసుకున్న వారి నుంచి తాంబూలం తీసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకు తొందరగా పెళ్లవుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. వరమహాలక్ష్మి వివిధ రూపాలలో కరుణిస్తుందని, అన్ని సమస్యలు తొలగిపోయి పెళ్లి జరిగేలా అనుకూలత ఇస్తుందని నమ్మకం. అందుకే కొన్ని ప్రాంతాలలో ఈ రోజు భక్తితో ఉపవాసం ఉండి, పూజ చేసుకుని ముత్తైదువుల నుంచి తాంబూలం అందుకుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. -
ఫ్రైడే ఫీలింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ వీడియో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. దేవుని సొంత దేశం వయనాడ్ వండరింగ్స్ అంటూ 'ఫ్రైడే ఫీలింగ్' అని ట్యాగ్ చేసారు. ఇందులో అందమైన ప్రకృతిలో ఏపుగా పెరిగిన చెట్లు, మధ్యలో రోడ్డు కనువిందు చేస్తాయి. ఈ వీడియోని ఇప్పటికి వేలమంది వీక్షించారు, కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: భారత్ నుంచి విదేశాలకు ఐఫోన్స్.. చరిత్ర సృష్టించనున్న టాటా గ్రూప్ ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి వయనాడ్. కేరళలోని వయనాడ్ పచ్చని వాతావరణం, పర్వతాలు, నదులతో సందర్శకులను మంత్ర ముగ్దుల్ని చేస్తాయి. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పురాతనమైన అలవాట్లు, ఆచారాలలు ఇప్పటికి కూడా కనిపిస్తాయి. Wayanad Wanderings. God’s own country. The stuff of an ideal weekend. #FridayFeeling pic.twitter.com/YqVgBbvj7g — anand mahindra (@anandmahindra) October 27, 2023 -
నేడు సీఎం జగన్ విజయవాడ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్‌కు సీఎం చేరుకుంటారు. అక్కడ నిర్వహించే ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్(ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం ఆయన తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
శ్రీవారి సన్నిధిలో పలువురు ప్రముఖులు..!
-
ట్విటర్ డీల్: మస్క్ మరోసారి సంచలన నిర్ణయం!
న్యూఢిల్లీ: ట్విటర్ కొనుగోలుకు సంబంధించి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి కీలక ప్రకటన చేశారు. 44 బిలియన్ల డాలర్ల ట్విటర్ డీల్‌ను అతి త్వరలోనే పూర్తి చేయనున్నారట. ట్విటర్ కొనుగోలుకు సంబంధిత నిధులు సమకూర్చుకుంటున్న మస్క్ శుక్రవారం నాటికి కొనుగోలును పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు సహ-పెట్టుబడిదారులకు మస్క్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. డీల్‌కు నిధులు సమకూర్చే బ్యాంకర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ట్విటర్ కొనుగోలు డీల్‌ను త్వరలోనే ముగించాలని మస్క్ నిర్ణయించినట్టు వార్త లొచ్చాయి. ముఖ్యంఆ సీక్వోయా క్యాపిటల్, బినాన్స్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ , ఇతరులతో సహా ఈక్విటీ పెట్టుబడిదారులు మస్క్ లాయర్ల నుండి ఫైనాన్సింగ్ కమిట్మెంట్కు సంబంధించిన పత్రాలను అందుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. డెలావేర్ కోర్టు న్యాయమూర్తి గడువు నేపథ్యంలో శుక్రవారం నాటికి లావాదేవీని పూర్తి చేసేలా మస్క్ ప్లాన్ చేస్తున్నాడని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే కొనుగోలు నిధులు సమకూర్చిన బ్యాంకులు తుది రుణ ఫైనాన్సింగ్ ఒప్పందాన్ని పూర్తి చేశాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అయితే తాజా పరిణామంపై, మస్క్ లాయర్లుగానీ, ట్విటర్ గానీ అధికారింగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. -
ఇళ్ల వద్దే శుక్రవారం నమాజ్
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణ కోçసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని తెలంగాణ వక్ఫ్‌బోర్డు సీఈఓ హమీద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గూమికూడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు మసీదుల్లో జరిగే శుక్రవారం నమాజులో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. మసీదులు శుక్రవారం నమాజుకు నోచుకోని పరిస్థితి ఉత్పన్నం కావద్దనే ఈ సడలింపునిస్తున్నామన్నారు. ముస్లింలందరూ ఇళ్ల వద్దే నమాజు చదువుకోవాలని, శుక్రవారం రోజు కూడా మసీదుకు రావొద్దని హైదరాబాద్‌లోని జామియా నిజామియా ఇస్లామిక్ వర్సిటీ ఉపకులపతి ఫత్వా జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు సీఈఓ గుర్తు చేశారు. ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఆడిటర్లకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులను మసీదు కమిటీలకు చేరవేయాలని కోరారు. -
వద్దన్న పాట
పదమూడేళ్ల వయసులో రెబెక్కా బ్లాక్ పాడిన ‘ఫ్రైడే’ అనే పాటను ప్రపంచం తిరస్కరించింది! పాపం చిన్న పిల్ల కదా అని సరిపెట్టుకోకుండా ఛీ కొట్టింది. నీ ముఖం అంది. ‘ది వరస్ట్ సాంగ్ ఎవర్’ గా ఆ పాట లోక‘ప్రసిద్ధి’ చెందింది. రెబెక్కా ఆడి, పాడిన ఆ సింగిల్ సాంగ్ వీడియో పుట్టి తొమ్మిదేళ్లు. తొమ్మిదేళ్లుగా లోకం తిడుతున్న తిట్లను భరిస్తూనే జీవితాన్ని ప్రేమించడం నేర్చుకుంది రెబెక్కా. తిరస్కారాల నుంచే తనను తనను మలుచుకుంది. వద్దన్న పాట నుంచే భవిష్యత్తుకు కొత్త స్వరాలను సమకూర్చుకుంది. ప్రేమ దక్కని వాళ్లు చేయవలసిన పని ఇదే. జీవితానికి దగ్గరవడం. మాధవ్ శింగరాజు కొంచెం టైముందా! లేక.. ‘గాట్టా బి ఫ్రెష్. గాట్టా గో డౌన్‌స్టెయిర్స్.. ఇట్స్ ఫ్రైడే..’ మూడ్‌లో ఉన్నారా.. బెడ్రూమ్లోంచి దిగెళ్లి పళ్లు తోముకుని.. ఇంత తిని.. శుక్రవారపు సోమరి పరిమళాలను అందుకుని కిటికీలోంచి గాల్లో తేలిపోడానికి! ఇట్స్ వాలెంటైన్స్ డే కూడా కదా. ఎవరికీ అందకండి. ఇది మీ లైఫ్. శుక్ర–శని–ఆది.. మీదే లైఫ్. తర్వాతెలాగూ మీ లైఫ్ మీ బాస్‌ది. మీ లైఫ్ మీ ప్రిన్సిపాల్ది. మీ లైఫ్ మీ హెడ్మాస్టర్ది. ఒక్కమాట. వెళ్తూవెళ్తూనైనా యూట్యూబ్‌లో రెబెక్కా బ్లాక్ – ఫ్రైడే అని కొట్టి చూడండి. పదమూడేళ్ల అమ్మాయి తొమ్మిదేళ్ల క్రితం పాడిన వీడియో సాంగ్ అది. ఆమెను స్మరించుకుంటూ ప్రేమికుల రోజున ఈ పాటను చూడమని కాదు. ఆమె నిక్షేపంగా ఉన్నారు తన ఇరవై రెండేళ్ల వయసులో. రెబెక్కా బ్లాక్ తన పేరు. ‘ఫ్రైడే’ ఆ పాట పేరు. 3 నిముషాల 47 సెకన్లు ఉంటుంది. వాలెంటైన్స్ డే రోజు అంత టైమ్‌ని వృ«థా చెయ్యడం అన్యాయమే. బయట గులాబీ పూలకాడలు అయిపోయాయంటే.. వట్టి చేతుల్తో వెళ్లి ఐలవ్యూకి ముందు సారీ చెప్పాల్సి వస్తుంది. సారీ కూడా ప్రేమ సిలబస్‌లో ఒక చాప్టరే. అలాగని బుంగమూతిని తెరిపించే పూలగుత్తేమీ కాదు కదా ‘సారీ’. వీడియో చూడకున్నా పర్లేదు. పైపై డీటెయిల్స్ చూడండి. పది లక్షలా పది వేల లైక్‌లు కనిపిస్తాయి. పక్కనే చూడండి. ముప్ఫై లక్షల అరవై వేల డిస్‌లైక్‌లు ఉంటాయి! రేటింగ్ చూడండి. ‘నో మెచ్యూర్ కంటెంట్’ అని ఉంటుంది. ఇక పాట చూడ్డానికేముంటుంది! చూసినా ఏం ఉంటుంది? ∙∙ ‘7 ఎ.ఎం. వేకింగ్ అప్ ఇన్ ది మార్నింగ్ గాట్టా బి ఫ్రెష్.. గాట్టా గో డౌన్ స్టెయిర్స్.. గాట్టా గెట్ డౌన్ టు ద బస్ స్టాప్.. గాట్టా క్యాచ్ మై బస్.. ఐ సీ మై ఫ్రెండ్స్..’ పాటంతా ఇదే తొందర. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవాలన్న ఓ పదమూడేళ్ల అమ్మాయి తొందర.. రెబెక్కా బ్లాక్ ‘ఫ్రైడే’ సాంగ్ థీమ్. జీవితాన్ని ప్రేమిస్తే జీవితం మన చుట్టూ తిరుగుతుంది. వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి చుట్టూ మనం తిరగాల్సి వస్తుంది. రెబెక్కా బ్లాక్.. జీవితాన్ని ప్రేమించింది. ప్రేమించి ఊరుకోలేదు. పాటతో ఆ ప్రేమను చూపించింది. ఎవరికీ అర్థం కాలేదు. ఇదేం పాట అన్నారు! ఇది పాటా అన్నారు. పాటలో కీట్స్ లేడు. షెల్లీ లేడు. బైరన్ లేడు. కనీసం కుర్రవృద్ధుడు జస్టిన్ బీబర్ లేడు. అసలు పొయెట్రీనే లేదు. శుక్రవారం రాగానే లేవడం, పార్టీలకు పరుగెత్తడం. ఏముంది ఇందులో? లోకం నిక్కచ్చి మాస్టారు. పదమూడేళ్ల పిల్లయినా గెలిచే తీరాలంటుంది. గెలవలేకపోతే ‘ఈ లోకంలోకి ఎందుకొచ్చావ్?’ అని అడుగుతుంది. పాడింది మాత్రమే రెబెక్కా. తన ఫీలింగ్స్‌ని వేరెవరికో చెప్పి తనకు కావలసినట్లు పాటను రాయించుకుంది. ప్రపంచంలోని ఒక్క లిరిక్ లవర్‌కి కూడా ఈ పాట నచ్చలేదు. పూర్ గర్ల్ అన్నారు. ‘ఎస్టర్డే వాజ్ థర్స్డే.. టుడే ఈజ్ ఫ్రైడే.. టుమారో ఈజ్ శాటర్ డే’ అని పాడుతుంది రెబెక్కా.. పాటలో ఓ చోట. ‘డే ఆఫ్టర్ టుమారో సండే కదా.. హహహా.. ఈ పిల్లలో విషయం లేదు. కసిగా ఏదో అవ్వాలనుకుని లోకం మీద విసురుగా పడింది’ అని కామెంట్స్. సిస్టమ్‌ని షట్ డౌన్ చేసేస్తే ఈ కామెంట్స్ అన్ని మాయమౌతాయి. కానీ స్కూల్ మాయమౌతుందా? సెలవులొచ్చే వరకు ఆన్‌లోనే ఉంటుంది. సెలవులయ్యాక మళ్లీ స్కూల్. పాటను యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసిన రోజు మొదలైన వెవ్వెవ్వేలు రెబెక్కాను టీనేజ్ అంతా వెంటాడాయి. స్కూల్లో టీచర్లు కూడా ఆమెను చూసి నోటికి చెయ్యి అడ్డుపెట్టి నవ్వుకున్నారు. ముడుచుకుపోయింది. స్కూల్లో పదిహేనవ యేట ఆమెతో మాట్లాడేవాళ్లు తగ్గిపోయారు. డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. కాలేజ్‌లో పదిహేడవ యేట.. అప్పుడే రెబక్కా ‘ఫ్రైడే’ను చూసి వచ్చినవాళ్లెవరో.. తింటున్న పీజాలు, బర్గర్లు ఆమె మీద విసిరేశారు. సగం చచ్చిపోయింది. పందొమ్మిదో యేట మ్యూజిక్ ప్రొడ్యూజర్లు, సాంగ్ రైటర్లు నిన్నసలు ఎప్పటికీ తీసుకునేదే లేదనేశారు. ఇంటికొచ్చి ఏడ్చేసింది రెబెక్కా. రోజూ ఏడుస్తూనే ఉంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఒకటే ఏడుపు. తలుపులు వేసుకుని ఒంటరిగా ఏడుపు. అమ్మకు చెప్పలేదు. నాన్నకు చెప్పలేదు. ∙∙ టీనేజ్ దాటుతుండగా రెబెక్కా ఓ రోజు అద్దంలో తనని తను పరిశీలనగా చూసుకుంది. ఏడ్చినట్లుంది. తనేం ఏడ్వడం లేదు. కానీ ఏడ్చినట్లే ఉంది! కన్నీళ్లొస్తే చేతులతో తుడుచుకుంటాం. ఏడుపే రాకుండా కన్నీళ్లు కనిపిస్తుంటే.. తుడుచుకోవలసింది కళ్లను కాదు. కళ్లు మూసినా, కళ్లు తెరిచినా తనను ఏడిపిస్తున్న లోకాన్ని! అవును.. లోకాన్ని తన కళ్ల ముందు నుంచి తుడిచేయాలి. కళ్లు మూసుకుంది రెబెక్కా. రెప్పల మాటున అంతవరకు ఉంటూ వచ్చిన అవమానాలన్నీ ఒకటొకటిగా అదృశ్యం అయిపోవడం మొదలైంది. చివరికొక రూపం మిగిలింది. ఆ రూపం రెబక్కాదే. రెబక్కా అందంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ఉంది. ఒక కొత్త పాట కోసం తనని తను ట్యూన్ చేసుకుంటోంది! ఈ ఫిబ్రవరి 10 కి రెబెక్కా పాట ‘ఫ్రైడే’.. పదవ సంవత్సరంలోకి ప్రవేశించింది. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న పోస్ట్ పెట్టింది రెబెక్కా. ‘మీరేమిటన్నది మీ గురించి మీకేం తెలుసో అదే కానీ.. మీ గురించి ఎవరేమనుకుంటున్నారో అది కాదు మీరు’ అని. ఇంకా చాలా రాసింది. వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయ్యాక.. ఈ సాయంత్రం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆ పోస్ట్‌ను చదవండి. మీరు జీవితాన్ని ప్రేమిస్తున్నారో, వ్యక్తిని ప్రేమిస్తున్నారో మీ కనురెప్పల లోపలి స్క్రీన్‌పై కనిపిస్తుంది. తర్వాత మీరు.. రెబెక్కా ఇన్నేళ్లలోనూ సొంతంగా, ఎవరి సహాయమూ లేకుండా చేసిన మిగతా సింగిల్స్‌ని (సింగిల్ సాంగ్స్) కూడా వెతకడం మొదలు పెడతారు. ఆమెదే కొద్దిగా ఫిల్మోగ్రఫీ ఉంది. డిస్కోగ్రఫీ ఉంది. అన్నీ తనకు తానుగా చేసుకున్నవే. జీవితాన్ని ప్రేమించేవారు ఏదైనా సొంతంగా చేసుకోగలరు. దేన్నయినా సొంతంగా సాధించగలరు. మన జీవితమే మనకు వాలంటైన్. -
శుక్రవారం... మధ్యాహ్నం మాత్రమే!
సాక్షి, సిటీబ్యూరో: కేవలం శుక్రవారం... అది కూడా మధ్యాహ్నం పూట... ప్రార్థనలకు వెళ్లే యజమానుల దుకాణాలే టార్గెట్... సగం దింపిన షట్టర్‌ను ఎత్తి ఏది దొరికితే అది ఎత్తుకుపోతారు... ఈ పంథాలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోని ఠాణాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులకు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి వాహనం, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం తెలిపారు. పాతబస్తీ, ఫలక్‌నుమా పరిధిలోని వట్టేపల్లికి చెందిన మహ్మద్ అక్రమ్ వెల్డింగ్ వర్కర్‌గా, మహ్మద్ పాషా కూలీగా పని చేసేవారు. దురలవాట్లకు బానిసైన అక్రమ్ అందుకు అవసరమైన డబ్బు సంపాదించడానికి కొన్నాళ్ల క్రితం నుంచి చోరీలు చేయడం మొదలెట్టాడు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల కోసం వెళ్లే వ్యాపారులు తమ దుకాణాల షట్టర్స్ సగం వరకే కిందికి దించుతుంటారు. దీనిని గుర్తించిన అక్రమ్ ఆయా షాపుల్లోకి దూరి అందినకాడికి నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లేవాడు. తస్కరించిన నగదుతో పాటు చోరీ వస్తువుల్ని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. గతంలో అతడిపై షాహినాయత్‌గంజ్, కుల్సుంపుర, మైలార్‌దేవ్‌పల్లి ఠాణాల పరిధిల్లో కేసులు నమోదయ్యాయి. అక్రమ్‌ను అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. 2018 జూన్‌లో జైలు నుంచి బయటికి వచ్చిన అతను ఏడాది తర్వాత భవానీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇదే తరహాలో మరో చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ ఏడాది అక్టోబర్ 1న జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా తన పంథా మార్చుకోని అక్రమ్ ఈసారి ముఠా కట్టి పంజా విసరాలని భావించాడు. తన స్నేహితుడైన పాషాకు విషయం చెప్పడంతో సహకరించడానికి ముందుకు వచ్చాడు. ఆ నెల మొదటి వారంలో తన స్నేహితుడు ఖాలీద్‌తో కలిసి రెండు రోజుల పాటు బీదర్‌లో ‘పర్యటించిన’ అక్రమ్ ఓ ద్విచక్ర వాహనం చోరీ చేసి తీసుకువచ్చాడు. పాషాతో కలిసి దీనిపై తిరుగుతూ నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరూ కలిసి చోరీ బైక్‌పై సంచరిస్తూ ఓ చెత్త వాహనం డ్రైవర్‌ను గమనించారు. అతడు తన ఫోన్‌ను వాహనం సీటుపై ఉంచి ఇంట్లోకి వెళ్లడాన్ని గుర్తించిన వీరు ఫోన్ తస్కరించారు. నిందితులు అక్రమ్, పాషా అదే నెల ఆఖరి వారంలో అదే చోరీ బైక్‌పై టోలిచౌకి ప్రాంతంలో సంచరించారు. ఆ సమయంలో నవాజ్ చికెన్ షాప్ షట్టర్ సగం దించిన యజమాని ప్రార్థనల కోసం వెళ్లారు. దీనిని గమనించిన అక్రమ్ వాహనాన్ని కొద్దిదూరంలో ఆపాడు. పాషాను దాని సమీపంలోనే ఉంచి యజమాని రాకను గమనించమని చెప్పాడు. అక్రమ్ నేరుగా దుకాణంలోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.85 వేల నగదు, సెల్‌ఫోన్ చోరీ చేశాడు. ఈ డబ్బును ఇద్దరూ కలిసి ఖర్చు చేశారు. ఈ రెండు ఉదంతాలకు సంబం«ధించి బాధితుల ఫిర్యాదుతో స్థానిక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. వీటిని ఛేదించేందుకు పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు మహ్మద్ ముజఫర్, పి.మల్లికార్జున్, ఎన్.రంజిత్‌కుమార్‌లతో కూడిన బృందం చోరీ జరిగిన దుకాణం సమీపంలోని సీసీ కెమెరాల ఫీడ్‌ను సేకరించి అధ్యయనం చేసింది. ఫలితంగా అనుమానితుల జాడ తెలియడంతో లోతుగా దర్యాప్తు చేసింది. ఆదివారం అక్రమ్, పాషాలను పట్టుకుని వాహనం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను గోల్కొండ పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ తెలిపారు. -
శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు
-
అసలే 13...ఆపైన శుక్రవారం
జనాలకు కొన్ని వింత నమ్మకాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లి ఎదురొచ్చినా, ఎవరైనా తుమ్మినా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం వంటివి. ఇలానే ప్రజల్లో ఇంకా చాలా మూఢ నమ్మకాలే ఉన్నాయి. ఒక్కోసారి ఏమైనా సంఘటనలు యాధృచ్చికంగా ఏర్పడినా.. అవి ఈ మూఢ నమ్మకాల వల్లే ఏర్పడ్డాయని కొందరు భావిస్తుంటారు. ఇలాంటి నమ్మకాల వల్ల కొన్ని సార్లు మంచి జరుగుతుంది, కొన్ని సార్లు చెడు జరుగుతుంది. అలాంటి ఒక వింత నమ్మకమే 13ను దురదృష్టంగా భావించడం. అవును ప్రపంచంలో చాలా దేశాల్లో 13ను దురదృష్ట సంఖ్యగా నమ్ముతారట. అలాంటి 13 వ తారీఖు కనుక శుక్రవారం వస్తే దానంత దరిద్రమైన రోజు మరొకటి ఉండదని అనుకుంటారట. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఈ రోజు శుక్రవారం 13వ తేదీ. 13వ తేదీని ఎందుకు దురదృష్ట సంఖ్యగా చెబుతారో సరైన కారణాలు తెలియదు కానీ, ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే.. ఏసు క్రీస్తును సిలువ వేయడానికి ముందు రోజు జరిగిన ముఖ్య ఘట్టం లాస్ట్ సప్పర్. దీనిలో పాల్గొన్నవారు 13 మంది. ఆ మరుసటి రోజు అనగా శుక్రవారం క్రీస్తును సిలువ వేశారు. ఆ రోజున ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. ఇటువంటి బాధకరమైన సంఘటనలు జరిగాయి కాబట్టే ఏ నెలలోనైనా ఈ రెండు కలిసి వస్తే అంటే 13వ తేదీ శుక్రవారం వస్తే ఆ రోజు తప్పకుండా ఏదైనా చెడు జరుగుతుందని బఫ్ఫేలోని ఓ విశ్వవిద్యాలయంలో ఆంత్రాపాలజీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఫిల్ స్టివెన్స్ తెలిపారు. ఏజేసీ.కామ్‌లోని యూదుల ఇస్కారియట్ ప్రకారం క్రీస్తును మోసం చేసి సైనికులకు అప్పగించిన శిష్యుడు భోజన బల్ల వద్ద 13వ స్థానంలో కూర్చున్నాడని.. అందుకే 13 అనే అంకెను చెడు సంఖ్యగా భావిస్తారని తెలిసింది. కారణాలు ఏవైనా చాలా మంది మాత్రం 13 సంఖ్యను దురదృష్టంగా భావిస్తారు. ఆ తేదీన ఎవ్వరూ గృహప్రవేశం చేయరు. పెద్ద పెద్ద భవనాలలో కూడా 13వ నంబరు అంతస్తు ఉండదు. ఒకవేళ 13వ అంతస్తు ఉన్నా.. ఆ మొత్తం అంతస్తును ఖాళీగా ఉంచుతారు. ఆ రోజున ఎవరూ వివాహం కూడా చేసుకోరు. గతంలో కూడా 13వ తేదీ శుక్రవారం వచ్చిన సందర్భాల్లో అనేక అనూహ్యమైన చెడు సంఘటనలు సంభవించాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే కొంతమంది 13వ తేదీ, శుక్రవారం రెండు కలసిరావడం చాలా అదృష్టంగా భావిస్తారట. ఏదైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటుందని, కాబట్టి ఈ రోజంతా మంచి జరగాలని ఆశించి, రోజు చివరలో ఏం జరిగిందో విశ్లేషించుకోండని అంటున్నారు న్యూమరాలజిస్ట్‌లు. మరో విషయం ఏంటంటే నేడు శుక్రవారం 13వ తేదీ అనంతరం ఈ ఏడాదిలో జూలై నెలలో కూడా 13వ తేదీ శుక్రవారంతో కలిసి రాబోతోంది. మరి ఈ రెండు రోజుల్లో ఏమైనా వింత విశేషాలు జరుగుతాయేమో చూడాలి. -
పాహిమాం...
జిల్లా వ్యాప్తంగా శ్రావణ మాసం మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్థలతో ఆచరించారు. అమ్మవారి ఆలయాలు వేకువ జాము నుంచే కిక్కిరిసిపోయాయి. కుంకుమ పూజలు చేసి ముత్తైదువలకు వాయినాలు అందజేశారు. జిల్లాలో ప్రధాన ఆలయాలైన అన్నవరంలోని వనదుర్గ అమ్మవారు, ద్రాక్షారామం, పాదగయ తదితర ఆలయాలు కిటకిటలాడాయి. -
బాసర సరస్వతీ ఆలయంలో అపచారం
-
విద్యారంగంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో విద్యారంగాన్ని పటిష్టం చేసి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలపడానికి డీఈఓ కృషి చేయాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు కోరారు. డీఈఓ ఆర్ఎస్ గంగాభవానీకి రాష్ట్రస్థాయి అవార్డు లభించిన సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గంగాభవానీని కలసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విద్యా ప్రమాణాలతో కూడిన కార్యక్రమాలు నిర్వహించి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యాశాఖ ఏడీ ఏవీ వెంకటరమణ, సూపరింటెండెంట్లు పురుషోత్తం, అజీజ్, రీజనల్ స్పోర్ట్స్ కో– ఆర్డినేటర్ పీఎస్ సుధాకర్, పాండు రంగారావు, డి.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల పెంపు
కొవ్వూరు : పశ్చిమ డెల్టా కాలువకు సాగు నీటి అవసరాల నిమిత్తం మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గురువారం పశ్చిమ డెల్టా కాలువలకు నీరు విడుదల చేశారు. మొదటి రోజు కావడంతో తొలుత 100 క్యూసెక్కులు, దశలవారీగా 500 క్యూసెక్కులకు పెంచారు. శుక్రవారం ఉదయం రెండు వేల క్యూసెక్కు లు విడుదల చేసిన అధికారులు క్రమేణా సాయంత్రానికి మరో వెయ్యి క్యూసెక్కులు పెంచి విడుదల చేస్తున్నారు. శనివారం నుంచి ఏ కాలువకు ఎంత నీరు విడుదల చేస్తున్నామో షెడ్యూలు వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 3,400 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. దీనిలో తూర్పు, సెంట్రల్ డెల్టాలకు రెండు వందల క్యూసెక్కుల చొప్పున, పశ్చిమ డెల్టాకు 3 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం సాయంత్రం నీటిమట్టం 13.78 అడుగులుగా నమోదైంది. ఆనకట్ట నీటిసామర్థ్యం కంటే అదనంగా నీరు నిల్వ ఉండడంతో ధవళేశ్వరం ఆర్మ్‌లో ఐదు గేట్లు, విజ్జేశ్వరం ఆర్మ్‌లో మూడు గేట్లను 0.20 మీటర్లు ఎత్తులేపి 4,825 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. -
దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి
ఏలూరు అర్బన్ : వేసవిలో చల్లగాలి కోసం చాలామంది ప్రజలు ఇళ్ల బయట, డాబాల పైన పడుకునే సమయంలో ఇళ్లకు తాళాలు వేసుకోకుంటే దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ హెచ్చరించారు. శుక్రవారం ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎస్పీ ప్రజలతో నేరుగా ఫోన్ లో మాట్లాడారు. సమస్యలు విని సంబంధిత అధికారులకు ప్రజల ఫిర్యాదులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో ఇళ్ల దొంగతనాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. వాటిని నిరోధించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. అయితే దొంగతనాలు అడ్డుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. దానిలో భాగంగా ఇళ్ల బయట, డాబాల పైన పడుకునే సమయంలో తలుపులకు తాళాలు వేసుకోవడంతో పాటు సాధ్యమైనంత వరకూ ఇళ్లలో విలువైన నగలు, పెద్దమొత్తంలో నగదు ఉంచుకోవద్దని సూచించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులంతా ఇళ్లకు తాళాలు వేసుకుని పొరుగూరు వెళ్లే క్రమంలో సదరు విషయాన్ని సంబంధిత పోలీస్‌స్టేషన్ లో తెలిపితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 28 మంది ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అందులో కొన్ని ఇలా ఉన్నాయి. తణుకు నుంచి ఫోన్ చేసిన వ్యక్తి పట్టణంలో క్రికెట్ బెట్టింగ్, బైక్ రేసింగ్‌లు జరుగుతున్నాయని నిరోధించాలని కోరాడు. ఏలూరు నుంచి ఫోన్ చేసిన వ్యక్తి తంగెళ్లమూడి ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ వద్ద ఆకతాయిల ఆగడాలను నిరోధించాలని ఫిర్యాదు చేశాడు. చింతలపూడి నుంచి ఫోన్ చేసిన వ్యక్తి పట్టణంలో కోడి పందేలు, పేకాటలు పెద్దఎత్తున జరుగుతున్నాయని, వాటిని పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. -
‘యనమదుర్రు’ ప్రక్షాళనకు చర్యలు
భీమవరం టౌ న్ : యనమదుర్రు డ్రెయి న్ ప్రక్షాళన దిశగా జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దృష్టి సారించారు. యనమదుర్రు డ్రెయి న్ జలాలు నిర్జీవంగా మారడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో యనమదుర్రు డ్రెయి న్ ను ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గొంతేరు డ్రెయి న్ ను మరో యనమదుర్రు కానివ్వబోమని గోదావరి మెగా ఆక్వాఫుడ్పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ ఉద్యమిస్తున్న నేపథ్యంలో గతనెల 25న భీమవరంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శిక్షణ పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. యనమదుర్రు డ్రెయి న్ ప్రక్షాళనకు ప్రణాళిక సిద్ధం చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు, రైతులు ఇలా అన్ని వర్గాల నుంచి యనమదుర్రు డ్రెయి న్ కాలుష్యానికి పరిశ్రమలు, మున్సిపాలిటీలు గ్రామాల నుంచి వస్తున్న మురుగు, చెత్త కారణమంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు పర్యావరణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావుతో కలిసి యనమదుర్రు డ్రెయి న్ ను పరిశీలించారు. ట్రీట్మెంట్ ప్లాంట్లపై చర్చ యనమదుర్రు డ్రెయి న్ లో మురుగునీరు కలిసే చోట సావేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎక్కడెక్కడ అవసరమో పరిశీలించారు. దెయ్యాలతిప్ప ప్రాంతంలో, భీమవరం పట్టణం రెస్ట్‌హౌస్ రోడ్డు శివారు గంగానమ్మ గుడి ప్రాంతంలో, అందరికీ ఇళ్లు నిర్మాణానికి కేటాయించిన 82 ఎకరాల స్థలం వద్ద ఎస్టీపీలు నిర్మాణంపై చర్చించారు. అమృత్ పథకంలో 5 ఎంఎల్డీ ఎస్టీపీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు వివరించారు. మరో 5 ఎంఎల్డీ ఎస్టీపీ నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు బృందం యనమదుర్రు డ్రెయి న్ లో మురుగు కలుస్తున్న ప్రాంతాల ఫొటోలు తీసుకున్నారు. డ్రెయి న్ ప్రక్షాళనకు సంబంధించి మున్సిపల్ అధికారులతో చర్చించారు. మున్సిపల్ డీఈ శ్రీకాంత్, టౌ న్ ప్లానింగ్ అధికారులు వారి వెంట ఉన్నారు. -
చిన వెంకన్నకు కల్యాణ శోభ
ద్వారకాతిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో వేంకటేశ్వర స్వామి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు శుక్రవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. చినవెంకన్న భక్తులకు శ్రీమహావిష్ణువుగా దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామి నుదిటిన కల్యాణ తిలకం, బుగ్గనచుక్కతో పెళ్లి కూమారుడిగా శోభిల్లారు. పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు పెళ్లి కుమార్తెలుగా ముస్తాబయ్యారు. ఆలయ పండితులు, అర్చకులు ఈ తంతును వైభవోపేతంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణలతో చిన వెంకన్న క్షేత్రం మార్మోగింది. వేదికపై ఏర్పాటు చేసిన రజత సింహాసనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ వేడుకలను తిలకించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాథరావు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గజ వాహనంపై ఊరేగిన శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మెుదటి రోజున జరిగే గజ వాహన సేవకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. స్వామి వైభవాన్ని చాటే ఈ వాహనసేవను శుక్రవారం రాత్రి క్షేత్ర పురవీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. రాజగోపురం మీదుగా పుర వీధులకు పయనమైన స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రీహరికళాతోరణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. -
ఉద్యోగులు ప్రజలతో మమేకం కావాలి
ఏలూరు (మెట్రో) : ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న వ్యతిరేక భావం పోవాలంటే ఉద్యోగులు ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించాలని, వారితో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఏపీ ఎన్జీవోలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ కొందరు ఉద్యోగుల పట్ల ప్రజల్లో సరైన అభిప్రాయం లేదని పదిమందికీ మేలు చేసే కార్యక్రమాల్లో కొన్ని విషయాలు ఇబ్బంది అనిపించినా కష్టపడి పనిచేసి ప్రజలకు సేవ చేస్తే పరవాలేదన్నారు. వ్యక్తి కోసం చట్టాన్ని అతిక్రమించి ఎవరు పనిచేసినా సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా శాఖా పరంగా ఇబ్బందులు పడుతుంతే తన దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. జిల్లా ఎన్జీవో అధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్ మాట్లాడుతూ అన్ని శాఖల ఉద్యోగులూ కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆర్.సూర్యారావు, ఎన్జీవో నాయకులు చోడగిరి శ్రీనివాస్, రమేష్‌కుమార్, శ్రీధర్, సత్యనారాయణ, ఐవీఎస్‌ఎన్ రాజు పాల్గొన్నారు. న్యాయమూర్తి గోపి బాధ్యతల స్వీకరణ ఏలూరు(సెంట్రల్) : జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా జి.గోపి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయనను ఇటీవలే జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ చేశారు. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఆటో బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
కైకరం (ఉంగుటూరు) : జాతీయ రహదారిపై కైకరం వద్ద శుక్రవారం తెల్లవారు జూమున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి, డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ సమీపంలోని భవానీపురానికి చెందిన ఆకుమళ్ల రమణారెడ్డి(29) గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆటోలో వాషింగ్మెషీన్లు, కూలర్లలోడుతో తణుకు బయలుదేరాడు. మార్గ మధ్యలో కైకరం వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొని కొంత దూరం ఈడ్చుకుపోయింది. డ్రైవర్ రమణారెడ్డి అక్కడక్కిడే మృతిచెందాడు. చేబ్రోలు ఎస్సై చావా సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వ్యాయామ కళాశాలకు మినీ స్టేడియం
దెందులూరు : రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలకు మరోసారి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. కళాశాలకు మినీ స్టేడియం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వక ఆదేశాలను జారీ చేసింది. కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మ న్ మాగంటి నారాయణ ప్రసాద్ శుక్రవారం మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, అధికారుల కృషి, సహాయ, సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం మినీ స్టేడియం మంజూరు చేసిందని తెలిపారు. స్టేడియం మంజూరు ద్వారా వ్యాయామ కళాశాలకు మరింత కీర్తి ప్రతిష్టలు రావటమే కాకుండా, శిక్షణ పొందే వ్యాయామ అధ్యాపక విద్యార్థినీ, విద్యార్థులకు మరెంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. తన సొంత వ్యయంతో కళాశాలలో రెండో సంవత్సరం వ్యాయామ విద్యనభ్యసిస్తున్న ఐదుగురికి ప్రతి సంవత్సరం ఫీజులు చెల్లిస్తానన్నారు. ఇంట్రామ్యూరల్ ఆటల పోటీలు ప్రారంభం.. వ్యాయామ కళాశాలలో శుక్రవారం ఇంట్రామ్యూరల్ ఆటల పోటీలను కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మ న్ మాగంటి నారాయణ ప్రసాద్ ప్రారంభించారు. ఇంట్రామ్యూరల్ డైరెక్టర్ వి.శ్యామలా ఆధ్వర్యంలో జరిగిన ఆటల పోటీల్లో 16 గ్రూపులకు చెందిన డీపీఈడీ, బీపీఈడీ వ్యాయామ అధ్యాపక విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కో గ్రూపులో 25 మంది ఉన్నారు. ఈ సందర్భంగా చైర్మ న్ మాగంటి మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరం శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వెళుతున్న వ్యాయామ అధ్యాపకులు పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో వ్యాయామ అభివృద్ధి, రాష్ట్ర, జాతీయ స్థాయి విభాగాల్లో ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాలన్నారు. తొలుత వాలీబాల్ సర్వీస్ చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. అధ్యాపక విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన రోప్ స్కిప్పింగ్ ఆకర్షణ గా నిలిచింది. -
చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు
పెదనిండ్రకొలను (నిడమర్రు): సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ విమర్శించారు. శుక్రవారం పెదనిండ్రకొలనులో జరిగిన గడప గడపకూ వైఎస్సార్‌లో ఆయన పాల్గొని స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరిపై పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. పాలనపై అసహనంతో ఉన్న యువత సోషల్ మీడియా ద్వారా తమ భావాలను ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. అది కూడా నేరంగా వారిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని సోషల్ మీడియా ద్వారా ఖండిస్తే ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్‌పై వస్తున్న సోషల్ మీడియా పోస్టులపై యువత స్పందన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. పొలిటికల్ సెటైర్ డిజైనర్ అరెస్ట్ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉందన్నారు. మే 1,2 తేదీల్లో జగన్ దీక్ష మద్దతు ధర లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, వారి సమస్యలపై జగన్ పోరాడతారని భరోసా ఇచ్చారు. వచ్చే నెల 1,2 తేదీల్లో గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఈనెల 26, 27 తేదీల్లో జరగాలి్సన దీక్ష వాయిదాపడిందన్నారు. రైతు దీక్షకు అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. శ్రీధర్ వెంట ఆపార్టీ ఉంగుటూరు కన్వీనర్ పుప్పాల వాసుబాబు , మండల కన్వీనర్లు సంకు సత్యకుమార్, రావిపాటి సత్యశ్రీనివాస్, మరడా వెంకట మంగారావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కచ్చాల నాగేశ్వరరావు, తుమ్మగంటి రంగ, రామిశెట్టి శ్రీను, పులిచర్ల కృష్ణారావు, ఎంపీటీసీలు కోడూరి రాంబాబు, సునీత మానసింగ్, ఆర్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఇదేనా.. పనిచేసే తీరు
ఏలూరు (మెట్రో) : కాలువలు మూసివేసిన తర్వాత ఇప్పుడు గుర్రపు డెక్క, తూడు తొలగింపు విషయంలో టెండర్లు పిలుస్తారా అంటూ ఇరిగేషన్ అధికారులపై కలెక్టర్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయాలనే ఆలోచన ఉంటే ముందుగానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారని, పని చేయకూడదనే ఆలోచన ఉంటేనే ఇటువంటి పనులు చేస్తారని మండిపడ్డారు. ఇటువంటి పద్ధతి విడనాడాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి తీరుపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. సాగునీటి కాలువ మరమ్మతులు, డెల్టా ఆధునికీకరణ కార్యక్రమాలు, కాలువలు మూసి వేసిన తరువాత చేపట్టాల్సి ఉన్నప్పటికీ కాలువలు తెరిచిన తరువాత పనులు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రాష్ట్ర స్థాయి అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న పనుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. చీఫ్ ఇంజనీర్, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి వాటి అనుమతులు పొందుతామని తెలిపారు. పోలవరం ఆరోగ్య కేంద్రాన్ని అప్‌గ్రేడ్ చేసినట్టు కాగితంపై చూపిస్తే కుదరదనీ, డాక్టర్లు, సిబ్బంది నియామకానికి తగిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని చెప్పారు. సిబ్బందిని మంజూరు చేయిస్తానని జిల్లా వైద్యాధికారి కోటేశ్వరికి చెప్పారు. సిమెంటు రోడ్ల నిర్మాణంలో కష్టపడి పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకొచి్చన పంచాయతీరాజ్ ఏఈ మాణిక్యాన్ని కలెక్టర్ అభినందించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ కట్టా హైమావతి, డీపీఓ సుధాకర్, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ పాల్గొన్నారు. -
ఆటోలోనూ నగదు రహిత ప్రయాణం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో నగదురహిత ఆటో ప్రయాణానికి రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ శ్రీకారం చుట్టారు. రవా ణాశాఖ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఆటోల్లో ప్రయాణించే వారు నగదుతో సంబంధం లేకుండా ప్రత్యేక యాప్ ద్వారా ఆటో చార్జీలు చెల్లించే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. మంత్రి పితాని సత్యనారాయణతో పాటు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఏలూరు మేయర్ నూర్జహా న్ కొద్దిదూరం ఆటోలో ప్రయాణించారు. ఆటో చార్జీల కోసం చిల్లర సమస్య తలెత్తకుండా నేరుగా ఆటో డ్రైవర్ బ్యాంకు ఖాతాకు సొమ్ము జమయ్యేలా రూపొందించిన ఈ ప్రత్యేక యాప్ వల్ల ఎక్కడా నగదు సమస్య తలెత్తబోదని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. రాబోయే రోజుల్లో నగదు రహిత లావాదేవీలకు ప్రజలు అలవాటు పడతారని, రాబోయే రెండేళ్లలో ఈ విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని మంత్రి పితాని చెప్పారు. ఆటో డ్రైవర్ ఖాతాకు కలెక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాంకు ఖాతా నుంచి రూ.50 సొమ్మును ఆ న్లై న్లో పంపించారు. దశల వారీగా ఆటో సేవలను విస్తరించనున్నారు. -
భళా.. వేంగి కళ
చారిత్రక నగరం హేలాపురిలో వేంగి కళా ఉత్సవాలు శుక్రవారం మొదలయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల శాస్త్రీయ, జానపద నృత్య కళారీతులను ప్రదర్శిస్తున్నారు. గుంటూరుకు చెందిన ప్రవల్లిక కూచిపూడి నృత్య విన్యాసమిది. గజ్జె ఘల్లున.. గుండె ఝల్లున ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : నగరానికి చెందిన శ్రీ లలితా కామేశ్వరి నృత్య సదనం ఆధ్వర్యంలో నాట్యాచారిణి ఘండికోట అలివేలు ఉష నిర్వహణలో శుక్రవారం ప్రారంభమైన వేంగి కళా ఉత్సవాలు అలరించాయి. అంతర్జాతీయ స్థాయి నృత్య కళాకారుల నృత్యప్రదర్శన కళాకారులను రంజింపజేశాయి. నవీ ముంబైకి చెందిన అపేక్ష ముందర్జీ భరతనాట్యం, గుంటూరుకు చెందిన ప్రవల్లిక కూచిపూడి నృత్యం నగరవాసులను విపరీతంగా అలరించాయి. అలాగే చెన్నైకి చెందిన అమర్నాథ్ ఘోష్ కథక్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
గ్యాస్ లీకై తాటాకిల్లు దగ్ధం
వెంకట్రామన్నగూడెం (తాడేపలి్లగూడెం రూరల్) : గ్యాస్ లీకై తాటాకిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని వెంకట్రామన్నగూడెంలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని జయ మహంకాళి పౌల్ట్రీ ఎదురుగా బత్తుల శ్రీనివాసరావు నివాసముంటున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి పనులు ముగించుకుని ఇంటిల్లిపాది నిద్రించారు. శుక్రవారం తెల్లవారు జామున గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు చూసి కేకలు పెట్టారు. ఈ హడావుడికి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు లేచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే ఇంటితో పాటు బీరువాలోని రూ.2.50 లక్షల నగదు, ఇతర సామగ్రి, ఇంటి ఆవరణలోని పల్సర్ మోటారు సైకిల్ పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం ఆస్తినష్టం సుమారు రూ.6.50 లక్షలు ఉంటుందని బాధితుడు శ్రీనివాసరావు వాపోయాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఇన్చార్జి ఫైరాఫీసర్ వి.భాస్కర్‌రాజు ఆధ్వర్యంలో మంటలను అదుపు చేశారు.