చిన వెంకన్నకు కల్యాణ శోభ
చిన వెంకన్నకు కల్యాణ శోభ
Published Sat, May 6 2017 12:34 AM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM
ద్వారకాతిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో వేంకటేశ్వర స్వామి వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు శుక్రవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. చినవెంకన్న భక్తులకు శ్రీమహావిష్ణువుగా దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామి నుదిటిన కల్యాణ తిలకం, బుగ్గనచుక్కతో పెళ్లి కూమారుడిగా శోభిల్లారు. పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు పెళ్లి కుమార్తెలుగా ముస్తాబయ్యారు. ఆలయ పండితులు, అర్చకులు ఈ తంతును వైభవోపేతంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణలతో చిన వెంకన్న క్షేత్రం మార్మోగింది. వేదికపై ఏర్పాటు చేసిన రజత సింహాసనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ వేడుకలను తిలకించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాథరావు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గజ వాహనంపై ఊరేగిన శ్రీవారు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా
మెుదటి రోజున జరిగే గజ వాహన సేవకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. స్వామి వైభవాన్ని చాటే ఈ వాహనసేవను శుక్రవారం రాత్రి క్షేత్ర పురవీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. రాజగోపురం మీదుగా పుర వీధులకు పయనమైన స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రీహరికళాతోరణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
Advertisement
Advertisement