
మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతం శ్రావణమాసపు రెండో శుక్రవారం జరుపుకోవడం శాస్త్రంగా ఎంతో కాలం జరుగుతూ వస్తున్నది. అయితే ఏదైనా కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం కానీ, ప్రత్యేక పూజలు కానీ చేసుకోలేని వాళ్లకు ఆఖరి శుక్రవారం చివరి అవకాశంగా భావిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి, సకలశుభాలు కలగాలని ప్రార్థిస్తారు.
చివరి రోజు మరింత ప్రత్యేకం..
శ్రావణమాసం, శుక్రవారాలు ఎంత ప్రత్యేకమైనవో వేరుగా చెప్పక్కర్లేదు. అయితే శుభప్రదమైన శ్రావణమాసంలో చివరి వారం కావడంతో బోలెడంత సందడి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిల లక్ష్మీ దేవి పూజకు మరింత ప్రత్యేకమని చెప్పాలి.
ఆఖరి రోజు వ్రతం చేస్తే:
ఆఖరి రోజున ఉపవాసం పాటించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. ఈ రోజున యథావిధిగా రకరకాల పిండి వంటలు, క్షీరాన్నం, పళ్లు, పూలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ శుభసమయంలో శ్రీ యంత్రానికి పూజలు నిర్వహిస్తారు. రాత్రి నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ హ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే లక్ష్మి ఇంట్లో నివాసం ఉంటుందని నమ్మకం.
అలాగే వరలక్ష్మి రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 11 పసుపు పిండి ముద్దలను లక్ష్మీదేవి పాదాలకు సమర్పించి, పూజ తర్వాత వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో ఉంచితే దీనివల్ల ఆర్థిక లబ్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. లక్ష్మీదేవికి కొబ్బరికాయ సమర్పించాలి. దీనివల్ల ఆర్థిక లబ్ది పొందే అవకాశం ఏర్పడుతుంది.
పెళ్లికాని పడుచులకు వరం..
పూజ చేసుకున్న వారి నుంచి తాంబూలం తీసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకు తొందరగా పెళ్లవుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. వరమహాలక్ష్మి వివిధ రూపాలలో కరుణిస్తుందని, అన్ని సమస్యలు తొలగిపోయి పెళ్లి జరిగేలా అనుకూలత ఇస్తుందని నమ్మకం. అందుకే కొన్ని ప్రాంతాలలో ఈ రోజు భక్తితో ఉపవాసం ఉండి, పూజ చేసుకుని ముత్తైదువుల నుంచి తాంబూలం అందుకుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment