
దసరా నుంచే.. తీన్మార్
- కొత్త జిల్లాలు ముహూర్తం ఖరారు
- సిద్దిపేటలోకి మరో మండలం
- బెజ్జెంకిని కలపాలని ప్రతిపాదనలు
- తుది నోఫికేషన్‌కు సర్వం సిద్ధం
- సిద్దిపేటకు ఖరారైన కలెక్టర్
- అధికారిక ఉత్తర్వులే తరువాయి
- మెదక్ జిల్లాలో కొత్తగా ఐదు మండలాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:దసరా నుంచే కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకొచ్చే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మెదక్ జిల్లాను మూడు జిల్లాలు చేయడంపై శుక్రవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తొలి ముసాయిదా తరువాత నిర్ణయం తీసుకున్న రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు అవసరమైన చట్ట సవరణ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తేవాలని క్యాబినేట్ నిర్ణయించింది.‡ తాజా పరిణామాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో అదనంగా మరో మండలం కలవబోతోంది. కరీంనగర్ జిల్లాలోని పాత బెజ్జంకి మండల కేంద్రంతో పాటు మరి కొన్ని గ్రామాలను కలుపుకొని బెజ్జంకి మండలం పేరుతో సిద్దిపేట జిల్లాలో కలుపుతూ ప్రతిపాదనలు పంపారు.
ఈ నిర్ణయంపై రెండు జిల్లాల మంత్రులతో పాటు, కలెక్టర్లు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బెజ్జెంకి మండలంలోని గ్రామాలను రెండుగా విభజన చేసి కరీంనగర్‌కు సమీపంగా ఉన్న గ్రామాలకు వడ్లూరు (బేగంపేట) లేదా గన్నేరువరం మండల కేంద్రం చేసి కరీంనగర్ జిల్లాలో చేరుస్తారు. ఇక మిగిలిన జెజ్జంకి, తోటపల్లి, పోతారం, గాగిల్లాపూర్, గుగ్గిల్ల, వేములపల్లి, లక్ష్మీపూర్, దేవక్కపల్లి, దాచారం, వీరాపూర్, గూడెం, కల్లెపల్లి, ముత్తన్నపేట, చిలాపూర్, రేగులపల్లి గ్రామాలు, ఇల్లంతకుంట మండలంలో గుండారం, రేపాక గ్రామాలు, కోహెడ మండలంలోని ఇంకొన్ని గ్రామలను కలిపి బెజ్జంకి మండల కేంద్రం చేసి సిద్దిపేటలో కలుపుతున్నారు. 19 జిల్లాలతో సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. తాజాగా ఈ సంఖ్య 23 మండలాలకు చేరుతుంది.
నాగిరెడ్డిపేటపై వీడని సందిగ్ధత:....
తొలి నోటిఫికేషన్‌లో 14 మండలాలతో ఏర్పాటు చేయదలిచిన మెదక్ జిల్లాలో 20 మండలాలకు పెరిగింది. నర్సాపూర్ ప్రజల విజ్ఞప్తి మేరకు నర్సాపూర్‌కు రెవెన్యూ డివిజన్ హోదా కల్పిస్తూ మెదక్ జిల్లాలో చేర్చారు. నిజాంపేట, మనోహరాబాద్, నార్సింగి, హవేళిఘణపురం, పిడిచేడ్ గ్రామాలకు మండల కేంద్రం హోదా కల్పించారు. నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తూన్నారు.
పోచారం, మాల్‌తుమ్మెద, వాడి, చీనూరు తదితర గ్రామాలకు చెందిన నలుగురు యువకులు మూకుమ్మడిగా పోచారం డ్యాంలో దూకి ఆత్మహత్యకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలు కోరుకుంటే నాగిరెడ్డిపేట మండలంలోని మెదక్ సమీప గ్రామాల ప్రజలు మెదక్ జిల్లాలో కలపవచ్చని ఇటీవల జరిగిన ప్రజాప్రతినిధలు భేటీలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనతో పై నాలుగు గ్రామాలు మెదక్ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే పోచారం గ్రామం వస్తే ఈ గ్రామ పంచాయతీలోని జలప్రాజెక్టు (పోచారం)కూడా మెదక్ జిల్లాలోకి వస్తుంది కాబట్టి, కామారెడ్డి ప్రజా ప్రతినిధులు పోచారంను మెదక్‌లో కలపకుండా అడ్డం పడుతున్నట్లు సమాచారం.
సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి!
సిద్దిపేట జిల్లా తొలి కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అధికారిక ఉత్తర్వులు వెలువడటమే తరువాయి. ప్రస్తుతం మెదక్ జాయింట్ కలెక్టర్ పని చేస్తున్న ఆయనకు పూర్తిస్థాయి కలెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్‌ర్రూం పథకం ఇళ్లకు వెంకట్రామిరెడ్డి ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఇళ్ల నిర్మాణంలో వ్యయప్రయాసాలు ఉన్నప్పటికీ జేసీ పట్టుదలతో అనుకున్న సమయానికే ప్రాజెక్టు దాదాపు పూర్తి చేసి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్శించారు.