
దసరా రోజే కొత్త జిల్లాల సంబురం.. కేబినెట్ ఓకే
హైదరాబాద్: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడుగంటలపాటు జరిగిన ఈ భేటీలో ఇంకా పలు అంశాలు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా భేటీ వివరాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వివరించారు. కరీంనగర్, నిజమాబాద్, సిద్ధిపేట, రామగుండంలో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. దసరా నుంచి కొత్త జిల్లాలు ప్రారంభించాలని నిర్ణయించారు. తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటుకు వీలుగా 1993 చట్టంలో సవరణకు ఆమోదం తెలిపామన్నారు.
జీహెచ్ఎంసీలో పలు సంస్కరణలు తెచ్చేందుకు మున్సిపల్ చట్టంలో మార్పులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు వివరించారు. అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మిషన్ భగీరథ కార్పోరేషన్ ను వేతనాలు, పెన్షన్ల పరిధిలోకి తెస్తూ ఆమోదం తెలిపారని చెప్పారు. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు మోటార్ వెహికిల్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చామని పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలోని హెటిరో డ్రగ్స్ ట్రస్టుకు 15 ఎకరాల భూమిని కేటాయించినట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి కేన్సర్ ఆస్పత్రిని నెలకొల్పేందుకు హెటిరో ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది నుంచి 119 బీసీ, 90 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.