విద్యార్థిని నర్సమ్మకు స్వీట్లు తినిపిస్తున్న కుటుంబసభ్యులు
కొల్చారం:దక్షిణాప్రికాలోని కిలిమాంజారో పర్వతారోహణం ముగించుకొని శుక్రవారం మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట స్వగ్రామానికి చేరుకున్న విద్యార్థిని నర్సమ్మకు ఘన స్వాగతం లభించింది. ఈ నెల 8న దక్షిణాఫ్రికాలోని కిలిమాంజారో పర్వతారోహణకు బయలుదేరిన జిల్లాకు చెందిన పది మందిలో నర్సమ్మ అతి చిన్న వయస్కురాలు. కొల్చారంలోని కేజీబీవీ లో 8వ తరగతి చదువుతోన్న ఆమె.. తన బృందంతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవం నాడు కిలిమాంజారో పర్వతంపై జాతీయ జెండాను ఎగురవేసిన సంగతి తెలిసిందే. నర్సమ్మ రాక సందర్భంగా రంగంపేటలో కోలాహలం నెలకొంది. పాఠశాలలకు చెందిన విద్యార్థులు, గ్రామస్తులు, ఆయా పార్టీల నాయకులు, యువజన సంఘాల కార్యకర్తలు నర్సమ్మ రాకకోసం ఎదురు చూశారు.
మధ్యాహ్నం 2 గంటలకు రంగంపేటకు నర్సమ్మకు టెస్కోడైరెక్టర్ అరిగెరమేష్, ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఖాదిర్‌హుస్సేన్, రాంచంద్రం, సీనియర్ పాత్రికేయులు గామని జైపాల్, ప్రజలు పూలమాలలతో సత్కరించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నర్సమ్మను విద్యార్థులు, గ్రామానికి చెందిన యువజన సంఘాల నేతలు, ప్రజలు శాలువాలతో సత్కరించారు. పూలమాలలు వేసి భారతమాతకు జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని నర్సమ్మ తాను చదువుతున్న పాఠశాల ఆవరణలో మొక్క నాటింది.
పర్వతారోహణతో ఆత్మవిశ్వాసం పెరిగింది
పర్వతారోహణ కావడంతో ముందస్తుగా కొంత భయం ఏర్పడినా శిక్షణ సమయంలో ఉపాధ్యాయులు ఇచ్చిన మనోధైర్యం నాలో ఆత్మవిశ్వాసాన్ని పూర్తి స్థాయిలో పెంచింది. పర్వతం ఎక్కేముందు రెండుసార్లు కొంత ఇబ్బంది ఎదురైనా తోటి విద్యార్థుల ప్రోత్సాహం, జిల్లా కలెక్టర్ తనపై ఉంచిన నమ్మకం పర్వతంపైకి ఎక్కించేందుకు ఎంతగానో తోడ్పడింది. ఆత్మ విశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చనేది పర్వతారోహణ ద్వారా తెలిసింది. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే తాము ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది.
- నర్సమ్మ, విద్యార్థి