పంట ఎండె.. గుండె మండె!
- ఘణపురం నీళ్ల లొల్లి
- వరి పంట ఎండుముఖం
- కట్టలు తెగిన ఆవేదన
- షట్టర్లు తెరచిన దిగువ రైతులు
- ఠాణాకు చేరిన వివాదం
పాపన్నపేట: ఘణపురం దిగువ రైతులు తిరగబడ్డారు. సాగు నీళ్ల కోసం ఆనకట్ట గేట్లు ఎత్తారు. ఎండుతున్న పొలాలకు నీళ్లందించేందుకు తెగించిన 200 మంది రైతులు శుక్రవారం ఆనకట్ట రెండు షట్టర్లను బలవంతంగా తెరిచి కిందకు నీళ్లు వదిలారు. అవి పొలాలకు చేరే వరకు అక్కడే కూర్చున్నారు. ఇంకోవైపు షట్టర్లు తెవరటం అన్యాయమంటూ కాల్వ కింద రైతులు ఎగువ రైతుల మీదకు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో విషయం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది.ఘనపురం ప్రాజెక్టు కింద ఫతేనహర్, మహబూబ్ నహర్ కాలువలు ఉన్నాయి. ఈ రెండు కాలువల కింద 23 వేల ఎకరాల సాగు భూమి ఉంది.
వర్షాభావ పరిస్థితుల వల్ల వానలు పడక ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. దీంతో ప్రాజెక్టు కింద పంటలు వేసుకోవద్దని ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో రెండేళ్లుగా రైతులు పంటలు వేయటం లేదు. ఈ ఏడాది కూడా వర్షాభావం నెలకొనడం.. తిండి గింజలకూ కరువైన పరిస్థితుల్లో దాదాపు 3 వేల ఎకరాల్లో వరి పంట వేశారు. పొట్ట దశలో ఉన్న వరి పొలాలు.. నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఇదే సమయంలో డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు చొరవతో సింగూరు నుంచి 0.35 టీఎంసీల జలాలను ఘనపురం ప్రాజెక్టులోకి విడిచారు.
అయితే నది మధ్యలో ఉన్న మడుగులు ఆ నీటిని మింగేశాయి. అదృష్టవశాత్తు వెనువెంటనే ఎగువన కురిసిన వర్షాల వల్ల ఘనపురం ప్రాజెక్టులోకి 6.5 అడుగుల మేర నీరు వచ్చింది.ఈ నీటిని డిప్యూటీ స్పీçకర్ బుధవారం ఎంఎన్, ఎఫ్‌ఎన్ కాల్వల్లోకి వదిలారు.
మా గతేం కావాలి..
అయితే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులకు సాగు నీరందటం లేదు. తమ పొలాలు ఎండి పోతున్నాయని ప్రాజెక్టు కింది రైతులు ఆందోళనకు గురయ్యారు. కనీసం తమకు కొన్ని నీళ్లు వదిలితే ఇసుకలో నీరింకి మంజీర నదిలో తాము వేసుకున్న ఊటబావుల్లో నీరు చేరుతుందని, తమ పొలాలు జీవం పోసుకుంటాయని వారంటున్నారు. అలాగే మంజీర నదిలో ఉన్న పొడిచన్‌పల్లి, కొత్తపల్లి, కుర్తివాడ రక్షిత మంచినీటి పథకాల్లో కూడా నీరు చేరి ప్రజల దాహార్తి తీరుతుందని అంటున్నారు.
ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఈ నెల 4న రాత్రి ఘనపురం ప్రాజెక్టు షట్టర్లను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తడంతో నీరంతా దిగువన ఉన్న మంజీర నదిలోకి వెళ్లిపోయింది. ఈ మేరకు ఎగువన కాల్వల కింద ఉన్న రైతులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు రాత్రిపూట షట్టర్ల వద్ద కాపలా ఉంటున్నారు. తాజాగా పాపన్నపేట, మెదక్ మండలాలకు చెందిన సుమారు 200 మంది రైతులు శుక్రవారం ఘనపురం ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి షట్టర్లను తెరిచి నీళ్లు వదిలారు. ఈ నీళ్లు తమ పొలం చేరేవరకు ఇక్కడే ఉంటామని బైఠాయించారు. కాగా కాల్వల కింద ఉన్న రైతులు ఈ చర్యలను నిరసిస్తున్నారు.
కాల్వల ద్వారానే నీరు: - ఈఈ యేసయ్య
ప్రస్తుతానికి ఘనపురం ప్రాజెక్టులో నిల్వ ఉన్న పరిస్థితిని బట్టి కాల్వల ద్వారానే పొలాలకు వదులుతున్నాం. ప్రాజెక్టు కిందకు నీరు వదిలే పరిస్థితి లేదు.