Dam gates
-
రెడ్అలర్ట్ : కేరళలో మలంపుజ డ్యామ్ గేట్ల ఎత్తివేత
కొచ్చి : కేరళను మరోసారి వరద భయం వెంటాడుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ వారాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరికలతో ఇరు రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో పలక్కాడ్‌లోని మలంపుజ డ్యామ్ గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు. మలంపుజ డ్యామ్‌కు చెందిన నాలుగు గేట్లను 9 సెంమీ చొప్పున అధికారులు ఎత్తివేశారు. ఐఎండీ సూచనల నేపథ్యంలో మూడు తీర ప్రాంత జిల్లాల్లో ఈనెల ఏడున రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈనెల 5 నాటికి మత్స్యకారులు సురక్షిత తీర ప్రాంతానికి వెళ్లాలని ప్రభుత్వం కోరిందని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమై పరిస్థితిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. -
పంట ఎండె.. గుండె మండె!
ఘణపురం నీళ్ల లొల్లి వరి పంట ఎండుముఖం కట్టలు తెగిన ఆవేదన షట్టర్లు తెరచిన దిగువ రైతులు ఠాణాకు చేరిన వివాదం పాపన్నపేట: ఘణపురం దిగువ రైతులు తిరగబడ్డారు. సాగు నీళ్ల కోసం ఆనకట్ట గేట్లు ఎత్తారు. ఎండుతున్న పొలాలకు నీళ్లందించేందుకు తెగించిన 200 మంది రైతులు శుక్రవారం ఆనకట్ట రెండు షట్టర్లను బలవంతంగా తెరిచి కిందకు నీళ్లు వదిలారు. అవి పొలాలకు చేరే వరకు అక్కడే కూర్చున్నారు. ఇంకోవైపు షట్టర్లు తెవరటం అన్యాయమంటూ కాల్వ కింద రైతులు ఎగువ రైతుల మీదకు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో విషయం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది.ఘనపురం ప్రాజెక్టు కింద ఫతేనహర్, మహబూబ్ నహర్ కాలువలు ఉన్నాయి. ఈ రెండు కాలువల కింద 23 వేల ఎకరాల సాగు భూమి ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల వానలు పడక ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. దీంతో ప్రాజెక్టు కింద పంటలు వేసుకోవద్దని ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో రెండేళ్లుగా రైతులు పంటలు వేయటం లేదు. ఈ ఏడాది కూడా వర్షాభావం నెలకొనడం.. తిండి గింజలకూ కరువైన పరిస్థితుల్లో దాదాపు 3 వేల ఎకరాల్లో వరి పంట వేశారు. పొట్ట దశలో ఉన్న వరి పొలాలు.. నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఇదే సమయంలో డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు చొరవతో సింగూరు నుంచి 0.35 టీఎంసీల జలాలను ఘనపురం ప్రాజెక్టులోకి విడిచారు. అయితే నది మధ్యలో ఉన్న మడుగులు ఆ నీటిని మింగేశాయి. అదృష్టవశాత్తు వెనువెంటనే ఎగువన కురిసిన వర్షాల వల్ల ఘనపురం ప్రాజెక్టులోకి 6.5 అడుగుల మేర నీరు వచ్చింది.ఈ నీటిని డిప్యూటీ స్పీçకర్ బుధవారం ఎంఎన్, ఎఫ్ఎన్ కాల్వల్లోకి వదిలారు. మా గతేం కావాలి.. అయితే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులకు సాగు నీరందటం లేదు. తమ పొలాలు ఎండి పోతున్నాయని ప్రాజెక్టు కింది రైతులు ఆందోళనకు గురయ్యారు. కనీసం తమకు కొన్ని నీళ్లు వదిలితే ఇసుకలో నీరింకి మంజీర నదిలో తాము వేసుకున్న ఊటబావుల్లో నీరు చేరుతుందని, తమ పొలాలు జీవం పోసుకుంటాయని వారంటున్నారు. అలాగే మంజీర నదిలో ఉన్న పొడిచన్పల్లి, కొత్తపల్లి, కుర్తివాడ రక్షిత మంచినీటి పథకాల్లో కూడా నీరు చేరి ప్రజల దాహార్తి తీరుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఈ నెల 4న రాత్రి ఘనపురం ప్రాజెక్టు షట్టర్లను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తడంతో నీరంతా దిగువన ఉన్న మంజీర నదిలోకి వెళ్లిపోయింది. ఈ మేరకు ఎగువన కాల్వల కింద ఉన్న రైతులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు రాత్రిపూట షట్టర్ల వద్ద కాపలా ఉంటున్నారు. తాజాగా పాపన్నపేట, మెదక్ మండలాలకు చెందిన సుమారు 200 మంది రైతులు శుక్రవారం ఘనపురం ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి షట్టర్లను తెరిచి నీళ్లు వదిలారు. ఈ నీళ్లు తమ పొలం చేరేవరకు ఇక్కడే ఉంటామని బైఠాయించారు. కాగా కాల్వల కింద ఉన్న రైతులు ఈ చర్యలను నిరసిస్తున్నారు. కాల్వల ద్వారానే నీరు: - ఈఈ యేసయ్య ప్రస్తుతానికి ఘనపురం ప్రాజెక్టులో నిల్వ ఉన్న పరిస్థితిని బట్టి కాల్వల ద్వారానే పొలాలకు వదులుతున్నాం. ప్రాజెక్టు కిందకు నీరు వదిలే పరిస్థితి లేదు. -
పెరుగుతూ.. తగ్గుతూ
నాగార్జునసాగర్ :నాగార్జునసాగర్ జలాశయానికి వచ్చే వరద పెరుగుతూ... మళ్లీ తగ్గుతోంది. వాస్తవానికి కృష్ణానదికి ఎగువన కురుస్తున్న వర్షాలతో కాకుండా, స్థానికంగా కురుస్తున్న వర్షాలతో వరద వస్తోంది. దీంతో ఈ వరద నీటిని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. శ్రీశైలం జలాశయానికి సోమవారం అర్ధరాత్రి దాటేసరికి ఎగువ నుంచి వచ్చే వరద ఒక్కసారిగా తగ్గింది. దీంతో వెంటనే ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు మూసివేశారు. దీంతో దిగువన ఉన్న సాగర్ జలాశయ గేట్లు కూడా మంగళవారం తెల్లవారుజామున మూయాల్సి వచ్చింది. ఉదయానికి వరదఉధృతి పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రెండుగేట్లు తెరుచుకున్నాయి. దీంతో మళ్లీ సాగర్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. సాయంత్రానికి వరదతగ్గడంతో గేట్లను మూసివేశారు. కేవలం విద్యుదుత్పాదన ద్వారా 75,854క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు పది గేట్లను మొదట ఎత్తారు. ఆ తర్వాత ఎనిమిదికి, పెరిగిన పర్యాటకులు గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లను చూడటానికి పర్యాటకులు తరలివస్తున్నారు. దీంతో కృష్ణాతీరం సందడిసందడిగా మారింది. పర్యాటకులు బారులుదీరి కృష్ణమ్మ అందాలను తనివితీరా చూశారు. చంద్రవంకవాగు పొంగి పొర్లుతుండటంతో ఎత్తిపోతల వద్ద జలపాత దృశ్యం పర్యాటకులకు ఆహ్లాదం కలిగించింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తరలివస్తున్నారు. వీరంతా అత్యధిక సంఖ్యలో వస్తుండడంతో చిరువ్యాపారులకు పండగ వాతావరణం నెలకొన్నది, మొక్కజొన్న కండెలు, వేరుశనగకాయలకు గిరాకీ పెరిగింది. -
తాండూరు విద్యార్థి సురక్షితం
తాండూరు: హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ప్రమాదం నుంచి తాండూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పానుగంటి సృజన్ సురక్షితంగా బయటపడ్డారు. తాండూరుకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి పానుగంటి విశ్వనాథం కుమారుడు సృజన్. ఎలక్ట్రానిక్స్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈఐఈ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వరద ప్రమాదం నుంచి సృజన్ క్షేమంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా సృజన్ సోమవారం చండిఘడ్ నుంచి ఫోన్లో మాట్లాడారు. ప్రమాద వివరాలు తెలియజేశారు. వివరాలు సృజన్ మాటల్లోనే.. ఈ నెల 3న టూర్‌కు బయల్దేరి వెళ్లాం. ఆదివారం సిమ్లా పర్యటన అనంతరం మనాలికి రెండు బస్సుల్లో బయల్దేరాం. మనాలి మార్గమధ్యంలో మండి జిల్లాలోని లార్జి హైడ్రోవర్ పవర్ ప్రాజెక్టు వద్ద ఆగారు. అక్కడ విద్యార్థిని, విద్యార్థులు డ్యామ్ వద్ద ఫొటోలు దిగేందుకు వెళ్లారు. నేను మరికొంత మంది విద్యార్థులు ఒడ్డున నిల్చున్నాం. అప్పుడు సమయం సాయంత్రం 6.30 గంటలు అవుతోంది. డ్యామ్ గేట్లు ఒక్కసారిగా ఎత్తడంతో నీటి ప్రవాహం దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నీటి ప్రవాహం పెరిగింది. డ్యామ్ కింది భాగంలో ఫొటోలు దిగుతున్న విద్యార్థినీ విద్యార్థులు తప్పించుకునే వీలు లేకపోయింది. ఆ ప్రవాహంలో విద్యార్థులు గల్లంతయ్యారు. విద్యార్థులందరం రక్షించాలని కేకలు వేశాం. వెంటనే నేను ‘100’ నంబర్‌కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారమిచ్చాను. రెస్క్యూటీంను పంపించాలని కోరాం. తర్వాత స్థానిక అధికారులకు సమాచారమిచ్చినా సకాలంలో స్పందించలేదు. ప్రమాదం జరిగిన సుమారు రెండు గంటలకు బైక్‌మీద ఒక పోలీసు కానిస్టేబుల్ ఘటనా స్థలానికి వచ్చాడు. డ్యామ్గేట్లు ఎత్తినప్పుడు ఎలాంటి అలారం శబ్దం వినపడలేదు. కాస్త బయట రాళ్లపై నిల్చున్నవాళ్లమే తప్పించుకోగలిగాం. అక్కడి అధికారులు సకాలంలో స్పందించి ఉంటే కొందరినైనా కాపాడుకుని ఉండేవాళ్లం...’ అని వివరించాడు. తన కుమారుడు క్షేమంగా ఉన్నాడనే సమాచారంతో తండ్రి విశ్వనాథంతోపాటు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన తాండూరు విద్యార్థి సృజన్‌తోపాటు తండ్రి విశ్వనాథంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఫోన్లో మాటాడారు. ప్రమాద వివరాలు ఆయన తెలుసుకున్నారు.