తాండూరు విద్యార్థి సురక్షితం
తాండూరు: హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ప్రమాదం నుంచి తాండూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పానుగంటి సృజన్ సురక్షితంగా బయటపడ్డారు. తాండూరుకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి పానుగంటి విశ్వనాథం కుమారుడు సృజన్. ఎలక్ట్రానిక్స్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈఐఈ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వరద ప్రమాదం నుంచి సృజన్ క్షేమంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా సృజన్ సోమవారం చండిఘడ్ నుంచి ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద వివరాలు తెలియజేశారు.
వివరాలు సృజన్ మాటల్లోనే..
ఈ నెల 3న టూర్‌కు బయల్దేరి వెళ్లాం. ఆదివారం సిమ్లా పర్యటన అనంతరం మనాలికి రెండు బస్సుల్లో బయల్దేరాం. మనాలి మార్గమధ్యంలో మండి జిల్లాలోని లార్జి హైడ్రోవర్ పవర్ ప్రాజెక్టు వద్ద ఆగారు. అక్కడ విద్యార్థిని, విద్యార్థులు డ్యామ్ వద్ద ఫొటోలు దిగేందుకు వెళ్లారు. నేను మరికొంత మంది విద్యార్థులు ఒడ్డున నిల్చున్నాం. అప్పుడు సమయం సాయంత్రం 6.30 గంటలు అవుతోంది. డ్యామ్ గేట్లు ఒక్కసారిగా ఎత్తడంతో నీటి ప్రవాహం దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నీటి ప్రవాహం పెరిగింది.
డ్యామ్ కింది భాగంలో ఫొటోలు దిగుతున్న విద్యార్థినీ విద్యార్థులు తప్పించుకునే వీలు లేకపోయింది. ఆ ప్రవాహంలో విద్యార్థులు గల్లంతయ్యారు. విద్యార్థులందరం రక్షించాలని కేకలు వేశాం. వెంటనే నేను ‘100’ నంబర్‌కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారమిచ్చాను. రెస్క్యూటీంను పంపించాలని కోరాం. తర్వాత స్థానిక అధికారులకు సమాచారమిచ్చినా సకాలంలో స్పందించలేదు. ప్రమాదం జరిగిన సుమారు రెండు గంటలకు బైక్‌మీద ఒక పోలీసు కానిస్టేబుల్ ఘటనా స్థలానికి వచ్చాడు.
డ్యామ్‌గేట్లు ఎత్తినప్పుడు ఎలాంటి అలారం శబ్దం వినపడలేదు. కాస్త బయట రాళ్లపై నిల్చున్నవాళ్లమే తప్పించుకోగలిగాం. అక్కడి అధికారులు సకాలంలో స్పందించి ఉంటే కొందరినైనా కాపాడుకుని ఉండేవాళ్లం...’ అని వివరించాడు. తన కుమారుడు క్షేమంగా ఉన్నాడనే సమాచారంతో తండ్రి విశ్వనాథంతోపాటు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన తాండూరు విద్యార్థి సృజన్‌తోపాటు తండ్రి విశ్వనాథంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఫోన్‌లో మాటాడారు. ప్రమాద వివరాలు ఆయన తెలుసుకున్నారు.