Srujan
-
కంగ్రాట్స్.. నిర్మల!
కర్నూలు కల్చరల్/ఆదోని రూరల్: నిర్మల పోరాట యోధురాలుని, ఆ అమ్మాయి దృఢ సంకల్పం, పోరాట పటిమకు సెల్యూట్ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ప్రశంసించారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన నిర్మల 10వ తరతగతిలో మంచి మార్కులు సాధించినప్పటికీ పేదరికంతో తల్లిదండ్రులు చదువు మాన్పించిన సందర్భంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్మలను ఆస్పరి కేజేబీవీలో చేర్పించారు. ఆ విద్యార్థిని ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్‌తో మొదటి సంవత్సరం పరీక్షల్లో 440 మార్కులకు 421 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదివారం నిర్మలను క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బైపీసీ గ్రూప్‌లు ఉన్న 8 కేజీబీవీల్లో నిర్మల టాపర్‌గా నిలవడం అభినందనీయమన్నారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన హనుమంతమ్మ, శ్రీనివాస్ దంపతుల కుమార్తె నిర్మల గురించి నేడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారన్నారు. ఆడపిల్లలకు నిర్మల రోల్‌మోడల్, స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసించారు. ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ దృఢ సంకల్పంతో చదువుకోవాలన్న తన కోరికను నెరవేర్చుకొని ఉన్నత ఆశయంతో ముందుకు వెళుతోందన్నారు. విద్యతోనే సాధికారత లభిస్తుందని ఆడపిల్లలు చదువుకొని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. బేటీ బచావో బేటీ పడావో కింద నిర్మలకు ఇన్సెంటివ్ ఇవ్వాలని ఇంచార్జ్ ఐసీడీఎస్ పీడీని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థిని ఖాతాలో ఇన్సెంటివ్ జమ చేయడం వల్ల ఇంటర్ తరువాత వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా పైచదువులు చదువుకోడానికి ఉపయోగ పడుతుందన్నారు. సమస్యలతో చదువుకోలేక మధ్యలో చదువు ఆపేసిన వారు ఇంకా ఎవరైనా ఉంటే స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించి అలాంటి వారిని ఈ సంవత్సరం కేవీజీబీల్లో అడ్మిషన్ చేయించాలని ఆదేశించారు. నిర్మల సాధించిన ప్రగతి గురించి అందరికి తెలిసేలా సమావేశం నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మలను శాలువాతో సన్మానించి స్వీట్స్ అందజేశారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి జీవితంలో అనేక విజయాలు సాధించాలని సూచించారు. బైపీసీలో 421 మార్కులు సాధించిన నిర్మలతో జిల్ల్లా కలెక్టర్ సృజన, ఇతర అధికారులు కలెక్టర్ చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను.. గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివి 537 మార్కులు సాధించానని, తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలతో చదువు వద్దని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని అయితే తనకు ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లానని నిర్మల తెలిపారు. ఈ విషయం ప్రతికల్లో ప్రచురితమై కలెక్టర్ దృష్టికి వెళ్లడం, కలెక్టర్ మేడం వెంటనే స్పందించి కేజీబీవీలో అడ్మిషన్ ఇప్పించారన్నారు. ఈరోజు ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షల్లో కేజీబీవీల్లో టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాఽశాఖాధికారి శామ్యూల్, సమగ్ర శిక్ష ఏపీసీ విజయ జ్యోతి, ఇన్‌ఛార్జి ఐసీడీఎస్ పీడీ వెంకట లక్ష్మమ్మ, జీసీడీవో సునీత, కేజీబీవీ ఎస్ఓ శరన్‌స్మైలీ, ఆదోని ఎంఈఓ–2 శ్రీనివాసులు, విద్యార్థిని తల్లిదండ్రులు, బందువులు పాల్గొన్నారు. -
కొత్త కథలతో ఎస్ ఒరిజినల్స్.. ఏకంగా 9 సినిమాలు
S Originals Coming With 9 Movies With Different Concepts: ఈ సంవత్సరం ఏకంగా 9 సినిమాలను నిర్మించేందుకు సిద్ధం అవుతుంది 'ఎస్ ఒరిజనల్స్'. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో కథను నమ్మి కొత్త తరం దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నారు నిర్మాత సృజన్. తమ సంస్థ నుంచి వస్తున్న సినిమాలపై గురించి సృజన్ మాట్లాడుతూ 'ఎస్ ఒరిజినల్స్‌ను టాలీవుడ్లో ప్రత్యేక స్థానంలో నిలుపాలన్నదే నా కోరిక. ఇప్పటి వరకు భాగస్వామ్యంలో కొన్ని సినిమాలను నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడు మా బ్యానర్ నుంచే 9 చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల షూటింగ్ సుమారు ముగింపునకు రావడం సంతోషంగా ఉంది. దీని ద్వారా కొత్త దర్శకులు పరిచయం కాబోతున్నారు. టాలెంట్‌పై నమ్మకంతో వారిని ప్రోత్సహిస్తున్నాం. ఇవే కాకుండా మరికొన్ని కథలను ఫైనలైజ్ చేసి ఈ ఏడాది ప్రారంభిస్తాం' అని తెలిపారు. ప్రస్తుతం పంచతంత్రం విడుదలకు సిద్ధంగా ఉందని సృజన్ పేర్కొన్నారు. 'సంతోష్ శోభన్ హీరోగా డిజిటల్ మీడియాలో బ్రాండ్‌గా ఎదిగిన సుభాష్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఒక అందమైన ప్రేమకథను రూపొదించాం. సుమంత్ హీరోగా అహాం చిత్రం షూటింగ్ ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయిన సినిమాతో సుబ్బు చెరుకూరిని కొత్త దర్శకుడిగా అరంగ్రేటం చేయనున్నారు. ఇంకొక కొత్త దర్శకుడిగా బ్రిజేష్‌తో వైరల్ సినిమా రానుంది. కిరణ్ డైరెక్షన్లో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కన్నడలో బీర్బల్ ట్రయాలజీ తీసిన శ్రీని దర్శకత్వంలో ఓల్డ్ మంక్ మూవీని, కొత్త దర్శకుడు విష్ణును మరో సినిమాతో పరిచయం చేస్తున్నాం. బాలీవుడ్ పాపులర్ రైటర్స్ సిద్దార్ధ , గరీమ దర్శకత్వంలో రూపొందున్న దుకాన్ మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్లో ఉంది.' అని సృజన్ వెల్లడించారు. కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకం బలంగా ఉందని నిర్మాత సృజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎస్ ఒరిజినల్స్ సంస్థ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. -
‘పుష్పక విమానం’ డైరెక్టర్ దామోదర గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం): తండ్రి పేరున్న కథా రచయిత, తాత నక్సలైట్ నాయకుడు... అతను మాత్రం వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పుష్పక విమానం’ అనే సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ చిత్ర దర్శకుడు సృజన్(దామోదర) శ్రీకాకుళం వాసే. దర్శకుడి తండ్రి ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు. ఈయన ప్రస్తుతం శ్రీకాకుళంలోని విశాఖ ఎ కాలనీలో నివాసముంటున్నారు. సృజన్ తాత ప్రముఖ నక్సలైట్ నాయకులు మామిడి అప్పలసూరి. వీరి స్వగ్రామం కోమర్తి. లఘు చిత్రాల నుంచి.. సృజన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసి సినిమాలపై ఇష్టంతో అటువైపు వెళ్లారు. తొలి తెలుగు కథగా చెప్పుకునే గురజాడ ‘దిద్దుబాటు’ ఆధారంగా సృజన్ ‘కమిలిని’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశారు. సృజన్ అభిరుచికి ఈ లఘుచిత్రం ఓ మచ్చుతునక. ఈ షార్ట్ ఫిలింను అప్పట్లో దాసరి నారాయణరావు మెచ్చుకున్నారు కూడా. ఆయన జన్మదినం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఈ లఘుచిత్రంతోనే సృజన్ మొదటి బహుమతి గెలుచుకున్నాడు. అలాగే ఓ గిరిజన విద్యార్థిని స్కూల్ బాట పట్టించే కథాంశంతో తీసిన ‘సన్నాయి’ అనే షార్ట్‌ఫిలిం కూడా సృజన్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు పుష్పక విమానం ఫిలిం సర్కిళ్లలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. గోవర్దనరావు ప్రోత్సాహంతోనే.. ఈ సినిమాపై సృజన్ మాట్లాడుతూ విజయ దేవర కొండ తండ్రి గోవర్దనరావు ప్రోత్సాహంతోనే పుష్పక విమానం సినిమాను తెరకెక్కించానని తెలిపారు. నూతన దర్శకులు, నటులను ఆయన ఎంతో ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే తనకూ అవకాశం ఇచ్చారని తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ కూడా అండదండలు అందించారని తెలిపారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రోజూ వింటున్న సంఘటనల ఆధారంగా తీసినట్లు వివరించారు. -
పంచేద్రియాల చుట్టూ అల్లుకున్న కథే 'పంచతంత్రం'
‘దొరసాని’ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన జీవితా రాజశేఖర్ల చిన్న కుమార్తె శివాత్మిక నటిస్తున్న తాజా చిత్రం ‘పంచతంత్రం’. గురువారం శివాత్మిక పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. హీరో అడివి శేష్ టైటిల్ పోస్టర్ విడుదల చేసి, నటీనటుల వివరాలు వెల్లడించారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. కొంత గ్యాప్ తర్వాత స్వాతి నటిస్తున్న చిత్రం ఇది. నటిగా ఆమెకిది కమ్‌బ్యాక్ అనొచ్చు. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అఖిలేష్ వర్ధన్ , సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. సృజన్ మాట్లాడుతూ– ‘‘దొరసాని’లో తన నటనతో ఆకట్టుకున్న శివాత్మిక మా సినిమాలో లేఖ పాత్రలో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. ‘కలర్ ఫొటో’ ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ మాటలు రాశారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా, హ్యాపీగా ఉంది’’ అన్నారు శివాత్మిక. ‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాల చుట్టూ (చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన) అల్లుకున్న కథతో ఈ సినిమా ఉంటుంది. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉంటాయి’’ అన్నారు హర్ష. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ కె. నల్లి, లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భువన్ సాలూరు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఉషారెడ్డి వవ్వేటి, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి. -
ఆ శిశువు మాత్రం...
చుట్టూ గాఢాంధకారం... నల్లని మబ్బుల చాటున చంద్రుడు గుర్రు పెట్టి నిదరోతున్నాడు. గ్రామం గాఢ నిద్రలో ఉంది కదా అని ప్రకృతి కూడా అప్పుడే నిద్రకు ఉపక్రమించింది. పైరగాలి మాత్రం కొద్దిగా మేలుకొని మెల్లని, చల్లని గాలులను వీయిస్తోంది. ఆ గాలికి మైమరచి కొండలు ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. ఆ కొండల పక్కనే ఓ చిన్న బొరియ. దాని నిండా పలు రకాల పశువులు. ఇంతలో దూరంగా ఇద్దరు వ్యక్తులు.. చూడటానికి భార్యాభర్తల్లా ఉన్నారు. అసలే అర్ధరాత్రి. చలి గజగజ వణికిస్తోంది. చలికి ఆ స్త్రీ రెండు చేతులు చెవులపై అదిమి పెట్టింది. భార్య చలికి తట్టుకోలేక పోవడాన్ని గమనించి అతడు తన పై వస్త్రాన్ని తీసి ఆమెకు కప్పాడు. సరిగ్గా అప్పుడే చంద్రుడు నిద్రలేచాడు. నల్లని మబ్బుల కనురెప్పలను తెరచి లోకాన్ని చూసాడు. ఏదో చూడకూడని దాన్ని చూశాడు కాబోలు.. తన బాహువులను చూడమన్నట్లు వెన్నెలను విరగబూయించడం ప్రారంభించాడు. గాఢ నిద్రలో మునిగిన గ్రామం చంద్రుడి వెలుగును పట్టించుకోలేదు. ఆ జాబిల్లి వెలుగులో పశువులన్నీ ఓ మానవీయ ఘటనను చూశాయి. తమ వద్దకు వస్తున్న ఆ జంట చూడముచ్చటగా ఉంది. ఆమె నిండు గర్భిణి. ఏ క్షణమైనా ప్రసవం జరిగేలా ఉంది. వీరికి దారి చూపడానికే చంద్రుడు నిద్ర లేచాడా అన్నట్లు ఉందా పరిస్థితి. పసుల పాకలోని జంతువులు నిద్ర లేచాయి. ‘‘ఏంటి వీళ్ళు... ఇటే వస్తున్నారు. ఇప్పటికే ఇరుకుగా ఉంది. వీరెక్కడ సరిపోతారు’’ అందో గాడిద. ‘‘సరేలే ఉన్న దాంట్లో ఇరుక్కుంటారేమో నీకేంటి?’’ అంది పక్కనే ఉన్న మరో గాడిద. ‘‘సరిగ్గా చూడండెహే.. పాపం ఆవిడ ప్రసవానికి సిద్ధంగా ఉంది. నోర్మూసుకుని దారి ఇవ్వండి లేకపోతే తెలుసుగా, కొమ్ములకు ఈ మధ్యే పదును పెట్టా..’’ అని హెచ్చరించింది పక్కనే ఉన్న ఓ పొట్టేలు. ‘‘నిజమే.. అందరూ లేవండి.. మనం ఆ మూలకు వెళదాం’’ అంది గొర్రె. అప్పుడే నిద్ర లేచిన ఓ బుజ్జి మేక తనను కొంటె చూపుతో చూస్తున్న చంద్రుణ్ణి చూసింది. తర్వాత వాళ్ళ అమ్మతో.. ‘‘అమ్మా ఏమయిందే, ఇంకా తెల్లారలేదుగా.. అప్పుడే ఎందుకు లేపుతున్నావ్?’’ అని అడిగింది. ఇంతలో వారు లోనికి రానేవచ్చారు. పశువులన్నీ మరో మూలకు చేరి వారికి కొంచెం చోటిచ్చాయి. అనుకున్నదే అయింది. ఆ స్త్రీ వచ్చిన కొద్దిసేపటికే బంగారులాంటి కొడుకు పుట్టాడు. బుజ్జి మేక ఆ బాలుడి దగ్గర చేరి చెంగు చెంగున గెంతుతోంది. అది చూసి మిగిలిన బుజ్జి మేకలు, గొర్రె పిల్లలు మే.. మే అని పిల్లాడి చుట్టూ చేరి ఆడుకుంటున్నాయి. ‘‘ఎవరి సహాయం లేకపోయినా సుఖ ప్రసవం జరిగింది.. సంతోషం’’ అంది పొట్టేలు పక్కనే ఉన్న గాడిదతో... ‘‘నిజమే బాలుడు చూడ ముచ్చటగా ఉన్నాడు, నా మీద ఎక్కి కూర్చుంటే నగరమంతా తిప్పుతాను’’ అంది గాడిద. ఇంతలో ఓ గొర్రె పిల్ల కల్పించుకొని.. ‘‘అమ్మా చూడవే... ఈ బాబు అచ్చం నాలాగే ఉన్నాడు’’అంది. ‘‘నిజమేలేవే.. కొంచెం దూరంగా గెంతు.. బిడ్డ మీద పడేలా ఉన్నావు’’ అంది తల్లి. ఇంతలో బిడ్డ దగ్గరకు ఓ ఆవు, పెయ్య దూడ కలిసి వచ్చాయి. ఆ పెయ్య దూడ తన తల్లితో.. ‘‘అమ్మా.. బాబు చూడు నాలాగే ఎర్రగా ఉన్నాడు. ఒక్క మచ్చ కూడా లేదు’’ అంది. నిజమేనన్నట్లు ఆ ఆవు తలూపింది. ఇంతలో మబ్బులన్నీ నిద్ర లేచి గట్టిగా ఆవులించాయి. ఆ శబ్దానికి జంతువులన్నీ భయపడ్డాయి. ఇంతలో ఆ పాకలో గొప్ప వెలుగు పుట్టింది. ఆ వెలుగులో రెక్కలు కట్టుకున్న అందమైన జీవులు ప్రత్యక్షమయ్యాయి. ఏమిటీ వింత అని పెద్ద జంతువులన్నీ గుడ్లు మిటకరించి చూస్తున్నాయి. చిన్ని గాడిదలు, బుజ్జి మేకలు, గొర్రె పిల్లలు, పెయ్య దూడలు, కోడె దూడలు మాత్రం ఆనందంతో శబ్దాలు చేస్తూ చెంగు చెంగున గెంతుతూ నాట్యం చేస్తున్నాయి. బిడ్డ పుట్టుకతో, జంతు నాట్యాలతో పరవశులైన ఆ రెక్కల జీవులు బిడ్డను పొగిడి తిరిగి వెళ్లిపోయారు...అప్పటి వరకూ ఎగిరిన పసు పిల్లలు అన్నీ అలసిపోయి బిడ్డ చుట్టూ హాయిగా పడుకున్నాయి. పెద్ద జంతువులన్నీ కాసేపు ముచ్చట్లు కొనసాగించి అలాగే నిద్రపోయాయి. వేదనను అనుభవించిన ఆ స్త్రీ సంతోష మైకంతో, ఆత్మీయ ఆనందంతో నిద్రలోకి జారుకుంది. అప్పటివరకు గర్భవతియైన తన భార్యను కాపాడిన భర్త కూడా పడుకున్నాడు. అప్పుడే కన్ను తెరిచిన ఆ బిడ్డ మాత్రం కళ్లు ఇంతింత చేసుకుని లోకాన్ని ప్రేమ, కరుణ, శాంతి దిశగా మేల్కొలపాల్సిన అవసరం ఉందని అనుకుంటూ, తనకు జన్మనిచ్చిన తల్లి వైపు... ఆదరించిన తండ్రి వైపు కృతజ్ఞతతో చూశాడు. ఆ బిడ్డ మాత్రం... సంతోషంతో తనవైపే చూస్తున్న జాబిల్లిని, ఆనంద బాష్పాలను మంచు రూపంలో కురిపిస్తున్న నల్లని మబ్బులను... తన పుట్టుకను గాంచి మిగుల ఆనందపడిన పశు పిల్లలను, వాటి తల్లులను చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నీ మీద నగరానికి వస్తానని గాడిదకు మనసులోనే మాటిచ్చాడు. అచ్చం నాలాగే ఉన్నాడన్న గొర్రె పిల్లకు, ఎర్రగా ముద్దుగా ఒక్క మచ్చ కూడా లేదన్న పెయ్య దూడకు మీరన్నవన్నీ నిజమే అని తన మనసులో అనుకుంటూ చిరునవ్వుల వర్షం కురిపించాడు. – సృజన్ సెగెవ్ సాక్షి, హైదరాబాద్ -
ఇదేం సినిమా కథ కాదు...
సినిమాల ప్రభావంతో యువత పడుతున్న దారుల గురించి విరివిరిగా చర్చలు జరుగుతున్న సమయంలో.. ఓ ఎన్నారై యువకుడి ప్రయత్నం తెరపైకి వచ్చింది. విద్యాదానానికి మించింది లేదని బలంగా నమ్మిన ఆ 20 ఏళ్ల యువకుడు ఓ సినిమా ప్రేరణతో చేసిన ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం నింపేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నమే మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. సృజన్ నేపథ్యం.. అమెరికాలోని మేరీల్యాండ్, జర్మన్‌టౌన్‌లో తెలుగు దంపతులకు సృజన్ కోనేరు జన్మించాడు. ప్రస్తుతం పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఐఎస్(మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) కోర్సు అభ్యసిస్తున్నాడు. తల్లి ఏడాదిన్నర క్రితం పాంక్రియాటిక్ కేన్సర్‌తో కన్నుమూశారు. మాతృదేశంలోని విద్యా వ్యవస్థలో మార్పులు రావాలన్నది ఆమె కోరిక. దానిని నెరవేర్చేందుకు ఈ ఎన్నారై యువకుడు కదిలాడు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ సాయం తీసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషికి తన ఆలోచనను వివరించాడు. ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించటం, సోషల్ రెస్పాన్స్‌బిలిటీస్(సామాజికి బాధ్యత)పై అవగాహన కల్పిస్తానని, అందుకు అనుమతించాలని కోరాడు. అతని ఆలోచన నచ్చిన సీఎస్ జోషి కూడా అందుకు అనుమతిచ్చారు. తన ప్రయత్నానికి వేదికగా శంషాబాద్ దగ్గర్లోని సిద్ధాపురం గ్రామం.. జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సృజన్ ఎంచుకున్నాడు. ‘రెగ్యులర్ తరగతులకు ఏ మాత్రం భంగం కలగకుండా నా ప్రయత్నాన్ని మొదలుపెట్టా. మొదట్లో నేను ఆంగ్లం మాట్లాడుతుంటే విద్యార్థులు సిగ్గుపడేవారు. వాళ్ల నేపథ్యం.. పరిస్థితులు నాకు అర్థమయ్యాయి. అప్పటి నుంచి వారిలో తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టాక.. క్రమంగా నాకు దగ్గర అవ్వటం ప్రారంభించారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపటమే ముఖ్యమని భావించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టా. క్రమక్రమంగా వాళ్లు ఆంగ్లంలో మాట్లాడటం మొదలుపెట్టారు. చాలా సంతోషంగా ఉంది’ అని సృజన్ చెబుతున్నాడు. ఈ ఎన్నారై అందరిలా కాదు... ‘20 ఏళ్ల యువకుడు. టీచింగ్‌లో ఎలాంటి అనుభవం లేని వ్యక్తి. పైగా ఎన్నారై. అయినా సొంత గడ్డపై మమకారంతో చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందించదగ్గ విషయం. విద్యార్థులు అతని పాఠాల కోసం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మణివర్థన్ రెడ్డి సృజన్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం వారాంతం నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తున్న సృజన్.. ఈ నెలాఖరులో ఈ ‘ఎంపవర్మెంట్ బియాండ్ ఎడ్యుకేషన్’ ప్రాజెక్టు పూర్తి రిపోర్టును అందించేందుకు సిద్ధమవుతున్నాడు. తన ఈ ప్రయత్నం ద్వారా మరికొందరు ఎన్నారైల్లో కదలిక తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని, తద్వారా మాతృభూమికి ఎంతో కొంత మేలు జరగుతుందని సృజన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మహేష్ అభిమాని... అన్నట్లు సృజన్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు అభిమాని అంట. అంతేకాదు భరత్ అనే నేను చిత్రంలోని కాన్సెప్ట్(ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం)తోనే ప్రేరణ పొంది తాను ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టానని సృజన్ చెబుతున్నాడు కూడా. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇదే సిద్దాపురం గ్రామాన్ని గతంలో మహేష్ దత్తత తీసుకున్నారు కూడా. -
లోకేశ్ కోసమే తాంత్రిక పూజలు
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘సీఎం చంద్రబాబు , రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు రాజయోగం దక్కడం కోసం కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేశాం అని సృజన్ కొన్ని రోజులుగా మాతో చెబుతున్నాడు. మేము పట్టించుకోలేదు. కానీ, ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు చేశారని వెలుగులోకి రావడంతో అది నిజమేనని అర్థమైంది’’... ఇదీ సృజన్ సన్నిహితులు, బంధువులు ప్రస్తుతం చెబుతున్న మాట. దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పూజలు చేశారని చెప్పిన సృజన్ ఆచూకీ కనిపించడం లేదు. నారా లోకేశ్ కోసమే తాంత్రిక పూజలు చేశామని సృజన్ చెప్పడం... ఆ తరువాత అతడు కనిపించకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సృజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల వ్యూహం ప్రకారమే వారు నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరీ సృజన్? గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివేరుకు చెందిన అర్చకుడు సృజన్. అక్కడ శివాలయంలో పనిచేస్తున్నాడు. ఇంద్రకీలాద్రిపై డిసెంబరు 26న అర్ధరాత్రి తాంత్రిక పూజలు చేసిన సమయంలో అతడు అక్కడే ఉన్నాడు. స్మార్త వైదిక ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అమ్మవారి కవచాన్ని తొలగించి, మహిషాసురమర్థినిగా అలం కరణ చేసింది సృజనే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి అతని అచూకి లేదు. విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు నోరువిప్పడం లేదు. విజయవాడలోని ఓ గుర్తు తెలియని ప్రదేశంలో సృజన్‌ను ఉంచినట్లు తెలుస్తోంది. -
వర్ధమాన నటిపై లైంగిక వేధింపులు
విజయవాడ: విజయవాడ సమీపంలో నిడమానూరు వద్ద ఓ వర్ధమాన నటిని లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తనకు సినిమాలో హీరోయిన్ చాన్స్ ఇస్తామని హైదరాబాద్‌కు చెందిన వర్ధమాన దర్శకుడు చలపతి, వర్ధమాన హీరో సృజన్‌లు ఆశ కల్పించి తన కారులో హైదరాబాద్ నుంచి భీమవరం తీసుకువెళుతున్నారని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో ముందు సీట్లో కూర్చున్న తనపై దర్శకుడు చలపతితో పాటు హీరో సృజన్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారని పేర్కొన్నారు. గొడవ జరుగుతుండగా తన కారు పక్కనే వెళుతున్న ఓ లారీని ఢీకొందని తెలిపారు. గాయాలకు గురైన తనను విజయవాడలో ఓ ప్రైవేట్ ఆస్పతిలో చేర్పించారని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హైదరాబాద్ నుంచి వచ్చి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. నిందితుడు చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్ధమాన హీరోగా చెబుతున్న సృజన్ పరారీలో ఉన్నాడు. -
పోలీసుల అదుపులో బ్లాక్మెయిల్ నిందితులు
శనివారం నగరంలోని అమీర్‌పేట్‌లో రియల్టర్‌ను తుపాకీతో బెదిరించిన ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ సమీపంలో నిన్న రియల్టర్ కిషోర్‌కుమార్ ను కొందరు దుండగులు తుపాకీతో బెదిరించారు. దీంతో భయబ్రాంతులకు గురైన కిషోర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ సంఘటనతో సంబంధం ఉన్న కిషోర్ కుమార్ వ్యాపార భాగస్వాములు సృజన్, రాఘవేంద్రలతో పాటు మరో వ్యక్తిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం వెలికితీత
ధర్మసాగర్ : ధర్మసాగర్ రిజర్వాయర్‌లో గల్లంతైన ఇద్దరిలో కానిస్టేబుల్ పొలుమారి సృజన్(25) మృతదేహం సోమవారం ఉద యం లభ్యమైంది. ధర్మసాగర్ రిజర్వాయర్ లో ఆదివారం ఇద్దరు గల్లంతు కాగా అందులో పీఈటీ మాచర్ల సునీల్ మృతదేహాన్ని ఆదివా రం రాత్రి వెలికితీశారు. అయితే, చీకటి పడడంతో గాలింపు నిలిపివేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం స్థానిక జాలర్ల గాలింపు లో సృజన్ మృతదేహం బయటపడగా పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృత్యువులోనూ కలిసే.. ఉజ్వల భవిష్యత్ ఉన్న సృజన్, సునీల్ ప్రమాదవశాత్తు నీటి మునిగి మృత్యువాత పడడంతో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎంజీఎంలో యువకుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యాక సోమవారం మధ్యాహ్నం వారి స్వగృహాలకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చిన్ననాటి నుండి కలిసి చదువుకుని, మృత్యువులో సైతం వీడిపోని తమ స్నేహితుల మృతదేహాలను చూసిన సహచరులు గుండెలవిసేలా రోదించారు. ఇక జీవిత చరమాంకంలో తమకు అండగా ఉంటారనుకున్న తమ కుమారులు విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. కాగా, కానిస్టేబుల్ పొలిమారి సృజన్ మృతదేహానికి పోలీస్ సిబ్బంది, స్థానిక సెయింట్ మా«థ్యూస్ స్కూల్లో పీఈటీగా పని చేస్తున్న మాచర్ల సునీల్ మృతదేహానికి పాఠశాల సిబ్బంది నివాళులర్పించారు. ఈ మేరకు సాయంత్రం యువకుల మృతదేహాలకు స్థానిక రోమన్ క్యాథలిక్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
రిజర్వాయర్‌లో కానిస్టేబుల్ మృతదేహం
వరంగల్: వరంగల్ జిల్లా ధర్మాసాగర్ జలాశయంలో ఆదివారం గల్లంతైన కానిస్టేబుల్ పొలిమారి సృజన్(25)మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. ఆదివారం మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన సృజన్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. -
హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య
డి. పోచంపల్లిలోని శ్రీసాయి గణేశ్ బాయ్స్ హాస్టల్లో శివ శృజన్(18) అనే యువ విద్యార్థి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత సమస్యలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు నోట్ సూసైడ్ నోట్ రాశాడు. శృజన్ దుండిగల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పార్క్ చేసిన కారులో మంటలు, ఒకరి మృతి
-
పార్క్ చేసిన కారులో మంటలు, ఒకరి మృతి
హైదరాబాద్ : ఇంటి ముందు పార్క్ చేసిన కారులో నుంచి మంటలు చెలరేగి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే సురేష్ రెడ్డి గత రాత్రి తన ఇంటి ముందు కారు పార్క్ చేశారు. సురేష్ రెడ్డి ఇద్దరు కుమారులు శుక్రవారం కారులో ఉన్న పెన్‌డ్రైవ్ తీసుకునేందుకు వెళ్లారు. కారు డోర్లు తెరిచి పెన్ డ్రైవ్ తీసుకుంటుండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు ముందు సీటులో ఉన్న సృజన్ కొద్దిపాటి గాయాలతో వెంటనే బయటకు రాగా, వెనక సీటులో ఉన్న శ్రేయన్ మంటల్లో చిక్కుకున్నాడు. సుమారు 80 శాతం గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన అతడు మృతి చెందాడు. మరోవైపు సృజన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా రాత్రి కారు పార్క్ చేసిన సమయంలో లైట్లు ఆఫ్ చేయకపోవడంతో, ఇవాళ ఉదయం కారు ఓపెన్ చేయగానే షార్ట్ సర్క్యూట్ సంభవించినట్లు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
తాండూరు విద్యార్థి సురక్షితం
తాండూరు: హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ప్రమాదం నుంచి తాండూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పానుగంటి సృజన్ సురక్షితంగా బయటపడ్డారు. తాండూరుకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి పానుగంటి విశ్వనాథం కుమారుడు సృజన్. ఎలక్ట్రానిక్స్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈఐఈ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వరద ప్రమాదం నుంచి సృజన్ క్షేమంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా సృజన్ సోమవారం చండిఘడ్ నుంచి ఫోన్లో మాట్లాడారు. ప్రమాద వివరాలు తెలియజేశారు. వివరాలు సృజన్ మాటల్లోనే.. ఈ నెల 3న టూర్‌కు బయల్దేరి వెళ్లాం. ఆదివారం సిమ్లా పర్యటన అనంతరం మనాలికి రెండు బస్సుల్లో బయల్దేరాం. మనాలి మార్గమధ్యంలో మండి జిల్లాలోని లార్జి హైడ్రోవర్ పవర్ ప్రాజెక్టు వద్ద ఆగారు. అక్కడ విద్యార్థిని, విద్యార్థులు డ్యామ్ వద్ద ఫొటోలు దిగేందుకు వెళ్లారు. నేను మరికొంత మంది విద్యార్థులు ఒడ్డున నిల్చున్నాం. అప్పుడు సమయం సాయంత్రం 6.30 గంటలు అవుతోంది. డ్యామ్ గేట్లు ఒక్కసారిగా ఎత్తడంతో నీటి ప్రవాహం దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నీటి ప్రవాహం పెరిగింది. డ్యామ్ కింది భాగంలో ఫొటోలు దిగుతున్న విద్యార్థినీ విద్యార్థులు తప్పించుకునే వీలు లేకపోయింది. ఆ ప్రవాహంలో విద్యార్థులు గల్లంతయ్యారు. విద్యార్థులందరం రక్షించాలని కేకలు వేశాం. వెంటనే నేను ‘100’ నంబర్‌కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారమిచ్చాను. రెస్క్యూటీంను పంపించాలని కోరాం. తర్వాత స్థానిక అధికారులకు సమాచారమిచ్చినా సకాలంలో స్పందించలేదు. ప్రమాదం జరిగిన సుమారు రెండు గంటలకు బైక్‌మీద ఒక పోలీసు కానిస్టేబుల్ ఘటనా స్థలానికి వచ్చాడు. డ్యామ్గేట్లు ఎత్తినప్పుడు ఎలాంటి అలారం శబ్దం వినపడలేదు. కాస్త బయట రాళ్లపై నిల్చున్నవాళ్లమే తప్పించుకోగలిగాం. అక్కడి అధికారులు సకాలంలో స్పందించి ఉంటే కొందరినైనా కాపాడుకుని ఉండేవాళ్లం...’ అని వివరించాడు. తన కుమారుడు క్షేమంగా ఉన్నాడనే సమాచారంతో తండ్రి విశ్వనాథంతోపాటు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన తాండూరు విద్యార్థి సృజన్‌తోపాటు తండ్రి విశ్వనాథంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఫోన్లో మాటాడారు. ప్రమాద వివరాలు ఆయన తెలుసుకున్నారు.