చుట్టూ గాఢాంధకారం... నల్లని మబ్బుల చాటున చంద్రుడు గుర్రు పెట్టి నిదరోతున్నాడు. గ్రామం గాఢ నిద్రలో ఉంది కదా అని ప్రకృతి కూడా అప్పుడే నిద్రకు ఉపక్రమించింది. పైరగాలి మాత్రం కొద్దిగా మేలుకొని మెల్లని, చల్లని గాలులను వీయిస్తోంది. ఆ గాలికి మైమరచి కొండలు ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. ఆ కొండల పక్కనే ఓ చిన్న బొరియ. దాని నిండా పలు రకాల పశువులు.
ఇంతలో దూరంగా ఇద్దరు వ్యక్తులు..
చూడటానికి భార్యాభర్తల్లా ఉన్నారు. అసలే అర్ధరాత్రి. చలి గజగజ వణికిస్తోంది. చలికి ఆ స్త్రీ రెండు చేతులు చెవులపై అదిమి పెట్టింది. భార్య చలికి తట్టుకోలేక పోవడాన్ని గమనించి అతడు తన పై వస్త్రాన్ని తీసి ఆమెకు కప్పాడు. సరిగ్గా అప్పుడే చంద్రుడు నిద్రలేచాడు. నల్లని మబ్బుల కనురెప్పలను తెరచి లోకాన్ని చూసాడు. ఏదో చూడకూడని దాన్ని చూశాడు కాబోలు.. తన బాహువులను చూడమన్నట్లు వెన్నెలను విరగబూయించడం ప్రారంభించాడు. గాఢ నిద్రలో మునిగిన గ్రామం చంద్రుడి వెలుగును పట్టించుకోలేదు.
ఆ జాబిల్లి వెలుగులో పశువులన్నీ ఓ మానవీయ ఘటనను చూశాయి. తమ వద్దకు వస్తున్న ఆ జంట చూడముచ్చటగా ఉంది. ఆమె నిండు గర్భిణి. ఏ క్షణమైనా ప్రసవం జరిగేలా ఉంది. వీరికి దారి చూపడానికే చంద్రుడు నిద్ర లేచాడా అన్నట్లు ఉందా పరిస్థితి. పసుల పాకలోని జంతువులు నిద్ర లేచాయి. ‘‘ఏంటి వీళ్ళు... ఇటే వస్తున్నారు. ఇప్పటికే ఇరుకుగా ఉంది. వీరెక్కడ సరిపోతారు’’ అందో గాడిద. ‘‘సరేలే ఉన్న దాంట్లో ఇరుక్కుంటారేమో నీకేంటి?’’ అంది పక్కనే ఉన్న మరో గాడిద. ‘‘సరిగ్గా చూడండెహే.. పాపం ఆవిడ ప్రసవానికి సిద్ధంగా ఉంది. నోర్మూసుకుని దారి ఇవ్వండి లేకపోతే తెలుసుగా, కొమ్ములకు ఈ మధ్యే పదును పెట్టా..’’ అని హెచ్చరించింది పక్కనే ఉన్న ఓ పొట్టేలు.
‘‘నిజమే.. అందరూ లేవండి.. మనం ఆ మూలకు వెళదాం’’ అంది గొర్రె. అప్పుడే నిద్ర లేచిన ఓ బుజ్జి మేక తనను కొంటె చూపుతో చూస్తున్న చంద్రుణ్ణి చూసింది. తర్వాత వాళ్ళ అమ్మతో.. ‘‘అమ్మా ఏమయిందే, ఇంకా తెల్లారలేదుగా.. అప్పుడే ఎందుకు లేపుతున్నావ్?’’ అని అడిగింది. ఇంతలో వారు లోనికి రానేవచ్చారు. పశువులన్నీ మరో మూలకు చేరి వారికి కొంచెం చోటిచ్చాయి. అనుకున్నదే అయింది. ఆ స్త్రీ వచ్చిన కొద్దిసేపటికే బంగారులాంటి కొడుకు పుట్టాడు. బుజ్జి మేక ఆ బాలుడి దగ్గర చేరి చెంగు చెంగున గెంతుతోంది. అది చూసి మిగిలిన బుజ్జి మేకలు, గొర్రె పిల్లలు మే.. మే అని పిల్లాడి చుట్టూ చేరి ఆడుకుంటున్నాయి.
‘‘ఎవరి సహాయం లేకపోయినా సుఖ ప్రసవం జరిగింది.. సంతోషం’’ అంది పొట్టేలు పక్కనే ఉన్న గాడిదతో... ‘‘నిజమే బాలుడు చూడ ముచ్చటగా ఉన్నాడు, నా మీద ఎక్కి కూర్చుంటే నగరమంతా తిప్పుతాను’’ అంది గాడిద. ఇంతలో ఓ గొర్రె పిల్ల కల్పించుకొని.. ‘‘అమ్మా చూడవే... ఈ బాబు అచ్చం నాలాగే ఉన్నాడు’’అంది. ‘‘నిజమేలేవే.. కొంచెం దూరంగా గెంతు.. బిడ్డ మీద పడేలా ఉన్నావు’’ అంది తల్లి. ఇంతలో బిడ్డ దగ్గరకు ఓ ఆవు, పెయ్య దూడ కలిసి వచ్చాయి. ఆ పెయ్య దూడ తన తల్లితో.. ‘‘అమ్మా.. బాబు చూడు నాలాగే ఎర్రగా ఉన్నాడు. ఒక్క మచ్చ కూడా లేదు’’ అంది. నిజమేనన్నట్లు ఆ ఆవు తలూపింది. ఇంతలో మబ్బులన్నీ నిద్ర లేచి గట్టిగా ఆవులించాయి. ఆ శబ్దానికి జంతువులన్నీ భయపడ్డాయి. ఇంతలో ఆ పాకలో గొప్ప వెలుగు పుట్టింది. ఆ వెలుగులో రెక్కలు కట్టుకున్న అందమైన జీవులు ప్రత్యక్షమయ్యాయి.
ఏమిటీ వింత అని పెద్ద జంతువులన్నీ గుడ్లు మిటకరించి చూస్తున్నాయి. చిన్ని గాడిదలు, బుజ్జి మేకలు, గొర్రె పిల్లలు, పెయ్య దూడలు, కోడె దూడలు మాత్రం ఆనందంతో శబ్దాలు చేస్తూ చెంగు చెంగున గెంతుతూ నాట్యం చేస్తున్నాయి. బిడ్డ పుట్టుకతో, జంతు నాట్యాలతో పరవశులైన ఆ రెక్కల జీవులు బిడ్డను పొగిడి తిరిగి వెళ్లిపోయారు...అప్పటి వరకూ ఎగిరిన పసు పిల్లలు అన్నీ అలసిపోయి బిడ్డ చుట్టూ హాయిగా పడుకున్నాయి. పెద్ద జంతువులన్నీ కాసేపు ముచ్చట్లు కొనసాగించి అలాగే నిద్రపోయాయి. వేదనను అనుభవించిన ఆ స్త్రీ సంతోష మైకంతో, ఆత్మీయ ఆనందంతో నిద్రలోకి జారుకుంది. అప్పటివరకు గర్భవతియైన తన భార్యను కాపాడిన భర్త కూడా పడుకున్నాడు. అప్పుడే కన్ను తెరిచిన ఆ బిడ్డ మాత్రం కళ్లు ఇంతింత చేసుకుని లోకాన్ని ప్రేమ, కరుణ, శాంతి దిశగా మేల్కొలపాల్సిన అవసరం ఉందని అనుకుంటూ, తనకు జన్మనిచ్చిన తల్లి వైపు... ఆదరించిన తండ్రి వైపు కృతజ్ఞతతో చూశాడు.
ఆ బిడ్డ మాత్రం... సంతోషంతో తనవైపే చూస్తున్న జాబిల్లిని, ఆనంద బాష్పాలను మంచు రూపంలో కురిపిస్తున్న నల్లని మబ్బులను... తన పుట్టుకను గాంచి మిగుల ఆనందపడిన పశు పిల్లలను, వాటి తల్లులను చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నీ మీద నగరానికి వస్తానని గాడిదకు మనసులోనే మాటిచ్చాడు. అచ్చం నాలాగే ఉన్నాడన్న గొర్రె పిల్లకు, ఎర్రగా ముద్దుగా ఒక్క మచ్చ కూడా లేదన్న పెయ్య దూడకు మీరన్నవన్నీ నిజమే అని తన మనసులో అనుకుంటూ చిరునవ్వుల వర్షం కురిపించాడు.
– సృజన్ సెగెవ్
సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment