1919లో మూసీ ఒడ్డున వెలసిన హైకోర్టు
భారీ గుమ్మటాలతో ఆకట్టుకునేలా నిర్మాణం
గులాబీ, తెలుపు గ్రానైట్‌లతో భవనం రూపకల్పన
మూడు ప్రభుత్వాలకు న్యాయాలయంగా సేవలు
హైకోర్టు తరలింపు నేపథ్యంలో ప్రత్యేక కథనం
సాక్షి, హైదరాబాద్: మూసీనది ఒడ్డున ఠీవిగా నిల్చున్న అద్భుత కట్టడం.. భారీ గుమ్మటాలతో చూడగానే ఆకట్టుకునేలా నిర్మాణం.. వందేళ్లకు పైగా చరిత్ర. ఎందరో గొప్ప మేధావులు న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా పని చేసిన భవనం. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన వారూ అనేకమే. కోట్లాది మందికి న్యాయాన్ని అందించిన సజీవ సాక్ష్యం. గులాబీ, తెలుపు గ్రానైట్‌లతో రూపుదాల్చిన విశాల భవంతి. నాటి నిజాం ప్రభుత్వానికి, ఉమ్మడి ఏపీ సర్కార్‌కు, ప్రత్యేక తెలంగాణ సర్కార్‌కు ఉన్నత న్యాయస్థానంగా నగరం నడిబొడ్డున సేవలందించిన భారీ కట్టడం. ఈ హైకోర్టును బుద్వేల్‌కు తరలించాలని కొందరు.. వద్దు ఇక్కడే కొనసాగించాలని మరికొందరు.. ఈ వాదనల నేపథ్యంలో కొద్దికాలం క్రితం బుద్వేల్‌లో కొత్త హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 105 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్న హైకోర్టు భవనంపై ప్రత్యేక కథనం.
హైకోర్టు ఏర్పాటు ఇలా...
’ఆంగ్లేయుల పాలనలో రూపొందించిన అనేక నిబంధనలు నిజాం ప్రభుత్వం అధీనంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇతర ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధంగా ఇక్కడ కూడా కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలుత పత్తర్‌ఘాట్లో హైకోర్టును నెలకొల్పారు. 1908లో వచ్చిన వరదల తర్వాత లాల్‌బాగ్‌లో ఉండే ఆస్మాన్ ఝా నవాబ్ నివాస గృహంలోకి మార్చారు. 1912లో నగరంలో కలరా వ్యాధి రావడంతో పబ్లిక్ గార్డెన్స్ హాల్‌కు, అక్కడి నుంచి సాలార్‌జంగ్ బహదూర్ నివాసానికి తరలించారు. అక్కడ స్థలం సరిపోక ఇబ్బందిపడాల్సి వచ్చింది. దీంతో సైఫాబాద్‌ని సర్తాజ్జంగ్ నవాబ్ ఇంటికి మార్చారు.
హైకోర్టు భవనానికి రూపకల్పన...
1915, ఏప్రిల్ 15న ప్రస్తుత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. జైపూర్‌కు చెందిన శంకర్‌లాల్ ఆర్కిటెక్ట్‌గా, మెహర్ అలీఫజల్ ఇంజనీర్‌గా వ్యవహరించారు. శంషాబాద్ వద్ద గగ న్‌పహాడ్‌లోని కొండలను తొలిచి, ఇండో ఇస్లామిక్ శైలిలో పాతబస్తీలోని మూసీనది ఒడ్డున నిర్మించారు. 1919, మార్చి 31న భవన నిర్మాణం పూర్తయింది. మూసీపై నయాపూల్ వంతెన పక్కన హైకోర్టు భవనం ఠీవిగా కొలువుదీరింది. నిజాం కాలం నాటి 18,22,750 సిక్కాల వ్యయంతో 9 ఎకరాల్లో నిర్మించిన ఈ భవనాన్ని 1920, ఏప్రిల్ 20న ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1956, నవంబర్ 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చారు. ఆ తర్వాత పలు అవసరాల నిమిత్తం కొత్త భవనాలు నిర్మిస్తూ వచ్చారు. హైన్ మహల్, నది మహల్, కుతుబ్ షాహీ నిర్మాణాల శిథిలాలపై ఈ చారిత్రక, వారసత్వ హైకోర్టు భవనాన్ని నిర్మించారు.
ప్రత్యేక రాష్ట్రం తర్వాత...
2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా.. ఒకే భవనంలో ఏపీ, తెలంగాణ హైకోర్టులు కొనసాగుతూ వచ్చాయి. 2018, డిసెంబర్ 26న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడంతో 2019, జనవరి 1న ఏపీ హైకోర్టు అమరావతికి తరలివెళ్లిపోయింది. తర్వాత ఈ భవనం పూర్తిగా తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు.
ముఖ్యాంశాలు...
⇒ నిజాం కాలంలో మొదటి ప్రధాన న్యాయమూర్తి: నిజామత్ జంగ్
⇒ స్వాతంత్య్రానికి పూర్వం జడ్జీల నియామకం చేసింది: నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్
⇒ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైకోర్టుకు తొలి సీజే: జస్టిస్ కోకా సుబ్బారావు
⇒ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర హైకోర్టు తొలి సీజే: జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా
⇒ పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టు రూపకల్పన (ఏపీ హైకోర్టు తరలిన) తర్వాత తొలి సీజే: జస్టిస్ టీబీ రాధాకృష్ణన్
⇒ 2019లో నిర్మాణం వందేళ్లు పూర్తి చేసుకుంది
⇒ 1948 నుంచి 1950 వరకు ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ కూడా పనిచేసింది. ఉర్దూ అధికారిక భాష కావడంతో ఇక్కడ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.
⇒ ప్రధాన భవనంలో 32 కోర్టు హాళ్లు, 38 చాంబర్లు ఉంటాయి.
జడ్జీల సంఖ్య పెరిగిందిలా...
ప్రస్తుత హైకోర్టు భవనం ప్రారంభించే నాటికి ఉన్న న్యాయమూర్తులు 6
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తులు 12
1970లో న్యాయమూర్తుల సంఖ్య 32
1987లో న్యాయమూర్తుల సంఖ్య 36
2014లో న్యాయమూర్తుల సంఖ్య 61
విభజన సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24
2021లో న్యాయమూర్తుల సంఖ్య 42
Comments
Please login to add a commentAdd a comment