Christmas Day
-
మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మెదక్‌జోన్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా ప్రార్థనలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. తెల్లవారు జామున 4.30 గంటలకు మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రెవరెండ్ బిషప్ సాల్మన్‌రాజ్ భక్తులకు దైవ సందేశం అందించి.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు క్రీస్తు జననం మానవాళి అంతటికీ శుభదినం అన్నారు. భక్తులు ఏసు చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు భక్తులకు చర్చి దర్శనానికి అనుమతిచ్చారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులను ఆశీర్వదించేందుకు 15 మంది గురువులను అందుబాటులో ఉంచామని రెండో ఆరాధనలో దైవ సందేశమిచ్చిన చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జ్ జార్జ్ ఎబనైజర్రాజ్ తెలిపారు. ఈ ఉత్సవాలకు డయాసిస్ పరిధిలోని 13 జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. చర్చిలో ఆలపించిన భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ సందర్భంగా కల్వరి టెంపుల్‌కు భారీగా హాజరైన భక్తులు అన్ని మతాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం: మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, అందులో భాగంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ గిఫ్టు ప్యాకెట్లు అందజేశారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మతాలను గౌరవిస్తూ రాష్ట్ర శ్రేయస్సును కోరుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ఏసుప్రభువు ఆశీస్సులు ఉండాలన్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలను దేశానికి అందించాలనే ఉదేశంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. ఆమెతోపాటు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ఒప్పందం
యూరప్ యూనియన్(ఈయూ) నుంచి నిష్క్రమించే బ్రెగ్జిట్ ప్రక్రియ సజావుగా ముగుస్తుందా లేదా అని ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన బ్రిటన్ పౌరులకు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ క్రిస్మస్ పర్వదినాన బ్రస్సెల్స్ నుంచి మంచి కబురు అందించారు. ఈయూ నుంచి వైదొలగడానికి సంబంధించిన ఒప్పందానికి ఇక కేవలం ఏడు రోజులే గడువుండగా ఎవరూ ఊహించని రీతిలో దీనికి శుభం కార్డు పడింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 1 నుంచి లాంఛనంగా బ్రిటన్ ఈయూ నుంచి బయటికొచ్చింది. కానీ దానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఒప్పందం కుదరడానికి మళ్లీ ఏడాది పట్టింది. ఒకటా రెండా... నాలుగేళ్లుగా అటు ఈయూకూ, ఇటు బ్రిటన్‌కూ ఇదొక సంక్లిష్ట సమస్యగా మారింది. ఎడతెగకుండా సాగిన చర్చలు ప్రతిసారీ ప్రతిష్టంభనలోనే ముగిసి ఉసూరనిపించాయి. ఒప్పందం వల్ల జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడటం.... అందుకు అనువైన రీతిలో ఈయూను ఒప్పించడం జాన్సన్‌కు పెను సమస్యగా మారింది. ఒక దశలో విసుగెత్తి ఒప్పందం లేకున్నా ఖాతరు చేసేది లేదని, దేనికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. అటు ఈయూకు సైతం ఇది జీవన్మరణ సమస్యే. బయటికెళ్లిన బ్రిటన్‌కు అంతా బాగుందని, అందువల్ల అది ఎంతో లాభపడిందని ఇతర సభ్య దేశాలు అనుకుంటే ఈయూ నుంచి ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తారు. వెళ్లిపోవడం వల్ల అది ఎంతో నష్టపోయిందన్న అభిప్రాయం కలగడం దాని మనుగడకు ముఖ్యం. కనుకనే ఒప్పందం కుదరడానికి నాలుగేళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. అయితే తాజాగా ఒప్పందం కుదిరిందంటూ చేసిన ప్రకటనతోపాటు విడుదలైన జాన్సన్ ఫొటో చూస్తే అంతా బ్రిటన్‌కు అనుకూలంగానే ముగిసిందన్న అభిప్రాయం అందరికీ కలుగుతుంది. అటు ఈయూ కూడా ఈ ఒప్పందం ఇరుపక్షాలకూ ప్రయోజనం చేకూర్చేదని, న్యాయమైనదని అంటోంది. అయితే ఇంతమాత్రం చేత ఇంకా అంతా అయిపోయినట్టు కాదు. ఈ ఒప్పందాన్ని జాన్సన్ బ్రిటన్ పార్లమెంట్ ముందుంచి దాని ధ్రువీకరణ పొందాలి. అందుకోసం మరో అయిదు రోజుల్లో బ్రిటన్ పార్లమెంటు సమావేశం కాబోతోంది. అటు 27 మంది ఈయూ పెద్దలు సభ్య దేశాల రాయబారులనూ సమావేశపరిచి ఒప్పంద వివరాలు చెప్పడం క్రిస్మస్ రోజునే మొదలైంది. ఈ రాయబారులంతా వెనువెంటనే స్వదేశాలకెళ్లి అధినేతలకు ఒప్పందాన్ని వివరిస్తారు. అన్ని దేశాల పార్లమెంటులూ ఈ నెలాఖరుకల్లా ఒప్పందంపై ఆమోదముద్ర వేయాలి. ఇది నష్టదాయకమైనదని ఏ దేశం భావించినా ఒప్పందాన్ని వీటో చేయొచ్చు. ఈ ప్రక్రియ సాఫీగా ముగిసిపోతే ఈయూ పార్లమెంటు వచ్చే నెల మొదట్లో ఒప్పందాన్ని పరిశీలించడం మొదలెడుతుంది. అది ధ్రువీకరించేవరకూ దీన్ని తాత్కాలిక ఒప్పందంగానే పరిగణిస్తారు. బ్రెగ్జిట్ భూతం 2016లో డేవిడ్ కామెరాన్, నిరుడు థెరిస్సా మే జాతకాలను తలకిందులు చేసింది. వారిద్దరూ అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు ఎన్నికలు తప్పలేదు. థెరిస్సా మే స్థానంలో వచ్చిన బోరిస్ జాన్సన్ గత ఏడాది అక్టోబర్‌లో కూడా ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. అది కాస్తా పార్లమెంటులో వీగిపోవటంతో ఆయన ప్రభుత్వం రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సివచ్చింది. తిరిగి మళ్లీ ప్రధాని అయిన దగ్గరినుంచి ఆయన బ్రెగ్జిట్పైనే అధిక సమయం వెచ్చించారు. ఒకపక్క హఠాత్తుగా విరుచుకుపడిన కరోనా మహమ్మారితో దేశం అయోమయావస్థలో పడగా... ఆయనే ఆ వ్యాధిబారిన పడ్డారు. ఇలా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. ఇంతకూ ఒప్పందంలో ఏముంది? ఇరు పక్షాలూ చెప్పుకుంటున్నట్టు అది ఉభయత్రా ప్రయోజనకరమైనదేనా... లేక పాత ఒప్పందాల మాదిరే దీన్ని కూడా పార్లమెంటు విసిరికొడుతుందా అన్నది తేలడానికి మరికొన్ని రోజులు పడుతుంది. 1,800 పేజీలున్న ఒప్పందంలో ఇరుపక్షాల సంబంధాలపైనా అనేకానేక నిబంధనలున్నాయి. ఇటు బ్రిటన్, అటు ఈయూ వేర్వేరుగా మనుగడ సాగిస్తూ వాణిజ్యరంగంలో కలిసి పనిచేయడానికి ఏమేం పాటించాలో, ఉత్పత్తయ్యే సరుకుపై విధించే పన్నులు ఎలా వుండాలో చెప్పే నిబంధనలవి. ఒక దేశంగా బ్రిటన్‌కు ఇకపై పూర్తి సార్వభౌమాధికారం చేతికొచ్చినట్టే. అది తన భవిష్యత్తును తానే నిర్దేశించుకోగలుగుతుంది. ఇకపై ఈయూ నియమ నిబంధనలు వర్తించవు. నచ్చిన చట్టాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు. ఈయూ ధ్రువీకరణ అవసరం లేదు. యూరపియన్ న్యాయస్థానం బెడద వుండదు. బ్రిటన్ పౌరులు ఈయూ ప్రాంత దేశాలకు వెళ్లాలన్నా, అక్కడివారు ఇటు రావాలన్నా ఇకపై వీసా తప్పనిసరి కావొచ్చు. బ్రిటన్ పరిధిలోని ఇంగ్లిష్ చానెల్లో చేపలు పట్టడానికి ఈయూ ఫిషింగ్ బోట్లకు అనుమతులు అవసరమవుతాయి. ఈయూ ఏటా 60 లక్షల టన్నుల చేపల్ని ఎగుమతి చేస్తుంది. అందులో ఏడు లక్షల టన్నులు ఇంగ్లిష్ చానెల్, ఇతర కెనాల్స్‌లో లభిస్తాయి. దీని విలువ 65 కోట్ల పౌండ్లు. ఇదే ఒప్పందం కుదరడానికి అడ్డంకిగా మారింది. చివరకు ఏకాభిప్రాయం కుదిరింది. అయితే ప్రశ్నలు చాలానే వున్నాయి. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సేవారంగంపై ఆధారపడివుంటుంది. ఆ రంగానికి ఈయూ ప్రాంత దేశాల్లో అవకాశాలెలా వుంటాయో తెలియదు. ఎందుకంటే ఈ ఒప్పందంలో దాని ఊసే లేదు. ముఖ్యంగా విత్త సంబంధ సేవారంగం పరిస్థితేమిటో అగమ్యగోచరం. ఆ రంగానికి ఈయూ ఏమేరకు చోటిస్తుందో చూడాలి. ఏడాది క్రితం కుదిరిన అవగాహనకు భిన్నంగా ఇటీవలే అంతర్గత మార్కెట్లకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చింది. అది ఈయూకు మింగుడుపడటం లేదు. బిల్లును వెనక్కి తీసుకోనట్టయితే ప్రతీకార చర్యలుంటాయని అది హెచ్చరించింది. ఇలాంటి సమస్యలు ఇకముందూ తప్పకపోవచ్చు. మొత్తానికి బ్రిటన్ ఈయూతో వున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని వదులుకుని బయటికొచ్చింది. ఇందువల్ల అది జీడీపీలో 4 శాతం కోల్పోతుంది. ఒప్పందం లేకుండా బయటికొస్తే ఇది 6 శాతం మేర వుండేది. తదుపరి దశలు కూడా సాఫీగా పూర్తయితే అది జాన్సన్ ప్రతిష్టను మరింత పెంచుతుంది. -
ఆ శిశువు మాత్రం...
చుట్టూ గాఢాంధకారం... నల్లని మబ్బుల చాటున చంద్రుడు గుర్రు పెట్టి నిదరోతున్నాడు. గ్రామం గాఢ నిద్రలో ఉంది కదా అని ప్రకృతి కూడా అప్పుడే నిద్రకు ఉపక్రమించింది. పైరగాలి మాత్రం కొద్దిగా మేలుకొని మెల్లని, చల్లని గాలులను వీయిస్తోంది. ఆ గాలికి మైమరచి కొండలు ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. ఆ కొండల పక్కనే ఓ చిన్న బొరియ. దాని నిండా పలు రకాల పశువులు. ఇంతలో దూరంగా ఇద్దరు వ్యక్తులు.. చూడటానికి భార్యాభర్తల్లా ఉన్నారు. అసలే అర్ధరాత్రి. చలి గజగజ వణికిస్తోంది. చలికి ఆ స్త్రీ రెండు చేతులు చెవులపై అదిమి పెట్టింది. భార్య చలికి తట్టుకోలేక పోవడాన్ని గమనించి అతడు తన పై వస్త్రాన్ని తీసి ఆమెకు కప్పాడు. సరిగ్గా అప్పుడే చంద్రుడు నిద్రలేచాడు. నల్లని మబ్బుల కనురెప్పలను తెరచి లోకాన్ని చూసాడు. ఏదో చూడకూడని దాన్ని చూశాడు కాబోలు.. తన బాహువులను చూడమన్నట్లు వెన్నెలను విరగబూయించడం ప్రారంభించాడు. గాఢ నిద్రలో మునిగిన గ్రామం చంద్రుడి వెలుగును పట్టించుకోలేదు. ఆ జాబిల్లి వెలుగులో పశువులన్నీ ఓ మానవీయ ఘటనను చూశాయి. తమ వద్దకు వస్తున్న ఆ జంట చూడముచ్చటగా ఉంది. ఆమె నిండు గర్భిణి. ఏ క్షణమైనా ప్రసవం జరిగేలా ఉంది. వీరికి దారి చూపడానికే చంద్రుడు నిద్ర లేచాడా అన్నట్లు ఉందా పరిస్థితి. పసుల పాకలోని జంతువులు నిద్ర లేచాయి. ‘‘ఏంటి వీళ్ళు... ఇటే వస్తున్నారు. ఇప్పటికే ఇరుకుగా ఉంది. వీరెక్కడ సరిపోతారు’’ అందో గాడిద. ‘‘సరేలే ఉన్న దాంట్లో ఇరుక్కుంటారేమో నీకేంటి?’’ అంది పక్కనే ఉన్న మరో గాడిద. ‘‘సరిగ్గా చూడండెహే.. పాపం ఆవిడ ప్రసవానికి సిద్ధంగా ఉంది. నోర్మూసుకుని దారి ఇవ్వండి లేకపోతే తెలుసుగా, కొమ్ములకు ఈ మధ్యే పదును పెట్టా..’’ అని హెచ్చరించింది పక్కనే ఉన్న ఓ పొట్టేలు. ‘‘నిజమే.. అందరూ లేవండి.. మనం ఆ మూలకు వెళదాం’’ అంది గొర్రె. అప్పుడే నిద్ర లేచిన ఓ బుజ్జి మేక తనను కొంటె చూపుతో చూస్తున్న చంద్రుణ్ణి చూసింది. తర్వాత వాళ్ళ అమ్మతో.. ‘‘అమ్మా ఏమయిందే, ఇంకా తెల్లారలేదుగా.. అప్పుడే ఎందుకు లేపుతున్నావ్?’’ అని అడిగింది. ఇంతలో వారు లోనికి రానేవచ్చారు. పశువులన్నీ మరో మూలకు చేరి వారికి కొంచెం చోటిచ్చాయి. అనుకున్నదే అయింది. ఆ స్త్రీ వచ్చిన కొద్దిసేపటికే బంగారులాంటి కొడుకు పుట్టాడు. బుజ్జి మేక ఆ బాలుడి దగ్గర చేరి చెంగు చెంగున గెంతుతోంది. అది చూసి మిగిలిన బుజ్జి మేకలు, గొర్రె పిల్లలు మే.. మే అని పిల్లాడి చుట్టూ చేరి ఆడుకుంటున్నాయి. ‘‘ఎవరి సహాయం లేకపోయినా సుఖ ప్రసవం జరిగింది.. సంతోషం’’ అంది పొట్టేలు పక్కనే ఉన్న గాడిదతో... ‘‘నిజమే బాలుడు చూడ ముచ్చటగా ఉన్నాడు, నా మీద ఎక్కి కూర్చుంటే నగరమంతా తిప్పుతాను’’ అంది గాడిద. ఇంతలో ఓ గొర్రె పిల్ల కల్పించుకొని.. ‘‘అమ్మా చూడవే... ఈ బాబు అచ్చం నాలాగే ఉన్నాడు’’అంది. ‘‘నిజమేలేవే.. కొంచెం దూరంగా గెంతు.. బిడ్డ మీద పడేలా ఉన్నావు’’ అంది తల్లి. ఇంతలో బిడ్డ దగ్గరకు ఓ ఆవు, పెయ్య దూడ కలిసి వచ్చాయి. ఆ పెయ్య దూడ తన తల్లితో.. ‘‘అమ్మా.. బాబు చూడు నాలాగే ఎర్రగా ఉన్నాడు. ఒక్క మచ్చ కూడా లేదు’’ అంది. నిజమేనన్నట్లు ఆ ఆవు తలూపింది. ఇంతలో మబ్బులన్నీ నిద్ర లేచి గట్టిగా ఆవులించాయి. ఆ శబ్దానికి జంతువులన్నీ భయపడ్డాయి. ఇంతలో ఆ పాకలో గొప్ప వెలుగు పుట్టింది. ఆ వెలుగులో రెక్కలు కట్టుకున్న అందమైన జీవులు ప్రత్యక్షమయ్యాయి. ఏమిటీ వింత అని పెద్ద జంతువులన్నీ గుడ్లు మిటకరించి చూస్తున్నాయి. చిన్ని గాడిదలు, బుజ్జి మేకలు, గొర్రె పిల్లలు, పెయ్య దూడలు, కోడె దూడలు మాత్రం ఆనందంతో శబ్దాలు చేస్తూ చెంగు చెంగున గెంతుతూ నాట్యం చేస్తున్నాయి. బిడ్డ పుట్టుకతో, జంతు నాట్యాలతో పరవశులైన ఆ రెక్కల జీవులు బిడ్డను పొగిడి తిరిగి వెళ్లిపోయారు...అప్పటి వరకూ ఎగిరిన పసు పిల్లలు అన్నీ అలసిపోయి బిడ్డ చుట్టూ హాయిగా పడుకున్నాయి. పెద్ద జంతువులన్నీ కాసేపు ముచ్చట్లు కొనసాగించి అలాగే నిద్రపోయాయి. వేదనను అనుభవించిన ఆ స్త్రీ సంతోష మైకంతో, ఆత్మీయ ఆనందంతో నిద్రలోకి జారుకుంది. అప్పటివరకు గర్భవతియైన తన భార్యను కాపాడిన భర్త కూడా పడుకున్నాడు. అప్పుడే కన్ను తెరిచిన ఆ బిడ్డ మాత్రం కళ్లు ఇంతింత చేసుకుని లోకాన్ని ప్రేమ, కరుణ, శాంతి దిశగా మేల్కొలపాల్సిన అవసరం ఉందని అనుకుంటూ, తనకు జన్మనిచ్చిన తల్లి వైపు... ఆదరించిన తండ్రి వైపు కృతజ్ఞతతో చూశాడు. ఆ బిడ్డ మాత్రం... సంతోషంతో తనవైపే చూస్తున్న జాబిల్లిని, ఆనంద బాష్పాలను మంచు రూపంలో కురిపిస్తున్న నల్లని మబ్బులను... తన పుట్టుకను గాంచి మిగుల ఆనందపడిన పశు పిల్లలను, వాటి తల్లులను చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నీ మీద నగరానికి వస్తానని గాడిదకు మనసులోనే మాటిచ్చాడు. అచ్చం నాలాగే ఉన్నాడన్న గొర్రె పిల్లకు, ఎర్రగా ముద్దుగా ఒక్క మచ్చ కూడా లేదన్న పెయ్య దూడకు మీరన్నవన్నీ నిజమే అని తన మనసులో అనుకుంటూ చిరునవ్వుల వర్షం కురిపించాడు. – సృజన్ సెగెవ్ సాక్షి, హైదరాబాద్ -
ఇలకు దిగిన ప్రేమ
క్రిస్మస్ సమయంలో చర్చిలపై, ఇండ్లపై, వీధులలో, క్రిస్మస్ ట్రీలపై ప్రజలు ఆనందోత్సాహాలతో స్టార్స్ అలంకరిస్తారు. దీనికి కారణం యేసు ప్రభువు 2020 సంవత్సరాల క్రితం బెత్లెహేములో జన్మించి, స్థలం లేక పశువుల తొట్టిలో పరుండబెట్టిన రాత్రి ఆకాశంలో ఒక దేదీప్య తార వెలిసింది. దేవుడే మానవావతారుడై భూమిపై వెలశాడు. క్రిస్మస్లో వెలిగించే రంగురంగుల విద్యుత్ దీపాల ప్రకాశం, నక్షత్రం, పెద్ద చిన్న తారలతో చాలా ఆత్మీయ భావాలు ఇమిడి ఉన్నాయి. కోట్లాది లెక్కించలేని నక్షత్రాలు గగనంలో ఉన్నప్పటికీ ఈ నక్షత్రం ప్రత్యేకం. దేవుని నమ్మిన అబ్రహాం సంతానం ఆకాశంలో నక్షత్రాల వలె విస్తరిస్తారని, ఆయన సంతతి నుండి లోక రక్షకుడు ఉదయిస్తాడని నిర్ధారణ అయింది. ఈ తార మిగిలిన వాటి నుండి తగ్గించుకుని కిందకి దిగి వచ్చాడు. మనం కూడా పాపం నుండి, చెడు నుండి వేరు కావాలి. యేసు సాత్వికుడై దాసుని రూపం ధరించాడు. మనుష్యులు పరలోకానికి దారి చూడాలంటే తగ్గింపు కలిగి ఉండాలి. మోసగాడైన యాకోబులో ఉదయించిన నక్షత్రం రాజును పోలిన ఇశ్రాయేలీయులనుగా మనుష్యులను మార్చడానికి క్రీస్తు వచ్చాడు. దేవుని దూతలు వేరు, మోసం చేసే తేజోనక్షత్రం సాతాను వేరు. నేను దావీదు వేరు చిగురును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను’ అని యేసు చెప్పాడు (ప్రకట:22:16). దారి చూపు వెలుగును వెంబడించు వారు గుంటలో పడరు. పాపమున్న చోటను నడువరు. అందువలన యేసు శిశువు నుండి సిలువ వరకు అక్కడి నుండి పునరుత్థానుడై వెళ్లువరకు ‘నేను లోకానికి వెలుగునై ఉన్నాను‘ అని తెలిపాడు. యేసు నుండి రక్షించబడిన వారు నక్షత్రాలు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశిస్తారు. నీతి మార్గాన్ని అననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు’ (దానియేలు 12:3) మరణించినా జీవించునట్లు దారి చూపు వారు వీరే. మోషే, దానియేలు, బాప్తిస్మమిచ్చు యోహాను, పౌలు, ఎస్తేరు లాంటి బైబిలు వ్యక్తులు అట్టివారే. ఏ నక్షత్రాన పుట్టామనేది ప్రాముఖ్యం కాదు. కాని క్రిస్మస్ నక్షత్రాన్ని వెంబడిస్తే ప్రేమ, నీతి, పరిశుద్ధత, మంచి తండ్రిగా, తల్లిగా, నాయకుడి మాదిరిగా, మదర్ థెరిస్సావలె ప్రకాశిస్తారు. ‘కాంతి గల నక్షత్రాల్లారా, మీరందరూ ఆయనను స్తుతించండి (కీర్తనలు 148:3) అని కీర్తనకారులు పాడినారు. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా మారరాదని బైబిలు హెచ్చరిస్తుంది. బైబిల్ ఎవరి చేతిలో ఎవరి హృదయంలో ఉండునో వారు ప్రకాశించే దివిటీలు. జాలరి నుండి శిష్యునిగా మారిన పేతురు ‘తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాలలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచితే మీకు మేలు’ (2 పేతురు 1:19) అని రాశారు. లోకం హత్యలతో, అత్యాచారాలతో, ధనాశతో, దుర్వ్యసనాలతో, అసమాధానంతో చీకటిలో ఉన్నప్పుడు, అట్టి జనం మధ్యకు మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుతున్నారు (ఫిలిప్పీ 2:16) అని పరిశుద్ధ పౌలు తెలిపాడు. విద్యలో, నీతిలో, మాదిరిలో, ప్రావీణ్యతలో గొప్ప తారలుగా మనుషుల్ని మార్చాలి. అమెరికా అంతర్యుద్ధంలోనికి తమ పిల్లలను పంపేవారు, వారు చనిపోయినప్పుడు ఒక ఎర్రటి నక్షత్రం కట్టుకొనేవారట. అయితే ఒక తండ్రి, కుమారుని నడిపిస్తూ, రెండు ఎత్తైన కట్టడాల మధ్య ఆకాశంలో బంగారు వర్ణ నక్షత్రం చూచి కుమారుడు, ‘నాన్న! దేవుడు తన కుమారుని యుద్ధానికి పంపాడు’ అన్నాడు.‘ఈ స్టార్ వార్‌లో సిలువలో సాతాను ఓడిపోయాడు. యేసు మృత్యుంజయుుడై గెలిచాడు గనుక నేటికీ వెలుగుల క్రిస్మస్. ‘దేవుడు తానే మనలను ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుని పంపాడు’. (1 యోహాను 4:10). ఇది సజీవ క్రిస్మస్ తార, నేటికీ ప్రకాశించి అనేకులకు దారి చూపుతోంది. ఈ లోకం శాశ్వతం కాదు. ధనం, గౌరవం, సంపద, ప్రఖ్యాతి ఎంత ఉన్నా, రెండవ రాకడ ఆసన్నమయే సమయంలో ఏవీ ఎన్నతగినవి కావు. యేసు మొదటి రాక క్రిస్మస్ పాపులను రక్షించడానికి ప్రభువు రెండవ రాకడ తను నమ్మిన పరిశుద్ధులను నిత్య రాజ్యంలోనికి తీసుకొని వెళ్లడానికి ఆకాశం నుండి నక్షత్రాలు రాలతాయి (మత్తయి 24: 29) అని ప్రభువే తెలిపాడు. ఎంత గొప్పవాడైనా బెత్లహేం నక్షత్రం వలె పని అయిన తరువాత కనుమరుగవుతుంది. ఇది సత్యం. క్రిస్మస్ నక్షత్రాలు, పండుగ సందడి, వ్యాపార సమయం అయిన తరువాత పాతబడి పనికి రాకపోవచ్చు గాని, కుటుంబం, కుమారులు, కుమార్తెలు, సత్ప్రవర్తన, పరిశుద్ధత, ఇతరులకు దారి చూపుతూ బతికితే... నిరంతరం నిలుచు నక్షత్రాలుగా ఉంటారు. ‘నీతిమంతులైతే తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు’ అదే నిత్య క్రిస్మస్ ఆనందం. – తంటిపూడి ప్రభాకరరావు -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయి అని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. -
ప్రజలకు ఏపీ గవర్నర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “క్రిస్మస్ అంటే యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయం. విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ,సహనం, కరుణ పూర్వక అనుబంధాలను మేలుకొలుపుతూ యేసు బోధలను ఆదరించే సందర్భం. ధర్మం, విశ్వాసపూరితమైన గమనానికి యేసుక్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుంది. ఈ సందర్భంగా నా క్రైస్తవ సోదరులతో కలిసి ప్రపంచంలో శాంతి, సామరస్యం కోసం ప్రార్థిస్తున్నాను. కరోనా ముప్పు ఇప్పటికీ పొంచి ఉంది. సాంఘిక దూరాన్ని పాటించటం, మాస్కు ధరించటం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకుని నివాసాలలో సురక్షితంగా ఉంటూ పండుగను జరుపుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ, మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు” అని క్రిస్మస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిశ్వ భూషణ్ హరిచందన్ సందేశం ఇచ్చారు. చదవండి:మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్ ఘన నివాళి -
ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ ముఠా అరెస్ట్!
సిడ్నీ: దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను అక్రమ సరఫరా చేస్తున్న ముఠాను ఆస్ట్రేలియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 360 మిలియన్ డాలర్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్రిస్మస్ వేడుకలలో భాగంగా దేశంలో విస్తృత తనిఖీలు చేపట్టిన అధికారులు తమ నిఘా పటిష్టం చేశారు. ఇందులో భాగంగా మత్తుపదార్థాలను సరఫరా చేస్తున్న 15 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. ఇందులో మాజీ రగ్బీ ఆటగాడు ఉన్నట్లు స్థానిక మీడియా 9 న్యూస్ పేర్కొంది. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు, న్యూ సౌత్‌వెల్స్ పోలీసులతో పాటు తాహిటి, ఫిజీ బృందాలు సమష్టిగా దాడిచేసి బ్రూక్లిన్ లో 500 కిలోల కొకైన్‌ను, తాహిటిలో మరో 600 కిలోల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దేశ చరిత్రలోనే ఇది పట్టుబడ్డ పెద్ద డ్రగ్స్ ముఠా అని ఏసీపీ క్రిస్ హీహాన్ అన్నారు. దక్షిణ అమెరికా దేశాల నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ అక్రమ రవాణా అవుతున్నాయని, 29-63 ఏళ్ల వయసున్న వారు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని వివరించారు. అరెస్టయిన వారిలో ఏ ఒక్కరికి బెయిల్ ఇచ్చే అవకాశం లేదని ఏసీపీ తెలిపారు. -
‘గుడ్ గవర్నెన్స్ డే’పై దుమారం
* క్రిస్మస్ రోజు స్కూళ్లు తెరిచి ఉంచాలని సర్క్యులర్ జారీ * పార్లమెంట్లో ప్రభుత్వంపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు * సీబీఎస్ఈ సర్క్యులర్ ఏదీ జారీ చేయలేదని ప్రభుత్వం వివరణ.. * క్రిస్మస్ రోజు పాఠశాలలకు సెలవేనని స్పష్టీకరణ న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ రోజైన డిసెంబర్ 25ని గుడ్ గవర్నెన్స్ డేగా జరపాలని, ఆ రోజున స్కూళ్లను తెరిచి ఉంచాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) శాఖకు అనుబంధంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి(ఎన్వీఎస్) జారీ చేసిన సర్క్యులర్ దుమారం రేపింది. సోమవారం పార్లమెంట్లో ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. వివాదానికి తెరదించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడింది. డిసెంబర్ 10న జారీ చేసిన సర్క్యులర్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయి పుట్టినరోజు, మదన్మోహన్ మాలవ్య జయంతి సందర్భంగా డిసెంబర్ 25న విద్యార్థుల్లో స్ఫూర్తిని రగిలించేలా క్విజ్, ఉపన్యాస పోటీలు, గుడ్ గవర్నెన్స్‌కు సంబంధించిన డాక్యుమెంటరీల ప్రదర్శన నిర్వహించాలని ఎన్వీఎస్ తన అధీనంలోని పాఠశాలలను ఆదేశించింది. తమ పరిధిలోని అన్ని జేఎన్‌వీల్లో గుడ్ గవర్నెన్స్ డే జరపాలని ఎన్వీఎస్ కమిషనర్ జీఎస్ బోత్యల్ అన్ని జేఎన్వీలకు సర్క్యులర్ జారీ చేశారు.ఈ సర్క్యూలర్‌పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, అన్నా డీఎంకే, వామపక్ష సభ్యులు ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రిస్మస్ రోజు స్కూళ్లు తెరిచి ఉంచాలని చెప్పడం ప్రమాదకరమని, ఇది సమర్థనీయం కాదని, దీనిని ఉపసంహరించుకోవాలని అన్నాయి. ఇది క్రైస్తవుల మతపరమైన హక్కులపై దాడి చేయడం లాంటిదని సీపీఎం అభివర్ణించింది. లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇచ్చారు. డిసెంబర్ 25న జవహర్ నవోదయ విద్యాలయాల(జేఎన్వీ)తో పాటు అన్ని స్కూళ్లు మూసే ఉంటాయని, దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని అన్నారు. ‘డిసెంబర్ 25న స్కూళ్లు తెరిచి ఉంచాలని సీబీఎస్ఈ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అన్ని స్కూళ్లకు షెడ్యూల్ ప్రకారమే క్రిస్మస్ సెలవులు ఉంటాయని సీబీఎస్ఈ వివరణ ఇచ్చింది’’ అని హెచ్చార్డీశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చిన్నారులు, విద్యార్థులను సెలవులకు దూరం చేసేలా లేదా వారి మతానికి చెందిన వేడుకల్లో పాల్గొనకుండా చేసే ఉద్దేశం తమకు లేదంది. గుడ్ గవర్నెన్స్ డే కోసం మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని ఆ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. పోటీలను జేఎన్వీలు స్వచ్ఛందంగా చేపట్టాయన్నారు. మతమార్పిడిలపై అట్టుడికిన రాజ్యసభ.. మతమార్పిడి అంశంపై సోమవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమాలు తుడిచిపెట్టుకుపోయాయి. చర్చ జరపాలని, ప్రధాని సమాధానమివ్వాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే చర్చకు అంగీకరించిన ప్రభుత్వం.. హోంమంత్రి రాజనాథ్ సింగ్ చర్చకు సమాధానమిస్తారని ప్రకటించడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. చర్చిలకు అదనపు భద్రత అలీగఢ్: డిసెంబర్ 25న అలీగఢ్‌కు చెందిన ఓ సంస్థ భారీ స్థాయిలో మతమార్పిడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు చర్చిలకు భద్రత కల్పించాలని అలీగఢ్‌లోని క్రైస్తవ సంఘాలు పోలీసులను కోరాయి. కాగా, శారదా చిట్ స్కామ్‌లో పశ్చిమబెంగాల్ మంత్రి మదన్ మిత్రా అరెస్టుకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం పార్లమెంట్ భవనం ఎదుట నిరసనకు దిగారు. రాయ్‌బరేలీలో మతమార్పిడి చేస్తాం: వీహెచ్‌పీ లక్నో: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో మైనారిటీలను హిందూ మతంలోకి తీసుకొస్తామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రకటించింది. 60 ముస్లిం, క్రైస్తవ కుటుంబాలను జనవరిలో మతం మార్పించబోతున్నట్లు వీహెచ్‌పీ రాయ్‌బరేలీ జిల్లా చీఫ్ హరీష్చంద్రశర్మ వెల్లడించారు. తిరిగి సొంత ఇంటికి(హిందూ మతం) రావడానికి వారు సిద్ధంగా ఉన్నారన్నారు.