మంత్రి సత్యవతి రాథోడ్‌కు చర్చిలో కేక్ తినిపిస్తున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్‌జోన్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్‌ఐ చర్చిలో ఘనంగా ప్రార్థనలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. తెల్లవారు జామున 4.30 గంటలకు మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రెవరెండ్ బిషప్ సాల్‌మన్‌రాజ్ భక్తులకు దైవ సందేశం అందించి.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఏసు క్రీస్తు జననం మానవాళి అంతటికీ శుభదినం అన్నారు. భక్తులు ఏసు చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు భక్తులకు చర్చి దర్శనానికి అనుమతిచ్చారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులను ఆశీర్వదించేందుకు 15 మంది గురువులను అందుబాటులో ఉంచామని రెండో ఆరాధనలో దైవ సందేశమిచ్చిన చర్చి ప్రెసిబిటరీ ఇన్‌చార్జ్ జార్జ్ ఎబనైజర్‌రాజ్ తెలిపారు. ఈ ఉత్సవాలకు డయాసిస్ పరిధిలోని 13 జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. చర్చిలో ఆలపించిన భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
క్రిస్మస్ సందర్భంగా కల్వరి టెంపుల్‌కు భారీగా హాజరైన భక్తులు
అన్ని మతాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం: మంత్రి సత్యవతి రాథోడ్
సీఎం కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, అందులో భాగంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ గిఫ్టు ప్యాకెట్లు అందజేశారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని మతాలను గౌరవిస్తూ రాష్ట్ర శ్రేయస్సును కోరుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ఏసుప్రభువు ఆశీస్సులు ఉండాలన్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలను దేశానికి అందించాలనే ఉదేశంతో బీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. ఆమెతోపాటు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment