పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
పులివెందుల: రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మూడో రోజు ఆయన వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అవ్వా తాతలు, అక్కచెల్లెమ్మలు, ప్రతి సోదరుడు, స్నేహితుడు, బంధువులు, కుటుంబ సభ్యులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం 9.15 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులలోని సీఎస్‌ఐ చర్చికి చేరుకున్నారు.
కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పాస్టర్ ఆనందరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తల్లి విజయమ్మతో కలిసి కేక్‌ను కట్ చేశారు. సీఎస్‌ఐ చర్చి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. అంతకు ముందు సీఎస్‌ఐ చర్చి న్యూ కాంప్లెక్స్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీఎస్‌ఐ చర్చి పాస్టర్ ఆనందరావు వైఎస్ విజయమ్మ రచించిన ‘కీర్తనల జ్ఞాన అన్వయం’ గ్రంథాన్ని సంఘ సభ్యులకు పంపిణీ చేశారు. వైఎస్ విజయమ్మ తన జీవిత అనుభవసారంగా రచించిన ఈ గ్రంథంలోని అంశాలను అందరూ తెలుసుకుని నడుచుకోవాలని పాస్టర్ సూచించారు.
క్రిస్మస్ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కేక్ తినిపిస్తున్న మాతృమూర్తి వైఎస్ విజయమ్మ
ఈ కార్యక్రమాల అనంతరం సీఎం జగన్ కడప విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి విజయవాడ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్సార్ సోదరి విమలమ్మ, వైఎస్సార్ సోదరుడు రవీంద్రనాథరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మాధవి, డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment