
సాక్షి, మెదక్ : క్రిస్మస్ వేడుకలకు మెదక్ సీఎస్‌ఐ (చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా) ముస్తాబైంది. యేసయ్య మహాదేవాలయం రంగురంగుల విద్యుద్దీపాలతో వెలుగులీనుతోంది. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బిషప్ ఏసీ సాల్మన్‌రాజు తొలి ప్రార్థన ప్రారంభిస్తారు. అనంతరం దైవ సందేశాన్ని ఇస్తారు. తర్వాత పవిత్ర సిలువ ఊరేగింపు నిర్వహిస్తారు. 9.30 గంటలకు రెండో ఆరాధన జరుగుతుంది.
చర్చిలో నిర్వహించే వేడుకలకు రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల వారు హాజరవుతారు. మరోవైపు చర్చికి ఆదివారం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. సుమారు రెండు లక్షల మంది వరకు వేడుకల్లో పాల్గొంటారని అంచనా. ఈ సందర్భంగా చర్చి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 500 మందికిపైగా పోలీసులు బందోబస్తులో ఉన్నారు.