‘గుడ్ గవర్నెన్స్ డే’పై దుమారం
* క్రిస్మస్ రోజు స్కూళ్లు తెరిచి ఉంచాలని సర్క్యులర్ జారీ
* పార్లమెంట్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు
* సీబీఎస్‌ఈ సర్క్యులర్ ఏదీ జారీ చేయలేదని ప్రభుత్వం వివరణ..
* క్రిస్మస్ రోజు పాఠశాలలకు సెలవేనని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ రోజైన డిసెంబర్ 25ని గుడ్ గవర్నెన్స్ డేగా జరపాలని, ఆ రోజున స్కూళ్లను తెరిచి ఉంచాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) శాఖకు అనుబంధంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్) జారీ చేసిన సర్క్యులర్ దుమారం రేపింది. సోమవారం పార్లమెంట్‌లో ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. వివాదానికి తెరదించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడింది. డిసెంబర్ 10న జారీ చేసిన సర్క్యులర్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయి పుట్టినరోజు, మదన్‌మోహన్ మాలవ్య జయంతి సందర్భంగా డిసెంబర్ 25న విద్యార్థుల్లో స్ఫూర్తిని రగిలించేలా క్విజ్, ఉపన్యాస పోటీలు, గుడ్ గవర్నెన్స్‌కు సంబంధించిన డాక్యుమెంటరీల ప్రదర్శన నిర్వహించాలని ఎన్‌వీఎస్ తన అధీనంలోని పాఠశాలలను ఆదేశించింది. తమ పరిధిలోని అన్ని జేఎన్‌వీల్లో గుడ్ గవర్నెన్స్ డే జరపాలని ఎన్‌వీఎస్ కమిషనర్ జీఎస్ బోత్యల్ అన్ని జేఎన్‌వీలకు సర్క్యులర్ జారీ చేశారు.ఈ సర్క్యూలర్‌పై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, అన్నా డీఎంకే, వామపక్ష సభ్యులు ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
క్రిస్మస్ రోజు స్కూళ్లు తెరిచి ఉంచాలని చెప్పడం ప్రమాదకరమని, ఇది సమర్థనీయం కాదని, దీనిని ఉపసంహరించుకోవాలని అన్నాయి. ఇది క్రైస్తవుల మతపరమైన హక్కులపై దాడి చేయడం లాంటిదని సీపీఎం అభివర్ణించింది. లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇచ్చారు. డిసెంబర్ 25న జవహర్ నవోదయ విద్యాలయాల(జేఎన్‌వీ)తో పాటు అన్ని స్కూళ్లు మూసే ఉంటాయని, దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని అన్నారు. ‘డిసెంబర్ 25న స్కూళ్లు తెరిచి ఉంచాలని సీబీఎస్‌ఈ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అన్ని స్కూళ్లకు షెడ్యూల్ ప్రకారమే క్రిస్మస్ సెలవులు ఉంటాయని సీబీఎస్‌ఈ వివరణ ఇచ్చింది’’ అని హెచ్చార్డీశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చిన్నారులు, విద్యార్థులను సెలవులకు దూరం చేసేలా లేదా వారి మతానికి చెందిన వేడుకల్లో పాల్గొనకుండా చేసే ఉద్దేశం తమకు లేదంది. గుడ్ గవర్నెన్స్ డే కోసం మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని ఆ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. పోటీలను జేఎన్‌వీలు స్వచ్ఛందంగా చేపట్టాయన్నారు.
మతమార్పిడిలపై అట్టుడికిన రాజ్యసభ..
మతమార్పిడి అంశంపై సోమవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమాలు తుడిచిపెట్టుకుపోయాయి. చర్చ జరపాలని, ప్రధాని సమాధానమివ్వాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే చర్చకు అంగీకరించిన ప్రభుత్వం.. హోంమంత్రి రాజనాథ్ సింగ్ చర్చకు సమాధానమిస్తారని ప్రకటించడంతో ప్రతిష్టంభన ఏర్పడింది.
చర్చిలకు అదనపు భద్రత
అలీగఢ్: డిసెంబర్ 25న అలీగఢ్‌కు చెందిన ఓ సంస్థ భారీ స్థాయిలో మతమార్పిడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు చర్చిలకు భద్రత కల్పించాలని అలీగఢ్‌లోని క్రైస్తవ సంఘాలు పోలీసులను కోరాయి. కాగా, శారదా చిట్ స్కామ్‌లో పశ్చిమబెంగాల్ మంత్రి మదన్ మిత్రా అరెస్టుకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం పార్లమెంట్ భవనం ఎదుట నిరసనకు దిగారు.
రాయ్‌బరేలీలో మతమార్పిడి చేస్తాం: వీహెచ్‌పీ
లక్నో: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో మైనారిటీలను హిందూ మతంలోకి తీసుకొస్తామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రకటించింది. 60 ముస్లిం, క్రైస్తవ కుటుంబాలను జనవరిలో మతం మార్పించబోతున్నట్లు వీహెచ్‌పీ రాయ్‌బరేలీ జిల్లా చీఫ్ హరీష్‌చంద్రశర్మ వెల్లడించారు. తిరిగి సొంత ఇంటికి(హిందూ మతం) రావడానికి వారు సిద్ధంగా ఉన్నారన్నారు.