circular issued
-
ఎన్నికల కోడ్ ముగిసింది: ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల ప్రవర్తనావళి గడువు ముగిసింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల కమిషన్ గురువారం పంపిన ఒక సర్క్యులర్‌లో ఈ విషయం తెలిపింది. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెల్సిందే. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఎత్తివేత నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటింది. లోక్‌సభతోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణ, లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరపడంతోపాటు అధికార పార్టీలు, ప్రభుత్వాలు అధికార దుర్వినియోగాన్ని నివారించే లక్ష్యంతో దేశంలో 1960 నుంచి ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. -
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ముకుతాడు
ముంబై: ఆర్థిక అంశాల విషయంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ)లకు నిబంధనలను కఠినతరం చేయాలని బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భావిస్తోంది. ఇందులో భాగంగా పబ్లిక్ డిపాజిట్ల మెచ్యూరిటీ వ్యవధిని ఐదేళ్లకు తగ్గించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఒక ముసాయిదా సర్క్యులర్‌ను జారీ చేసింది. కొన్ని నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తున్నట్లు ఒకవైపు స్పష్టం చేస్తూనే మరోవైపు ఫిబ్రవరి 29వ తేదీలోపు ఈ ముసాయిదా పత్రంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని సంబంధిత వర్గాలకు విజ్ఞప్తి చేసింది. హెచ్ఎఫ్సీల డిపాజిట్ల చెల్లింపులకు సంబంధించి నిధుల లభ్యత అవసరాల నిర్వహణను మెరుగుపరచుకోవడంపై కూడా ఈ సర్క్యులర్‌లో ఆర్బీఐ దృష్టి సారించింది. ప్రతిపాదిత తాజా ముసాయిదా ప్రకారం, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్‌లు లేని హెచ్ఎఫ్సీలు పబ్లిక్ డిపాజిట్లను స్వీకరించలేవు. అదే సమయంలో క్రెడిట్ కార్డ్ వ్యాపారంతో పాటు నిర్దిష్ట రుసుము ఆధారిత కార్యకలాపాలలోకి హెచ్‌ఎఫ్‌సీలను అనుమతించే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ముందస్తు అనుమతితో, రిస్క్ షేరింగ్ లేకుండా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులతో కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి కొన్ని హెచ్ఎఫ్సీలకు అనుమతి లభిస్తోంది. ఇది రెండు సంవత్సరాల ప్రారంభ కాలానికి వర్తిస్తుంది. అటుపై దీనిపై సమీక్ష, దీనికి అనుగుణంగా తదుపరి అనుమతులు ఉంటాయి. ప్రస్తుతం, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం (120 నెలల లోపు) తర్వాత తిరిగి చెల్లించే విధంగా పబ్లిక్ డిపాజిట్లను ఆమోదించడానికి లేదా పునరుద్ధరించడానికి అనుమతిఉంది. తక్షణం అమలు... 120 నెలల వరకూ డిపాజిట్ల ఆమోదం లేదా పునరుద్ధరణకు వీలుంది. దీనిని 5 సంవత్సరాలకు తగ్గించాలన్నది తాజా ముసాయిదా ఉద్దేశం. అయితే ఈ నిబంధన తక్షణం అమల్లోకి వచి్చనట్లు కూడా ఆర్బీఐ సర్క్యులర్ పేర్కొనడం గమనార్హం. ‘‘ఇకమీదట, ఈ సర్క్యులర్ తేదీ నుండి హెచ్ఎఫ్సీలు ఆమోదించిన లేదా పునరుద్ధరించిన పబ్లిక్ డిపాజిట్లను 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ గడువు 60 నెలలకు పరిమితం అయ్యింది. అయితే ఇప్పటికే అరవై నెలల కంటే ఎక్కువ మెచ్యూరిటీతో ఉన్న డిపాజిట్లు ఆయా హెచ్ఎఫ్సీల ప్రస్తుత రీపేమెంట్ ప్రొఫైల్ ప్రకారం తిరిగి చెల్లించడం జరుగుతుంది’’అని ఆర్బీఐ సర్క్యులర్ పేర్కొంది. ఒకవేళ ఆయా కంపెనీల క్రెడిట్ రేటింగ్ కనీస పెట్టుబడి గ్రేడ్ కంటే తక్కువగా ఉంటే, అటువంటి హెచ్ఎఫ్సీలు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్ పొందే వరకు ఇప్పటికే ఉన్న డిపాజిట్లను పునరుద్దరించలేవని, లేదా తాజా డిపాజిట్లను అంగీకరించలేవని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక డిపాజిట్ తీసుకునే హెచ్ఎఫ్సీలు కలిగి ఉన్న పబ్లిక్ డిపాజిట్ల పరిమాణ సీలింగ్ (పరిమితి) ప్రస్తుతం తమ సొంత నికర నిధుల్లో 3 రెట్లు ఉంటే, దీనిని తక్షణం అమల్లోకి వచ్చే విధంగా 1.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. కాగా, తాజా ముసాయిదా ప్రకారం వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు లేదా ప్రకృతి వైపరీత్యాలు/విపత్తుల కారణంగా ముందస్తు–మెచ్యూర్ ఉపసంహరణ అనుమతులకు హెచ్ఎఫ్సీలకు వీలుకలుగుతోంది. ఎన్బీఎఫ్సీ నిబంధనలతో సమన్వయం.. తాజా చర్యల ద్వారా ఇతర నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) బాటలోకి హెచ్‌ఎఫ్‌సీలను తీసుకురావాలని భావిస్తోంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నుండి హెచ్ఎఫ్సీల నియంత్రణను బదిలీ చేసిన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ 2020 అక్టోబర్ 22వ తేదీన తొలిసారి ఈ సంస్థల కోసం సవరించిన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేసింది. హెచ్ఎఫ్సీలు –ఎన్‌బీఎఫ్‌సీల నిబంధనల మధ్య మరింత సమన్వయం తీసుకురావడం కోసం దశలవారీగా ప్రయత్నం జరుగుతుందని ఆర్బీఐ ఈ సందర్భంగా స్పష్ట చేసింది. ఏప్రిల్ నుంచి తాజా రుణ ‘చార్జీ’ నిబంధనల అమలు... బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)రుణ ఎగవేతలపై జరిమానా చార్జీలను ఆదాయ వృద్ధి సాధనంగా ఉపయోగించడాన్ని నిషేధించిన సవరిత ‘ఫెయిర్ లెండింగ్ విధానం’ ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ సోమవారం తెలిపింది.బ్యాంకులు– నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జరిమానా వడ్డీని ఆదాయ పెంపు సాధనంగా ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆర్బీఐ గత ఏడాది ఆగస్టు 18న ఇందుకు సంబంధించిన నిబంధనలను సవరించింది. దీని ప్రకారం బ్యాంకులు రుణ పునఃచెల్లిపుల్లో వైఫల్యం వంటి ‘‘సహేతుకమైన’’ ప్రాతిపదికపై మాత్రమే జరిమానా చార్జీలను విధించడానికి వీలవుతుంది. ఇటువంటి జరిమానా చార్జీలు బ్యాంకుల బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం వివక్షత లేని పద్ధతిలో డిఫాల్ట్ కింద ఉన్న మొత్తంపై మాత్రమే అమలువుతాయి. అటువంటి చార్జీలపై వడ్డీని లెక్కించడం జరగదు. బ్యాంకింగ్ రెగ్యులేటర్ సూచనలు క్రెడిట్ కార్డ్‌లు, అంతర్జాతీయ వాణిజ్య రుణాలు, వాణిజ్య రుణాలకు వర్తించదు. -
ఆర్బీఐ కీలక ఆదేశాలు - డిఫాల్ట్ కస్టమర్లకు గుడ్ న్యూస్
ముంబై: రుణాలు డిఫాల్ట్ అయిన కస్టమర్లపై బ్యాంకులు అదనపు వడ్డీ, చార్జీలు విధించి దాన్ని అసలుకు కలిపే విధానానికి చెక్ పెట్టేలా రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదనలు చేసింది. జరిమానాగా వడ్డించే చార్జీల పరిమాణం అనేది డిఫాల్ట్ అయిన మొత్తానికి అనుగుణంగా మాత్రమే ఉండాలని సహేతుక రుణ విధానాలపై విడుదల చేసిన ఒక సర్క్యులర్ ముసాయిదాలో పేర్కొంది. తీసుకున్న రుణాన్ని రుణగ్రహీత సక్రమంగా తిరిగి చెల్లించేలా చూడటమే జరిమానాల ప్రధాన ఉద్దేశ్యమని, వాటిని ఆదాయ వనరుగా బ్యాంకులు భావించరాదని సూచించింది. -
నామినీ అప్డేట్ గడువు పొడిగింపు: సెబీ
న్యూఢిల్లీ: ప్రస్తుత డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ఇన్వెస్టర్లకు నామినీ వివరాలు అప్డేట్ చేయడం లేదా తొలగించేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గడువును ఆరు నెలలు పొడిగించింది. ప్రస్తుత గడువు మార్చి 31తో ముగియనుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 30వరకూ అనుమతిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. 2021 జూలైలో తొలుత అర్హతగల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులంతా 2022 మార్చి31లోగా నామినీ వివరాలు దాఖలు చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. ఇలా చేయని ఖాతాలను డెబిట్లు చేపట్టేందుకు వీలులేకుండా నిలిపివేయనున్నట్లు తెలియజేసింది. తదుపరి 2023 మార్చి31లోగా డీమ్యాట్ ఖాతాలు, ఎంఎఫ్ ఫోలియోలకు నామినీ వివరాలు జత చేయడం తప్పనిసరి చేసింది. వెరసి నామినీ వివరాలు అందించడం లేదా నామినేషన్‌ను ఉపసంహరించేందుకు మరో ఆరు నెలల గడువు లభించింది. 2022 ఆగస్ట్1లోగాఎంఎఫ్ సబ్స్క్రయిబర్లకు నామినీ వివరాలివ్వడం లేదా నామినేషన్ నుంచి తప్పుకునేందుకు 2022 జూన్‌లో సెబీ తప్పనిసరి చేసింది. ఆపై 2022 అక్టోబర్ 1వరకూ గడువు పెంచింది. తదుపరి 2023 మార్చి31వరకూ మరోసారి గడువు పొడిగించింది. 2021 అక్టోబర్ తదుపరి డీమ్యాట్ ఖాతాలు తెరిచే ఇన్వెస్టర్లకు డిక్లరేషన్ ఫామ్ ద్వారా నామినీ వివరాలిచ్చేందుకు వీలు కల్పించింది. ఇదేవిధంగా నామినేషన్‌ను తప్పించేందుకూ వీలుంది. -
కేవైసీ లేకుంటే ఆటోమేటిక్‌గా ట్రేడింగ్ ఖాతాల డీయాక్టివేషన్
న్యూఢిల్లీ: నో యువర్ క్లయింట్ (కేవైసీ) వివరాలు సమగ్రంగా లేకపోతే ఇన్వెస్టర్ల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ చేసే నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుక్రవారం విడుదల చేసింది. ఇవి ఆగస్టు 31 నుంచి అమల్లోకి వస్తాయని ఒక సర్క్యులర్‌లో తెలిపింది. కేవైసీ ప్రక్రియలో చిరునామాలు అత్యంత కీలకమని సెబీ స్పష్టం చేసింది. సాధారణంగా ఇన్వెస్టర్ల చిరునామాలను మధ్యవర్తిత్వ సంస్థ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదని గుర్తించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజా నిబంధనలు రూపొందించినట్లు వివరించింది. వీటి ప్రకారం సెబీ జారీ చేసే ఆదేశాలు మొదలైన వాటిని ఏ ఎంఐఐ (మార్కెట్ ఇన్ఫ్రా సంస్థ) కూడా ఇన్వెస్టర్‌కి అందజేసి, రసీదు తీసుకోలేకపోయిన పక్షంలో .. డెలివరీ విఫలమైన తేదీ నుంచి అయిదు రోజుల్లో అన్ని ఎంఐఐలు సదరు మదుపుదారు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను డీయాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అయితే, కేవలం ఒకే ఎంఐఐ విఫలమైతే మాత్రం ఖాతాల డీయాక్టివేషన్ ఉండదని సెబీ తెలిపింది. అలాగే, తగిన పత్రాలన్నింటితో దర ఖాస్తు చేసుకుంటే ఎంఐఐలు అయిదు రోజుల్లోగా రీయాక్టివేట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. -
సరుకు రవాణా వాహనాలకు పాస్‌లు అవసరం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల మధ్య నడిచే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలు, అన్లోడ్ చేసి వెళ్లే ఖాళీ వాహనాలకు పాస్‌లు అవసరం లేదని హోం శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ ఏప్రిల్ 15న జారీ చేసిన ఉత్తర్వుల్లోని నిబంధన 12(1), నిబంధన 12(6)లపై స్పష్టత ఇచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో సరుకు రవాణా వాహనాలు, అన్లోడ్ చేసిన వాహనాలను పాస్‌ల పేరిట అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదు లు వచ్చాయని, వీటికి పాస్‌లు అవసరం లేదని, డ్రైవర్‌కు లైసెన్స్ ఉంటే చాలునని తేల్చి చెప్పింది. దేశంలో వస్తువుల సరఫరా సజావుగా సాగేందుకు ఇది తప్పనిసరి అని వివరించింది. రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు ఈ ఆదేశాలు పాటించేలా సూచనలు జారీ చేయాలని కోరింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను స్వస్థలాలకు పంపే విషయంలో జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. కరోనా ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని, వీరిని రోడ్డు మార్గంలో శానిటైజ్ చేసిన వాహనాల్లో తరలించాలని తెలిపింది. సంబంధిత రాష్ట్రాల అధికారులు ఈ విషయంలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ ఉండాలని సూచించింది. -
నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ: కేంద్రం నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు ఉత్తరప్రదేశ్, బిహార్ గవర్నర్లకు స్థానచలనం కలిగించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా మాజీ ఎంపీ, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది జగ్దీప్ ధంకర్(68)ను నియమిస్తూ శనివారం రాష్ట్రపతి భవన్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. వచ్చే వారం పదవీ విరమణ చేయనున్న కేసరీనాథ్ త్రిపాఠీ స్థానంలో ధంకర్ బాధ్యతలు చేపడతారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. బెంగాల్లో రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ, మమతా బెనర్జీల మధ్య పోరు కొనసాగుతున్న సమయంలో ఈ నియామకం చేపట్టడం గమనార్హం. ధంకర్ 1990–91 సంవత్సరాల మధ్య పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. 2003లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే, 2018 జనవరి నుంచి మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆనందీబెన్ పటేల్‌ను కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమించింది. ఆనందీ బెన్ స్థానంలో బీజేపీ కురువృద్ధ నేత, బిహార్ గవర్నర్ లాల్జీ టాండన్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. టాండన్ స్థానంలో బిహార్ గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత ఫగు చౌహాన్ బాధ్యతలు చేపడతారని ఆ సర్క్యులర్ వెల్లడించింది. త్రిపుర గవర్నర్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత రమేశ్ బైస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి పదవీ కాలం 27న ముగియనుంది. నాగాలాండ్ గవర్నర్‌గా ఇంటెలిజెన్స్ బ్యూరో రిటైర్డు స్పెషల్ డైరెక్టర్ ఎన్.రవి నియమితులయ్యారు. 1976 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రవి నాగా వేర్పాటువాదులతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ తెలిపింది. 1950లో యూపీ ఏర్పడిన తర్వాత మొదటి మహిళా గవర్నర్ ఆనందీబెన్. అంతకుముందు ఉన్న యునైటెడ్ ప్రావిన్సుకు 1947లో సరోజినీ నాయుడు గవర్నర్‌గా నియమితులయ్యారు. -
గత కేటాయింపులే బడ్జెట్లో కొనసాగింపు..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్లో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులనే వచ్చే నెల ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లోనూ కొనసాగించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సూచనప్రాయంగా వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తెలిసిందే. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ జూలై 5న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. మధ్యంతర బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకుండా పక్కన పెట్టిన వాటికి అవసరమైతేనే అదనపు కేటాయింపులు పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ‘2019–20 మధ్యంతర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనల్లో మార్పులుండవు‘ అని సర్క్యులర్‌లో ఆర్థిక శాఖ పేర్కొంది. కొత్తగా ఏర్పాటైన 17వ లోక్‌సభ.. జూన్ 17 నుంచి జూలై 26 దాకా సమావేశం కానుంది. జూలై 4న 2019–20 ఆర్థిక సర్వేను, ఆ మరుసటి రోజు 5వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం, బ్యాంకుల మొండి బాకీలు .. ఎన్‌బీఎఫ్‌సీల నిధులపరమైన సమస్యలు, ఉపాధి కల్పన, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతుల పునరుద్ధరణ, వ్యవసాయ రంగ సమస్యలు, ఆర్థిక క్రమశిక్షణ తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం తదితర సవాళ్లు నిర్మలా సీతారామన్ ముందు ఉన్నాయి. -
బాధ్యతలను మరొకరికి అప్పగిస్తున్నా
కొట్టాయం/కొచ్చి: అత్యాచారం ఆరోపణలను ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ పరిపాలన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన ఈ నెల 13వ తేదీన జారీ చేసిన సర్క్యులర్ తాజాగా వెలుగు చూసింది. ‘నేను లేని సమయంలో మాన్సిగ్నోర్ మాధ్యూ కొక్కండమ్ ఈ డయోసిస్ పరిపాలన సజావుగా సాగేలా చూసుకుంటారు. దైవశక్తి జోక్యంతోనే ఈ అంశంలో సత్యం వెలుగు చూస్తుంది. నాకు వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన ఆధారాల్లో పరస్పర విరుద్ధాంశాలున్నాయి. ఫలితం కోసం ఎదురు చూస్తున్నాను’ అని అందులో పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా కేరళ పోలీసులు నోటీసులిచ్చిన నేపథ్యంలో ఈ సర్క్యులర్ వెలువడింది. -
సహజవాయువు ధరలు పైపైకి
న్యూఢిల్లీ: దేశంలో ఉత్పత్తయ్యే సహజవాయువు ధరలను కేంద్రం భారీగా పెంచింది. దీంతో పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా అయ్యే వంట గ్యాస్ వినియోగదారుల జేబులు గుల్ల కానుండగా ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, రిలయెన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్‌కు మాత్రం లాభాలు రానున్నాయి. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా దేశీయ సహజవాయువు ధరను అమాంతం ఆరు శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ విభాగం గురువారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. మిలియన్ మెట్రిక్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంఎంబీటీయూ)గ్యాస్‌కు 3.06 డాలర్లు చొప్పున ధర పెరుగనుంది. అధిక లోతు, అధిక వేడి, అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి వెలికితీసే గ్యాస్ ధరను 9 శాతం అంటే ఎంఎంబీటీయూకు 6.78 డాలర్ల చొప్పున పెంచింది. ఈ ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలలపాటు అమల్లో ఉంటాయి. 2014 నవంబర్ నుంచి అమల్లోకి వచ్చిన విధానం ప్రకారం.. కేంద్రం అంతర్జాతీయ మార్కెట్ ధరలననుసరించి ఆరు నెలలకోసారి సహజవాయువు ధరలను సవరిస్తోంది. -
సీబీఎస్ఈ పేపర్ లీక్.. రీ–ఎగ్జామ్
న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో రెండు పరీక్షలను మళ్లీ నిర్వహించాలని (రీ–ఎగ్జామ్) సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) బుధవారం నిర్ణయించింది. పదవ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం, పన్నెండవ తరగతి విద్యార్థులకు ఎకనామిక్స్ పరీక్షలను మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్షల తేదీల వివరాలను వారం రోజుల్లో తమ వెబ్సైట్లో ఉంచుతామని సీబీఎస్ఈ ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ‘కొన్ని పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన వార్తలను మేం పరిగణనలోకి తీసుకుంటున్నాం. విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, పరీక్షల పవిత్రతను కాపాడటం కోసం రెండు సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం’ అని సర్క్యులర్‌లో సీబీఎస్ఈ తెలిపింది. 12వ తరగతికి సోమవారం జరిగిన ఆర్థిక శాస్త్రం పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాము అన్ని పరీక్షా కేంద్రాల నుంచీ సమాచారం తెప్పించుకున్నామనీ, పేపర్ లీక్ కాలేదని సీబీఎస్ఈ అప్పుడే స్పష్టం చేసింది. పరీక్షల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు దుండగులు పేపర్ లీక్ అయినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టి ఉంటారని సీబీఎస్ఈ పేర్కొంది. 12వ తరగతికే చెందిన అకౌంటెన్సీ పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీక్ అయినట్లు తమకు ఫిర్యాదులు అందాయని మార్చి 15నే ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అలాంటిదేమీ లేదని సీబీఎస్ఈ వివరణ ఇచ్చినా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సోమవారం నుంచి కొత్త పద్ధతి.. ప్రశ్నప్రతాలు లీక్ అవుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి కొత్త పద్ధతిలో క్వశ్చన్ పేపర్లను పంపిణీ చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అలాగే లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ జరుపుతోందన్నారు. ‘సీబీఎస్ఈకి దృఢమైన వ్యవస్థ ఉంది. అయినా పేపర్లు లీక్ అవుతుంటే, లేదా వ్యవస్థలో ఏదైనా లోపముంటే.. వాటిని సరిదిద్దేందుకు సోమవారం నుంచి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నాం’ అని జవదేకర్ చెప్పారు. లీకేజీ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏం మాట్లాడారని అడగ్గా.. ప్రధానికి అన్ని వివరాలనూ తాను అందించాననీ, ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహించాలని మోదీ ఎప్పుడూ అంటుంటా రని జవదేకర్ చెప్పారు. పరీక్షల నిర్వహణను మోదీ ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారన్నారు. -
హాల్ టికెట్లు ఆపొద్దు: సీబీఎస్ఈ
న్యూఢిల్లీ: వివిధ కారణాలు చూపుతూ విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరిస్తుండటంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) స్పందించింది. ఇటువంటి ఘటనలు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతర్గత పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదనే కారణంగా హాల్ టికెట్లు ఇవ్వటం లేదనీ, ఫీజులు వసూలు చేస్తున్నారనీ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పలు ఫిర్యాదులు రావటంతో సీబీఎస్ఈ ఈ మేరకు పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. మార్చి 5వ తేదీ నుంచి పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు సీబీఎస్ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. -
ఐఐటీలో బాలికల కోసం ప్రత్యేక జాబితా
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ఐఐటీల్లో బాలికల సంఖ్యను కనీసం 14 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఐఐటీల్లో చేరే విద్యార్థుల్లో బాలికల కోసం ప్రత్యేక మెరిట్ లిస్ట్ రూపొందించాలని ఈ విద్యాసంస్థలను కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇది 2018–19 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ‘ఐఐటీల్లో సాధారణ జాబితా రూపొందించిన అనంతరం బాలికల కోసం ప్రత్యేక జాబితా రూపొందించాలి. ఒకవేళ రెగ్యులర్ మెరిట్ లిస్టులో బాలికల సంఖ్య ఆరు శాతం ఉంటే.. మొత్తం క్యాంపస్‌లో బాలికల సంఖ్య కనీసం 14 శాతం ఉండేలా వెంటనే ఐఐటీలు బాలికలతో కొత్త జాబితాను రూపొందించాలి’ అని ఆ శాఖ సర్క్యులర్‌లో పేర్కొంది. 2016 కల్లా ఐఐటీల్లో చేరే మహిళల సంఖ్యను 20 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. కాగా, ఇప్పటికే ఐఐటీల్లో లింగపరమైన రిజర్వేషన్లపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
సీఎం ఆదేశాలంటే లెక్కలేదా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సూచిం చిన ఫైళ్లను కొన్ని శాఖల అధికారులు జాప్యం చేస్తున్నారు. తన ఆదేశాల అమల్లో అధికా రుల తాత్సారంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో సీఎం నుంచి వచ్చే ఫైళ్లు, ఆదేశాలపై ఆయా శాఖల అధికారులు తక్షణం స్పందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్‌కు సీఎంవో సూచించింది. ఈ మేరకు సీఎంవో అధికారి రాజశేఖర్‌రెడ్డి సీఎస్‌కు నోట్ పంపినట్లు తెలిసింది. బుధవారం అన్ని శాఖల కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు సీఎస్ సర్క్యులర్ జారీ చేశారు. ముఖ్యమంత్రి, సీఎంవో స్థాయి నుంచి వచ్చే ఆదేశాలను వెంటనే అమలు చేయాలని సూచించారు. సీఎంవో ఫైళ్లను అత్యవసర, అత్యంత ప్రాధాన్యమున్న అంశాలుగా పరిగణించి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. ఆ తర్వాతే ఫైలు సర్క్యులేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. సీఎం సంతకం చేసిన ఫైల్ తాలూకు ఆదేశాలను వారం రోజుల్లో, వివిధ శాఖల ప్రమేయం ఉన్న ఫైళ్లను 15 రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఉత్తర్వు లకు కావాల్సిన సమాచారాన్ని సంబంధిత అధికారులు, శాఖల నుంచి మెసేజ్‌లు, ఈ మెయిల్స్ ద్వారా తెప్పించుకోవాలని కోరారు. సంబంధిత ఫైళ్లలో ఉన్న ఆర్థిక, న్యాయ పరమైన అడ్డంకులను సీఎంవోలోని సంబం ధిత అధికారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఆ విషయాన్ని అధికారులు సీఎంకు నివేదించే వీలు ఉంటుందని ప్రస్తావించారు. -
‘గుడ్ గవర్నెన్స్ డే’పై దుమారం
* క్రిస్మస్ రోజు స్కూళ్లు తెరిచి ఉంచాలని సర్క్యులర్ జారీ * పార్లమెంట్లో ప్రభుత్వంపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు * సీబీఎస్ఈ సర్క్యులర్ ఏదీ జారీ చేయలేదని ప్రభుత్వం వివరణ.. * క్రిస్మస్ రోజు పాఠశాలలకు సెలవేనని స్పష్టీకరణ న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ రోజైన డిసెంబర్ 25ని గుడ్ గవర్నెన్స్ డేగా జరపాలని, ఆ రోజున స్కూళ్లను తెరిచి ఉంచాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) శాఖకు అనుబంధంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి(ఎన్వీఎస్) జారీ చేసిన సర్క్యులర్ దుమారం రేపింది. సోమవారం పార్లమెంట్లో ఆందోళనకు దిగిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. వివాదానికి తెరదించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడింది. డిసెంబర్ 10న జారీ చేసిన సర్క్యులర్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయి పుట్టినరోజు, మదన్మోహన్ మాలవ్య జయంతి సందర్భంగా డిసెంబర్ 25న విద్యార్థుల్లో స్ఫూర్తిని రగిలించేలా క్విజ్, ఉపన్యాస పోటీలు, గుడ్ గవర్నెన్స్‌కు సంబంధించిన డాక్యుమెంటరీల ప్రదర్శన నిర్వహించాలని ఎన్వీఎస్ తన అధీనంలోని పాఠశాలలను ఆదేశించింది. తమ పరిధిలోని అన్ని జేఎన్‌వీల్లో గుడ్ గవర్నెన్స్ డే జరపాలని ఎన్వీఎస్ కమిషనర్ జీఎస్ బోత్యల్ అన్ని జేఎన్వీలకు సర్క్యులర్ జారీ చేశారు.ఈ సర్క్యూలర్‌పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, అన్నా డీఎంకే, వామపక్ష సభ్యులు ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రిస్మస్ రోజు స్కూళ్లు తెరిచి ఉంచాలని చెప్పడం ప్రమాదకరమని, ఇది సమర్థనీయం కాదని, దీనిని ఉపసంహరించుకోవాలని అన్నాయి. ఇది క్రైస్తవుల మతపరమైన హక్కులపై దాడి చేయడం లాంటిదని సీపీఎం అభివర్ణించింది. లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇచ్చారు. డిసెంబర్ 25న జవహర్ నవోదయ విద్యాలయాల(జేఎన్వీ)తో పాటు అన్ని స్కూళ్లు మూసే ఉంటాయని, దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని అన్నారు. ‘డిసెంబర్ 25న స్కూళ్లు తెరిచి ఉంచాలని సీబీఎస్ఈ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అన్ని స్కూళ్లకు షెడ్యూల్ ప్రకారమే క్రిస్మస్ సెలవులు ఉంటాయని సీబీఎస్ఈ వివరణ ఇచ్చింది’’ అని హెచ్చార్డీశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చిన్నారులు, విద్యార్థులను సెలవులకు దూరం చేసేలా లేదా వారి మతానికి చెందిన వేడుకల్లో పాల్గొనకుండా చేసే ఉద్దేశం తమకు లేదంది. గుడ్ గవర్నెన్స్ డే కోసం మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని ఆ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. పోటీలను జేఎన్వీలు స్వచ్ఛందంగా చేపట్టాయన్నారు. మతమార్పిడిలపై అట్టుడికిన రాజ్యసభ.. మతమార్పిడి అంశంపై సోమవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమాలు తుడిచిపెట్టుకుపోయాయి. చర్చ జరపాలని, ప్రధాని సమాధానమివ్వాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే చర్చకు అంగీకరించిన ప్రభుత్వం.. హోంమంత్రి రాజనాథ్ సింగ్ చర్చకు సమాధానమిస్తారని ప్రకటించడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. చర్చిలకు అదనపు భద్రత అలీగఢ్: డిసెంబర్ 25న అలీగఢ్‌కు చెందిన ఓ సంస్థ భారీ స్థాయిలో మతమార్పిడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు చర్చిలకు భద్రత కల్పించాలని అలీగఢ్‌లోని క్రైస్తవ సంఘాలు పోలీసులను కోరాయి. కాగా, శారదా చిట్ స్కామ్‌లో పశ్చిమబెంగాల్ మంత్రి మదన్ మిత్రా అరెస్టుకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం పార్లమెంట్ భవనం ఎదుట నిరసనకు దిగారు. రాయ్‌బరేలీలో మతమార్పిడి చేస్తాం: వీహెచ్‌పీ లక్నో: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో మైనారిటీలను హిందూ మతంలోకి తీసుకొస్తామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రకటించింది. 60 ముస్లిం, క్రైస్తవ కుటుంబాలను జనవరిలో మతం మార్పించబోతున్నట్లు వీహెచ్‌పీ రాయ్‌బరేలీ జిల్లా చీఫ్ హరీష్చంద్రశర్మ వెల్లడించారు. తిరిగి సొంత ఇంటికి(హిందూ మతం) రావడానికి వారు సిద్ధంగా ఉన్నారన్నారు.