న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో రెండు పరీక్షలను మళ్లీ నిర్వహించాలని (రీ–ఎగ్జామ్) సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) బుధవారం నిర్ణయించింది. పదవ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రం, పన్నెండవ తరగతి విద్యార్థులకు ఎకనామిక్స్ పరీక్షలను మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్షల తేదీల వివరాలను వారం రోజుల్లో తమ వెబ్‌సైట్‌లో ఉంచుతామని సీబీఎస్‌ఈ ఓ సర్క్యులర్‌లో పేర్కొంది.
ఈ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ‘కొన్ని పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన వార్తలను మేం పరిగణనలోకి తీసుకుంటున్నాం. విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, పరీక్షల పవిత్రతను కాపాడటం కోసం రెండు సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తాం’ అని సర్క్యులర్‌లో సీబీఎస్‌ఈ తెలిపింది. 12వ తరగతికి సోమవారం జరిగిన ఆర్థిక శాస్త్రం పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
అయితే తాము అన్ని పరీక్షా కేంద్రాల నుంచీ సమాచారం తెప్పించుకున్నామనీ, పేపర్ లీక్ కాలేదని సీబీఎస్‌ఈ అప్పుడే స్పష్టం చేసింది. పరీక్షల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు దుండగులు పేపర్ లీక్ అయినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టి ఉంటారని సీబీఎస్‌ఈ పేర్కొంది. 12వ తరగతికే చెందిన అకౌంటెన్సీ పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీక్ అయినట్లు తమకు ఫిర్యాదులు అందాయని మార్చి 15నే ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అలాంటిదేమీ లేదని సీబీఎస్‌ఈ వివరణ ఇచ్చినా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
సోమవారం నుంచి కొత్త పద్ధతి..
ప్రశ్నప్రతాలు లీక్ అవుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి కొత్త పద్ధతిలో క్వశ్చన్ పేపర్లను పంపిణీ చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అలాగే లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ జరుపుతోందన్నారు. ‘సీబీఎస్‌ఈకి దృఢమైన వ్యవస్థ ఉంది. అయినా పేపర్లు లీక్ అవుతుంటే, లేదా వ్యవస్థలో ఏదైనా లోపముంటే.. వాటిని సరిదిద్దేందుకు సోమవారం నుంచి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నాం’ అని జవదేకర్ చెప్పారు. లీకేజీ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏం మాట్లాడారని అడగ్గా.. ప్రధానికి అన్ని వివరాలనూ తాను అందించాననీ, ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహించాలని మోదీ ఎప్పుడూ అంటుంటా రని జవదేకర్ చెప్పారు. పరీక్షల నిర్వహణను మోదీ ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment