
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల ప్రవర్తనావళి గడువు ముగిసింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల కమిషన్ గురువారం పంపిన ఒక సర్క్యులర్‌లో ఈ విషయం తెలిపింది. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెల్సిందే.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఎత్తివేత నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటింది. లోక్‌సభతోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణ, లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరపడంతోపాటు అధికార పార్టీలు, ప్రభుత్వాలు అధికార దుర్వినియోగాన్ని నివారించే లక్ష్యంతో దేశంలో 1960 నుంచి ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు.