Code of Conduct
-
ఎన్నికల కోడ్ ముగిసింది: ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల ప్రవర్తనావళి గడువు ముగిసింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఎన్నికల కమిషన్ గురువారం పంపిన ఒక సర్క్యులర్‌లో ఈ విషయం తెలిపింది. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెల్సిందే. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఎత్తివేత నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఈసీ ప్రకటింది. లోక్‌సభతోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణ, లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరపడంతోపాటు అధికార పార్టీలు, ప్రభుత్వాలు అధికార దుర్వినియోగాన్ని నివారించే లక్ష్యంతో దేశంలో 1960 నుంచి ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. -
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు గురువారం నోటీసులు జారీ చేసింది.ఎన్నికల కోడ్‌ను మోదీ, రాహుల్ ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చినట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 29, ఉదయం 11 గంటల లోపు ఇరువురు నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ చేసిన ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఇద్దరు నేతలు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్వేషపూరిత ఆరోపణలు, విమర్శలు చేస్తూ ప్రసంగించారు. ఈ వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్‌ను ఈసీ వివరణ కోరింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా పార్టీ అధ్యక్షులే జాగ్రత్త వహించాలని పేర్కొంది. ECI issues notice to BJP President JP Nadda seeking party’s response on complaints of violation of model code of conduct by PM Modi during campaign in Rajasthan.BJP asked to respond by April 29. pic.twitter.com/9TmNOoWlE7— Arvind Gunasekar (@arvindgunasekar) April 25, 2024 -
శాంతిభద్రతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండండి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా తనిఖీలు, ఆస్తుల జప్తు జరుగుతున్న విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 3న సీఎస్, డీజీపీలతో సమీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగు పర్చాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు. సీజర్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలను అప్రమ్తతం చేయాలని, జిల్లా పరిధుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టపర్చాలన్నారు. ప్రతి సరిహద్దు చెక్ పోస్టు వద్ద కనీసం ఒక కెమేరాతో స్టాటిక్ సర్వలెన్స్ టీమ్‌ను ఉంచాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం నిత్యావసర సేవల్లో ఉండే 33 విభాగాలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. వీటిలో ముఖ్యంగా పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్ తదితర శాఖలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. ముందస్తు అనుమతి తప్పనిసరి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉందని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. అయితే నేరుగా గానీ, ఎన్కోర్ పోర్టల్ ద్వారా గానీ అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో అప్రమ్తతంగా ఉండాలని, ఎలాంటి దుర్ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ ఘటనలకు సంబంధించిన వాస్తవ నివేదికను వెంటనే తమకు పంపాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫారం–7, వివరాలు సరిదిద్దేందుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫారం–8లను చట్టబద్ధమైన విధానంలో ఈ నెల 26లోపు పరిష్కరించాలని ఆదేశించారు. నూతన ఓటర్ల నమోదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజూ తొమ్మిది నివేదికలను భారత ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉందని, ఈ నివేదికలు పంపే విషయంలో ఏమాత్రం అలక్ష్యం వహించొద్దన్నారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్ హరేంధిరప్రసాద్, జాయింట్ సీఈవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కట్టుదిట్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి: సీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్నిఆదేశించారు. మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్ సైట్లన్నిటిలో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన ఫోటోలు, ఆడియో, వీడియోలు వంటివి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అదే విధంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన పొటోలను,ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులపై గల రాజకీయపరమైన ప్రకటనలన్నీ తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఏశాఖనుంచైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి కార్యదర్శులకు స్పష్టం చేశారు.ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే అలాంటి వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యల తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు అందరూ చర్యలు తీసుకోవాలని అన్నారు.చాలా వరకు కార్యదర్శి స్థాయి అధికారులు ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళనున్నందున ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై పూర్తి స్పష్టత ఉండేలా ఈమార్గదర్శకాలను పూర్తిగా చదివి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి సీఈఓ ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్ లో నివేదిక ఇవ్వాలని అందరు కార్యదర్శులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను వివరిస్తూ ఎన్నికల షెడ్యూల్ వెలువడి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక కొత్త పధకాలు ప్రకటించడానికి వీలులేదని స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రావిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్లు మంజూరు, హామీలు, శంకుస్థాపనలు పూర్తి నిషేధమని సీఈవో స్పష్టం చేశారు. వర్క్ఆర్డర్ ఉన్న కేత్ర స్థాయిలో పనులు మొదలు కాని పనులు చేపట్ట కూడదని తెలిపారు. పనులు పూర్తయిన వాటికి నిధులు విడుదలలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. వివిధ రకాల ఫించన్లు పంపిణీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. కోడ్ అమలులోకి వచ్చాక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సమీక్షలు లేదా వీడియో సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద వివిధ రిజిష్టర్డ్ లబ్దిదారులకు యదావిధిగా ఉపాధి పనులు కల్పించవచ్చని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందు ఏవైనా పనులకు సంబంధించి టెండర్లు పలిచి ఉంటే ఆప్రక్రియను కొనసాగించుకోవచ్చని కాని టెండర్లను ఖరారు చేయడానికి వీలులేదని సీఈవో మీనా కార్యదర్శులకు తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలని చెప్పారు. అలాగే వివిధ పబ్లిక్ ఆస్థులు అనగా బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్లు, రైల్వే,రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన అడ్వర్టైజ్మెంట్లు, వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నిటినీ షెడ్యూల్ వెలువడిన 48గంటల్లో తొలగించాలని సీఈవో స్పష్టం చేశారు. అదే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లను నిలిపి వేయాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు లేక ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేల వంటి ప్రజా ప్రతినిధుల ఫొటోలు ఉండరాదని తెలిపారు. ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వ భవనాలు, కార్యాలయిల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు,సందేశాలు వంటివి ఉండరాదని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అలాగే పీఎం, సీఎం సహాయ నిధి కింద గుండె, కిడ్ని, కేన్సర్ వంటి రోగులకు అత్యవసర చికిత్సల కోసం సకాలంలో నిధులు మంజూరుకు ఆయా శాఖలకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సద్భావనా దివస్, గాంధీ జయంతి వంటి జాతీయ ప్రాముఖ్యతా దినోత్సవాల వేడుకల్లో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు వంటి ప్రజా ప్రతినిధులు పాల్గొన వచ్చని, ఆవేడుకల్లో రాజకీయపరమైన ప్రసంగాలు ఏపచేయరాదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర లబ్దిలు పొందినా అలాంటి వారిపై సిసిఏ నిబంధనలు ప్రకారం ఐపీసీ సెక్షన్ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123,129,134,134 ఎ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఇఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.ఇంకా ఈసమావేశంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన పలు సందేశాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ కుమార్,వై.శ్రీలక్ష్మి,కె.విజయా నంద్,వర్చువల్‌గా యం.టి కృష్ణబాబు, అనంతరాము పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, హరీశ్ కుమార్ గుప్త, ప్రవీణ్ ప్రకాశ్, సునీత, కాంతిలాల్ దండే, చిరంజీవి చౌదరి, వాణీ మోహన్, పలువురు కార్యదర్శులు,కమీషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. -
Lok sabha elections 2024: సార్వత్రిక సమరం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 18వ లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వ తేదీ వరకు మొత్తం ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్బీర్సింగ్ సంధుతో కలిసి శనివారం ఢిల్లీలో ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కూడా మే 13 న నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలన్నింటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. షెడ్యూల్ విడుదలవడంతోనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచి్చనట్టు సీఈసీ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని సీఈసీ ప్రకటించారు. షెడ్యూల్ నుంచి ఫలితాల వెల్లడి దాకా చూసుకుంటే ఈసారి ఎన్నికల ప్రక్రియ ఏకంగా 82 రోజుల సాగనుండటం విశేషం! 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల 119 రోజుల పాటు జరిగాయి. తర్వాత అత్యంత సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ ఇదే కానుంది. తమిళనాడుతో పాటు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి విడతలోనే పోలింగ్ పూర్తవుతోంది. మొత్తమ్మీద 23 రాష్ట్రాలు, యూటీల్లో ఒకే విడతలో; యూపీ, పశి్చమబెంగాల్, బిహార్లలో మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘సుపరిపాలన, అన్ని రంగాలకూ అందించిన అభివృద్ధి ఫలాల ప్రాతిపదికన అధికార పక్షం ఎన్నికల బరిలో దిగుతుండటం గత పదేళ్ల బీజేపీ పాలనలో భారత్ సాధించిన అద్భుత మార్పు’’ అని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నియంతృత్వం బారినుంచి కాపాడేందుకు ఈ ఎన్నికలు బహుశా చివరి అవకాశమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రపంచానికే తలమానికంగా... ప్రపంచానికే ప్రామాణికంగా నిలిచిపోయేలా ఈసారి ఎన్నికలను నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్‌కుమార్ ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో 91.2 కోట్ల మంది ఓటర్లుండగా 61.5 కోట్ల మంది, అంటే 67.4 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఓటింగ్ శాతాన్ని ఇతోధికంగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఈసీ వివరించారు. అందుకోసం వయోవృద్ధ, వికలాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు సదుపాయం వంటి పలు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటేయాలని కోరారు. రీ పోలింగ్ తదితరాలకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రాధాన్యమిస్తామన్నారు. 2022–23లో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీగా నగదు జప్తు చేసినట్లు వెల్లడించారు. అత్యధికంగా గుజరాత్లో రూ.802 కోట్లు, తెలంగాణలో రూ.778 కోట్లు, రాజస్థాన్‌లో రూ.704 కోట్లు జప్తు చేశారు. ఈసీ ఇంకేం చెప్పారంటే... ► జాతుల హింస బారిన పడ్డ మణిపూర్‌లో శిబిరాల్లో తలదాచుకుంటున్నవారు అక్కడే ఓటేసేలా చర్యలు తీసుకున్నాం. ► సూర్యాస్తమయం తర్వాత బ్యాంకు వాహనాల రాకపోకలు నిషిద్ధం. ► నాన్ షెడ్యూల్డ్ చార్టర్డ్ విమానాలపై పూర్తిస్థాయి నిఘా, తనిఖీ ఉంటాయి. ► అక్రమ ఆన్లైన్ నగదు బదిలీలపై ఆద్యంతం డేగ కన్నుంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వీవీప్యాట్ యంత్రాలు వినియోగిస్తారు. ► ప్రచారంలో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ నియోగించరాదు. ఆ లోక్‌సభ స్థానంలో రెండు విడతల్లో పోలింగ్! ఈసీ విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్లో ఒక విశేషం చోటుచేసుకుంది. మొత్తం లోక్‌సభ స్థానాలు 543 కాగా 544 స్థానాలకు పోలింగ్ జరగనున్నట్టు షెడ్యూల్లో పేర్కొన్నారు. దీనిపై విలేకరుల ప్రశ్నకు సీఈసీ వివరణ ఇచ్చారు. ‘‘మణిపూర్‌లో జాతుల హింసతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న ఔటర్ మణిపూర్ లోక్‌సభ స్థానంలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. అందుకే మొత్తం స్థానాలు 543 అయినా 544గా కనిపిస్తున్నాయి’’ అని వివరించారు. ఔటర్ మణిపూర్‌లోని 15 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఏప్రిల్ 19న తొలి దశలో, మిగతా 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో 26న పోలింగ్ జరగనుంది. ‘4ఎం’ సవాలుకు సిద్ధం ‘‘స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో ఈసీ ముందు ప్రధానంగా నాలుగు రకాల సవాళ్లున్నాయి. అవే మజిల్ (కండ బలం), మనీ (ధన బలం), మిస్ ఇన్ఫర్మేషన్ (తప్పుడు సమాచారం), మోడల్ కోడ్ వయోలేషన్స్ (కోడ్ ఉల్లంఘన). వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు ఈసీ సర్వసన్నద్ధంగా ఉంది’’ అని సీఈసీ ప్రకటించారు. గత ఎన్నికల అనుభవాల ఆధారంగా ఈ దిశగా పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ‘‘1.5 కోట్ల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియోగిస్తున్నాం. జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దుల వద్ద డ్రోన్ ఆధారిత తనిఖీలు, నాన్ చార్టర్డ్ విమానాలపై పూర్తిస్థాయి నిఘా ఉంటాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు వార్తలు, ఎన్నికల హింసపై ఉక్కుపాదం మోపుతాం. కండబలానికి చెక్ పెట్టి, అభ్యర్థులందరికీ సమ న్యాయం చేసేందుకు వీలుగా కలెక్టర్లు, ఎస్పీలు అనుసరించాల్సిన పలు నియమ నిబంధనలను ఇప్పటికే జారీ చేశాం. ప్రతి జిల్లాలోనూ సమీకృత కంట్రోల్ రూములు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుంటాయి’’ అని పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనను, ఎన్నికల హింసను సహించబోమన్నారు. వాటికి పాల్పడితే ఎంత పెద్ద నేతనైనా ఉపేక్షించేది లేదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ‘‘గతంలో గట్టిగా మందలించడంతో సరిపెట్టేవాళ్లం. ఇప్పుడు మాత్రం కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు. 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19 న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఒడిశాలోని 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13, మే 20, 25న, జూన్ 1ల్లో నాలుగు విడతల్లో పోలింగ్ జరుగనుంది. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తెలంగాణలో ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో మే 13న ఉప ఎన్నిక జరుగనుంది. హోరాహోరీ తలపడండి, కానీ... ఎన్నికల బరిలో పార్టీలు హోరాహోరీగా తలపడవచ్చని, అయితే ఆ క్రమంలో గీత దాటకుండా చూసుకోవాలని సీఈసీ సూచించారు. విద్వేష ప్రసంగాలకు, కుల, మతపరమైన విమర్శలు, ప్రకటనలకు, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. నేతలు కూడా వ్యక్తిగత దాడికి, దిగజారుడు భాషకు నేతలు ఉండాలన్నారు. ఈ డిజిటల్ యుగంలో మాట్లాడే ప్రతి మాటా కనీసం వందేళ్ల పాటు రికార్డై ఉండిపోతుందని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘కావాల్సినంత ద్వేషించుకుందాం. కానీ తర్వాతెప్పుడైనా మిత్రులం కావాల్సొస్తే సిగ్గుపడే పరిస్థితి రాకుండా చూసుకుందాం’’ అన్న ప్రసిద్ధ ఉర్దూ కవితా పంక్తిని ఈ సందర్భంగా సీఈసీ చదివి విని్పంచారు! ‘‘ప్రకటనలను వార్తలుగా చిత్రించడం, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రత్యర్థులను అవమానించడం, వేధించడం వంటివి కూడదు. స్టార్ ప్రచారకులు ఎన్నికల ప్రచారంలో హుందాతనాన్ని కాపాడాలి’’ అన్నారు. తప్పుడు వార్తల సృష్టికర్తలపై కఠిన చర్యలు తప్పవన్నారు. విరాళాలపై నిఘా పారీ్టలకు అందే విరాళాలపై నిఘాకు యంత్రాంగం ఉండాలని సీఈసీ అన్నారు. ‘‘అదేసమయంలో దాతల గోప్యతను కాపాడాలి. వారిని వేధించకూడదు. పారీ్టలకు అనధికార మార్గాల గుండా అందే లెక్కలోకి రాని నిధులకు అడ్డుకట్ట వేసే ఉత్తమ వ్యవస్థ రావాలి. చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అన్ని విషయాలూ తెలియాలి’’ అన్నారు. -
ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి..కలెక్టర్
కుమరం భీం: జిల్లాలో ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఎస్పీ సురేశ్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి పై పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అ ధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖర్చుల పరిశీలకులు, సహాయ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్– స్టాటిక్ సర్వేయలెన్స్, వీడియో సర్వేయలెన్స్ బృందాలు, అకౌంటింగ్ బృందం, ఎక్సైజ్ బృందం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. బృందాలను నియోజకవర్గాల వారీగా విభజించి విధులు కేటాయించామన్నారు. అధికారులు అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ప్రత్యేక వీడియో సర్వేయలెన్స్ టీం నియోజకవర్గంలో జరిగే ర్యాలీలు, బహిరంగ సభలు, ఎన్నికలకు సంబంధిత అంశాలను వీడియో రికార్డింగ్ చేస్తుందని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఫిర్యాదులపై స్పందించాలని, మద్యం, నగదు, కానుకల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ఖర్చులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. 1950, 08733279411 నంబర్లతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఆధారాలు లేకుండా రూ.50 వేల కంటే అధికంగా నగదు, రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన మద్యం తరలిస్తే సీజ్ చేస్తామని తెలిపారు. ఎంసీఎంసీ బృందం దినపత్రికలు, టీవీ చానళ్లు, మొబైల్ సందేశాలు, సోషల్ నెట్‌వర్క్‌లపై దృష్టి సారించాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార సమయంలో ఎంసీఎంసీ అనుమతి పొందాలన్నారు. ప్రతిరోజూ ఫ్లయింగ్ స్క్వాడ్ నివేదికలు అందించాలని ఆదేశించారు. -
రూ.100 కోట్ల స్కాం: నలుగురు కాదు ఆరుగురు ఉద్యోగులపై టీసీఎస్ చర్యలు
ముంబై: కొన్ని రిక్రూట్మెంట్ సంస్థలతో కుమ్మక్కై, వాటికి ప్రయోజనాలు చేకూర్చేలా వ్యవహరించినందుకు గాను ఆరుగురు ఉద్యోగులపై ఐటీ దిగ్గజం టీసీఎస్ చర్యలు తీసుకుంది. నైతిక నియమావళిని పాటించలేదని విచారణలో తేలడంతో ఆరుగురు ఉద్యోగులను, అలాగే ఆరు సంస్థలను నిషేధించినట్లు సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. మరో ముగ్గురు ఉద్యోగుల పాత్రపైనా సంస్థ విచారణ జరుపుతోందని ఆయన షేర్హోల్డర్లకు వెల్లడించారు. (వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్) కొందరు ఉద్యోగుల తప్పుడు ప్రవర్తన గురించి ఇద్దరు ప్రజావేగుల నుంచి కంపెనీకి ఫిర్యాదులు రావడం, టీసీఎస్‌లో ఉద్యోగాలకు లంచాలు తీసుకుంటున్నారని.. తత్సంబంధ వ్యక్తులు ఈ రకంగా కనీసం రూ. 100 కోట్లు సంపాదించారని ఇటీవల మీడియాలో వార్తలు రావడం నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, సంపన్న దేశాల్లో అనిశ్చితితో రాబోయే కొన్ని త్రైమాసికాల్లో వ్యాపారానికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చని, అయితే మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే అవకాశాలు ఆశావహంగానే ఉన్నాయని చంద్రశేఖర్ వివరించారు. (తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా?) -
IPL 2023: కోహ్లి మ్యాచ్ ఫీజులో కోత
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ కోహ్లిపై జరిమానా విధించారు. సోమవారం చెన్నైతో జరిగిన పోరులో ప్రత్యర్థి బ్యాటర్ శివమ్ దూబే అవుటైనపుడు కోహ్లి సంబరం అతిగా అనిపించడంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. కోహ్లి తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ జరిమానాతో సరిపెట్టారు. నియమావళిలోని ఆర్టికల్ 2.2 లెవెల్ 1 అతిక్రమణలో రిఫరీదే తుది నిర్ణయం అవుతుంది. -
ఐపీఎల్ నిబంధన ఉల్లంఘన.. కేఎల్ రాహుల్‌కు భారీ జరిమానా
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధనలను అతిక్రమించిన కారణంగా కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. డీవై పాటిల్ వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నిబంధన అతిక్రమించినట్లు సమాచారం అందింది. కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేఎల్ రాహుల్ లెవల్-1 నిబంధన ఉల్లఘించినట్లు తేలింది. రాహుల్ కూడా తన తప్పును ఒప్పుకోవడంతో రూల్ ప్రకారం అతని మ్యాచ్ ఫీజు నుంచి 20 శాతం కోత విధిస్తున్నాం అంటూ ప్రకటనలో తెలిపింది. కాగా కేఎల్ రాహుల్ ఇప్పటికే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా 12 లక్షల జరిమానా పడింది. మరో రెండుసార్లు రాహుల్ స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే ఒక మ్యాచ్ బ్యాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తృటిలో తప్పించకున్న మార్కస్ స్టోయినిస్ లక్నో సూపర్ జెయింట్స్‌కే చెందిన బ్యాట్స్‌మన్ మార్కస్ స్టోయినిస్ తృటిలో జరిమానా నుంచి తప్పించకున్నాడు. వైడ్ విషయంలో అంపైర్‌ను తప్పుబట్టి ఐపీఎల్ లెవెల్-1 నిబంధన అతిక్రమించాడు. అయితే మేనేజ్మెంట్ మాత్రం స్టోయినిస్‌ను వార్నింగ్‌తో సరిపెట్టింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద స్టోయినిస్ లెవెల్-1 నిబంధనను అతిక్రమించాడు. అయితే ఇది మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించి వదిలేస్తున్నాం అంటూ ప్రకటనలో పేర్కొంది, ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. కృనాల్ పాండ్యా 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కేఎల్ రాహుల్ 30, స్టోయినిస్ 24 పరుగులు చేశారు. చదవండి: LSG vs RCB: అంపైర్ వైడ్ ఇచ్చుంటే లక్నో మ్యాచ్ గెలిచేదేమో! Virat Kohli Golden Duck In IPL: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు -
చంపేస్తానంటూ హెచ్చరిక.. ఆటగాడిపై జీవితకాల నిషేధం
క్రికెట్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం. ఒక్కోసారి అవి కొట్టుకునే స్థాయికి వెళ్తాయి. అయితే ఇలాంటివి జరగకుండా అంపైర్లు జోక్యం చేసుకొని వివాదాన్ని సద్దుమణిగిస్తుంటారు. మరి అలాంటి అంపైర్లకు చంపేస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తే ఆటగాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సరిగ్గా అలాంటి పనే పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ చేసింది. చదవండి: Virat Kohli: 'కోహ్లి వివాదం ముగించే వ్యక్తి గంగూలీ మాత్రమే' మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అంపైర్‌పై చేయి చేసుకోవడంతో పాటు చంపేస్తానంటూ తిమోటి వీర్ అనే క్లబ్ క్రికెటర్ గ్రౌండ్‌లోనే వార్నింగ్ ఇచ్చాడు. డిసెంబర్ 4న గిస్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. దీనిపై విచారణ జరిపిన పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ తిమోటిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. క్రికెట్ నిబంధనల ప్రకారం అంపైర్‌పై దురుసు ప్రవర్తన మాత్రమేగాక చంపేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ కింద లెవెల్-4 నిబంధనలను తిమోటి అతిక్రమించినట్లు తేలింది. ఈ చర్యలకుగాను ఇకపై క్రికెట్ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇంతకముందు కూడా తిమోటి ఇదే తరహాలో తన దురుసు ప్రవర్తనతో కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఉల్లఘించాడని.. అందుకే తాజా చర్యను సీరియస్‌గా తీసుకొని జీవితకాలం నిషేధం విధించినట్లు పావర్టీ బే క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ ఐసాక్ హ్యూగ్స్ వివరణ ఇచ్చారు. చదవండి: Ashes 2021-22: జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్.. సూపర్‌మాన్‌లా డైవ్ చేస్తూ.. వీడియో వైరల్ -
ఉప ఎన్నికకు ఏర్పాట్లు కట్టుదిట్టం
సాక్షి, అమరావతి: పటిష్టమైన నిఘాతో వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. ప్రచారంలో రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. బద్వేలు ఉప ఎన్నిక నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను శుక్రవారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడంతో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి ► కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం, ర్యాలీలు నిర్వహించుకోవాలి. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ సమయంలో ఎటు వంటి ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించకూడదు. నామినేషన్లకు అభ్యర్థితోపాటు మరొకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. ► ఎన్నికల ప్రచార సమయంలో ఇండోర్ సమావేశాలకు 200 మంది, బహిరంగ సమావేశాలకు స్టార్ క్యాంపైనర్లకు 1,000 మంది, ఇతరులకు 500 మంది, వీధుల్లో సమావేశాలకు 50 మంది, ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి. ► బహిరంగ సమావేశాల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఆ వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో వేస్తారు. ఆ సమయంలో ఒక్కో అభ్యర్థికి 20 వాహనాలను 50 శాతం సీటింగ్ కెపాసిటీతో అనుమతిస్తారు. ► రెండు డోసుల కోవిడ్ టీకా వేయించుకున్న వారినే ఎన్నికల ఏజంట్లుగా పెట్టుకోవాలి. ఇదే నిబంధన పోలింగ్ సిబ్బందికీ వర్తిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు. శానిటైజ్ చేయడంతో పాటు థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ సౌకర్యం ఉంటుంది. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 7 గంటలలోపు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి. నిరంతర పర్యవేక్షణ ► వైఎస్సార్ జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీస్ పోస్టు, చెక్ పోస్టుల ద్వారా నిశిత తనిఖీలు ఉంటాయి. ► ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘాకు 8 టాస్కు ఫోర్సు బృందాలు, 21 ప్లైయింగ్ స్క్వాడ్లు, 3 వీడియో వ్యూయింగ్ బృందాలు, 4 ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేశాం. ► మొత్తం 281 పోలింగ్ స్టేషన్లలో 140 చోట్లకు పైగా లైవ్ టెలికాస్టు ద్వారా ఎన్నిక నిశిత పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నాం. ► ఫిర్యాదుల స్వీకరణ, తక్షణ పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్, వెబ్సైట్, మొబైల్ యాప్ ఏర్పాటు చేశాం. 1950కు ఫోన్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. వికలాంగులు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ► 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, కోవిడ్ పాజిటివ్ ఓటర్లు కోరితే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తాం. ఇందుకు నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుండి ఐదు రోజుల్లోపు 12–ఈ ఫార్ములాలో దరఖాస్తు చేసుకోవాలి. బద్వేలు నియోజకవర్గంలో 80 ఏళ్లుపై బడిన వృద్ధులు 3,837 మంది, వికలాంగులు 3,902 మంది ఓటర్లుగా ఉన్నారు. ► 2,16,164 మంది జనరల్, సర్వీసు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే అక్టోబర్ 8 లోపు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారు కూడా ఓటు వేయొచ్చు. మొత్తం 281 పోలింగ్ స్టేషన్లలో 30 సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నాం. -
సోషల్ మీడియాకు కళ్లెం
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దుర్విని యోగంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను, నేరపూరిత సమాచారాన్ని కట్టడి చేసేందుకు సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు చేపట్టాల్సిన చర్యలను నిర్ధారిస్తూ కఠిన నిబంధనావళిని విడుదల చేసింది. అలాగే, తమ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రసారమయ్యే కంటెంట్‌కు సంబంధించి యూట్యూబ్, ఆమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సంస్థలు అనుసరించాల్సిన నియమాలను నిర్ధారించింది. వివాదాస్పద సమాచారంపై సత్వరమే స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారం కోసం అధికారులను నియమించి, వారు భారత్‌లోనే నివసించేలా చూడాలని ఆదేశించింది. భారత్‌లోని చిరునామాతో కార్యాలయం ఉండాలని పేర్కొంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా షేర్ అవుతున్న పోస్ట్‌లను, సంబంధిత ఖాతాలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాల విషయంలో కేంద్రానికి, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు మధ్య ఇటీవల వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా, ఓటీటీ, డిజిటల్ మీడియాల నియంత్రణకు ఉద్దేశించిన తాజా నియమ, నిబంధనలను ‘ద ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్’ పేరుతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం వెల్లడించారు. దర్యాప్తు సంస్థలతో సమన్వయం కోసం వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్ తదితర సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ఆమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యాజమాన్యాలు భారత్‌లో ప్రత్యేకంగా ప్రతినిధులను నియమించుకోవాలని ఆ నిబంధనల్లో స్పష్టం చేశారు. అలాగే, వివాదాస్పద సమాచారాన్ని మొదట రూపొందించిన వ్యక్తిని 24 గంటల్లోపు గుర్తించి, ఆ సమాచారాన్ని, ఆ ఖాతాను తొలగించాలని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే సమాచారం, లైంగిక దృశ్యాలు, మార్ఫ్డ్ ఫొటోలు, నగ్నచిత్రాల విషయంలోనూ ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు స్పందించాలని ఆదేశించారు. వివాదాస్పద సమాచారంపై ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే.. తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు. వినియోగదారులు, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం భారత్‌లోనే ఉండేలా ఒక అధికారిని నియమించాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలతో నెలవారీ నివేదికను రూపొందించాలని, వినియోగదారుల ఫిర్యాదులపై 15 రోజుల్లోగా స్పందించాలని ఆదేశించారు. దేశ సార్వభౌమత్వాన్ని, దేశ రక్షణను, సమాజంలో శాంతి భద్రతలను దెబ్బతీసే సమాచారంపై.. ఆ సమాచారాన్ని తొలుత రూపొందించిన వ్యక్తి వివరాలను ప్రభుత్వం కానీ, కోర్టులు కానీ కోరితే వెంటనే అందించాలని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏదైనా సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. వినియోగదారుల సంఖ్య ఆధారంగా సోషల్ మీడియా సంస్థలను రెండు విభాగాలుగా విభజిస్తూ నిబంధనలను రూపొందించారు. ప్రభావశీల సామాజిక మాధ్యమాలు మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. వార్తలు, వార్తాకథనాలను అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా వాటి యాజమాన్య వివరాలను స్పష్టంగా పేర్కొనాలని నిబంధనల్లో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలు, ఓటీటీ సంస్థలు, డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్స్ దుర్వినియోగం కాకుండా చూసేందుకే ఈ నిబంధనలను రూపొందించామని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆయా సంస్థలు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 2011 నాటి నిబంధనల స్థానంలో తాజా నిబంధనలను తీసుకువచ్చామన్నారు. ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థలు తాజా నిబంధనలను అమలు చేసేందుకు మూడు నెలల గడవును ఇచ్చామన్నారు. ‘భారత్‌లో అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థల వ్యాపార విస్తరణను స్వాగతిస్తాం. విమర్శను, భిన్నాభిప్రాయాన్ని కూడా గౌరవిస్తాం. అలాగే, సోషల్ మీడియా వినియోగదారులకు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక సరైన వేదిక కూడా ఉండాలి’ అని ఆయన వివరించారు. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ డేటా చవకగా లభిస్తున్న భారత్.. సోషల్ మీడియా సంస్థలకు అతిపెద్ద లాభదాయక మార్కెట్‌గా మారిన విషయం తెలిసిందే. భారత్‌లో వాట్సాప్‌కు 53 కోట్ల మంది, ఫేస్‌బుక్‌కు 41 కోట్లమంది, యూట్యూబ్‌కు 44.8 కోట్ల మంది, ట్విటర్‌కు 1.75 కోట్లమంది, ఇన్‌స్ట్రాగామ్‌కు 21 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు. సోషల్ మీడియా నిబంధనలను ఐటీ శాఖ పర్యవేక్షిస్తుంది. ఓటీటీ, డిజిటల్ మీడియా నిబంధనలను సమాచార ప్రసార శాఖ పర్యవేక్షిస్తుంది. అన్ని సోషల్ మీడియా సంస్థలు భారతీయ చట్టాలను గౌరవించాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల వినియోగదారుల సాధికారత లక్ష్యంగా కొత్త నిబంధనలు రూపొందాయని ట్వీట్ చేశారు. తాజా నిబంధనల ప్రకారం.. అన్ని సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు ఒక చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, ఒక నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్, ఒక రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించుకోవాలి. వారు భారత్‌లోనే నివాసం ఉండాలి. ఫిర్యాదులకు సంబంధించిన నివేదికను నెలవారీగా వారు రూపొందించాలి. తమ అకౌంట్లను స్వచ్చందంగా వెరిఫై చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించాలి. కంటెంట్‌ను తొలగించడానికి సంబంధించి వినియోగదారుడికి ముందుగా సమాచారం, వివరణ ఇవ్వాలి. ఈ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం వినియోగదారులకు ఉండాలి. వినియోగదారుల వయస్సు ఆధారంగా తాము ప్రసారం చేసే కంటెంట్‌ను యూనివర్సల్, యూ/ఏ 7+ సంవత్సరాలు, యూ/ఏ 13+ సంవత్సరాలు, యూ/ఏ 16+ సంవత్సరాలు, ఏ(పెద్దలకు మాత్రమే) అనే ఐదు విభాగాలుగా ఓటీటీ సంస్థలు విభజించాలి. ఆయా విభాగాలను స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. దాంతో, వినియోగదారులు తాము వీక్షించనున్న వీడియోపై ముందే ఒక అవగాహనకు వస్తారు. యూ/ఏ 13+ సంవత్సరాలు.. ఆ పై విభాగాలకు సంబంధించి పిల్లలకు అందుబాటులో లేకుండా పేరెంటల్ లాక్ సదుపాయాన్ని కల్పించాలి. అడల్ట్ కంటెంట్‌ను వీక్షించేందుకు వయస్సును నిర్ధారించే విశ్వసనీయమైన ప్రక్రియ ఉండాలి. వార్తలను, వార్తాకథనాలను ప్రసారం చేసే డిజిటల్ మీడియా సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను, కేబుల్ టెలీవిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ చట్టంలోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అపోహలను, అసత్యాలను ప్రచారం చేయకూడదు. స్వీయ నియంత్రణతో కూడిన మూడంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తొలి స్థాయిలో పబ్లిషర్ల స్వీయ నియంత్రణ, రెండో స్థాయిలో పబ్లిషింగ్ సంస్థలకు సంబంధించిన ఉమ్మడి స్వీయ నియంత్రణ విభాగం, మూడో స్థాయిలో పర్యవేక్షక నియంత్రణ ఉండాలి. రెండో స్థాయిలోని స్వీయ నియంత్రణ విభాగం కోసం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, లేదా సంబంధిత వ్యవహారాల్లో నిపుణుడైన వ్యక్తిని నియమించుకోవచ్చు. ఆ కమిటీలో గరిష్టంగా ఆరుగురు సభ్యులుండాలి. సమాచార ప్రసార శాఖ వద్ద ఆ కమిటీని రిజిస్టర్ చెయ్యాలి. తమ అకౌంట్లను స్వచ్చందంగా వెరిఫై చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించాలి. కంటెంట్‌ను తొలగించడానికి సంబంధించి వినియోగదారుడికి ముందుగా సమాచారం, వివరణ ఇవ్వాలి. ఈ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం వినియోగదారులకు ఉండాలి. వినియోగదారుల వయస్సు ఆధారంగా తాము ప్రసారం చేసే కంటెంట్‌ను యూని వర్సల్, యూ/ఏ 7+ సంవత్సరాలు, యూ/ఏ 13+ సంవత్సరాలు, యూ/ఏ 16+ సంవత్సరాలు, ఏ(పెద్దలకు మాత్రమే) అనే 5 విభాగాలుగా ఓటీటీ సంస్థలు విభజించాలి. అవి స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. యూ/ఏ 13+ సంవత్సరాలు.. ఆ పై విభాగాలకు సంబంధించి పిల్లలకు అందుబాటులో లేకుండా పేరెంటల్ లాక్ సదుపాయాన్ని కల్పించాలి. అడల్ట్ కంటెంట్‌ను వీక్షించేందుకు వయస్సును నిర్ధారించే విశ్వసనీయమైన ప్రక్రియ ఉండాలి. వార్తలను, వార్తాకథనాలను ప్రసారం చేసే డిజిటల్ మీడియా సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ చట్టంలోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అపోహలను, అసత్యాలను ప్రచారం చేయకూడదు. స్వీయ నియంత్రణతో కూడిన మూడంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తొలి స్థాయిలో పబ్లిషర్ల స్వీయ నియంత్రణ, రెండో స్థాయిలో పబ్లిషింగ్ సంస్థలకు సంబంధించిన ఉమ్మడి స్వీయ నియంత్రణ విభాగం, మూడో స్థాయిలో పర్యవేక్షక నియంత్రణ ఉండాలి. రెండో స్థాయిలోని స్వీయ నియంత్రణ విభాగం కోసం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, లేదా రిటైర్డ్ హైకోర్టు దాన్యాయమూర్తి, లేదా సంబంధిత వ్యవహారాల్లో నిపుణుడైన వ్యక్తిని నియమించుకోవచ్చు. -
కాంగ్రెస్‌కి షాకిచ్చిన ఎన్నికల కమిషన్
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కమల్ నాథ్‌కు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను కమల్ నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక మహిళా అభ్యర్థిని ‘ఐటెం’ అంటూ సంభోదించడం పట్ల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళ పట్ల ఇలాంటి పదాలను వాడటం కమిషన్ జారీ చేసిన నియమాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది. రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ, కమల్ నాథ్ ప్రవర్తనా నియమావళి నిబంధనలను పదేపదే ఉల్లంఘించారని తెలిపింది. (చదవండి: ‘ఐటెం’ వ్యాఖ్యలపై కమల్ నాథ్ వివరణ) అలానే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కూడా కమల్ నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక ఇప్పటి నుంచి కమల్ నాథ్ ఏదైనా నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటే.. మొత్తం వ్యయాన్ని ఆ నియోజకవర్గ అభ్యర్థినే భరించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ తన ఉత్తర్వలో స్పష్టం చేసింది. అలానే ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు హుందాగా, గౌరవప్రదంగా మెలగడం కోసం అందరి ఏకాభిప్రాయంతో ప్రవర్తనా నియమావళిని రూపొందించారని.. ఇది అనేక దశాబ్దాలుగా అమలులో ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. -
స్థానిక అభ్యర్థీ.. ఇవి తెలుసుకో.!
సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రవర్తన నియమావళి ఈ నెల 7 నుంచే అమల్లోకి వచ్చింది. ఎన్నికల్ కోడ్‌ను అందరూ కచ్చితంగా పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గీత దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకూ కోడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ప్రశాంతయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అభ్యర్థులంతా సహకరించాలని కోరుతున్నారు. అభ్యర్థులకు, పారీ్టలకు పలు సూచనలు అందిస్తున్నారు. ఇవి చేయొద్దు.. ►ప్రజల మధ్య విద్వేషాలు రేకెత్తించేలా, ఉద్రిక్తతలకు కారణమయ్యేలా, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఏ పార్టీ అభ్యర్థి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. జాతి, కులం, మతం, ప్రాంతం పేర్లతో ఓట్లు అడగకూడదు. ►ఆలయాలు, మసీదులు, చర్చిలను ఎన్నికల ప్రచారానికి వినియోగించకూడదు. ►అభ్యర్థుల వ్యక్తిగత జీవితం, అంశాల ప్రస్తావనను ఓటర్ల వద్ద తీసుకురాకూడదు. ఎవరి గురించి అయినా వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ఆరోపణలు చేయకూడదు. ►ప్రైవేటు, ప్రభుత్వ భవనాలపై వాటి యాజమాని, సంబంధిత అధికారి అనుమతి లేకుండా జెండా కట్టడం, పోస్టర్లు అతికించడం, నినాదాలు రాయడం చేయకూడదు. అనుమతి ఉంటే సంబంధిత పత్రాలను ఎన్నికల అధికారికి ఇవ్వాలి. ►ఒక అభ్యరి్థ, అతని అనుచరులు మరో పార్టీ వారి జెండాలు, పోస్టర్లను తొలగించకూడదు. ►ఒక పార్టీకి చెందిన అభ్యర్థి ఇతర పారీ్టల నాయకుల దిష్టిబొమ్మలను ఊరేగించడం, తగలబెట్టడం, ప్రదర్శించడం చేయకూడదు. ఊరేగింపుల్లో పోలీసుల సాయం ఊరేగింపు ప్రారంభానికి ముందే తేదీ, సమయం, మార్గం, ముగింపు ప్రదేశం, నిర్వహించే అభ్యర్థి వివరాలు తెలియజేయాలి. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఆ మార్గంలో నిషేధ ఆజ్ఞలు ఉంటే మినహాయింపు కోరుతూ ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి. రెండు, అంతకు మించి రాజకీయ పారీ్టలు ఒకే మార్గంలో ఊరేగింపు చేయాల్సి వస్తే ఒకరికొకరు ఎదురు పడకుండా చూడాలి. పోలీసుల సాయం తప్పనిసరిగా తీసుకోవాలి. వీటికి దూరంగా ఉండాలి.. ►అవినీతి, నేరాలకు అభ్యర్థులు దూరంగా ఉండాలి. ►మతం, కులం, వర్గం ప్రాతిపదికన ఓటు వేయమని, వేయవద్దని కోరడం చేయరాదు. ఓటుకోసం మతపరమైన గుర్తుల వినియోగం చేయకూడదు. ►ముద్రించేవారు, ప్రచురించే వారి పేర్లు లేకుండా కరపత్రాలు, పోస్టర్లు, సర్కులర్లు, ఇతర ప్రకటనలు ఇవ్వరాదు. ►ఒక అభ్యర్థి వ్యక్తిగత ప్రవర్తన, నడవడికకు సంబంధించి అవాస్తవాలతో కూడిన ప్రకటనలు ఇవ్వడం, వార్తాంశాలను ప్రచురించడం చేయరాదు. ►ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఏర్పాటు చేసిన సమావేశాలు, సభలను అడ్డుకోవడం సరికాదు. ►ఓటర్లకు ఏ రూపంలోనూ లంచం, బహుమతులు ఇవ్వరాదు. ►పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ప్రచారం ఉండాలి. ►పోలింగ్ రోజున ఓటర్లకు ప్రయాణ సౌకర్యం కలి్పంచడం నేరం. ►పోలింగ్ కేంద్రాల సమీపంలో క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం, పోలింగ్ అధికారి విధులను అడ్డగించడం చేయరాదు. ►మరొకరి ఓటు వేయడానికి ప్రయత్నం చేయకూడదు. అనుమతి ఉంటేనే... ►అధికారుల అనుమతి లేకుండా బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే బహిరంగ సభలు, సమావేశాల వద్ద మైకులను వినియోగించాలి. ఇతర సందర్భాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే ఉపయోగించాలి. ►ఆస్పత్రుల్లోని రోగులకు అసౌకర్యాం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల అనుమతి లేకుండా ఉపన్యాసాలు, రికార్డు చేసిన ప్రసంగాలను వినిపించకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు వాటిని జప్తు చేయవచ్చు. ►బహిరంగ ప్రదేశాల్లో ఎన్నికల సభలు నిర్వహించడానికి అనుమతి మంజూరు విషయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీ మధ్య పక్షపాతం చూపకూడదు. ఒకే ప్రదేశంలో ఒకే తేదీ, ఒకే సమయంలో సమావేశాలకు ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తు వస్తే.. మొదటగా అందినదానికి అనుమతి ఇవ్వాలి. మరిన్ని నిబంధనలు ►ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పోటీ చేస్తే అభ్యరి్థ, రాజకీయ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు. ►ఎన్నికల పర్యటనలో భాగంగా ఎవరైనా ఒక వ్యక్తి ఆహా్వనం మేరకు మంత్రి హాజరైనా ప్రభుత్వ ఉద్యోగి అందులో పాల్గొనకూడదు. ►ఎన్నికల సమావేశాలు నిర్వహించే మైదానాలు, హెలిప్యాడ్లు తదితర బహిరంగ ప్రదేశాల విషయంలో అధికార పార్టీ గుత్తాధిపత్యం చూపకూడదు. అధికార పార్టీ ఏ నియమాల ప్రకారం ఉపయోగిస్తుందో.. అవే నియమాలపై ఇతర పార్టీ అభ్యర్థులకూ అనుమతించాలి ►విశ్రాంతి భవనాలు, సర్క్యూట్ హౌస్‌లు, ఇతర ప్రభుత్వ వసతి వినియోగంలోనూ.. అలాగే ఎన్నికల ప్రచారం నిమిత్తం భవనాలు, వాటి పరికరాలను వినియోగంచడానికి అనుమతి ఇవ్వరాదు. ►ఎయిడెట్ విద్యాసంస్థలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సాయం పొందే, ఇతర ఏదైనా విద్యా సంస్థల యాజమన్యానికి బాధ్యులుగా ఉన్న వారితో సంబంధం ఉండకూడదు. అభ్యర్థి ఎన్నిక అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు ఆ సంస్థకు చెందిన భవనాలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది, విధులు, వాహనాలను వినియోగించకూడదు. ►అన్ని సమావేశాలను ఎన్నికల సమావేశాలుగా పరిగణించాలి. వాటికి ప్రభుత్వ నిధులు వినియోగించకూడదు. శాంతి భద్రతల విధులు నిర్వహించే వారు తప్ప ఇతర ప్రభుత్వ ఉద్యోగులు హాజరు కాకూడదు. ఒక మంత్రి ఎన్నికలు జరిగే ప్రాంతానికి పర్యటనకు వెళ్తే అది ఎన్నికల పర్యటన కిందనే గుర్తించాలి. పర్యటనకు ప్రభుత్వ వాహనాలను ఇతర సౌకర్యాలను కల్పించకూడదు. -
కోడ్ ముగిసింది!
ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలో పది నెలలుగా అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) శనివారంతో ముగిసింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ సర్క్యూలర్ ద్వారా జిల్లా అధికారులకు సమాచారం అందించారు. గతేడాది డిసెంబర్లో అసెంబ్లీ, జనవరిలో పంచాయతీ, మార్చిలో ఎమ్మెల్సీ, ఏప్రిల్‌లో లోక్‌సభ, మే నెలలో పరిషత్ ఎన్నికలు జరిగాయి. వరుస ఎన్నికలు ఉండడంతో కోడ్ అమల్లో ఉంది. అన్నీ రాష్ట్రాల్లో లోక్‌సభ ఫలితాల తర్వాత కోడ్‌ను ఎత్తివేయగా, మన రాష్ట్రంలో పరిషత్ ఫలితాలు లోక్‌సభ ఫలితాల అనంతరం వెలువడడంతో కోడ్ కొనసాగుతూ వచ్చింది. తాజాగా ఫలితాలు వెలువడి ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక కూడా జరిగింది. దీంతో కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈసారి వరుస ఎన్నికలు రావడంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, వాటికి సంబంధించిన నిధుల విడుదల వెనుకబడిపోయింది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు, పథకాలతో ప్రజలకు చేకూర్చే లబ్ధి గత ఎనిమిది నెలలుగా ఆగిపోయిందని చెప్పవచ్చు. 2018 సెప్టెంబర్ 6న సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28న రాష్ట్రంలో పాక్షికంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. సుమారు 251 రోజులు జిల్లాలో కోడ్ అమల్లో కొనసాగింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో జిల్లాలో పనులకు, నిధుల విడుదలకు లైన్‌క్లియరైంది. రెండేళ్లుగా అందని రుణాలు... గత కొన్ని రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం ఎలాంటి విధాన ప్రకటనలు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. శనివారం జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరగడంతో జిల్లాలో కోడ్ పరిసమాప్తమైంది. కోడ్ అమలులో ఉండడంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన వ్యక్తిగత రుణాలు, గ్రూపుల వారీ రుణాల విడుదల రెండేళ్లుగా అందడం లేదు. 2017–18 సంవత్సరంలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు రెండేళ్లు దాటిన ఇంత వరకు చెక్కులు గానీ, డబ్బులు గానీ చేతికి అందడం లేదు. ప్రభుత్వఉద్యోగం రాకపోయిన కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చనే ఆశతో 2017–18 సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా సాయం పొందేందుకు దాదాపు పదివేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఇంత వరకు సగం మందికి రుణాలు అందలేదు. ఇప్పుడు కోడ్ ముగియడంతో లబ్ధిదారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. నిలిచిన నిధులు.. పనులు.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆరు నెలలుగా ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, పనులు గానీ ప్రారంభించకపోగా, 2019–20 ఆర్థిక యేడాదిలోనూ ఏప్రిల్, మే నెలల్లో ఎలాంటివి చేపట్టేందుకు ఆస్కారం లేకుండా పోయింది. అంటే సుమారు ఎనిమిది నెలలుగా వివిధ ప్రభుత్వ శాఖలకు నిధులు విడుదల నిలిచిపోగా, ఆయా పనులు సైతం ఆగిపోయాయి. ప్రధానంగా వ్యవసాయ శాఖ ద్వారా అందజేసే రైతుబంధు (పెట్టుబడి సాయం) జిల్లాలో ఇంకా రైతులకు అందలేదు. ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌కు ముందు రైతుల చేతికి అందించాల్సి ఉండగా, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్న ఇంత వరకు పెట్టుబడి సాయం చేతికి అందలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిధుల విడుదలలో జాప్యం జరిగిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు కోడ్ తొలగిపోవడంతో రైతులకు పెట్టుబడి సాయం అందే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత ఎనిమిది నెలలుగా కళ్యాణలక్ష్మి పథకానికి వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పథకాలకు ఎన్నికల కోడ్‌తో ఏలాంటి సంబంధం లేకపోయినా.. కోడ్ అమలులో నేపధ్యంలో పథకాలకు నిధుల విడుదల సమస్యగా మారింది. గత పక్షం రోజుల కిందట నిధులు విడుదలైన అధికారులు ఎన్నికల పనుల్లో బీజీగా ఉండడంతో లబ్ధిదారుల చేతికి అందలేదు. దీంతో పథకం అమలు మందగించిందని చెప్పొచ్చు. -
రాహుల్‌కు ఈసీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు శుక్రవారం ఈసీ నోటీసులు జారీ చేసింది. తాను పోటీ చేస్తున్న అమేధి నియోజకవర్గంలో రాహుల్ ఫోటోలతో కూడిన బ్యానర్లను ఏర్పాటు చేసి ఆ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ హామీ పధకం పేరిట ‘ ఇప్పుడు న్యాయం జరుగుతుంది’ అనే నినాదాలను వాటిపై పొందుపరచడం పట్ల ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఈసీ ఆదేశించింది. స్ధానిక అధికారుల అనుమతి లేకుండానే ఈ బ్యానర్లను ఏర్పాటు చేశారని ఈసీ పేర్కొంది. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు అమేథిలో ఈ తరహా భారీ బ్యానర్లను గుర్తించి, కాంగ్రెస్ కార్యకర్తలను సంబంధిత పత్రాలు చూపాలని కోరగా వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని నోటీసులో ఈసీ పేర్కొంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే ఈసీ చర్యలు చేపడుతుందని అధికారులు తెలిపారు. -
‘గురి’తప్పినందుకే గురివింద నీతి
తాను పదవినుంచి దిగిపోతాననే భావన ఏపీ సీఎం చంద్రబాబులో రోజు రోజుకు బలపడుతున్న తీరు ఆయనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్టుంది. ఫలితంగా తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోయే వాతావరణం ఉందని ఎన్నికల ప్రకటనకు చాలా ముందే పాలకపక్ష పెద్ద గ్రహించారు. అధిగమించే ఎత్తుగడలు ప్రారంభించారు. ఇష్టులైన అధికారులను తెచ్చుకోవడం, ఈసీపై దాడులకు ముందే సిద్ధం కావడం, ప్రభుత్వ డబ్బును ఎన్నికల తరుణంలో పంచేయడం.. ఇవేవీ పనిచేయకపోవడంతో చంద్రబాబు విలవిల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో బట్టబయలవుతున్న అన్ని అరిష్టాలకూ మలివిడత ఎన్నికల సంస్కరణలే పరిష్కారమా? ‘ఆరిపోయే దీపానికి వెలుగులెక్కువ, ఆపద్దర్మ ముఖ్యమంత్రికి అరుపులెక్కువ’ఇదొక కొత్త పేరడీ! సామాజిక మాధ్యమాల విస్తృతి, ప్రభావం వల్ల వ్యక్తుల సృజన, వ్యక్తీకరణ సామర్థ్యాలూ పెరిగాయి. అందుకు కొత్తగా పుట్టుకొచ్చే ఇటువంటి పేరడీ సామెతలే నిదర్శనం. ఇది వినగానే చాలామందికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడే గుర్తుకు వస్తారు. ఎందుకంటే, పలు విషయాల్లో ఆయ నిప్పుడు పెద్ద గొంతుతో అరుస్తున్నారు. కానీ, ఆయన ఆపద్దర్మ ముఖ్య మంత్రి కాదు. పూర్తిస్థాయి ముఖ్యమంత్రే! కాకపోతే, ఎన్నికల కోడ్ ఆమల్లో ఉన్నప్పటికీ, నిబంధనల ప్రకారం చేయకూడని పనులన్నీ చేసే స్తున్నారు. వాటిని యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పైగా నెపాన్ని ఎన్నికల సంఘం (ఈసీ)పై నెడుతున్నారు. తాను దిగిపోయే ముఖ్యమంత్రినని ఇతరుల కన్నా ఈయనే ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే, ‘జూన్ 8 వరకు నేనే ముఖ్యమంత్రిన’ని ఒకమారు, ‘..రేపు ఫలితాలొచ్చాక కూడా జగన్మోహన్రెడ్డి లోటస్‌పాండ్ నుంచే పాలన సాగిస్తారా?’ అని మరో మారు... ఇలా మాట్లాడటం అంటే, తెలియకుండానే తన మనోభావాల్ని వెల్లడించడమే! తన ఓటమిని అంగీకరించడమే! దిగిపోతాననే భావన లోలోపల రోజురోజుకు బలపడుతున్న తీరు ఆయనను తీవ్ర ఆందో ళనకు, గగుర్పాటుకు గురిచేస్తున్నట్టుంది. ఫలితంగా తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఆయనేదో చాణక్యం చేస్తారని కొద్దో గొప్పో విశ్వాసమున్న వారి నమ్మకమూ క్రమంగా సడలిపోతోంది. ‘ఏమిటీ! ఈయన ఇలా తయారయ్యారు..?’ అని వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఆయనలో నైపుణ్యాల కన్నా వ్యవహార దక్షత ఎక్కువని భావించే వారు మాత్రం, ‘ఇప్పుడేమిటి? ఆయనెప్పుడూ అంతే!’ అని పెదవి విరు స్తున్నారు. వారి వాదనకు, తన తాజా చర్యల ద్వారా చంద్రబాబు మరింత బలం చేకూరుస్తున్నారు. ఎవరి వాదనెలా ఉన్నా.. ఈ ఎన్నికల ప్రకటనకు ముందు, తర్వాత జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య వాదులకు జుగుప్స కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న దారుణాలకు అంతే లేదు. చాలా నిబంధనలు కాగితాలకే పరిమిత మౌతున్నాయి. ఎటు చూసినా ఉల్లంఘనలే! ఉన్న నిబంధనల పటిష్ట అమలుతోపాటు మరో విడత ఎన్నికల సంస్కరణల అవసరం కొట్టొ చ్చినట్టు కనిపిస్తోంది. వీటిని మరో దశకు తీసుకువెళ్లాల్సి ఉంది. మలి విడత ఎన్నికల సంస్కరణ ప్రతిపాదనలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతిపాదనల్ని ఓ సమగ్ర ఎజెండా రూపంలో 2004 జూలైలో నే నాటి ఎన్నికల సంఘం ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. పోలింగ్‌కు ముందే ఓటమి జాడ పసిగట్టారు ఇప్పుడు సీఎం చంద్రబాబు చేస్తున్న అల్లరంతా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల పైన, ఈసీపైన. ఓడిపోయే వాతావరణం ఉందని ఎన్నికల ప్రకటనకు చాలా ముందే పాలకపక్ష పెద్ద గ్రహించారు. అధిగమించే ఎత్తుగడలు ప్రారంభించారు. సంక్షేమ పథకాలకు మెరుగులు దిద్దడమైనా, వాటి నీడలో నగదు బదిలీ అయినా, అందుకు సరిపడేలా శాఖాపరమైన ఆర్థిక సర్దుబాట్లయినా... వ్యూహాత్మకంగా చేసు కున్నవే. ఎన్నికల ప్రకటనకు కొద్ది కాలం ముందే, తమ అభీష్టం ప్రకారం జిల్లాల కలెక్టర్లను నియమించుకున్నారు. మూడు సంవత్సరాలకు పైబడి ఒకే చోట ఉన్న కొందరిని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చారే తప్ప ఎన్నికల విధులకు దూరం చేయలేదు. 175 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులనూ, ‘చెబితే వింటార’నే అనుకూలురినే నియ మించు కున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదింపుల మేరకే జాబి తా రూపొందింది. మరో వైపు సాంకేతిక పూర్వ రంగాన్నీ సిద్ధ్దం చేసు కున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమని, చేసి చూపిస్తామని దేశ మంతా ప్రచారం చేసిన వేమూరి హరిప్రసాద్ చౌదరి అనే నిపుణుడి సేవ ల్ని చాలా ముందుగానే ఖరారు చేసుకున్నారు. అంటే, ‘దొంగకు తాళా లిచ్చార’నే సామెత చందంగా ఆయనకు ప్రభుత్వ ఐటీ సలహాదారుగా స్థానం కల్పించారు. కలెక్టర్ల సమావేశంలోనూ కూర్చోబెట్టుకున్నారు. సీఎం సొంత జిల్లా కలెక్టరుతో ఆయన నేరుగా సంభాషించడం, ఈవీఎం పనితీరుపై ఫిర్యాదు, కలెక్టరు వివరణ, ‘ఈసీ’ ప్రస్తా్తవనే లేకుండా... కావాలంటే ఈవీఎం మారుస్తాననడం ఇదే ధృవపరుస్తోంది. ఇక్కడే ఏదో వ్యూహం జరిగింది. తమ లోపాయికారి వ్యవహారాల్ని నిఘా విభాగం ఉన్నతాధికారి కనుసన్నల్లో గోప్యంగా జరిపించుకోవచ్చని మరో పక్క పథకం వేశారు. కానీ, పరిస్థితులు వికటించి ఎన్నికల సంఘం కొన్ని బదిలీలు జరిపేసరికి ఉక్రోషం తారాస్థాయికి చేరింది. కోడ్ అమల్లోకి వచ్చిననాటి నుంచి పాలనా వ్యవస్థ మొత్తం ఈసీ ప్రత్యక్ష అజమాయిషీలోకి వస్తుందని అందరికీ తెలుసు. అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈసీ ఆదేశాలు బేఖాతరంటూ, సీఎం చెప్పినట్టే నడు చుకున్నారు. ఈసీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేశారు. ఇంత జరిగినా ఆయన్ని బదిలీ చేయొద్దన్నది బాబు వాదన. ఏ బదిలీలూ చేయొద్దం టారాయన. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల్ని రాష్ట్రంలోని ముఖ్య ఎన్నికల అధికారి అమలు చేయొద్దంటూ ఆయన్నే గదమాయించారు. నా సంగతి చూపిస్తానని టీవీ కెమెరాల ముందే బెదిరించారు. మీ వ్యూహం వికటిస్తే... ఈసీపై ధుమధుమలా? ఎన్నికల అధికారుల నియామకాల నుంచి కింది స్థాయి సిబ్బందిని సమ కూర్చడం వరకు ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏ పోలింగ్ కేంద్రానికి ఏ ఈవీఎం వెళ్లాలన్నదీ ప్రణాళిక రూపొందించినట్టు సమా చారం! వందల సంఖ్యలో ప్రభుత్వ అధికారుల్ని రిజర్వులో పెట్టి, ఆశా వర్కర్లతో, ప్రయివేటు విద్యాసంస్థల సిబ్బందితో ఎన్నికల పనులు చేయి ంచాలని ఎవరు నిర్ణయించారు? బెంగళూరు నుంచి వచ్చిన వందల మంది సాంకేతిక సిబ్బంది సహకారాన్ని, ఈవీఎంలు మొరాయించిన చోట ఎందుకు తీసుకోలేదు? ఇవన్నీ ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల పైచిలుకు ఈవీఎంలు(మొత్తం 92 వేలకు గాను) మొరాయిస్తే, మూడో వంతు పనిచేయలేదనే ప్రచారం ప్రారంభించారు. అనుకూల మీడియా దానికి ‘తందానా’ అంది. తానూ, ఈ తందానా బ్యాచ్ కలిసి పోలింగ్ శాతాల్ని రమారమి తగ్గించేందుకు విశ్వయత్నం చేశారు. ఇంకోవైపు నోరుపెంచి, ఇదంతా ఈసీ వైఫల్యమన్నారు. నానా యాగీ చేశారు. ‘... షామియానాలు లేవు, మంచినీళ్లు లేవు, తెల్లవార్లూ పోలింగ్ జరిపారు...’ ఇలా నోటికొచ్చిన విమర్శలు చేశారు. ఎన్నికల సంఘానికి తమ కార్యాలయం బయట ఒక బంట్రోతు కూడా ఉండరు. మరెలా? తగు ఆదేశాలు, అజమాయిషీతో వారు పర్యవేక్షణ మాత్రమే చేస్తారు. వారి ఆదేశాల్ని అమలుపరుస్తూ, ఎన్నికల ప్రక్రియను నిర్వహించవలసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే! స్థూలంగా ఈసీ ఇచ్చే ఆదేశాల ప్రకారం ఈ యంత్రాంగమే పనులు నిర్వహించాలి. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం, ప్రక్రియ ప్రారంభంలోనే, తాను స్వచ్ఛందంగా తప్పుకొని రాష్ట్రపతి పాలన కోరిన పెద్దమనిషేం కాదు ఈ ముఖ్యమంత్రి! ‘జూన్ 8 వరకు నేనే ముఖ్యమంత్రిని’ అని ఇప్పటికీ బల్ల గుద్ది చెబుతున్నారు. వద్దంటే శాఖల వారీ సమీక్షలు జరుపుతున్నారు. పెద్ద మొత్తంలో పాత బిల్లులు ఆమోదిస్తున్నారు. మరి, ఎన్నికల నిర్వహణ వైఫల్యాన్ని ఎవరికి అంటగట్టాలని చూస్తున్నారు? ఈ వైఫల్యాలూ ముందస్తు పథకం ప్రకారమే జరిగాయా? అనుమానం సహజం. ఎందుకంటే, ప్రభుత్వ పెద్దలకు అధికారులపై పట్టున్న కొన్ని జిల్లాల్లోనే ఈ వైఫల్యాలు తలెత్తాయి. ‘ఈసీ వైఫల్యమని ఎత్తిచూపే ఎజెండా నేను భుజానికెత్తుకున్నాను, కనుక, మీరెవరూ ఈసీకి సహకరించకండి’ అని మాటవినే యంత్రాంగానికి ముందే ప్రభుత్వ పెద్ద ‘సైగ’ చేశారేమో? మూడు వందల పై చిలుకు ఈవీఎంలు మొరాయిస్తే, అందులో మూడింట రెండొంతుల ఈవీఎంలు ఒకటి రెండు గంటల్లోనే సర్దుకున్నాయి. ఉదయం ఎక్కువ జాప్యం జరిగిన చోట సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అలా సాయంత్రం పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 131 బూత్‌లలో జరిగితే, మూడు జిల్లాల్లోనే (కృష్ణా–37, గుంటూరు–21, ప్రకాశం–25) 83 చోట్ల జరిగిందంటే అనుమానం రాదా? ఈసీ ఏర్పాటు చేసిన ‘ఈవీఎం చాలెంజ్’ సమయంలోనూ కిమ్మనని వారు, వ్యూహం బెడిసికొట్టినందుకే వాటిపై ‘ట్యాంపరింగ్’ అల్లరి పెంచినట్టు స్పష్టమౌతోంది. ఈసీ కోరలు ఇంకా పదునెక్కాలి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే నిబంధనల్ని ఉల్లంఘించినా చర్యలు లేని పరిస్థితి నెలకొంది. పది రూపాయలు ఖర్చు పెడదామంటే ఐటీ దాడులు చేపిస్తున్నారు... అందుకే నేనొక ప్లాన్ చేశా, ప్రభుత్వ పథ కాల డబ్బులే ఇటు మళ్లించి మీకందేలా చేస్తున్నాను, మొన్న ఆ పథకం కింద అంతిచ్చాను, ఇంకో పథకం కింది ఇంత ఇప్పించాను. రేపు మరో పథకం కింద మరింత రాబోతోంది. శుబ్బరంగా ఖర్చు పెట్టేస్తున్నాను, అందుకే, తమ్ముళ్లూ నాకే ఓటేయండి... ఇదీ వరస! ఇది ఓటర్లను ప్రలో భ పెట్టడం కాదా? అదీ సొంత డబ్బుతో కాదు, పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో! ప్రజాధనాన్ని విచ్ఛల విడిగా ఓట్లు దండుకునేందుకు వెచ్చి స్తున్నానని ఒక పాలకుడు ఇంత పచ్చిగా అంగీకరించడం బహుశా... ఆఫ్రికా, ల్యాటిన్ అమెరికా దేశాల్లోనూ ఉండదేమో! వీటన్నిటికీ విరు గుడు మలి విడత ఎన్నికల సంస్కరణలే! ఎన్నికల్లో పాలకపక్షాల అధి కార దుర్వినియోగాల్ని అడ్డుకోవాలి. ఎన్నికల ప్రకటనతోనే దేశంలో, రాష్ట్రాల్లో అప్పటివరకున్న ప్రభుత్వాలు తప్పించి రాష్ట్రపతి పాలన తేవాలి. పాలక–విపక్షాల మధ్య క్షేత్ర సమస్థితి నెలకొల్పాలి. విచ్చలవిడి డబ్బు వ్యయం, మద్యం ఖర్చును ఇంకేవైనా పటిష్ట చర్యల ద్వారా అరి కట్టాలి. ప్రజాప్రాతినిధ్య చట్టాన్నీ సవరించాలి. ‘నియోజకవర్గ అభివృద్ధి్ద’ సాకుతో పార్టీలు మారి, ‘అధికారం’ చంకన చేరే ప్రజాప్రతినిధుల సభ్య త్వాలు రద్దయ్యే సంస్కరణలు రావాలి. పార్టీ మార్పిళ్ల నియంత్రణ చట్టాన్ని సవరించాలి. ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర పతి–గవర్నర్లకో, ఎన్నికల సంఘానికో అప్పగించాలి. అంతే తప్ప, స్పీకర్ పదవి ప్రతిష్టను మంటగలిపే ఫక్తు రాజకీయ తాబేదారుల చేతుల్లో పెట్టొద్దు. గత ఎన్నికల్లో గెలవడానికి 11 కోట్లు ఖర్చుపెట్టానని బహిరంగంగా ప్రకటించినా చర్యలు లేకుంటే, వారు తర్వాతి ఎన్నికల్లో బూత్ రిగ్గింగులకైనా తలపడతారన్నదే ఈ ఎన్నికలు నేర్పిన పాఠం. పాఠం నేరిస్తేనే ప్రజాస్వామ్యానికి రక్ష! -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
మస్తు తాగిండ్రు..
సాక్షి, కొల్చారం(నర్సాపూర్): ఎన్నికలు వచ్చాయంటే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ దిశగానే ప్రతీ పార్టీ మద్యాన్ని ఎన్నికల్లో ఏరుల్లా పారిస్తుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గడిచిన ఐదు రోజుల వ్యవధిలోనే మెదక్ జిల్లావ్యాప్తంగా ఏకంగా రూ.20.84కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే ఎంతమేర పంపిణీ చేశారో అర్థం చేసుకోవచ్చు. కొల్చారం మండలం చిన్నఘణాపూర్ శివారులోని మద్యం ఆధారిత నిల్వ కేంద్రం(ఐఎంఎల్) ద్వారా జిల్లాలోని 108 మద్యం దుకాణాలకు, బార్లకు ఇక్కడి నుంచి మద్యం పంపిణీ జరుగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ 15న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి డిసెంబర్ 3వ తేది వరకు రూ.44.41కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అనంతరం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 16 రోజుల వ్యవధిలో రూ.56.75కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజులు ఐఎంఎల్ డిపోకు సెలవులు పోగా మిగిలిన ఐదు రోజుల్లో లిక్కర్ 12615 కేసులు, మద్యం విలువ రూ.14కోట్ల 90లక్షలు కాగా, బీరు 1848 కేసులు.. విలువ రూ.5కోట్ల 93లక్షలు అమ్ముడయ్యాయి. మొత్తంగా అమ్ముడైన మద్యం విలువ రూ.20 కోట్ల 84లక్షల 289లు. ఇంతపెద్ద మొత్తంలో మద్యం అమ్మకాలు జరగడం పరిశీలిస్తే ఎన్నికల్లో మద్యం ప్రభావం ఎంతన్నది తెలుస్తుంది. -
నిష్పక్షపాతంగా సోదాలు: ఈసీ
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఐటీ, ఈడీ లాంటి సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో వరుసగా ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఈ మేరకు తాజాగా లేఖ రాసింది. దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్య తీసుకునే ముందైనా తమకు తెలియజేయాలని కోరింది. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఐటీ శాఖ పలువురు రాజకీయ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్రం ఎన్ఫోర్స్మెంట్ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. ఎన్నికల వేళ అక్రమ నగదు చలామణి అవుతోందని అనుమానాలు వస్తే దాడులు చేసే ముందు సంబంధిత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలియజేయాలని ఈసీ సూచించింది. -
చిక్కుల్లో గవర్నర్ కల్యాణ్ సింగ్
న్యూఢిల్లీ: రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్(87) మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమర్పించిన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గత నెల 25న యూపీలోని అలీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కల్యాణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మనమంతా బీజేపీ కార్యకర్తలం. కాబట్టి మళ్లీ బీజేపీనే అధికారంలోకి రావాలని కోరుకుంటాం. దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ మళ్లీ ప్రధాని కావాల్సిన అవసరముంది. మే 23న మోదీ మళ్లీ ప్రధాని కావాలని మేమంతా కోరుకుంటున్నాం. దేశంలోని ప్రతీ బీజేపీ కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేయాలి’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో విచారణ జరిపిన ఈసీ.. కల్యాణ్ సింగ్ ఎన్నికల నియమావళితో పాటు గవర్నర్ పదవికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. ఈ నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించింది. విదేశీ పర్యటన నుంచి బుధవారం భారత్‌కు చేరుకున్న కోవింద్, సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ నివేదికను హోంశాఖకు పంపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు ఎదుర్కొన్న తొలి గవర్నర్‌గా కల్యాణ్ సింగ్ నిలిచే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. సింగ్‌కు ముందు 1990ల్లో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన గుల్షర్ అహ్మద్ తన కుమారుడి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. 1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కల్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో పొసగకపోవడంతో 1999లో పార్టీకి రాజీనామా చేసిన కల్యాణ్ సింగ్, తిరిగి 2004లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో మోదీ ప్రధానిగా ఎన్నికయ్యాక కేంద్ర ప్రభుత్వం కల్యాణ్ సింగ్ ను రాజస్తాన్ గవర్నర్‌గా నియమించింది. -
లంచాలిచ్చినా.. బెదిరించినా ఊరుకోం
సాక్షి, అమరావతి : ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలం కనపడుతోంది. పార్టీలు, అభ్యర్థుల విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఈ సందర్భంగా వారు చేసే పనులు పలువురిని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అందుకే ఎన్నికల కమిషన్ పార్టీలు, అభ్యర్థులను కట్టడి చేయడానికి కొన్ని నిబంధనలు పెట్టింది అవేంటో చూద్దామా... ఓటర్లకు లంచం ఇవ్వడం, బెదిరించడం, అసలు ఓటర్లకు బదులుగా వేరే వ్యక్తులను ఓటర్లుగా వ్యవహరించేటట్టు చేయకూడదు. పోలింగ్ స్టేషన్లకు వంద మీటర్ల పరిధిలో ప్రచారం చేయరాదు. పోలింగ్‌కు ముందు 48 గంటల కాలంలో పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించరాదు. పోలింగ్ స్టేషన్‌కు ఓటర్లను తీసుకెళ్లకూడదు. ప్రతీ వ్యక్తి రాజకీయ భావాలు, కార్యక్రమాల పట్ల పార్టీలకు, అభ్యర్థులకు అయిష్టత ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ప్రశాంత గృహజీవనాన్ని వారు గౌరవించాల్సిందే. ఆ వ్యక్తి అభిప్రాయాలు లేదా కార్యక్రమాల పట్ల నిరసన వ్యక్తం చేయడం, ఇంటి ముందు వ్యతిరేక ప్రదర్శనలు చేయడం వంటివి చేయకూడదు. జెండాలు, బ్యానర్లు, నోటీసులు అతికించడానికి, నినాదాలు రాయడానికి ఆ ఇంటి యజమాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇతర పార్టీలు నిర్వహించే ఊరేగింపులు, సమావేశాలను అడ్డుకోకూడదు. పార్టీ లేక అభ్యర్థి స్థానిక పోలీసు అధికారులకు తగినంత సమయం ఉండే విధంగా ముందుగానే సభ నిర్వహించే ప్రదేశం, సమయాన్ని తెలియపర్చాలి. సభను ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో అప్పటికే ఏమన్నా నిషేధాజ్ఞలు ఉంటే పార్టీ లేదా అభ్యర్థి ముందుగానే తెలుసుకోవాలి. ఎలాంటి అడ్డంకులు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఊరేగింపు సజావుగా సాగే విధంగా నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఊరేగింపు సాధ్యమైనంత వరకు రోడ్డుకు కుడివైపున సాగేట్టు చూసుకోవాలి. ఇతర రాజకీయ పక్షాల సభ్యులు లేదా నాయకుల దిష్టిబొమ్మలను మోసుకెళ్లడం, తగలెట్టడం చేయరాదు. -
చిరంజీవిపై కేసు కొట్టివేత
సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ సినీనటుడు చిరంజీవిపై 2014లో గుంటూరు, అరండల్‌పేట పోలీసులు నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు బుధవారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ బుధవారం ఉత్తర్వులిచ్చారు. 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ రాత్రి 10 గంటల తరువాత కూడా ప్రచారం నిర్వహించారంటూ చిరంజీవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను కింది కోర్టు విచారణకు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిరంజీవిపై అక్రమంగా కేసు నమోదు చేశారని అతని తరఫు సీనియర్ న్యాయవాది పి.గంగయ్యనాయుడు కోర్టుకు నివేదించారు. ప్రచారం పూర్తి చేసి తిరిగి వస్తున్నప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, పోలీసులు చిరంజీవిపై నమోదు చేసిన కేసును కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షి, ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆ క్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని, ఇటు ఎన్నికల నిర్వహణకు కూడా జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు వెల్లడించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఎన్నికలను విజయవంతం చేయడానికి అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈనెల 18 నుంచి 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను కార్యాలయంలో స్వీకరిస్తామన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ఉంటారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన, 28 వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న కౌటింగ్ ప్రక్రియ ఉంటుందని వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల్ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. నిజామాబాద్ సెగ్మెంట్లో మొత్తం 15,53,577 మంది ఓటర్లు ఉండగా, 8,14,689 మంది మహిళలు, 7,38,577 మంది పురుషులు, 35 మంది ఇతరులున్నట్లు తెలిపారు. అయితే పోటీ చేసే అభ్యర్థే కాకుండా వారి ప్రపోజల్స్ కూడా నామినేషన్ వేయవచ్చన్నారు. అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగురు మాత్రమే నామినేషన్ వేయడానికి లోపలికి అనుమతించడం జరుగుతుందన్నారు. నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంలో అభ్యర్థులు, పార్టీలు ఖచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియామావళిని పాటించాలని, కేవలం మూడు వాహనాలు మాత్రమే ఉపయోగించి వాటిని100 మీటర్ల పరిధిలోనే నిలిపివేయాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థి రూ.25 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీకి చెందిన అభ్యర్థులకైతే రూ.12,500 డిపాజిట్ చేయాలన్నారు. అదే విధంగా పార్టీలు, అభ్యర్థులు వివిధ అనుమతుల కోసం ‘సువిధ’ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫిర్యాదులు, సూచనల కోసం జిల్లా స్థాయిలో 1950 టోల్‌ఫ్రీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి సంసిద్ధులుగా ఉన్నామని, నోడల్ అధికారులు, వివిధ రకాల బృందాలను ఏర్పాటు చేసి సన్నాహక సమావేశాలు నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ, ప్రయివేటు ప్రాంతాల్లో, ఆస్తులపై ఉన్న పార్టీల, అభ్యర్థులకు చెందిన జెండాలు, ప్లెక్సీలు, గోడ రాతలు, ప్రభుత్వ పథకాల పోస్టర్లను తొలగిస్తున్నట్లు వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్,నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నిజామాబాద్ సెగ్మెంట్లో ఓటర్లు పురుషులు : 7,38,577 మహిళలు : 8,14,689 ఇతరులు : 35 మొత్తం ఓటర్లు :15,53,577 రాజకీయ పార్టీలతో సమీక్ష... పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు కోరారు. ప్రగతిభవన్‌లో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల నియామవళి తప్పనిసరిగా అందరూ అమలు చేయాలన్నా రు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే సహకరించాలని కోరారు. నామినేషన్ వేసే అభ్యర్థులు పాటిం చాల్సిన నిబంధనలను ఈ సందర్భంగా కలెక్టర్ వారికి వివరించారు. -
యథేచ్ఛగా టీడీపీ కోడ్ ఉల్లంఘన
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, నెట్వర్క్: సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇంకా మొద్దు నిద్ర వీడడం లేదనే విమర్శలొస్తు న్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆదివారం నుంచి సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చి చేరింది. అయితే అధికారులు ఇంకా అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ప్రభుత్వ ప్రచార ప్రకటనల్లో సీఎం, మంత్రుల ఫొటోలు తొలగించాల్సి ఉన్నా తాత్సారం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇంకా సీఎం ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు దర్శనమి స్తున్నాయి. నిబంధనల మేరకు రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయాల్సి ఉంది. ఇతర పార్టీల నాయకుల విగ్రహాలకు ముసుగు వేస్తున్న అధికారులు.. ‘అధికార’ పార్టీ నేతల విగ్రహాలకు మినహాయింపు ఇస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఫ్లెక్సీలు మాత్రమే తొలగింపు సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీ నేతల ఫ్లెక్సీలను తొలగించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లను ఎమ్మెల్సీ కోడ్ వచ్చిన వెంటనే తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మ గాంధీ, అంబేడ్కర్, రాష్ట్రపతి, గవర్నర్ ఫొటోలను మాత్రమే ఉంచి.. సీఎం, మంత్రి తదితరుల ఫొటోలను తొలగించాలి. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ఫొటోలు దర్శనమిస్తుండడం గమనార్హం. అన్న క్యాంటీన్లలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫొటోలను తొలగించే ధైర్యం అధికారులకు లేకపోయింది. మంత్రి ఆనందబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘన నిబంధనల ప్రకారం సంక్షేమ పథకాలకు సంబంధించిన పనిముట్లను లబ్ధిదారులకు అందజేయకూడదు. అయితే మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి గుంటూరు జిల్లా యడవూరు మండలంలోని పదిహేను గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆదివారం రాత్రే కుట్టు మిషన్లను పంపిణీ చేయించారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున మంత్రి నక్కా ఆనందబాబుకు ఓటెయ్యాలని హామీ తీసుకున్నారు. రోడ్ల నిర్మాణం.. గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది. అధికార పార్టీ నాయకులు కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలు చేసేస్తున్నారు.ప్రభుత్వ పథకాలకు చెందిన హోర్డింగులు, స్టిక్కర్లు ఎప్పటిలాగే దర్శనమిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి–గోవిందపురం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరుకు సంబంధించి ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీని అభినందిస్తూ టీడీపీ నేతలు సోమవారం సభ ఏర్పాటు చేశారు. పలాస ఎమ్మెల్యే శివాజీ కుమార్తె గౌతు శిరీష, ఆయన అల్లుడు వెంకన్న చౌదరి దర్జాగా సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల సంఘానికి ఝలక్ ఇచ్చారు. కోటబొమ్మాళి మండలం కొత్తపేట కొండ పోరంబోకు స్థలంలో టీడీపీకి చెందిన కార్యకర్తలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా పాత తేదీలతో పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేశారని కొత్తపేట మాజీ సర్పంచి ఆర్.ముకుందరెడ్డి టెక్కలి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. వీరఘట్టం మండలంలో ‘బడికొస్తా’ పథకంలో భాగంగా 8, 9వ తరగతులు చదువుతున్న బాలికలకు గతంలో అందించాల్సిన సైకిళ్లను సోమవారం పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లాలో .. తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారపార్టీ నాయకుల సిఫార్సు లేఖలకు అధికార యంత్రాంగం దర్శనాలు కల్పిస్తోంది. తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్సులపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రచారాలకు సంబంధించిన చిత్రాలు తొలగించలేదు. ఇక ఫైబర్‌నెట్ కేంద్రాల వద్ద ముఖ్యమంత్రి చిత్ర పటాలతో ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇంకా తీయలేదు. తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా అన్న క్యాంటీన్ నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. మీకెందుకు సార్.. ‘పచ్చ’పాతం.. రాజమహేంద్రవరం నగరంలోని జాంపేట వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద పార్టీ బ్యానర్లపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రాలు ఉన్నాయంటూ బ్యానర్లు తొలగించాలని హడావుడి చేసిన అధికారులు.. టీడీపీ కార్యాలయం వద్ద స్వామి భక్తి ప్రదర్శించారు. అక్కడ సీఎం చంద్రబాబు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫొటోలు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకపోవడంపై జనం మండిపడుతున్నారు. టీడీపీ కార్యాలయంపైన చంద్రబాబు, గోరంట్ల ఫొటోలున్నా పట్టించుకోని అధికారులు ఏ అధికారీ పట్టించు‘కోడ్’.. కాకినాడ నగరంలోని జగన్నాథపురం వంతెన దిగువ భాగంలో ప్రభుత్వం బీసీ కులస్తులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా కాకినాడ నగరపాలక అధికార యంత్రాంగం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. కర్నూలు జిల్లాలో.. ఆత్మకూరు పట్టణంలో టీడీపీ నాయకులు ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ పేదలను పిలిపించుకుని స్థానిక మైనార్టీ కాలనీలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ భరత్‌కుమార్ అక్కడికి వెళ్లేలోపు అందరూ జారుకున్నారు. వెల్దుర్తి మండలం రామళ్లకోటలో సీబీఎన్ ఆర్మీ పేరుతో వాహనాలు వినియోగించి ప్రచారం చేపట్టారు. కొలిమిగుండ్లలో చెత్తబుట్టలు పంపిణీ చేసి..పట్టపగలే కోడ్ ఉల్లంఘించారు. -
పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు
సాక్షి, శ్రీకాకుళం : ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఎన్నికల నోడల్ అధికారులతో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు సమాచారాన్ని 1950 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. ఇతర అధికారుల ఫోన్ నంబర్లకు పలువురు ఫోన్ చేస్తున్నారని, ఓట్ల వివరాలు అధికారుల వద్ద తక్షణం అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 1950 నంబరుకు డయల్ చేయడం, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా వివరాలు సులువుగా తెలుసుకోవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు ఓటు హక్కు లేని వారు కూడా కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటు వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. పోలింగు కేంద్రాల వద్ద దివ్యాంగులకు ప్రత్యేకంగా ర్యాంపులు, త్రిచక్ర వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫ్లైయింగ్ స్కాడ్స్, వీడియో సర్వేలియన్స్ బృందాలు, ప్రవర్తనా నియమావళి అమలు అధికారులు, సెక్టార్ అధికారులు తక్షణం రంగంలోకి దిగాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలతో షెడ్యూలు వచ్చిన వెంటనే సమావేశాలు ఏర్పాటు చేసి విధివిధానాలు తెలియజేయాలని ఆదేశించారు. సమావేశాలకు, ప్రచారం చేసుకొనే వాహనాలకు అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. సువిధ యాప్ ద్వారా రిటర్నింగు అధికారులకు దరఖాస్తు చేయవచ్చని సూచించారు. పోస్టల్ బ్యాలెట్లపై స్పష్టమైన సమాచారం అందించాలని రిటర్నింగు అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ వేసే విధానంపై శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణకు వినియోగించే ఈవీఎంలను సైతం స్ట్రాంగ్‌రూమ్‌లలో పెట్టాలని సూచించారు. స్ట్రాంగ్‌రూమ్, రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు ఉండాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు మాట్లాడుతూ ఎన్నికలకు అవసరమైన సామగ్రి పూర్తి స్థాయిలో ప్రతి విభాగం కలిగి ఉండాలన్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన అనంతరం అభ్యర్థులు, పార్టీల నుంచి వచ్చే ఎస్ఎంఎస్, ఐవీఆర్ ఎస్ కాల్స్, ఎఫ్ఎం రేడియో, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తదితర విధాలుగా వచ్చే సమాచారాన్ని పరిశీలించాలని ఆదేశించారు. స్థానికంగా రిటర్నింగు అధికారులు ప్రింటింగ్ ప్రెస్‌లు, కేబుల్ ఆపరేటర్లతో సమావవేశాలు నిర్వహించి విధివిధానాలు తెలియజేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్–2 పి.రజనీకాంతారావు, ఏఎస్పీ టి.పనసారెడ్డి, రిటర్నింగు అధికారులు లోతేటి శివశంకర్, ఎం.వి.రమణ, గణపతి, మహాలక్ష్మి, భాస్కరరెడ్డి, దొర, పి. అప్పారావు, రఘురాం, జయదేవి, ఎస్డీ అనిత, నోడల్ అధికారులు టి.కైలాష్ గిరీశ్వర్, ఎ.కళ్యాణ చక్రవర్తి, హెచ్.కూర్మారావు, ఎల్.రమేష్, ఎం.మోహనరావు, వి.వి.లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.