
సాక్షి, అమరావతి : ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలం కనపడుతోంది. పార్టీలు, అభ్యర్థుల విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఈ సందర్భంగా వారు చేసే పనులు పలువురిని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అందుకే ఎన్నికల కమిషన్ పార్టీలు, అభ్యర్థులను కట్టడి చేయడానికి కొన్ని నిబంధనలు పెట్టింది అవేంటో చూద్దామా...
- ఓటర్లకు లంచం ఇవ్వడం, బెదిరించడం, అసలు ఓటర్లకు బదులుగా వేరే వ్యక్తులను ఓటర్లుగా వ్యవహరించేటట్టు చేయకూడదు. పోలింగ్ స్టేషన్లకు వంద మీటర్ల పరిధిలో ప్రచారం చేయరాదు. పోలింగ్‌కు ముందు 48 గంటల కాలంలో పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించరాదు. పోలింగ్ స్టేషన్‌కు ఓటర్లను తీసుకెళ్లకూడదు.
- ప్రతీ వ్యక్తి రాజకీయ భావాలు, కార్యక్రమాల పట్ల పార్టీలకు, అభ్యర్థులకు అయిష్టత ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ప్రశాంత గృహజీవనాన్ని వారు గౌరవించాల్సిందే. ఆ వ్యక్తి అభిప్రాయాలు లేదా కార్యక్రమాల పట్ల నిరసన వ్యక్తం చేయడం, ఇంటి ముందు వ్యతిరేక ప్రదర్శనలు చేయడం వంటివి చేయకూడదు.
- జెండాలు, బ్యానర్లు, నోటీసులు అతికించడానికి, నినాదాలు రాయడానికి ఆ ఇంటి యజమాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
- ఇతర పార్టీలు నిర్వహించే ఊరేగింపులు, సమావేశాలను అడ్డుకోకూడదు.
- పార్టీ లేక అభ్యర్థి స్థానిక పోలీసు అధికారులకు తగినంత సమయం ఉండే విధంగా ముందుగానే సభ నిర్వహించే ప్రదేశం, సమయాన్ని తెలియపర్చాలి.
- సభను ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో అప్పటికే ఏమన్నా నిషేధాజ్ఞలు ఉంటే పార్టీ లేదా అభ్యర్థి ముందుగానే తెలుసుకోవాలి.
- ఎలాంటి అడ్డంకులు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఊరేగింపు సజావుగా సాగే విధంగా నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఊరేగింపు సాధ్యమైనంత వరకు రోడ్డుకు కుడివైపున సాగేట్టు చూసుకోవాలి. ఇతర రాజకీయ పక్షాల సభ్యులు లేదా నాయకుల దిష్టిబొమ్మలను మోసుకెళ్లడం, తగలెట్టడం చేయరాదు.
Comments
Please login to add a commentAdd a comment