నిఘాను పటిష్టపర్చండి
రాజకీయ పార్టీల కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల ఆప్షన్ మేరకు పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా తనిఖీలు, ఆస్తుల జప్తు జరుగుతున్న విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 3న సీఎస్, డీజీపీలతో సమీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగు పర్చాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు.
సీజర్ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజన్సీలను అప్రమ్తతం చేయాలని, జిల్లా పరిధుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టపర్చాలన్నారు. ప్రతి సరిహద్దు చెక్ పోస్టు వద్ద కనీసం ఒక కెమేరాతో స్టాటిక్ సర్వలెన్స్ టీమ్‌ను ఉంచాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం నిత్యావసర సేవల్లో ఉండే 33 విభాగాలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు.
వీటిలో ముఖ్యంగా పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్ తదితర శాఖలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు.
ముందస్తు అనుమతి తప్పనిసరి
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉందని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. అయితే నేరుగా గానీ, ఎన్కోర్ పోర్టల్ ద్వారా గానీ అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో అప్రమ్తతంగా ఉండాలని, ఎలాంటి దుర్ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ ఘటనలకు సంబంధించిన వాస్తవ నివేదికను వెంటనే తమకు పంపాలని ఆదేశించారు.
ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫారం–7, వివరాలు సరిదిద్దేందుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫారం–8లను చట్టబద్ధమైన విధానంలో ఈ నెల 26లోపు పరిష్కరించాలని ఆదేశించారు. నూతన ఓటర్ల నమోదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజూ తొమ్మిది నివేదికలను భారత ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉందని, ఈ నివేదికలు పంపే విషయంలో ఏమాత్రం అలక్ష్యం వహించొద్దన్నారు.
సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్ హరేంధిరప్రసాద్, జాయింట్ సీఈవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment