
స్వచ్ఛత లోపిస్తే చర్యలు తీసుకుంటా
తణుకు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు
సాక్షి, భీమవరం: ఈ ఏడాది అక్టోబర్ రెండో తేదీ తర్వాత నుంచి రాష్ట్రమంతటా ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఎక్కడికి వచ్చేదీ రెండు, మూడు గంటల ముందే తెలియజేస్తామని, ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుందని చెప్పారు. స్వచ్ఛత లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు జెడ్పీ బాలుర హైస్కూల్ వద్ద జరిగిన ప్రజావేదికలో ప్రసంగించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇళ్లతో పాటు పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గత పాలకులు చెత్తపైనా పన్నువేస్తే తాము ఎత్తివేశామన్నారు.
గత ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం డ్రెయిన్లలో మట్టి కూడా తీయలేదని, 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారని.. ఇందులో 51 లక్షల టన్నుల చెత్త తొలగింపు పూర్తయ్యిందని, అక్టోబర్ రెండో తేదీ నాటికి ఎక్కడా చెత్తలేకుండా చేస్తామని చెప్పారు. 2027 నాటికి 100 శాతం మురుగునీటిని శుద్ధిచేసి వ్యవసాయానికి వాడతామని తెలిపారు.
విభాగాల వారీగా స్వచ్ఛాంధ్ర ర్యాంకింగ్‌లు..
ఇక స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి విభాగానికీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ ర్యాంకింగ్స్ తయారుచేశామని చంద్రబాబు వెల్లడించారు. మున్సిపల్ శాఖకు 20 పాయింట్లు, పంచాయతీరాజ్‌కు 28, విద్యాశాఖకు 14, టూరిజంకు 11, పరిశ్రమలకు 13, హాస్టళ్లకు 11, ఎండోమెంట్‌కు 11, ఆస్పత్రులకు 9, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌కు 5, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు 7, మార్కెట్లకు 9, హైవేలకు 3, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 7 పాయింట్లు చొప్పున ఇచ్చినట్లు తెలిపారు.
అలాగే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో కూడా జిల్లాల వారీగా పాయింట్లు ఇచ్చామన్నారు. అంతకుముందు.. తణుకు కూరగాయల హోల్‌సేల్ మార్కెట్‌ను చంద్రబాబు పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్కులో చెత్తను ఊడ్చారు. ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు తమ గోడు చెప్పుకోవాలనుకున్న సామాన్యులకు మైక్ ఇవ్వకపోవడంతో వారు నిరాశ చెందారు. ఓ దశలో చంద్రబాబే స్వయంగా ఓ యువకుడిని కూర్చోమని గట్టిగా చెప్పారు.
మరోవైపు.. ఎండలో దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజనాలు లేకపోవడంతో వారు ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఇక నరసాపురం నియోజకవర్గంలో గీత కార్మికులకు కేటాయించిన మూడు మద్యం దుకాణాలను శెట్టిబలిజ సామాజికవర్గం వారికి దక్కకుండా బినామీ పేర్లతో కొట్టేశారని మొగల్తూరు మండలానికి చెందిన కొందరు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చి తమకు న్యాయంచేయాలని కోరారు.
పోలీసు ఆంక్షలతో ప్రజల ఇక్కట్లు..
ఇదిలా ఉంటే.. చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీస్ ఆంక్షలతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే ఇక్కడ నిత్యం జరుగుతున్న పశువధను నిరసిస్తూ కొద్దిరోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న స్థానిక కొండాలమ్మ పుంత, మహాలక్ష్మినగర్ ప్రాంతాల ప్రజలను పోలీసులు హౌస్ అరెస్టుచేశారు. వారెవరూ బయటకు రాకుండా పోలీసులను కాపలా పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment