న్యూఢిల్లీ: రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్(87) మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమర్పించిన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ వ్యవహారంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గత నెల 25న యూపీలోని అలీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కల్యాణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మనమంతా బీజేపీ కార్యకర్తలం. కాబట్టి మళ్లీ బీజేపీనే అధికారంలోకి రావాలని కోరుకుంటాం. దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ మళ్లీ ప్రధాని కావాల్సిన అవసరముంది.
మే 23న మోదీ మళ్లీ ప్రధాని కావాలని మేమంతా కోరుకుంటున్నాం. దేశంలోని ప్రతీ బీజేపీ కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేయాలి’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో విచారణ జరిపిన ఈసీ.. కల్యాణ్ సింగ్ ఎన్నికల నియమావళితో పాటు గవర్నర్ పదవికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. ఈ నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించింది. విదేశీ పర్యటన నుంచి బుధవారం భారత్‌కు చేరుకున్న కోవింద్, సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ నివేదికను హోంశాఖకు పంపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు ఎదుర్కొన్న తొలి గవర్నర్‌గా కల్యాణ్ సింగ్ నిలిచే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
సింగ్‌కు ముందు 1990ల్లో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన గుల్షర్ అహ్మద్ తన కుమారుడి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. 1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కల్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో పొసగకపోవడంతో 1999లో పార్టీకి రాజీనామా చేసిన కల్యాణ్ సింగ్, తిరిగి 2004లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో మోదీ ప్రధానిగా ఎన్నికయ్యాక కేంద్ర ప్రభుత్వం కల్యాణ్ సింగ్ ను రాజస్తాన్ గవర్నర్‌గా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment